31, డిసెంబర్ 2016, శనివారం

సమస్య - 2239 (మూఢాచార మొసంగులే...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"మూఢాచారము ముదితకు మురిపెము నొసగున్" 
లేదా...
"మూఢాచార మొసంగులే మురిపెమున్ బూఁబోఁడికిన్ వేడుకన్"
ఈ సమస్యను పంపిన పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు!

30, డిసెంబర్ 2016, శుక్రవారం

సమస్య - 2238 (రాధేయుఁడు వెంబడింప...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
.
"రాధేయుఁడు వెంబడింప రాముఁడు బాఱెన్"
లేదా...
"రాధేయుం డదె వెంబడింపఁగ వడిన్ రాముండు బాఱెన్ గటా"
ఈ సమస్యను పంపిన మిట్టపల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.

29, డిసెంబర్ 2016, గురువారం

సమస్య - 2237 (శకునమ్ముల్ గని....)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....

"శకునమ్ముల్ గని భీతిఁ జెందిరఁట యాశ్చర్యంబుగన్ నాస్తికుల్"
లేదా...
"శకునములకు భీతిలిరి నాస్తికజనమ్ము"
ఈ సమస్యను పంపిన పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు.

28, డిసెంబర్ 2016, బుధవారం

సికింద్రాబాదులో రాంభట్ల వారి అష్టావధానం


ది. 26-12-2016 (సోమవారం) నాడు సికింద్రాబాద్, బోయిన్‍పల్లిలోని శ్రీ భోళాశంకర మందిరంలో 'భక్తిసాధనమ్' పత్రికా వ్యవస్థాపకులు పండరి రాధాకృష్ణమూర్తి గారి నిర్వహరణలో రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారి అష్టావధానం జరిగింది. ఆనాటి అవధానాంశాలు, పూరణలు....

1) సమస్య (ధనికొండ రవిప్రసాద్ గారు)
"కృష్ణునకు వెన్న నొసఁగెను క్రీస్తు గూడ"

పూరణ.....
వత్సలతఁ జూపి ప్రోవఁగా వర యశోద
కృష్ణునకు వెన్న నొసఁగెను; క్రీస్తు గూడ
పట్టుదలతోడఁ బెట్టెను రొట్టెలెన్నొ
మానవత యన్న నిదె యౌను మహిమ గనుమ.

2) దత్తపది (సాయిపవన్ గారు)
"ఆభరణము, అలంకారము, శ్మశానము, కపాలము పదాలను ఉపయోగిస్తూ పెద్దనోట్ల రద్దు వల్ల సమస్యలను తెలుపుతూ నచ్చిన ఛందంలో పద్యం"

పూరణ......
కొనఁగ నాభరణమ్ముల కొరత వచ్చె
ముగిసె మేన నలంకారములను బెట్ట
సకల ధననిధు (Bank) లెల్ల శ్మశానములుగ
ద్రవ్యమే లేక పాలన సవ్యమె? శివ!

3) వర్ణన (ఉప్పల బాలసుబ్రహ్మణ్యం)
"మహాభారతంలో విదురుని పాత్ర, విదురనీతులను గురించి పద్యం"

పూరణ....
చెదరిపోవ ధర్మ మకట చింతఁ బాపివేయఁగా
పదిలమైన భావరాశి భారతమ్మునందునన్
విదురనీతి యన్న రీతి వెలుగుచుండె చూడుమా
సదయులార! యాచరించి సర్వశాంతి నొందుమా.

4) నిషిద్ధాక్షరి (గౌరీభట్ల రఘురామ శర్మ గారు)
"శంకరుని గురించి పద్యం"

పూరణ.... (కుండలీకరణంలో ఉన్నవి పృచ్ఛకుల నిషిద్ధాక్షరాలు)
శ్రీ(హ)శ్రీ(హ)లన్(క)మ(న)ది(న)గ(గ)న(గ)వాక్
శ్రీశ్రీ(శ)మత్(క)మూ(ర్ధ)ల(మ)జ(న)త్వ జీ(వ)రన్(చే)మ(క)మ్మున్...
(రెండు పాదాలకే నిషేధం పరిమితమయింది)

శ్రీశ్రీలన్ మదిఁ గన వా
చ్ఛ్రీశ్రీమన్మూలజత్వ! జీరన్ మమ్మున్
స్వాశ్రయులన్ గావుమయా
యాశ్రితజనరక్షకా! విహాయసకేశా!

5) న్యస్తాక్షరి (కంది శంకరయ్య)
"అంశం - శివస్తుతి.
౧వ పాదంలో ౧వ అక్షరం - పా
౨వ పాదంలో ౭వ అక్షరం - ర్వ
౩వ పాదంలో ౧౩వ అక్షరం - తీ
౪వ పాదంలో ౧౭వ అక్షరం - శ"

పూరణ....
పావనమైన ప్రాంగణము పర్వతరాజ తనూజ భర్తకున్
దేవికి నేత్రపర్వమగు దివ్య సభస్థలి యెంచి చూడఁగా
ధీవినయాది సద్గుణమతిన్ మహతీయ యతీంద్రగానమే
యీవిధి నాంధ్రపద్య కవితేశుని బ్రోవుమ యీశ! శంకరా!

