31, జులై 2011, ఆదివారం

ప్రహేళిక - 49

ఈ ‘భేదం’ ఏమిటి?
తే. గీ.
క్షాంతి, మేదస్సు, జలజము, సంక్షయమ్ము,
నొంటిపాటు, మోదమ్ము, ముక్కంటి, మౌని
యనెడి చతురక్షరపదమ్ము లందులో ద్వి
తీయవర్ణంబు లే ‘వాసిఁ’ దెలియఁజేయు?

కవిమిత్రులారా,
ఆ భేదం ఏమిటో చెప్పండి.
సమాధానాన్ని మెయిల్ చేయండి.
shankarkandi@gmail.com

సమస్యా పూరణం -411 (నలకూబరు మంచ మందు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
నలకూబరు మంచ మందు నల్లులు సేరెన్.

ప్రహేళిక - 48 (సమాధానం)

సీ.
రావణాసురుఁడు శ్రీరామున కేమగు? (అరాతి)
వానలు లేకున్న వచ్చు నేది? (క్షామము)
బంగారు నగలమ్ము వర్తకు నేమందు(రు)? (సరాబు)
ఐరావతాఖ్యమైనట్టి దేది? (గజము)
సంపన్నతను దెల్పఁజాలు బూడిద యేది? (విభూతి)
ప్రాణమ్ములను దీయు వస్తు వేది? (విషము)
సూక్ష్మాతిసూక్ష్మవస్తువుకు గుర్తింపేది? (అణువు)
మ్రొక్కి దేవున కిచ్చు మూట యేది?(ముడుపు)
తే. గీ.
అన్నిటికిఁ జూడ మూడేసి యక్షరమ్ము
లందు మధ్యాక్షరమ్ముల నరసి చూడ
నష్టదిగ్గజకవులలో నగు నొకండు
చెప్పువారల కిత్తుఁ బ్రశంస లెన్నొ.
రాతి - క్షాము - సరాబు - గము - విభూతి - విము - అణువు - ముడుపు.
సమాధానాల నడిమి అక్షరాలను వరుసగా చదివితే వచ్చే సమాధానం ...
రామరాజభూషణుడు.
సరియైన సమాధానాలు పంపినవారు ...
గన్నవరపు నరసింహ మూర్తి గారు,
మందాకిని గారు,
కోడీహళ్ళి మురళీ మోహన్ గారు,
వసంత కిశోర్ గారు,
చంద్రశేఖర్ గారు,
‘కమనీయం’ గారు.
అందరికీ అభినందనలు.

30, జులై 2011, శనివారం

ప్రహేళిక - 48

సీ.
రావణాసురుఁడు శ్రీరామున కేమగు?
వానలు లేకున్న వచ్చు నేది?
బంగారు నగలమ్ము వర్తకు నేమందు?
రైరావతాఖ్యమైనట్టి దేది?
సంపన్నతను దెల్పఁజాలు బూడిద యేది?
ప్రాణమ్ములను దీయు వస్తు వేది?
సూక్ష్మాతిసూక్ష్మవస్తువుకు గుర్తింపేది?
మ్రొక్కి దేవున కిచ్చు మూట యేది?
తే. గీ.
అన్నిటికిఁ జూడ మూడేసి యక్షరమ్ము
లందు మధ్యాక్షరమ్ముల నరసి చూడ
నష్టదిగ్గజకవులలో నగు నొకండు
చెప్పువారల నేఁ బ్రశంసింతు నిపుడు.
కవిమిత్రులారా,
ఆ కవి పేరు (వివరణతో) చెప్పండి.
సమాధానాన్ని మెయిల్ చేయండి.
shankarkandi@gmail.com

సమస్యా పూరణం -410 (కలికి కంటినీరు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
కలికి కంటినీరు కలిమి నొసఁగు.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

29, జులై 2011, శుక్రవారం

ప్రహేళిక - 47

ఈ పదాలు ఏవి?
ఆ. వె.
దాన మొసఁగువాఁడు, తననుఁ గన్న వనిత,
వ్రాత, వెఱ్ఱి, యగ్ని పదము లవ్వి
ద్వ్యక్షరమ్ములు తుది యక్షరా లాదులౌ
నట్టివానిఁ జెప్పునతఁడె ఘనుఁడు.

కవిమిత్రులారా,
ఆ పదాలేమిటో చెప్పగలరా?
సమాధానాన్ని మెయిల్ చేయండి.
shankarkandi@gmail.కం

సమస్యా పూరణం -409 (బంజరు భూములు దొరకవు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
బంజరు భూములు దొరకవు పదికోట్లన్నన్.
ఈ సమస్యను పంపిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.

28, జులై 2011, గురువారం

ప్రహేళిక - 46

ఈ పదాలు ఏవి?
ఆ. వె.
ఫణము, ఘటిక, నందపత్ని, దాహము, బాష్ప
వారి, కృష్ణసతియు పదము లవ్వి
త్ర్యక్షరమ్ములు తుది యక్షరా లాదులౌ
నట్టివానిఁ జెప్పునతఁడె ఘనుఁడు.

కవిమిత్రులారా,
ఆ పదాలేమిటో చెప్పగలరా?
సమాధానాన్ని మెయిల్ చేయండి.
shankarkandi@gmail.com

చమత్కార పద్యాలు - 114 A (ప్రహేళిక సమాధానం)

చం.
కలువలరాజు బావ సతి కన్నకుమారుని యన్న మన్మనిన్
దొలఁచినవాని కార్యములు తూకొని చేసినవాని తండ్రినిం
జిలికినవాని వైరి పతి చెల్లెలి బావకు నన్న తండ్రికిన్
వలచిన వాహనంబు వలె వచ్చెడి నింటికిఁ జూడవే చెలీ!

(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి ‘చాటుపద్య రత్నాకరము’ నుండి)
వివరణ -
కలువల రాజు - చంద్రుడు
చంద్రుని బావ - విష్ణువు
విష్ణువు సతి - లక్ష్మి
లక్ష్మి కన్నకుమారుడు - మన్మథుడు
మన్మథుని అన్న - బ్రహ్మ
బ్రహ్మ మనుమడు - రావణుడు
రావణుని తొలచినవాడు - రాముడు
రాముని కార్యములు చేసినవాడు - హనుమంతుడు
హనుమంతుని తండ్రి - వాయుదేవుడు.
వాయువును చిలికినవాడు - శేషుడు
శేషుని వైరి - గరుత్మంతుడు
గరుత్మంతుని ప్రభువు - కృష్ణుడు (విష్ణువు)
కృష్ణుని చెల్లెలు - సుభద్ర
సుభద్ర బావ - భీముడు
భీముని అన్న - ధర్మరాజు
ధర్మరాజు తండ్రి - యముడు
యముని వాహనం - దున్నపోతు.
సరియైన సమాధానం పంపిన
మందాకిని, గన్నవరపు నరసింహ మూర్తి గారలకు
అభినందనలు.

