కావ్యములోని సాహిత్యపరమైన విశేషములు:
శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు పేర్కొనినట్లు యీ కావ్యము సరళముగా, సుబోధకముగా, సూక్తి సురభిళముగా అలరారుచున్నది. సుమారు 2,400 పద్యములు కల ఈ కావ్యములో 50 విధముల ఛందస్సులు గోచరించును. అనేకములగు విశేష వృత్తములు చాలా సందర్భములలో నుపయోగింప బడినవి.
ఉదా: స్రగ్ధర, మహాస్రగ్ధర, మేఘవిస్ఫూర్జితము, శిఖరిణి, సుగంధి, ఉత్సాహ, మత్తకోకిల, మొ.వి.
12 సంస్కృత శ్లోకములు వేదవాక్యములను అనుకరించు రీతిలో చదువరులకు ఆహ్లాదకరముగా గలవు.
అక్కడక్కడ కొన్ని శబ్దాలంకారములు, అర్థాలంకారములు కూడా కావ్యమునకు వన్నె తెచ్చునున్నవి. ఉదా: శ్లేషాలంకారము, ముద్రాలంకారము, ముక్తపదగ్రస్త అలంకారము మొ.వి.
శ్రీరామగీత అను జ్ఞానబోధ సంపూర్ణముగా ఒక 180 పాదముల సీసమాలికగా వ్రాయబడినది. కావ్యాంతములో కొన్ని గర్భ కవిత్వ రీతులు రేఖా చిత్రములతో చూపబడినవి.
శ్రీ కొంపెల్ల వేంకట రామ శాస్త్రి గారి అభిప్రాయములో "ఈ అధ్యాత్మ రామాయణములో సందర్భోచితమైన పద ప్రయోగములు, రసోచితమైన వృత్త విన్యాసాలు సహృదయులకు హృదయాలను రంజింపజేస్తాయి.
శ్రీ కోటమర్తి వేంకట నరసింహ మూర్తి గారి విశ్లేషణలో: ఇందలి రచనా వైవిధ్యము ఆదర్శప్రాయము. గ్రంథ పరిశీలనా విషయమున యథోచితముగా అడుగడుగునా ఎన్నో యెన్నెన్నో చిన్నెలు, వన్నెలు పాఠకలోకమునకు దృగ్గోచరమగుటయే గాక చర్విత చర్వణ స్థితికి గొంపోవును.
మనమార హితులు నాయం
దనురాగము జూపి మధురతర పదములతో
వినుతించి కృతిని స్పందన
మును దెలిపిరి వారి నెల్ల బొగడుదు వేడ్కన్
శ్రీరామచంద్ర! నీ సేవ భాగ్యంబని
వ్రాసితి నధ్యాత్మ రామ చరిత
నా బృహత్కార్యంబు నందాది నుండియు
చివరి దన్క ననేక శిష్టజనులు
సౌహర్దమలర ప్రోత్సాహమ్ము గూర్చుచు
నందించిరి సహాయ మాదరమున
నా రీతి బాసటయై నిల్చి నట్టి వా
రందర నెంతయు నభినుతింతు
వారిపై కరుణామృత వర్షధార
కురిసి కలిగింపుమో దేవ! కువలయమున
నఖిల సౌభాగ్యములు, జీవితాంత్యమందు
నీదు సాయుజ్యముక్తి నో నీరజాక్ష!
ఈ గ్రంథము వలయు వారికి ఉచితముగా పోస్టులో పంప బడును.
సంప్రదించవలసిన చిరునామా:
Nemani Ramajogi Sanyasi Rao
Plot No.HIG 33, Flat No.203,
Navya's Vijay Heights,
Marripalem Vuda Layout,
VISAKHAPATNAM - 530 009.
Phone: 0891 - 2565944, mobile: 94402 33175