31, డిసెంబర్ 2011, శనివారం

చమత్కార పద్యాలు - 163

ఏకస్థానీయం

(ఈ శ్లోకంలో్ కంఠ్యాలైన అ,ఆ,క,ఖ,గ,ఘ,ఙ,హ అక్షరాలు మాత్రమే ప్రయుక్త మయ్యాయి)

అగా గాఙ్గాఙ్గకాకాఙ్గ
గాహకాఘ కకాకహా |
అహాహాఙ్గ ఖగాఙ్కాగ
గకఙ్గాగ ఖగాఙ్గగ
||

తాత్పర్యం
గంగాతరంగాలలో స్నానమాడే ఓ యాత్రికుడా! నీకు సంసారబాధలు తెలియవు. మేరుపర్వత మెక్కి అక్కడ తపస్సు చేయి. ఆ తర్వాత మమ్మల్ని పాపాలనుండి విముక్తులను చేయడానికి దిగిరా!

(శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారు సేకరించిన ‘ప్రహేళికలు’ గ్రంథంనుండి)

సమస్యాపూరణం - 577 (గతకాలము మేలు)

కవిమిత్రులారా,
             2011 సంవత్సరానికి వీడ్కోలు!
          ఈ సంవత్సరమంతా పూరణార్థం రోజుకొక సమస్య నిస్తూ వస్తున్న నాకు బ్రతుకే సమస్య అయింది. మనశ్శాంతిని దూరం చేసిన ఉద్రిక్త పరిస్థితులను ఎన్నో ఎదుర్కొన్నాను. కోడలుతో సమస్య, ఊళ్ళు, ఇళ్ళు  మారడం, శారీరక. మానసిక, ఆర్థిక ఇబ్బందులు నన్ను బాధ పెట్టాయి. బ్లాగు నిర్వహణ ఒక్కటే నాకు సాంత్వన నిచ్చింది. బ్లాగు మిత్రులు ఎప్పటికప్పుడు నాకు  ధైర్యాన్ని ఇచ్చారు. ఆర్థికంగానూ ఆదుకున్నారు.
          మిత్రులు కేవలం సమస్యలను పూరించడమే కాక మిగిలినవారి పూరణల గుణదోష విచారణ చేస్తూ నాకు శ్రమ తగ్గించారు. ఛందోవ్యాకరణాల గురించి సంస్కారపూరిత చర్చలు చే్సారు. బ్లాగు మిత్రుల మధ్య అన్యోన్యత పెరిగింది. వారి స్నేహానికి బ్లాగు ఒక మాధ్యమం అయింది.
          ఒకటి రెండు అజ్ఞాత వ్యాఖ్యల వల్ల మనస్సు కొంత చివుక్కు మన్నా ‘స్థితప్రజ్ఞత’ను అలవరుచుకొనే ప్రయత్నం చేసాను.
          ఈ సంవత్సరానికి వీడ్కోలు పలికే ఈ తరుణంలో నాకు అన్ని విధాల సహకరిస్తున్న బ్లాగుమిత్రు లందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది
      గతకాలము మేలు వచ్చు కాలముకంటెన్.
                                

30, డిసెంబర్ 2011, శుక్రవారం

చమత్కార పద్యాలు - 162

ఏకాక్షర శ్లోకం

యాయాయాయాయాయాయాయా
యాయాయాయాయాయాయాయా |
యాయాయాయాయాయాయాయా
యాయాయాయాయాయాయాయా
||

పదవిభాగం 
యాయాయా, ఆయ, ఆయాయ, అయాయ, అయాయ, అయాయ, అయాయ, అయాయ, ఆయాయాయ, ఆయాయాయ, ఆయాయా, యా, యా, యా, యా, యా, యా, యా, యా. 

