31, మే 2012, గురువారం

రవీంద్రుని గీతాంజలి - 29

రవీంద్రుని గీతాంజలి

తెనుఁగు సేత

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు

29
HE whom 1 enclose with my name is
weeping in this dungeon. I am ever
busy building this wall all around ; and
as this wall goes up into the sky day
by day I lose sight of my true being in
its dark shadow.

I take pride in this great wall, and I
plaster it with dust and sand lest a least
hole should be left in this name ; and
for all the care I take I lose sight of
my true being.

చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము....


నేను నాపేర నెవని బంధించియుంటి,
నాతఁ డీ పేరిసంకెలలందుఁ జిక్కి
యడలుచున్నాఁడు బందీగృహమ్మునందు ||

రేబవల్ నామకుడ్యనిర్మితినె తవిలి,
యే మరచుచుంటి మిగిలిన యెల్ల పనుల,
యెత్తుగా మింట గోడ లెట్లెట్లు లేచె
నట్టటుల్ వీని నీడల దట్టమైన
తమసు నా యెదలోని సత్యమునె కప్పె ||

*మట్టిపై మట్టి పెట్టుచు పెట్టుచేను
పేరు పేరిఁటి గోడలు పెంచుచుంటి ||

గోడలం దింత క్రంతయు గూడ దంచు,
వెలుఁగు పడుదారి సుంతయు వల దటంచు,
మట్టి యిసుకల పూతలు పెట్టి పెట్టి
గట్టి పరచుచు మిక్కిలి గర్వి నైతి,
కాని దీనికి నే నెంతపునుకొంటి
నంత గోల్పడుచుంటి సత్యాత్మదృష్టి ||

సమస్యాపూరణం - 721 (నరులే కారణము)

కవిమిత్రులారా...

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

నరులే కారణము లంక నాశనమునకున్.

ఈ సమస్యను పంపిన

గుండు మధుసూదన్ గారికి

ధన్యవాదాలు

విశేష వృత్తము - 18

ఇంద్రవంశ -
ఇది 12వ ఛందమైన ‘జగతి’లో 1381వ వృత్తము.

లక్షణములు -
గణములు - త త జ ర 
యతి - 8వ అక్షరము
ప్రాస నియమము కలదు


ఇంద్రవజ్ర కంటే ఇందులో ఒక అక్షరము ఎక్కువగా ఉంటుంది(చివరలో).   


ఉదా:
ఇందీవరశ్యామ! నరేశ్వరేశ్వరా!
బృందారక ప్రస్తుత విక్రమోజ్జ్వలా!
మందస్మితాస్యాంబుజ! క్ష్మాసుతా ప్రియా!
వందారు మందార! భవప్రణాశకా!


చూచేరు కదండీ.  ఇక ప్రయత్నించండి.  స్వస్తి!
               
పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

30, మే 2012, బుధవారం

రవీంద్రుని గీతాంజలి - 28

రవీంద్రుని గీతాంజలి

తెనుఁగు సేత

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు

28

OBSTINATE are the trammels, but my
heart aches when I try to break them.

Freedom is all I want, but to hope
for it I feel ashamed.

I am certain that priceless wealth is
in thee, and that thou art my best
friend, but I have not the heart to
sweep away the tinsel that fills my
room.

The shroud that covers me is a
shroud of dust and death ; I hate it,
yet hug it in love.

My debts are large, my failures great,
my shame secret and heavy ; yet when
I come to ask for my good, I quake in
fear lest my prayer be granted.


చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము....

పట్టు వదలని సంకెళ్ళఁ గట్టు వడితిఁ,
గాని యవి త్రెంచఁబోయిన గలుగు వగపు ||

ఎల్లగతుల విముక్తియె యీప్సితమ్ము,
కాని యది వేడుకొనుటకె కలుగు లజ్జ ||

నిక్కముగ నీకడ నమూల్యనిధులు కలవు,
నీవె నా యుత్తమోత్తమస్నేహితుండ,
విది యెఱుంగుదుఁ గాని మా యింటిలోని
శిథిల మౌ పాడు బోడి బొచ్చెలనుగూడ
నుల్ల మిది పారవేయుట కొప్పుకొనదు ||

నన్ను గప్పిన యావరణములు మృణ్మ
యంబులే కాదు మృత్యుమయములు గూడ,
అవి కడున్ రోత పుట్టించు; నట్టు లయ్యు
వలపుగొని కౌగిలింతును వాని నేను ||

అప్పు లున్నవి లెక్క లేనన్ని నాకు
బ్రదుకు నిండను దండుగుల్ భంగపాట్లు,
బరువయిన సిగ్గు కలదు గుప్తముగ లోన,
అట్టులైనను పరమ కల్యాణభిక్ష
కోరుకొనుటకు నీ దరి జేరినపుడు
వెరపున వణంకిపోదు “నా వేడికోలు
నీవె మఱి సమ్మతింపవొ యేమొ!” యంచు ||
 

సమస్యాపూరణం - 720 (డండడ డడ డండ)

కవిమిత్రులారా...

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

డండడ డడ డండ డండ డండడ డండమ్
 

ఈ సమస్యను సూచించిన
నా బాల్య మిత్రుడు తాటికొండ ఓంకార్‌కు
ధన్యవాదాలు

విశేష వృత్తము - 18

ఉపజాతి -

ఇది అర్ధసమవృత్తములకు చెందినది. 1,3 వ పాదములు ఒక వృత్తమునకు, 2,4 పాదములు మరొక వృత్తమునకు చెందిన లక్షణాలు కలిగి యున్నచో అది అర్థసమ వృత్తము. 

1, 3 పాదములు ఇంద్రవజ్ర (త-త-జ-గగ) మరియు 2, 4 పాదములు ఉపేంద్రవజ్ర (జ-త-జ-గగ) ఉంచి రచించితే వచ్చే వృత్తమే ఉపజాతి. అన్ని పాదములలోను యతిస్థానము 8. ప్రాస నియమ ముండును.
ఉదా:
శ్యామాభిరామా! నయనాభిరామా!
క్షమాసుతా కామ! ప్రశస్త నామా!
స్వామీ! నృపాలాన్వయ వార్ధి సోమా!
సమస్త లోకాధిప! సార్వభౌమా!


పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

29, మే 2012, మంగళవారం

రవీంద్రుని గీతాంజలి - 27

రవీంద్రుని గీతాంజలి

తెనుఁగు సేత


శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు


27

LIGHT, oh where is the light ? Kindle
it with the burning fire of desire !

There is the lamp but never a flicker
of a flame, is such thy fate, my heart !
Ah, death were better by far for thee !

Misery knocks at thy door, and her
message is that thy lord is wakeful, and
he calls thee to the love-tryst through
the darkness of night

The sky is overcast with clouds and
the rain is ceaseless. I know not what
this is that stirs in me, I know not its
meaning.

A moment's flash of lightning drags
down a deeper gloom on my sight, and
my heart gropes for the path to where
the music of the night calls me.

Light, oh where is the light I Kindle
it with the burning fire of desire 1 It
thunders and the wind rushes screaming
through the void. The night is black
as a black stone. Let not the hours
pass by in the dark. Kindle the lamp
of love with thy life. 

చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము...

ఎటఁ గలదు వె ల్గరే? వెలుఁ గెచటఁ గలదు
దానిఁ గామాగ్నికీలిక తగులఁ బెట్టె ||

కలదు దీపము, కాని తత్కలిక లేదు,
హృదయమా! యిట్టిదే నీ యదృష్ట మేమొ!
చాల మే లింతకంటెను చావుకూడ,
తత్ప్రదీప్తిని విరహాగ్ని తగులఁ బెట్టె ||

తెలిపె వేదనాదూతిక తలుపు తట్టి
“ఓసి ప్రాణంబ! మేల్కొని యున్నవాఁడు
నీ కొరకు స్వామి, యీ తమోనిబిడరాత్రిఁ
బిలిచెఁ బ్రేమాభిసారము సలుప నతఁడు,
స్వయముగా వెతపడుచును బ్రభువు తాను
కాచుచున్నాఁడు సుమ్ము నీ గౌరవమ్ము,
నీకొరకె చూచు నిద్దుర లేక” యంచు ||

గగనమున్ మబ్బుతెప్పలు కప్పి వేసె
తెరపి సెడి వాన భోరునఁ గురియఁ దొడఁగె
యేలనో కాని యీ తమోవేళ నాదు
హృదయ మిది తమకమునఁ గ్రక్కదలుచుండె ||

*జల్లునం బడఁ దొడగె వర్షాజలమ్ము,
మెరపు తళతళ క్షణమున మెరసి పోయె,
కటికచీకఁటి తెప్పున కనులు గప్పె,
యీ నిశాకాల గంభీరగానధార
యెంత దౌనుండి పిల్చెనొ యేమొ కాని
యుల్ల మాకృష్టమై చనుచుండె నటకె
*యిరులు కన్నుల నిండెఁ గ్రొమ్మెరపు వెల్గు ||

యెటఁ గలదు వె ల్గరే! వెలుఁ గెచటఁ గలదు?
దాని విరహానలజ్వాల తగులఁ బెట్టె
ఉరిమెను మొగుళ్ళు వ్యర్థఁపు టరపుతోడ,
కీచు మని మింట గాడ్పులు వీచె వడిగ,
దట్టమౌ రేయి నల్లరాచట్టు వోలెఁ
గారునలుపులు పులుముచుఁ గానవచ్చె,
గడియ లివి చీఁకటిం బడి కడపఁ బోకు,
మీ నిశావేళఁ దావక ప్రాణధార
నించి ప్రేమదీపమ్ము వెల్గించుకొమ్ము ||

సమస్యాపూరణం - 719 (ఫాలలోచనుండు)

కవిమిత్రులారా...

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

ఫాలలోచనుండు పాపి సుమ్ము!

ఈ సమస్యను పంపిన

వసంత కిశోర్ గారికి

ధన్యవాదాలు.

విశేష వృత్తము - 17

ఉపేంద్రవజ్ర -
ఇది 11వ ఛందమైన ‘త్రిష్టుప్పు’లో 358వ వృత్తము.

లక్షణము -
గణములు -  జ త జ గగ
యతిస్థానము -  8వ అక్షరము
ప్రాస నియమము కలదు.
(ఈ వృత్తమునకు ఇంద్రవజ్రకు తొలి అక్షరము మాత్రమే భిన్నముగా నుండును).


ఉదా:
నరాధిపా! శ్రీరఘునాథ! రామా!
సురాధినాథస్తుత శుద్ధ కీర్తీ!
ధరాసుతా వల్లభ! ధర్మమూర్తీ!
సరోరుహాక్షా! సుఖ శాంతిదాతా!


చూచేరు కదా ఇంక ప్రయత్నించండి.స్వస్తి!


పండిత రామజోగి సన్యాసి రావు

28, మే 2012, సోమవారం

రవీంద్రుని గీతాంజలి - 26

రవీంద్రుని గీతాంజలి

తెనుఁగు సేత

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు

26

HE came and sat by my side but I
woke not. What a cursed sleep it was,
O miserable me !

