31, అక్టోబర్ 2010, ఆదివారం

సమస్యా పూరణం - 139

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది
నైతిక విలువలను వీడి నాయకుఁ డయ్యెన్.
దీనిని పంపించిన దోర్నాల హరి గారికి ధన్యవాదాలు.

ప్రహేళిక - 22

ఎవరీ వ్యక్తి?
ఈనాటి ప్రహేళికను పంపించిన వారు మంద పీతాంబర్ గారు. వారికి ధన్యవాదాలు.
సీ.
ఫల్గుణుని ధ్వజముపై నుండు నేరాజు?
పోతన రాజైన ఖ్యాతి యేది?
విద్యతో పాటేది విధిగ నుండవలెను?
సరస మాడెడివాని సంజ్ఞ యేది?
స్తంభోద్భవుండైన శౌరి రూపం బేది?
అన్ని ప్రాణుల కేది యవసరమ్ము?
అలసిన డెందము లానందపడు నెట?
శాంతి చిహ్నఁపు పక్షి జాడ యేది?
తే.గీ.
నాలు గక్షరమ్ముల పద నర్తనమున
క్రమముగా ద్వితీయాక్షర గతిని గనిన
తెలుగు నామమ్ము ఢిల్లీకి తేజ మొసఁగ
ముఖ్యమంత్రి, ప్రధానియౌ ముఖ్యుఁ డెవఁడు?
ఆ ముఖ్యుడైన వ్యక్తి ఎవరో చెప్పండి.

ప్రహేళిక - 21 సమాధానం

ఈ దేవుడు ఎవరు?
ఆ.వె.
నలుమొగములవాని చెలువ యత్త కొడుకు
పగతు భార్య తండ్రి వైరి తనయు
బావ దాయఁ జంపువాని తండ్రి సుతుని
ప్రభువు మీ కొసంగు విభవములను.

సమాధానం - ఆ దేవుడు రాముడు.
వివరణ -
శ్రీ కోడీహళ్ళి మురళీ మోహన్ గారొక్కరే సరియైన వివరణతో సమాధానం చెప్పారు. వారి వ్యాఖ్యనే ఇక్కడ ప్రచురిస్తున్నాను. వారికి అభినందనలు. ధన్యవాదాలు.
నలుమొగములవాడు బ్రహ్మ
వాని చెలువ సరస్వతి
ఆమె అత్త లక్ష్మి
ఆమె కొడుకు మన్మథుడు
అతని పగతుడు శివుడు
అతనిభార్య పార్వతి.
ఆమె తండ్రి పర్వతుడు
అతని వైరి ఇంద్రుడు.
ఆతని తనయుడు అర్జునుడు.
అతని బావ కృష్ణుడు.
అతని దాయ(శత్రువు) జరాసంధుడు
అతని జంపువాడు భీముడు.
వాని తండ్రి వాయుదేవుడు.
అతని సుతుడు ఆంజనేయుడు.
అతని ప్రభువు శ్రీరామచంద్రుడు.
ప్రహేళికను పరిష్కరించే ప్రయత్నం చేసినవారు .....
మందాకిని గారు, నారాయణ గారు, మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారు, నేదునూరి రాజేశ్వరి గారు, చంద్రశేఖర్ గారు.
అందరికీ అభినందనలు.

30, అక్టోబర్ 2010, శనివారం

సమస్యా పూరణం - 138

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
ఖర పదముల మ్రొక్కినపుడె కలుగును సుఖముల్.

ప్రహేళిక - 20 సమాధానం

ఈ నగరం పేరేమిటి?
సీ.
కావ్య మంకిత మందఁగా మెచ్చు నెవ్వఁడు?
కోనేటి రాయని కొండ యేది?
నిదుర రానున్నటు లెది తెల్పు మనలకు?
ప్రహ్లాదమున కన్య పద మదేమి?
వంద పద్యములతో వరలెడి కృతి యేది?
వృషభ భుజమున కేది వేఱు పేరు?
బ్రహ్మ నాలుక పైన వసియించు నే కాంత?
నైరృతి దిగ్గజ నామ మేది?
తే.గీ.
అన్నిటికిఁ జూడ నాల్గేసి యక్షరమ్ము
లా పదమ్ముల రెండవ యక్షరముల
నుడువఁగ ననంత పద్మనాభుఁడు వెలసిన
నగరమై యొప్పుఁ జెప్పు డా నగర మేదొ.
వివరణ -
కావ్య మంకిత మందఁగా మెచ్చువాడు - కృతిపతి(భర్త)
కోనేటి రాయని కొండ -తిరుమల
నిదుర రానున్నట్లు మనలకు తెలిపేది - ఆవలింత
ప్రహ్లాదమున కన్య పదము - ఆనందము
వంద పద్యములతో వరలెడి కృతి - శతకము
వృషభ భుజమునకు వేఱు పేరు - మూపురము
బ్రహ్మ నాలుక పైన వసియించు కాంత - సరస్వతి
నైరృతి దిగ్గజ నామము - కుముదము.
కృతిపతి(భర్త) - తిరుమల - ఆవలింత - ఆనందము - శతకము - మూపురము - సరస్వతి - కుముదము
పై పదాల రెండవ అక్షరాలను చదివితే
సమాధానం - తిరువనంతపురము.
సమాధానాలు పంపినవారు
మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారు, మందాకిని గారు, మంద పీతాంబర్ గారు, టేకుమళ్ళ వెంకటప్పయ్య గారు, నారాయణ గారు, గన్నవరపు నరసింహమూర్తి గారు, నేదునూరి రాజేశ్వరి గారు, కోడీహళ్ళి మురళీమోహన్ గారు.
అందరికీ అభినందనలు.

ప్రహేళిక - 21

ఈ దేవుడు ఎవరు?
ఆ.వె.
నలుమొగములవాని చెలువ యత్త కొడుకు
పగతు భార్య తండ్రి వైరి తనయు
బావ దాయఁ జంపువాని తండ్రి సుతుని
ప్రభువు మీ కొసంగు విభవములను.

ఆ దేవుడు ఎవరో చెప్పండి

29, అక్టోబర్ 2010, శుక్రవారం

సమస్యా పూరణం - 137

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
బలరాముఁడు సీతఁ జూచి ఫక్కున నవ్వెన్.

ప్రహేళిక - 20

ఈ నగరం పేరేమిటి?
సీ.
కావ్య మంకిత మందఁగా మెచ్చు నెవ్వఁడు?
కోనేటి రాయని కొండ యేది?
నిదుర రానున్నటు లెది తెల్పు మనలకు?
ప్రహ్లాదమున కన్య పద మదేమి?
వంద పద్యములతో వరలెడి కృతి యేది?
వృషభ భుజమున కేది వేఱు పేరు?
బ్రహ్మ నాలుక పైన వసియించు నే కాంత?
నైరృతి దిగ్గజ నామ మేది?
తే.గీ.
అన్నిటికిఁ జూడ నాల్గేసి యక్షరమ్ము
లా పదమ్ముల రెండవ యక్షరముల
నుడువఁగ ననంత పద్మనాభుఁడు వెలసిన
నగరమై యొప్పుఁ జెప్పు డా నగర మేదొ.
ఆ నగరం పేరు చెప్పండి.

ప్రహేళిక - 19 సమాధానం

ఈ పదాలు ఏమిటో చెప్పండి
సీ.
కనులకు పెను వేదనను గూర్చు జబ్బేది?
శృంగారచేష్టకు గుర్తదేది?
వచ్చియు రానట్టి వరనిద్ర యేదది?
షడ్రుచు లం దామ్ల సామ్య మేది?
కాలి చివరి గుదికా లన నెయ్యది?
విస్తృతార్థ పదము విధ మదేమి?
మార్దవంబగు నూత్న మణికాంతి నేమండ్రు?
కోరికలను దెల్పుకొను మనండి.
తే.గీ.
అన్నిటికి జూడ మూడేసి యక్షరమ్ము
లీవ లావలనుండి పఠించి చూడ
నొక్క విధముగ నుండును చక్కగాను
యోచనము జేసి చెప్పఁగ నొప్పు నిపుడు.
సమాధానాలు -
కనులకు పెను వేదనను గూర్చు జబ్బు - కలక
శృంగారచేష్టకు గుర్తు - కులుకు
వచ్చియు రానట్టి వరనిద్ర - కునుకు
షడ్రుచు లం దామ్ల సామ్యము - పులుపు
కాలి చివరి గుదికా లనగా - మడమ
విస్తృతార్థ పదము విధము - విరివి
మార్దవంబగు నూత్న మణికాంతి - మిసిమి
కోరికలను దెల్పుకొను మనండి - కోరుకో
అన్నీ సరైన సమాధానాలు పంపినవారు ఒక్కరు కూడ లేరు. ఒకటి, రెండు తప్పులతో సమాధానాలు పంపినవారు ....
మంద పీతాంబర్ గారు, భమిడిపాటి సూర్యలక్ష్మి గారు, మందాకిని గారు, చంద్రశేఖర్ గారు, నేదునూరి రాజేశ్వరి గారు, మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారు, కోడీహళ్ళి మురళీ మోహన్ గారు.
అందరికీ అభినందనలు.

