చమత్కార పద్యాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
చమత్కార పద్యాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

20, ఏప్రిల్ 2017, గురువారం

చమత్కార పద్యం - 251

సీతా రావణ సంవాద ఝరి
 3 (-క +న)
ఈ శ్లోకంలో ‘క’ ను తీసి వేసి ఆ స్థానంలో ‘న’ ఉంచాలి

సీతే! శ్రీశ్చ వికాశితా ఖలు వధూ కామప్రియాంగస్య మే
దారిద్ర్యం పురి క ర్తితం గుణ గణైః కాలోచితప్రస్థితేః,
హా మాయాకర కామితాన్య లలనాలగ్నాంత రంగః ప్రియః
పాపాత్మన్! కలయే నసంగత మిదం సర్వం త్వదుక్తం వచః।।
ఉన్నది ఉన్నట్లుగా.....
రావణోక్తి:
సీతే = ఓ సీతా
వధూ కామ ప్రియాంగస్య = స్త్రీలకు మన్మథుని వలె సుందరుడనైన
మే = నాకు
శ్రీః = సంపద
వికాశితా = విప్పారినది
కాలోచిత ప్రస్థితేః = కాలాను గుణ్య ప్రయాణ సన్నాహము గల
మే = నా యొక్క
గుణగణైః = గుణ సమూహములతో
పురి = పట్టణమందు
దారిద్ర్యం కర్తితం = దరిద్రము నరికి వేయబడినది...అని రావణ కృత స్వస్తుతి!
అట్లే
ప్రియః = నీ ప్రియుడు
మాయాకర కామితాన్య లలనాలగ్నాంత రంగః = మాయావి పరకాంతలందు మనసు నిలుపు వాడు.... అని రామనింద
సీతా ప్రత్యుక్తి...
సర్వం త్వదుక్తం వచః = నీ పలుకంతయు
సంగతం నకలయే = సరియైనదిగా తలచను... అని సమాన్యార్థం
కలయే = క కారము లోపింపగా
నసంగతం = న కారముతో కూడినది అని సంకేతార్థము
క తీసి వేసి న ప్రతిక్షేపించగా
వధూనామ ప్రియాంగస్య = స్త్రీల కప్రియమగు శరీరము గల
మే = నా యొక్క
శ్రీః = సంపద
వినాశితా = నశింపజేయ బడినది!
నాలోచిత ప్రస్థితే = అనాలోచితముగా ప్రయాణము చేయు
మే = నా యొక్క
పురి = పట్టణమందు
దారిద్ర్యం నర్తితం = దరిద్రము నర్తించును
అని రావణ నిందగా మారింది
అట్లే
మాయానర నామితాన్య లలనాంత రంగః = లీలా మానుష విగ్రహుడు,పర స్త్రీలందు మనసు చేర్చని వాడు
ప్రియః = ప్రేమ పాత్రుడు... అని రామ స్తుతిగా పరిణమించింది.

(‘బంధకవిత్వం’ వాట్సప్ సమూహం నుండి శ్రీ వైద్యం వేంకటేశ్వరాచార్యులకు ధన్యవాదాలతో...)

19, ఏప్రిల్ 2017, బుధవారం

చమత్కార పద్యం - 250

సీతా రావణ సంవాద ఝరి
 2 (-వ)
భూజాతే! నవభూషణో భవవరోపేత స్సదా వర్జితా
కీర్త్యౌఘోఽహ మివాస్తి కః కృతపరావజ్ఞశ్చ లోకే నరః
ప్రాణానాం దయితం వనైక నిలయం సీతే, కుతో మన్యసే
వ్యాహారస్తవ నీచవారహిత ఇత్యేవావగచ్ఛామి రే!