He came when the night was still;
he had his harp in his hands, and
my dreams became resonant with its
melodies.

Alas, why are my nights all thus
lost? Ah, why do I ever miss his
sight whose breath touches my sleep ?


చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము....

నాకడకు వచ్చి కూరుచున్నాఁ డతండు,
కాని యపుడైన నేను మేల్కాంచ నైతి ||

అద్దిరా! హతభాగ్యమా! మొద్దు నిద్ర
యింతగా దాపరించిన దేల నాకు? ||

అది ప్రశాంత నిశీథిని, అతఁడు వచ్చె,
అతని చేతుల వీణయు నమరి యుండె
దాని మధురస్వరప్రతిస్వాన మగుచు
సాగిపోయెను మామక స్వప్నధార ||

*లేచి చూచితి నున్మత్తలీల దక్షి
ణంపు గంధవహ మ్మది నింపుచుండెఁ
జిమ్మచీఁకటిలోఁ దన కమ్మతావి ||

*ఇట్టులే నాదు రే లెల్ల యేలఁ గడచె?
నతని యూర్పులు సోకగా నయ్యెఁ గాని
నా కతని దర్శనం బేల కాకపోయె?
అక్కటా! వాని గళహార మక్కుతోడఁ
దాకు కౌఁగిలి నాకేల లేకపోయె? ||

సమస్యాపూరణం - 718 (అఱవమునందు వేమన)

కవిమిత్రులారా...

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

అఱవమునందు వేమన మహాకవి భాగవతమ్ముఁ జెప్పెఁగా!

ఈ సమస్యను పంపిన

గుండు మధుసూదన్ గారికి

ధన్యవాదాలు.

విశేషఛ్ఛందము - 16

ఇంద్రవజ్ర -
ఇది 11వ ఛందమైన ‘త్రిష్టుప్పు’లో 357వ వృత్తము.

లక్షణము
గణములు - త త జ గగ 
యతి స్థానము - 8వ అక్షరము 
ప్రాస నియమము కలదు.


ఉదా:
శ్యామాభిరామా! నయనాభిరామా!
భూమీశ వంశాంబుధి పూర్ణచంద్రా!
సోమాననా! దేవ! విశుద్ధ తత్త్వా!
రామా! సురారాతి విరామ! భీమా!


చూచేరు కదా.  ప్రయత్నించండి.  స్వస్తి!

పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

27, మే 2012, ఆదివారం

రవీంద్రుని గీతాంజలి - 25

రవీంద్రుని గీతాంజలి

తెనుఁగు సేత

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు


25

IN the night of weariness let me give
myself up to sleep without struggle,
resting my trust upon thee.

Let me not force my flagging spirit
into a poor preparation for thy worship.

It is thou who drawest the veil of
night upon the tired eyes of the day to
renew its sight in a fresher gladness of
awakening.


చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము....

బడలి పోయిన రేయి నీ పాదమూల
మందు విశ్వాసముంచి నీయండఁ జేరి
చింత చీఁకాకు లేక నిద్రింతుఁ గాక ||

నన్ను బలవంతపెట్టకు, సన్నగిల్లి
పోయె నుత్సాహ మెల్ల, నీ పూజకొరకు
సిద్ధపడుట రవంత నాచేతకాదు ||

మేలుకొని వేళ నవనవోన్మేషదృష్టి
మఱల నుల్లాసభరమున మెరయుకొరకు
నలసిపోయిన పగటి కన్నులకు రేయి
ముసుఁగు నిడి నీవెకా నిద్రపుచ్చు దొరవు ||

సమస్యాపూరణం - 717 (తినుచో తియ్యని వేపగింజ)

కవిమిత్రులారా...

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

తినుచో తియ్యని వేపగింజ మదిలో దీపించు సద్యోగముల్.

ఈ సమస్యను పంపిన
కవిమిత్రునకు
ధన్యవాదాలు.

విశేష చ్ఛందము - 15

దండకము -
ఇది ‘ఉపరివృత్తము’లలో చేరినది. 26 అక్షరములకంటె అధికమగు అక్షరములు గల లయగ్రాహి, లయవిభాతి మొదలగునవి ఉపరివృత్తములు.


దండకములు అనేక విధములుగా నుండును.  సులక్షణ సారములో ఇచ్చిన విధము, ప్రస్తుతము వాడుకలో నున్నదియు నగు దండకమును గూర్చి చెప్పుచున్నాను.

దండకమునకు ఇన్ని గణములని గాని, ఇన్ని పాదములని గాని నియమములు లేవు.  స న హ గణములతో ప్రారంభించ వచ్చును, లేకుంటే త గణముతో ప్రారంభించ వచ్చును.  ఆ పిదప అన్నియునూ త గణములే వేయవలెను.  గురువుతో సమాప్తి చేయవలెను.  ఎన్ని ఎక్కువ శబ్దాలంకారములు ముఖ్యముగా అనుప్రాసలు వేసినచో దండకము అంత అందముగా వచ్చును. 

ఉదా -
     శ్రీమన్మహేశార్ధ గాత్రీ! హిమాద్రీశపుత్రీ! త్రిలోకాధినేత్రీ! సదా భక్త సంప్రార్ధితార్థ ప్రదాత్రీ! చిదానందరూపా! జగజ్జాల దీపా! తమోఘ్న ప్రదీపా!  సువర్ణస్వరూపా! సదాదేవ బృందంబు సేవించు నీ దివ్య పాదాంబుజాతంబులన్ నేను ధ్యానింతు నేకాగ్ర చిత్తాన నో వేద మాతా! భవాంబోధిపోతా! త్రిలోకైక మాతా!  సదా లోక కళ్యాణమున్ గూర్చు నీ మందహాసంబు నీ చిద్విలాసంబు నీ ప్రేమతత్త్వంబు పీయూష సారంబు నానంద సంవర్ధకంబై విరాజిల్లు నో తల్లి! దీవ్యత్ కృపా కల్పవల్లీ!  .........  ........ నమస్తే నమస్తే నమః 


మీరూ ప్రయత్నించండి.  స్వస్తి.

పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

26, మే 2012, శనివారం

రవీంద్రుని గీతాంజలి - 24

రవీంద్రుని గీతాంజలి

తెనుఁగు సేత

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు

24

IF the day is done, if birds sing no
more, if the wind has flagged tired,
then draw the veil of darkness thick
upon me, even as thou hast wrapt the
earth with the coverlet of sleep and
tenderly closed the petals of the droop-
ing lotus at dusk.

From the traveller, whose sack of
provisions is empty before the voyage
is ended, whose garment is torn and
dust-laden, whose strength is exhausted,
remove shame and poverty, and renew
his life like a flower under the cover of
thy kindly night.


చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము....

పగలు దిగజారినప్పుడు, పక్షితతుల
కలరుతుమ్ములు విశ్రాంతి గాంచి నప్పు,
డలసి సొలసిన గాడుపు లంత నంత
విసరుచున్ విసరుచును సొమ్మసిలి నపుడు,
నీవు పుడమికి మెలమెల్ల నిదురముసుఁగు
గప్పు గతి దళమైన చీఁకటుల పేరి
దుప్పట మ్మది నాపయిఁ గప్పు మోయి!
అలముకొను మలుసందెలో తలలు వంచు
తమ్మిరేకుల సుతిమెత్తఁ దనముతోడ
ముడుచున ట్లీవు నాకనుల్ మూయు మోయి! ||

విడిచి చేరక మున్నె నావెంట నున్న
దారిబత్తెము మొత్తము తీరిపోయె,
తొడవు లుడుపులు భరమయి దుమ్ము గ్రమ్మి
చిరిగిపోయెను, శక్తియు తరిగిపోయె,
స్వామి! యీ సిగ్గు గొల్పెడి లేమి వాసి
కనికరఁపు రేయి మాటునఁ దనరుపువ్వు
లట్లు బ్రదుకిది నవనవలాడ నిమ్ము ||
 

సమస్యాపూరణం - 716 (కైక విభుడు రాఘవుండు)

కవిమిత్రులారా...

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

కైక విభుడు రాఘవుండు కాపాడు మిమున్.


ఈ సమస్యను పంపిన
కవిమిత్రునకు
ధన్యవాదాలు.

ప్రత్యేక పద్యము - 14

మధ్యాక్కర - 

అక్కరలు దేశిచ్ఛందోజాతములు. ఉపగణములతో (సూర్యేంద్రచంద్ర గణములతో) నిర్మితములు. ఇవి కన్నడములోను గలవు. మధ్యాక్కరను కన్నడమున ‘దొరెయక్కర’ అన్నారు.
లక్షణములు -
గణములు - ఇం ఇం సూ ఇం ఇం సూ 

(2 ఇం.గ.-1 సూ.గ.- 2 ఇం.గ.-1 సూ.గ.)
యతి -  4వ గణము తొలి అక్షరము (నన్నయ్య 5వ గణము తొలి అక్షరమును ఎన్నుకొనెను. అంతకుముందు యుద్దమల్లుని శాసనములోను ఇదే విధముగ నున్నది. కాని తరువాతి కవులు, లాక్షణికులందరు చతుర్థ గణాద్యక్షర యతిని పాటించిరి)
ప్రాస నియమము కలదు


ఉదా:
చని రాజ మందిరమ్మునకు జననాథు సన్నిధి జేరి
వినయమ్ము మీర మ్రొక్కులిడి విజయ శబ్దము చేసినంత
మనుజేశ్వరుం డడిగెను సుమంత్రుని యాత్రముతోడ
జనుదెంచితే మంత్రివర్య! సవివరముగ తెల్పుమయ్య!


మీరూ ప్రయత్నించండి.  స్వస్తి!


పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

25, మే 2012, శుక్రవారం

రవీంద్రుని గీతాంజలి - 23

రవీంద్రుని గీతాంజలి

తెనుఁగు సేత

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు

23

ART thou abroad on this stormy night
on thy journey of love, my friend ? The
sky groans like one in despair.

I have no sleep to-night. Ever and
again I open my door and look out on
the darkness, my friend !

I can see nothing before me. I
wonder where lies thy path !

By what dim shore of the ink-black
river, by what far edge of the frowning
forest, through what mazy depth of
gloom art thou threading thy course
to come to me, my friend ? 


చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము.....


నా ప్రియప్రాణబంధు! యీనాటి గాలి
వానపట్టిన రేయి దూరాననుండి
సాగి వచ్చెదొ ప్రేమాభిసారి వగుచు? ||

ఆస చెడి దురపిల్లు ప్రేయసి విధాన
చదలు దీర్ఘనిశ్వాసము వదలుచుండె ||

నేడు నాకంట రవ్వంత నిదుర లేదు,
నీదు రాకకుఁ బ్రియతమా! నిండుటిర్లఁ
దేప తేపకు వాకిలి తెరచి చూతు ||

ఎదుట నేమియు గాంచలే, నెచటఁ గలదొ
సఖుఁడ! నీదు పథమ్ము విస్మయకరమ్ము ||

ఏ నది వినీలదూరతీరానుగతినొ,
అడవి బొమముడి యిడిన యే యంచుపైనొ,
చిమ్మచీకట్ల యే త్రోవ చిక్కులోనొ,
ఓయి ప్రాణసఖా! నన్ను డాయుకొరకు
నడక సాగించు చెక్కడ తడసినావొ? ||

సమస్యాపూరణం - 715 (రంకు నేర్చిన చిన్నది)

కవిమిత్రులారా...