28, అక్టోబర్ 2010, గురువారం

సమస్యా పూరణం - 136

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
పచ్చి మాంసమ్ముఁ దినువాఁడు బ్రాహ్మణుండు.

ప్రహేళిక - 19

ఈ పదాలు ఏమిటో చెప్పండి
సీ.
కనులకు పెను వేదనను గూర్చు జబ్బేది?
శృంగారచేష్టకు గుర్తదేది?
వచ్చియు రానట్టి వరనిద్ర యేదది?
షడ్రుచు లం దామ్ల సామ్య మేది?
కాలి చివరి గుదికా లన నెయ్యది?
విస్తృతార్థ పదము విధ మదేమి?
మార్దవంబగు నూత్న మణికాంతి నేమండ్రు?
కోరికలను దెల్పుకొను మనండి.
తే.గీ.
అన్నిటికి జూడ మూడేసి యక్షరమ్ము
లీవ లావలనుండి పఠించి చూడ
నొక్క విధముగ నుండును చక్కగాను
యోచనము జేసి చెప్పఁగ నొప్పు నిపుడు.
ఆ పదా లేమిటో చెప్పండి.

27, అక్టోబర్ 2010, బుధవారం

సమస్యా పూరణం - 135

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
దీనిని సూచించిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.
పగటి పూట చంద్రునిఁ గనె పద్మనయన.

ప్రహేళిక - 18

ఈ నవల పేరేమిటి?
సీ.
బలవంతు నెదిరించు బలహీనుఁ డేమి గను?
విఘ్నములఁ దొలగించు వేలు పెవఁడు?
గుణ వాచకంబుగఁ గొనెడి శబ్దం బేది?
గోటి గిల్లుడు కెట్టి గుర్తు గలదు?
సరసిలో జన్మించు విరిని యేమందురు?
పంజాబునకు నేది ప్రాత పేరు?
తొలిసారి యిరువురి యెఱుక నేమందురు?
సంతానము నొసంగు సత్త్ర మేది?
తే.గీ.
అన్నిటికిఁ జూడ నైదేసి యక్షరమ్ము
లందు వరుసగా రెండవ యక్షరములఁ
జదువఁ దెలుఁగులో వచ్చిన మొదటి నవల
యనిన కీర్తి పొందిన గ్రంథమై యెసంగు.
ఆ గ్రంథం పేరేమిటి?

26, అక్టోబర్ 2010, మంగళవారం

సమస్యా పూరణం - 134

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
దీనిని సూచించిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.
జార చోరులఁ గీర్తించువారె ఘనులు.

25, అక్టోబర్ 2010, సోమవారం

సమస్యా పూరణం - 133

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
సంయమీంద్రుండు గోరెను సంగమమును.

24, అక్టోబర్ 2010, ఆదివారం

సమస్యా పూరణం - 132

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
దైవ మున్నదె సుతునకు తల్లికంటె.

ప్రహేళిక - 17 సమాధానం

చెప్పుకోండి చూద్దాం
సీ.
గణగణ మని మ్రోగఁగల వస్తు వది యేది?
భూమికి వెలకు పదం బదేమి?
మీనంబులను బట్ట మేటి సాధన మేది?
విష్ణ్వింద్రులకు నొక్క పేరదేమి?
నగజాత పతి వాహనం బనఁగ నెయ్యది?
నది కటునిటు నుండునది యదేమి?
భగవంతునిఁ దలంచి భక్తు లే మొనరింత్రు?
ఇడుములో "ఇ"ని తీయ నేమి మిగులు?
తే.గీ.
అన్నిటికిఁ జూడ రెండేసి యక్షరములు;
వరుస ప్రథమాక్షరమ్ముల నరసి చూడ
ఆంజనేయుఁడొ భీముఁడో యై తనర్చుఁ
నట్టి దెద్దియో తెలుపుడీ యంఘులార!
వివరణ -
గణగణ మని మ్రోగు వస్తు వది - గంట
భూమికి, వెల కొకే పద మగును - ధర
మీనంబులను బట్టు సాధనం బది - వల
విష్ణ్వింద్రులకు నొక్క పేరగును - హరి
నగజాత పతి వాహనం బగును - నంది
నది కటునిటు నుండునదేమొ - దరి
భగవంతునకు భక్తు లొనరించెదరు - నుతి
ఇడుములో "ఇ"ని తీయ మిగిలేది - డుము
గంట, ధర, వల, హరి, నంది, దరి, నుతి, డుము ... ఈ పదాల మొదటి అక్షరాలను చదివితే
సమాధానం .................. గంధవహ నందనుడు.
సరియైన సమాధానాలు పంపిన వారు ........
గన్నవరపు నరసింహ మూర్తి గారు, నారాయణ గారు, చంద్రశేఖర్ గారు, మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారు, మంద పీతాంబర్ గారు, కోడీహళ్ళి మురళీమోహన్ గారు, భమిడిపాటి సూర్యలక్ష్మి గారు, మందాకిని గారు, నేదునూరి రాజేశ్వరి గారు.
అందరికీ అభినందనలు.

23, అక్టోబర్ 2010, శనివారం

సమస్యా పూరణం - 131

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
సొర చెట్టున బీరకాయ సొంపుగఁ గాచెన్.

ప్రహేళిక - 17

చెప్పుకోండి చూద్దాం
సీ.
గణగణ మని మ్రోగఁగల వస్తు వది యేది?
భూమికి వెలకు పదం బదేమి?
మీనంబులను బట్ట మేటి సాధన మేది?
విష్ణ్వింద్రులకు నొక్క పేరదేమి?
నగజాత పతి వాహనం బనఁగ నెయ్యది?
నది కటునిటు నుండునది యదేమి?
భగవంతునిఁ దలంచి భక్తు లే మొనరింత్రు?
ఇడుములో "ఇ"ని తీయ నేమి మిగులు?
తే.గీ.
అన్నిటికిఁ జూడ రెండేసి యక్షరములు;
వరుస ప్రథమాక్షరమ్ముల నరసి చూడ
ఆంజనేయుఁడొ భీముఁడో యై తనర్చుఁ
నట్టి దెద్దియో తెలుపుడీ యనఘులార!
సమాధానం చెప్పండి.

ప్రహేళిక - 16 సమాధానం

ఇది ఏ విద్య?
సీ.
పతి నెల్లకాలముఁ బాయని దెవ్వరు?
శ్రీ విష్ణుదేవుని చెలువ యెవరు?
బలిభుక్కుగా పేరుఁ బడసిన దే పక్షి?
నియతితోఁ దపముఁ బూనిన దెవండు?
ఏది సమాధాన మెలమిఁ గోరుచునుండు?
మృగయా వినోద మే మగుఁ దెనుఁగున?
ఏడేండ్లు పీడించు నే గ్రహం బందఱను?
పాదచారులు దేని బారిఁ బడుదు?
తే,గీ.
రన్నిటికిఁ జూడ రెండేసి యక్షరములు
మొదటి యక్షరముల నన్ని చదివి చూడఁ
దనువులన్ మార్చు దివ్య విద్యగఁ దనర్చు
నట్టి దెద్దియో తెలుపుడీ యనఘులార!
వివరణ -
పతి నెల్లకాలమ్ము బాయనిది - పత్ని
శ్రీవిష్ణు దేవుని చెలువ యైనది - రమ
బలిభుక్కుగా పేరు బడసినది - కాకి
నియతితో తపము బూనినవాడు - యతి
మన సమాధానమ్ము కోరెడిది - ప్రశ్న
మృగయ వినోదమ్ము తెలుగులో - వేట
ఏడేండ్లు పీడించు నట్టి గ్రహమే - శని
పాదచారులను బాధించేది - ముల్లు
పత్ని, రమ, కాకి, యతి, ప్రశ్న, వేట, శని, ముల్లు .... ఈ పదాల మొదటి అక్షరాలను చదివితే
సమాధానం ...... పరకాయప్రవేశము.
సమాధానాలు పంపినవారు .............
గన్నవరపు నరసింహ మూర్తి గారు, భమిడిపాటి సూర్యలక్ష్మి గారు, డి. సుబ్రహ్మణ్యం గారు, నారాయణ గారు, మంద పీతాంబర్ గారు, మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారు, నేదునూరి రాజేశ్వరి గారు.
అందరికీ అభినందనలు.

22, అక్టోబర్ 2010, శుక్రవారం

సమస్యా పూరణం - 130

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
దీనిని సూచించిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.
కవివరుఁ గపితోడఁ బోల్చఁగా మెచ్చి రహో.

ప్రహేళిక - 16

ఇది ఏ విద్య?
సీ.
పతి నెల్లకాలముఁ బాయని దెవ్వరు?
శ్రీ విష్ణుదేవుని చెలువ యెవరు?
బలిభుక్కుగా పేరుఁ బడసిన దే పక్షి?
నియతితోఁ దపముఁ బూనిన దెవండు?
ఏది సమాధాన మెలమిఁ గోరుచునుండు?
మృగయా వినోద మే మగుఁ దెనుఁగున?
ఏడేండ్లు పీడించు నే గ్రహం బందఱను?
పాదచారులు దేని బారిఁ బడుదు?
తే,గీ.
రన్నిటికిఁ జూడ రెండేసి యక్షరములు
మొదటి యక్షరముల నన్ని చదివి చూడఁ
దనువులన్ మార్చు దివ్య విద్యగఁ దనర్చు
నట్టి దెద్దియో తెలుపుడీ యనఘులార!
ఆ విద్య ఏదో తెలియజేయండి.

