31, మార్చి 2011, గురువారం

సమస్యా పూరణం - 272 (యముని మహిషము)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
యముని మహిషము యమహా యయినది.

30, మార్చి 2011, బుధవారం

సమస్యా పూరణం - 271 (చదువు కొండెక్కినది)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
చదువు కొండెక్కినది కళాశాలలందు.

29, మార్చి 2011, మంగళవారం

సమస్యా పూరణం - 270 (కవి నాశముఁ గోరె)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
కవి నాశముఁ గోరెఁ దన సుకావ్యములోనన్.

28, మార్చి 2011, సోమవారం

సమస్యా పూరణం - 269 (పువ్వుఁబోడుల తల లెల్ల)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
పువ్వుఁబోడుల తల లెల్ల బోడు లయ్యె.

27, మార్చి 2011, ఆదివారం

వారాంతపు సమస్యా పూరణం - (రాతికి నాతిపైన ననురాగము)

కవి మిత్రులారా,
ఈ వారాంతానికి పూరించ వలసిన సమస్య ఇది ......
రాతికి నాతిపైన ననురాగము గల్గుట నైజమే కదా!

సమస్యా పూరణం - 268 (ప్రొద్దు పొడిచె)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
ప్రొద్దు పొడిచె నింక నిద్దురింతు

26, మార్చి 2011, శనివారం

సమస్యా పూరణం - 267 (ఆంజనేయున కొప్పెను)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
ఆంజనేయున కొప్పెను హస్తిముఖము

25, మార్చి 2011, శుక్రవారం

సమస్యా పూరణం - 266 (భల్లూకము చదువుకొనఁగ)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
భల్లూకము చదువుకొనఁగ బడిలోఁ జేరెన్.

24, మార్చి 2011, గురువారం

సమస్యా పూరణం - 265 (మందు జనుల కెల్ల)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
మందు జనుల కెల్ల విందు గాదె!
ఈ సమస్యను సూచించిన టేకుమళ్ళ వెంకటప్పయ్య గారికి ధన్యవాదాలు.
కవి మిత్రులకు మనవి ....
"భల్లూకము చదువుకొనఁగ బడిలోఁ జేరెన్" నిజానికి ఇది ఈరోజు నేనిచ్చిన సమస్య. ఆ తర్వాత నిన్నటి వ్యాఖ్యలు చూస్తుంటే వెంకటప్పయ్య గారు ఇచ్చిన సమస్య కనిపించింది. అది బాగుందనిపించి వారిచ్చిన తేటగీతి పాదాన్ని ఆటవెలదిగా మార్చి ఇస్తూ పోస్ట్‌ను సవరించాను. తీరా చూస్తే అప్పటికే "భల్లూకము" హారం తదితర అగ్రిగేటర్‌లలో దర్శన మిచ్చింది. మీరు తికమక పడకుండా ఈ వివరణ. ఎలాగూ రేపటి సమస్య "భల్లూకమే" క్వొశ్చెన్ పేపర్ లీకయింది. ముందే పూరణలు వ్రాసి సిద్ధంగా ఉంచుకోండి.

23, మార్చి 2011, బుధవారం

సమస్యా పూరణం - 264 (శ్రీరామునిఁ జూచి సీత)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
శ్రీరామునిఁ జూచి సీత చీకొట్టెఁ గదా!