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

రంకు నేర్చిన చిన్నది బొంకలేదు.

ఈ సమస్యను సూచించిన
పోచిరాజు సుబ్బారావు గారికి
ధన్యవాదాలు.

ప్రత్యేక వృత్తము - 13

మణిరంగము -
ఇది 10వ ఛందమైన ‘పంక్తి’లో 219వ వృత్తము.
లక్షణములు -
గణములు - ర స స గ 
యతి - 6వ అక్షరము 
ప్రాస నియమము కలదు.


మామూలుగా పాదమునకు 10 అక్షరములు దాటిన పద్యములకే యతి నియమము చెప్పబడును.  అయినా కొన్ని వృత్తములకీ యతి పాటించు చుండుటయు కలదు


ఉదా:
శర్వసన్నుత సద్గుణ ధామా!
సర్వ భాగ్యద! శత్రువిరామా!
నిర్వికార! వినీల సుగాత్రా!
సర్వ రక్షక! సారసనేత్రా!


పాదప వృత్తమునకు దీనికి ఒక చిన్న తేడా మాత్రమే కలదు.  అది మీరు గమనించ గలరు.  స్వస్తి!
పండిత నేమాని సన్యాసి రావు
               

24, మే 2012, గురువారం

రవీంద్రుని గీతాంజలి - 22

రవీంద్రుని గీతాంజలి

తెనుఁగు సేత

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు

22

IN the deep shadows of the rainy July,
with secret steps, thou walkest, silent
as night, eluding all watchers.

To-day the morning has closed its
eyes, heedless of the insistent calls of
the loud east wind, and a thick veil has
been drawn over the ever-wakeful blue
sky.

The woodlands have hushed their
songs, and doors are all shut at every
house. Thou art the solitary wayfarer
in this deserted street. Oh my only
friend, my best beloved, the gates are
open in my house do not pass by like
a dream. 


చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదం.....


శ్రావణ గభీర జలధరచ్ఛాయలోన
గుప్తమై యుండు నడుగుల గుర్తుతోడ
నెల్ల కావలివారిఁ దప్పించుకొంచు
సంచరించెదు నిసి వలె సద్దు లేక ||

కనులు మూతలుపడి నుషస్సునకు నేడు
వట్టిగనె తూర్పుగాడుపు పట్టుపట్టి
పెద్ద గింగురు మ్రోతలఁ బిలుచుచుండె,
నిత్య జాగరితమ్మగు నీలి నింగి
కప్పుకొనె చిక్కని మొగుళ్ళ దుప్పటమును ||

మూగవడిపోయె గహన భూభాగములును,
ద్వారముల్ మూయఁబడె నెల్లవారి యిండ్ల,
ఈ విజనవీధి వెంబడి నేగుచున్న
యొంటి పథికుఁడ వెవ్వఁడ వోయి నీవు? ||

ఓయి! ప్రియతమ! ఓయి! నా యొంటి సఖుఁడ!
కలవు తెరచియె మాయింటితలుపు లివిగొ!
యెదుటినుండియె కలవలెఁ గదలి పోకు ||

సమస్యాపూరణం - 714 (పుత్రుఁడ నేఁ గానటంచు)

కవిమిత్రులారా...

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

పుత్రుఁడ నేఁ గానటంచు పుత్రుఁడు పలికెన్.

ఈ సమస్యను సూచించిన
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి
ధన్యవాదాలు.

ప్రత్యేక వృత్తము - 12

స్వాగతము.
ఇది 11వ ఛందమైన ‘త్రిష్టుప్పు’లో 443వ వృత్తము.
రథోద్ధతమునకు దీనికి ఒక అక్షరము మాత్రమే తేడా. 


లక్షణము -
గణములు: ర న భ గగ
యతి : 7వ అక్షరము
ప్రాస నియమము కలదు.
 
ఉదా:
మౌనివర్య! జనమాన్య చరిత్రా!
జ్ఞానసారనిధి! స్వాగతమయ్యా!
మాననీయ గుణ! మంగళదాతా!
పూని నీ పదము మ్రొక్కెద స్వామీ!


(పై పద్యములో 3వ పాదమును చూడండి
- మాననీయ గుణ! మంగళదాతా! (స్వాగత వృత్తము)
 చివరిలో ఒక్క అక్షరమును ఇలా మార్చితే రథోద్ధతము అవుతుంది:
- మాననీయ గుణ! మంగళాన్వితా! (రథోద్ధత వృత్తము)  
స్వస్తి!


పండిత నేమాని రామజోగి సన్యాసిరావు

23, మే 2012, బుధవారం

‘శివాని’ శబ్ద చర్చ

మిస్సన్న గారు చెప్పిన వనమయూరము .............

    నీ పద సరోజముల నీడయె భవానీ
    ఆపదల బాపి యిడు హాయిని శివానీ
    కోపమును బూనకుము క్రూరులని మాపై
    పాపలము తల్లి యెడ బాయకుము నీవై.

* * * * * * * * *
పండిత నేమాని గారు చెప్పారు...
    అయ్యా శ్రీ మిస్సన్న గారూ!
    శివా అంటేనే పార్వతీదేవి. సంస్కృతములో శివా అనే శబ్దము చివరి దీర్ఘము తొలగగా తెలుగులో శివ అవుతుంది. అంటే శివ అనే పదము శివ పార్వతులకు ఇద్దరికీ అన్వయించును. శివానీ అనే ప్రయోగము సాధువు కాదు. మృడానీ, రుద్రాణీ, బ్రహ్మాణీ, ఇంద్రాణీ అనే పదములు సాధువులే. స్వస్తి.

* * * * * * * * * *
కంది శంకరయ్య చెప్పారు...
    పండిత నేమాని వారూ,
    ‘శివాని’ శబ్దం సాధుప్రయోగం కాదన్నారు. శివుడు శబ్దానికి ‘సాధువుల హృదయమున శయనించువాడు, మంగళప్రదుడు’ అనే వ్యుత్పత్త్యర్థాలున్నాయి. ఆవిధంగా శివ శబ్దానికి సాధువుల హృదయమున శయనించునది, మంగళప్రద’ అని అర్థం చేసికొన వచ్చు. సూర్యరాయాంధ్రనిఘంటువు ‘శివాని’ శబ్దానికి శివుని భార్య, పార్వతి అని అర్థాలిచ్చింది. పర్యాయపద నిఘంటువులో పార్వతికి శివ, శివాని రెండు పదాలూ ఇచ్చింది.

* * * * * * * * * *
పండిత నేమాని గారు చెప్పారు...
అయ్యా! డా. ఏల్చూరి మురళీధర్ గారూ! శుభాశీస్సులు.
    శంకరాభరణము బ్లాగులో ఈ మధ్య మీరు కనబడుట లేదు.  మాకు ఎంతో వెలితిగా నున్నది.  మీరు అప్పుడప్పుడైనా వీలుచేసికొని బ్లాగుకి కొంత టైము కేటాయించండి. 
    ఈ బ్లాగులో శ్రీ మిస్సన్న గారు శివాని అనే పదము వాడితే నేను సాధువు కాదేమో ననే  అభిప్రాయమును వెలిబుచ్చేను. నేను పూర్వము ఆవిధముగా వినినాను. నాది కేవలము శ్రుతపాండిత్యమే.  శ్రీ శంకరయ్య గారు ఆ అభ్యంతరమును త్రోసిపుచ్చేరు.  సూర్యరాయ ఆంధ్ర నిఘంటువు శివాని పదమును సమర్థించింది అన్నారు.  మీరు మరి కొంచెము విపులముగా మాకు తెలియజేయ గలరు. స్వస్తి! 
ఇట్లు
మీ శ్రేయోభిలాషి,
నేమాని రామజోగి సన్యాసి రావు

* * * * * * * * *
డా. ఏల్చూరి మురళీధర్ గారు చెప్పారు......
పూజ్యశ్రీ గురుదేవులకు
విహితానేకప్రణామములతో,
మీ లేఖను చదివి ఎంతో సంతోషమైంది. అత్మీయమైన మీ కుశలానుయోగానికి ధన్యవాదాలు. కోరిక ఎంత ఉన్నా తీరిక ఏ మాత్రం లభింపక ఇటీవల శ్రీ శంకరాభరణం బ్లాగును చూడటం వీలుపడలేదు. మీరు ఆదేశించినట్లు - తప్పక పాల్గొనే ప్రయత్నం చేస్తాను.
"శివానీ" శబ్దాన్ని గుఱించి బ్లాగులో శ్రీ మిస్సన్న గారు ఏమని ప్రయోగించారో నేను చూడలేదు కాని, రూపసాధన ప్రక్రియ విషయమై నా అభిప్రాయం ఇది:
స్త్రీప్రత్యయప్రకరణంలో “శివానీ” శబ్దాన్ని "శివస్య స్త్రీ" అనే అర్థంలో శివ+అన్+ఈ అని విధించి సాధింపవచ్చును. మోనియర్ విలియమ్స్, వామన శివరామ ఆప్టే, శబ్దార్థకల్పతరువు, సూర్యరాయాంధ్ర నిఘంటువు వంటి అకారాదినిఘంటువులలో శివాని = పార్వతి అని పేర్కొనబడిన మాట నిజమే.
అయితే, సంస్కృతంలో అమరకోశం, త్రికాండశేషం, వైజయంతి, విశ్వం, మేదిని, మంఖకోశం వంటి ప్రసిద్ధకోశాలేవీ “శివానీ” శబ్దాన్ని చూపలేదు. అమరకోశవ్యాఖ్యానాలలో ప్రామాణికమైన రామాశ్రమి 1. శివా 2. శివీ అన్న శబ్దాలను మాత్రం సాధించి, “శివానీ” రూపాన్ని ప్రస్తావింపలేదు.
ఈ సందర్భంలో పాణినీయం (4:1:49) "ఇన్ద్ర-వరుణ-భవ-శర్వ-రుద్ర-మృడ-హిమ-అరణ్య-యవ-యవన-మతుల-ఆచార్యాణాం అనుక్" అన్న సూత్రంలో "శివ" శబ్దాన్ని చేర్చుకోకపోవటం వల్ల మీరన్న సందేహానికి తావు కలిగి ఉంటుంది. “భవ” శబ్దం నుంచి “భవాని”; “ఇన్ద్ర” శబ్దం పైని “ఇన్ద్రాణి” ఏర్పడ్డ తర్వాత “భవా”, “ఇన్ద్రా” మొదలైన శబ్దాలు ఏర్పడలేదు. ఆ ప్రకారమే “శివా”, “శివీ” శబ్దాలేర్పడిన తర్వాత “శివాని” సాధ్యం కాదని మీరు చదివిన వ్యాసకర్త భావించారేమో!
అంతేగాక, సంస్కృతంలో ప్రసిద్ధములైన లలితా సహస్రనామ - రామాయణ - మహాభారత - శ్రీ శంకరాచార్య స్తోత్రాదులలో,  ప్రసిద్ధకావ్యాలలో ఎక్కడా శివానీ శబ్దం ప్రయుక్తమైనట్లు జ్ఞాపకానికి రావటం లేదు. ప్రసిద్ధ కవిప్రయోగాలేవీ స్ఫురింపలేదు. ప్రాచీనప్రయోగాలు మృగ్యాలేమో!  శ్రీనాథుని భీమేశ్వరపురాణంలో ప్రయుక్తమైనట్లు లేదు. కాశీఖండంలో గుర్తుకు రాలేదు. ఇంకా గుర్తుచేసుకోవాలి.
సంస్కృతవ్యాకరణము యొక్క flexibility కారణంగా ఏ పదానికి ఏ అర్థాన్నైనా సాధింపవచ్చుననేది అనేకార్థకావ్యకవులు మనకు ఉపదేశించారు. కాబట్టి - కవిప్రయోగం లేకపోయినా శివ శబ్దాన్ని ప్రాతిపదికంగా స్వీకరించి, పై సూత్రాధారాన "అనుక్" + "ఙీష్" చేర్చితే "శివానీ" అని వాడుకోవచ్చునని నా అభిప్రాయం.
మీరు, శంకరయ్య గారు, మిత్రులందఱూ క్షేమమే కదా! అందఱికీ నా నమస్కారములు.    
విధేయుడు,
ఏల్చూరి మురళీధరరావు

