31, ఆగస్టు 2012, శుక్రవారం

సమస్యాపూరణం - 808 (పాపములకు హేతు వగును)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
పాపములకు హేతు వగును ప్రణవ మొకటె.
(ఈ సమస్యను తేటగీతి, ఆటవెలది, కందము, ఉత్సాహములలో పూరించవచ్చు)

పద్య రచన - 98

 కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

30, ఆగస్టు 2012, గురువారం

సమస్యాపూరణం - 807 (నిద్ర చేకూర్చు సంపదల్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
నిద్ర చేకూర్చు సంపదల్ భద్రముగను. 

పద్య రచన - 97

 కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

29, ఆగస్టు 2012, బుధవారం

సమస్యాపూరణం - 806 (తెలుఁగు భాషాభిమానము)

తెలుగు భాషాదినోత్సవ శుభాకాంక్షలు!
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
తెలుఁగు భాషాభిమానము తొలఁగవలెను.

పద్య రచన - 96

 నేడు గిడుగు రామమూర్తి పంతులు జన్మదినం
తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు!
కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

అభినందన మందార మాల

శ్రీరస్తు         శుభమస్తు       అవిఘ్నమస్తు
నేడు తెలుగు భాషా దినోత్సవము సందర్భముగా,
రానున్న ఉపాధ్యాయ దినోత్సవము సందర్భముగా 
" శంకరాభరణము" బ్లాగ్ నిర్వాహకులు 
శ్రీ కంది శంకరయ్యకు
అభినందన మందార మాల.
శ్రీ కంది శంకరయ్య. విశ్రాంత ఆంధ్రోపాధ్యాయులు.

కం:- శ్రీ కంది వంశ చంద్రమ! 
మీ కవితా మార్గమున సుమేరు సుకవులన్
లోకంబున కందించిన  
శ్రీ కందిగ పేరు గనిరి చిన్మయ రూపా!

సీ:- ఉత్తమోపాధ్యాయ వృత్తిని చేపట్టి  -  స్ఫూర్తిని కొలిపి సద్వర్తనముల,.
నిర్మల భావనా ధర్మము నెఱనమ్మి  -  ధర్మవర్తనులను ధరను నిలిపి,
సత్య బోధన చేసి, స్తుత్యసన్మార్గమ్ము  -  నత్యంత స్తుత్యమై యలర వేసి,
జీవన సద్గతి భావనాపటిమతో  -  విద్యార్థులకు మప్పి వెలయఁ జేసి,
గీ:- చెదరి పోనట్టిన నగవులు జిందు మోము 
సరస సద్భావనా సుధల్ దొరలు పలుకు,
కరుణ  గాంభీర్యతలు చూపు కన్ను దోయి 
పొంకమున నొప్పుదే! కంది శంకరార్య!

శా:- మీ సద్వర్తన సత్య సంధత, సదా మేల్గోరు మీ బుద్ధియున్,
ధ్యాసన్ జూపుచు చేయు బోధనలు, మీ ధన్యాత్మయున్, ప్రేమయున్,
భాషాటోపముఁ జూపనట్టి కవితా పాండిత్యమున్ జూచినన్
మీసాదృశ్యుల నెన్న లేరుగద!స్వామీ! శంకరార్యా! ధరన్.

గీ:-శంకరాభరణము మీరె.శంకరయ్య!  
జంకు గొంకులు లేనట్టి సహృదయ మణి!
యింక పై మిము శుభములే యేలు నిజము. 
శంకరుండిల మిము బ్రోచు శాంతి గొలిపి.

గీ:- మంగళంబులు మీకిల మంగళములు. 
మంగళంబులు కవులకు మంగళములు.
మంగళంబులు బుధులకు మంగళములు.  
మంగళంబులు హరికి సన్ మంగళములు.

మంగళం                       మహత్                        శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ

28, ఆగస్టు 2012, మంగళవారం

సమస్యాపూరణం - 805 (కమలమునకు చంద్రుఁడే)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
కమలమునకు చంద్రుఁడే సుఖమ్మును గూర్చున్.
(కన్నడ బ్లాగు "పద్యపాన" సౌజన్యంతో)
కన్నడ సమస్య...
ಕಮಲಂ ಚಂದ್ರಂಗೆ ತಕ್ಕುದೆನಿಸಿತ್ತಲ್ತೇ!

పద్య రచన - 95


కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
(వసంత కిశోర్ గారికి ధన్యవాదాలతో...)

27, ఆగస్టు 2012, సోమవారం

దత్తపది - 25 (నన - నీనీ - నును - నేనే)

నన - నీనీ - నును - నేనే
పై శబ్దాలను ఉపయోగిస్తూ మీకు నచ్చిన ఛందస్సులో
భారతార్థంలో పద్యం వ్రాయండి.
(కన్నడ బ్లాగు `పద్యపాన' సౌజన్యంతో...)

పద్య రచన - 94


కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

26, ఆగస్టు 2012, ఆదివారం

సమస్యాపూరణం - 804 (దశావతారముల్ ధరించె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
దశావతారముల్ ధరించె త్ర్యంబకుం డుదారుఁడై.

పద్య రచన - 93


కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
(మా గురుదేవులు కీ.శే. శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు రచించిన "అవతారధార" తప్పక చూడవలసిందిగా మనవి)

అవతారధార

అవతారధార
శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు
 శరణని కేళులెత్తు శ్రుతి సంతతి వంత నడంప, సోమకా
సురు పెనుమోమునం దొరఁగు శోణితపూరము సాగి సాగరో
దరమున రక్తనాడుల విధంబుగఁ దోప జగత్త్రయీభయం
కరముగ నీడ్చుచుం గెడపు కాలమునన్ శ్రమ మందినావొ?; మం
దరగిరి వీపుచిప్పపయి దార్కొని కుమ్మరిసారె పోల్కి బి
ట్టొరయుచు దిర్దిరం దిరుగుచున్నెడ నొచ్చితివో?; శశాంక సుం
దరతర బింబపున్నడిమి నల్లనిమచ్చ యనంగ నానన
స్ఫురదురుదంష్ట్రికాగ్రమున భూవలయం బమరించి, తన్మహా
భరము వహించుచో నలత పాల్పడినావొ?; యనన్యతన్ “హరీ
హరి” యను పచ్చిరక్కసుని యర్భకు నోమఁగ నుక్కుకంబపుం
జిరుతఁడవై, మహాసురుని జీలుచువేళ రమాలతాంగి ముం
గురులకు శిల్పకారులగు గోరులు నొచ్చెనొ?; పిన్నవై బలీ
శ్వర కరదానధార సహసాస్ఫురదంఘ్రిని దమ్మిచూలి ని
ర్భరముద మందుచుం గడుగు పావనజీవనధార కర్పరం
బొరసెడి గోటికోటి దిగుచున్న మహాజలధార యేకతన్
ధరఁ బడ విశ్వరూపమును దాల్చుతరిన్ వెరఁ గందినావొ?; దు
ర్నరపరిపాలకాళి గళనాళవిలుంఠన కేళి వేడి నె
త్తురు లవి చుక్కచుక్కలుగఁ ద్రుళ్లిపడం గఱలెక్కి యెఱ్ఱనౌ
పరశువు దీపఁపుం గళిక భాతిఁ గరాంచలమందు వెల్గఁగా
నిరువదియొక్కమారులు నహీనతరార్భటి భూప్రదక్షిణీ
కరణ మొనర్చుకాలమున గాసిలితో?; యల తండ్రి యానతిన్
శిరమునఁ దాల్చి కారడవి జేరి శిలాశితకంటకౌఘ ని
ష్టురతరదంతురస్థలులు సోకఁ జరించెడివేళ నూత్న పం
కరుహ పదద్వయంబు కసుగందెనొ?; యల్ల యశోద నీదు పెం
పెరుగక చిన్నిబొజ్జపయి నిప్పటికిం బెనుదద్దు సుట్టిరా
బిరబిర గట్టు కట్లు, “నిలు వెన్నెలదొంగ!” యటంచు గోపతా
మరసదళాక్షు లెల్ల బహుమానముగా నిడు బుగ్గపోట్లు, పా
ర్థ రథము ద్రోలు వేళఁ బయిఁ గ్రమ్మెడి కైదువు వ్రేట్లు, మున్నుగా
బెరసిన పెక్కుపాట్లు పడి వేసరితో?; పెడదారి పోడుముల్
గరపుచు నాసురప్రకృతులన్ పెకలించి కలంచినట్టి య
వ్వెరవు దలంచియే యనుతపించుచు నుంటివొ?; యింకముందు భీ
కర కరకంపితాసి తొలి కార్మెరపుల్ నెరపన్ నవాంబుదా
విరళ వినీలకాంతి మహిభృచ్ఛిరముల్ వెస నాక్రమించి తీ
వ్ర రుధిరవృష్టిమై పదనువారిన ధారణి ధర్మనిర్మలాం
కురముల సొంపునింపు తెరఁగుం బరికింపుచు నుంటివో?; నిజం
బరయ నతీతమున్ మఱి యనాగతమున్ గొన సర్వశక్తి వీ
కరణి కనుల్ మొగుడ్పఁ దగు కాలము గాదిది మెండునిండి ర
స్థిర హృదయుల్ దురామయులు “దేవుఁడు లేఁ”డని విఱ్ఱవీగు పెన్
మొరకులు వారి యోష్ఠపుటి మున్‌మును సీవనముం బొనర్చి దు
ర్భరతరగర్భ దాస్యమయ పంకనిమజ్జ దమాయక ప్రజం
గరుణ సముద్ధరింపుచు జగత్పతి! యాద మహీధరాగ్ర మం
దిరమున నిందిరం గలిసి తేలుము విశ్రమకేళి, పాతకో
త్కర పటుగంధ సింధుర విదారి! హరీ! గుణహారి! మాదృశా
దరణము మానకుండుము సుధామయ దృఙ్గ్లహరీ! నృకేసరీ!