22, మార్చి 2011, మంగళవారం

గళ్ళ నుడి కట్టు - 66


సారి గళ్ళనుడికట్టును తయారు చేసి పంపినవారు
మంత్రిప్రగడ
వేంకట బాలసుబ్రహ్మణ్యం గారు. వారికి ధన్యవాదాలు.
అడ్డం
1. మహేశ్వరుడు దీనిపై ఉంటాడు (4)
3. గూఢార్థ కావ్యవిశేషం. మొన్ననే ఈ బ్లాగులో కనిపించింది (4)
7. సమూహం, అతిగా (2)
8. ఆభరణ"ము"తో కొండ (3)
9. వెనుదిరిగిన సమయం రావణుడి నగరమా? (2)
12. రామం గారితో విశ్రాంతి (3)
13. రాజులకు రాజు (3)
17. ప్రోగు (2)
18. సంధి, అయోధ్యలో ఇంకా కుదరనిది (3)
19. సగం, సొరుగు (2)
22. వందనం (4)
23. ఇది పెనుభూతం (4)
నిలువు
1. సినిమా దీనిపై చూపిస్తారు (4)
2. కాస్త, స్వల్పం (2)
4. బంగారం (2)
5. కాయ కాని తెలుగు తీపి వంటకం (4)
6. విరోధాలు రాత్రి వద్దు (3)
10. వరలక్ష్మి ముద్దుపేరు (3)
11. తూచే రాజు (3)
14. రాధతో పూజ (4)
15. ఎడబాటు (3)
16. పరమాత్ముని ధ్యానం చేయమంటే అంత పరాకు ఎందుకు? (4)
20. అడ్డం 22 ను పెడుతున్నాడంటే దాని మధ్యలో ఉన్న దాన్ని కొట్టడానికే (2)
21. విడవ మంటే చెట్టును పట్టుకుంటావేం? (2)
దయచేసి మీ సమాధానాలను క్రింది అడ్రస్‌కు మెయిల్ చెయ్యండి.
shankarkandi@gmail.com

సమస్యా పూరణం - 263 (నరసింహుని పూజ చేసె)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
నరసింహుని పూజ చేసె నరకాసురుఁడే.

21, మార్చి 2011, సోమవారం

సమస్యా పూరణం - 262 (పోలేరమ్మను నుతింప)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
పోలేరమ్మను నుతింప ముప్పు గలుఁగురా.

ప్రహేళిక - 43 సమాధానం.

ఈ కావ్యం పేరేమిటి?
ఏది జటాయువు సోదరునకుఁ బేరు? - సంపాతి
సాగరముఁ గలువ సాగు నేది? - సరిత్తు
మత్తుఁ గల్గించు గమ్మత్తు వస్తు వదేది? - గంజాయి
ఇల్వలు సోదరుం డెవ్వఁ డతఁడు? - వాతాపి
పాంచాలితోడ సుభద్ర వరుస యేది? - సపత్ని
నాల్గవ శత్రువు నామ మేది? - మోహము
కామధేనువునకుఁ గల వేఱు పేరేమి? - సురభి
సముదాయమునకును సంజ్ఞ యేది? - గణము
వాయుసుతుఁడు పాండవద్వితీయుఁ డెవండు? - భీముడు
సంపాతి - సరిత్తు - గంజాయి - వాతాపి - సపత్ని - మోహము - సురభి - గణము - భీముడు.
పై పదాల నడిమి అక్షరాలను చదివితే తెలిసే కావ్యం పేరు ..........
పారిజాతాపహరణము
సరియైన సమాధానాలు పంపిన వారు .......
1. చంద్రశేఖర్ గారు,
2. కోడీహళ్ళి మురళీ మోహన్ గారు,
3. మందాకిని గారు,
4. మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారు,
5. వసంత్ కిశోర్ గారు,
6. గన్నవరపు నరసింహ మూర్తి గారు.
అందరికీ అభినందనలు.

20, మార్చి 2011, ఆదివారం

ఆశీర్వాద పంచరత్నములు

(ఇదెప్పుడో ఏడు నెలల క్రితం వ్రాసి సమర్పించింది. మొన్న బ్లాగులో ప్రకటించిన బేతి నరసింహ స్వామి గారి "పదవీ వరమణ సన్మాన పత్రము"ను చూచి దీనినికూడ బ్లాగులో పెట్టమని కొందరు మిత్రులు కోరారు)

మంత్రి వర్యులు, రాష్ట్ర వెనుకబడిన కులాల సంక్షేమ శాఖ, ఆం. ప్ర.
వరంగల్ (తూర్పు) శాసన సభ సభ్యులు
శ్రీ బస్వరాజు సారయ్య, లక్ష్మి దంపతుల కనిష్ఠ పుత్రిక
చి. ల. సౌ. అనిత
కూరేటి సుగుణ, కీ. శే. సాంబశివరావు దంపతుల కనిష్ఠ పుత్రుఁడు
చి. జయ నారాయణ
శుభ వివాహ మహోత్సవము
ది. 22-08-2010 (ఆదివారం) రోజున జరిగిన సందర్భమున సమర్పించిన
ఆశీర్వాద పంచరత్నములు

శ్రీయుతుం డగు ద్వారకామాయి సాయి
సచ్చిదానందరూపుఁడై సదయుఁ డయ్యు
`బస్వరాజు సారయ్య` శుభస్వభావ
తనయ `అనిత`ను శుభదృష్టిఁ గనును సతము.