21, అక్టోబర్ 2010, గురువారం

సమస్యా పూరణం - 129

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
గణనాయకు గళమునందు గరళము నిండెన్.

ప్రహేళిక - 15 సమాధానం

ఈ కవి ఎవరు?
సీ.
కవి తల్లజుఁడు వ్రాయఁ గలిగెడి దేమగు?
నీరేడు లోకాల కేది నెలవు?
చేప కన్నులది సంస్కృతములో నేమగు?
మనల నెయ్యది గమ్యమునకుఁ జేర్చు?
మూతిపై మొలిచెడి పురుష చిహ్నంబేది?
ప్రతిరోజు కేది పర్యాయ పదము?
ఈరోజు, నేడన నితర పదం బేది?
తూకమ్ము వేయు వస్తు వది యేది?
తే.గీ.
కాల సర్పమున్ జూచినన్ గలుఁగు నేది?
లెక్కపెట్టుట కే పద మక్కర పడు?
నన్నిటికిఁ జూడ మూడేసి యక్షరములు;
నడిమి యక్షరా లొక కవి నామ మగును.
గేయరూప వివరణ -
కవితల్లజుడు వ్రాయ గలుగు నట్టిది - కవిత
ఈరేడు లోకాల నెలవు కద - విశ్వమ్ము
చేపకన్నులది సంస్కృతములో - మీనాక్షి
మనల గమ్యమ్మునకు చేర్చునది - పథము
మూతిపై పురుష చిహ్నమ్ము - మీసమ్ము
ప్రతిరోజు పర్యాయ పదమగును - నిత్యము
ఈరోజు, నేడులకు ఇతర పదము - ఈనాడు
తూకమ్ము వేయుటకు వస్తువగు - తరాజు
కాలసర్పము జూడ కలిగేది - భయము
లెక్క పెట్టుటకు అక్కర పదము - గణన.
కవిత, విశ్వము, మీనాక్షి, పథము, మీసము, నిత్యము, ఈనాడు, తరాజు, భయము, గణన
ఈ పదాల నడిమి అక్షరాలను చదివితే .....
సమాధానం .......... విశ్వనాథ సత్యనారాయణ.
సమాధానాలు పంపినవారు ...
భమిడిపాటి సూర్యలక్ష్మి గారు, మంద పీతాంబర్ గారు, మందాకిని గారు, నేదునూరి రాజేశ్వరి గారు, గన్నవరపు నరసింహ మూర్తి గారు, కోడీహళ్ళి మురళీ మోహన్ గారు.
అందరికీ అభినందనలు.

20, అక్టోబర్ 2010, బుధవారం

సమస్యా పూరణం - 128

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
బోధించుట రాని గురువె పూజ్యుం డయ్యెన్.

ప్రహేళిక - 15

ఈ కవి ఎవరు?
సీ.
కవి తల్లజుఁడు వ్రాయఁ గలిగెడి దేమగు?
నీరేడు లోకాల కేది నెలవు?
చేప కన్నులది సంస్కృతములో నేమగు?
మనల నెయ్యది గమ్యమునకుఁ జేర్చు?
మూతిపై మొలిచెడి పురుష చిహ్నం బేది?
ప్రతిరోజు కేది పర్యాయ పదము?
ఈరోజు, నేడన నితర పదం బేది?
తూకమ్ము వేయు వస్తు వది యేది?
తే.గీ.
కాల సర్పమున్ జూచినన్ గలుఁగు నేది?
లెక్కపెట్టుట కే పద మక్కర పడు?
నన్నిటికిఁ జూడ మూడేసి యక్షరములు;
నడిమి యక్షరా లొక కవి నామ మగును.
ఆ కవి పేరు చెప్పండి.

ప్రహేళిక - 14 సమాధానం

ఊరి పేరేది?
ఆ.వె.
క్షితి, నెలతుక, మత్తు, కీటకమ్ము, సొరిది,
మోము మూడు వర్ణముల పదములు;
మొదటి యక్షరములఁ జదివినఁ దెలిసెడి
యూరి పేరుఁ జెప్పువార లెవరు?

క్షితి = అవని, నెలతుక = మగువ, మత్తు = లాహిరి, కీటకమ్ము = పురుగు, సొరిది = రయము, మోము = ముఖము
అవని, మగువ, లాహిరి, పురుగు, రయము, ముఖము ... ఈ పదాల మొదటి అక్షరాలను చదివితే
సమాధానం .......... అమలాపురము.
సమాధానాలు పంపినవారు ....
భమిడిపాటి సూర్యలక్ష్మి గారు, మంద పీతాంబర్ గారు, షేక్ రహంఆనుద్దిన్ గారు, గన్నవరపు నరసింహ మూర్తి గారు.
అందరికీ అభినందనలు.

19, అక్టోబర్ 2010, మంగళవారం

సమస్యా పూరణం - 127

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
దీనిని పంపించిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.
యతి విటుఁడు గాకపోవునే యతివ బిలువ.

ప్రహేళిక - 14

ఊరి పేరేది?
ఆ.వె.
క్షితి, నెలతుక, మత్తు, కీటకమ్ము, సొరిది,
మోము మూడు వర్ణముల పదములు;
మొదటి యక్షరములఁ జదివినఁ దెలిసెడి
యూరి పేరుఁ జెప్పువార లెవరు?

ఆ ఊరి పేరు చెప్పండి.

ప్రహేళిక - 13 సమాధానం

ఏ రాగమో యిది?
తే.గీ.
జుట్టుముడి, జాలకము, వన్నె, జోగి, యగ్గి
ద్వ్యక్షర పదాలు; వాని యాద్యక్షరములఁ
జదువ సంగీతమున నొక్క చక్కనైన
రాగమై యొప్పుఁ దెల్పుడా రాగ మేదొ.

జుట్టుముడి = శిఖ, జాలకము = వల, వన్నె = రంగు, జోగి = జటి, అగ్గి = నిప్పు
శిఖ, వల, రంగు, జటి, నిప్పు .... ఈ పదాల మొదటి అక్షరాలను చదివితే
సమాధానం ............. శివరంజని.
సరియైన సమాధానం పంపిన వారు ...
కోడీహళ్ళి మురళీమోహన్ గారు, గన్నవరపు నరసింహ మూర్తి గారు, మంద పీతాంబర్ గారు, నేదునూరి రాజేశ్వరి గారు.
అందరికీ అభినందనలు.

18, అక్టోబర్ 2010, సోమవారం

సమస్యా పూరణం - 126

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
పంచ పాండవులనఁ బదుగురు కద!

వారాంతపు సమస్యా పూరణం - 13

కవి మిత్రులారా,
ఈ వారాంతానికి పూరించ వలసిన సమస్య ఇది .....
సీతా మానస చోరుఁ డెవ్వఁ డనినన్ శ్రీకృష్ణమూర్తే కదా!

ప్రహేళిక - 13

ఏ రాగమో యిది?
తే.గీ.
జుట్టుముడి, జాలకము, వన్నె, జోగి, యగ్గి
ద్వ్యక్షర పదాలు; వాని యాద్యక్షరములఁ
జదువ సంగీతమున నొక్క చక్కనైన
రాగమై యొప్పుఁ దెల్పుడా రాగ మేదొ.

ఆ రాగం పేరు చెప్పండి.

గళ్ళ నుడి కట్టు - 63


అడ్డం
1. సద్యోగాలు కల నౌకరులు (4)
3. వ్యవసాయం పరిహారం కోరితే వాడుక (4)
7. గ్రామ సింహం (2)
8. గోదారి లాంటి రాజమార్గం (3)
9. సంస్థానం లాంటి కార్పోరేషన్ (2)
12. కత్తెర వేసే నక్షత్రం (3)
13. కంటకాకీర్ణమైన క్షామం (3)
17. సూర్యుని భార్యల్లో ఒకరు. వరిష్ఠమైన ధాన్యం (2)
18. కట్టుబాటు, సన్మానం. కావాలంటే సునిల్ లేటెస్ట్ సినిమా చూడండి (3)
19. పీక పిసికి వేయాలనే కోపం (2)
22. నియంత మాత్రమే గణన చేసే అడ్డగింపు (4)
23. పేక దరి చేరకండి. మిగిలేది దారిద్ర్యం (4)
నిలువు
1. తక్షకుని శత్రువు. పైల మహర్షి శిష్యుడు (4)
2. బాగున్నదీ కూన (2)
4. దేవుడు తీర్చే కోరికే శ్రేష్ఠం (2)
5. పాతకాలపు సినీ నటులు ఈ స్టేజీ నుంచే వచ్చినవారు (4)
6. గోతాముల్లో పెట్టిన సరుకు నిల్వ ఉండే గోడౌన్ (3)
10. ఒక తిత్తిని వేడి చేస్తే వచ్చే పీడనం (3)
11. సంఘటనంలో సంఘటన (3)
14. కచుని ప్రేమించిన శుక్రుని బిడ్డ (4)
15. పనికోసం వచ్చినవాడు (3)
16. నాణ్యత కాసింతైనా దొరకంది. లో స్టాండర్డ్ (4)
20. ఏమాత్రము గుణం లేనిదా ఈ మందు గోళీ (2)
21. తుమ్మెద ఆద్యంతాలు చూస్తే మిగిలింది చివర (2)

17, అక్టోబర్ 2010, ఆదివారం

ప్రహేళిక - 12 సమాధానం

ఈయన ఎవరు?
ఆ.వె.
సారె, బిలము, విజయ, మీరసమ్మును, స్నేహ
మనఁగ త్ర్యక్షరమ్ము; లందు నడిమి
యక్షరములఁ జదువ నగు నొక్క పేరు వ్యా
కరణమును రచించి ఘనతఁ గనెను.