          (ఇది యాదగిరి లక్ష్మీనృసింహస్వామి ప్రార్థనా రూపం. అవి రజాకార్ల దురంతాలతో నైజాం ప్రజలు పలుపాట్లు పడుతున్న రోజులు. కాలం 1947-48. ఉత్సవాలకు కాలినడకన ప్రయాణమైన చిలుకమఱ్ఱి వారిని, వారి సహచరులను దారిలో అడ్డగించి సోదాచేసి ఆ దుండగులు రెండు రోజులు పడవేసి ఉంచారు. స్వామిని నిందించారు. తర్వాత ఎలాగో తప్పించుకొని స్వామి సన్నిధిని చేరి వ్రాసిన విన్నపం ఇది.)

25, ఆగస్టు 2012, శనివారం

సమస్యాపూరణం - 803 (కల్కి వచ్చు ననుట)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
కల్కి వచ్చు ననుట కల్ల సుమ్ము.

పద్య రచన - 92


కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

24, ఆగస్టు 2012, శుక్రవారం

సమస్యాపూరణం - 802 (బుద్ధుఁ డాతఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
బుద్ధుఁ డాతఁడు హింసానిబద్ధుఁ డెపుడు.

పద్య రచన - 91

 
కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

ఇట్టి సృష్టి యేల -౨

ఇట్టి సృష్టి యేల?
శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు

సీ.
నిండారు సత్యంపు బండారమునయందె
          కల్ల దొంతరలున్న కర్మమేమొ? 
నెఱజాలికడలి పెందరఁగల పొరలందె
          హింసా ప్రళయవహ్ను లెరియుటేమొ?
పుణ్య గణ్య క్షేత్ర భూభాగములయందె
          పలు పాపరాసుల పంటలేమొ?
శాంతి రాకాసుధా చంక్రమమ్ములయందె
          క్రోధహలాలోద్బోధమేమొ?
ఆ.వె.
బహుమిథోవిరుద్ధ భావసమ్మేళన
చతురిమంబు సుప్రసన్నమైన
నీ యెడంద నెట్లు నివ్వటిల్లె? నిదేమి
లీల? యిట్టి సృష్టి యేల దేవ?
సీ.
క్షారాబ్ధి శీకరాసారార్ద్రతటమందె
          తీయని నీరూరు నూయి యేమి?
గాంఢాంధకార దిక్కబళనాభీలరా
          త్రులనె చుక్కల మిలమిల లవేమి?
శాఖిశాఖాశిఖా చంచలాగ్రములందె
          పల్లవ సుమ ఫలోద్భవ మదేమి?
గ్రీష్మ దుస్సహ మహోగ్రోష్మకీలలయందె
          వర్షాభిషేక ప్రహర్షమేమి?
తే.గీ.
తెలిసినట్లుండి వెండియు తెలియకుండు
భావసన్నిగూహనముల తావలమగు
నీ కృతికిఁ బతివై యీవు సేకరించు
నెలమి యదియేమి? యీ సృష్టి యేల దేవ!
సీ.
ఎచట మండు టడవులే, తేట చన్నీటి
          కొలని కెలనిత్రోవ మలక లేవొ?
యెచట ముండ్లడొంకలే, నీటు విరిదోట
          సూటి జూపెడు పాటి బాట లేవొ?
యెచటఁ గన నెడారులే, శీతలచ్ఛాయ
          లొలయు మేటి యేటి యొడ్డు లేవొ?
యెచటఁ గూళమెకనులే, యూరి పొలిమేర
          జేరఁ బారు దారి తీరులేవొ?
ఆ.వె.
యెవరు తెలుపువార, లీ హోరమ్రోతలో
మాట చెవికిఁ బట్టు మార్గమేది?
మంచి చెడ్డ గలిపి మాయతో వంచింతు
వేమి? యిట్టి సృష్టి యేల? దేవ!
ఆ.వె.
ఎటకుఁ గదల వలలె, యెటనున్న నురలె, యే
యెడకుఁ జూడ నుచ్చులే, యిఁకెందొ
తగులు ప్రాణిఁ జూచి నగుచుందు వింతెకాఁ
బోలు, నిట్టి సృష్టి యేల? దేవ!
* సంపూర్ణము *

23, ఆగస్టు 2012, గురువారం

సమస్యాపూరణం - 801 (శిశుపాలుఁడు ప్రాణసఖుఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
శిశుపాలుఁడు ప్రాణసఖుఁడు శ్రీకృష్ణునకున్.

పద్య రచన - 90


కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

ఇట్టి సృష్టి యేల? - ౧

ఇట్టి సృష్టి యేల?
శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు

సీ.
మోదుగు బూగెలల్ మొద్దువారెడిఁ గదా
          ముద్దుగులాబికే ముండ్లివేల?
కళలేని గాజుపూసలు రాదులౌఁ గదా
          నిగ్గుముత్తెములకే గొగ్గువేల?
లెక్క కెక్కని పెక్కు చుక్కలు కలవుగా
          వెన్నెల రేనికే వెలితి యేల?
కారుకూతలు ప్రేలు కాకులున్నవి కదా
          వాకట్టు లివియేల కోకిలలకె?
ఆ.వె.
నీ నిరంకుశంపు నిర్మాణ ఘనశక్తి
కిది నిదర్శనమ్మొ? యీ విధంబె
నీ వినోదకరమొ? దేవ! కన్నీట వ్రా
యించు నిట్టి సృష్టి యేలనయ్య?
సీ.
ఆణ్వాది బ్రహ్మాండ మంత దానై చొక్కు
          సుకవి యౌదలఁ బేదరికఁపు బరువు
మలమలమాడు పొట్టల గొట్టుకొను బిచ్చ
          గాండ్ర కేటేట నొక్క శిశుజన్మ
నవ్వు బువ్వుల డాగు నాగులౌ నెడఁదల
          విసఁపు టూర్పులకు సొంపెసగు తావి
తెలివి దివ్వెల తళత్తళలందె యజ్ఞాన
          గాఢతమస్సమాక్రమణ పరిధి
ఆ.వె.
నీ మహిమకు వెరచి నిన్నెదిర్చి యడుగఁ
జాలఁ డెవఁడు ధైర్యసాహసముల
నెవఁడొ యడగెనేని నీవును మారాడ
జాల విట్టి సృష్టి యేల దేవ?
(మిగిలిన భాగము రేపు)

22, ఆగస్టు 2012, బుధవారం

సమస్యాపూరణం - 800 (బలరాముని ధర్మపత్ని)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
బలరాముని ధర్మపత్ని వైదర్భి కదా!
లేదా
భామ రుక్మిణి సతి బలరామునకును.