గమనిక : ఈశ్లోకంలో 'వ'కారము చ్యావిత మగును
రావణోక్తి:
ఆత్మస్తుతి:
నవ భూషణః = నూతనాలంకారములు గలవాడను
భవవరోపేతః = ఈశ్వర వరములు కలిగిన వాడను
సదా వర్జితా కీర్త్యౌఘ = ఎప్పుడు అపకీర్తిచేరనీయని వాడను
కృత పరావజ్ఞః = శత్రువులకు అవమానము ఘటించు వాడను
అని రావణుని ఆత్మస్తుతి
3వపాదంలో
వనైక నిలయం = వనములోనే వుండు వాడు అని రామనింద!
సీతా ప్రత్యుక్తి:
రే నీచ = ఓ నీచుడా!
తవ వ్యాహారః = నీ పలుకు
నీచవార హితః = నీచులకు మాత్రమే హితమైనది .  . అని సామాన్యార్థం కలిగి
వా రహితః = 'వ'కారము లేనిది అని సంకేతం
వ కారం తీసేస్తే రావణుడి సంగతి చూడండి
న భూషణః = ఆభరణములు లేని వాడను
భరోపేతః = భూమికి భారమైన వాడను
సదార్జితా కీర్త్యౌఘః = ఎప్పుడూ చెడు కీర్తి సంపాదించుకొను వాడను . అని రావణుని ఆత్మనిందగా మారుతుంది
కృత పరాజ్ఞః = శత్రువుల ఆజ్ఞలను నెరవేర్చు వాడను
అనికూడా!
3వపాదంలో వ తీస్తే
నైక నిలయం = ఒక చోట కాక సర్వవ్యాపకుడు అని రామ స్తుతిగా పరిణమించింది!

(‘బంధకవిత్వం’ వాట్సప్ సమూహం నుండి శ్రీ వైద్యం వేంకటేశ్వరాచార్యులకు, శ్రీ కె. శేషఫణి శర్మ గారలకు ధన్యవాదాలతో...)

18, ఏప్రిల్ 2017, మంగళవారం

చమత్కార పద్యం - 249

సీతా రావణ సంవాదఝరి!
ఒక అద్భుత సంస్కృత కావ్యం
అశోక వృక్షం క్రింద వున్న సీత దగ్గరకు వచ్చిన రావణుడు రాముని నిందించడం ఆత్మస్తుతి చేసుకోవడం మొదటి మూడు పాదాల్లో వుంటుంది!
సీతఒరే మూర్ఖుడా! నీమాటలలో ఫలానా అక్షరాన్ని తీసేయ్!” అంటుంది. అంతే మొత్తం అర్థం మారిపోతుంది! రామనింద రామస్తుతిగా మారుతుంది! రావణుని ఆత్మస్తుతి స్వనిందగా మారుతుంది!
అద్భుతమైన 50 శ్లోకాలను వ్రాసిన వారు కర్నూలు జిల్లా ఔకు గ్రామవాసి కీ.శే. బచ్చు సుబ్బరాయగుప్త!
ఆంధ్ర టీకా తాత్పర్యం వ్రాసిన వారు కర్నూలు వాసి అష్టావధాని కీ.శే. పుల్లాపంతుల వేంకట రామ శర్మ!
వాటిని అలాగే పెట్టడానికి ప్రయత్నిస్తా!
(పై వాక్యాలన్నీ శ్రీ కె. శేషఫణి శర్మ గారివి)
 1  (_)
భూజాతేఽ లసమాన విగ్రహయుతః సీతేహ్యలర్కోపమః
భర్తా తే వికలస్వర స్వవదనో యుద్ధే చలశ్రీవృతః।
నిష్ణాతో లలనానురూప తను సంయుక్తో స్మ్యహం పాలనే
వాక్తే పాప! సదావిలేతి సుజనాః కే బ్రువంతి క్షితౌ!
 ........ఉన్నది ఉన్నట్టుగా చూస్తే
రావణోక్తి: రామనింద
అలసమాన విగ్రహయుతః = ప్రకాశించని విగ్రహము కలవాడు
అలర్కోపమః = పిచ్చి కుక్కతో సమానుడు
వికలస్వర స్వవదనః = నోరెత్తి మాటలాడలేనివాడు
చల శ్రీవృతః = సంపద తొలగినవాడు
రావణ ఆత్మస్తుతి:
పాలనే నిష్ణాతః = పాలనా దక్షుడను
లలనానురూప సంయుక్తః = స్త్రీలకు మనోహర సౌందర్యము కలవాడను
సీత ప్రత్యుక్తి.....
అవిలా = ఎప్పుడునూ కలుషమైనది (రావణునిమాట) అని సామాన్యార్థం
విశేషార్థం....
అవిలా = లకార రహితమైనది
 ....ఇప్పుడు అన్నింటా లకారాన్ని తీసివేసి చూద్దాం...
అసమాన విగ్రహయుతః = సాటి లేని శరీరము కలవాడు
అర్కోపమః = సూర్య సమానుడు
వికస్వర స్వవదనః = ప్రకాశించు కంఠధ్వని కలవాడు
శ్రీవృతశ్చ = సంపద్యుక్తుడు
అని రామస్తుతిగా మారింది
ఇక తీసేస్తే రావణుడేమైనడో చూడండి
నానురూప తను సంయుక్తః = అనర్హ శరీర యుతుడను
పానే నిష్ణాతః = మద్య పాన నిరతుడను
అని రావణ ఆత్మస్తుతి ఆత్మనిందగా మారింది
ఇంతటి అద్భుతాలు చేసిన కవులున్నారు! అటువంటి వారికి శిరసా నమామి!