సమస్యా పూరణం -408 (కంచెయే చేను మేయుట)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
కంచెయే చేను మేయుట కల్ల గాదు
ఈ సమస్యను సూచించిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

27, జులై 2011, బుధవారం

చమత్కార పద్యాలు - 114 (ప్రహేళిక)

చం.
కలువలరాజు బావ సతి కన్నకుమారుని యన్న మన్మనిన్
దొలఁచినవాని కార్యములు తూకొని చేసినవాని తండ్రినిం
జిలికినవాని వైరి పతి చెల్లెలి బావకు నన్న తండ్రికిన్
వలచిన వాహనంబు వలె వచ్చెడి నింటికిఁ జూడవే చెలీ!

(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి ‘చాటుపద్య రత్నాకరము’ నుండి)
కవిమిత్రులారా,
ఆ వస్తున్న వాడెలా ఉన్నాడో వివరించండి.
సమాధానాన్ని మెయిల్ చేయండి.
shankarkandi@gmail.com

సమస్యా పూరణం -407 (రాళ్ళు గలిగినవాఁడె)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
రాళ్ళు గలిగినవాఁడె పో రాజు నేఁడు.
ఈ సమస్యను పంపిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.

26, జులై 2011, మంగళవారం

చమత్కార పద్యాలు - 113 (ప్రహేళిక)

చం.
మమతను దన్ను నొక్క చెలి "మానిని! నీ విభు నామ మే"మనన్
గమలజగంధి పల్కెఁ "గరి కంధి ప్రజాపతి చంద్రి కాతప
త్రములఁ ద్రివర్ణయుక్తముగ వ్రాసియు నందలి మధ్యవర్ణముల్
క్రమముగఁ గూర్చి పల్కినను క్రమ్మర నా విభు నామ మయ్యెడిన్"
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి ‘చాటుపద్య రత్నాకరము’ నుండి)
కవిమిత్రులారా,
ఆ మానిని మగని పేరేమిటి?
(ముప్రత్యయం స్థానంలో అనుస్వారం ఉంచండి. ఉదా. ‘కంధి’ శబ్దానికి సముద్రము అని నాలుగక్షరాలు కాక సముద్రం అని మూడక్షరాలు స్వీకరించండి.)
సమాధానాన్ని మెయిల్ చేయండి.
shankarkandi@gmail.com

సమస్యా పూరణం -406 (భృత్యుని మోదగ హరీశు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
భృత్యుని మోదగ హరీశు భేషనిరి జనుల్!
ఈ సమస్యను సూచించిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.

25, జులై 2011, సోమవారం

చమత్కార పద్యాలు - 112 (ప్రహేళిక)

చం.
నగతనయన్ ధరన్ సిరిని నాలుగు వర్ణములన్ లిఖించి, పొం
దుగఁ దుది నొక్క యక్కరము దూకొని వ్రాయఁగ నింపుమీఱఁగా
నగును గజాననుండు, మఱి యాదిగ నొక్కొక యక్కరంబు దిం
చఁగఁ జతురాననుండు, శరజన్ముఁడు, పంచశరుండు, వహ్నియున్.
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి ‘చాటుపద్య రత్నాకరము’ నుండి)
వివరణ -
పార్వతి (రెండక్షరాలు), భూమి (ఒక అక్షరం), లక్ష్మి (ఒక అక్షరం) మొత్తం నాలుగు అక్షరాలు వ్రాసి చివర మరొక అక్షరాన్ని చేర్చితే గణేశుడు (కార్తికేయుడూ కావచ్చు) అనే అర్థం వస్తుంది. మొదటినుండి ఒక్కొక్క అక్షరాన్ని తొలగిస్తూ పోతే వరుసగా బ్రహ్మ (మన్మథుడూ కావచ్చు), సుబ్రహ్మణ్యుడు, మన్మథుడు, అగ్ని అనే అర్థాలు వస్తాయి.
కవిమిత్రులారా,
సమాధానం చెప్పగలరా?
సమాధానం మెయిల్ చేయండి.

shankarkandi@gmail.com

సమస్యా పూరణం -405 (చదువులలో సార మెఱిఁగి)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
చదువులలో సార మెఱిఁగి చవటగ మాఱెన్.

24, జులై 2011, ఆదివారం

చమత్కార పద్యాలు - 111 (ప్రహేళిక)

భర్త పేరు చెప్పిన పద్మనయన
చం.
"సరసిజనేత్ర! నీ విభుని చారుతరంబగు పేరు చెప్పుమా!"
"అరయఁగ నీవు న న్నడుగు నాతని పే రిదె చిత్తగింపుమా,
కరియును వారిరాశి హరుకార్ముకమున్ శర మద్దమున్ శుకం
బరుదుగ వ్రాయఁగా నడిమి యక్కరముల్ గణుతింపఁ బే రగున్"

(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి ‘చాటుపద్య రత్నాకరము’ నుండి)
కవిమిత్రులారా,
ఆమె భర్త పేరు చెప్పగలరా?
(గమనిక - అన్నీ మూడక్షరాల పదాలు. పదాల వ్యావహారికరూపాలనే స్వీకరించండి. ఉదాహరణకు కరికి ‘మాతంగము’ అని తీసికొంటే నాలుగక్షరాల పదం అవుతుంది. ముప్రత్యయం స్థానంలో అనుస్వారాన్ని ఉంచి ‘మాతంగం’ అనే మూడక్షరాల పదాన్నే తీసికోవాలి)
సమాధానం మెయిల్ చేయండి.
shankarkandi@gmail.com

సమస్యా పూరణం -404 (అర్ధరాత్రి రవికి)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
అర్ధరాత్రి రవికి నర్ఘ్యము లిడె.
ఈ సమస్యను సూచించిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.

చమత్కార పద్యాలు - 110 A (ప్రహేళిక సమాధానం)

కం.
అంచిత చతుర్థజాతుఁడు
పంచమమార్గమున నేఁగి ప్రథమతనూజన్
గాంచి, తృతీయం బప్పురి
నించి, ద్వితీయంబు దాఁటి, నృపు కడ కరిగెన్.
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి ‘చాటుపద్య రత్నాకరము’ నుండి)
వివరణ -
ఈ పద్యంలోని అర్థాలకు పంచభూతాలతో (1. భూమి, 2. నీరు, 3. అగ్ని, 4. వాయువు, 5. ఆకాశం) సంబంధం.
చతుర్థజాతుడు (నాల్గవదైన వాయువు కుమారుడైన ఆంజనేయుడు) పంచమమార్గమున (ఐదవదైన ఆకాశమార్గంలో) వెళ్ళి, ప్రథమతనూజన్ (మొదటిదైన భూమి కుమార్తె అయిన సీతను) చూచి, ఆ లంకాపురిలో తృతీయాన్ని (మూడవదైన అగ్నిని) నింపి, ద్వితీయంబు (రెండవదైన నీటిని అంటే సముద్రాన్ని) దాటి, రాముని వద్దకు వెళ్ళాడు.
మందాకిని, గన్నవరపు నరసింహ మూర్తి, ఊకదంపుడు గారలు సరైన సమాధానాలు పంపారు.
అందరికీ అభినందనలు.