రవీంద్రుని గీతాంజలి - 21

రవీంద్రుని గీతాంజలి

తెనుఁగు సేత

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు

21

I MUST launch out my boat. The
languid hours pass by on the shore
Alas for me !

The spring has done its flowering and
taken leave. And now with the burden
of faded futile flowers I wait and linger.

The waves have become clamorous,
and upon the bank in the shady lane the
yellow leaves flutter and fall.

What emptiness do you gaze upon !
Do you not feel a thrill passing through
the air with the notes of the far away
song floating from the other shore ?

చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదం.....


నాపడవ లంగ రెత్తి యీనాడు తప్ప
కద్దరిం జేరుకోగల నని తలంతు
బడలికల్ దీర తీరాన గడచు పొడవు
గడియ లివి నా నిమిత్తమ కడచె నయయొ ||

పూలు పూయించు పనులెల్ల పూర్తిచేసి
వీడుకోల్ గొని యామని వెడలి పోయె,
వాడిపోయిన యీపూల వట్టి బుట్టి
మోసికొని వేచి యే నేమి చేసికొందు? ||

అలలు జలముల గళగళ మనుచు లేచె
దరుల చీఁకటి పొదరుల మరుగులందుఁ
బండుటాకులు పటపట పడఁదొడంగె ||

శూన్య హృదయమ! నీ వేమి సూచుచుంటి
వుప్పరంబునఁ గనులెత్తి రెప్పయిడక? ||

దూరతీరోచ్చలన్మురళీరవంపు
జాడ లీగాలిలోనుండి సాగి వచ్చి
జలదరింపగఁ జేయుట తెలియ వొక్కొ? ||

ప్రత్యేక వృత్తము - 11

రథోద్ధతము -

ఇది 11వ ఛందమైన ‘త్రిష్టుప్పు’లో 698వ వృత్తము.
‘యత్ర యత్ర రఘునాథ కీర్తనం, తత్ర తత్ర కృత మస్తకాంజలిమ్’ అనే శ్లోకము ఉన్నది కదా - అది రథోద్ధత వృత్తమే.  


లక్షణము -
గణములు - ర న ర వ.
యతిస్థానము - 7వ అక్షరము 
ప్రాస నియమము కలదు 

ఉదా:
శ్రీ రఘూద్వహ! విశేష వైభవా!
ధారుణీ ప్రియసుతా హృదీశ్వరా!
వీరవర్య! ఘన విక్రమోన్నతా!
సారసాక్ష! త్రిదశ ప్రపూజితా!


పట్టుబడినదంటే చాల చక్కగా నడుస్తుంది.  స్వస్తి!

పండిత రామజోగి సన్యాసి రావు

సమస్యాపూరణం - 713 (మూర్ఖుఁ డతఁడు)

కవిమిత్రులారా...

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

మూర్ఖుఁ డతఁడు రాజపూజితుండు.


22, మే 2012, మంగళవారం

రవీంద్రుని గీతాంజలి - 20

రవీంద్రుని గీతాంజలి

తెనుఁగు సేత

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు

20

ON the day when the lotus bloomed,
alas, my mind was straying, and I knew
it not. My basket was empty and the
flower remained unheeded.

Only now and again a sadness fell
upon me, and I started up from my
dream and felt a sweet trace of a strange
fragrance in the south wind.

That vague sweetness made my heart
ache with longing and it seemed to me
that it was the eager breath of the
summer seeking for its completion.

I knew not then that it was so near,
that it was mine, and that this perfect
sweetness had blossomed in the depth
of my own heart


చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదం.....

మొగ్గ లెన్నడు సడలించె ముసుఁగు? తమ్మి
విరు లి వెన్నడు నిండార విప్పువారె?
జాడయే సుంత తెలియ దానాడు నాకు,
నెందుఁ గ్రుమ్మరుచుండెనో డెంద మకట!
వట్టి దై యుండెఁ బువ్వుల బుట్టి, తలఁపు
వాల దెవనికి మరుగైన పూలమీద ||

అప్పు డప్పుడు నా కెదో చెప్పరాని
వ్యాకులత పైఁబయిం గ్రమ్మి వచ్చుచుండు,
నొక్క కలవోలెఁ గాంచి యే నులికిపడుచు
దిగ్గురని లేతు, నపుడె యేతెంచు నట్టి
దక్షిణానిల మందు మంద మధురంపుఁ
బరిమళాభాస మెదియొ చొప్పడఁ గడంగు ||

ఆ యనిర్వాచ్య మధురిమ యంది నంత
హృదయవేదన తొలఁగి యపేక్ష కలిగె
ఒక యపూర్వ నిశ్వాసము సకలజగతి
నల వసంతుఁడు నింపినయట్లు దోచె ||

ఇంతగా దూరమే లేని దేమి యిద్ది?
యౌర! యిది నాదు నిట్టూర్పు యయ్యె నేమి?
దీని నిండారు తీపి నా మానసంపు
లోతు పూదోట కుసుమగుళుచ్ఛములుగ
విప్పుకొను నేమి? యప్పు డీ విధమె యెఱుఁగ ||

ప్రత్యేక వృత్తము - 10

వనమయూరము -
దీనినే కొందరు లాక్షణికులు ‘ఇందువదన’ అన్నారు. 
ఇది 14వ ఛందమైన ‘శక్వరి’లో 2806వ వృత్తం.

లక్షణములు:
గణములు - భ జ స న గగ.
యతి - 9వ అక్షరము 
ప్రాస నియమము కలదు.


ఉదా:
నీవె ధృతి నీవె గతి నీవె మతి రామా!
నీవె సకలంబవని నే దలచు చుందున్
పోవలదు వీడి నను పోవలదు తండ్రీ!
పోవలదు రామ! గుణ భూషణ! యటంచున్


ఈ లయతో చక్కని జోల పాటలు వ్రాస్తే బాగుగ నుంటాయి.  స్వస్తి!


పండిత రామజోగి సన్యాసి రావు

సమస్యాపూరణం - 712 (తప్పు లెన్నువాఁడె)

కవిమిత్రులారా...

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

తప్పు లెన్నువాఁడె గొప్పవాఁడు.

ఈ సమస్యకు స్ఫూర్తి నిచ్చిన
గుండా సహదేవుడు గారికి

ధన్యవాదాలు.

21, మే 2012, సోమవారం

రవీంద్రుని గీతాంజలి - 19

రవీంద్రుని గీతాంజలి

తెనుఁగు సేత

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు

19

IF thou speakest not I will fill my
heart with thy silence and endure it. I
will keep still and wait like the night
with starry vigil and its head bent low
with patience.

The morning will surely come, the
darkness will vanish, and thy voice pour
down in golden streams breaking through
the sky.

Then thy words will take wing in
songs from every one of my birds'
nests, and thy melodies will break forth
in flowers in all my forest groves. 


చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదం.....

మౌనమా! నీవు మాటాడ వేని యింక
నేను సైతము ముచ్చట మానుకొందు
నీదు నిశ్శబ్దవృత్తియె నెమ్మనమున
నింపుకొని యోర్మి గైకొని నిల్చియుందు ||

రాత్రి నిస్తబ్దముగ వినమ్రత వహించి,
రిక్కదివ్వెలు వెలిగించి, రెప్ప యిడక
యెదురు సూచుచు నిల్చున ట్లేనుగూడ
గాచుకొని యుందుఁ దాలిమి నాచిపట్టి ||

కాఁగలదు ప్రభాతమ్ము కాగలదు నిజము,
చిమ్మచీఁకటి యిది రూపుచెదరఁ గలదు,
తావకీనస్వరస్వర్ణధార పారి
నింగి చీల్చి యిలం డిగి నిండఁ గలదు ||

అపుడె మేల్కొను నా హృదయఁపుఁ బులుంగు
గూండ్లు నీ గీతికాస్వరగుంభనముల
ముమ్మరమ్మయి కిలకిల మ్రోయు లెమ్ము
స్వామి! యప్పుడె మామకారామసీమఁ
దావకస్వరమధురిమ తీవ తీవ
పూవుప్రోవులుగా విరబూచు లెమ్ము ||

ప్రత్యేక వృత్తములు - 9

భుజంగప్రయాతము.

ఇది 12 వ ఛందమైన "జగతి"లో 586 వ వృత్తము.
"శివం శంకరం శంభు మీశానమీడే" అను స్తోత్రము, "వినా వేంకటేశం ననాథో ననాథః" అను స్తోత్రము మనలో చాలమందికి తెలుసును కదా.  ఈ పాదములు భుజంగప్రయాతము అనే ఛందస్సే.


లక్షణములు -
గణములు - య య య య 
యతిస్థానము - 8వ అక్షరము 
ప్రాసనియమము కలదు.


ఉదా:
మహానంద వారాశి, మాయావిలోలున్
మహర్షివ్రజ స్తూయమాన ప్రభావున్
మహీజా హృదంభోజ మార్తాండు, రామున్
మహీశాధినాథున్ క్షమాపూర్ణు గొల్తున్.


          మంచి వేగముతో నడిచేది ఈ వృత్తము.  సంస్కృత సమాసములు పడితే చాలా హాయిగా నడుస్తుంది.  స్వస్తి!

పండిత నేమాని రామజోగి సన్యాసి రావు 

సమస్యాపూరణం - 711 (పందిరిమంచమున ముండ్లు)

కవిమిత్రులారా...

