31, ఆగస్టు 2014, ఆదివారం

దత్తపది - 41 (కరి-గురి-దరి-విరి)

కవిమిత్రులారా!
“కరి - గురి - దరి - విరి”
పై పదాలను ఉపయోగిస్తూ మీకు నచ్చిన ఛందస్సులో
భారతార్థంలో పద్యం వ్రాయండి.

పద్యరచన - 663 (వేమన పద్యములు)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము...
“వేమన పద్యములు”

నిర్వచన భారత గర్భ రామాయణము – 70


రావిపాటి లక్ష్మీనారాయణ

రామాయణము-
ఆ.     (మీఱి పలికె వెండి మిగులశూరుఁడగు సు
యోధనవిభుఁ జూచి యుదుటుతో)డఁ
(బోరు వినవొ నష్టము మఱి యారయఁగనుఁ
బొందు లాభ మంచుఁ బుడమిలో)న. (౮౫)

భారతము-
కం.    మీఱి పలికె వెండి మిగుల
శూరుఁడగు సుయోధనవిభుఁ జూచి యుదుటుతోఁ
బోరు వినవొ నష్టము మఱి
యారయఁగనుఁ బొందు లాభ మంచుఁ బుడమిలో. (౮౫)

టీక- సుయోధనవిభు = (రా) మంచియోధులకు ప్రభున్ (రావణుని), (భా) దుర్యోధనుని.

30, ఆగస్టు 2014, శనివారం

సమస్యా పూరణం – 1510 (ధనమొక్కటె మోక్షమిచ్చు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
ధనమొక్కటె మోక్షమిచ్చు దారిగఁ దలఁతున్.
ఈ సమస్యను పంపిన సంపత్ కుమార్ శాస్త్రి గారికి ధన్యవాదాలు.

పద్యరచన - 662

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశం...
“సినిమా పాటలు, నాడు-నేడు’

నిర్వచన భారత గర్భ రామాయణము – 69


రావిపాటి లక్ష్మీనారాయణ

రామాయణము-
శా.        (ఆవీరుండు సభన్ ధృతి)స్ఫురణు దైత్యాలిప్రభుం గాంచె; నా
పై (వావిం గని చెప్పె నెట్టిపనికై వచ్చెన్) దనుం దెల్పె నా
(హా విఖ్యాతుఁడ వంచు ను)ర్విజను నీవర్పింపవే యంచునుం
దా(వేవేగను మీఱి పల్కె విరివౌ తాల్మిన్) గడున్ గూడుచున్. (౮౪)

భారతము-
కం.       ఆవీరుండు సభన్ ధృతి
వావిం గని చెప్పె నెట్టిపనికై వచ్చెన్
హా విఖ్యాతుఁడ వంచును
వేవేగను మీఱి పల్కె విరివౌ తాల్మిన్. (౮౪)

టీక- స్ఫురణు = ప్రకాశించువాఁడు.

29, ఆగస్టు 2014, శుక్రవారం

న్యస్తాక్షరి -2

అంశం- వినాయక స్తుతి.
ఛందస్సు- ఆటవెలది.
మొదటిపాదం 1వ అక్షరం ‘వి’, రెండవ పాదం 3వ అక్షరం ‘నా’, మూడవ పాదం 10వ అక్షరం ‘య’, నాలుగవ పాదం 12వ అక్షరం ‘క’.

పద్యరచన - 661

కవిమిత్రులారా,
వినాయక చవితి శుభాకాంక్షలు.

ఈనాటి పద్యరచనకు అంశం...
వినాయక చవితి - చంద్రదర్శనము.