23, జులై 2011, శనివారం

చమత్కార పద్యాలు - 110 (ప్రహేళిక)

కం.
అంచిత చతుర్థజాతుఁడు
పంచమమార్గమున నేఁగి ప్రథమతనూజన్
గాంచి, తృతీయం బప్పురి
నించి, ద్వితీయంబు దాఁటి, నృపు కడ కరిగెన్.
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి ‘చాటుపద్య రత్నాకరము’ నుండి)
కవిమిత్రులారా,
ఎవరికైనా సమాధానం తెలుసా?
తెలిస్తే క్రింది చిరునామాకు మెయిల్ పెట్టండి.
shankarkandi@gmail.com

సమస్యా పూరణం -403 (మగఁ డెఱుఁగని మర్మములు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
మగఁ డెఱుఁగని మర్మము లవి మామ యెఱుంగున్.

చమత్కార పద్యాలు - 109 A (ప్రహేళిక సమాధానం)

మ.
చవితిన్ షష్ఠజుఁ డేగి, పంచమపతిస్థానంబు లంఘించి, యే
డవవాఁ డేలిన వీడుఁ జేరి, పదిలుండై యష్టమస్యందనో
ద్భవి వీక్షించి, తృతీయు చెంతకుఁ జతుర్థశ్రేణి నంపించి, యా
ది విరోధిన్ బెదరించి, యప్పురి ద్వితీయున్ నిల్పి వచ్చెన్ వెసన్.

వివరణ -
ఈ పద్యంలోని అర్థాలలి అష్టదిక్పాలురతో (1. ఇంద్రుడు, 2. అగ్ని, 3. యముడు, 4. నిరృతి, 5. వరుణుడు, 6. వాయువు, 7. కుబేరుడు, 8. ఈశానుడు.) సంబంధం ఉంది.
చవితినాడు
షష్ఠజుడు (దిక్పతులలో ఆరవవాడైన వాయువు కుమారుడైన ఆంజనేయుడు) బయలుదేరి,
పంచమపతి స్థానం (ఐదవవాడైన వరుణుని స్థావరమైన సముద్రాన్ని) లఘించి,
ఏడవవా డేలిన నగరం(ఏడవవాడైన కుబేరుడు పాలించిన లంకానగరం) చేరుకొని,
అష్టమ (ఎనిమిదవవాడైన ఈశ్వరుని) స్యందన (వాహనమైన భూమికి) ఉద్భవి (జన్మించిన సీత)ను చూచి, తృతీయుని (మూడవవాడైన యముని) వద్దకు
చతుర్థ శ్రేణిని (నాల్గవవాడైన నిరృతి పరివారమైన రాక్షసులను) పంపించి,
ఆది విరోధిని (మొదటివాడైన ఇంద్రుని శత్రువైన రావణిని) బెదరించి,
ఆ లంకానగరంలో ద్వితీయుని (రెండవవాడైన అగ్నిని) నిల్పి [కాల్చి]
వేగంగా తిరిగివచ్చాడు.
గన్నవరపు నరసింహ మూర్తి, కోడీహళ్ళి మురళీమోహన్ గారలు సరియైన సమాధానలు పంపారు.
వారికి అభినందనలు.

22, జులై 2011, శుక్రవారం

చమత్కార పద్యాలు - 109 (ప్రహేళిక)

మ.
చవితిన్ షష్ఠజుఁ డేగి, పంచమపతిస్థానంబు లంఘించి, యే
డవవాఁ డేలిన వీడుఁ జేరి, పదిలుండై యష్టమస్యందనో
ద్భవి వీక్షించి, తృతీయు చెంతకుఁ జతుర్థశ్రేణి నంపించి, యా
ది విరోధిన్ బెదరించి, యప్పురి ద్వితీయున్ నిల్పి వచ్చెన్ వెసన్.
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి ‘చాటుపద్య రత్నాకరము’ నుండి)
కవిమిత్రులారా,
ఎవరికైనా సమాధానం తెలుసా?
తెలిస్తే క్రింది చిరునామాకు మెయిల్ పెట్టండి.
shankarkandi@gmail.com

సమస్యా పూరణం -402 (కలలు కల్లలైన)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
కలలు కల్లలైనఁ గలుగు సుఖము.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

21, జులై 2011, గురువారం

చమత్కార పద్యాలు - 108 (ప్రహేళిక)

సీ.
ఆద్యంత మధ్య మాంతాది వర్ణంబులఁ
దేఁటి రక్కసిరాజు తెలియఁ దల్లి;
ఆద్యంత మధ్య మాంతాది వర్ణంబుల
శివునిల్లు వరిచేను క్షీరధార;
ఆద్యంత మధ్య మాంతాది వర్ణంబుల
భార్యయు ఖడ్గంబు పాదపంబు;
ఆద్యంత మధ్య మాంతాది వర్ణంబుల
మార్వన్నె యీటె ధూమంబు దనరు;
తే.గీ.
అన్నిటికిఁ జూడ మూఁడేసి యక్షరములు;
మొదలు తుదలును, నడి తుది, మొదలు నడుమ,
ప్రాణరక్షను; లతలను; పాదపములఁ
బరికరము లంద యీ పదా లమరవలయు.
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి ‘చాటుపద్య రత్నాకరము’ నుండి)
వివరణ -
అన్ని సమాధానాలు మూడక్షరాలు పదాలు.
మొదటి సమాధానం ప్రాణరక్ష చేసే ‘గంజి’ వంటి పానీయాహారం. దాని 1,3 అక్షరాలు కలిస్తే తుమ్మెద; 2,3 అక్షరాలు కలిస్తే ఒక రాక్షసరాజు; 1,2 అక్షరాలు కలిస్తే తల్లి.
రెండవ సమాధానం ‘బీర, కాకర’ వంటి ఒక తీగ. దాని 1,3 అక్షరాలు కలిస్తే దేవాలయం; 2,3 అక్షరాలు కలిస్తే వరి నాటిన స్థలం; 1,2 అక్షరాలు కలిస్తే ‘గుమ్మము’లో పాలధార.
మూడవ సమాధానం ‘జీలకఱ్ఱ, మెంతులు’ వంటి పోపులో వేసే చెట్టు దినుసు. దాని 1,3 అక్షరాలు కలిస్తే భార్య; 2,3 అక్షరాలు కలిస్తే ‘వారసులు’లో వాడికత్తి; 1,2 అక్షరాలు కలిస్తే ఒక గింజ ‘మామిడికాయ’ పచ్చడికి తప్పనిసరి కావలసింది.
నాల్గవ సమాధానం ‘జాజి, మల్లె’ వంటి వకుళవృక్షం. దాని 1,3 అక్షరాలు కలిస్తే రూపు లేదా వన్నె ; 2,3 అక్షరాలు కలిస్తే ‘గడబిడ’లో ఈటె; 1,2 అక్షరాలు కలిస్తే ధూమం.
కవిమిత్రులారా,
సమాధానాలు చెప్పగలరా?
ఉదాహరణకు మొదటి సమాధానం ‘వరస’ అనుకుందాం. మీరు సమాధానం వ్రాయవలసిన పద్ధతి ఇది ...
1. వరస - వర, రస, వస.