తాత్పర్యం
భగవంతునికి అలంకారమైన ఈ పాదుకలు  మనకు అన్ని శుభాలను కలిగిస్తాయి. సర్వరోగాలను హరిస్తాయి. నిరంతరం అతని సన్నిధిలో ఉండాలనే మన కోరికను సఫలం చేసే జ్ఞానాన్ని చేకూర్చుతాయి. ఈ పాదుకల వలన మనం ప్రపంచంలోని అన్ని ప్రదేశాలకూ చేరుకోవచ్చు. అటువంటి మహిమాన్వితమైన ప్రభుపాదుకలకు వందనం. 

(శ్రీ వేదాంత దేశికుల ‘పాదుకాసహస్రం’ నుండి)

సమస్యాపూరణం - 576 (ఏడడుగుల బంధ మౌర)


కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది
ఏడడుగుల  బంధ మౌర ! యేటికి బంపెన్.
ఈ సమస్యను పంపిన 
శ్రీ పోచిరాజు సుబ్బారావు గారికి
ధన్యవాదాలు.

నా పాటలు - (సాయి పాట)

                           ఓంసాయి శ్రీసాయి

ఓంసాయి శ్రీసాయి జయసాయి అనండి
ఓంకారరూపుడైన సాయి మహిమ కనండి              
|| ఓంసాయి ||

ప్రేమతోడ సాయినాథు పేరు తలచినంతనే
పెన్నిధియై కొర్కెలు నెరవేర్చు మాట నిజమండి
సాయిబాబ లీలలను సన్నుతించు వారలు
సర్వబంధనాలు తొలగి ముక్తి గనుట నిజమండి     
|| ఓంసాయి ||

విశ్వాసంతోడ సాయి నాశ్రయించువారికి
శాశ్వతసుఖశాంతు లిచ్చు సదయుడనీ నమ్మండి
షిరిడీపతి చరణకమల శరణాగతులైన వారి
మరణభయం పోగొట్టే మాన్యుడనీ నమ్మండి           || ఓంసాయి ||

మహిమాన్వితుడైన సాయి మహిత కథాశ్రవణమే
మానరాని రోగాలను మాన్పుననుట నిజమండి
సమత మమత బోధించిన సాయిగురుని సూక్తులే
భ్రమలను తొలగించునట్టి బాటలనీ నమ్మండి             || ఓంసాయి ||

29, డిసెంబర్ 2011, గురువారం

చమత్కార పద్యాలు - 161

ఇకార, అకార విశిష్ట శ్లోకం 
 క్రింది శ్లోకం పూర్వార్ధం ఇకార విశిష్టమై, ఉత్తరార్ధం అకార విశిష్టమై ఉన్నది.

క్షితిస్థితిమితిక్షిప్తి
విధివిన్నిధి సిద్ధిలిట్ |
మమ త్ర్యక్ష నమద్దక్ష
హర స్మరహర స్మర
||

తాత్పర్యం
ఓ ముక్కంటీ! సర్వజ్ఞా! లయకరా! అష్టవిధశక్తి శాలీ! భూతిదాతా! దక్ష మన్మథ సంహారా! నన్ను కాపాడు.

సమస్యా పూరణం - 575 (భగవద్గీత)

 కవిమిత్రులారా,
          భగవద్గీతను నిషేధించాలని వేసిన పిటీషన్ ను రష్యా కోర్టు కొట్టివేసింది. గతంలో ఈ అంశాన్ని ఆధారంగా చేసికొని సమస్య ఇస్తే అందరూ ఉత్సాహంగా గీతాప్రాశస్త్యాన్ని వివరిస్తూ సరసమైన, ప్రబోధాత్మకమైన పూరణలు పంపారు. అందరికీ ధన్యవాదాలు.

          నిన్నటి వార్త చూసి కవిమిత్రులు స్పందించి పూరణార్థం కొన్ని సమస్యలను పంపారు. ఈరోజు అందరి సమస్యలను ఇస్తున్నాను.  అయితే వాటిలో సమస్య ఉండదు. వ్యతిరేకార్థం, అసంబద్ధత, అసత్యం వంటివి లేవు. అన్నీ సూటిగా ఉన్నాయి. మిత్రులు వాటిలో నచ్చిన పాదాన్ని ఎన్నుకొని పద్యరచన చేయడమే. 