నిర్వచన భారత గర్భ రామాయణము – 68


రావిపాటి లక్ష్మీనారాయణ

రామాయణము-
సీ.      ఘోరుఁ డాతం డిట్లు (తోరపుధృతి నేగి
దుర్యోధనసుజిష్ణు) ధూర్తరిపు మ
రుత్సుతు డాసె; దీరుల నేయుటకు దైత్యు
(లు వెస గైకొనిరి; హరి విజయుఁడు సు)
కృతి కలగుండు వారిఁ బఱచెఁ; బఱచె సే
నలు; మరల్చెను మేఘనాదుఁ డుగ్ర
యోధనుండు మొనల; నొప్పుచుఁ దా బద్మ
జాస్త్రమ్ము వైచెను హనుమమీఁద
గీ.      బావని యజమంత్రప్రభావమున నిలిచె;
నతని బంధించె డనుజాధిపాగ్రనంద
నుండు రోషారుణిత(నయనుఁడు; సనియెను
గన గురువిభునిఁ) బంక్తికంఠుని హనుమఁడు. (౮౩)

భారతము-
ఆ.      తోరపు ధృతి నేగి దుర్యోధన సుజిష్ణు
లు వెసఁ గైకొనిరి హరి విజయుఁడు సు
యోధనుండు మొనలఁ; నొప్పుచుఁ దాఁ బద్మ
నయనుఁడు సనియెను గనఁ గురువిభుని. (౮౩)

టీక- దుర్యోధనసుజిష్ణు = (రా) యోధుల కలవికాని వారిని జయించువానిని, (భా) దుర్యోధనార్జునులు; హరి = (రా) కోతి. (భా) కృష్ణుని; విజయుఁడు = (రా) జయశీలుఁడు, (భా) అర్జునుఁడు; పద్మనయనుఁడు = (భా) కృష్ణుఁడు; గురువిభుని = (రా) గొప్పప్రభుని, కురువిభుని = (భా) ధృతరాష్ట్రుని; ధృతి = (రా) ధైర్యము, (భా) ప్రీతి; తోరపు = అందమగు; తీరుల = బాణములను; పఱచె = పరువెత్తెను; అజ = బ్రహ్మ.

28, ఆగస్టు 2014, గురువారం

సమస్యా పూరణం – 1509 (పురుషుల ప్రాణముల)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
పురుషుల ప్రాణములఁ దీయఁ బుట్టిరి వనితల్.

పద్యరచన - 660 (శాపము)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశం...
“శాపము”

నిర్వచన భారత గర్భ రామాయణము – 67

రావిపాటి లక్ష్మీనారాయణ


రామాయణము-

సీ.     దశకంఠుఁ డల్గె; నా(తతబలాఢ్యుఁ డయిన

తగునేర్పరి యభిమ)తమునఁ బోయి

యమ్ము లక్షుండు నేయ, విటపి హనుమ ధ

(న్యుఁడు గ్రహించెను; ధృతి నుత్తరమును)

వాని కిచ్చె; నసుర(వరసుయోధనకృతి

పాండుసమాఖ్యునిఁ) బావని శర

ముల నొంచి మించె; సల్లలితధైర్యము దితి

(కొమరు లొందిరి; తమతమ బలముల)

గీ.     కొలఁదిఁ బోర, వాయుజుఁడు వారలను నొంచి

నేలఁ గలిపె నక్షకుమారుని; దనుజపతి

యంప హనుమంతుఁ బట్టెద నంచు నింద్ర

జిత్తు కత్తి నూఱుచు నేగె సేనతోడ. (౮౨)



భారతము-

ఆ.    తతబలాఢ్యుఁ డయిన తగునేర్పరి యభిమ

న్యుఁడు గ్రహించెను ధృతి నుత్తర; మును

వరసుయోధనకృతి పాండుసమాఖ్యుని

కొమరు లొందిరి తమతమ బలముల. (౮౨)



టీక- ధృతి = (రా) ధైర్యముతో, (భా) ప్రీతితో; ఉత్తరమును = (రా) జవాబు; (భా) ఉత్తర = ఉత్తర యను విరాటరాజ పుత్రికను, మును = ముందుగా; అసురవరసుయోధనకృతి = రాక్షసులలో మంచి యోధుఁడగు దిట్ట (అక్షకుమారుఁడు); పాండుసమాఖ్యుని = (రా) తెల్లనికీర్తి గలవానిని, (భా) పాండుడను పేరుగల రాజుయొక్క; బలముల = (రా) శక్తుల, (భా) సైన్యముల; విటపి = చెట్టు.