(‘బంధకవిత్వం’ వాట్సప్ సమూహం నుండి శ్రీ వైద్యం వేంకటేశ్వరాచార్యులకు ధన్యవాదాలతో...)

9, ఫిబ్రవరి 2017, గురువారం

చమత్కార పద్యం - 248

ఇటీవల ద్రాక్షారామంలో తాతా సందీప్ శర్మ గారి అష్టావధానం జరిగింది. ఆ అవధానంలోని ఒక విశేషం...

24, జనవరి 2017, మంగళవారం

గమ్మత్తైన పద్యం

పూర్వం ఒక రామ భక్తుడు....  రాముడంటే వల్లమాలిన ప్రేమ. శివుడి పేరు ఎత్తడు.

ఒకసారి ఓ పండితుడి దగ్గరికి వెళ్లి "రోజూ చదువుకునేలా విష్ణువును గూర్చి ఒక శ్లోకం వ్రాసి ఇవ్వండి" అన్నాడు.

ఆ పెద్దాయనకీ తెలుసు ... ఇతడికి శివుడు అంటే పడదని. సరే ఒక కాగితం మీద మంచి శ్లోకం ఒకటి వ్రాసి ఇచ్చాడు.
"విష్ణువుని స్తుతిస్తూ వ్రాసాను. మీ విష్ణువు సంతోషిస్తాడు. చదువుకో" అంటూ.

గవీశపాత్రో నగజార్తిహారీ
కుమారతాతః శశిఖండమౌళిః। 

లంకేశ సంపూజితపాదపద్మః
పాయాదనాదిః  పరమేశ్వరో నః॥
ఆశ్చర్య పోయాడు చదవగానే.

అందులో ఏమని చెప్పబడింది? పరమేశ్వరః నః పాయాత్  అని. అంటే పరమేశ్వరుడు మనలను కాపాడు గాక అని అర్ధం . తక్కిన పదాలన్నీ ఆ పరమేశ్వరునికి  విశేషణాలు. అర్ధం చూడండి...

గవీశపాత్రః ... గవాం ఈశః  గవీశః .... ఆవులకు ప్రభువు అయిన వృషభం. అది వాహనం గా కలవాడు గవీశపాత్రః. అంటే సదాశివుడు.

నగజార్తి హారీ ... నగజ అంటే పార్వతీ దేవి ... ఆవిడ ఆర్తిని పోగొట్టిన వాడూ ... అంటే సాంబశివుడే. 

కుమారతాతః .... తాతః అనే సంస్కృత పదానికి తండ్రి అని అర్థం ... కుమారస్వామి యొక్క తండ్రి అయినవాడు శివుడే నిస్సందేహంగా.

శశిఖండ మౌళి: ... అంటే చంద్రవంక శిరసున ధరించిన వాడూ.

లంకేశ సంపూజిత పాద పద్మ: ... లంకాధిపతి అయిన రావణునిచే పూజింపబడిన పాదపద్మములు కలవాడూ. 

అనాదిః ... ఆది లేని వాడూ  ... అంటే ఆదిమధ్యాన్తరహితుడు అయినవాడూ,

అటువంటి పరమేశ్వరః నః పాయాత్ .... వృషభ వాహనుడూ, పార్వతీ పతి, కుమార స్వామి తండ్రీ, చంద్రశేఖరుడూ, రావణునిచే సేవింప బడిన వాడూ అనాది అయిన పరమేశ్వరుడు మనలను కాచు గాక అనేది తాత్పర్యం.