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

పందిరిమంచమున ముండ్లు పఱచుటె మేలౌ.  


ఈ సమస్యను సూచించిన
పోచిరాజు సుబ్బారావు గారికి
ధన్యవాదాలు.  20, మే 2012, ఆదివారం

రవీంద్రుని గీతాంజలి - 18

రవీంద్రుని గీతాంజలి

తెనుఁగు సేత

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు

18

CLOUDS heap upon clouds and it darkens.
Ah, love, why dost thou let me wait
outside at the door all alone ?

In the busy moments of the noontide
work I am with the crowd, but on this
dark lonely day it is only for thee that
I hope.

If thou showest me not thy face, if
thou leavest me wholly aside, I know
not how I am to pass these long, rainy
hours.

I keep gazing on the far away gloom
of the sky, and my heart wanders wail-
ing with the restless wind. 


చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదం....

కప్పె నుప్పరమందు మేఘములమీద
మేఘముల్, చిట్టు చీకట్లు, మెండుకొనియె,
నెదురుచూపుల వాకిటియెదుట నన్ను
ప్రియతమా! యొంటిఁ గూర్చుండఁ బెట్టి తేల? ||

పలుపనులఁ జిక్కి యూపిరి సలపకుందు
బహుజన పరీవృతంబుగఁ బగళులందుఁ
గాని యీ యిర్లు క్రమ్ము నేకాంతవేళ
నాస పడియుంటి నీ సమాశ్వాసమందె ||

ప్రియసఖా! నాకు మోము చూపింపకుండ
నీవె బొత్తుగ న న్నుపేక్షింతువేని
యొక్క రవ్వంతయుం దోచదోయి నాకు
పొడవు లీ మబ్బు గడియలు గడచుటెట్లొ? ||

నేను దవుదవ్వు నల్లని నింగివైపు
గనుచునే యుంటి రెప్పలు కదలనీక,
త్రిమ్మరుచునుండె హృదయ మీ తెరపి లేని
వాయువుం గూడి పుట్టెడు వగపుతోడ ||

ఎదురుచూపుల వాకిటి యెదుట నన్ను
ప్రియతమా! యొంటిఁ గూర్చుండఁ బెట్టితేల? ||

ప్రత్యేక వృత్తములు - 8

స్రగ్విణి -

ఈ నాడు మంచి రాగయుక్తముగా పాడదగిన స్రగ్విణీ వృత్తము గురించి చెప్పుకొందాము.
ఇది 12 వ ఛందమైన "జగతి"లో 1171 వ వృత్తము.


లక్షణములు  : 
గణములు - ర ర ర ర 
యతి - 7వ అక్షరము
ప్రాస నియమము కలదు.


ఉదా:
శ్రీవరా! శ్రీకరా! స్నిగ్ధ హాసాకరా!
దేవలోకస్తుతా! దివ్యరూపాన్వితా!
దేవ దేవా! మహాదేవ  సంభావితా!
రావయా రావయా రామచంద్ర ప్రభూ!


చక్కగా ప్రయత్నించండి, మంచి విందులు గూర్చండి.  స్వస్తి.

పండిత రామజోగి సన్యాసి రావు

సమస్యాపూరణం - 710 (గట్రాచూలికిఁ దనయుఁడు)

కవిమిత్రులారా...
ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

గట్రాచూలికిఁ దనయుఁడు కందర్పుఁ డగున్.

19, మే 2012, శనివారం

రవీంద్రుని గీతాంజలి - 17

రవీంద్రుని గీతాంజలి

తెనుఁగు సేత

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు

17

I AM only waiting for love to give
myself up at last into his hands. That
is why it is so late and why I have
been guilty of such omissions.

They come with their laws and their
codes to bind me fast; but I evade
them ever, for I am only waiting for
love to give myself up at last into his
hands.

People blame me and call me heed-
less ; I doubt not they are right in their
blame.

The market day is over and work is
all done for the busy. Those who came
to call me in vain have gone back in
anger. I am only waiting for love to
give myself up at last into his hands. 


చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము....


వేచి కూర్చుంటి నాకు నే, ప్రేమకరము
లందు సర్వస్వ మర్పిత మాచరింపఁ,
జాల తడ వయిపోయె, దొసంగు లెన్నొ
దొరలె నా నుండి, నే నొక దోషి నైతి ||

తమ విధుల్ తమ చట్టముల్ త్రాళ్ళుజేసి
నన్ను బంధింప వేచియున్నారు వారు,
కాని తప్పించుకొం చెల్లకాల మేను
బయట బడుచుంటి నవ్వారి బారినుండి,
దీనికిన్ శిక్ష వచ్చెన యేని నేను
మది ముదంబందు చనుభవించెదను గాక
వేచి కూర్చుంటి నాకు నే ప్రేమకేళ్ళఁ
గడకు సర్వస్వ మమ్ముడు పడుట కొఱకు ||

సడ్డమాలినవాఁడని జనులు నన్ను
తిట్టి పోసెద, రందు సందియము లేదు,
తలపయిన్ మోపుకొనుచు నిందాభరంబు
నందరికిఁ గ్రింద నిలఁబడి యుందు నేను ||

దినము తుది ముట్టె, నమ్ముచుఁ గొనుచు నుండు
బేరకాండ్రెల్ల చల్లఁగ జారుకొనిరి
నను బిలువ వచ్చినట్టి వారును చిరాకు
పడుచు వచ్చినత్రోవన వెడలి రెపుడొ
కాని యొక నేన యొంటిగా గాచియుంటి
ప్రేమకరముల కిట సమర్పితము గాక ||     

ప్రత్యేక వృత్తములు - 7

తోటకము -

ఇది 12వ ఛందమైన ‘జగతి’లో 1756వ వృత్తము.
"కమలా కుచ చూచుక కుంకుమతో" అనే శ్లోకము మనలో చాలమందికి తెలుసును కదా.  అది తోటక వృత్తమే.

లక్షణములు:
గణములు - స స స స 
యతి స్థానము - 9
ప్రాస నియమము కలదు.


ఉదా:
రమాత్మవు నీవనిక్తిమెయిన్
నిరతంబును గొల్తును నీ పదముల్
రణాగత వత్సల సారనిధీ!
రితార్థను రామ! ప్రన్న గుణా!
IUU- I I  U- I   I  U-I    I  U
 స   -    స   -     స    -     స 


మంచి లయతో గమనముతో అలరారే ఈ పద్యము ఎంతో బాగున్నది కదూ.  ప్రయత్నించండి.  స్వస్తి.

పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

సమస్యాపూరణం - 709 (నాలుగైదు కలుప)

కవిమిత్రులారా,

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

నాలుగైదు కలుప నలువదయ్యె.

ఈ సమస్యను పంపిన
విష్ణునందన్ గారికి
ధన్యవాదాలు.


18, మే 2012, శుక్రవారం

రవీంద్రుని గీతాంజలి - 16

రవీంద్రుని గీతాంజలి

తెనుఁగు సేత


శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు

16

I HAVE had my invitation to this world's
festival, and thus my life has been
blessed. My eyes have seen and my
ears have heard.

It was my part at this feast to play
upon my instrument, and I have done
all I could.

New, I ask, has the time come at
last when I may go in and see thy face
and offer thee my silent salutation ?


చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము...

అందినది జగదానందయజ్ఞమందు
పాలుగొను పిల్పు, మనుజజీవనము నాకు
ధన్య మయ్యెఁ గడుంగడు ధన్య మయ్యె ||

నా కనుంగవ రూప సౌందర్యలహరి
యందుఁ బారాడి దప్పి చల్లార్చుకొనియె,
శ్రవణముల్ మున్క లిడె గభీరస్వరాల ||

మురళిపై గాన మొనరించు బరువు నాకు
నొప్పగించితి విట్టి మహోత్సవమున,
బ్రతుకులో నవ్వు లేడ్పులు పాటపాట
నింపి నే నింక దాని వాయింపఁగలను ||

ఇదియె విన్నప మిపు డొనరింతు నేను,
సమయమంతయు కడచను చరమ వేళ
నీదు సభలోని కేతెంచి, నీ ముఖమ్ము
దర్శన మొనర్చి, నీదు పదంబులందు
మౌనవందన మనియెడి కానుక యిడి,
వినియెదం గాక నీ జయ నినదములను ||     

ప్రత్యేక వృత్తములు - 6

పంచ చామరము - 

ఇది 16వ ఛందమైన ‘అష్టి’లో 21846వ వృత్తం. ఇది ఉత్సాహ, సుగంధి వృత్తముల వలెనే యుండును.

గణములు: జ ర జ ర జ గ
యతిస్థానమ: 10వ అక్షరము
ప్రాస నియమము కలదు


ఉదా: 


మో హిరణ్య బాహవే సనాతనాయ తే నమః
మశ్శివాయ సర్వ భూత నాయకాయ తే నమః
మో హరాయ నందివాహనాయ శూలినే నమః
మో భవాయ నాగభూషణాయ శంభవే నమః

I  U    I-U   I   U-I U  I-U   I   U- I U I- U
   జ    -       ర    -    జ  -     ర    -     జ -  గ.


పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

సమస్యాపూరణం - 708 (పరపురుషునికై తపింప)

కవిమిత్రులారా,

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

పరపురుషునికై తపింపవలె సతి యెపుడున్.

ఈ సమస్యను సూచించిన
కందుల వరప్రసాద్ గారికి
ధన్యవాదాలు.

17, మే 2012, గురువారం

రవీంద్రుని గీతాంజలి - 15

రవీంద్రుని గీతాంజలి

తెనుఁగు సేత

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు

15


I AM here to sing thee songs. In this
hall of thine I have a corner seat-
In thy world I have no work to do ;
my useless life can only break out in
tunes without a purpose.

When the hour strikes for thy silent
worship at the dark temple of midnight,
command me, my master, to stand
before thee to sing.

When in the morning air the golden
harp is tuned, honour me, commanding
my presence. 


చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము...

వచ్చి తిట కేను నీ పాట పాడుకొరకె,
నీ *జగన్మయమౌ సభానిలయమందు
నిద్ది యొకమూల నాకున్న కొద్దిచోటు ||

నాథ! యేను భవద్భువనమ్ములోనఁ
బనికిరా నెట్టికార్యముపట్ల నైన
కాని నాజీవితంబె యాకస్మికముగ
నీ స్వరమ్ముల మెరయుచు నెగడు నయ్య ||

మధ్యరాత్రఁపుఁ జీఁకటి మందిరమున
మౌనపూజనమున కనువైన వేళ
నీ యెదుట నిల్చి గానము సేయుకొరకు
నొడయఁడా! నాకు నానతి యిడఁ గదయ్య ||

నింగి వెల్గుల వెల్లువ పొంగులోన
వేగు తెమ్మెర బంగరు వీణమీద
తరఁగ లెత్తు స్వరమ్ములు మొరయు నపుడు
దాపు జేరెదఁ గాక నే దవ్వుగాక
యింత గౌరవ మీవు నా కీఁ గదయ్య ||     

శ్రీ వైష్ణవీ మాత


శ్రీ వైష్ణవీ మాత

శ్రీమాతా! కమనీయ రూపసహితా! సిద్ధిప్రదా! బుద్ధిదా!
శ్రీమత్పావనదివ్యభవ్య చరితా! చిద్రూపిణీ! శ్రీమయీ!
మామా పాపములన్ హరించి మదిలో మాకిన్ని సద్భావముల్
నీమంబుల్ గలిగించి కావుము సదా, నీకంజలుల్ వైష్ణవీ!  1.