పద్య రచన - 89


కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

విన్నపము - ౮

విన్నపము
శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు.

మేనుగల యంతకున్ విషయానువృత్తి
సాగుటయె తప్పదందువా? సాగనిమ్ము!
కాని యద్దాని ఫలము సుంతైన నాకు
వలవ దంతర్నియంతవై వెలయు రేఁడ!
యందవలె నీకె తానది యడుగడుగునఁ,
గరుణతో నీవ కొనవలెఁ గాన్కవోలె,
ఇంతపాటిగ చనవు నీ విచ్చెదేని
నిన్నె కన్గొందు నాయందు, నిఖిలమందు
నింక నీకు నా కరమర యేమి స్వామి?
ఈ జగంబెల్లఁ బ్రేమింతు వీవ యంచు,
నపుడు నీ సృష్టిశిల్పమం దణఁగియుండు
నతి నిగూఢ మహారహస్యములు నాకు
గోచరంబగు నడుగడుగునకుఁ దామె!
సకల కర్మలు యుష్మదర్చనమ యౌచు
విశ్వకల్యాణ కృతులయి వెలయు నపుడు!
కాని యపుడేని నాయెద గర్వలవము
చేరఁగా నీకు మంజలి సేతు నీకు!
దోపవలయుఁ బ్రభూ! నీవ తోపవలయు!
నీదు కల్యాణ గుణములె నిఖిలమందు
నందవలె మేనఁ బ్రాణము లాడుదాఁక!
చిన్నబుచ్చకు తండ్రి నా విన్నపంబు.
*     *     *     *     *     *
అవలి మాటయొ! యమృతార్ణవాంతరాళ
పరినిమజ్జనమౌ భవత్పదమె కలదు,
తప్ప దాపొందు నీకు నా కెప్పుడైనఁ,
జింత రవ్వంత చెంతకుఁ జేరదింక.
*     *     *     *     *     *
కాని యీదేహ మున్నంత కాల మిచట
నీ పయింగల నమ్మిక మాపఁజూచు
ఘటనలంగూడ నీ చిత్ర నటన గతులె
కాన రావలెఁ గనులకు గట్టినట్లు,
చిన్నబుచ్చకు తండ్రి! నా విన్నపమ్ము,
నాదు పేరాస గన్గొని నవ్వఁబోకు,
శ్రీసఖా! ముగ్ధమధుర సౌశీల్యసీమ!
స్వామి! నారాయణా నమస్కార మిదిగొ!

* సంపూర్ణము*

21, ఆగస్టు 2012, మంగళవారం

సమస్యాపూరణం - 799 (రామునకున్ భక్తులు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
రామునకున్ భక్తులు గద రాక్షసు లెల్లన్.

పద్య రచన - 88


కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

విన్నపము - ౭

విన్నపము
శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు.

ఆర్థితార్థ ప్రదాన దీక్షైక దక్ష!
యెపుడు ప్రవహిల్లనిమ్ము నా కీతలంపె,
సారెసారెకుఁ గన్బ్రామి పారిపోకు,
నీకొరకె యెల్ల కల్మియు నిలువనిమ్ము,
నాకు నీసేవ మరపు రానీకు మెపుడు,
పెన్నిధివి స్వామి! యీ నిరుపేద కిపుడు
దొరికితివి వీడలే నిఁక తరుమఁబోకు,
పెక్కు మోసఁపు వేసాల నక్కి నక్కి
పలు తెరంగుల నుచ్చులు, వలలు పన్ని
నన్ను వేటాడ వేచియున్నారు వారు,
పగతు లార్గుర కప్పగింపకుము తండ్రి!
యిపుడు నేఁ దప్పిపోతినా యింక నీకుఁ
గరగతం బౌట మఱియెన్ని కల్పములకొ?
చేతులారఁగ దూరము చేసికొనకు
దీన సంత్రాణ శీల! నీవాని నీవ
యేల పోగొట్టుకొందు విదెట్టి లీల?
నీ నిరుపమాన సుగుణ జాలాన లాగి
యొకపరిగ నన్ను బంధించి యుంచుకొనుము.

20, ఆగస్టు 2012, సోమవారం

సమస్యాపూరణం - 798 (పరశురాము నోడించె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...

పరశురాము నోడించె రావణుఁడు గినిసి.

పద్య రచన - 87


కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

విన్నపము - ౬

విన్నపము
శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు.

అమల కౌస్తుభ వైజయంత్యాది వివిధ
హార నూపుర కాంచి కేయూర కటక
మకరకుండల మకుటాది మండనముల
సౌరు, పంచాయుధ ప్రభా శబలితముగ,
నింద్రధను వనఁ గెలఁకుల నింపు నింప
నీలమేఘము వోలిన నీదురూపు
పరచుకొందును జీవితాంబరమునందు.
*     *     *     *     *     *
ముసి నగవుతోడఁ గ్రీగంటి విసురుతోడ
నాకు నిన్ జూపి, నీకును నన్ను జూపి
కలుపు కలుములవెల్లి మా కన్నతల్లి
నీదు వలపుల దేవేరి నిలిచి వెలుఁగు
మెఱపువలెఁ బేరెడందఁ గాపురము పెట్ట
నీలమేఘము వోలిన నీదురూపు
పరచుకొందును జీవితాంబరమునందు.
*     *     *     *     *     *
కనులఁ బెదవులఁ బలుకులఁ గనికరంపు
టమృత వర్షము గురియు, చనాదికాల
ఘోర సంసారదావ దుర్వార వహ్ని
కీలికా మాలికాపరిఖేలనంపు
మేటి తాపము లొకమాటు మీటఁజాలు
చలువ నిడు కేలు నాపయిఁ జాచి వాలు
నీలమేఘము వోలిన నీదురూపు
పరచుకొందును జీవితాంబరమునందు.

19, ఆగస్టు 2012, ఆదివారం

సమస్యాపూరణం - 797 (పొట్టివాని భార్య)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
పొట్టివాని భార్య పొడుగరి యఁట!

పద్య రచన - 86


కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

విన్నపము - ౫

విన్నపము
శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు.

అశరణ శరణ్య! నాకింక యళుకు లేదు,
తమ్మి కెంపారు నీదు పాదమ్ము లేను
ముద్దుగొందును, గన్నుల కద్దుకొందు,
నుదుట నిడుకొందుఁ, బ్రాణాలఁ బొదువుకొందు,
బాష్ప సంరుద్ధ గద్గద స్వరముతోడఁ
బాడుకొందు, నౌదల నిడి వేడుకొందు,
వానిపై మెలమెల్ల నీదైన దివ్య
విశ్వమంగళమూర్తి సేవించుకొందు,
నీలమేఘము వోలిన నీదురూపు
పరచుకొందును జీవితాంబరమునందు.
*     *     *     *     *     *
తరఁగలై క్రిందివైపు సాంధ్యప్రకాశ
మలమిన ట్లున్న స్వర్ణపీతాంబరంపుఁ
జెరఁగు జీరాడ, నిటు నటు తిరుగు నాదు
కను లనెడు చాతకమ్ముల కరవుదీర,
నీలమేఘము వోలిన నీదురూపు
పరచుకొందును జీవితాంబరమునందు.

18, ఆగస్టు 2012, శనివారం

సమస్యాపూరణం - 796 (నరసింహా! నిన్ను నమ్మి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
నరసింహా! నిన్ను నమ్మి నాశన మైతిన్.

పద్య రచన - 85


కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

విన్నపము - ౪

విన్నపము
శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు.