27, ఆగస్టు 2014, బుధవారం

నిషిద్ధాక్షరి - 6

నిరోష్ఠ్యంగా (ప,ఫ,బ,భ,మ అనే అక్షరాలను ఉపయోగించకుండా)
మద్యపానాన్ని మానుమని హితబోధ చేస్తూ
మీకు నచ్చిన ఛందంలో
పద్యం వ్రాయండి.

పద్యరచన - 659 (పెద్ద బాలశిక్ష)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశం...
“పెద్ద బాలశిక్ష”

నిర్వచన భారత గర్భ రామాయణము – 66


రావిపాటి లక్ష్మీనారాయణ

రామాయణము-
చం.      ఉఱికెఁ గపీంద్రుఁడున్ (హననయుక్తుఁడునై కొనె నా లసద్బ)లుం
డురుశిల వారిఁ దో(లుడు, సుయోధనదుష్టుఁడు లోఁచు చుత్త)రం
బుఱువుగ బంట్లబా(రుఁ గడు నొప్పుచుఁ గూడి పరుం గలంచి) యి
చ్చె; రిపునిఁ జంపి తా (మురిసె శ్రీని మరుద్వరపుత్రుఁ డంత)టన్. (౮౧)

భారతము-
గీ.         హననయుక్తుఁడునై కొనె నాల సద్బ
లుఁడు సుయోధనదుష్టుఁడు; లోచు నుత్త
రుఁ గడు నొప్పుచుఁ గూడి పరుం గలంచి
మురిసె శ్రీని మరుద్వరపుత్రుఁ డంత. (౮౧)

టీక- (రా) ఆ, లసద్బలుఁడు = మంచి బలముగలవాఁడు; (భా) ఆలన్ = ఆవులను, సద్బలుఁడు; సుయోధనదుష్టుఁడు = (రా) మంచియోధుఁడగు దుష్టుఁడు, (భా) దుర్యోధనుఁడను దుష్టుఁడు; ఉత్తరున్ = (భా) ఉత్తరుని; (రా) మరుత్ = దేవతల, వర = రాజు (ఇంద్రుని) పుత్రుఁడు (అర్జునుఁడు).

26, ఆగస్టు 2014, మంగళవారం

సమస్యా పూరణం – 1508 (కామదాసులైన)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కామదాసులైనఁ గలుగు ముక్తి
ఈ సమస్యను సూచించిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.

పద్యరచన - 658 (నవరాత్రి చందాలు)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశం...
“నవరాత్రి చందాలు”

నిర్వచన భారత గర్భ రామాయణము – 65


రావిపాటి లక్ష్మీనారాయణ

రామాయణము-
చం.    తమ(బల మొప్ప సైనికులు దక్షులు దానుఁ గడంగఁ బోయి, కొం
చు మమతఁ గో)ల లాకపినిఁ జూచిరి; మర్కటచేష్ట రాలబా
రు మి(వులఁ బట్ట నవ్వి రటు గ్రొవ్వి లలిన్; విడిపించి రంత భీ
మముఖులు వే)ల్పుగొంగలు నమందగతిం దమ తేజి పగ్గముల్. (౮౦)

భారతము-
కం.    బలమొప్పు సైనికులు ద
క్షులు దానుఁ గడంకఁ బోయి, కొంచు మమత గో
వులఁ బట్ట నవ్విరటుఁ గ్రొ
వ్వి లలిన్, విడిపించి రంత భీమముఖులు వే. (౮౦)

టీక- (రా) కోలలు = బాణములను; నవ్విరటు = అటుల నగిరి; (భా) అవ్విరటు = ఆ విరాటరాజును భీమముఖులు = (రా) భయంకరములగు ముఖములు గలవారు, (భా) భీముఁడు మొదలగువారు; వేల్పుగొంగలు = రాక్షసులు; తేజి = గుఱ్ఱపు; రాలబారు = రాళ్లసమూహము; ఉరుశిల = గొప్పరాతిని.