శ్రేయంబుల్ గలిగించ "జమ్ము యను కాశ్మీర"ప్రదేశంబునన్
హాయిం గొల్పగ వాసముంటివి గదా, అంబా! జగన్మోహినీ!
నీయందెవ్వరు భక్తిఁజూపి సతమున్ నీనామ సంకీర్తనల్
చేయం జూతురు వారి కబ్బు నిలలో శ్రీ లెప్పుడున్ వైష్ణవీ!  2.


మాతా! శాంకరి! జ్ఞానశూన్యుడ నికన్ మందుండ నీ కేవిధిన్
చేతంబుల్లసిలంగ గూర్చగలనో శ్రీసూక్తులందంబుగా
రీతుల్ ఛందము రానివాడనుగదా, రేయింబవల్ నిత్యమున్
జోతల్ చేసెద భక్తితోడ కరుణన్ జూపించుమా వైష్ణవీ!   3.


నీచారిత్రము మాధురీభరమహో! నీసత్కథాలాపముల్
వాచాలత్వము ద్రుంచివేసి ఘనతన్ వాగ్వైభవాన్వీతమౌ
వీచీ పంక్తుల నందజేసి క్రమతన్ విజ్ఞాన మందించుచున్
ప్రాచీనత్వము కట్టబెట్టును గదా, వాగీశ్వరీ! వైష్ణవీ!  4.


నీవే సర్వఫలప్రదాత్రివిగదా, నీనుండియే సృష్టులున్
గావింపంబడు, వృద్ధినొందు, లయమౌ కైవల్యసంధాయినీ!
ఆవైకుంఠుడు, సృష్టికర్త, శివుడాహా! నీ పదచ్ఛాయనే
భావింతుర్ తమ మార్గదర్శకముగా  భాగ్యప్రదా!  వైష్ణవీ!  5.


జమ్మూప్రాంత సమీపమందు ఘనమౌ సద్గోత్రవర్గంబుపై
అమ్మా! యీశ్వరి! లోకరక్షణకునై యాశ్చర్యముం గొల్పుచున్
సమ్మోదంబున నిల్చినావు జననీ! సన్మార్గముం జూపుచున్
మమ్మెట్లైనను గావగా వలయు నోమాహేశ్వరీ! వైష్ణవీ!  6.


తల్లుల్ దండ్రులు బంధువర్గమనుచున్ తాదాత్మ్యతం జెంది యో
తల్లీ! మానవుడెల్లెడం దిరుగుచున్ దైన్యత్వముం బొందుచున్
కల్లోలంబులఁ జిక్కుచుండె కనుమా, కారుణ్యముం జూపి మా
కెల్లన్ నీపదకంజదర్శనసుఖం బీయం దగున్ వైష్ణవీ!  7.


ధన్యుండై వెలుగొందు వాడు ఘనుడై త్వద్భక్తు డీ సృష్టిలో
నన్యం బొండు తలంచబోక సతతం బార్ద్రాత్ముడై నీకథల్
మాన్యత్వంబున చెప్పుచున్న, వినినన్ మాతా! దయాంభోనిధీ!
దైన్యత్వంబు నశించి సత్వయుతుడౌ  తత్త్వాత్మికా! వైష్ణవీ!  8.


నిన్నున్ నమ్మితి నీపదాబ్జములకున్ నిత్యాభిషేకంబులన్
మన్నింపందగునమ్మ! పూజలెరుగన్, మందుండ నజ్ఞుండనై
యున్నాడన్ కను, నీ సుతుండ నిదిగో, ఓయమ్మ! ధన్యాత్ముగా
నన్నేరీతి యనుగ్రహింపగలవో, నారాయణీ! వైష్ణవీ!  9.


దేవీ! నీ చరణామృతాబ్ధిలహరుల్ తీర్థంబులై దేహమం
దావేశించిన కల్మషంబులను స్వాహాచేసి దివ్యత్వమున్
సేవాభావము గల్గజేసి జనులన్ శ్రీమంతులన్ జేయు, నా
కేవేళన్ భవదీయసంస్తవసుఖం(చరణాంబుసేవనసుఖం) 
బిప్పించుమా వైష్ణవీ!  10.

హరి వేంకట సత్యనారాయణ మూర్తి

ప్రత్యేక వృత్తాలు - 5

సుగంధి -
ఇది 15వ ఛందమైన ‘అతిశక్వరి’ లోని వృత్తము. 
ఇది ఉత్సాహ వలెనే ఉంటుంది.

లక్షణములు:
గణములు:  7 హ గణములు 1 గురువు (లేక ర జ ర జ ర)
యతి స్థానము: 9వ అక్షరము
ప్రాస నియమము కలదు.


ఉదా:
వందనమ్ము వేదవేద్య! వాసవ ప్రపూజితా!
వందనమ్ము దేవదేవ!భక్తి పారిజాతమా!
వందనమ్ము జ్ఞానకాంతిభాసురా! పరాత్పరా!
వందనమ్ము సర్వ లోకపాల! పూరుషోత్తమా!


స్వస్తి!
 పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

సమస్యాపూరణం - 707 (శని పట్టినవారల కగు)

కవిమిత్రులారా,

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

శని పట్టినవారల కగు సకలశుభమ్ముల్.

ఈ సమస్యను సూచించిన
పోచిరాజు సుబ్బారావు గారికి
ధన్యవాదాలు.

16, మే 2012, బుధవారం

రవీంద్రుని గీతాంజలి - 14

రవీంద్రుని గీతాంజలి

తెనుఁగు సేత

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు

14

MY desires are many and my cry is
pitiful, but ever didst thou save me by
hard refusals ; and this strong mercy
has been wrought into my life through
and through.

Day by day thou art making me
worthy of the simple, great gifts that
thou gavest to me unasked this sky
and the light, this body and the life
and the mind saving me from perils
of overmucli desire.

There are times when I languidly
linger and times when I awaken and
hurry in search of my goal ; but cruelly
thou hidest thyself from before me.

Day by day thou art making me
worthy of thy full acceptance by refus-
ing me ever and anon, saving me from
perils of weak, uncertain desire.


చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము...

నాదు కోర్కులకా లెక్కలేదు, వాని
కొరకయిన యేడ్పులా కనికరము గొల్పు
కాని యవ్వాని కఠినముగ నిరసించి
కాచుచుంటివి నన్ కలకాల మీవు
కణకణములో మదీయజీవనము నందు
నిండియున్నది యిట్టి నీ నిష్ఠురదయ ||

ఈ మహాగగనస్థల, మీ ప్రకాశ,
మీ శరీర, మీ ప్రాణము, లీ మనంబు
నేను యాచింపకుండనె యిచ్చి తీవు
దినదినము నీ మహాదానమును గొనంగ
నాకు యోగ్యత గూర్చుచున్నాఁడ వీవు
మెండు కోర్కుల యిరుకున నుండి నన్ను
వెలికిఁ దీయుచు రక్ష గావింతు వీవు ||

అలసటం గొని సోమరి నగుచు నేను
కొన్ని వేళల మరపునఁ గూరి యుందు
కొన్ని వేళల మెలకువ గొని బిరబిర
పోదు గమ్యగవేషణమున మునింగి,
కాని నిష్ఠురవర్తన మూని యెదుటి
నుండి యంతర్హితుఁడ వగుచుందు వీవు ||

దినదినము నిండు కలయిక కనువు పరప
నెంచి యెడనెడ నను నిరసించె దీవ
యీ యనిశ్చతముల్ బలహీనము లగు
నధికవాంఛల సంకట మందు నుండి
నన్ను వెలికెత్తి కాచుచున్నాఁడ వీవ
*యీ కఠోరదయామర్మ మేమొ నాకుఁ
దెల్ల మయ్యెఁ బ్రభూ! తేట తెల్ల మయ్యె ||     

ప్రత్యేక వృత్తాలు - 4

ఉత్సాహ వృత్తము -

గణములు:  7 సూర్య గణములు 1 గురువు
యతి స్థానము:  5వ గణము మొదటి యక్షరము. (ప్రాస నియమమున్న కారణమున ప్రాసయతి నిషేధము)
ప్రాస నియమము కలదు. 


(ఉత్సాహ వృత్తమునకు ఆటవెలదిని చేర్చిన ‘విషమ సీసము’ అగును. సూర్య గణములైన హగణ, నగణములలో ఏ ఒక్క గణముతోను పద్యమంతయు రచింపరాదు. అన్ని హగణములతో వ్రాసిన అది ‘సుగంధి వృత్తము’, అన్ని నగణములతో వ్రాసిన అది ‘విచికిలిత వృత్తము’ అగును. కనుక యథేచ్ఛముగా హగణ, నగణములను ప్రయోగించవలెను)

ఉదా:
వారిజాత లోచనుండు భద్రమూర్తి ప్రీతుడై
భూరి కరుణ మెరయ వినెను మొరల నెల్ల శీఘ్రమే
ధారుణిన్ నరత్వమొంది దశముఖున్ వధించుచున్
భారమెల్ల దీర్చుననుచు వసుధ పొంగె నెంతయున్


ఇంతకు ముందే ఈ పద్యము గురించి చెప్పుకొన్నాము.  కొందరు ఈ పద్యమును ఇప్పటికే అలవర్చుకొన్నారు - అయినా మరొక్క మారు ఈరోజు చెప్పుకొనుచున్నాము. స్వస్తి!పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

సమస్యాపూరణం - 706 (పెన్నిధులు గల్గి)

కవిమిత్రులారా,


ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

పెన్నిధులు గల్గి సుఖియించుఁ బేదవాఁడె.

ఈ సమస్యను సూచించిన 
గుండా సహదేవుడు గారికి
ధన్యవాదాలు.

15, మే 2012, మంగళవారం

పద్య రచన

కవిమిత్రులకు నమస్కృతులు. 

       క్రమం తప్పకుండా నేను రోజుకొక చిత్రాన్ని (గూగులమ్మ దయతో) ఇవ్వడం, దానిని పరిశీలించి పద్యాన్నో, పద్యాలనో వ్రాయమని కోరడం అందరూ (లబ్ధప్రతిష్ఠులతో సహా) ఉత్సాహంగా పాల్గొనడం జరుగుతున్నది. ఔత్సాహికులకు ఇది పద్యరచనాభ్యాసానికి తోడ్పడుతున్నది. అందరికీ ధన్యవాదాలు.