చంచల శ్రీదృగంచలాంచన్ముఖాబ్జ!
చిమ్మకుము దవ్వు, నన్ దరిఁజేరనిమ్ము,
భూరి కరుణాప్రఫుల్ల దృక్పుండరీక!
చూడు మొకసారి నన్ను నాగోడు వినుము,
మధుర మధురక్షమోల్లాస మందహాస!
నేరముల్ సైచి నన్ను మన్నింపుమయ్య,
యభయముద్రా సమున్నిద్రహస్తపద్మ!
దురిత సంస్కార ధారలు తుడువుమయ్య!
యెట్టి నిరుపేదతోనైన నీవు కలిసి
మెలసి యుండెదవంచు నేఁ బిలుచుచుంటి,
నొక్కపరి రాగదయ్య! నా యుల్లమెల్ల
పులక లెగయఁగ నడుగులు నిలుపుమయ్య!
కులిశ చక్రాంకుశాదులు కలుష మడఁప,
శంఖ పంకజ శోభ స్వచ్ఛత నొసంగఁ,
గల్పతరు చిహ్న మన్నిఁటి కరవు దీర్ప,
నాయెద జయధ్వజాంకము నాటుమయ్య!

17, ఆగస్టు 2012, శుక్రవారం

సమస్యాపూరణం - 795 (పంది పుటుక్కున)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
పంది పుటుక్కునఁ గొఱికెను భామిని పెదవిన్.

పద్య రచన - 84


కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

విన్నపము - ౩

విన్నపము
శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు.

ఈ యహమ్మమకారము లేల పెరిగె?
మాననీయ మనుష్య జన్మం బిదేల
చిన్నబుచ్చుచుఁ గడపితి నిన్నినాళ్లు?
బంద మిది యెట్లు తప్పించుకొందు స్వామి?
ధర్మపథమునఁ బదము గదల్పరాదు,
నన్ను నే నింత తెలిసికొనంగలేదు,
భక్తియా హత్తుకొనదు నీ పదములందు,
నే యుపాయము లేదు, దిక్కెవరు లేరు,
“మాధవా! యుష్మదంఘ్రులె మామకీన
శరణ” మనుట వినా పెర తెరువు దోప
“దఖిల బాంధవ్యనిధివి నారాయణుఁడవు
నీవె నన్నేలు దొర” వని నేటికేని
తెలిసియో తెలియకయొ నేఁ బలుకుచుంటి,
దీనవత్సల! నాదెసఁ దిరుగు మీవె,
యెటకుఁ జూచినఁగాని పట్టింత లేదు
జారిపోనీకు మచ్యుతస్వామి! నన్ను,
పతితపావన! నావంటి పాపి యొకఁడు
కావలయునన్న నీకుఁ జిక్కఁడు గదయ్య!

16, ఆగస్టు 2012, గురువారం

సమస్యాపూరణం - 794 (కమఠమునం జొచ్చి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
కమఠమునం జొచ్చి మేలుఁ గనె పథికుఁ డటన్.

పద్య రచన - 83


కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

విన్నపము - ౨

విన్నపము
శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు.

నిఖిలమున్ లోన వెలుపల నిండియుండు
స్వామి! నీ సొమ్మెకా చరాచర మిదెల్ల!
యిచ్చవచ్చినటుల్ పరుగెత్తు చేను
దాని నిటు కొల్లగొట్టఁగఁ బూనినాఁడ!
నో దయాంభోధి! నాలోననుండి యీవ
యొసఁగు శక్తిని గాదె యీ యురుకులాట!
అణువణువు తీరుతీరుగ నదికి యదికి
యెవఁడు చేసిన చేత యీ వివిధసృష్టి?
ప్రాణ మెక్కించి, చైతన్య భవ్యకళలు
నించి యిన్నిన్ని యాట లాడించు నెవ్వఁ
డొక్క నీవు దక్క మఱెవ్వఁడోయి! యింత
తెలివి, యింతటి బలిమియు గల వలంతి?
వహహ! యెటు గనుఁగొన్న నీ మహిమ కాదె
చిత్ర చిత్ర గతుల విలసిల్లుచుండు!
నింతటి వెలుంగు గని లోనె యిర్లు క్రమ్మి
తెరపు రా దింత నిన్ను గుర్తెఱుఁగు కన్ను ||
“నేనె యత్నింతు సుఖియింతు నేన” యంచు
విఱ్ఱవీగుదుఁ గాని, నీ విధమె తలఁపఁ,
గలుషితము లీ దురభిమాన ఫలితములకు
నంటువడకనె యీవుందు వంతరమున,
నే నిటుల్ స్వామి విద్రోహ నీచబుద్ధిఁ
గోరుకొను మేలు కీడయి చేరుఁ దుదకు,
నెవరినో తిట్టి పోయుదు, నెవరిపైనొ
విఱుచుకొని పడుచుందు, లోఁ గెరలుచుందు,
నీసు పేరాస మోసము రోసమూని
చేయఁగల యన్ని దొసఁగులు చేయుచుందు,
నౌర! యెంతటి దౌర్జన్య, మౌర! యెంత
పాతక, మ్మిది యోచింపనైతి సుంత,
యో నిరంకుశ లోకేశ! యో ప్రచండ
శాసనోద్దండ! యో సర్వశక్తియుక్త!
నేఁడు నీజాడ సుంత చింతించినంత
గుండె దడదడ లాడుచు నుండె నయ్య!
యెట్టి కట్టిఁడి శిక్ష లెన్నెన్ని యుగము
లనుభవింపఁగ వలెనొ? యీ జనన మరణ
ఘోర చక్రములోఁ దగుల్కొని మఱెన్ని
యటమటఁపు మేను లెత్తి యల్లాడవలెనొ?

(రేపు మరికొంత....)

15, ఆగస్టు 2012, బుధవారం

సమస్యాపూరణం - 79౩ (స్వాతంత్ర్యము వచ్చె)

కవిమిత్రులారా,
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
స్వాతంత్ర్యము వచ్చె మనకు సంబర మడఁగెన్.
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

పద్య రచన - 82

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

విన్నపము - ౧

విన్నపము
శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు.

 
శ్రీసఖా! విన్నప మ్మిది సేతు నీకు,
నాదు పేరాస గొన్గొని నవ్వఁబోకు!
*     *     *     *     *     *     *
ఎవఁడ? నెవ్వరివాఁడ? నే నెచటివాఁడ?
నిట కెటుల్ వచ్చి? తింకెటు లేగువాఁడఁ?
దెలియ దిసుమంత, సకలమ్ము తెలియునన్న
గర్వ మొక్కటియే గూడుగట్టుఁ గాని |
యేమి కర్మమో కటకటా! యింద్రియముల
చేతి కీల్బొమ్మనై భ్రమ జెందుచుంటి,
నొక్క నిముసము విశ్రాంతి చిక్కనీక
యేచి దుర్వార జవమున లేచు నవియె |
యేది యెటు లాగు, నే నటు పోదు, నింతె,
యివియె నా పోటుబంట్లు, నా కెపుడొ యేదొ
తోచినం జాలు, నివియెల్లఁ దోడుగాఁగ
సృష్టికళమీది కట్టె దండెత్తి వత్తు,
నిద్ది కూడును, గూడని దిద్ది యనెడు
జంకు కొం కనుమాట లేశమ్ము లేదు |
మదికి నచ్చినఁ జాలు, నేమాడ్కినైన
నాదియై తీరవలె నది యేది కాని ||

(రేపు మరికొంత....)

14, ఆగస్టు 2012, మంగళవారం

సమస్యాపూరణం - 792 (చేపలపులు సడిగెరా)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
చేపలపులు సడిగెరా వసిష్ఠుడు ప్రీతిన్.

పద్య రచన - 81


కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

13, ఆగస్టు 2012, సోమవారం

సమస్యాపూరణం - 791 (నాకు నీకు మాకు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
నాకు నీకు మాకు మీకు మనకు!

పద్య రచన - 80

 కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

రవీంద్రుని గీతాంజలి - 103

IN one salutation to thee, my God, let
all my senses spread out and touch this
world at thy feet.

Like a rain-cloud of July hung low
with its burden of unshed showers let
all my mind bend down at thy door in
one salutation to thee.

Let all my songs gather together
their diverse strains into a single current
and flow to a sea of silence in one salu-
tation to thee.