సమాధానాలను క్రింది చిరునామాకు మెయిల్ చేయండి.
shankarkandi@gmail.com

సమస్యా పూరణం -401 (పతి జూచిన పడతి)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
పతిఁ జూచిన పడతి గుండె భగ్గున మండెన్.
(శ్రీ గరికపాటి వారి అవధానం నుండి ధన్యవాదాలతో)

ప్రత్యేక సమస్యా పూరణం -400 (భ్లాగు సమస్య లివె)

కవి మిత్రులారా,
మీ అందరి సహకారంతో ‘శంకరాభరణం’ నిరాటంకంగా కొనసాగుతున్నది. చూస్తూ చూస్తుండగానే సమస్యాపూరణాల సంఖ్య 400 చేరింది. ఇకముందు కూడా ఇలాగే కొనసాగడానికి మీ అందరి ఆశీస్సులను, సలహాలను, సహకారాన్ని కోరుకుంటున్నాను. లబ్ధప్రతిష్ఠులు, ఔత్సాహికులు సమస్యలను పూరిస్తూ నాకు నూతనోత్తేజాన్ని కలిగిస్తున్నారు.
అందరికీ వందనాలు, ధన్యవాదాలు.

ఈ సందర్భంగా క్రింది ప్రత్యేక సమస్యను పూరించవలసిందిగా మనవి.
భ్లాగు సమస్య లివె నాల్గువంద లయెఁ గదా!

20, జులై 2011, బుధవారం

ప్రహేళిక - 45

ఈ పదాలు ఏవి?
తే. గీ.
వృష్టి, నిమ్నగ, దిక్కు, రవిజుఁడు, రాత్రి,
కలిమి, తారక, సత్కావ్యకర్త యనెడి
పదము లవి ద్వ్యక్షరమ్ములు; మొదలు విడువ
తుదలు మొదలగు నవి యెవ్వి? తోయజాక్ష!

మిత్రులారా,
సమాధానాలను వ్యాఖ్యగా పెట్టకుండా క్రింది మెయిల్ చిరునామాకు పంపండి.
shankarkandi@gmail. com

ప్రహేళిక - 44 (సమాధానం)

ఈ దేవి ఎవరు?
తే. గీ.
గాలికొడుకు కుమారునిఁ గూల్చినట్టి
వాని తండ్రిని మ్రింగెడివారి తలలు
నఱికినట్టివాని సుతుని నలుమొగముల
నెలకొనిన దేవిఁ గొల్తు విద్యల నొసంగ.

వివరణ -
గాలికొడుకు - భీముఁడు.
భీముని కుమారుఁడు - ఘటోత్కచుఁడు.
ఘటోత్కచుని కూల్చినవాఁడు - కర్ణుఁడు.
కర్ణుని తండ్రి - సూర్యుఁడు.
సూర్యుని మ్రింగెడివారు - రాహుకేతువులు.
రాహుకేతువుల తలలు నఱికినవాఁడు - విష్ణువు.
విష్ణువు సుతుఁడు - బ్రహ్మ.
బ్రహ్మ నలుమొగాలలో నెలకొన్న దేవి - సరస్వతి.
సమాధానాలు పంపిన
కోడీహళ్ళి మురళీమోహన్
సంపత్
గోలి హనుమచ్ఛాస్త్రి
మందాకిని
గారలకు అభినందనలు.

సమస్యా పూరణం -399 (దురితద్యూతమున నోడె)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
దురితద్యూతమున నోడె దుర్యోధనుఁడే!
ఈ సమస్యను పంపిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.

19, జులై 2011, మంగళవారం

ప్రహేళిక - 44

ఈ దేవి ఎవరు?
తే. గీ.
గాలికొడుకు కుమారునిఁ గూల్చినట్టి
వాని తండ్రిని మ్రింగెడివారి తలలు
నఱికినట్టివాని సుతుని నలుమొగముల
నెలకొనిన దేవిఁ గొల్తు విద్యల నొసంగ.

మిత్రులారా,
సమాధానాలను వ్యాఖ్యగా పెట్టకుండా క్రింది మెయిల్ చిరునామాకు పంపండి.
shankarkandi@gmail. com

సమస్యా పూరణం -398 (తండ్రి మించిన శత్రువు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
తండ్రి మించిన శత్రువు ధరణి గలఁడె?
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

18, జులై 2011, సోమవారం

చమత్కార పద్యాలు - 108 (ద్రౌపది, పాండవులు)

ద్రౌపది, పాండవుల వరుసలు
సర్వజ్ఞ సింగ భూపాలుని వద్దకు ఒక కవి వచ్చాడు.
ద్రౌపద్యాః పాండుతనయాః పతి దేవర భావుకః |
న దేవరో ధర్మరాజః సహదేవో న భావుకః ||

అనే శ్లోకాన్ని మనసులో ఉంచుకొని రాజు "ద్రౌపదికి పాండవు లైదుగురు భర్తలు కదా! వారిలో ఒకరు ఆమెకు భర్త అయినప్పుడు తక్కినవారు ఆమెకు ఏమవుతారో ఆశువుగా కందపద్యంలో చెప్పగలవా?" అని కవిని ప్రశ్నించాడు. అప్పుడా కవి చెప్పిన పద్యం .....
కం.
పతి మఱఁదియు సహదేవుఁడు,
పతి బావయు ధర్మజుండు, బావలు మఱఁదుల్
పతులు నర నకుల భీములు,
పతు లేవురు సింగభూప! పాంచాలి కిలన్.