సారె = పాచిక, బిలము = కన్నము, విజయము = జయము, ఈరసమ్ము = అసూయ, స్నేహము = కూరిమి
పాచిక, కన్నము, జయము, అసూయ, కూరిమి ... ఈ పదాల నడిమి అక్షరాలను చదినితే
సమాధానం .... చిన్నయసూరి.
సమాధానం పంపిన వారు ....
కోడీహళ్ళి మురళీమోహన్ గారు, మందాకిని గారు, చంద్రశేఖర్ గారు, మంద పీతాంబర్ గారు, గన్నవరపు నరసింహ మూర్తి గారు, భమిడిపాటి సూర్యలక్ష్మి గారు, అజ్ఞాత గారు, నేదునూరి రాజేశ్వరి గారు.
అందరికీ అభినందనలు, విజయదశమి శుభాకాంక్షలు.

దసరా శుభాకాంక్షలు

"శంకరాభరణం"
బ్లాగు వీక్షకులకు, మార్గదర్శకులకు, కవి మిత్రులకు, హితులకు
విజయదశమి శుభాకాంక్షలు!
వశమయ్యె మీదు స్నేహము
యశమును గడియించె "శంకరాభరణము" బ్లా
గ్యశ కారకులార! విజయ
దశమి శుభాకాంక్షలివె సదా మీ హితుఁడన్.

కంది శంకరయ్య.
దసరా శుభాకాంక్షలు
శంకరాభరణమే సాహిత్య మణి రత్న
మాలయై శోభాయమాన మయ్యె ,
పూర్వ కవీంద్రుల భూరికావ్యము లోని
పద్యచమత్కృతి ప్రాభవాలు
పదపదంబున దాగి పరికించు మనిగోరు
ఆ ప్రహేళికలపై ఆశలూరు
పూరణ చరణాల పూరణల్ సవరించి
పూర్ణత జేకూర్చు పూజ్య గురువు
దత్తపదు లెన్నొ మాలలో దాగియుండు
గళ్ళనుడి కట్టు పదరీతి గతులదెలుపు
ఎన్నగా జూడ భాషకు వన్నె గూర్చ
సఫల మయ్యారు గురువు శ్రీ శంకరయ్య !.

గన్నవరపు మూర్తి మిన్నగా జెప్పును
చంద్ర గారు జెప్పు చక్క గాను ,
నేదునూరి వారు నేర్పుగా చెబుతారు,
అంద రికిని దసర వంద నములు .


యీ బ్లాగులో పాల్గొంటున్న , వీక్షిస్తున్న మిత్రు లందరికి
వి జ య ద శ మి శుభాకాంక్షలు .
మంద పీతాంబర్
ధన్య వాదములు. పీతాంబర్ గారు." మీ వందనములకు అభినందనములు.' అందరికి విజయ దశమి శుభా కాంక్షలు.గురువులు,బహుముఖ ప్రజ్ఞాశాలి ' శంకరయ్య గారికి ప్రత్యేకాభి నందనలు.
ప్రీతి తోడ జెపును పీతాంబరు గారు
గన్నవరపు జెప్పు గగన మెరుపు
చంద్ర గారు జెప్పు చంద్రుని వెలుగంత
సరస గతిని నేర్పు శంకర గురువర్య.
వందనమ్ము లివియె యందుకొను మందరు
దోస మెంచ వలదు దశమి గనుక

రాజేశ్వరి నేదునూరి

16, అక్టోబర్ 2010, శనివారం

సమస్యా పూరణం - 125

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
దీనిని సూచించిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.
కాంక్ష లుండవు ప్రజలకుఁ గలి యుగమున.

ప్రహేళిక - 12

ఈయన ఎవరు?
ఆ.వె.
సారె, బిలము, విజయ, మీరసమ్మును, స్నేహ
మనఁగ త్ర్యక్షరమ్ము; లందు నడిమి
యక్షరములఁ జదువ నగు నొక్క పేరు వ్యా
కరణమును రచించి ఘనతఁ గనెను.

ఈయన ఎవరో చెప్పండి.

ప్రహేళిక - 11 సమాధానం

ఈ గ్రంథం ఏమిటి?
ఆ.వె.
ధవుఁడు, మాల, బరువు, తరళమ్ము, తృప్తి, వా
ర్ధక్య మను పదములు త్ర్యక్షరములు;
మొదటి యక్షరములఁ జదివినఁ దెలిసెడి
గ్రంథమేదొ తెలుపఁ గలరె మీరు?

ధవుడు = మగడు, మాల = హారము, బరువు = భారము, తరళము = రత్నము, తృప్తి = తనివి, వార్ధక్యము = ముదిమి.
మగడు, హారము, భారము, రత్నము, తనివి, ముదిమి పదాల మొదటి అక్షరాలను చదివితే
సమాధానం .... మహాభారతము.
సరియైన సమాధానాలు పంపినవారు .....
చంద్రశేఖర్ గారు, గన్నవరపు నరసింహ మూర్తి గారు, టేకుమళ్ళ వెంకటప్పయ్య గారు, అన్వేషి గారు, మంద పీతాంబర్ గారు, మందాకిని గారు, భమిడిపాటి సూర్యలక్ష్మి గారు, నేదునూరి రాజేశ్వరి గారు
అందరికీ అభినందనలు.

గళ్ళ నుడి కట్టు - 62


అడ్డం
2. ఈ నాయకుడు చేనేతగాడా? (2)
4. దేవుడి భార్య (2)
5. కళంకం (2)
6. కాల్చేసే దప్పిక (2)
8. పడవ (3)
9. గింజ, విత్తనం (2)
10. సపత్ని (3)
12. ఆముదం చెట్టు. వ్రణ హంత కదా! (3)
15. సంతానం (2)
16. శకుని సోదరి (3)
18. దుర్యోధనుడి కిది మాయసభ (4)
21. మల్లుడు తల తెగి తిరగబడ్డాడు (2)
23. వక్రం, వైపు (2)
25. ఎర్రదనం (4)
28. కనకములో అట్నుంచి "చూడము" (3)
30. కాల్చబడినది (2)
31. సాధించడం (3)
32. లెక్కల శాస్త్రం (3)
34. ఆహా! యింతటిదా సుఖం (2)
35. రంగరించి రంగులు వేసేవాడు (3)
36. తులలో తూస్తే సమానం (2)
38. ఆపరాని కార్యం (2)
39. సమభాగం. ఫిఫ్టీ - ఫిఫ్టీ (2)
40. నెమ్మదించిన మనస్సు (2)
నిలువు
1. విరాళం (2)
3. ఒక నది. సూర్యుని కూతురు (3)
4. భీష్ముడి అసలు పేరు (5)
5. మైకం (2)
7. మరాళం (2)
9. పక్షి (3)
11. పోవలసిందే సకుటుంబంగా బ్రతుకు తెరువు కోసం పరదేశానికి (3)
13. మార్గం (2)
14. భాగమతి ఒక మహిళ (2)
17. భూమి (3)
19. ఒక నది. ఇదీ సూర్య పుత్రికే (3)
20. పుట్టుక, సంసారం, ప్రపంచం (2)
22. "ఆమ్యామ్యా" అన్న నటుని ఇంటి పేరు క్రిందినుండి (2)
24. యుద్ధ ప్రదేశం (5)
26. శ్రీకృష్ణుని పట్ట మహిషి (3)
27. మేఘం (2)
28. నాసిక (2)
29. కటికవాడు (3)
32. గొప్పదనం. అష్టైశ్వర్యాలలో ఒకటి (3)
33. ఉత్సవాలలో ఆనవాయితీగా చేసే కార్యక్రమం. వితంతువును అడగండి (2)
34. కీడు (2)
37. ధర తలక్రిందయింది

15, అక్టోబర్ 2010, శుక్రవారం

సమస్యా పూరణం - 124

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
దీనిని సూచించిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.
భార్య లిద్దరు శ్రీరామభద్రునకును.

ప్రహేళిక - 11

ఈ గ్రంథం ఏమిటి?
ఆ.వె.
ధవుఁడు, మాల, బరువు, తరళమ్ము, తృప్తి, వా
ర్ధక్య మను పదములు త్ర్యక్షరములు;
మొదటి యక్షరములఁ జదివినఁ దెలిసెడి
గ్రంథమేదొ తెలుపఁ గలరె మీరు?