ఆ.వె.
`బస్వరాజు` వంశవారాశి పూర్ణ శ
శాంకుఁడై వెలింగి శాసనసభ
సభ్యుఁడై చెలంగు `సారయ్య`కును ముద్దు
బిడ్డ వైన `అనిత`! పేర్మిఁ గనుము.

కం.
నీ తండ్రికి సారయ్యకు
చేతఃకాయానుకూల శీలము గలదౌ
నీ తల్లి `లక్ష్మి` ప్రేమను
శీతాంశుని వెన్నెల వలెఁ జేకొను మనితా!

కం.
అగణిత సద్గుణఖని, వా
సిగ `శ్రీ కూరేటి సాంబశివరావు`నకున్
`సుగుణ`కు ముద్దుల తనయుం
డగు `జయ నారాయణ` పతియై యలరారున్.

కం.
మీ దాంపత్యపు జీవన
మాపాత మధుర మగుచు సదానంద సుఖో
పేతమ్మై శోభించున్
గాత షిరిడి సాయినాథ కారుణ్యమునన్.

ఆశీస్సులతో ....
బ్రాహ్మణపెల్లి ఆంజనేయ శాస్త్రి
అర్చక, పురోహితుఁడు
శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయము
కొత్తవాడ, వరంగల్.
రచన - కంది శంకరయ్య, విశ్రాంత తెలుగు పండితుఁడు.

ప్రహేళిక - 43

ఈ కావ్యం పేరేమిటి?
సీ.
ఏది జటాయువు సోదరునకుఁ బేరు?
సాగరముఁ గలువ సాగు నేది?
మత్తుఁ గల్గించు గమ్మత్తు వస్తు వదేది?
ఇల్వలు సోదరుం డెవ్వఁ డతఁడు?
పాంచాలితోడ సుభద్ర వరుస యేది?
నాల్గవ శత్రువు నామ మేది?
కామధేనువునకుఁ గల వేఱు పేరేమి?
సముదాయమునకును సంజ్ఞ యేది?

ఆ. వె.
వాయుసుతుఁడు పాండవద్వితీయుఁ డెవండు?
త్ర్యక్షరపదము లవి; తడవి చూడ
మధ్యమాక్షరముల మధుర ప్రబంధమై
యొప్పు కావ్య మేదొ చెప్పఁ గలరె?

ముందు తొమ్మిది ప్రశ్నలకు సమాధానాలు చెప్పి, ఆ తర్వాత ఆ కావ్యం పేరు చెప్పండి.

సమాధానాన్ని క్రింది మెయిల్ అడ్రస్‌కు పంపండి.
shankarkandi@gmail.com

వారాంతపు సమస్యా పూరణం - (అవధానం బొనరించి)

కవి మిత్రులారా,
ఈ వారాంతానికి పూరించ వలసిన సమస్య ఇది ......

అవధానం బొనరించి పామరుఁ డయెన్ ఖ్యాతుండు విద్వత్సభన్.

సమస్యా పూరణం - 261 (వన్నెలే తెల్లఁబోయిన)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
వన్నెలే తెల్లఁబోయిన భంగిఁ గనుఁడు.
ఈ సమస్యను పంపిన మందాకిని గారికి ధన్యవాదాలు.

19, మార్చి 2011, శనివారం

సమస్యా పూరణం - 260 (తిరుమలేశునిఁ దిట్టిన)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
తిరుమలేశునిఁ దిట్టిన సిరులు గలుగు.