25, ఆగస్టు 2014, సోమవారం

దత్తపది - 40 (దెస-నస-పస-వెస)

కవిమిత్రులారా!
దెస - నస - పస - వెస
పై పదాలను స్వార్థంలో కాకుండా ఉపయోగిస్తూ మీకు నచ్చిన ఛందస్సులో
రామాయణార్థంలో పద్యం వ్రాయండి.

పద్యరచన - 657 (నానృషిః ...)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశం...
‘నానృషిః కురుతే కావ్యమ్’

నిర్వచన భారత గర్భ రామాయణము - 64


రావిపాటి లక్ష్మీనారాయణ

రామాయణము-
సీ.      శోధించి మైనాకు,  సురస సింహిక మించి,
లంకనుఁ బరిమార్చి లంకజొచ్చి
కన్నీరు మున్నీరుగా నేడ్చు క్ష్మాజనుఁ
గని, దశముఖుని జం కెనలను విని,
రాముక్షేమము దెల్పి, రమణి కొసఁగి యుంగ
రము రత్నమంది, వనము పెకల్చి,
వనపాలకులఁ దోలి, వక్త్రనాసాదులఁ
జదువ రావణుఁ డల్గి జంబుమాలి
గీ.      గురు(భుజబలము గల్గెడి యురుఖలు, జడు
పెఱుఁగని వలఁతిం, దులువను, హితు, సుశ)స్త్ర
మ(ర్మజితరిపుఁ, బనుపఁగ మహితగజహ
యరథభటులతోడఁ గదలె నతఁడు వే)గ. (౭౯)

భారతము-
కం.     భుజబలము గల్గెడి యురుఖ
లు, జడు పెఱుఁగని వలఁతిం, దులువను, హితు, సుశ
ర్మజితరిపుఁ, బనుపఁగ మహిత
గజహయరథభటులతోడఁ గదలె నతఁడు వే. (౭౯)

టీక- (రా) సుశస్త్ర = మంచి శస్త్రములయొక్క; మర్మ = మర్మమువలన; జిత = గెలువబడిన; రిపున్= శత్రువులుగలవానిని; మున్నీరు = సముద్రము; మహిత = ఎక్కువగు.

24, ఆగస్టు 2014, ఆదివారం

సమస్యా పూరణం – 1507 (వల్లకాడులో పెళ్ళి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
వల్లకాడులో పెళ్ళి సంబంధ మమరె.
ఈ సమస్యను సూచించిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

పద్యరచన - 656

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

నిర్వచన భారత గర్భ రామాయణము - 63

రావిపాటి లక్ష్మీనారాయణ
 
రామాయణము-
సీ.         అంగదు యువరాజు నవనీపు సుగ్రీవు
                                    గిష్కింధకుం జేసె క్షితిజమగఁడు
            (నుతబలుఁడు సుయోధనుఁడు, దాయ లసమాన
                                    చరిత వెలఁది యుండు క్ష్మాతలంబు)
            వెదకింపఁగా గోరి వేచి వర్షర్తు వం
                                    తమగువఱకు మహీధరచరులనుఁ
            (గోవిదస్తుతులను గురు భీష్మముఖులను
                                    రయము గూడఁగను నరసి కనుఁగొని)
గీ.         రండనుచుఁ బంపెఁ; గొని యుంగరంబు దక్షి
            ణమున కంగదాదులతో హనుమ యరిగి మ
            హేంద్రగిరి నుండు సంపాతి హితమున నభ
            మున కెగిరె గరుడునిఁ బోలి వనధి దాఁట. (౭౮)

భారతము-
ఆ.        నుతబలుఁడు సుయోధనుఁడు దాయ లసమాన
            చరిత వెలఁది యుండు క్ష్మాతలంబుఁ
            గోవిదస్తుతులను గురు భీష్మముఖులను
            రయము గూడఁగను నరసి కనుఁగొని. (౭౮)

టీక- సుయోధనుఁడు = (రా) మంచియోధుఁడు, (భా) దుర్యోధనుఁడు; (రా) దాయ = రావణుఁడు; లసమానచరిత = ఒప్పుచున్న చరిత్రగలది (సీత); (భా) దాయలు = పాండవులు; అసమానచరిత = సమానములేని చరిత్రగలది (ద్రౌపది); గురుభీష్మముఖులను = (రా) ఎక్కువ భయంకరములగు ముఖములు గలవారిని, (భా) ద్రోణుఁడు భీష్ముఁడు మొదలగువారిని.