సింగభూపాలుడు ఆనందించి కవిని ఉచితంగా సత్కరించాడట!
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి ‘చాటుపద్య రత్నాకరము’ నుండి)
కవిమిత్రులారా,
క్రింది సమస్యను పూరించండి.
కొడుకునే భర్తగాఁ బొంది పడతి మురిసె.

సమస్యా పూరణం -397 (కవితాతత్త్వమ్ము)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
కవితాతత్త్వమ్ము నడ్డగాడిద లెఱుఁగున్.

17, జులై 2011, ఆదివారం

చమత్కార పద్యాలు - 107 (ప్రహేళిక)

సీ.
ఏమిచేయక వృథా యేటి నీ రేగును?
భూపాలుఁ డేటికిఁ బుట్టు వొందు?
తుంగముస్తెల ప్రీతి తొలఁకాడు వేనికి?
సభవారి నవ్వించు జాణ యెవఁడు?
కలహంస నివసించు కాసార మెయ్యది?
వీరుఁ డెద్దానిచే విజయ మందు?
లజ్జ యెవ్వరి కమూల్యపు టలంకారంబు?
దేవాంగులకు దేన జీవనంబు?
తే. గీ.
అన్నిటికిఁ జూడ నైదేసి యక్షరమ్ము
లొనర నిరుదెసఁ జదివిన నొక్క తీరె
చెప్పఁగల్గిన నే నిత్తు జిన్నమాడ
చెప్పలేకున్న నవ్వుదుఁ జిన్ని నవ్వు.
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి ‘చాటుపద్య రత్నాకరము’ నుండి)
కవిమిత్రులారా!
ఎవరైనా సమాధానం చెప్పగలరా?

సమస్యా పూరణం -396 (పుట్టినదిన మని)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
పుట్టినదిన మని విషాదమున విలపింతున్.
ఉదయాన్నే జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన
కోడీహళ్ళి మురళీ మోహన్ గారికి
ధన్యవాదాలు.
వారు చెప్పే దాకా ఈరోజు నా పుట్టినరోజన్న విషయం గుర్తుకు రాలేదు.

16, జులై 2011, శనివారం

చమత్కార పద్యాలు - 106 (ప్రహేళిక)

సీ.
రాముఁ డెవ్వరిఁ గూడి రావణు మర్దించె?
పరవాసుదేవుని పట్ణ మేది?
రాజమన్నారు చే రంజిల్లు శర మేది?
వెలయ నాలుగువంటి విత్తమేది?
సీతను జేకొనఁ జెఱచిన ధను వేది?
సభవారి నవ్వించు జాణ యెవఁడు?
అల రంభ తుఱుములో నలరు మాలిక యేది?
శ్రీకృష్ణుఁ డేయింటఁ జెలఁగుచుండె?
తే. గీ.
అన్నిటికిఁ జూడ నైదేసి యక్షరమ్ము
లొనర నిరుదెసఁ జదివిన నొక్క తీరె
చెప్పఁగల్గిన నే నిత్తు జిన్నమాడ
చెప్పలేకున్న నవ్వుదుఁ జిన్ని నవ్వు.
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి ‘చాటుపద్య రత్నాకరము’ నుండి)
కవిమిత్రులారా!
ఎవరైనా సమాధానం చెప్పగలరా?

సమస్యా పూరణం -395 (రావణుండు దిక్కు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
రావణుండు దిక్కు రాఘవునకు
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

చమత్కార పద్యాలు - 105 A (ప్రహేళిక సమాధానం)

సీ.
అసమానకోదండుఁ డైన రా జెవ్వఁడు? (శ్రీరామ)
రాజుపేరిటఁ గల రాగ మేది? (మారువ)
రాగంబు సరివచ్చు రాజిత ఋతువేది? (వసంత)
ఋతువు పేరిటఁ గల రుద్రుఁ డెవఁడు? (తపసి)
రుద్రుని పేరిట రూఢియౌ పక్షేది? (సీతవ?)
పక్షి పేరిటఁ గల వృక్ష మేది? (వటము)
వృక్షంబు సరివచ్చు వెలయు భూషణ మేది? (ముక్కెర)
భూషకు సరివచ్చు భూమి యేది? (రంగము)
తే. గీ.
అన్నిటికిఁ జూడ మూడేసి యక్షరమ్ము
లాదు లుడుపంగఁ దుదలెల్ల నాదు లగును;
చెప్పునాతఁడు భావజ్ఞ శేఖరుండు
లక్షణోపేంద్ర! కృష్ణరాయక్షితీంద్ర!
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి ‘చాటుపద్య రత్నాకరము’ నుండి)
సమాధానాలు -
శ్రీరామ - మారువ - వసంత - తపసి - సీతవ - వటము - ముక్కెర - రంగము.
కోడీహళ్ళి మురళీ మోహన్ గారు, గోలి హనుమచ్ఛాస్త్రి గారు ప్రశంసనీయమైన ప్రయత్నం చేసారు.
వారికి అభినందనలు.

15, జులై 2011, శుక్రవారం

చమత్కార పద్యాలు - 105 (ప్రహేళిక)

సీ.
అసమానకోదండుఁ డైన రా జెవ్వఁడు?
రాజుపేరిటఁ గల రాగ మేది?
రాగంబు సరివచ్చు రాజిత ఋతువేది?
ఋతువు పేరిటఁ గల రుద్రుఁ డెవఁడు?
రుద్రుని పేరిట రూఢియౌ పక్షేది?
పక్షి పేరిటఁ గల వృక్ష మేది?
వృక్షంబు సరివచ్చు వెలయు భూషణ మేది?
భూషకు సరివచ్చు భూమి యేది?
తే. గీ.
అన్నిటికిఁ జూడ మూడేసి యక్షరమ్ము
లాదు లుడుపంగఁ దుదలెల్ల నాదు లగును;
చెప్పునాతఁడు భావజ్ఞ శేఖరుండు
లక్షణోపేంద్ర! కృష్ణరాయక్షితీంద్ర!
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి ‘చాటుపద్య రత్నాకరము’ నుండి)
కవిమిత్రులారా!
ఎవరైనా సమాధానం చెప్పగలరా?

సమస్యా పూరణం -394 (ముక్కంటికి మ్రొక్కువాఁడు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
ముక్కంటికి మ్రొక్కువాఁడు మూర్ఖుఁడు జగతిన్.