6) ఛందోభాషణం (హన్మకొండ రామ్మూర్తి)
(పద్యాల వేగం ఎక్కువై వ్రాయడానికి వీలు పడలేదు)

7) ఆశువు (వెంపటి అనిత గారు)
౧. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ వర్ణన.
౨. 'భక్తిసాధనమ్' పత్రికపై పద్యం.

(పద్యాల వేగం ఎక్కువై వ్రాయడానికి వీలుపడలేదు)

8) అప్రస్తుత ప్రసంగం (కస్తూరి శశిధర శర్మ గారు)

సమస్య - 2236 (అవకాశమ్ముల వీడినన్...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....

"అవకాశమ్ముల వీడినన్ నరుల కాహ్లాదమ్ము సేకూరదే" 
లేదా...
"అవకాశము విడిన నరుల కాహ్లాదమ్మా"
ఈ సమస్యను పంపిన పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు.

27, డిసెంబర్ 2016, మంగళవారం

సమస్య - 2235 (వీరుడు పోవిడుచు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"వీరుఁడు పోవిడుచు యుద్ధవిముఖుం డగుచున్"

26, డిసెంబర్ 2016, సోమవారం

సమస్య - 2235 (అవధానం బొక ప్రజ్ఞయౌ...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"అవధానం బొక ప్రజ్ఞయౌ నన నసత్యంబే కదా మిత్రమా"
లేదా...
"అవధానము ప్రజ్ఞ యనుట యనృతము సఖుఁడా"
ఈ సమస్యను సూచించిన జీడికంటి శ్రీనివాస మూర్తి గారికి ధన్యవాదాలు.

25, డిసెంబర్ 2016, ఆదివారం

సమస్య - 2234 (శంకరునిఁ గొల్చుచుంద్రు...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"శంకరునిఁ గొల్చుచుంద్రు క్రైస్తవులు సతము" 

లేదా
"శంకరు నాశ్రయించిరఁట సై యని క్రైస్తవు లెల్ల భక్తితోన్" 
ఈ సమస్యను పంపిన పిట్టా సత్యనారాయణ గారికి ధన్యవాదాలు.

24, డిసెంబర్ 2016, శనివారం

సమస్య - 2233 (దరహాసమ్ములు సాలు...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"దరహాసమ్ములు సాలు వక్త్రమున శస్త్రశ్రేణులన్ మించగన్"
లేదా...
"శస్త్రశ్రేణులను మించు సరి చిరునవ్వే"
ఈ సమస్యను పంపిన పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు.

23, డిసెంబర్ 2016, శుక్రవారం

సమస్య - 2232 (భర్త మరణవార్తను...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"భర్త మరణవార్తను విని భార్య మురిసె"
లేదా...
"భర్త పరేతుఁ డయ్యెనను వార్త వినంగనె భార్య నవ్వెరా"
ఈ సమస్యను అందించిన మిట్టపెల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.

22, డిసెంబర్ 2016, గురువారం

న్యస్తాక్షరి - 38 (ఉ-త్త-రుఁ-డు)

అంశము- ఉత్తరుని ప్రగల్భములు
ఛందస్సు- ఉత్పలమాల
మొదటి పాదం 1వ అక్షరం 'ఉ'
రెండవ పాదం 7వ అక్షరం 'త్త'
మూడవ పాదం 14వ అక్షరం 'రుఁ'
నాల్గవ పాదం 19వ అక్షరం 'డు'

21, డిసెంబర్ 2016, బుధవారం

సమస్య - 2231 (అమ్మా రమ్మని పిల్చె...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"అమ్మా రమ్మని పిల్చె భార్యను మగం డయ్యర్ధరాత్రంబునన్"
లేదా...
"అమ్మా రమ్మనుచుఁ బిలిచె నాలినిఁ మగఁడే"

20, డిసెంబర్ 2016, మంగళవారం

సమస్య - 2230 (దైవమును నమ్మకుండ...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"దైవమును నమ్మ కుండగఁ దరమె యుండ"
లేదా...
"దైవమ్మును నమ్మకుండఁ దరమే యుండన్"
ఈ సమస్యను పంపిన పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు.

19, డిసెంబర్ 2016, సోమవారం

సమస్య - 2229 (వేశ్యను వీక్షించి...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"వేశ్యను వీక్షించి వేదవిదు లిడిరి నతుల్"
లేదా...
"వేశ్యను జూచి మ్రొక్కిరట వేదవిదుల్ గడుభక్తి నెల్లరున్"
ఈ సమస్యను పంపిన మిట్టపెల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.

18, డిసెంబర్ 2016, ఆదివారం

సమస్య - 2228 (తాళములో నుండు కప్ప....)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"తాళములో నుండు కప్ప దడదడలాడెన్"
లేదా...
"తాళములోని కప్ప కడుఁ దల్లడమందె భయార్తచిత్తయై"
(ఒక అవధానంలో గరికిపాటి వారిని అడిగిన సమస్య)

17, డిసెంబర్ 2016, శనివారం

సమస్య - 2227 (తిరుమల వేంకటేశ్వరుఁడు....)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"తిరుమల వేంకటేశ్వరుఁడు దేవుఁడు గాఁడని చెప్పి రెల్లరున్"
లేదా...
"తిరుమలేశుఁ డెట్లు దేవుఁ డగును"
ఈ సమస్యను సూచించిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

16, డిసెంబర్ 2016, శుక్రవారం

సమస్య - 2226 (కాసులఁ జూచి వచ్చినవి....)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"కాసులఁ జూచి వచ్చినవి గంతులు వేయుచు కోతు లన్నియున్"
లేదా...
"కాసులఁ గని వచ్చెఁ గపులు గంతు లిడుచు"
ఈ సమస్యను పంపిన పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు.