18, మార్చి 2011, శుక్రవారం

సమస్యా పూరణం - 259 (సింహము నెదిరించి)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్యను టేకుమళ్ళ వెంకటప్పయ్య గారు పంపారు.
సింహమునెదిరించి గ్రామ సింహము గెలిచెన్
అయితే అనుస్వార పూర్వకమైన హకార ప్రాస కొందరిని ఇబ్బంది పెడుతుందేమో అన్న సందేహంతో కంద పాదాన్ని తేటగీతి పాదంగా మార్చాను.
సింహమును జయించెను గ్రామసింహ మొకటి.
కవిమిత్రులు మీ వీలును బట్టి పై రెండింటిలో దేనినైనా స్వీకరించి పూరణలు పంపండి.
సమస్యను పంపిన టేకుమళ్ళ వెంకటప్పయ్య గారికి ధన్యవాదాలు.

17, మార్చి 2011, గురువారం

పద్య రచన

పద్య రచన
కొంత కాలంగా ఎందరో నన్నొక విషయం అడుగుతున్నారు.
"మాకు పద్యాలు రాయాలనే ఆసక్తి ఉంది. మీ బ్లాగులో కేవలం `సమస్యా పూరణ`లే ఇస్తున్నారు. అసలు పద్యం రాయడమే కష్ట మనుకుంటుంటే క్లిష్టమైన సమస్యకు ఉచితమైన పరిష్కారం ఆలోచించి దానిని ఛందోబద్ధం చేయడం మాకు చాలా కష్టం. కాబట్టి మాలాంటి ఔత్సాహికులను ప్రోత్సహిస్తూ స్వేచ్ఛగా పద్యాలను వ్రాసే అవకాశం కల్పించండి. ఒక అంశాన్ని ఇచ్చి నచ్చిన ఛందంలో పద్యం వ్రాయమనడం కాని, సమస్యగా కాకుండ ఏదైనా అంశంపై ఒక పద్యపాదాన్ని ఇచ్చి పద్యం పూర్తి చేయ మనడం కాని చేయవచ్చు" ఇదీ వాళ్ళు కోరుతున్నది.
నాకూ ఈ ఆలోచన ఎంతోకాలంగా ఉంది. "ఛందస్సు" పాఠాలు ప్రారంభించిన తరువాత "పద్య రచన" శీర్షికను ప్రకటించా లనుకున్నాను. కాని కొన్ని కారణాల వల్ల ఛందోపాఠాలు ప్రారంభించ లేదు. ఎప్పుడు మొదలు పెడతానో కచ్చితంగా చెప్పలేను.
అందువల్ల ఆసక్తి ఉన్నవారి ఉత్సాహాన్ని నీరుగార్చకుండా "పద్య రచన" శీర్షికను ప్రారంభిస్తున్నాను.
"పద్య రచన" శీర్షికలో ఏదైనా అంశం ఇచ్చి స్వేచ్ఛాఛందంలో కాని, నేను నిర్దేశించిన ఛందంలో కాని పద్యం వ్రాయమంటాను. లేదా ఏదైనా అంశంపై ఒక పాదాన్ని ఇచ్చి పద్యం పూర్తిచేయ మంటాను.

ఈ శీర్షికపై కవిమిత్రుల సలహాలను, సూచనలను కోరుతున్నాను. మీ అందరి అభిప్రాయాలను అనుసరించి ఒక నిర్దిష్ట ప్రణాళికతో ఈ శీర్షికను ప్రారంభిస్తాను.

సమస్యా పూరణం - 258 (మాధవుఁడు మాధవుని)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
మాధవుఁడు మాధవునితోడ మత్సరించె.
ఈనాటి సమస్యను సూచించిన మందాకిని గారికి ధన్యవాదాలు.

16, మార్చి 2011, బుధవారం

సమస్యా పూరణం - 257 (నెలవంకన్ జూచి)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
నెలవంకన్ జూచి నవ్వ నేరము సుమ్మీ.

15, మార్చి 2011, మంగళవారం

సమస్యా పూరణం - 256 (శ్రమమునందు మనకు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
శ్రమమునందు మనకు శాంతి దొరకు.