ఆ సమస్యలు(?) ఇవి
శ్రీ పండిత నేమాని వారు
విజయశ్రీకలితగీత! వేవేల నుతుల్ 

శ్రీ పోచిరాజు సుబ్బారావు గారు
గీత మార్చును మనుజుల గీత నెపుడు 

‘మనతెలుగు’ శ్రీ చంద్రశేఖర్ గారు
చల్లగఁ గాపాడు గీత సకల సుజనులన్
చల్లగఁ గాపాడు గీత సైబిరియనులన్

పై కవిమిత్రులకు ధన్యవాదాలు.

28, డిసెంబర్ 2011, బుధవారం

చమత్కార పద్యాలు - 160

ఉకార విశిష్ట శ్లోకం

క్రింది శ్లోకంలోని అక్షరాలన్నీ కేవలం ఉత్వంతోనే ఉన్నాయి.

ఉరుగుం ద్యుగురుం యుత్సు
చుక్రుశుస్తుష్టువుః పురు
|
లులుభుః పుపుషుర్ముత్సు
ముముహుర్ను ముహుర్ముహుః
||

తాత్పర్యం
దేవతలందరూ యుద్ధానికి వెళ్తూ దేవగురువైన బృహస్పతిని సంతోషంగా, స్థిరంగా ఉండమని, మాటిమాటికి నిద్రావశుడు కావద్దని ప్రార్థించారు.

సమస్యాపూరణం - 574 (కవి గౌరవ మెల్ల)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది
కవి గౌరవ మెల్ల కావ్యగానము చెఱచెన్
ఈ సమస్యను పంపిన  
లక్కాకుల వెంకట రాజారావు గారికి
ధన్యవాదాలు.

27, డిసెంబర్ 2011, మంగళవారం

ఛందస్సు - (రేఫ సంయుక్త పూర్వాక్షర గురులఘు విచారం)

       రేఫ సంయుక్త పూర్వాక్షర గురులఘు విచారం
          ఈమధ్య కొందరు కవిమిత్రుల పూరణలలో వారు రేఫసంయుక్త పూర్వాక్షరాన్ని లఘువుగా పరిగణిస్తే (ఉదా. ‘సత్యవ్రతుడు’లో ‘త్య’) నేను పూర్వాక్షరం గురువు అవుతుందని, అక్కడ గణదోషం ఏర్పడిందని వ్యాఖ్యానించాను. శ్రీ చింతా వారు, శ్రీ పండిత నేమాని వారు వివరించినా నా సందేహం తీరలేదు. ఛందోగ్రంథాల పరిశీలనానంతరం నా అభిప్రాయం తప్పని తెలుసుకున్నాను. ఈ విషయంలో అటువంటి ప్రయోగాలు చేసి, నా వ్యాఖ్యల వల్ల మనస్సు నొచ్చుకున్న మిత్రులు మన్నించాలి.
          ‘పింగళచ్ఛందము’లో గురు లఘువుల లక్షణం.
దీర్ఘం సంయోగపరతం
తథా ప్లుతం వ్యంజనాంత మూష్మాంతమ్
సానుస్వరం చ గురు
క్వచి దవసానేऽపి లఘ్వంతమ్
          ఈ లక్షణాన్ని అనుసరించి దీర్ఘాలు (ఆఈఊౠఏఐఓఔ అనే అచ్చులు, ఈ అచ్చులతో కూడిన హల్లులు), సంయోగపూర్వాలు (ద్విత్వసంయుక్తాక్షరాలకు ముందున్నవి), ప్లుతాలు (మూడు మాత్రలు కల సంబోధనాశ్చర్యాది పదాంతాక్షరాలు), వ్యంజనాంతాలు (ధిక్, సత్ మొదలైనవి), ఊష్మాంతాలు (విసర్గతో కూడినవి), అనుస్వార యుక్తాలు (సున్నాతో కూడిన అక్షరాలు) గురువులు.