15, డిసెంబర్ 2016, గురువారం

సమస్య - 2225 (ఇన శశి బింబయుగ్మము....)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"ఇన శశిబింబ యుగ్మ ముదయించె దినాంతమునందు దద్దిశన్"
(ప్రాచీనమూ, ప్రసిద్ధమూ అయిన సమస్య)
లేదా...
"ఇన హిమకర బింబము లుదయించె నొకమొగిన్"

14, డిసెంబర్ 2016, బుధవారం

సమస్య - 2224 (గీతను బోధించె నరుఁడు....)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"గీతను బోధించె నరుఁడు గీష్పతి వినఁగన్"
లేదా...
"గీతను జెప్పె నర్జునుండు గీష్పతియే వినఁగన్ రణంబునన్"
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

13, డిసెంబర్ 2016, మంగళవారం

నిషిద్ధాక్షరి - 34

కవిమిత్రులారా,
అంశం - రామాయణ సంబంధమైన ఏదైనా అంశం.
నిషిద్ధాక్షరములు - ఋ, ౠ, ఎ, ఏ, ఐ, ఒ, ఓ, ఔ అనే అచ్చులు, ఆ అచ్చులతో కూడిన హల్లులు. (అనగా అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ అనే అచ్చులు, ఆ అచ్చులతో కూడిన హల్లులను మాత్రమే ఉపయోగించాలి)
ఛందస్సు - మీ ఇష్టము.

12, డిసెంబర్ 2016, సోమవారం

సమస్య - 2223 (తండ్రి మరణమ్ము...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"తండ్రి మరణమ్ము సంతోషదాయకమ్ము"
లేదా...
"జనకుని చావు పుత్రునకు సంతసముం గలిగించు సత్యమౌ"
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

11, డిసెంబర్ 2016, ఆదివారం

సమస్య - 2222 (శంకరాభరణము...)

కవిమిత్రులారా!
(నేటి సమస్య సంఖ్యను చూస్తే నాకు ఆనందం, ఒక విధమైన తృప్తి, (కించిత్తు గర్వం) కలుగుతున్నాయి. ఈ సంఖ్యను చేరడానికి కవిమిత్రులందిస్తున్న సహకారమే కారణం. ఈ సహకారాన్ని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తూ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను)
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"శంకరాభరణము సమస్యలకు నెలవు"
లేదా...
"అరయఁగ శంకరాభరణమందు సమస్యల వెల్లువే కదా"

10, డిసెంబర్ 2016, శనివారం

సమస్య - 2221 (బలవంతపు చావు వచ్చె...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"బలవంతపు చావు వచ్చె భాస్కరున కటన్"
లేదా...
"బలవన్ముృత్యువు ప్రాప్తమయ్యె రవికిన్ బ్రారబ్ధకర్మంబునన్"
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

9, డిసెంబర్ 2016, శుక్రవారం

సమస్య - 2220 (బలరాముఁడు సీతఁ జూచి...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"బలరాముఁడు సీతఁ జూచి ఫక్కున నగియెన్"
లేదా...
"బలరాముం డవనీతనూజఁ గని దుర్వారమ్ముగా నవ్వెరా"
(కందంలో ఉన్న సమస్య ప్రసిద్ధమైనదే)

8, డిసెంబర్ 2016, గురువారం

సమస్య - 2219 (సాహిత్యాధ్వమున దుమ్ము....)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"సాహిత్యాధ్వము దుమ్ము రేగినది దుష్కాలమ్ము ప్రారంభమై"
లేదా...
"సాహిత్యాధ్వమున దుమ్ము సమధిక మయ్యెన్"
(ఆకాశవాణి వారి సమస్య)

7, డిసెంబర్ 2016, బుధవారం

సమస్య - 2218 (తప్పు సేయువాఁడె...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"తప్పు సేయువాఁడె ధర్మవిదుఁడు"
లేదా...
"తప్పులు సేయు మానవుఁడె ధర్మవిదుం డన నొప్పు నెల్లెడన్"

6, డిసెంబర్ 2016, మంగళవారం

సమస్య - 2217 (రాక్షసుల సహస్రదృక్కు...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"రాక్షసుల సహస్రదృక్కు రక్షించు సదా"
లేదా...
"రాక్షసు లెల్లరన్ సతము రక్షణ సేయు సహస్రనేత్రుఁడే"

5, డిసెంబర్ 2016, సోమవారం

వరంగల్ అష్టావధానము


ది. 4-12-2016 (ఆదివారం) వరంగల్లులోని రైజింగ్ సన్ హైస్కూలులో కుమారి 'పుల్లాభట్ల నాగశాంతి స్వరూప' గారు అష్టావధానం చేశారు. ఈ కార్యక్రమానికి లయన్ శ్రీ తమ్మెర లక్ష్మీనరసింహ రావు గారు అధ్యక్షత వహించగా, ప్రముఖ అష్టావధాని డా॥ శ్రీ ఇందారపు కిషన్ రావు గారు సమన్వయకర్తగా వ్యవహరించారు. అతిథులుగా శ్రీ ఆరుట్ల భాష్యాచార్య గారు, డా॥ శ్రీ టి. శ్రీరంగస్వామి గారు పాల్గొన్నారు.