14, మార్చి 2011, సోమవారం

సమస్యా పూరణం - 255 (అర్జునునకు మిత్రుఁ)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
అర్జునునకు మిత్రుఁ డంగరాజు.
ఇప్పుడే వేములవాడ నుండి హైదరాబాదు చేరుకున్నాను. వచ్చీ రావడం తోనే ముందుగా సమస్యను పోస్ట్ చేస్తున్నాను. ఇక తీరిగ్గా నిన్నటి మొన్నటి పూరణలూ, వ్యాఖ్యలూ, స్పందనలూ చూస్తాను.

13, మార్చి 2011, ఆదివారం

వారాంతపు సమస్యా పూరణం - (బావా రమ్మని పిల్చె)

కవి మిత్రులారా,
ఈ వారాంతానికి పూరించ వలసిన సమస్య ఇది ......
బావా రమ్మని పిల్చె మోహ మెసఁగన్ బాంచాలి రాధాత్మజున్.

సమస్యా పూరణం - 254 (ధనమె లక్ష్య మగును)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
ధనమె లక్ష్య మగును తాపసులకు.

12, మార్చి 2011, శనివారం

సమస్యా పూరణం - 253 (నాకు మోదమ్ముఁ గూర్చె)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
నాకు మోదమ్ముఁ గూర్చె సునామి యిపుడు.
నిజానికి నేను ముందు అనుకున్న సమస్య
"
నామ రూపమ్ము లడఁచె సునామి యకట!".
కాని మిత్రులు ఇందులో "సమస్య" లేదంటారని పైవిధంగా మార్చాను.

విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని బోధించే భారతీయ సంస్కృతికి వారసులం మనం. జపాన్ దేశ సోదరులకు మన సానుభూతిని తెలియజేద్దాం.
"లోకా స్సమస్తా స్సుఖినో భవంతు."

11, మార్చి 2011, శుక్రవారం

ప్రత్యేక సమస్యా పూరణం - 252 (విగ్రహముల పైన)

కవి మిత్రులారా,
నిన్నటి విధ్వంసం తెలుగువారంతా సిగ్గుపడవలసిన సంఘటన. ఈ విధ్వంసంపై కవిమిత్రులు స్పందించ వలసిందిగా మనవి.
ఈ పూట పూరించ వలసిన సమస్య ఇది ......
విగ్రహముల పైన నాగ్రహమ్ము.

సమస్యా పూరణం - 251 (విస్కీయే మేలు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
విస్కీయే మేలు విషము విఱుగుట కొఱకున్.

10, మార్చి 2011, గురువారం

సమస్యా పూరణం - 250 (మెల్ల కన్ను వలన)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
మెల్ల కన్ను వలన మేలు గలిగె.

9, మార్చి 2011, బుధవారం

సమస్యా పూరణం - 249 (దున్న పాలు పితికె)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
దున్న పాలు పితికె సన్నుతాంగి.

8, మార్చి 2011, మంగళవారం

సమస్యా పూరణం - 248 (ఆడువారిని తన్నుటే)

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
ఆడువారిని తన్నుటే న్యాయ మగును.

7, మార్చి 2011, సోమవారం

వారాంతపు సమస్యా పూరణం - (స్ఫురణ భవత్స్వరూప మను)

కవి మిత్రులారా,
ఈ వారాంతానికి పూరించ వలసిన సమస్య ఇది ......
స్ఫురణ భవత్స్వరూప మను సూక్తి నిజమ్ము ధరిత్రి శారదా.
ఈ సమస్యను పంపిన మిస్సన్న గారికి ధన్యవాదాలు.

సమస్యా పూరణం - 247 (పెండ్లి సేయఁదగును)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......

పెండ్లి సేయఁదగును ప్రేతమునకు.
ఈ సమస్యను పంపిన మిస్సన్న గారికి ధన్యవాదాలు.

6, మార్చి 2011, ఆదివారం

సమస్యా పూరణం - 246 (కాశి కేఁగువాఁడు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
కాశి కేఁగువాఁడు ఖలుఁడు గాఁడె.
ఈ సమస్యను పంపిన మిస్సన్న గారికి ధన్యవాదాలు.