అర్ధం తెలియగానే మతి పోయింది. వ్రాసిన వాని మీద పిచ్చ కోపం వచ్చింది. అది పట్టుకుని తెగ తిరిగాడు.

చివరికి ఒకాయన "అది విష్ణువుని కీర్తించేదే ... ఏమీ అనుమానం లేదు" అని అతడిని ఓదార్చాడు.

ఇది మరో ఆశ్చర్యం.

అనాది అనే మాటలో ఉంది అంతా. కిటుకు చూడండి ....

పరమేశ్వరుడు ఎలాటివాడూ  అంటే అనాదిః అట. అంటే ఆది లేని వాడు. అంటే పరమేశ్వరలో ఆది అక్షరం లేనివాడు.
ఇప్పుడు ఏమయ్యింది? రమేశ్వరః అయ్యింది. అంటే లక్ష్మీపతి అయిన విష్ణువే కదా!

గవీశపాత్రః ... లో గ తీసెయ్యండి .. వీశపాత్రః అవుతుంది. విః  అంటే పక్షి అని అర్ధం. వీనామ్  ఈశః  వీశః ... పక్షులకు రాజు అంటే గరుడుడు, ఏతా వాతా గరుడ వాహనుడైన విష్ణువు.

నగజార్తి హారీ ... మొదటి అక్షరం తీసెయ్యండి .... గజార్తి హారీ ... గజేంద్ర మోక్షణము చేసిన విష్ణువు.

కుమారతాతః .... ఆది అక్షరం తీసేస్తే ... మారతాతః .... మన్మధుని తండ్రి అయిన విష్ణువు.

శశిఖండ మౌళి: ... మొదటి అక్షరం లేకపోతే శిఖండమౌళిః... నెమలిపింఛము ధరించిన విష్ణువు.  

లంకేశ సంపూజిత పాద పద్మ: ... మళ్ళీ ఆది లేనిదిగా చెయ్యండి ... కేశ సంపూజిత పాద పద్మ: ... క అంటే బ్రహ్మ, ఈశః అంటే రుద్రుడు ... అంటే బ్రహ్మ రుద్రేంద్రాదులు బాగుగా పూజించిన పాదపద్మములు కల విష్ణువు.

అతడు మనలను కాపాడు గాక ....
గరుడ వాహనుడూ, గజేంద్రుని ఆర్తిని పోగొట్టిన వాడూ, మన్మధుని తండ్రీ, నెమలి పింఛము దాల్చిన వాడూ, బ్రహ్మ రుద్రాదుల చేత పూజింపబడిన పాద పద్మములు కలవాడూ అయిన రమేశ్వరుడు .... విష్ణువు మనలను కాచు గాక అనే తాత్పర్యం .

ఇప్పటికి అతడు శాంతించాడు.

సమన్వయించుకోకపోతే జీవితాలు దుర్భరం ఔతాయి. సర్వదేవతలలో  విష్ణువుని దర్శించగలిగితే వాడు వైష్ణవుడు. సర్వ దేవతలలో శివుని  దర్శించగలిగితే వాడు  శైవుడు.  ఇది మన భారతీయ కవితా వైభవము.


విష్ణుభట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి
('అనంత్ మూగి' గారికి ధన్యవాదాలతో...)

21, అక్టోబర్ 2016, శుక్రవారం

చమత్కార పద్యాలు – 216/30


త్రింశదర్థ పద్యరత్నము పోకూరి కాశీపతి

ఆ.వె.
భూరి జఠర గురుఁడు నీరజాంబక భూతి
మహిత కరుఁ డహీన మణి కలాపుఁ
డలఘు సద్గణేశుఁ డగ్రగోపుఁడు మహా
మర్త్యసింహుఁ డేలు మనల నెపుడు.