          హ్రస్వాలు, గురుభిన్నాలైన ఇతరాక్షరాలు లఘువులు. గురుభిన్నాలై లఘువులు కాని అక్షరాలేవో చూద్దాం.
          సంయోగపరత్వం గురువుకు ఒక లక్షణం కదా! అనగా సంయుక్తాక్షరాలకు ముందుండే అక్షరాలు గురువులు. కాని కావ్యాలలో అందుకు వ్యతిరేకమైన లక్ష్యాలు కనబడుతున్నాయి. అందువల్ల కేదారభట్టు
‘పాదాదా విహవర్ణస్య, సంయోగః క్రమసంజ్ఞితః
పరస్థితేన తేనస్యాత్, లఘుతాపి గురోః క్వచిత్’
          అని లక్షణాన్ని చెప్పాడు. దీనిని బట్టి ‘క్వాచిత్కముగా’ ఉత్తరపాదాది సంయుక్తం పరమైనపుడు పూర్వపాదాంత వర్ణం గురువు కాకపోవచ్చు. అనగా ఏదైనా పాదం సంయుక్తాక్షరంతో మొదలైతే దాని ముందున్న పాదం చివరి అక్షరం గురువు కాకపోవచ్చు.
          రేఫసంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం పాక్షికంగా లఘుత్వాన్ని పొందడం (ఒక్కొక్కసారి గురువు, ఒక్కొక్కసారి లఘువు కావడం) గమనించి పింగళాచార్యుడు ‘ప్రహేవా’ అనే వికల్పసూత్రాన్ని చెప్పాడు. (వృత్తరత్నాకరం, 1-10)
          ఈ విధంగా రేఫసంయుక్తాక్షరానికి ముందున్నవి లఘువులుగానే ఉండడాన్ని గుర్తించిన జయకీర్తి అందుకు ఉచ్చారణశైథిల్యమే కారణమని భావించి ‘సంయోగః పరోऽపి జాతు వర్ణః’ (ఛందోనుశాసనము - ౧.౧౦) అని ప్రకటించాడు.
          
          లఘువులు రెండు విధాలు. 1. సహజ లఘువులు, 2. గురువు కావలసి ఉండి ఉచ్చారణ శైథిల్యం చేత గురుత్వాన్ని పొందక లఘువుగానే ఉండేవి.
          ఈ శిథిలోచ్చారణం చేత పాదాది సంయుక్తాక్షరానికి ముందున్న (పూర్వపాదాంత) అక్షరాలు, రేఫసంయుక్తాక్షరానికి ముందున్నవి వైకల్పికంగా లఘువు లవుతున్నవి.
          ‘సంయుక్తే సంస్కృతాద్యే స్యాత్ సర్వ మంధ్రపదం లఘు ...’ అనే చింతామణి సూత్రం వల్ల ‘సంయుక్తాక్షరంతో ప్రారంభమయ్యే సంస్కృతపదానికి ముందున్న తెలుగుపదం చివరి అక్షరం గురువు కాదు. (ఉదా. నీకు స్తుతి - ఇక్కడ సంయుక్తాక్షరంతో ప్రారంభమైన సంస్కృతపదం ‘స్తుతి’ ముందున్న తెలుగుపదం (నీకు) చివర ఉన్న లఘువు - ‘కు’ గురువు కాదు)
          
          సంయుక్తాక్షరంతో ప్రారంభమయ్యే తెలుగుపదానికి ముందున్న పదం చివరి అక్షరం కూడా గురువు కాదు (ఉదా. చక్కని వ్రాత - ఇక్కడ ‘వ్రా’కు ముందున్న ‘ని’ లఘువుగానే ఉంటుంది)
          సంస్కృతంలో ఏ పరిస్థితిలో నైనా సంయుక్తాక్షరానికి ముందున్న లఘువు గురువు అవుతుంది. తెలుగులో మాత్రం ఏకపదంలో, సిద్ధసాంస్కృతిక సమాసంలో మాత్రమే సంయుక్తాక్షరానికి ముందున్న లఘువులు గురువు లవుతాయి.
          