Like a flock of homesick cranes flying
night and day back to their mountain
nests let all my life take its voyage to
its eternal home in one salutation to
thee. 

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము....

ఒక నమస్కారమందె నా యొడలియెల్ల
యింద్రియములు చివాలున నెగసి దేవ!
తాకుఁగాక నీపాదగతము జగమ్ము ||

కురిసి తరుగని క్రొన్నీటి బరువుతోడ
వ్రాలు శ్రావణమేఘమువోలె స్వామి!
యొక నమస్కృతిలోనె నాయుల్లమెల్ల
వంగియుండెడుఁగాక నీ వాకిలికడ ||

వివిధరాగస్వరాలాపభిన్నభిన్న
గీతు లన్ని యొకేయొకరీతిలోనఁ
గూడి మౌనపయోధి పొంగున లయించుఁ
గాక నీకైన యొక నమస్కారమందె ||

మఱలఁ దమతావు మానససరసు జేర
నరుగు తహతహతోఁ బవలనక, రేయి
యనక, యొక్క యుడ్డీనమునందె లేచి
పోవు రాయంచగుంపునువోలి నాదు
ప్రాణముల్ మహామృత్యుతీరాన వెల్గు
స్వీయ శాశ్వత భవనముఁ జేర నెగసి
చనెడుఁగావుత నొక నమస్కారమందె ||

-* సంపూర్ణము *-

12, ఆగస్టు 2012, ఆదివారం

సమస్యాపూరణం - 790 (లే లే నా రాజ యనిన)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
లే లే నా రాజ యనిన లేవఁడు రాణీ!
(ఈరోజు సమస్య ఏమివ్వాలా అని ఆలోచిస్తుంటే
పక్కింట్లోంచి ‘ప్రేమ్‌నగర్’ సినిమా పాట వినిపించింది)

పద్య రచన - 79

 కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

రవీంద్రుని గీతాంజలి - 102

I BOASTED among men that I had known
you. They see your pictures in all
works of mine. They come and ask
me, "Who is he?" I know not how
to answer them. I say, "Indeed, I
cannot tell." They blame me and they
go away in scorn. And you sit there
smiling.

I put my tales of you into lasting
songs. The secret gushes out from my
heart. They come and ask me, "Tell
me all your meanings." I know not
how to answer them. I say, " Ah, who
knows what they mean ! " They smile
and go away in utter scorn. And you
sit there smiling.

చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము.....

“ని న్నెఱింగినవాఁడను నే” నఁటంచు
నెల్ల యీ జనులందు గర్వించుచుందు,
నేను గీచిన బొమలలోన నీదు
పెక్కురూపులు సూచి నాచక్కి జేరి
“యీతఁ డెవ?” రని నన్ను బ్రశ్నింత్రు వార,
లేమి తెలియును నాకు? నే నేమి చెప్ప?
నిజము పల్కుదు “నేఁ జెప్పనేర” నంచు,
నీసడించుచు ధిక్కృతి సేసి నన్ను
వారు పోయెద, రచ్చటఁ గూరుచుండి
నవ్వుకొందువు ముసిముసినవ్వు లీవు ||

అమరగీతాల నీకత లల్లువేళ
హృద్గతరహస్యముల్ ప్రవహిల్లి వచ్చు,
“నర్థమే?” మని వచ్చి వా రడిగినప్పు
డేను మఱియేమి చెప్పుదు? “వాని యర్థ
మెవ్వఁ డెఱుఁగు?” నఁటంచు వచింతు నింతె,
యేగెదరు వారు నవ్వుచు హేళనముగ,
మందహాసానఁ గూర్చుండి యుందు వీవు ||

11, ఆగస్టు 2012, శనివారం

సమస్యాపూరణం - 789 (చీకాకులె సుఖము నొసఁగి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
చీకాకులె సుఖము నొసఁగి చింత బాపున్.

పద్య రచన - 78

 
కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

రవీంద్రుని గీతాంజలి - 101


EVER in my life have I sought thee
with my songs. It was they who led
me from door to door, and with them
have I felt about me, searching and
touching my world.

It was my songs that taught me all
the lessons I ever learnt ; they showed
me secret paths, they brought before
my sight many a star on the horizon of
my heart.

They guided me all the day long to
the mysteries of the country of pleasure
and pain, and, at last, to what palace
gate have they brought me in the
evening at the end of my journey ?

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము.....

ఎవ్వి నన్ గొనిపోయె నింటింటికడకు,
వేనితో లోని వెలుపలి విశ్వమెల్ల
నరసి కేలంటి కంటి నాత్మానుభవము,
నట్టి గీతాలతోన ని న్ననుదినమ్ము
వెదకుచుంటి మదీయజీవితమునిండ ||

ఏ నెఱుఁగు విద్యలెల్ల నా కివియె నేర్పె,
కనఁబరచె నాకు గుప్తమార్గముల నివియె,
దృష్టికిం దెచ్చె నివియె నాహృదయగగన
తలమున వెలుంగు నెన్నెన్ని తారకలనొ ||

వివిధ సుఖదుఃఖమయమగు నవనియందుఁ
గల రహస్యములైన తావులకు నన్నుఁ
దీసికొని చని పవలెల్ల ద్రిప్పి తుదకు
నవియె మలుసందెవేళ యాత్రాంతమందు
నిలిపె నేరాచనగరు వాకిలికిఁ దెచ్చి? ||

10, ఆగస్టు 2012, శుక్రవారం

‘శ్రీమదధ్యాత్మరామాయణము రచన - ఒక తపస్సు’ పై స్పందన

పూజ్యశ్రీ నేమాని గురుదేవులకు
ప్రణతిపురస్సరంగా,

          దాదాపు నెలన్నరపాటు ఏదో ఒక కారణాన ఇంటర్నెట్ చూడటం వీలయింది కాదు. ఈ రోజే శంకరాభరణంలో మీరు వ్రాసిన అధ్యాత్మ రామాయణం రచనాదీక్షను గుఱించిన విశేషాలను సాకల్యంగా చదివాను. చదివినందుకు ఎంతో ఆనందం కలిగింది.

          మీ రచనావ్యాసంగాన్ని శీర్షికలోనే మీరు తపోయోగంతో రూపించడం ఎంతో సముచితంగా ఉన్నది. కామేశ్వరీ శతకంలో “కవనార్థం బుదయించితిన్” అన్న చెళ్ళపిళ్ళ వారి అభిజ్ఞానం, రామాయణ కల్పవృక్షంలో “కవితారూప తపస్సు చేసితిని శ్రీకంఠా!” అన్న విశ్వనాథ వారి వినివేదనం జ్ఞప్తికి వచ్చాయి.

          మీ రసన తీయనైనది. మీ రచన హృద్యమైనది. ధారాశుద్ధి అపురూపం. చిత్రకవిత్వం వచ్చినప్పుడు సైతం ప్రసన్నతను నిలుపుకొనటం నిజంగా ప్రశంసనీయం. మూలంలోని ఆ అతిప్రౌఢమైన శైలిని, అద్వైతశాస్త్రం లోతులను తడవి చూచిన ఘట్టాలను, దర్శనాంతసాహిత్యదృష్టిని, పాదుకాంతమంత్రసాధనరహస్యాలను, సాలంకృతమైన అభివ్యక్తికౌశలిని, పారాయణయోగ్యతను అనురణింపజేసి రాణింపజేయటం ఎంతటివారికైనా దుస్సాధమైన మహావిషయం. పూర్వం నారు నాగనార్య మహాకవి రచించిన అధ్యాత్మ రామాయణము పద్యానువాదం ఒకటి నా వద్ద ఉన్నదానిని ఒకప్పుడు చదువుకొన్నాను. ఆ తర్వాత వావిళ్ళ వారు ప్రకటించినది, శ్రీ మలయాళస్వాముల వారు ప్రకటించినది వచనానువాదాలను చదివాను. మనస్సులో అక్కడక్కడ వాటితో సరిపోల్చుకొంటూ చదివినప్పుడు ప్రసన్నసరస్వతీకమైన మీ అభినవానువాదం రమణీయమైన ధార మూలాన హాయిగా సాగిపోయినదని అనిపించింది. ఇది నిశ్చితమైన నా అభిప్రాయం. 