14, జులై 2011, గురువారం

చమత్కార పద్యాలు - 104 (ప్రహేళిక)

సీ.
నక్షత్రవీథికి నాయకుఁ డెవ్వఁడు?
రంగగు గుడిలోన లింగ మేది?
వాహనంబుల మీఁది వన్నెకు మొద లేది?
దేవతాఋషులకు తిండి యేది?
నరకాసురునిఁ గన్న నాతి నామం బేది?
పొలఁతి చక్కఁదనాలఁ బోల్ప నేది?
తల్లికిఁ గడగొట్టు తనయునిపై నేది?
కమలాప్త బింబంబుఁ గప్పు నేది?
తే. గీ.
అన్నిటికిఁ జూడ రెండేసి యక్షరమ్ము
లాదు లుడుపంగఁ దుదలెల్ల నాదు లగును;
చెప్పునాతఁడు భావజ్ఞ శేఖరుండు
లక్షణోపేంద్ర! కృష్ణరాయక్షితీంద్ర!
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి ‘చాటుపద్య రత్నాకరము’ నుండి)
కవిమిత్రులారా!
ఎవరైనా సమాధానం చెప్పగలరా?

ప్రత్యేక సమస్యా పూరణం -393 (వ్యాసుని భారతమ్ము విన)

కవి మిత్రులారా,
‘వ్యాసపూర్ణిమ’ పర్వదినం సందర్భంగా
పూరించవలసిన ప్రత్యేక సమస్య ఇది ........
వ్యాసుని భారతమ్ము విన
వ్యాధులు, బాధలు వృద్ధి పొందెడిన్.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

సమస్యా పూరణం -392 (సరసుఁ డైనట్టి భోగియే)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
సరసుఁ డైనట్టి భోగియే జ్ఞాన యోగి.
ఈ సమస్యను సూచించిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.

13, జులై 2011, బుధవారం

చమత్కార పద్యాలు - 103 (ప్రహేళిక)

సీ.
మనుజుని యాకార మహిమకు మొద లెద్ది?
నగవైరివైరి దౌ నగర మెద్ది?
రఘుపతి కాచిన రాక్షసాండజ మెద్ది?
శిబి కర్ణు లార్జించు చెలువ మెద్ది?
పంచబాణుని వింటఁ బరగెడు రుచి యెద్ది?
గిరిపతి భుజియించు గిన్నె యెద్ది?
నయనాంగరక్షకు ననువైన బల మెద్ది?
చెలఁగి మానముఁ గాచు చె ట్టదెద్ది?
తే. గీ.
అన్నిటికిఁ జూడ రెండేసి యక్కరమ్ము
లాదు లుడుపంగఁ దుదలెల్ల నాదు లగును;
చెప్పునాతఁడు భావజ్ఞ శేఖరుండు
లక్షణోపేంద్ర! కృష్ణరాయక్షితీంద్ర!
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి ‘చాటుపద్య రత్నాకరము’ నుండి)
కవిమిత్రులారా!
ఎవరైనా సమాధానం చెప్పగలరా?

సమస్యా పూరణం -391 (కాముకులను గొలువ)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
కాముకులను గొలువఁ గలుగు యశము
ఈ సమస్యను పంపిన కవిమిత్రునికి ధన్యవాదాలు.

చమత్కార పద్యాలు - 102 A (ప్రహేళిక - సమాధానం)

సీ.
ఏనుఁగు సింహంబు నెలనాగయును గూడి
యొక మాటలోపల నుండవలయుఁ
బక్షియు వస్త్రంబు పాషాణమును గూడి
యొక మాటలోపల నుండవలయుఁ
ఫణిరాజు ఫణివైరి ఫణిభూషణుఁడుఁ గూడి
యొక మాటలోపల నుండవలయు
రారాజు రతిరాజు రాజరాజును గూడి
యొక మాటలోపల నుండవలయు
తే. గీ.
దీని యర్థంబుఁ జెప్పఁగా ధీనిధులకు
నెలలు పన్నెండు గడువిత్తు నేర్పుగాను;
చెప్పు నాతఁడు భావజ్ఞ శేఖరుండు
లక్షణోపేత! కృష్ణరాయక్షితీంద్ర!
సమాధానాలు -
ఏనుఁగు + సింహము + ఎలనాగ = నాగము + కేసరి + ఆలు
= నాగకేసరాలు (ఒక దినుసు వడ్లు)
పక్షి + వస్త్రము + పాషాణము = కాకి + బొంత + రాయి
= కాకిబొంతరాయి (ఒక జాతి రాయి)
ఫణిరాజు + ఫణివైరి + ఫణిభూషణుఁడు = నాగము + గరుడుడు + ఈశ్వరుడు
= నాగగరుడేశ్వరము (ఒక క్షేత్రం)
రారాజు + రతిరాజు + రాజరాజు = రాజు + మదనుడు + కుబేరుడు
= రాజమదనకుబేరము (ఒక ఔషధం)
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి ‘చాటుపద్య రత్నాకరము’ నుండి)
గోలి హనుమచ్ఛాస్త్రి గారొక్కరే దీనికి సరైన సమాధానాలు చెప్పారు. వారికి అభినందనలు.

12, జులై 2011, మంగళవారం

చమత్కార పద్యాలు - 102 (ప్రహేళిక)

సీ.
ఏనుఁగు సింహంబు నెలనాగయును గూడి
యొక మాటలోపల నుండవలయుఁ
బక్షియు వస్త్రంబు పాషాణమును గూడి
యొక మాటలోపల నుండవలయుఁ
ఫణిరాజు ఫణివైరి ఫణిభూషణుఁడుఁ గూడి
యొక మాటలోపల నుండవలయు
రారాజు రతిరాజు రాజరాజును గూడి
యొక మాటలోపల నుండవలయు
తే. గీ.
దీని యర్థంబుఁ జెప్పఁగా ధీనిధులకు
నెలలు పన్నెండు గడువిత్తు నేర్పుగాను;
చెప్పు నాతఁడు భావజ్ఞ శేఖరుండు
లక్షణోపేత! కృష్ణరాయక్షితీంద్ర!
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి ‘చాటుపద్య రత్నాకరము’ నుండి)
కవిమిత్రులారా!
ఎవరైనా సమాధానం చెప్పగలరా?

సమస్యా పూరణం -390 (అడవిఁ గాచిన వెన్నెల)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
అడవిఁ గాచిన వెన్నెల హాయి నొసఁగె.
ఈ సమస్యను సూచించిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.

11, జులై 2011, సోమవారం

చమత్కార పద్యాలు - 101 (ప్రహేళిక)

సదావక్ర స్సదాక్రూరః
సదా పూజామపేక్షతే |
కన్యారాశిస్థితో నిత్యం
జామాతా దశమో గ్రహః ||
నా అనువాదం -
వక్రగతిఁ జరించు వాఁడు క్రూరుం డెప్పు
డైనఁ పూజలు గొన నభిలషించు
స్థిరముగా వసించుఁ జేరి కన్యారాశి
మనల కల్లుఁడు దశమగ్రహమ్ము.