23, ఆగస్టు 2014, శనివారం

జడ శతకం

జడశతకం
‘జ్యోతి వలబోజు’ గారు ఇలా తెలియజేస్తున్నారు.

శతక సాహిత్యంలో ఒక వినూత్న ప్రయోగం!
ఒకే రచయిత శతకం పూర్తి చేయకుండా పదిమంది మిత్రులతో శతకం వేస్తే ఎలా వుంటుంది .. బ్రహ్మాండంగా వుంటుంది.. కాదంటారా. అందరూ ఒకే అంశం అదే "జడ" మీద పద్యాలు అల్లితే వాటితో "జడ శతకం" తయారు చేసి ప్రచురించాలని "బ్నిం"గారు నిర్ణయించారు.
అందమైన 'కంద' పద్యాలతో రూపొందించే ఈ శతకాన్ని 'బ్నిం'తో పాటు మరి కొందరు కవులు, రచయితల పద్యాలు కలిపి సంయుక్తంగా అల్లాలనే ప్రయత్నంతోనే ఈ జడశతకం గ్రూపును ప్రారంభిస్తున్నాం.
కంద పద్య అభిమానులయిన కవులు ఒక్కొక్కరు 5 కి మించకుండా పద్యాలు రాయండి. మకుటం అవసరం లేదు కానీ 4 పాదాల్లో ఎక్కడో ఒక చోట 'జడ' అనే పదం రావాలి. ఎవర్నీ హర్ట్ చేయకుండా పద్యాలు రాయాలి సుమీ...
ఇంకా బోల్డు విశేషాలు ఉన్నాయి. ముందు ముందు మీరు ఈ ప్రాంగణంలోకి వస్తూ ఉండండి.
https://www.facebook.com/groups/1483014091957033/

కవిమిత్రులు పైలింకులో తమ పద్యాలను ప్రకటించవచ్చు. లేదా శంకరాభరణంలో వ్యాఖ్యగా పెట్టవచ్చు. ప్రారంభించండి.

న్యస్తాక్షరి - 1

కవిమిత్రులారా,
‘న్యస్తాక్షరి’ అనే క్రొత్త శీర్షికను ప్రారంభిస్తున్నాను. ఒక్కొక్క పాదంలో ఒక్కొక్క చోట ఫలానా అక్షరాలను ప్రయోగిస్తూ ఇచ్చిన అంశంపై అడిగిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయడం (అవధానంలో చెప్పడం) న్యస్తాక్షరి.
మిత్రులకు అవగాహన కోసం మేడసారి మోహన్ గారు అమెరికాలోని అట్లాంటాలో చేసిన అష్టావధానంలో నిర్వహించిన న్యస్తాక్షరిని ఇస్తున్నాను.
 

అడిగిన అంశం : సత్యభామ అలుక మత్తకోకిలలో..
మొదటి పాదం రెండవ అక్షరం ‘ఖ్య’, రెండవ పాదం పదునాల్గవ అక్షరం ‘చి’, మూడవ పాదం పదమూడవ అక్షరం ‘పా’, నాల్గవ పాదం మూడవ అక్షరం ‘త’.


 అవధాని గారు చెప్పిన పద్యం :
స‘ఖ్య’తన్‌ విడి సత్యభామ ప్రసన్నభావవిదూరయై
ప్రాఖ్యమూర్తిని కృష్ణదేవుని పాయ జూ‘చి’న వైనమున్‌
ముఖ్యమంచు దలంప వచ్చునె భూరి ‘పా’వనుడైన చిత్‌
సౌఖ్యతత్పరు పంకజాక్షుని సన్ను‘తిం’చుట యొప్పగున్‌.