అష్టావధానంలోని అన్ని అంశాలను అవధాని సమర్థంగా నిర్వహించి అందరి ప్రశంసలను అందుకున్నారు.

౧) నిషిద్ధాక్షరి - గుండు మధుసూదన్
ఓరుగల్లులో పోతన భాగవతావిష్కరణం...
అవధాని పూరణ - (కుండలీకరణంలో ఉన్నవి పృచ్ఛకులు నిషేధించిన అక్షరాలు. x అని ఉన్నచోట పృచ్ఛకులు నిషేధం విధించకుండా అవధాని చిత్తానికి వదిలివేశారు.).....
(x)శ్రీ(x)క(ర)ళ(య)తో(ప)ని(త)ండి(య)న(య)నీ
పాక(x)ము(x)మే(న)లై(x)స(క)త(త)ంబు భ(స)ళి(ర)యై (x)యె(స)ప్డున్
(రెండు పాదాలకు మాత్రమే నిషేధం విధించబడింది)

శ్రీకళతో నిండిన నీ
పాకము మేలై సతంబు భళియై యెప్డున్
లోకానికి మేలు కలుగ
శ్రీకారమె భాగవతము చిన్మయ కవిరాట్!

౨) సమస్య - జీడికంటి శ్రీనివాస మూర్తి
"అవధాన మ్మొక ప్రజ్ఞయౌ ననఁగ నా కాశ్చర్యమౌ సోదరీ"
అవధాని పూరణ....
వ్యవధానం బిసుమంత లేక యిలలో వర్ధిల్లు సత్క్రీడయై
కవిలోకానికిఁ గాంతు లీను శశియై గంభీర వాగ్బంధమై
యవురా చిత్ర విచిత్ర దీపితములై హ్లాదంబుఁ జేకూర్చు నీ
యవధాన మ్మొక ప్రజ్ఞయౌ ననఁగ నా కాశ్చర్యమౌ సోదరీ!

౩) దత్తపది - కంది శంకరయ్య
"సీత-కైక-సుమిత్ర-తార" పదాలను ప్రయోగిస్తూ భారతార్థంలో స్వేచ్ఛాచ్ఛందంలో పద్యం చెప్పాలి.
అవధాని పూరణ....
రాజ్యమునకై కలవరించి రహిని వెలుఁగ
ధరణి వసుమిత్రమై వెల్గు తపనఁ గూడి
కౌరవులె యిసీ తండ్రినిఁ గలఁతఁ బెట్టి
పశుతను వనితా రత్నముఁ బరిభవించె!

౪) వర్ణన - పాతూరి రఘురామయ్య
భద్రకాళి అమ్మవారి వర్ణన.....
అవధాని పూరణ....
అల్లాడించితివే సురారుల ననిన్ హాయంచు విశ్వేశ్వరీ
యిల్లాలా శివ వామభాగ నిలయా హేరంభ సంతోషిణీ
ముల్లోకాలకు మూలమైన జననీ మోక్షప్రదా ధీప్రదా
యుల్లంబందున భద్రకాళి యమవై యుత్సాహ మందింపవే!

౫) వ్యస్తాక్షరి - బోయినిపల్లి రాధ
ధరణి ననేక శిష్యులను దక్షులఁ జేసెడు ప్రాజ్ఞు లిమ్మహిన్.

౬) ఆశువు - చేపూరి శ్రీరామ్

1. మహాసహస్రావధానులు మీ అవధానాన్ని చూసి మనస్సులలో ఏమనుకొని వుంటారో ఊహించిచెప్పండి.
అవధాని పూరణ....
దిగ్గజములు నెదుట దిట్టలై యుండఁగా
పద్య పాదములవి పరుగుఁ దీయు
నింత వారి నెల్ల నెంతెంతగాఁ జూపు
వారి దృక్కు నాకు వాక్కు నిడెగ!

2. పెద్దనోట్ల రద్దుతో...ప్రజల సహనం...భావి బాగుంటుందని చెప్పండి.
అవధాని పూరణ...
మంచి ముందుఁ గలదు మదినుంచి మసలుఁడీ
పొంచియున్న చెడునుఁ బోవఁ జేయు
నాశ గలుగువాఁడె యానంద మయుఁడురా
సహన భావ మున్న సాధు సాధు!

3. ఈ అవధాన సభా వర్ణన చేయండి.
అవధాని పూరణ...
ఆఱు నైదుఁ గూడి యానంద మందింప
యత్నములను సలిపె నూత్నముగను
నోరుఁగల్లులోన నుయ్యాల లూపెగా
తెల్గు భాషలోన వెల్గులంద!