కవిమిత్రులారా,
క్రింది సమస్యను పూరించండి.
అల్లుఁడె మగఁడయ్యె ననుచు నత్తయె మురిసెన్.

సమస్యా పూరణం -389 (వ్యాధి యుపశమించె)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
వ్యాధి యుపశమించె బాధ హెచ్చె.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునికి ధన్యవాదాలు.

10, జులై 2011, ఆదివారం

చమత్కార పద్యాలు - 100 (ప్రహేళిక)

వృక్షాగ్రవాసీ న చ పక్షిరాజః
త్రిణేత్రధారీ న చ శూలపాణి |
త్వగ్వస్త్రధారీ న చ సిద్ధయోగీ
జలంచ బిభ్రత్ న ఘటో న మేఘః ||
(శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారు సేకరించిన ‘ప్రహేళికలు’ గ్రంథం నుండి)
నా అనువాదం -
తే. గీ.
చెట్టుపైన వసించు, పక్షి యనఁ దగదు;
మూఁడు కన్నులుండును, కాదు పురహరుండు;
చర్మవస్త్రధారియె, కాదు సంయమియును;
జలసహితమె, కాదది కుండ, జలధరమును;
సమాధానం - కొబ్బరికాయ.
కవిమిత్రులారా,
క్రింది సమస్యను పూరించండి.
"కొబ్బరికాయఁ గొట్టినను గోరికఁ దీర్చనివాఁడు దేవుఁడా?"

సమస్యా పూరణం -388 (అరయంగా ద్రుపదసుతకు )

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
అరయంగా ద్రుపద సుతకు నార్గురు భర్తల్.
ఈ సమస్యను పంపిన లక్కాకుల వెంకట రాజారావు గారికి ధన్యవాదాలు.

9, జులై 2011, శనివారం

చమత్కార పద్యాలు - 99 (ప్రహేళిక)

అస్థి నాస్తి శిరో నాస్తి
బాహురస్తి నిరంగుళిః |
నాస్తి పాదద్వయం గాఢ
మంగమాలింగతి స్వయమ్ ||
(శ్రీ శ్రీభాష్యం విజయ సారథి గారు సేకరించిన ‘ప్రహేళికలు’ గ్రంథం నుండి)
నా అనువాదం -
ఆ. వె.
లేవు బొమిక లెవ్వి లేదు తలయు గూడ
చేతు లుండు లేవు చేతివ్రేళ్ళు
కాళ్ళు లేవు గాని కౌఁగిలించు నొడలు
తెలిసి చెప్పఁగలవె ధీవిశాల!
సమాధానం - అంగీ (చొక్కా).
కవిమిత్రులారా,
క్రింది సమస్యను పూరించండి.
"అంగిని రోసిన యతఁడె మహాత్ముం డయ్యెన్."

సమస్యా పూరణం -387 (అల్లరిమూకలను పిలిచి)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
అల్లరిమూకలను పిలిచి యభినందింతున్
ఈ సమస్యను సూచించిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

8, జులై 2011, శుక్రవారం

చమత్కార పద్యాలు - 98 (ప్రహేళిక)

వనే జాతా వనే త్యక్తా
వనే తిష్ఠతి నిత్యశః |
పణ్యస్త్రీ న తు సా వేశ్యా
యో జానాతి స పండితః ||
(శ్రీ శ్రీభాష్యం విజయ సారథి గారు సేకరించిన ‘ప్రహేళికలు’ గ్రంథం నుండి)
(వనం = అడవి, జలం; పణ్యస్త్రీ = స్త్రీలింగ శబ్దమైన ధనమిచ్చి అనుభవించే వస్తువు)
నా అనువాదం -
కం.
వనమున జనియించును మఱి
వనమున విడువంగఁబడును వనమున నుండున్
ధన మిచ్చి యనుభవించెద
మన వేశ్యయు గాదు; తెలుపు నతఁడే బుధుఁ డౌ.
సమాధానం - నౌక. (నౌక నిర్మాణానికి కావలసిన కఱ్ఱ అడవిలో పుడుతుంది. దానిని నీటిలో విడుస్తారు. ఎప్పుడూ నీటిలోనే ఉంటుంది. డబ్బిచ్చి దానిపై ప్రయాణం చేస్తాము.)
కవిమిత్రులారా,
‘నౌక, ఓడ, పడవ, నావ’ శబ్దాలను ఉపయోగించి భారతార్థంలో మీకు నచ్చిన ఛందస్సులో పద్యం వ్రాయండి.

సమస్యా పూరణం -386 (అచ్చతెనుంగు పద్యమున)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
అచ్చతెనుంగు పద్యమున
నాంగ్లపదంబులె శోభఁ గూర్చురా.
ఈ సమస్యను సూచించిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.

7, జులై 2011, గురువారం

చమత్కార పద్యాలు - 97 (ప్రహేళిక)

అపదో దూరగామీ చ
సాక్షరో న చ పండితః |
అముఖః స్ఫుటవక్తా చ
యో జానాతి స పండితః ||

(శ్రీ శ్రీభాష్యం విజయ సారథి గారు సేకరించిన ‘ప్రహేళికలు’ గ్రంథం నుండి)
నా అనువాదం -
తే.
పాదములు లేవు దూరపు బాట పట్టు
సాక్షరమె కాని పాండితీస్పర్ష లేదు
నోరు లేదు స్పష్టమ్ముగా నుడువగలదు
తెలిసి చెప్పెడివాఁడె పో ధీయుతుండు.
దీని సమాధానం - (అందరికీ తెలిసిందే) జాబు.
కవిమిత్రులారా!
‘పదములు లేనట్టివాఁడు పరుగులు వెట్టెన్’
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా ఆహ్వానిస్తున్నాను.

సమస్యా పూరణం -385 (హరికి గీతను బోధించె)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
హరికి గీతను బోధించె నర్జునుండు.
ఈ సమస్యను సూచించిన లక్కాకుల వెంకట రాజారావు గారికి ధన్యవాదాలు.