ఇక మన మొదటి న్యస్తాక్షరి ఇది....
అంశం- సరస్వతీ స్తుతి.
ఛందస్సు- తేటగీతి.
మొదటిపాదం మొదటి అక్షరం ‘స’, రెండవ పాదం మూడవ అక్షరం ‘ర’, మూడవ పాదం తొమ్మిదవ అక్షరం ‘స్వ’, నాలుగవ పాదం పన్నెండవ అక్షరం ‘తి’.

పద్యరచన - 655

కవిమిత్రులారా,
ఈరోజు టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

నిర్వచన భారత గర్భ రామాయణము - 62

రావిపాటి లక్ష్మీనారాయణ
రామాయణము-
సీ. వారి మారుతి దెచ్చె బాస సల్పిరి రామ
            తరణిజు లొకరి కొకరునుఁ దోడు
    నీడలై మన; ధరణీజ గొంపోబడు
            చున్ ధర వైచిన సొమ్ము రాఘ
    వుఁడు గాంచె; సూర్యసుతుఁడు సెప్పెఁ దన్నుఁ బు
            రమునుండి తోలి యగ్రజుఁడు నైంద్రి
    (ఘన సింహబలుఁడు పైకొనుటను స్వరమణిఁ
            బావని, విని డాక బలిమితో)డ
గీ. రఘువరుఁడు దుందుభికళేబరంబు గోఁట
    మీటె సతతాళ్ళడచెఁ; జెట్టు చాటునుండి
    (గొనబుగను వాలి వీరుఁడు బనివడి నయ
    విరహితుఁ డగు వానినిఁ జదిపెన్) శరమున. (౭౭)

భారతము-
కం. ఘనసింహబలుఁడు పైకొను
      టను స్వరమణిఁ, బావని వినిడాక బలిమితో
      గొనబుగను వాలి వీరుఁడు
      బనివడి నయవిరహితుఁడగు వానినిఁ జదిపెన్. (౭౭)

టీక- ఐంద్రి = (రా) వాలి; సింహబలుఁడు = (రా) సింహమువంటి బలముగలవాఁడు, (భా) కీచకుఁడు; పావని = (రా) పావనమైనదానిని, (భా) భీముఁడు; వాలి = (భా) విజృంభించి; సతతాళ్ళను = ఏడు తాటిచెట్లను; పైకొనుటను = (రా) కవియుట, (భా) యత్నించుట; తరణిజుఁడు = సూర్యుని కుమారుఁడగు సుగ్రీవుఁడు; మనన్ = ఉండునట్లు; డాక = శౌర్యము.

22, ఆగస్టు 2014, శుక్రవారం

రేఫ రహిత శివధనుర్భంగము - 2

రేఫ రహిత శివధనుర్భంగము
తాడిగడప శ్యామల రావు

ద్వితీయ భాగము.