          పంక్తిపావనమైన మీ రచన నేపథ్య-రచనను శంకరాభరణంలో ప్రకాశింపజేసినందుకు శ్రీ శంకరయ్య గారికీ హార్దికాభినందనలను తెలియజేస్తున్నాను. దీనిని ఏతత్ప్రకటనకాలంలో వెంటనే పంపలేకపోయినందుకు మన్నింప ప్రార్థన.

వినమ్రంగా,
ఏల్చూరి మురళీధరరావు

సమస్యాపూరణం - 788 (వృద్ధురాలికి నేఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...

వృద్ధురాలికి నేఁడు వేవిళ్ళు గలిగె !
ఈ సమస్యను పంపిన వసంత కిశోర్ గారికి ధన్యవాదములు.

పద్య రచన - 77

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

రవీంద్రుని గీతాంజలి - 100


I DIVE down into the depth of the ocean
of forms, hoping to gain the perfect
pearl of the formless.

No more sailing from harbour to
harbour with this my weather-beaten
boat. The days are long passed when
my sport was to be tossed on waves.

And now I am eager to die into the
deathless.

Into the audience hall by the fathom
less abyss where swells up the music of
toneless strings I shall take this harp of
my life.

I shall tune it to the notes of for ever,
and, when it has sobbed out its last
utterance, lay down my silent harp at
the feet of the silent.

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము.....

నేను రూపాబ్ధిలో రూపులేని నిండు
ముత్తె మాసించి లోతున మునుఁగు చుంటి,
చాలు, నాజీర్ణ నౌకను సారె కింక
రేవురేవునకుం గొనిపోవ నొల్ల ||

కెరటముల కెదురీదుచు మురియు నట్టి
యాట పాటల తరియెల్ల దాటిపోయె,
అమృత గంభీర వారాశి యడుగుముట్టి
మడియుటకు నేడు వేడుక పొడమె నాకు ||

వీనులందఁగ జాలని గానధార
యెపుడు నిస్స్వర తంత్రుల నెగయు నట్టి
లోతు తెలియని యతల సభాతలమున
కేను గొనిపోదు మామక ప్రాణవీణ ||

దాని నుతి గల్పుదు నఖండగానమునకు,
చివరి గీతిక మ్రోగి మూగవడు వీణ
నుంతు నిశ్శబ్దమౌ తత్పదాంతికమున ||

9, ఆగస్టు 2012, గురువారం

దత్తపది - 24

శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు!
శివునకు అలంకారాలైన
చంద్ర - నాగ - గంగ - భస్మ
పదాలను ఉపయోగిస్తూ మీకు నచ్చిన ఛందస్సులో
శ్రీకృష్ణుని స్తుతిస్తూ పద్యం వ్రాయండి.
కవిమిత్రుల పూరణలు

1. గోలి హనుమచ్ఛాస్త్రి
నాగ శయన! కంసాంతక! నల్లనయ్య!
చంద్ర కాంతుల మించెడు చల్లనయ్య!
భస్మ మాయెను నా పాప పంకిలమ్ము
బాలకృష్ణ! నే మునుగంగ భక్తి లోన.
 
  

*     *     *     *     *
2. పండిత నేమాని
యదుకులాంభోధి చంద్ర! దేవాధిదేవ!
భక్తి చెలగంగ నీ పదాబ్జములు గొలుతు
నందనందనా! గతివీవె నాకు కృష్ణ!
భస్మ మొనరింపుమా హృత్స్థ వైరితతిని.

*     *     *     *     *
3. లక్ష్మీదేవి
ముడివేసి ముడిచిన ముత్యంపు దండయో
          శశిధరు తలపైని చంద్రవంక!
మెడలోన ధరియించు మెరుపుల హారాలు..
          నాగరాజుల బోలు నగలు గాదె!
భక్తిలో మునుగంగ పరమాత్ముడొక్కడే,
          పోతన్న జూపించె ముక్తి పథము.
మేనిపూతగ జేరి మెండు మరకలయ్యె
          భస్మరేఖల వంటి వనుచు తెలిపి..
భక్తి గలిగి, మంచి భావన పెంచుచు,
దైవ కృపకు పాత్రత బడయంగ,
విష్ణు శివుల మధ్య వేఱు భావము జూప
బోకుమనుచు మనకు బోధ చేసె.
*     *     *     *     *
4. సుబ్బారావు

ంద్రింబు బోలు ప్రన్నుడ
నాగ శయనుడు విష్ణువు యాగ భోక్త
గంగ పుత్రున కిష్టుడు కైటభారి

 భస్మ ధారుని చెలికాడు భవ్య మూర్తి
*     *     *     *     *
5. చంద్రమౌళి
పంచమాత్రాగణయుక్త చౌపది -
పరమాత్ముడే విష్ణు చంద్రసోదరివిభుడు
వరనాగశయనుఢే కృష్ణుడతడు
సురులు మునులెల్ల వర మడుగంగ శిష్టులను
కరుణించె రిపుల ్ముగ
జేసి
(దీనికి నేమాని వారి పద్యానుకృతి)
సరసిజాక్షుడు చంద్రసోదరికి విభుడు
నాగశయనుండు శౌరి జనార్దనుండు
సురలు వరమడుగంగ కృష్ణుడయి వెలసి
భస్మ మొనరించె దానవ వ్రాతములను.
*     *     *     *     *
6. సహదేవుడు
సూర్యచంద్రనేత్ర! శుభనామ! భవనాశ!
సాగరమునఁదేలు నాగశయన!
నీదు పాదగంగ నాదు జీవనగంగ
పద్మనాభ! స్మరణ వదల నెపుడు.
*     *     *     *     *
7. గుండు మధుసూదన్
యదు కులాబ్ధి చంద్ర! యవనారి! గోపాల!
పాద జనిత గంగ! వాసుదేవ!
నగధర! వ్రజ మోహనా! గరుడ గమన!
శౌరి! పద్మనాభ! స్మర జనయిత!
*     *     *     *     *
8. కమనీయం
యదుకులాబ్ధిచంద్ర! యమునాతటవిహారి!
నందగోపబాల! నాగశయన!
భస్మధారిమిత్ర! భక్తిలోమునుగంగ
మాకు మోక్ష మిచ్చు మావిభుడవు. 

పద్య రచన - 76

శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదిన శుభాకాంక్షలు!
కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

రవీంద్రుని గీతాంజలి - 99


WHEN I give up the helm I know that
the time has come for thee to take it.
What there is to do will be instantly
done. Vain is this struggle.

Then take away your hands and
silently put up with your defeat, my
heart, and think it your good fortune
to sit perfectly still where you are
placed.

These my lamps are blown out at
every little puff of wind, and trying to
light them I forget all else again and
again.
But I shall be wise this time and wait
in the dark, spreading my mat on the
floor ; and whenever it is thy pleasure,
my lord, come silently and take thy
seat here.

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము.....

ఎఱుఁగుదున్ స్వామి! “చుక్కాని యేను విడినఁ
దీసికొను తరి నీ కరుదెంచు” నంచు,
జరుగునది తత్క్షణమ్మున జరిగితీరు,
నేను లాగెడి శ్రమ మిది నిష్ఫలమ్ము ||

ఉల్లమా! చేతులం దూర ముంచుకొనుచు
నోటమిం గొని కిమ్మనకుండు మింక,
“యిదియె నా భాగ్యమౌ” నని యెంచుకొంచు
నున్నకడ సుంత కదలక యుండు మీవు ||

మలిగిపోవుచునున్నవి మామకీన
దీపము లొకొక్క చిరుగాలి దెబ్బతోన,
వాని వెల్గించు యత్నములోనె మాటి
మాటి కితరము లన్నిఁటి మరచుచుంటి ||

కాని యిపుడు వివేకముగా మెలంగ
వలయు పో, నేలపైఁ జాప పరచి యుంచి
యే నెదురుచూతుఁ జీఁకటిలోనె యింక,
మౌనముగ నా ప్రభూ! యిష్టమైనయపుడె
యిచటి నీ యాసనమ్ము గ్రహింప రమ్ము ||    

8, ఆగస్టు 2012, బుధవారం

సమస్యాపూరణం - 787 (రాలు కరగించు నెదను)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
రాలు కరగించు నెదను వరాల నిచ్చు.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదములు.