ఆ గ్రంథం పేరు చెప్పండి.

ప్రహేళిక - 10 సమాధానం

ఇతడెవరు?
తే.గీ.
గౌరి, ధనము, ననంతుఁడు, కత్తి, పసిడి,
డుల్లచేయుట యనునట్టి యెల్ల పదము
లమరు మూడక్షరంబుల నందు మొదటి
యక్షరంబులఁ జదివిన నభవుఁ డగును.

గౌరి = చండిక, ధనము = ద్రవ్యము, అనంతుడు = శేషుడు, కత్తి = ఖడ్గము, పసిడి = రుక్మము, డుల్లచేయుట = డులుచు
చండిక, ద్రవ్యము, శేషుడు, ఖడ్గము, రుక్మము, డులుచు .... ఈ పదాల మొదటి అక్షరాలను చదివితే
సమాధానం .............. చంద్రశేఖరుడు.
సమాధానం పంపింది కేవలం గన్నవరపు నరసింహ మూర్తి గారొక్కరే. వారికి అభినందనలు.

14, అక్టోబర్ 2010, గురువారం

సమస్యా పూరణం - 123

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్యను హరి దోర్నాల గారు పంపించారు. వారికి ధన్యవాదాలు.
ఆదాయపు పన్నుఁ గట్టె నచ్చెరు వొందన్.

చమత్కార పద్యాలు - 48

ప్రహేళికా చాటు పద్యం
సీ.
ధరణిపుత్రుని పినతల్లి తమ్ముని సుతు
తాత యల్లుని రాణి తండ్రి కొడుకు
కొడుకు తండ్రికి తండ్రి కోడలి సుతు బంటు
కరియైనవా నబ్బ కగ్రసుతుని
తమ్ముని యేలిక తండ్రి వియ్యంకుని
కూతు నేర్పునఁ జెరగొన్నవాని
తనయుని ద్రుంచిన ఘను నౌషధముఁ దెచ్చు
వా నయ్య సుతుని తద్వరకుమారు
తే.గీ.
నవ్వ కోడలి కోడలి యన్న తండ్రి
భామయొద్దను కొలువున్న భామ జనకు
తనుయుచేతను గూలిన ఘనుని తల్లి
ధరుఁడు మీ కిచ్చుఁ బుత్రపౌత్రాభివృద్ధి.
- అజ్ఞాత కవి
ఇత డెవరో వివరించగలరా?

ప్రహేళిక - 10

ఇతడెవరు?
తే.గీ.
గౌరి, ధనము, ననంతుఁడు, కత్తి, పసిడి,
డుల్లచేయుట యనునట్టి యెల్ల పదము
లమరు మూడక్షరంబుల నందు మొదటి
యక్షరంబులఁ జదివిన నభవుఁ డగును.

అతడెవరో చెప్పండి.

ప్రహేళిక - 9 సమాధానం

ఏమిటి సమాధానం?
ఆ.వె.
పాలకడలి పైనఁ బవళించు నెవ్వఁడు?
కనులు మేని నిండఁ గలుఁగు నెవఁడు?
ప్రాక్కుధరము పైనఁ బ్రభవించువాఁ డెవం
డొకటె యన్నిటికిని యుత్తరంబు.

పాలకడలి పైన పవళించే వాదు విష్ణువు, మేనినిండ కనులున్నవాడు ఇంద్రుడు, తూర్పుకొండపై పొడసూపేవాడు సూర్యుడు. వీరందరికీ "హరి" అనే పర్యాయపదం ఉంది. "హరి" శబ్దానికి "విష్ణువు, ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, యముడు, సిమ్హము, కోతి, పాము మొదలైన నానార్థా లున్నాయి. కాబట్టి పై ప్రహేళికకు
సమాధానం ......... హరి
గన్నవరపు నరసింహ మూర్తి గారొక్కరే సరైన సమాధానం చెప్పారు. వారికి అభినందనలు.
ప్రయత్నించిన వాళ్ళు భమిడిపాటి సూర్యలక్ష్మి, మంద పీతాంబర్, చంద్రశేఖర్, నేదునూరి రాజేశ్వరి గారలు.

13, అక్టోబర్ 2010, బుధవారం

దత్త పది - 8

కవి మిత్రులారా,
నయా, కియా, దియా, గయా
పై పదాలను ఉపయోగించి మీకు నచ్చిన ఛందస్సులో ఇష్టదైవ ప్రార్థన వ్రాయండి.

గళ్ళ నుడి కట్టు - 61


అడ్డం
1. అందరికి అతనంటే జంకు చూడు. ఇంకెవరు? యముడు (4)
3. అతను క్షాత్రానుకూలాభరణం ధరించాడు. అదే కవచం (4)
7. రాజుగారి భార్య రాగిణిని ఏమంటారు? (2)
8. ఇంకా ఈ రణం అంతం కానందుకు ఏమిటి హేతువు? (3)
9. జింక (3)
12. సొటసొట బడి గుమ్ముగా ఉందీ సౌందర్యం (3)
13. పాలను ఇచ్చేది (3)
17. ఇడ్లీ కోసం ఈ అపనింద పడాలా? (2)
18. పలు విధాల తలరాతలు రాసే బ్రహ్మ (3)
19. చేకూరి రామారావు. ఈయన రాతలు ప్రసిద్ధం (2)
22. పడమటి కొండ (4)
23. తండ్రి నుండి సంపాదించుకున్నది (4)
నిలువు
1. దుర్యోధనుడు కర్ణుడి కిచ్చిన కొత్త పేరు (4)
2. రాశి. సున్నా చేర్చితే చిత్తూరు జిల్లలోని ఇక అసెంబ్లీ నియోజకవర్గం (2)
4. చేదబావి. వెనుక గొయ్యి (2)
5. కరణం రాసిన వ్యాఖ్యలో గ్రామర్ తలక్రిందయింది (4)
6. ఎదతో నడిచే పాము (3)
10. సంపాదన కోసం బడికి రా (3)
11. దురదృష్టం వల్ల దరి జేరిన కండూతి (3)
14. గాలివాటంగా పడవను తీసుకు వెళ్ళేది (4)
15. మేటి ధారణాశక్తితో విలసిల్లే ధీమంతుడు (3)
16. ఆద్యంతాలు వంద ఉన్న బాణం దెబ్బ (4)
20. మేనమామలు మీరు కారు, వారు కారు, మరి .........? (2)
21. హిత మంత్రాలతో రక్షించే వాడు తలక్రిందయ్యాడు (2)

ప్రహేళిక - 9

ఏమిటి సమాధానం?
ఆ.వె.
పాలకడలి పైనఁ బవళించు నెవ్వఁడు?
కనులు మేని నిండఁ గలుఁగు నెవఁడు?
ప్రాక్కుధరము పైనఁ బ్రభవించువాఁ డెవం
డొకటె యన్నిటికిని యుత్తరంబు.

సమాధానం చెప్పండి.

ప్రహేళిక - 8 సమాధానం

ఇది ఏమిటి?
తే.గీ.
తోక, నాగలి, మకరమ్ము, తూతకొమ్ము
పలుక మూడక్షరమ్ముల పదము లందు
మొదటి యక్షరమ్ములఁ జూడఁ బోను రాను
సాధనం బగు నది యేది? సాధుశీల!

(తూతకొమ్ము = పిల్లనగ్రోవి)
తోక = వాలము, నాగలి = హలము, మకరము = నక్రము, తూతకొమ్ము = మురళి.
వాలము, హలము, నక్రము, మురళి ... పదాల మొదటి అక్షరాలను చదివితే
సమాధానం ..... వాహనము.
సమాధానాలు పంపినవారు -
మందాకిని గారు, గన్నవరపు నరసింహ మూర్తి గారు, మిట్టపెల్లి అమల గారు, నేదునూరి రాజేశ్వరి గారు, పద్మ గారు, మిస్సన్న గారు, టేకుమళ్ళ వెంకటప్పయ్య గారు.
అందరికీ అభినందనలు.

12, అక్టోబర్ 2010, మంగళవారం

సమస్యా పూరణం - 122

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
భూతములకు మ్రొక్కెఁ బురహరుండు.

ప్రహేళిక - 8

ఇది ఏమిటి?
తే.గీ.
తోక, నాగలి, మకరమ్ము, తూతకొమ్ము
పలుక మూడక్షరమ్ముల పదము లందు
మొదటి యక్షరమ్ములఁ జూడఁ బోను రాను
సాధనం బగు నది యేది? సాధుశీల!

(తూతకొమ్ము = పిల్లనగ్రోవి)
ఇది ఏమిటో చెప్పండి.

ప్రహేళిక - 7 సమాధానం

ఇత డెవరు?
ఆ.వె.
శిల, హృదయము, త్రోవ, చెలువైన యమృతమ్ము
ద్వ్యక్షర పదము లగు; వాని మొదటి
యక్షరములఁ జూడ నతని పేరై యొప్పుఁ
గీర్తనల రచించి కీర్తిఁ గనెను.