౭) ఘంటావధానం - యం. వెంకటలక్ష్మి
(పృచ్ఛకురాలు చేసిన శబ్దాలను విని అవధాని చెప్పినవి...)
1. రాగ మీవె భక్తి రాగ మీవె
2. రాలు పూలు పూసె రంజితముగ
3. బమ్మెర పోతన

౮) అప్రస్తుత ప్రశంస - పల్లేరు వీరస్వామి గారు సమర్థవంతంగా నిర్వహించారు.

డా॥ ఇందారపు కిషన్ రావు గారి ఆశీఃపద్యములు:

ప్రతిభా నాన్యతో దృష్టః
వ్యుత్పత్తిశ్చ గరీయసి|
శాంతిస్వరూప వాగ్దేవ్యాః
అభ్యాసశ్చాద్భుతః క్రమః||

సకల కష్టాంశములు తీర్చె సరసరీతి!
చాలు ప్రశ్నలా యవి, సునామీలు గావ?
అన్నిఁటినిఁ బట్టి పూరించె నద్భుతముగ
నబలయా కాదు నిజముగ సబల యనుము!

అవధానానంతరం శ్రీలేఖ సాహితి, వరంగల్ వారు ప్రచురించిన డా॥ పిట్టా సత్యనారాయణ గారి 'బ్రతుకు బాట (పద్య కథాకావ్యము), 'ఆధ్యాత్మిక యోగా - నాడీ నిదానము' అన్న పుస్తకాల ఆవిష్కరణ జరిగింది.

దత్తపది - 104 (సీత - కైక - సుమిత్ర - తార)

సీత - కైక - సుమిత్ర - తార
పై పదాలను ఉపయోగిస్తూ
మహాభారతార్థంలో
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.

(నిన్నటి వరంగల్ అష్టావధానంలో నే నిచ్చిన దత్తపది)

4, డిసెంబర్ 2016, ఆదివారం

ఆహ్వానము!


సమస్య - 2216 (మూడును నాలుగు గలిసిన...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"మూడు నాలుగు గలిపిన ముప్పది కద"
లేదా...
"మూడును నాలుగున్ గలియ ముప్పది యౌఁగద లెక్కఁ జూచినన్"
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

3, డిసెంబర్ 2016, శనివారం

సమస్య - 2215 (వర సురలోక మేగుదురు...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"వరసుర లోక మేగుదురు వారక చేసినఁ బాప కృత్యముల్"
లేదా...
"స్వర్గలోక మేగెదరఁట పాపులెల్ల"
ఈ సమస్యను పంపిన పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు!

2, డిసెంబర్ 2016, శుక్రవారం

సమస్య - 2214 (సాని పొందున్నవారలే...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"సాని పొందున్నవారలే సత్పురుషులు"
లేదా...
"సానుల పొందు గల్గిననె సత్పురుషుల్ యశమున్ గడింతురే"

1, డిసెంబర్ 2016, గురువారం

న్యస్తాక్షరి - 37 (వి-వా-హ-ము)

అంశము- పెండ్లి వేడుక
ఛందస్సు- తేటగీతి
నాలుగు పాదాల మొదటి అక్షరాలుగా వరుసగా
‘వి - వా - హ - ము’ ఉండాలి.

30, నవంబర్ 2016, బుధవారం

సమస్య - 2213 (మాధుర్యము లేని భాష...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"మాధుర్యము లేని భాష మన తెలుఁగు గదా"
లేదా...
"మాధుర్యం బిసుమంత లేనిది గదా మా యాంధ్ర మీ భూమిపై"
గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలతో....

29, నవంబర్ 2016, మంగళవారం

దత్తపది - 103 (దిన-వార-పక్ష-మాస)

దిన - వార - పక్ష - మాస
పై పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ
మహాభారతార్థంలో
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.

28, నవంబర్ 2016, సోమవారం

సమస్య - 2212 (వనితయుఁ గవితయు...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"వనితయుఁ గవితయు జనులను వంతలఁ బెట్టున్"
లేదా...
"వనితయుఁ గావ్యమున్ జనుల వంతలఁ బెట్టుట సత్యమే కదా"
(కవిశ్రీ సత్తిబాబు గారికి ధన్యవాదాలతో...)

27, నవంబర్ 2016, ఆదివారం

ఆహ్వానము!కాకతీయ పద్య కవితా వేదిక, వరంగల్

అవధాన రాజహంసిని, శతావధాన విశారద
కుమారి పుల్లాభట్ల నాగశాంతి స్వరూప గారిచే
(తెలుగు అధ్యాపకురాలు, ఆంధ్ర యువతీ సంస్కృత కళాశాల, రాజమహేంద్రవరము)

అష్టావధానము

వేదిక : రైజింగ్ సన్ హైస్కూల్, వాసవి కాలనీ రోడ్, కొత్తవాడ, వరంగల్
తేదీ : 04-12-2016 (ఆదివారం); సమయం : ఉదయం 10-00 గం.లకు.