5, మార్చి 2011, శనివారం

సమస్యా పూరణం - 245 (తుందిలుఁ గని మన్మథుఁడని)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......

తుందిలుఁ గని మన్మథుఁడని తొయ్యలి మురిసెన్.
(తుందిలుడు = పెద్ద బొజ్జ గలవాడు)
ఈ సమస్యను సూచించిన దేవి గారికి ధన్యవాదాలు.

4, మార్చి 2011, శుక్రవారం

సమస్యా పూరణం - 244 (మడిగట్టిన శ్రోత్రియుండు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
మడిగట్టిన శ్రోత్రియుండు మద్యము ద్రాగెన్.

3, మార్చి 2011, గురువారం

భక్త సిరియాళుని కథ

వసంత్ కిశోర్ చెప్పిన
భక్త సిరియాళుని కథ
కాంచీపురంలో చిరుతొండనంబి అనే వైశ్యకులశేఖరుడు ఉండేవాడు. అతడు అఖండ శివభక్తి తత్పరుడు. ఆయన భార్య తిరువెంగనాంచి. ఆ పుణ్య దంపతులు జంగమారాధనా తత్పరులు. వారి పుత్రుడు సిరియాళుడు.
చిరుతొండడు పూర్వజన్మవాసనా విశేషంచేత ఏకామ్రనాథుణ్ణి ఆరాధిస్తూ జంగమ ప్రమథులకు అడిగిన పదార్థం లేదనక సదా అన్నదానం చేసేవాడు.
ఒకనాడు పరమశివుడు పార్వతీదేవికి చిరుతొండని భక్తి ప్రభావం నిరూపింప దలచాడు.
నిత్యన్నదానశీలుడైన చిరుతొండనంబికి ఒకనాడు ఒక్క శివయోగి కూడా కనిపించలేదు. తిరిగి తిరిగి చివరకు కాంచీపురం ఊరిబయట ఉన్న పాడుబడిన గుడికివెళ్ళాడు. గర్భమంటపంలో ఒక వృద్ధుడు, అతనికి సేవ చేస్తున్న ముసలి అవ్వ కనిపించారు. ఆ మాయ జోగి దంపతులకు ప్రణామం చేసి, తమ యింటికి వచ్చి శివార్చన నందుకొని చరితార్థుణ్ని చేయమని ప్రార్థించాడు చిఱుతొండడు.
ఆ పరమ వృద్ధుడు "ఏడు రోజుల నుండి నిరాహార వ్రతం పూని ఉన్నాను. ఆ వ్రతానికి ఉద్యాపనము పశూపహారము. ఆ యాగపశువుగా నరుడు తప్ప మరొకడు పనికి రాడు. సుందరుడు, రోగ విహీనుడు, అయిన ఆ పిన్న వయసువాణ్ని తల్లితండ్రులు వండి మాకు వడ్డించి, మాతో పాటు భోజనం చేయాలి." అని పలికాడు.
చిరుతొండడు ఇంటికి వెళ్ళి విషయమంతా భార్యకు చెప్పాడు. ఆమె నవ్వి "మన శరీరార్థ ప్రాణాలకు కర్తలు శివయోగీశ్వరులే కదా! వారి సొమ్ములు వారికి సమర్పించడానికి ఆలోచన ఎందుకు?" అని పలికింది.
వెంటనే శివయోగిని తీసుకురావడానికి బయలుదేరాడు చిరుతొండడు.
అంతకు ముందే శివుడు మరొకవేషంలో గురువుగారి యింటిలో పాఠాలు చదువుకుంటున్న సిరియాళుని దగ్గరకు వెళ్ళాడు. ఆ జటాధారిని చూడగానే సిరియాళుడు ఎదురుగా వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసాడు.