శిల = రాయి, హృదయము = మది, త్రోవ = దారి, అమృతమ్ము = సుధ.
రాయి, మది, దారి, సుధ .... మొదటి అక్షరాలను చదివితే
సమాధానం ...... రామదాసు.
సరియైన సమాధానాలు పంపిన వారు
భాస్కర్ రామి రెడ్డి గారు, భమిడిపాటి సూర్యలక్ష్మి గారు, మందాకిని గారు, చంద్రశేఖర్ గారు, గన్నవరపు నరసింహ మూర్తి గారు, రెహమాన్ గారు, నేదునూరి రాజేశ్వరి గారు, కోడీహళ్ళి మురళీ మోహన్ గారు.
అందరికీ అభినందనలు.

గన్నవరపు నరసింహ మూర్తి గారి సమాధానం
రాయి గాదు మదియు రాగమ్ము తీయనై
దారి సులభమయ్యె త్రాగి సుధలు

రాయి,మది,దారి,సుధ = రామదాసు

కోడీహళ్ళి మురళీ మోహన్ గారి సమాధానం
కోరి వ్రాయుమిదె గుడారము మశకము
తనిఖియును తరాజు కనుము తుదలు
రెండు అక్షరములు నుండవలయునన్ని
తెలియవచ్చునతడు సులభముగను

వివరణ: గుడారము = డేరా, మశకము = దోమ, తనిఖీ = సోదా, తరాజు = త్రాసు.
డేరా, దోమ, సోదా, త్రాసు ... చివరి అక్షరాలను చదివెతే
సమాధానం ......... రామదాసు.

11, అక్టోబర్ 2010, సోమవారం

సమస్యా పూరణం - 121

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
నవరాత్ర్యుత్సవము లమరె నాలుగు దినముల్.

గళ్ళ నుడి కట్టు - 60


అడ్డం
1. ఆపరాని విజయం మనదైతే వాళ్ళది ఈ ఓటమి (4)
3. ఈ జమానాకు సరిపడ్డ అపరాధ శుల్కం (4)
7. జయ మనిశం తెస్తుంది కీర్తి (2)
8. తమిళుల పప్పుచారు (3)
9. రోజుకోసారి తప్పదు ఈ పవరు "కట్" 92)
12. తెలుపు. సైంధవ లవణంలో కళంకమా? (3)
13. అంతు పట్టని గుణం ఉన్న నగరం (3)
17. తమరిది ఎలాంటిదో మనస్సు? (2)
18. వివాహ మోదం చెడితే గొడవ (3)
19. వాసిగ ముడిచిన శిఖ (2)
22. తిరుగు ప్రయాణం చేసేవాడు (4)
23. మారు వేషం వేసి మరీ సీతను మాయ చేసిన నీచుడు (4)
నిలువు
1. అలాటిలాటి ప్రయాణం కాదు. పారిపోవడ మంటే (4)
2. జలజలమంటూ ప్రవహించే ఉదకం (2)
4. వారి రక్తం పీల్చేస్తే ఖాళీ (2)
5. ఏనాడో గ్రామాంతరం వెళ్ళిన వాడి మారు పేరు (4)
6. లవకుశులకు లక్ష్మణుడు ఏమవుతాడు? (3)
10. వినిపించే నక్షత్రం (3)
11. కోష్ఠ"ము" (3)
14. నలసతి (4)
15. నివసించే చోటు (3)
16. వాతాపిని జీర్ణం చేసుకొన్నవాడు (4)
20. తలకట్టు కట్టి కోటలో వేసేది (2)
21. తలక్రిందైన విధం (2)

ప్రహేళిక - 7

ఇత డెవరు?
ఆ.వె.
శిల, హృదయము, త్రోవ, చెలువైన యమృతమ్ము
ద్వ్యక్షర పదము లగు; వాని మొదటి
యక్షరములఁ జూడ నతని పేరై యొప్పుఁ
గీర్తనల రచించి కీర్తిఁ గనెను.

అత డెవరో చెప్పండి.

ప్రహేళిక - 6 సమాధానం

ఇదేమిటి?
తే.గీ.
యముని లోకమ్ము, తాల్మి, గౌతమియు, జింక
యనెడు చతురక్షర పదమ్ము లందు వెదక
వలెను రెండవ యక్షరమ్ములను; జదువఁ
దెలియు రాజమార్గ మ్మేది తెలుప గలరె?

యముని లోకమ్ము = నరకము, తాల్మి = సహనము, గౌతమి = గోదావరి, జింక = హరిణము.
నరకము, సహనము, గోదావరి, హరిణము పదాల రెండవ అక్షరాలను చదివితే
సమాధానం ................ రహదారి.
ఈ సారి ప్రతిస్పందన చాలా బాగుంది. మంద పీతాంబర్ గారు చమత్కారంగా, భాస్కర రామి రెడ్డి గారు కందపద్యంలో సమాధానా లిచ్చారు. ఇంకా సరియైన సామాధానం ఇచ్చినవారు మందాకిని గారు, కోడీహళ్ళి మురళీ మోహన్ గారు, చంద్రశేఖర్ గారు, నేదునూరి రాజేశ్వరి గారు, భమిడిపాటి సూర్యలక్ష్మి గారు, గన్నవరపు నరసింహ మూర్తి గారు. అందరికీ అభినందనలు, ధన్యవాదాలు.
మంద పీతాంబర్ గారి సమాధానం
" నరకము"నకు విసుగు చెంది
" సహనము" కోల్పోయి
" గోదావరి " లొ దూక బోవ,
" హరిణము " కనిపించి
" ర హ దా రి " చూపించె
తంతి ద్వార మిమ్ము చేరు కొంటి !


భాస్కర రామి రెడ్డి గారి సమాధానం
నరకము సహనము గోదా
వరి హరిణము నందు రెండవాక్షరముల ఒం
టరిజేసి కలిపి చదివిన,
గురువర్యా, నదియె ప్రశ్నకు విఱుపు తలపన్

10, అక్టోబర్ 2010, ఆదివారం

వారాంతపు సమస్యా పూరణం - 12

కవి మిత్రులారా,
ఈ వారాంతానికి పూరించ వలసిన సమస్య ఇది .....
చెలువుగ రామలక్ష్మణులు సీతకుఁ దమ్ములు శంభుఁ డన్నయున్.

సమస్యా పూరణం - 120

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
పసిబాలుడు మద్య మడిగె పాలొల్ల ననెన్.
( ఈ సమస్యను సూచించిన మిట్టపెల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు )

ప్రహేళిక - 6

ఇదేమిటి?
తే.గీ.
యముని లోకమ్ము, తాల్మి, గౌతమియు, జింక
యనెడు చతురక్షర పదమ్ము లందు వెదక
వలెను రెండవ యక్షరమ్ములను; జదువఁ
దెలియు రాజమార్గ మ్మేది తెలుప గలరె?

అదేమిటో చెప్పండి.

ప్రహేళిక - 5 సమాధానం

ఏమిటిది?
ఆ.వె.
ముక్కు, గర్వ, మమరపురి, శోణితంబు, ము
క్తాఫలంబు లరయ త్ర్యక్షరంబు
లట్టి పదముల ప్రథమాక్షరంబులఁ జూడ
మంగళమగు వాద్యముం గనెదము.

ముక్కు = నాసిక
గర్వము = దర్పము
అమరపురి = స్వర్గము
శోణితంబు = రక్తము
ముక్తాఫలంబు = ముత్యము

నాసిక, దర్పము, స్వర్గము, రక్తము, ముత్యము ఈ పదాల మొదటి అక్షరాలను చదివితే
సమాధానం ...... నాదస్వరము.
సమాధానం చెప్పిన వారు -
మంద పీతాంబర్, చంద్రశేఖర్, నేదునూరి రాజేశ్వరి, మిట్టపెల్లి అమల, భమిడిపాటి సూర్యలక్ష్మి గారలు. అందరికీ అభినందనలు.

9, అక్టోబర్ 2010, శనివారం

గళ్ళ నుడి కట్టు - 59


అడ్డం
1. ఈ పంతులు పేర ఒక జిల్లా ఉంది (7)
6. చిత్తయింది కొద్దిగానే (3)
7. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ముద్దు పేరుకు విభక్తి ప్రత్యయం చేర్చిన కుఱ్ఱవాడు (3)
9. వంచు ..చించు.. అంటూ మోసం చేయడం (3)
10. అడ్డం 7 కు వ్యతిరేకం (3)
11. యూ .. లేజీ ఫెలో! గెట్ అప్ (1)
12. ఎండ. దాని తల ప్రాణం తోకకు వచ్చింది (3)
13. విదేహ తనయ. చివరి అక్షరం మొదటికి వచ్చింది (3)
15. వేడుక. అవి మనోమోదం కలిగిస్తాయి (3)
17. రాజులు. మన్నెపు దొరలా? మొదటి అక్షరం చివరికి పోయింది. "బావా! యెప్పుడు వచ్చి తీవు?" పాడుకోండి. తెలుస్తుంది (3)
18. శ్రీదేవి ఇంద్రజగా నటించిన చిత్రం ప్రథమార్ధం (7)
నిలువు
2. గురుబ్రహ్మలు. బ్రహ్మ లేడు (3)
3. కానుపు. నేనుండగా దానికోసం ప్రయాస పడవంది మంత్రసాని (3)
4. అనుమానించు. నా పేరు తలచుకోండి (3)
5. సచ్చిదానంద స్వామి తన పేరులోని గుణాలను ముక్కలు చేసాడు (7)
7. ఇంటల్లుణ్ణి తన్నాలంటూ మరదళ్ళు పాడే పాట (7)
8. మద్యంతో పాటు శుక్రుని కడుపులో చేరి తలక్రిందయాడు వీడు (3)
12. తృప్తి (3)
13. సీత మహిజ అయితే మరి పార్వతి? (3)
14. ఇవ్వమని హిందీలో మూడుసార్లు దేబిరించాలి (3)
16. మనోచరుని నోము చేయరు (3)

సమస్యా పూరణం - 119

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
భాస్కరుఁ డుదయించె పడమటి దెస.