అన మెచ్చుకొని మహాముని గాధిసుతుడు
జననాథ యెనలేని ఘనచాప మిపుడు
గనకుండ మనసాగ దనుమాట నిజము
జలజాక్షు నకు దాని సత్వంబు జూడ
సభజూడ తన దైన సత్వంబు జూప
దానిని తెప్పింప దగునయ్య నీకు
నా విని జనకుడా నందంబు చెలగ
దైవదత్తంబైన నావింటి నంత
సభకు తెండని బంపె సమధిక బలుల
ఎనిమిది చుట్టుల పెనుబండి మీద
నిటలాక్షు చాపంబు నెలకొని యున్న
మణిగణాలంకృతమంజూష నపుడు
వేసట నా యైదు వేలమందియును
కొనితెచ్చి నిలుపగా జనకుని యెదుట
కనుగొని యొడయడు మునిమండనునకు
అద్దాని జూపించి అఖిల లోకేశు
పెద్ద చాపం బిదె యిద్దాని నెత్త
మానవనాథుల మాట యెందులకు
యక్షదనుజనాగు లక్షీణబలులు
దేవముఖ్యులకైన దీనిని బూని
వంచి గుణంబును బంధించ నలవె
యుత్కృష్టమగు వింటి నో మహాభాగ
గాధేయ మౌనిపుంగవ యింక దీని
తమ శిష్యులకు జూప దగునయ్య యనగ
కలువకన్నులవాడ ఘననీలవపుష
జలజాప్తఘనకులతిలక బాలేందు
మౌళి దాల్చిన యట్టి మహితచాపంబు
కన్నులపండువుగా కనవయ్య
యని ముని వేడుక నాన తీయగను
వినయాతిశయమున మునినాథునకును
జననాథునకును వందనములు చేసి
గజగమనంబున ఘనమైన విల్లు
శోభించుచుండు మంజూషను గదిసి
నడచిసవ్యంబుగా గడు భక్తి జూపి
ఓ శివచాపమా యుధ్ధతు డగుచు
వచ్చెను వీడని భావింపవలదు
శివుడన్న నాకుండు చిత్తంబు నందు
నిశ్చలంబై యుండు నిజమైన భక్తి
భవునదై యొప్పెడు బాణాసనంబు
పావనములయందు పావనమనుచు
భావించి వచ్చితి భవదీయమైన
తేజంబు నీక్షించ దీనికి నీవు
కోపించకుండగ గొంకెంచకుండ
నా యందు దయచూపి నన్ను నీ చెలిమి
గొననిమ్ము నా చేత గొననిమ్ము నిన్ను
నని చాల వినుతించి వినయంబు వెలయ
గడియలు విడిపించి ఘనమైన పెట్టె
తలుపు నల్లన దీసి తా గాంచెనపుడు
దివ్యశోభల నీను దేవుని విల్లు
ఠీవి నెగడు దేవదేవుని విల్లు
కని దాని ఘనశోభ కమలాక్షు డపుడు
మునిపతి జనపతు లను గని పలికె
కైలాసపతివింటి గంటి మీ వలన
దయతోడ దీనిని తాకు భాగ్యంబు
అనుమతించుడు ధన్యమగు నాదు జన్మ
మా పైన మీ దైన యానతి యున్న
వాంఛింతు గుణము నవశ్యంబు దొడుగ
బాణంబు సంధించు భావంబు గలుగు
పెద్దలు మీ జెప్పు విధము చేసెదను
మీ‌ పాదముల సాక్షి మునిగణనాథ
మీ పాదముల సాక్షి మిధిలాధినాథ
యనవిని మునిపతి జనపతు లపుడు
మిక్కిలి ముదమంది చక్కని పలుకు
పలికితి వయ్య నీ తలచిన యట్లు
శివుని చాపంబును చేబూన వయ్య
చక్కగా గుణమును సంధించ వయ్య
జయమస్తు శుభమస్తు జలజాక్ష యనగ
ధనువును వెస డాసి దాని మధ్యమున
జనపతియగు దశస్యందను పెద్ద
కొడుకు చేయిడి పైకి గొబ్బున లేపె
వేల మందికి కదుప వీలు కానట్టి
నీలగళుని విల్లు లీలగా నెత్తె
నెత్తుటయే యేమి ఈశాను దివ్య
చాపంబు గుణమున సంధించె వేగ
శింజిని నాపైన చెవిదాక లాగి
దినపతికులమౌళి కనువిందు చేయ
నంతలో వింతగా నంతకాంతకుని
పెనువిల్లు నడిమికి ఫెళ్ళున తునిసె
భూకంపమనునట్లు పుట్టిన ధ్వనికి
విలయమేఘధ్వానవిధమైన ధ్వనికి
మునిపుంగవుండన జనపతి యనగ
దినమణికులమణిదీపకు లనగ
చక్కగ నిలువంగ సభనున్న జనులు
వివశులై తక్షణం బవనిపై బడగ
తెలివిడి జనులకు గలిగెడి దాక
తాళి నృపాలుండు తాపసిం డాసి
ముకుళిత హస్తుడై మోదం బెసంగ
పలుకాడ దొడగెను పదిమంది వినగ
భగవానుడా నాదు భాగ్యంబు పండె
ఈ నాటి కొక జోదు నీశాను వింటి
నెత్తగా జాలిన యెక్కటి మగని
కన్నులపండువుగా చూడ గంటి
ఇనవంశమున నెంత ఘనుడుదయించె
ముక్కంటి పెనువిల్లు  తుక్కాయె నిపుడు
శివుని విల్లెత్త నా శివునకే తగును
శివుడు గా కున్న కేశవునకే తగును
కలనైన నూహింప గా దన్యు డొకడు
లీలగా కొని తన కేల నద్దాని
బేలపోవగ జేసె బెండు విధాన
నన్నట్టి దద్భుత మాయె మహాత్మ
ఇనకులపావను నెలమి సీతమ్మ
తనపతిగా గొని ధన్యయై వెలుగు
జనకుల కులయశంబును చాల నెగయు
ఘనబలశాలికై జనకుని బిడ్డ
వధువని పలికితి పంతంబు నెగ్గె
తమ యాన యగు నేని తద్దయు వేడ్క
నా యయోధ్యాపతి కతివేగముగను
సంగతి తెలుపగా సచివుల నిపుడు
పంపువాడను వివాహంపు వైభవము
నకు బిల్వ నంపెద నా పట్టణమున
అనవిని గాధేయు డమిత సంతుష్టు
డై మిధిలాధీశు నటు చేయ బంచె.