          సంస్కృతంలో రేఫసంయుక్తాక్షరం పరమైన లఘువు వైకల్పికంగా గురువు అవుతున్నది.
సంస్కృతపదంబు లొగి సమాసములు గూర్చు
నపుడు క్రారను గూడిన యక్కరంబు
లూఁదియుండు నొక్కొక్కచో నూఁదకుండుఁ
దెలుఁగు కృతులందు .... (కూచిమంచి తిమ్మకవి)
          సిద్ధసాంస్కృతిక సమాసంలో రేఫసంయుక్తవర్ణానికి ముందున్న వర్ణం ఒక్కొక్కసారి ఊదబడుతుందని, ఒక్కొక్కసారి ఊదబడదని తాత్పర్యం. ఇక్కడ రకార ఉచ్చారణలోని శైథిల్యం చేత రేఫసంయుక్తంలోని ప్రథమవ్యంజనం పూర్వస్వరంచేత ఆకర్షింపబడదని గ్రహించాలి.
          
          ‘ఋఌ వర్ణంబులు రల తుల్యంబులు’ అనడంచేత ఋ,రల ఉచ్చారణలో అభేదానికి అవకాశం కల్గుతున్నది. ‘ప్ర’ అనే సంయుక్తాక్షరంలో ‘ప్ + ర్ + అ’ అని వర్ణక్రమం వల్ల ఇది వ్యంజనద్వయం (రెండుహల్లులు) కల్గి, ఉపధావర్ణం (చివరివర్ణానికి ముందున్న వర్ణం)గా రేఫను కలిగి ఉంది. రకార పూర్వ వ్యంజనమైన పకారం పూర్వస్వరంచేత ఆకర్షింపబడి ఆ పూర్వాక్షరానికి గురుత్వాన్ని ఆపాదించాలి. కాని రకారం ఋకారతుల్యత్వంచేత స్వర (అచ్చు) ధర్మన్ని కలిగి ఉండి దానిపైనున్న అకారస్వరంతో లీనమౌతున్నది. దీని వల్ల రేఫ వ్యంజనత్వాన్ని కోల్పోవడం చేత ‘ప’కారం ఏకవ్యంజనాక్షరత్వాన్ని పొంది పూర్వస్వరం చేత ఆకర్షింపబడదు. అందువల్ల పూర్వ లఘ్వక్షరం ఊదబడక గురువు కాదు.
          ‘సాకేతప్రభువు’ అన్నప్పుడు ‘ప్ర’కు ముందున్న ‘త’వర్ణం గురువు కావచ్చు లేదా లఘువు కావచ్చు.
 
ఉదా ....
కం. ................. అమ్ముని
ప్రవరు పృథూత్సంగతలముపై వడిఁ బడియెన్ (భార. సభాపర్వం. 1-143)
(`మునిప్రవర’లోని ‘ని’ గురువు కాదు)
ఉ. కావున గామక్రోధములఁ గ్రాగుచు నాశ్రితకోటి గాచుచున్ (భార. శాంతిపర్వం. 4.81)
(‘కామక్రోధముల’లో ‘క్రో’ పూర్వాక్షరం గురువు కాలేదు)
సీ. సంధ్యాదివందనశ్రద్ధ యుజ్జన సేయు
          గీతవాక్యవినోదక్రియలఁ దగులు (కాశీఖండము. 4.81)
(ఇక్కడ ‘క్రి’ ముందున్న ‘ద’ గురువులు కాలేదు)
 
చివరగా ...
          ‘అద్రుచు, విద్రుచు, ఎద్రుచు, పద్రుచు మొదలైన తెలుగు పదాలలో ‘ద్రు’లోని అల్పరేఫోచ్చారణ వల్ల దాని ముందున్న అక్షరాలు గురువులు కాకుండా అవి సర్వలఘు గణా లవుతున్నాయి.
          ‘అదురుచు - అద్రుచు’ - ‘చుక్పరక రువర్ణంబునకు ముందఱి దువర్ణము నుత్వంబునకు లోపంబు విభాష నగు, నగుచో తత్పూర్వంబు గురువు గాదు (బాలవ్యకరణం. ప్రకీర్ణ. 20).
          