ప్రహేళిక - 5

ఇది ఏమిటి?
ఆ.వె.
ముక్కు, గర్వ, మమరపురి, శోణితంబు, ము
క్తాఫలంబు లరయ త్ర్యక్షరంబు
లట్టి పదముల ప్రథమాక్షరంబులఁ జూడ
మంగళమగు వాద్యముం గనెదము.

అదేమిటో చెప్పండి.

ప్రహేళిక - 4 సమాధానం

ఏమిటిది?
ఆ.వె.
వందనమ్ము, రొంపి, పదియవ తిథియు, నా
హ్లాద మనఁ బదములు త్ర్యక్షరములు;
మొదటి యక్షరముల ముదమునఁ జదివిన
వర్షముఁ గురిపించు పదము దెలియు.

వందనమ్ము = అంజలి
రొంపి = బురద
పదవ తిథి = దశమి
ఆహ్లాదము = ముదము

అంజలి, బురద, దశమి, ముదము ... ఈ పదాల మొదటి అక్షరాలను చదివితే
సమాధానం ........... అంబుదము ( మేఘము )
సరైన సమాధానాలు పంపినవారు
చంద్రశేఖర్ గారు, కోడీహళ్ళి మురళీమోహన్ గారు, మంద పీతాంబర్ గారు.
వీరికి అభినందనలు.

8, అక్టోబర్ 2010, శుక్రవారం

ప్రహేళిక - 4

ఏమిటిది?
ఆ.వె.
వందనమ్ము, రొంపి, పదియవ తిథియు,నా
హ్లాద మనఁ బదములు త్ర్యక్షరములు;
మొదటి యక్షరముల ముదమునఁ జదివిన
వర్షముఁ గురిపించు పదము దెలియు.

అదేమిటో చెప్పండి.

సమస్యా పూరణం - 118

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
రోషమ్మును వీడువాఁడె రోషయ్య యగున్.
( దీనిని పంపించిన హరి దోర్నాల గారికి ధన్యవాదాలు )

ప్రహేళిక - 3 సమాధానం

ఎవరీ బంధువు?
ఆ.వె.
గగనయాన మంధకారమ్ము సంభ్రమ
మతివ యనఁ బదములు త్ర్యక్షరములు
నడిమి యక్షరముల నయముగాఁ జదువఁగాఁ
దెలియు బంధు వెవరొ తెలుపఁ గలరె?

ప్రహేళిక - 2 కు ప్రతిస్పందన చాలా బాగుంది. మరి ప్రహేళిక - 3 కు ఒక్కరుకూడా సమాధానం పంపలేదు. తీరా చూస్తే నేనిచ్చిన ఆధారాలలో ఒక పెద్ద తప్పు జరిగింది. "గగనయానము" కు సమాధానం "విమానము" నాలుగక్షరాల పదం. కాని నేను "విమానం" అని పొరపాటున మూడక్షరాల పదంలో చేర్చాను. అందువల్ల అందరూ సమాధానం తెలిసికొనడంలో ఇబ్బంది పడ్డారు. ఇకనుండి ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడతాను. జరిగిన తప్పుకు మన్నించండి.
గగనయానము = విమానం (నిజానికి విమానము 4 అక్షరాల పదం)
అంధకారం = తమస్సు
సంభ్రమము = కంగారు
అతివ = తరుణి

విమానం, తమస్సు, కంగారు, తరుణి పదాల మద్య అక్షరాలను చదివితే
సమాధానం - మామగారు.

7, అక్టోబర్ 2010, గురువారం

సమస్యా పూరణం - 117

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
ఓదార్పులు సేయువాని కోరిమి లేదే!
( దీనిని పంపించిన నచికేత్ గారికి ధన్యవాదాలు )

ప్రహేళిక - 3

ఎవరీ బంధువు?
ఆ.వె.
గగనయాన మంధకారమ్ము సంభ్రమ
మతివ యనఁ బదములు త్ర్యక్షరములు
నడిమి యక్షరముల నయముగాఁ జదువఁగాఁ
దెలియు బంధు వెవరొ తెలుపఁ గలరె?

ఆ బంధు వెవరో తెలియజేయండి.

6, అక్టోబర్ 2010, బుధవారం

ప్రహేళిక - 2

ఇత డెవరు?
ఆ.వె.
డాగు, కరుణ, బొడ్డు, బాగైన తార రెం
డక్షరముల పదము లందు మొదటి
యక్షరములఁ జదువ నంగజు శత్రువౌ
శంకఁ దీర్చు మనెను శంకరయ్య.

సమాధానం చెప్పండి.

సమస్యా పూరణం - 116

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
కనుబొమలకు మీసములనఁ గన్నెఱ్ఱ గదా !
( దీనిని పంపించిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు )

చమత్కార పద్యాలు - 44

అందఱు నందఱే మఱియు నందఱు నందఱె యంద ఱందఱే.
కవిసార్వభౌముడు శ్రీనాథునికి ఒకానొక సభలో అన్నీ సర్వనామాలతో కూడిన ఈ సమస్యను ఇచ్చారట! దీనిని పూరించలేక ఆయన అవమానం పొందాలని వాళ్ళ ఆలోచన. కాని శ్రీనాథుడు వాళ్ళనే అవమానిస్తూ చేసిన పూరణ ...
ఉ.
కొందఱు భైరవాశ్వములు, కొందఱు పార్థుని తేరి టెక్కెముల్,
కొందఱు ప్రాక్కిటీశ్వరులు, కొందఱు కాలుని యెక్కిరింతలున్,
కొందఱు కృష్ణ జన్మమునం గూసిన ధన్యులు నీ సదస్సులో
అందఱు నందఱే మఱియు నందఱు నందఱె యంద ఱందఱే.

అర్థాలు -
భైరవాశ్వములు = కుక్కలు
పార్థుని తేరి టెక్కెముల్ = కోతులు
ప్రాక్కిటీశ్వరులు = పందులు
కాలుని యెక్కిరింతలు = దున్నపోతులు
కృష్ణ జన్మమున కూసిన ధన్యులు = గాడిదలు.

5, అక్టోబర్ 2010, మంగళవారం

సమస్యా పూరణం - 115

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది .....
అయ్యలకే గాని మీస మందరి కేలా?
( కవి చౌడప్ప పద్య పాదాన్ని సమస్యగా ఇవ్వమని నేదునూరి రాజేశ్వరి గారు సూచించారు )

ప్రహేళిక - 1

ఈ ఊరు పేరేమిటి?
తే.గీ.
నాలు గక్షరమ్ముల పేరి నగర మేను;
గాలివార్త, పికంబు, సాంగ్రామికుండు,
పాను పరయఁగా త్ర్యక్షర పదము లందు
నడిమి యక్షరా ల్జదివిన నాదు పేరు.

(సాంగ్రామికుడు = సైన్యాధిపతి)
ఆ నగరం పేరేమిటో చెప్పగలరా?

చమత్కార పద్యాలు - 43

ఎవరా దేవుళ్ళు?
చం.
సలిల విహారు లిద్దఱును, సంతత కాననచారు లిద్దఱున్,
వెలయఁగ విప్రు లిద్దఱును, వీర పరాక్రమ శాలు లిద్దఱున్,
బొలఁతుల డాయువాఁ డొకఁడు భూమిని బుట్టెడువాఁడు నొక్కఁడున్
జెలువుగ మీ కభీష్ట ఫల సిద్ధి ఘటింతు రనంత కాలమున్.

( చాటు పద్య మణిమంజరి )
భావం -
నీటిలో విహరించే వాళ్ళిద్దరు, అడవిలో సంచరించే వాళ్ళిద్దరు, బ్రాహ్మణు లిద్దరు, పరాక్రమవంతు లిద్దరు, స్త్రీల వెంటబడే వాడొక్కడు, భూమిపై పుట్టబోయే వాడొక్కడు మీకెల్లపుడు కోరికలు తీరుస్తారు.

ఎవరా దేవుళ్ళు?

4, అక్టోబర్ 2010, సోమవారం

సమస్యా పూరణం - 114

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది .....
కప్పకు సుందరికి పెండ్లి ఘనముగ జరిగెన్.