30వ అర్థము వీరబ్రహ్మ స్మరణ    
                                                                          
భూరి జఠర = బ్రహ్మ యను పేరుగల,
గురుఁడు = దేశికుఁడైనవాఁడును,
నీరజాంబక భూతి = విష్ణువు యొక్క పుట్టువు గలవాఁడును (లేక) ఈశ్వరాంశ సంభూతుఁడును,
మహిత కరుఁడు = అతిశయము గలవాఁడును,
అహీన మణి కలాపుఁడు = గొప్ప మణిభూషలు గలవాఁడును,
అలఘు సద్గణేశుఁడు = ఘనతరమైన సాధుగణాధీశ్వరుఁ డైన వాఁడును,
అగ్ర గోపుఁడు = గోపాలకాగ్రణి యైనవాఁడును (గరిమరెడ్డి అచ్చమ్మ యింట ననుట) లేక ముందు వాక్కుల కధీశుఁడైనవాఁడును (అనగా నికముందు జరుగబోవు వాక్యములు గల స్వరచిత కాలజ్ఞానమున కనుట),
మహామర్త్యసింహుఁడు = మిక్కిలి మానవ శ్రేష్ఠుడైనవాఁడును (అగు వీరబ్రహ్మేంద్రుఁడు),
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక! 

* త్రింశదర్థ పద్యరత్నము సంపూర్ణం *


20, అక్టోబర్ 2016, గురువారం

చమత్కార పద్యాలు – 216/29


త్రింశదర్థ పద్యరత్నము పోకూరి కాశీపతి

ఆ.వె.
భూరి జఠర గురుఁడు నీరజాంబక భూతి
మహిత కరుఁ డహీన మణి కలాపుఁ
డలఘు సద్గణేశుఁ డగ్రగోపుఁడు మహా
మర్త్యసింహుఁ డేలు మనల నెపుడు.

29వ అర్థము విశ్వకర్మ స్మరణ     
                                                                          
భూరి జఠర గురుఁడు = కనకగర్భుని వంటి జగద్గురుడైనవాఁడును,
నీరజాంబక భూతి = అనలాక్షుని వంటి పుట్టువు గలవాఁడు (పంచముఖుఁడు),
మహిత కరుఁడు = అధికమైన (పది) చేతులు గలవాఁడు,
అహీన మణి కలాపుఁడు = ఘనతరమైన మణిభూషలు గలవాఁడును,
అలఘు సద్గణేశుఁడు = మిక్కిలి సాధు గణములకు అధ్యక్షుఁడైనవాఁడును,
అగ్ర గోపుఁడు = తొలిపల్కులకు (వేదములకు) అధీశుఁడైనవాఁడును,
మహామర్త్యసింహుఁడు = మిక్కిలి దేవతా శ్రేష్ఠుడైనవాఁడును (అగు విశ్వకర్మ),
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!

19, అక్టోబర్ 2016, బుధవారం

చమత్కార పద్యాలు – 216/28


త్రింశదర్థ పద్యరత్నము పోకూరి కాశీపతి

ఆ.వె.
భూరి జఠర గురుఁడు నీరజాంబక భూతి
మహిత కరుఁ డహీన మణి కలాపుఁ
డలఘు సద్గణేశుఁ డగ్రగోపుఁడు మహా
మర్త్యసింహుఁ డేలు మనల నెపుడు.

28వ అర్థము దత్తాత్రేయ స్మరణ
                                                                          
భూరి జఠర గురుఁడు = బ్రహ్మయే తాతగా గలవాఁడును (బ్రహ్మ సంతానమగు అత్రి కుమారుఁడైనందున),
నీరజాంబక భూతి = విష్ణువు యొక్క పుట్టుక గలవాఁడును (అనసూయ కోర్కె ప్రకారము విష్ణువు దత్తాత్రేయుఁడుగా గల్గినందున),
మహిత కరుఁడు = అధికమైన (త్రిముఖుఁ డైనందున ఆరు) చేతులు గలవాఁడును,
అహీన మణి కలాపుఁడు = ఘనమగు రత్నభూషలు గలవాఁడును (తన జాతకర్మోత్సవమున దేవతలు కానుకగా ఇచ్చిన రత్నభూషలు ధరించినందున),
అలఘు సద్గణేశుఁడు = అలఘుతరమగు సాధు గణముల కధ్యక్షుఁడైనవాఁడును,
అగ్ర గోపుఁడు = వేదవాక్య పరిపాలకుడైనవాఁడును,
మహామర్త్యసింహుఁడు = మిక్కిలి దేవతా శ్రేష్ఠుడైనవాఁడును (అగు దత్తాత్రేయుఁడు),
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!