అధ్యక్షులు             : Ln. తమ్మెర లక్ష్మీనరసింహరావు గారు, MJF., T 20 F.,
సమన్వయ కర్త       : డా॥ ఇందారపు కిషన్ రావు గారు, (ప్రముఖ అష్టావధాని)
ముఖ్య అతిథి         : శ్రీ ఆరుట్ల భాష్యాచార్య గారు, (ప్రముఖ పద్యకవి)
విశిష్ట అతిథి          : డా॥ టి. శ్రీరంగస్వామి గారు, (శ్రీలేఖ సాహితి, వరంగల్)

పృచ్ఛకులు
నిషిద్ధాక్షరి                 : శ్రీ గుండు మధుసూదన్ గారు
సమస్య                    : శ్రీ జీడికంటి శ్రీనివాస మూర్తి గారు
దత్తపది                   : శ్రీ కంది శంకరయ్య
వ్యస్తాక్షరి                 : శ్రీమతి బోయినిపల్లి రాధ గారు
వర్ణన                      : డా॥ పాతూరి రఘురామయ్య గారు
ఆశువు                    : శ్రీ చేపూరి శ్రీరామ్ గారు
ఘంటావధానము        : చి॥ యం. వెంకటలక్ష్మి
అప్రస్తుత ప్రసంగము    : డా॥ పల్లేరు వీరస్వామి గారు

అందరూ ఆహూతులే!

ప్రాయోజకులు :
                    శ్రీ రామడుగు షణ్ముఖాచారి గారు,       
ప్రిన్సిపాల్, రైజింగ్ సన్ హైస్కూల్, వరంగల్.

సమస్య - 2211 (రాతినిఁ గూడినట్టి చెలి...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"రాతినిఁ గూడినట్టి  చెలి రాతిగ మారె నదేమి చోద్యమో?"
లేదా...
"రాతిఁ గూడి చెలియ రాయి యయ్యె"

26, నవంబర్ 2016, శనివారం

సమస్య - 2210 (కార్తిక మాసమందు శితికంఠుని...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"కార్తిక మాసమందు శితికంఠుని పూజలు సేయఁ బాపమౌ"
లేదా...
"కార్తికమున శివుని పూజ గడుఁ బాపమగున్"
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

25, నవంబర్ 2016, శుక్రవారం

ఆహ్వానం!


సమస్య - 2209 (హృదయముఁ జీల్ప...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"హృదయముఁ జీల్ప రత్నములు హేమములున్ గనవచ్చు నంతటన్"
లేదా...
"ఎదను జీల్పఁ గనంబడు హేమమణులు"
('చిత్ర కవితా ప్రపంచం' బ్లాగు సౌజన్యంతో)

24, నవంబర్ 2016, గురువారం

సమస్య - 2208 (మతిహీన పురుషు...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"మతిహీన పురుషు నుతింప మాన్యులు సుమ్మీ"  
లేదా...
"మతిహీనాచల భావ పూరుషుని సన్మానింప సంభావ్యమే"
ఈ సమస్యను పంపిన పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు.

23, నవంబర్ 2016, బుధవారం

సమస్య - 2207 (భువి వీడితి వేల...)


 అమర సంగీత విద్వాంసులు
మంగళంపల్లి బాల మురళీకృష్ణ గారికి
శ్రద్ధాంజలి!
కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"భువి వీడితి వేల బాల మురళీకృష్ణా"

22, నవంబర్ 2016, మంగళవారం

సమస్య - 2206 (కట్టలు గలవారి...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"కట్టలు గలవారి బాధ కంజుఁ డెఱుఁగునా"
లేదా...
"కట్టలు గల్గువారు పడు కష్టము నబ్జభవుం డెఱుంగునా"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

21, నవంబర్ 2016, సోమవారం

సమస్య - 2205 (తన్నం జూచిన...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"తన్నం జూచిన భక్తి గల్గు మదికిం దత్త్వంబు సుగ్రాహ్యమౌ"
లేదా...
"తన్నం జూచిననె భక్తితత్త్వము దెలియున్"

20, నవంబర్ 2016, ఆదివారం

సమస్య - 2204 (పడ్డవాఁడు కాఁడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"పడ్డవాఁడు కాఁడు చెడ్డవాఁడు"

19, నవంబర్ 2016, శనివారం

సమస్య - 2203 (ఆగ్రహ మున్నఁ జాలు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"ఆగ్రహ మున్నఁ జాలు సుజనావళి మెచ్చును స్తోత్రవాక్కులన్"
లేదా...
"ఆగ్రహ మున్నపుడె మెత్తు రందఱు సుజనుల్"

18, నవంబర్ 2016, శుక్రవారం

సమస్య - 2202 (రద్దన రాద్ధాంత మేల...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"రద్దన రాద్ధాంత మేల రాహుల్ గాంధీ"

17, నవంబర్ 2016, గురువారం

సమస్య - 2201 (భామా రమ్మనుచు...)


కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"భామా రమ్మనుచు ముదిత భర్తను బిలిచెన్" 

16, నవంబర్ 2016, బుధవారం

సమస్య - 2200 (తద్దినమే లేనిరోజు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"తద్దినమే లేనిరోజు నా తద్దినమే"
(యతిని గమనించండి)
లేదా...
"ఏ దినమందు తద్దినములే కరవౌనొ మదీయ తద్దినం
బా దినమౌను...."

"ఎద్దినం తద్దినం నాస్తి తద్దినం మమ తద్దినమ్" అని ఒక బ్రాహ్మణుడు వాపోయాడట! 
చిన్నప్పుడు మా గురువు గారు చెప్పారు."