గళ్ళ నుడి కట్టు - 58


అడ్డం
1. రావణుడిదా ఈ సైన్యం (3)
4. ఈజీగా దొరుకుతుంది. మూడాసుల లాభంతో (3)
6. చివరికి ఆమడ దూరం వెళ్ళినా లాభం లేదు (5)
7. సున్నా లేని బ్రతుకు. రాజశేఖర్ పై తలంబ్రాలు పోసింది (3)
9. కదం తొక్కిన యుద్ధం తికమక పడింది (3)
11. పరవశం, ఉపేక్ష, ఏమరుపాటు. "..... చేసే వేల? సమయము కాదు" అన్నాడు త్యాగయ్య (3)
13. పసివాణ్ణి ఇలా ముద్దుగా పిలిస్తే రౌడీ వచ్చాడేం? (2)
14. సంభావనం కావాలని అతని అభిప్రాయం (2)
15. శంకరుడు. మధ్య రెండక్షరాలు మారాలి (3)
16. చివర ఏనుగున్న పుకారు (3)
18. క్షణకాలం ఉండేది (3)
20. విరహాల మాత్రయా ఈ ఎక్స్ కర్షన్? (5)
22. శంకరుడే. త్రిపుర వైరి (3)
23. ఏ ఉపాయమైనా కథ పండదు (3)
నిలువు
1. చక్రవర్తుల రాజగోపాలాచారి (3)
2. అవని తలంలో స్త్రీ (3)
3. చీకట్లో కాలికి తగిలేది .....? రప్పో? (2)
4. శకుంతలా దుష్యంతుల కోడలు. భరతుని మనసు ఆనంద పరచేది (3)
5. శుభం ఉండదనం. ఇది యుద్ధం (3)
8. గనులకు భూకేటాయింపు ఇలా వాదప్రతివాదాలకు నెలవు అవుతున్నది (5)
10. మధురంగా మాట్లాడేది ఎవరో కళాపూర్ణోదయంలో చూడండి (5)
11. గ్రామీణుల జలుబు (3)
12. భూమికి కొడుకీ గ్రహం (3)
16. పులవ బెట్టిన ప్రేమ (3)
17. ప్రయత్నించి ఇసుమున తైలం తీయవచ్చు (3)
18. తలాతోకా లేని నక్షత్రపథం. (3)
19. కంచు కంఠం కలవాడు వేసుకున్న చొక్కా
21. రథమెక్కి యుద్ధం చేసేవాడు (2)

చమత్కార (చాటు) పద్యాలు - 42

ఆర్తజన రక్షణోపాయ! ఆంజనేయ! - 7
సీ.
నిడుద వాలంబుతో నిలువు నామంబుతో
నిగనిగ మెఱయు నెమ్మొగముతోడ
సహజ వర్ణంబుతో సవరని మౌంజితో
సలిల పూరిత కమండలముతోడ
పసిఁడి యందియలతోఁ బట్టు జన్నిదముతోఁ
బాటల లోచనాబ్జములతోడ
కరముల మోడ్పుతోఁ గటి హేమ పటముతోఁ
గమనీయ కుండల కాంతితోడ
తే. గీ.
కరుణ గల మూర్తితోడ సాక్షాత్కరించి
నిండు వేడుక నా మది నుండు మెపుడు
మహిత శ్రీరామ పదభక్తిమద్విధేయ!
ఆర్తజన రక్షణోపాయ! ఆంజనేయ!
( అజ్ఞాత కవి )

శారద దరహాసం

కారణాంతరాల వల్ల పోస్ట్ ప్రచురణ కొంతకాలం వాయిదా వేయడమైనది. మన్నించండి.

3, అక్టోబర్ 2010, ఆదివారం

వారాంతపు సమస్యా పూరణం - 11

కవి మిత్రులారా,
ఈ వారాంతానికి పూరించ వలసిన సమస్య ఇది .....
( దీనిని చంద్ర శేఖర్ గారు పంపించారు. వారికి ధన్యవాదాలు )
కోడలు మామఁ జూచి కనుగొట్టెను రమ్మని సైగఁ జేయుచున్.

సమస్యా పూరణం - 113

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది .....
దోమ కేమి తెలుసు రామభక్తి?

చమత్కార (చాటు) పద్యాలు - 41

ఆర్తజన రక్షణోపాయ! ఆంజనేయ! - 6
సీ.
స్తంభ సంభూతావసర ఘోరతర నర
పంచాస్య కహకహార్భటులఁ దెగడి
శాకినీ ఢాకిని సంతత లయకాల
భైరవ కిలకిలార్భటులఁ దెగడి
సంవర్త సమయ ప్రచండ దండధరారి
భర్గ కోలాహలార్భటులఁ దెగడి
దక్షాధ్వరధ్వంసకా క్షుద్రబల వీర
భద్ర హూహూక్రియార్భటులఁ దెగడి
తే. గీ.
పొలుచు భవదట్టహాసంబు చెలఁగఁ బంక్తి
ముఖుని రొమ్ము పగుల్పవే ముష్టిహతిని?
మహిత శ్రీరామ పదభక్తిమద్విధేయ!
ఆర్తజన రక్షణోపాయ! ఆంజనేయ!
( అజ్ఞాత కవి )

2, అక్టోబర్ 2010, శనివారం

సమస్యా పూరణం - 112

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్యను చంద్రశేఖర్ గారు పంపించారు ...
కాని విద్యలఁ జదువుట మానరాదు.

గళ్ళ నుడికట్టు - 57


అడ్డం
1. బాదరాయణ సంచారం దీపావళి మందుల కోసం (4)
3. ఆవులు, గేదెలు తినే గడ్డి (4)
7. సమానం (2)
8. మత్తునిస్తుందా ఈ తేనె (3)
9. శివునాజ్ఞ లేకుంటే ఇది కూడా కుట్టదట! (2)
12. ఉభయాక్షరాలలో ఒకటి. రెండు సున్నాలు (3)
13. సదా హితం చేస్తూ కూడుకొని ఉంటుంది (3)
17. బరువు. మధురమైనది కాదు (2)
18. అభ్యర్థించడం. యాచకవృత్తి (3)
19. శ్రేష్ఠుడు లేదా శ్రేష్ఠమైనది (2)
22. ప్రాణాంతకుడు (4)
23. ప్రథమ సోపానం (4)
నిలువు
1. తెరువరి. శరత్ బాబు "బడదీదీ" నవలకు తెలుగు సినిమా (4)
2. కలయిక. పంచతంత్రాల్లో ఒకటి (2)
4. చాలా సినిమాల చివర ఈ కార్డు పడుతుంది (2)
5. సంయమి ఐనా మనిషి ఐనా వెళ్ళవలసిన యముని పట్టణం (4)
6. పెళ్ళి కూతురు (3)
10. సరదాల పండుగ. రావణుడి వర్ధంతి (3)
11. స్త్రీ. భూమితో మొదలు (3)
14. చక్కెర వ్యాధి (4)
15. గమనిక లాంటిదే తెలుపడం (3)
16. ఈ రహస్యం ఈశ్వరుడికైనా తెలియదట! (4)
20. పత్రం (2)
21. ఇంద్రుని కొడుకైన వానరుడు (2)

చమత్కార (చాటు) పద్యాలు - 40

ఆర్తజన రక్షణోపాయ! ఆంజనేయ! - 5
సీ.
రాలవే యుడులు పేలాల పోలిక నీవు
వాల మల్లార్చిన వానరేంద్ర!
తూలవే గిరులు బంతుల తెఱంగున నీవు
హస్తముల్ సాచిన నలఘుతేజ!
పగులదే మిన్నంటి పంటి కైవడి నీవు
పెళపెళ నార్చిన భీతిరహిత!
తిరుగదే ధరణి కుమ్మరిసారె వలె నీవు
కుప్పించి యెగసినఁ గులిశదేహ!
తే. గీ.
దేవ దానవ మానవాధిపులలోన
నిన్ను వర్ణింపఁ దరమె నిర్నిద్రశౌర్య!
మహిత శ్రీరామ పదభక్తిమద్విధేయ!
ఆర్తజన రక్షణోపాయ! ఆంజనేయ!
( అజ్ఞాత కవి )

1, అక్టోబర్ 2010, శుక్రవారం

సమస్యా పూరణం - 111

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్యను చంద్రశేఖర్ గారు పంపించారు ...
అగ్నితోడ నగ్ని నార్పవచ్చు.

చమత్కార (చాటు) పద్యాలు - 39

ఆర్తజన రక్షణోపాయ! ఆంజనేయ! - 4
సీ.
పుట్టినాఁ డితఁడు శంభుని యమోఘం బైన
శక్తిచేఁ బార్వతీ జఠర మందు;
పట్టినాఁ డితఁడు చేపట్టుఁ గొమ్మగఁ బంటి
చవిఁ జిన్ననాఁడె హస్తముల రవిని;
కొట్టినాఁ డితఁడు గగ్గోలుగా లంకలో
వెన్నాడి యక్షాది వీర వరుల;
చుట్టినాఁ డితఁ డాజిఁ బెట్టని కోటగా
వాలంబు కపిసేన వలగొనంగ;
తే. గీ.
ఇతఁడు దైవంబు పటుతేజుఁ డితఁడు సరస
బాహు బలవంతుఁ డితఁడు నాఁ బరగి తౌర!
మహిత శ్రీరామ పదభక్తిమద్విధేయ!
ఆర్తజన రక్షణోపాయ! ఆంజనేయ!
( అజ్ఞాత కవి )