పద్య రచన - 75


కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

రవీంద్రుని గీతాంజలి - 98


I WILL deck thee with trophies, garlands
of my defeat. It is never in my power
to escape unconquered.

I surely know my pride will go to the
wall, my life will burst its bonds in ex-
ceeding pain, and my empty heart will
sob out in music like a hollow reed, and
the stone will melt in tears.

I surely know the hundred petals of
a lotus will not remain closed for ever
and the secret recess of its honey will
be bared.

From the blue sky an eye shall gaze
upon me and summon me in silence.
Nothing will be left for me, nothing
whatever, and utter death shall I receive
at thy feet.

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము.....

నీ జయాంకంబులో నా పరాజయంపు
హారముల్ సేతు నీ కలంకారములుగ,
పరిభవంబును గనకయ బయటఁ బడుట
శక్తి కందని పని సుమా! స్వామి! నాకు ||

నా యహంకృతి నుగ్గునుగ్గై యడంగు,
నమితవేదనఁ బ్రాణబంధములు ప్రిదులు,
వెదురుబొం గట్లు నా శూన్యహృదయ మరచు,
గరఁగిపోవును గన్నీళ్లఁ గఠినశిలయు,
తెలియు నిది నిశ్చయమ్ముగఁ దెలియు నాకు ||

తలఁప శతపత్రమందలి దళము లెల్ల
నొక్కరీతిన ముకుళించి యుండ వెపుడు,
గుప్త మధుకోశ మది విప్పుకొనకపోదు,
తెలియు నిది నిశ్చయమ్ముగఁ దెలియు నాకు ||

గగనముననుండి పరికించి *కన్ను లేవొ
పిలుచు నిశ్శబ్దమై యింటి వెలికి నన్ను!
మిగుల దేదియు నాకిట మిగుల దపుడు,
పరమమృత్యువు గందు నీ పదములందు ||

7, ఆగస్టు 2012, మంగళవారం

సమస్యాపూరణం - 786 (సిగ్గులేనివాఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
సిగ్గులేనివాఁడు శ్రీవిభుండు.
ఈ సమస్యను సూచించిన గోలి హనుమచ్ఛాస్త్రి గారికి ధన్యవాదములు.

పద్య రచన - 74


కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

రవీంద్రుని గీతాంజలి - 97


WHEN my play was with thee I never
questioned who thou wert. I knew nor
shyness nor fear, my life was boisterous.

In the early morning thou wouldst
call me from my sleep like my own
comrade and lead me running from
glade to glade.

On those days I never cared to know
the meaning of songs thou sangest to
me. Only my voice took up the tunes,
and my heart danced in their cadence.

Now, when the playtime is over,
what is this sudden sight that is come
upon me ? The world with eyes bent
upon thy feet stands in awe with all its
silent stars.

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము.....

కూడి నీతోడ నే నాడుకొంటిఁ గాని,
యెప్పు డడుగనె లేదు “నీ వెవ్వ” రంచు,
తెలియదు భయమ్ము, లజ్జయు తెలియ దపుడు,
బ్రతుకు ప్రవహిలుచుండె సంబరములందె ||

సహచరునివోలె వేకువ సమయమందుఁ
బిలిచి న న్నీవు నిద్ర మేల్కొలుపువాఁడ,
వపుడు నవ్వుచుఁ ద్రుళ్ళుచు నాటలాడ
వత్తు నీవెంట పరుగెత్తి వనికి వనికి ||

నీవు పాడిన పాటల భావ మేమొ
ఆ దినమ్ముల నేనింత యరయ లేదు,
గొణుగుకొనుచుంటి నీపాట గొంతుగల్పి,
దాని లయతోన యెదయు నర్తన మొనర్చె ||

ఆటవేళ సమాప్త మైనంతలోన
ఈ హఠాద్దర్శనం బిపు డేమి స్వామి?
యీ నభోభాగమెల్ల స్తభించిపోయె,
చంద్ర భాస్కర బింబముల్ సద్దుమణఁగె,
నవుర! యేకాంతభయభక్తి వివశ మగుచు
సకల విశ్వము మౌనతారకల కనులు
నీదు పాదాల వాలిచి నిలిచి యుండె ||

6, ఆగస్టు 2012, సోమవారం

సమస్యాపూరణం - 785 (మాటకు నిలబడనివాఁడె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
మాటకు నిలబడనివాఁడె మాన్యుఁడు జగతిన్.
ఈ సమస్యను సూచించిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదములు.

పద్య రచన - 73

అశ్వత్థామ పరాభవము
కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

రవీంద్రుని గీతాంజలి - 96


WHEN I go from hence let this be my
parting word, that what I have seen is
unsurpassable.

I have tasted of the hidden honey of
this lotus that expands on the ocean of
light, and thus am I blessed let this
be my parting word.

In this playhouse of infinite forms
I have had my play and here have
I caught sight of him that is formless.

My whole body and my limbs have
thrilled with his touch who is beyond
touch ; and if the end comes here,
let it come let this be my parting word.

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము.....

ఇదియె చెప్పుచుఁ బోదు నే నేగునాడు,
“కంటి నెది యెద్ది, నేనందుకొంటి నెద్ది,
యది సమస్తము సాటిలేనిది” యఁటంచు
నిదియె చెప్పుచుఁ బోదు నే నేగునాడు ||

విప్పె శతదళపద్మమీ వెలుఁగుకడలి,
అందె నిట నాకు గుప్తమరందరసము,
నేను ధన్యుఁడ నైతి నద్దానిఁ గ్రోలి
యిదియె చెప్పుచుఁ బోదు నే నేగునాడు ||

లెక్క యిడరాని యాకృతు ల్మెదలు విశ్వ
మనెడి క్రీడాగృహమ్మున నాడుకొంటి,
రూపరహితుని దివ్యస్వరూప మేను
రెండు కన్నుల నిండ దర్శించుకొంటి,
స్పర్శ మందనివాని సంస్పర్శనమున
నెల్ల మే నంగమంగము ఝల్లు మనియె,
అగునయే నంత మిప్పుడె యగునుఁగాక
యిదియె చెప్పుచుఁ బోదు నే నేగునపుడు ||

5, ఆగస్టు 2012, ఆదివారం

సమస్యాపూరణం - 784 (కరము కరము సౌఖ్య)

 కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
కరము కరము సౌఖ్యకరము సుమ్ము!

పద్య రచన - 72


కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

రవీంద్రుని గీతాంజలి - 95

 I WAS not aware of the moment when
I first crossed the threshold of this life.

What was the power that made me
open out into this vast mystery like a
bud in the forest at midnight !

When in the morning I looked upon
the light I felt in a moment that I was
no stranger in this world, that the in-
scrutable without name and form had
taken me in its arms in the form of my
own mother.

Even so, in death the same unknown
will appear as ever known to me. And
because I love this life, I know I shall
love death as well.

The child cries out when from the
right breast the mother takes it away,
in the very next moment to find in the
left one its consolation.

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము....

ఏ నెఱుంగను దొలుదొల్త నేక్షణాన
దాటినాఁడనొ యీజీవితంపుఁ గడప? ||

అడవి నడురేయిఁ జిట్లిన యలరుమొగ్గ
యట్లు, సువిశాల మీరహస్యంపు జగతిఁ
జిళ్ళిపడునటు లేశక్తి చేసె నన్ను? ||

తెలిసికోరాని, నామరూపులును లేని
తన్మహాశక్తియే కన్నతల్లియౌచుఁ
దాను న న్నోడిలోపలఁ దాల్చెనంచు
నేనిటకుఁ గ్రొత్తవాఁడను గానఁటంచు ||

ప్రథమసంధ్యాసువర్ణశోభల జగమ్ము
జూచినప్పుడె చప్పున దోచెనాకు ||

తెలియరాకను, యుగయుగమ్ముల పరిచితి
గలిగినట్లది చెంగట నిలిచి నన్నుఁ
దానె యొడిఁ జేర్చు మృత్యుకాలానఁ గూడ,
ఎట్లు జీవనమన్నఁ బ్రేమించుచుంటి
నింక మరణము నట్లె ప్రేమింతుఁ గాక ||

తల్లికుడిచను బాపినంతటనె బిడ్డ
యేడ్చుఁ గెవ్వునఁ, గాని తా నెడమవైపు
జేర్చి మరునిముసాన నోదార్చు నాపె ||

4, ఆగస్టు 2012, శనివారం

రవీంద్రుని గీతాంజలి - 94


AT this time of my parting, wish me
good luck, my friends ! The sky is
flushed with the dawn and my path lies
beautiful.