15, నవంబర్ 2016, మంగళవారం

సమస్య - 2199 (ఫలితముఁ గోరి పాటుపడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"ఫలితముఁ గోరి పాటుపడువారికి దక్కునె లాభ మెయ్యెడన్"
లేదా...
"పాటుపడినవారి కెట్లు ఫలితము దక్కున్"

14, నవంబర్ 2016, సోమవారం

సమస్య - 2198 (పిల్లినిఁ జంకఁ బెట్టుకొని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"పిల్లినిఁ జంకఁ బెట్టుకొని పెండ్లికిఁ బోయిన మెత్తు రెల్లరున్"లేదా..
"పెండ్లి కేగుము చంకలో పిల్లితోడ"

13, నవంబర్ 2016, ఆదివారం

సమస్య - 2197 (విప్రుఁడు మద్యమాంసముల...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"విప్రుఁడు మద్యమాంసముల విందనగాఁ దల యూపి వచ్చెనే"
లేదా...
"ద్విజుఁడు మద్యమాంసమ్ముల విందుఁ గోరె"

12, నవంబర్ 2016, శనివారం

సమస్య - 2196 (మారుతి చక్రాయుధమున...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"మారుతి చక్రాయుధమున మన్మథుఁ జంపెన్"
లేదా...
"మారుతి చక్రమున్ విడిచి మన్మథుఁ జంపెను గ్రూరకర్ముఁడై"

11, నవంబర్ 2016, శుక్రవారం

సమస్య - 2195 (సిగ్గెగ్గులు లేని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"సిగ్గెగ్గులు లేని మనుజు సిరి తా వలచున్"
లేదా...
"సిగ్గెగ్గుల్ దమలోన లేని మనుజున్ శ్రీ చేరు నెల్లప్పుడున్"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

10, నవంబర్ 2016, గురువారం

సమస్య - 2194 (మానిని మానముం జెఱచి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"మానిని మానముం జెఱచి మన్ననలన్ మగవాఁడు పొందెరా"
లేదా...
"మానిని మానమ్ముఁ జెఱచి మన్నన లందెన్"

9, నవంబర్ 2016, బుధవారం

సమస్య - 2193 (దోషము లెంచ రెవ్వరును...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"దోషము లెంచ రెవ్వరును దుష్టుని చెంతను విత్త మున్నచో"
లేదా...
"దోషము లరుదు ధనమున్న దుష్టునందు"
ఈ సమస్యను పంపిన పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు.

8, నవంబర్ 2016, మంగళవారం

సమస్య - 2192 (బోండా లరవై....)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"బోండా లరవై నమిలెను బొరుగుల వలెనే."
లేదా...
"బోండా లర్వది యైన నేమి నమిలెన్ భూమయ్య పేలాల్వలెన్"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

7, నవంబర్ 2016, సోమవారం

సమస్య - 2191 (హారము గొలిచిన....)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"హారము గొలిచిన నది పది యామడలుండెన్."
లేదా...
"హారము గొల్చి చూడఁ బది యామడ లున్నది కంటివే సఖీ"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

6, నవంబర్ 2016, ఆదివారం

దత్తపది - 102 (సరి-గమ-పద-నిస)

సరి - గమ - పద - నిస
పై పదాలను ఉపయోగిస్తూ
రామాయణార్థంలో
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.

5, నవంబర్ 2016, శనివారం

సమస్య - 2190 (దేవుఁడు లేనెలేఁడని....)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"దేవుఁడు లేనెలేఁడని మదిన్ నెర నమ్ముచుఁ గొల్తు భక్తితోన్"
లేదా...
"దేవుఁడు లేఁడనుచు నమ్మి తిరముగఁ గొల్తున్"

4, నవంబర్ 2016, శుక్రవారం

సమస్య - 2189 (తనయుఁడు తమ్ముఁ డయ్యె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"తనయుఁడు తమ్ముఁ డయ్యె నది తప్పగునో మఱి యొప్పునో సఖీ"
లేదా...
"తనయుఁడు తన తమ్ముఁ డయ్యెఁ దప్పో యొప్పో"

కాశీయాత్ర (ఖండకావ్యము)

                           రచన - పోచిరాజు సుబ్బారావు
 

కన్నకొడుకగు కిరణును గలుపుకొనుచు
విజయ, జామాత లిరువురు వెంట రాగ
కాశి కేగితి విశ్వేశు గనుట కొఱకు
హాయి  గొలిపెను  యాత్ర మా కందఱకును.

కాశికాపురమున గనువిందు గావించె
కనకమయపు  దేహకాంతి తోడ
నన్నపూర్ణ  తల్లి, యభయ మీయంగను
భక్తకోటి కెల్ల రక్తి నుండె.

చూసితి దుర్గా మాతను
జూసితి మఱి యాంజనేయు జూసితి గపులన్
జూసితి వీణాధారిని
జూసితి నే గవల మాత జూడ్కుల కింపౌ.

విశ్వనాధుని జూడంగ వేల కొలది
భక్త జనములు వత్తురు ప్రతిదినమ్ము
వారి నందర బ్రోవను వాసముండె
కాశి యందున తిరముగ గాలు డచట.