భక్తి తాత్పర్యంతో నమస్కరిస్తూ నిల్చున్న సిరియాళునితో "నాయనా! నీ తండ్రి చిరుతొండనంబి నిన్ను చంపి ఒక నిర్భాగ్యుడైన శివయోగికి ఆహారంగా పెట్టబోతున్నాడు. కడుపున బుట్టిన కూరిమి కుమారుని, మెడకోసి చంపి జోగులకు పెట్టే క్రూరుడు ఈ లోకంలో ఎవడైనా ఉంటాడా? స్నేహ శీలిని కాబట్టి ఈ విషయం నీకు చెప్పడానికై వచ్చాను. బ్రతికి వుంటే బలుసాకు తినవచ్చు. నీ ప్రాణాలు కాపాడుకో" అన్నాడు.
కుమార సిరియాళుడు చెవులు మూసుకుని "మహానుభావా! నీవీ రకంగా మాట్లాడడం న్యాయమా? ఇతరుల కోసమై శరీరమును ధనమును వ్యయం చేయడం కంటె ఈ జన్మకు సార్థక్య మేమున్నది?" అన్నాడు.
చిరుతొండడు వృద్ధ శివయోగిని ఇంటికి తీసుకువెళ్లాడు. పాఠశాలకు వెళ్లి కుమారుణ్ణి తీసుకు వచ్చాడు. కుమారుణ్ణి తొడమీద కూర్చుండ బెట్టుకుని, "తండ్రీ! సిరియాళా! ఎల్లపుడూ పంచాక్షరీ మంత్రమే జపిస్తూ ఉండు. " అని పలికి కత్తితో అతని శిరమును ఖండించాడు.
ఒక్కవ్రేటుతో క్రిందపడిపోయిన సిరియాళుని శిరస్సు "నమః శివాయ" అని మంత్రం పఠిస్తున్నది.
భోజనశాలలో వంట సిద్ధమైంది. అమృతాహారం ఆరగించవలసినదిగా నమస్కరించారు నంబి దంపతులు.
"నాకు మఱొక్క నియమం ఉన్నది. మగబిడ్డ లేని నిర్భాగ్యుని ఇంట్లో భోజనం చేయకూడదు. నీ కుమారుని పిలువు." అన్నాడు మాయా జంగముడు.
"స్వామీ! ముందే ఆ విషయం చెప్పి ఉంటే కుమారుని పిలిచేవాణ్ణి. ఇప్పుడు వాడెక్కడికి పోయినాడో ఆడుకోవడానికి" అన్నాడు నంబి.
వృద్ధ దంపతులు నంబి భార్యను, ఎలుగెత్తి కుమారుని పిలవమన్నారు
వెంటనే. "రారా! రారా! కుమారా!" అని దిక్కులు ప్రతిధ్వనించేటట్లు పిలిచింది తల్లి.
మరుక్షణమే ఆకులలో ఉన్న శాకపాకాలనుంచీ సిరియాళ కుమారుడు వారి ముందు నిలిచాడు.
పరమశివుడు భస్మదేహంతో నాగాలంకార భూషణుడై అర్థ చంద్రాకృతితో సాక్షాత్కరించి, సశరీరములతో కైలాసానికి రమ్మని వారిని ఆహ్వానించాడు.
అంత చిఱుతొండడు "స్వామీ!" నీ దయవల్ల వేయి గోత్రములకు చెందిన మా వైశ్యులందరూ ఈ కంచి పట్టణంలో ఈశ్వరా రాధనం చేస్తూ ఉన్నారు. వారి నందరిని వీడి నేనొక్కడినే రాలేను. ఇంతమందినీ కైలాసానికి రమ్మంటే వస్తాను" అన్నాడు.
శంభుడు కరుణించి కంచిలో ఉన్న వైశ్యులందరూ కైలాసానికి వచ్చేటట్లు వరం ప్రసాదించాడు.
కన్న కుమారుని కూడా బలిచేయడానికి వెనుదీయకుండా తనతోపాటు స్వజనానికి కూడా మోక్షం ఇప్పించిన చిరుతొండ నంబి, పరోపకారార్థమై తన శరీరమే దానమొనర్చిన సిరియాళుడు, శైవభక్తులలో అగ్రగణ్యులు

సమస్యా పూరణం - 243 (చచ్చి నంతనె చేఁతురు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
చచ్చి నంతనె చేఁతురు సంబరములు.
ఈ సమస్యను పంపిన ఊకదంపుడు గారికి ధన్యవాదాలు.