6, జులై 2011, బుధవారం

చమత్కార పద్యాలు - 96 (ఇతఁడేనా? యితఁడా?)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 40
ఒకసారి వెంకన్న కవి వినుకొండకు వెళ్ళి దానిని పాలించే శ్రీ రాజా మలరాజు వేంకట నరసింహారాయ ప్రభువును దర్శించాడు. ఆ రాజు అతనిని చులకనగా చూచి "ఇతఁడేనా వెంకన్న?" అన్నాడట! అప్పుడు కవి "అయ్యా! వెంకన్న ఇతడే, కానీ ..." అని క్రింది పద్యాన్ని చెప్పాడట..!
మ.
ఇతఁడేనా? వినుకొండనామక మనోభీష్టార్థకృత్పట్టణ
స్థితసామ్రాజ్య రమాదయామృతఝరీ చంచత్కటాక్షేక్షణ
ప్లుతసర్వాంగ సమస్తశోభనకళా పుంఖీభవత్ స్తుత్యసం
గత మల్రాజవరాన్వయప్రభవ వేంకట్నర్సధాత్రీశ్వరుం
డితఁడేనా? యితఁడా? యితండ? యితఁడా? యీతండ? యీతండటే?
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
పై పద్యంలోని చివరి పాదాన్ని సమస్యగా స్వీకరించి పూరణ చేయవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

సమస్యా పూరణం -384 (రాజీనామాల జాతరకు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
రాజీనామాల జాతరకుఁ దెర లేచెన్.
ఈ సమస్యను సూచించిన మా బంధువు, విశ్రాంత తెలుగుపండితులు అయిన
శ్యాం సుందర్ గారికి
ధన్యవాదాలు.

5, జులై 2011, మంగళవారం

చమత్కార పద్యాలు - 95 (షాదిక్షాంత పద్యములు)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 39
సమస్యలు పూర్తయ్యాక ‘ష’ అనే అక్షరంతో ప్రారంభించి, ‘క్ష’ అనే అక్షరంతో ముగిస్తూ కొన్ని కందపద్యాలను శ్రీరామస్తవంగా చెప్పమని రాజు కోరాడట. అప్పుడు వెంకన్న కవి చెప్పిన పద్యాలు ...
షాదిక్షాంత కంద పద్యాలు

షాక్షర మాదిగఁ జెప్పెద
నీ క్షణమునఁ గందపద్యనివహము వరుసన్
వీక్షింపర దయతో నిటు
రాక్షసహర! రామ! మోక్షరామాధ్యక్షా!

షడ్రాజన్యాంబరయుత
రాడ్రతవర్గస్తుతామరస్సరసీజా
తేడ్రుడ్యాగారపరి
వ్రాడ్రీవర! రామ! మోక్షరామాధ్యక్షా!

షణ్మిధునాంభస్సంభవ
రాణ్మానిత నూత్నరత్న రాజన్మకుటో
ద్యన్మండితాంతరీక్ష! వి
రాణ్మూర్తీ! రామ! మోక్షరామాధ్యక్షా!

షట్పదలసితోద్యస్మిన్
త్రిట్పదలాంగప్రకాశధీరాజిత! గ్రా
జట్పదజటిపటనానా
రాట్పూజిత! రామ! మోక్షరామాధ్యక్షా!

వెంకటగిరి రాజు వెంకన్న కవి పాండిత్యాన్నీ, ఆశుధారాపాటవాన్నీ, సమయస్ఫూర్తినీ, చాతుర్యాన్నీ మెచ్చుకొని నూటపదార్లు బహుమానమిచ్చి, పట్టుబట్టలు పెట్టి సత్కరించాడట!
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
‘షాదిక్షాంత కందపద్యాన్ని’ (ఇష్ట) దైవస్తుతిపరంగా వ్రాయవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

సమస్యా పూరణం -383 (లోకపాలు లేకున్నను)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
లోకపాలు లేకున్నను లోటు లేదు.
ఈ సమస్యను సూచించిన వ. రా. స. గారికి ధన్యవాదాలు.

4, జులై 2011, సోమవారం

చమత్కార పద్యాలు - 94 (దత్తపది)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 38
దత్తపది -
ఇఱుకరాదు, కొఱుకరాదు, నఱుకరాదు, పెఱుకరాదు.
గీ.
ఇఱుకరాదు చేత నిసుమంత నిప్పైనఁ
గొఱుకరాదు ఱాయి కొంచెమైన
నఱుకరాదు నీరు నడిమికి రెండుగాఁ
బెఱుకరాదు బావి పెల్లగిలఁగ.
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

సమస్యా పూరణం -382 (కరుణానిధి కూఁతురునకు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
కరుణానిధి కూఁతురునకుఁ గల్మష మంటెన్
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

3, జులై 2011, ఆదివారం

చమత్కార పద్యాలు - 93 (చందురులో నిఱ్ఱి)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 37
సమస్య -
"చందురులో నిఱ్ఱి నేలచంగలి మేసెన్"
కం.
కందర్పహరుఁడు నరుఁడును
పందికినై పోరిపోరి పరిపరిగతులన్
గ్రిందైన హరుని శీర్షపుఁ
జందురులో నిఱ్ఱి నేలచంగలి మేసెన్.
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

సమస్యాపూరణం - 382 (ఆనందింతురు క్రొత్త దంపతులు)

వారాంతపు సమస్యాపూరణం
కవి మిత్రులారా,
ఈ వారాంతానికి పూరించ వలసిన సమస్య ఇది ......
ఆనందింతురు క్రొత్త దంపతులహో
యాషాఢ మేతెంచినన్ !
ఈ సమస్యను సూచించిన లక్కాకుల వెంకట రాజారవు గారికి ధన్యవాదాలు.

సమస్యా పూరణం -381 (చెడు వారిన్ గొలువ)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
చెడు వారిన్ గొలువఁ దీరు చిరకామ్యంబుల్
ఈ సమస్యను పంపిన లక్కాకుల వెంకట రాజారావు గారికి ధన్యవాదాలు.

2, జులై 2011, శనివారం

చమత్కార పద్యాలు - 92 (అస్ఖలితబ్రహ్మచారి)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 36
సమస్య -
"అస్ఖలితబ్రహ్మచారి కార్గురు పుత్రుల్"
కం.
ఈ స్ఖాప్రాసము దుష్కర
మస్ఖలనత నీయఁ దగునె యది సుకవులకున్?
సస్ఖలితలయి గుహుం గని
రస్ఖలితబ్రహ్మచారి కార్గురు; పుత్రుల్.
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

సమస్యా పూరణం -380 (ఉదకమ్ములు పోయ)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
ఉదకమ్ములు పోయ నగ్ని యుగ్రత దాల్చెన్
ఈ సమస్యను పంపిన లక్కాకుల వెంకట రాజారావు గారికి ధన్యవాదాలు.

1, జులై 2011, శుక్రవారం

చమత్కార పద్యాలు - 91 (మతిలేని నరుండు)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 35
సమస్య -
"మతిలేని నరుండు మిగుల మన్నన నొందున్"
కం.
హిత మాచరించువారికి
హిత మొనరించుచును సుజనహితుఁ డగుచును దు
ష్కృత మెప్పుడుఁ జేయను స
మ్మతిలేని నరుండు మిగుల మన్నన నొందున్.
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

సమస్యా పూరణం -379 (రావణున కంజలించెను)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
రావణున కంజలించెను రామపత్ని.
ఈ సమస్యను సూచించిన కవివిత్రునకు ధన్యవాదాలు.