ఘాటు లరువది నాలుగు గలవు కాశి
నందులో మణికర్ణిక యధికతరము
తాన మాడిన దొలగును దప్పు లన్ని
కల్ల కాదిది నిజమునే బల్కుచుంటి.

కాలభైరవ దర్శన కాంక్షతోడ
పరుగు పరుగున బోవంగ ప్రభువు దరికి
సరిగ జూడంగ జాలము జనము మధ్య
ప్రణతు  లిడుదును నా కాలభైరవునకు.

చింతించ దగిన  విషయ
మ్మంతయు నిక చెత్త యుండె నా పుర మందున్
గుంతల మాదిరె వీధులు
నంతయు నా శివుని లీల లాహా యరయన్.

చీరల  విషయము జూసిన
భారమ్మే లేక యుండి బహు తేలికగా
నీరము తడిసిన చెడక బె
నారసులో పట్టు చీర నాణ్యతతోడన్.

శివుని యాజ్ఞయే లేనిచో చీమయైన
కుట్ట దందురు పండితు లట్టు లయ్యె
నాజ్ఞ గలుగగ భర్గుని యాత్మనుండి
వెడల గలిగితి మయ్య యా విభుని దరికి.

పండ్లలో గన యాపిలు పండు మఱియు
నాకు కూరల యందున నలరు నట్టి
పాల కూరను వదిలితి బ్రమద మలర
దుంప లందున చిలగడ దుంప కూడ.
కాశి యందున విడిచితి  గంగలోన.

3, నవంబర్ 2016, గురువారం

సమస్య - 2188 (కారాగారమునందు ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"కారాగారమునందు లభ్యమగు సౌఖ్యంబుల్ ముదం బొప్పగన్"
లేదా...
"కారాగారమున ఘనసుఖంబులు దక్కున్"

2, నవంబర్ 2016, బుధవారం

సమస్య - 2187 (అయ్యనుఁ గని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"అయ్యనుఁ గని విరహ మందె నతివ సహజమే"
లేదా...
"అయ్యనుఁ గాంచి నాతి విరహాతుర యయ్యెను సాజమే కదా"

1, నవంబర్ 2016, మంగళవారం

వేంకటేశ్వర శతకము - 11వేంకటేశ్వర శతకము
(ప్రణీతము: పోచిరాజు కామేశ్వర రావు)
 (౧౧)
మహిమపు స్వామి పుష్కరిణి మాన్పు రజోఘము స్వర్ణ చౌర్య దో
ష హరము సేయు మజ్జనము సల్పిన మాత్రమ సత్వరమ్ముగ
న్నిహపర సౌఖ్య దాయకము నింపుగ దర్శన పాన సంగమా
ద్యహరహ పుణ్య కృత్యముల నక్షధ రాచ్యుత! వేంకటేశ్వరా!                 96.

శరణము లెల్ల దుఃఖముల శార్ఙ్గధ రాంచిత పాదపద్మముల్
తరణము లిభ్భవాంబుధుల దాట రమావిభు నామకీర్తనల్
తురగము లక్షయస్థలికిఁ దోయజ నాభు సుపూజనావళుల్
కరములు మోడ్చి మ్రొక్కెదను గైటభ ఖండన! వేంకటేశ్వరా!                    97.

అక్షము లేని తేరున విహారము ధారుణిఁ జేయ శక్యమే
పక్షము లున్నఁ గాని భువిఁ బక్షులు పైకెగు రంగ శక్యమే
చక్షువు లున్నఁ గాని కన శక్యమె మేదినిఁ బ్రాణి కోటికి
న్నక్షయు జ్ఞాన యోగమున నైహిక ముక్తులు వేంకటేశ్వరా!                   98.

అమర సహస్ర భోగ చతురానన షణ్ముఖ కీర్త నాతిరి
క్తము సిరి వాస భూషితము తామరసాక్ష మనో వికాస శై
లము ధన హేమ ధాన్యద విరాజిత మిద్ధర వేంకటాద్రినిన్
సముచిత రీతిఁ గొల్చెదము సన్మతి నిత్యము వేంకటేశ్వరా!                     99.

శిష్ట జనాళి రక్షక విశేష కృపారస సిక్త వీక్షణా
దుష్ట జనాళి శిక్షక సదుద్భవ పాలన నాశ హేతుకా
కష్టతరానివార్య భవ ఖండన కార్య నిమగ్న దైవమా
తుష్ట సుభక్త సేవిత సదుజ్వల విగ్రహ వేంకటేశ్వరా!                              100.

శ్రీకర! భక్త సంచయ వశీకర! పాప వినాశ కారకా!
నాక నివాస నిర్జర గణప్రభు పూజిత పాదపద్మ! ప
ద్మాకర భాసిత క్షితిధరాలయ! మాధవ! భూరమా కరా
నేక సుమార్చితాంఘ్రియుగ! నిన్ను నుతించెద వేంకటేశ్వరా!                   101.

ఇది విబుధజన వినత కౌశిక సగోత్రోద్భవ పోచిరాజాన్వయ సత్యసుందరీపేర్రాజదంపతీ సుత
వేంకట రామ లక్ష్మీ సతీ సేవిత కామేశ్వర రావు నామధేయ విరచిత
శ్రీ వరాహ పురాణ ప్రామాణిక
వేంకటేశ్వర శతకము.
-*-