       శ్రీ నేమాని వారు ‘ప్రత్యేక వృత్తాలు’ శీర్షికను ప్రారంభించిన విషయం మీకు తెలుసు. మన కవులు అప్పుడప్పుడు అవసరం, అవకాశం ఉన్నప్పుడో లేక అశ్వాంసాంత పద్యాలుగానో కొన్ని విశేషచ్ఛందాలలో పద్యాలు వ్రాస్తూ వచ్చారు. అటువంటి పద్యాలను పరిచయం చేస్తున్నారు శ్రీ నేమాని వారు.

          కవి మిత్రులు ఆయా ఛందాలలో ఇష్ట దేవతా స్తుతి కాని, నచ్చిన ఏదైన అంశంపై కాని పద్యాలు వ్రాసి తమ రచనా నైపుణ్యాన్ని మెరుగు పరచుకొన వలసిందిగా మనవి.

       అందువల్ల ఈ ‘పద్య రచన’ శీర్షికకు కొంతకాలం విశ్రాంతి!

రవీంద్రుని గీతాంజలి - 13

రవీంద్రుని గీతాంజలి

తెనుఁగు సేత

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు

13

THE song that I came to sing remains
unsung to this day.

I have spent my days in stringing
and in unstringing my instrument.

The time has not come true, the
words have not been rightly set ; only
there is the agony of wishing in my
heart.

The blossom has not opened ; only
the wind is sighing by.

I have not seen his face, nor have I
listened to his voice ; only I have heard
his gentle footsteps from the road before
my house.

The livelong day has passed in spread-
ing his seat on the floor ; but the lamp
has not been lit and I cannot ask him
into my house.

I live in the hope of meeting with
him ; but this meeting is not yet. 


చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము...

ఇచ్చటికి నేవి పాడఁగ వచ్చినాఁడ
పాటలవి నేటి వరకును పాడ నైతి ||

స్వరములు కుదిర్చి, సారెలు చక్కపరచు
పాటులే పడుచుంటి నీ నాటి దాక
గానపుం గోర్కియా మదిలోనె నిల్చె ||

సమత సమకూడలేదు నా స్వరములందు
పాట కట్టవు నా తొట్రుపడి పదాలు!
ప్రాణములలోన మాత్రము పాడుకొనెడి
యారటము నిండియుండె నిరంతరముగ ||

ఇప్పటికి నేని పువ్వది విప్ప లేదు
కాని యిందాక నయ్యొ కేగాలి వీచు ||

అతని మో మేను చూడలే, దతని నోటి
పలుకు వినలేదు కాని కేవలము వాని
మృదుపదధ్వని విందు ప్రతిక్షణమ్ము,
ఎపుడు మా యింటి వాకిలి యెదుటినుండి
పుటపుటన వచ్చుచుండును పోవుచుండు ||

అతనికై యాసనమ్ముంచు జతనమందె
కడచిపోయెను పగలింటి కాలమెల్ల,
*ఇంటిలో దీపమేని వెల్గించ నైతి
నిప్పు డాతని మాయింటి కెట్లు పిలుతు? ||


ఆస గొనియుంటిఁ గలయిక యౌనటంచు
      కాని తా నింతవరకు నన్ గలియఁ డయ్యె ||     

ప్రత్యేక వృత్తాలు - 3

పాదపము -
ఇది 11వ ఛందమైన ‘త్రిష్టుప్పు’ లో 439వ వృత్తము.
(దీనిని అనంతుడు ‘తోదక’మని, అప్పకవి ‘దోధక’మని పేర్కొన్నారు)
గణములు: భ భ భ గగ
యతి  :  7వ అక్షరము
ప్రాస నియమము కలదు

ఉదా:
శ్రీరఘునందన! చిన్మయ! రామా!
మారుతి సేవిత! మంగళధామా!
వీరవరేణ్య! త్రివిక్రమ! రామా!
క్ష్మారమణా! పర గర్వ విరామా!


చూచేరా ఎంత సరళమైన గమనముతో ఉందో ఈ పద్యము. స్వస్తి!

పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

సమస్యాపూరణం - 705 (మాధవునకు శత్రువు గద)

కవిమిత్రులారా,

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...


మాధవునకు శత్రువు గద మకరధ్వజుఁడే!

ఈ సమస్యను సూచించిన  
పోచిరాజు సుబ్బారావు గారికి
ధన్యవాదాలు.

14, మే 2012, సోమవారం

పద్య రచన - 22

 కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.

రవీంద్రుని గీతాంజలి - 12

రవీంద్రుని గీతాంజలి

తెనుఁగు సేత

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు

12

THE time that my journey takes is long
and the way of it long.

I came out on the chariot of the first
gleam of light, and pursued my voyage
through the wildernesses of worlds leav-
ing my track on many a star and planet.

It is the most distant course that
comes nearest to thyself, and that
training is the most intricate which
leads to the utter simplicity of a tune.

The traveller has to knock at every
alien door to come to his own, and one
has to wander through all the outer
worlds to reach the innermost shrine
at the end.

My eyes strayed far and wide before
I shut them and said " Here art thou ! "

The question and the cry "Oh,
where ? " melt into tears of a thousand
streams and deluge the world with the
flood of the assurance " I am ! "

చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము...

చాలకాలము పయనము సలుపుచుంటి,
కడుపొడవు నేను పోవు మార్గమ్ముకూడ ||

ప్రథమ తైజసకిరణఁపు రథము మీద
వెలుపలికి వచ్చితిం దొలుదొలుత నేను,
సాగె నా పయనమ్ము విశ్వఁటెడారు
లందు, పలుచుక్క లెక్కి గ్రహమ్ము లెక్కి
యడుగు గుర్తులు నిలిపితి నచ్చటచట ||

దూరదూరము నడిచెడి దారి యద్ది,
కాని యది నీకె మిగుల దగ్గరగ వచ్చు,
నేర్చుటయె కడు కష్ట మా నేర్పుతోడ
సాగు రాగరుతుల్ కడు సహజగతులు ||

పథికుఁ డొక్కఁడు తనయింటి పట్టు చేర
తట్టవలె నెన్ని పరగృహద్వారములనొ!
కొనకు దనలోని విభుని గన్గొనుట కొరకు
క్రుమ్మరన్ వలె బాహ్యజగమ్ము లెన్నొ! ||

దవ్వు దవులందుఁ జెంగటి తావులందుఁ
ద్రోవ తప్పి భ్రమించు కందోయి మొగిచి
“యహహ! నీ విందె యుంటివా?” యంటి నేను ||

“అయ్యొ! యెక్కడ? రమ్ము ర” మ్మనెడు కేక
కరఁగి యొకవేయి కన్నీటివరద లయ్యె
“ఇదిగొ! నే” నన్న యాత్మప్రతీతి, పొంగి
పొంగి సకలప్రపంచము ముంచి వైచె ||

ప్రత్యేక వృత్తాలు - 2

ద్రుతవిలంబితము  
ఇది 12వ ఛందమైన ‘జగతి’లో 1464వ వృత్తము.
గణములు:  న భ భ ర
యతి  :  7వ అక్షరము
ప్రాస నియమము కలదు

ఉదా:
జయము రాఘవ! సద్గుణ వైభవా!
జయము విశ్రుత సత్య పరాక్రమా!
జయము రాక్షస సంఘ వినాశకా!
జయము సద్ఘన! సాధు జనావనా!

గమనిక -
ఈ పద్యములోని ప్రతిపాదము చివర ఒక లఘువును చేర్చితే తేటగీతి అవుతుంది.  యతి మాత్రము తేటగీతికి సరిపోయేటట్లు వేసుకొనవలెను.  (అంటే 2 చోట్ల యతి ఉండాలి) అప్పుడు ద్రుతవిలంబిత గర్భిత తేటగీతి అవుతుంది.  స్వస్తి!
పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

సమస్యాపూరణం - 704 (నరకలోకము గలదండ్రు)

కవిమిత్రులారా,

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

నరకలోకము గలదండ్రు నాకమందు.

ఈ సమస్యను పంపిన  
పోచిరాజు సుబ్బారావు గారికి 
ధన్యవాదాలు.

13, మే 2012, ఆదివారం

పద్య రచన - 21

  కవిమిత్రులారా,


పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.

రవీంద్రుని గీతాంజలి - 11

రవీంద్రుని గీతాంజలి

తెనుఁగు సేత

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు

11

LEAVE this chanting and singing and
telling of beads ! Whom dost thou
worship in this lonely dark corner of a
temple with doors all shut ? Open
thine eyes and see thy God is not before
thee!

He is there where the tiller is tilling
the hard ground and where the path-
maker is breaking stones. He is with
them in sun and in shower, and his
garment is covered with dust. Put off
thy holy mantle and even like him come
down on the dusty soil !

Deliverance ? Where is this deliver-
ance to be found ? Our master himself
has joyfully taken upon him the bonds
of creation ; he is bound with us all for
ever.

Come out of thy meditations and
leave aside thy flowers and incense !
What harm is there if thy clothes
become tattered and stained ? Meet
him and stand by him in toil and in
sweat of thy brow.


చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము...


భజన గాన జపమ్ములు వదలు మోయి;
ద్వారముల నెల్ల మూసి యెవ్వారు లేని
యాలయములోని చీఁకటి మూల జేరి
యెవరిఁ బూజింపుచుంటి వోయి! కనువిప్పి
చూడు, దేవుఁడు నీముందు లేఁడు సుమ్ము ||

కలఁ డతండు కృషీవలుల్ కరకు నేల
చీలికల్ పడ దున్ని కష్టించుచోట,
కలఁడు కార్మిక జనులు బాటలు రచింప
గట్టి బండలు ముక్కలు గొట్టు చోట,
ఎండ వానల వారితో నుండు నతని
కట్టుపుట్టము దుమ్మునఁ గ్రమ్మెనోయి!
ఆవలంబెట్టి మడిబట్ట లీవుగూడ
మురికి నేలకు నాతని కరణి దిగుము ||

ముక్తియా? అరే! యక్కడ ముక్తి దొరుకు?
తనకుఁ దానయి ముదమున మన ప్రభుండె
సృష్టిబంధములందునఁ జిక్కుకొనియె
నెల్ల మనతోడఁ గూడి వసించి యతఁడు
తనకుఁ దాఁ జిరకాలబంధనము పూనె ||

లెమ్ము ధ్యానమునుండి, పుష్పమ్ము లేల?
ధూప మేమిటి? కవి యటు ద్రోసి రమ్ము
చిరుగు లైనను, మన్నంటి మరకలైన
బట్టలకుఁ జింత సుంతయు పెట్టుకొనకు
కర్మయోగివై యతనితోఁ గలిసి నిలిచి
చెమ్మటం బ్రవహిల్లఁగ నిమ్ము నుదుట ||

ప్రత్యేక పద్యాలు (చందస్సులు) - 1

          కొన్ని ప్రత్యేక పద్యములను మన మిత్రులకు పరిచయము చేద్దామని ఈ శీర్షికను ప్రారంబించేను.  పరిశీలించండి:

మాలిని వృత్తము -  
ఇది 15 వ ఛందమైన ‘అతిశక్వరి’లో 4671వ వృత్తం.
గణములు  :  న న మ య య
యతి      :  9వ అక్షరము
ప్రాస    :  నియమము కలదు

ఉదా:
జయము జయము రామా! సర్వలోకాభిరామా!
జయము జయము శ్యామా! శాశ్వతానందధామా!
జయము జయము శౌరీ! సాధు చేతో విహారీ!
జయము జయము నేతా! సర్వ సౌఖ్యప్రదాతా!
పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

సమస్యాపూరణం - 703 (సినిమాలను జూచువాఁడు)

కవిమిత్రులారా,

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

సినిమాలను  జూచువాఁడు  శ్రీమంతుఁ డగున్.


ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

12, మే 2012, శనివారం

పద్య రచన - 20


కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.

రవీంద్రుని గీతాంజలి - 10

రవీంద్రుని గీతాంజలి

తెనుఁగు సేత

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు

10

HERE is thy footstool and there rest
thy feet where live the poorest,
and lowliest, and lost.

When I try to bow to thee,
my obeisance cannot reach
down to the depth where thy feet rest
among the
poorest, and lowliest, and lost

Pride can never approach to where
thou walkest in the clothes of the
humble among the poorest,
and lowliest, and lost.

My heart can never find its way to
where thou keepest company with the
companionless among the poorest,
the lowliest, and the lost. 


చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము...

*అధిప! నీచాతినీచ దీనాతిదీన
సకలధనహీన మానవ చయము నడుమ
నందరికి వెన్క, నందరిక్రింది చోట
నలరుచుండుఁ గదోయి నీ యడుగుదోయి ||

నేను నీకుఁ బ్రణామము నెరపువేళ
నద్ది నడుచక్కి నెచటనొ యాగిపోవు
నా శిరమ్మిది యెంత వినమ్రమయ్యు
నవమతుల కెల్లఁ గ్రిందఁ బొల్పారు నీదు
చరణపీఠము నందుకోఁ జాలదోయి! ||

అందరికి వెన్క, నందరి క్రిందిచోట,
సకలధనహీన మానవచయములోన
నలరుచుండుఁ గదోయి నీ యడుగుదోయి ||

సొమ్ము లెఱుఁగని దీనజనమ్ము నడుమ
సంచరించెదు పేద వేసమున నీవు
చేర నేరదు నా యహంకార మటకు ||

నేను ధనమాన సంపన్న మానవాళి
నడుమ నిను గను పేరాస విడువకుందుఁ
గాని మఱియెట్టి సహచరుల్ కానరాని
దీనజనులను వెన్నంటి తిరిగె దీవు ||

అందరికి వెన్క, నందరి క్రిందిచోట,
సకలధనహీన మానవ చయములోన
నలరుచుండుఁ గదోయి నీ యడుగుదోయి ||   

సమస్యాపూరణం - 702 (అధిక రక్తపు పోటు)

కవిమిత్రులారా,

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...


అధిక రక్తపు పోటు సౌఖ్యమ్ము గూర్చు.

11, మే 2012, శుక్రవారం

పద్య రచన - 19కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.

రవీంద్రుని గీతాంజలి - 9

రవీంద్రుని గీతాంజలి

తెనుఁగు సేత

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు

9

O FOOL, to try to carry thyself upon
thy own shoulders ! O beggar, to come
to beg at thy own door !

Leave all thy burdens on his hands
who can bear all, and never look behind
in regret.

Thy desire at once puts out the light
from the lamp it touches with its breath.
It is unholy take not thy gifts through
its unclean hands. Accept only what
is offered by sacred love. 


చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము...

*నా శిరస్థ్సలిమీదనే నా శరీర
భారమున్ మోయు పని కిఁక పాలుపడను
నేనె నా యింటివాకిటిలోని కింక
యరుగుఁ దేరనుపో బిచ్చ మడిగికొనఁగ ||

భార మియ్యది సర్వధూర్వహుఁడ వైన
నీదు పాదాల సన్నిధి నిల్పి, యేను
వెలికిఁ బరతెంతు స్వచ్ఛందవృత్తి నౌచు,
స్మృతికిఁ దే, నిఁక దీనిఁ జర్చింపఁ బోను,
నా భుజస్కంధములపయి నాదు మేని
బరువునే మోసికొను చిఁక తిరుగఁబోను ||

నాదు వాసన సోకి క్షణమ్ములోన
మలిపివేయు సుమా దేని వెలుఁగుఁ గాని
దీని మలినఁపు దోసిటిలోన నున్న
యెట్టి కానుక లేని గ్రహింపఁ జనదు
నిర్మలప్రేమభావ మందించి నపుడె
సమ్మతము పత్రమేని పుష్పమ్మయేని ||   

సమస్యాపూరణం - 701 (అందఱు నందఱే మఱియు)

కవిమిత్రులారా,

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

అందఱు నందఱే మఱియు నందఱు నందఱె యంద ఱందఱే!


ఇది ప్రసిద్ధమైన సమస్య. దీనికి కవిసార్వభౌముడు శ్రీనాథుని పూరణ....


కొందఱు భైరవాశ్వములు, కొందఱు పార్థుని తేరి టెక్కెముల్,
కొందఱు ప్రాక్కిటీశ్వరులు కొందఱు కాలుని యెక్కిరింతలున్,
కొందఱు కృష్ణజన్మమున కూసిన వారలు నీ సదస్సులో
నందఱు నందఱే మఱియు నందఱు నందఱె యంద ఱందఱే!


(భైరవాశ్వములు = కుక్కలు, పార్థుని తేరి టెక్కెములు = కోతులు, ప్రాక్కిటీశ్వరులు = పందులు, కాలుని యెక్కిరింతలు = దున్నపోతులు, కృష్ణజన్మమున కూసినవారలు = గాడిదలు)

10, మే 2012, గురువారం

పద్య రచన - 18


కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.

(చిత్రంలోని ‘థర్టీ బ్రాండ్ బీడీల ప్రకటనను’ పరిశీలించకుండా ఉపేక్షించండి)

రవీంద్రుని గీతాంజలి - 8

రవీంద్రుని గీతాంజలి

తెనుఁగు సేత

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు

8

THE child who is decked with prince's
robes and who has jewelled chains
round his neck loses all pleasure in his play ;
his dress hampers him at every step.

In fear that it may be frayed,
or stained with dust he keeps himself from
the world, and is afraid even to move.

Mother, it is no gain, thy bondage of finery,
if it keep one shut off from the
healthful dust of the earth, if it rob
one of the right of entrance to the
great fair of common human life. 


చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము...

అమ్మరో! రాచఠీవిగ నర్భకులకు
దొడిగెదవు విల్వ వల్వలు, మెడలలోన
రతనఁపు న్ముత్తియంపు హారమ్ము లిడెదు ||

పసినిసుఁగు లాడుకొను నాటపాటలందుఁ
బొదలు ముదమెల్ల నారడి పోవు దీన,
ఆడుకొను వేళ బాలుర కడుగడుగున
భారమౌచుండు నయ్యలంకార మెల్ల ||

చిరుగునో! త్రెస్సిపోవునో! విరిగి పడునొ!
దుమ్ము గ్రమ్మునో! యనెడి యాందోళనమున
దూరముగ నుంద్రు వా రెల్లవారలకును
భయము జెందుచు రిట్టటు పరుగు లెత్త ||

కోరి యీ రాజసఁపు టలంకార బంధ
మలవరించిన ఫలమేమి కలదు తల్లి?
యీవు ద్వారము దెరచెదవేని నేను
వెలికిఁ బరతెంచి హాయిగ వీధిలోని
దుమ్ములో నెండలోన వర్షమ్ములోన
దుముకు చురుకుచు స్వేచ్చగఁ దురఁగలింతు ||

విశ్వజనములు క్రీడ గావించు నట్టి,
వేల యాటలు దినమెల్ల విరియు నట్టి,
పెక్కు వేల స్వరమ్ములు పిక్కటిల్లి
విశ్వగానము నల్‌దెసల్ వినుచు నట్టి,
యతి మనోజ్ఞ సామాన్య జీవితములోన
వస్త్రభూషణ సంఛన్న బాలకులకు
హక్కులే, దవసరమును చిక్కబోదు ||

గర్భ కవిత్వములో మెలకువలు - 5

ఇప్పటివరకు 4 పాఠములలో గర్భ కవిత్వమును గురించి అనేక విషయములను వివరించితిని.  ఇంక కొన్ని ఉదాహరణలను మాత్రము వ్రాస్తాను.  ఔత్సాహికులైన కవి మిత్రులు ఇంక క్రమక్రమముగ గర్భ కవిత్వమును అభ్యాసము చేయవలసి యుంటుంది.   

ద్రుతవిలంబిత గర్భిత తేటగీతి:

పరమ పావన భావన భక్తితో(డ)
శరణు కోరితి సద్గుణ సాంద్ర నీ(దు)
చరణ వారిజ సన్నిధి స్వామి నన్(ను)
కరుణతో త్రిజగన్నుత కావవే(ల) 
తేటగీతి చివర ఒక లఘువు తీసివేస్తే ద్రుతవిలంబితము అయినది.

కంద గర్భిత తేటగీతి:

ధాత ముఖ దేవ సన్నుత! ..  ఆతత విల
యంకర!దనుజాంతక! శుభదా! ..  (మహేశ!)
భూతగణనాథ! పశుపతి! ..  ఖ్యాత చరిత!
సాంబ నన్ను గావుము గిరిశా! .. (దయాబ్ధి)

తేటగీతి 2, 4 పాదములలోని చివరి కుండలములలోని అక్షరములను తీసివేయగా కందము మిగిలినది కదా.

కంద, మధ్యాక్కర, తేటగీతి, ద్రుతవిలంబిత గర్భిత చంపకమాల:

శివ శివ శంకరా పురవిజేత విభో గురుమూర్తి ధీరతా
భవ భవ నాశకా పరమ భాగ్యద పావన బావ గోత్రజా
ధవ కవితాప్రియా సరస తాండవ సంభ్రమశాలి వేగ నా
స్తవ మిదె భో భవచ్చరణ సన్నిధి సత్కృతి సత్యపాలకా

కందము:
శివ శంకరా పురవిజే
తవిభో గురుమూర్తి ధీరతా భవ నా
కవితాప్రియా సరస తాం
డవ సంభ్రమశాలి వేగ నా స్తవమిదె భో 

మధ్యాకర: పై చంపకమాలలోని ప్రతి పాదములో చివరి 3 అక్షరములను తీసివేస్తే మధ్యాక్కర మిగులును. 

తేటగీతి: పై చంపకమాలలోని ప్రతి పాదములోని 8వ అక్షరమునుండి 20వ అక్షరము వరకు చదివినచో తేటగీతి వచ్చును.

ద్రుతవిలంబితము: పై చంపకమాలలోని ప్రతి పాదములోని 8వ అక్షరమునుండి 19 అక్షరమువరకు చదివినచో ద్రుతవిలంబితము వచ్చును.

స్వస్తి!
పండిత నేమాని రామజోగి సన్యాసి రావు