2, మార్చి 2011, బుధవారం

చమత్కార (చాటు) పద్యాలు - 52

మృడునిఁ గనుగొంటి
సీ.
అర్థంబు సత్పురుషాకృతి గాంచిన
వెండిచాయల పెద్ద కొండఁ గంటి
నా కొండ పార్శ్వమం దంటి పాయఁగలేక
సగమైన యొక మహాశక్తిఁ గంటి
నా శక్తి కుడివంక నద్రిశృంగము మీఁద
నద్భుతం బైన కాఱడవిఁ గంటి
న క్కానలోఁ గంటి నరుదైన యొక యేఱు
న య్యేటి దరులయం దమృత మొలుక
గీ.
పాఱి తడుపారు నొక పాలపాఁపఁ గంటి
నదియు నదియును నదియును నదియు నదియు
హరశిరోజూటగంగాబ్జు లగుట గంటి
మృడునిఁ గనుఁగొంటి నంతట మేలుకొంటి.

సీ.
శీతాద్రి యామ్య దిక్సీమ భూములు గంటిఁ
జెలువైన కేదారశిఖరిఁ గంటి
నుగ్రుని నిజకాంత నుమఁ జెంతఁ గనుఁగొంటి
మధుమాధవుని దైత్యమథనుఁ గంటిఁ
గంటి విఘ్నేశ్వరు గణనాథుఁ గనుఁగొంటిఁ
జండభైరవుని గోస్వామిఁ గంటి
నుత్తమ సంస్తుత్యు నుత్తరార్కునిఁ గంటిఁ
గాలభైరవు ఛన్నఘంటఁ గంటిఁ
గీ.
గంటి వటవృక్ష మాదిమగంగఁ గంటిఁ
గంటిఁ గేదార కుండోదకములు గ్రోలి
మహిత వృషరాజు నెక్కిన మహిమవాని
మృడునిఁ గనుఁగొంటి నంతట మేలుకొంటి.

సీ.
ఆలపోతులఱేని నాతని పగవానిఁ
బెంపంగఁ జంపంగఁ బెంపు గలిగి
హాలాహలపు మందు హల్లకముల విందుఁ
గుడువంగ ముడువంగఁ గోర్కె గల్గి
యెడమదిక్కు వధూటి జడల మక్కువబోటిఁ
బొలపింప వలపింపఁ బొందు గలిగి
పచ్చి యేనికతోలు ప్రాఁత కంగటికాలు
కట్టంగఁ బట్టంగఁ గణఁక గల్గి
గీ.
యెసఁగి లోకంబు లీరేడు నేలువాని
మిగులఁ బొడవైన తెల్లని మేనువాని
మహిత వృషరాజు నెక్కిన మహిమవాని
మృడునిఁ గనుఁగొంటి నంతట మేలుకొంటి.
(చాటు పద్య మణి మంజరి)

ప్రత్యేక సమస్యా పూరణం - (హర హర శంకరా)

కవి మిత్రులారా,
అందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు.
ఈ రోజు పూరించ వలసిన ప్రత్యేక సమస్య ఇది ......
హర హర శంకరా యనుచు నాలిని గౌఁగిటఁ జేర్చెఁ బ్రేమతో.
శివరాత్రి సందర్భంగా ఈ సమస్యను సూచించిన మిస్సన్న గారికి ధన్యవాదాలు.

సమస్యా పూరణం - 242 (శిష్టుఁ డెట్లు పల్కు)

కవి మిత్రులారా,
అందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు.
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
శిష్టుఁ డెట్లు పల్కు శివ శివ యని?
శివరాత్రి సందర్భంగా ఈ సమస్యను సూచించిన మిస్సన్న గారికి ధన్యవాదాలు.

1, మార్చి 2011, మంగళవారం

సమస్యా పూరణం - 241 (శంకరుం డొసంగు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
శంకరుం డొసంగు సంకటములు.
శివరాత్రి సందర్భంగా ఈ సమస్యను సూచించిన మిస్సన్న గారికి ధన్యవాదాలు.