--oOo--

సమస్యా పూరణం – 1506 (అమ్మా యని పిలువగానె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
అమ్మా యని పిలువగానె యాగ్రహమందెన్.
ఈ సమస్యను పంపిన గోలి హనుమచ్ఛాస్త్రి గారికి ధన్యవాదాలు.

పద్యరచన - 655

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

నిర్వచన భారత గర్భ రామాయణము - 61

రావిపాటి లక్ష్మీనారాయణ

రామాయణము-
సీ. (క్షోణినాథసుతులు సోమముఖులు విరా)
        జిల్లుపంపఁ గనిరి; క్షితిజమగఁడు
    క్ష్మాజకొఱకు రాల్చెఁ గన్నీటిచుక్క దా
        (టు; నెఱిఁ దద్వనజవదననుఁ గృష్ణ)
    వేణి వెదకుచు, హా(విమలపల్లవపద
        భ్రమరాక్షి యజ్ఞాత) పాళి నుంటె?
    హాసతి నాకిప్పు డయ్యెను దినమొక్క
        (వత్సరమ్ము; కొలిచి రుత్సహించి)
గీ. తొల్లి దాసీజనము ని న్నతులితముగ ని
    పుడు వనట నొందితె యని రాముఁ డనుచుండె;
    బలమునకుఁ బట్టుకొమ్మల వారి వాలి
    పంపెఁ దనుఁ జంప నని భయపడె రవిజుఁడు. (౭౬)

భారతము-
ఆ. క్షోణినాథసుతులు సోమముఖులు విరా
    టు, నెఱిఁ దద్వనజవదననుఁ గృష్ణ
    విమలపల్లవపద భ్రమరాక్షి, యజ్ఞాత
    వత్సరమ్ము కొలిచి రుత్సహించి. (౭౬)

టీక- (రా) పంపన్ = పంపాసరోవరమును; కృష్ణవేణిన్ = నల్లనిజడగలదానిని; అజ్ఞాతపాళిన్ = తెలియబడని చోటునందు; (భా) తద్వనజవదనను = అతని భార్యను (సుధేష్ణను); కృష్ణ = ద్రౌపది; దాటు = గుంపు; వనట = దుఃఖము.

21, ఆగస్టు 2014, గురువారం

సమస్యా పూరణం – 1505 (శేషశయను పూజ)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
శేషశయను పూజ సేయరాదు.
ఈ సమస్యను పంపిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.

పద్యరచన - 654

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.