Ask not what I have with me to take
there. I start on my journey with
empty hands and expectant heart.

I shall put on my wedding garland.
Mine is not the red-brown dress of the
traveller, and though there are dangers
on the way I have no fear in my mind.

The evening star will come out when
my voyage is done and the plaintive
notes of the twilight melodies be struck
up from the King's gateway.

చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము....

ప్రియసుహృజ్జనులార! యీ వీడుకోలు
కాలమున నాకు మీ శుభాకాంక్ష లిండు,
ప్రాతరారుణ్యశోభ నభమ్ముఁ గ్రమ్మె,
పరమరమణీయ మయ్యె నే నరుగుత్రోవ ||

“ఏమి పాధేయముం గొని యేగెద” వని
యడుగకుఁడు, వట్టిచేతుల నరుగుచుంటి,
కాని మది నిండియున్నది గంపెడాస ||

పథికవేషానఁ గాదు, వివాహమాల్య
భూషణాంబరధారినై పోదు నేను
కలవు నడుత్రోవఁ బెక్కు సంకటము, లైన
మనసులో లేదు భయమను మాట నాకు ||

యాత్ర ముగిసినయంత సాయంతనంపు
తార వెల్గొందు, నాస్వామి ద్వారసీమఁ
గరుణమయ సాంధ్య వాద్యముల్ మొరయుచుండు ||

సమస్యాపూరణం - 783 (శ్రావణమేఘములు గురియ)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
శ్రావణమేఘముు గురియాగ సుములన్.

పద్య రచన - 71


కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

3, ఆగస్టు 2012, శుక్రవారం

సమస్యాపూరణం - 782 (వరుఁ డశుభమును)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
వరుఁ డశుభమును బల్కె వివాహవేళ.

పద్య రచన - 70


కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

రవీంద్రుని గీతాంజలి - 93

I HAVE got my leave. Bid me farewell,
my brothers 1 1 bow to you all and
take my departure.

Here I give back the keys of my
door and I give up all claims to my
house. I only ask for last kind words
from you.

We were neighbours for long, but I
received more than I could give. Now
the day has dawned and the lamp
that lit my dark corner is out. A
summons has come and I am ready
for my journey.

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము.....

సెలవు దొరికెను పయనము సలుప నాకు,
వీడుకొందుఁ బ్రణామముతోడ మిమ్ము
పలుకుఁడీ శుభవాక్కులు భ్రాతలార!

ఇచ్చితిం బీగఁపుంజెవు లివి కొనుండు
వచ్చె మాయింటిహక్కు సర్వమ్ము మీకు,
నొక్క తుదిసారి కారుణ్యవాక్కు దక్క
ననుఁగు సైదోడులార! మి మ్మడుగ నెద్ది ||

ఇరుగు పొరుగునఁ జిరకాల మిచట నుంటి
మిచ్చితిన్ స్వల్ప, మధికము పుచ్చుకొంటి,
నిపుడు తెలవారె, నాచీఁకటింటిమూల
వెలు గొలుకు దీప మారెను, పిలుపు చేరె,
సిద్ధముగ నుంటిఁ బయనము సేయుకొఱకు ||

2, ఆగస్టు 2012, గురువారం

సమస్యాపూరణం - 781 (అన్న చావునకు)

కవిమిత్రులారా,
రక్షాబంధన మహోత్సవ శుభాకాంక్షలు!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
అన్న చావునకు ిమిత్త మయ్యె ననుజ.

పద్య రచన - 69

అందరికీ రక్షాబంధన పర్వదిన శుభాకాంక్షలు.
కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

రవీంద్రుని గీతాంజలి - 92

I KNOW that the day will come when
my sight of this earth shall be lost, and
life will take its leave in silence, drawing
the last curtain over my eyes.

Yet stars will watch at night, and
morning rise as before, and hours heave
like sea waves casting up pleasures and
pains.

When I think of this end of my
moments, the barrier of the moments
breaks and I see by the light of death
thy world with its careless treasures.
Rare is its lowliest seat, rare is its
meanest of lives.

Things that I longed for in vain and
things that I got let them pass. Let
me but truly possess the things that I
ever spurned and overlooked.

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము....

ఏ దినమ్మునఁ గన్నులయెదుట నాకు
జగతి యిది కానవచ్చుట ముగిసిపోవు,
ప్రాణ మేనాడు కన్నులపైనిఁ జిట్ట
చివరి తెర వేసి చప్పుడుసేయ కెగయు,
దిన మదియ రాఁగల దఁటంచుఁ దెలియు నాకు ||

అప్పుడున్ రేయిఁ దొల్లిటి యట్లె చుక్క
లుండు, వేకువవేళ సూర్యుఁడును బొడుచు,
కాలజలధిని గష్టసుఖాల తడలు
గడియ గడియగ లేచుచుఁ బడుచునుండు ||

అంతిమంపు క్షణమ్ము లూహింతునేని
కాలసీమలు సడలి భగ్న మయిపోవు,
నేను లక్ష్యము సేయని యెన్నియేని
పెన్నిధుల వెలుగొందు నీవిశ్వమెల్ల
కన్నులకుఁ గట్టు మృత్యువు కాంతిలోన,
అరిది కడుకొద్దిచోటైన దొరుకు టిచట,
తుచ్ఛతమజీవి యగుటయు దుర్లభ మిట ||

కోరుకొన్నవి, నాకుఁ జేకూరునవియు
పనికిమాలిన, వవియెల్ల చనఁగ నిమ్ము
ఎది తిరస్కృత మెద్ది యుపేక్షితమ్ము
నిక్క మది యొక్కటియె నాకు దక్కనిమ్ము ||

1, ఆగస్టు 2012, బుధవారం

పద్య రచన - 68

 
కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

సమస్యాపూరణం - 780 (తల్లి మగఁడు నాకు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
తల్లి మగఁడు నాకు తమ్ముఁ డును.

రవీంద్రుని గీతాంజలి - 91

O THOU the last fulfilment of life, Death,
my death, come and whisper to me ! .
Day after day have I kept watch for
thee; for thee have I borne the joys
and pangs of life.

All that I am, that I have, that I hope
and all my love have ever flowed towards
thee in depth of secrecy. One final
glance from thine eyes and my life will
be ever thine own.

The flowers have been woven and the
garland is ready for the bridegroom.
After the wedding the bride shall leave
her home and meet her lord alone in the
solitude of night.

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము....

ఓ చరమ పూర్ణభావమా! ఓ మదీయ
మరణమా! రమ్ము నాతోడ మాటలాడ,
నీకొరకె కాచుకొని యుంటి నిత్య మేను
బ్రతుకులో సుఖదుఃఖాల భారమెల్ల
మూపులం దాల్చి నీకయి మోయుచుంటి ||

ఏను, నాది, నాయాశ, నాయెల్ల ప్రేమ
కడు గభీర నిగూఢ మార్గమ్ము పట్టి
యెల్లపుడు నీదెసకె ప్రవహిల్లుచుండె,
నొక్క తుదిచూపు విసరితివో సతమ్ము
స్వీయ మగుఁ జుమ్ము నీకు నాజీవితమ్ము ||

పూలు గ్రుచ్చుట యెప్పుడొ ముగిసిపోయె,
సిద్ధముగ నుండె వరమాల చేతులందు,
పరిణయం బౌటె తడ, విక వధువు తనదు
తొంటియింటిని విడనాడి యొంటి యౌచుఁ
గాంతుతో జతగూడు నేకాంతరాత్రి ||