          ఈ పాఠంపై సందేహాలు, అభ్యంతరాలు, సూచనలు ఉంటే తెలియజేయ వలసిందిగా మనవి.

నిషిద్ధాక్షరి - 2

నిషిద్ధాక్షరి - 2
కవర్గాక్షరాలను (క,ఖ,గ,ఘ,ఙ లను) ఉపయోగించకుండా
కాకి, కోకిల ల సామ్యభేదాలపై
మీకు నచ్చిన ఛందంలో
పద్యం వ్రాయండి.

26, డిసెంబర్ 2011, సోమవారం

చమత్కార పద్యాలు - 159

ఏక వ్యంజన శ్లోకం

దాదదో దుద్దదుద్దాదీ
దాదదోదూదదీదదోః |
దుద్దాదం దదదే దుద్దే
దాదాదద దదోऽదదః
||

దీనికి ప్రతిపదార్థాలకోసం ప్రయత్నించాను. కాని సాధ్యం కాలేదు.

భావం 
శ్రీకృష్ణుడు అన్ని వరాలను ఇచ్చేవాడు, పాపసంహారకుడు, పరిశుద్ధుడు, దుష్టులను శిక్షించి శిష్టులను కాపాడేవాడు, ధర్మరక్షకుడు.
(గూగుల్ లో దొరికిన ఆంగ్లభావానికి నా అనువాదం)

సమస్యాపూరణం - 573 (పదుగు రాడు మాట)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది
పదుగు రాడు మాట పాడి గాదు
ఈ సమస్యను పంపిన లక్కాకుల వెంకట రాజారావు గారికి
ధన్యవాదాలు.

సాయి నవరత్నాలు

సాయి భక్తి విలాస మంజరి

1
ప్రవిమలాత్ముల మానసాబ్జము వాసమై యలరారు నిన్
సవినయమ్ముగ నేఁ దలంతును సాధుబృంద సుసేవితా!
శ్రవణపేయము నీ కథాసుధ సారసద్గుణ భూష! నీ
స్తవ మొనర్తు సమర్థ సద్గురు  సాయినాథ మహాప్రభూ!   

2
సాయి సద్గురు! సాయి సద్గురు! సాయి సద్గురు! సాయి! నాన్
గేయమంజరి మంజులమ్ముగ కీర్తనమ్మొనరించుచో
శ్రేయమాదృతి కూర్చుచుందువు శిష్ట కోటికి నిత్యమున్
సాయమౌచు సమర్థ సద్గురు సాయినాథ మహాప్రభూ!
       

3
స్మరణ మాదృతి భవ్య నామ ప్రశస్త తత్త్వ విశిష్టతల్
నిరతమున్ బొనరింప చిత్తము నిర్మలత్వము నొందుచున్
దురితముల్ తొలగున్ భవార్తియు దూరమౌ నని చేయుదున్
స్మరణమేను సమర్థ సద్గురు  సాయినాథ మహాప్రభూ!
    

4
పాదసేవ నొనర్చు భాగ్యమె భాగ్యమెల్లర కబ్బునే?
ఆదిదేవు కృపావిశేష మహాఫలంబుగ కాక, నీ
పాదసేవనచే భయమ్ములు వాయు, చేకురు మోక్షమున్
సాదరాన సమర్థ సద్గురు  సాయినాథ మహాప్రభూ!
     .

5
ధ్యాన ముఖ్య సమర్చనా నియమాళితో షిరిడీశ్వరా!
మానసాబ్జము సాదరాన సమర్పిత మ్మొనరింపగా
దీనులయ్యును వేగ గాంతురు దివ్యతేజము సత్కృపన్
జ్ఞానసిద్ధి సమర్థ సద్గురు  సాయినాథ మహాప్రభూ!
   

6
పాదయుగ్మము బట్టి భక్తులు వందనమ్ము లొనర్చుచున్
ఆది శక్తివి, ఆది దేవుడ వచ్యుతుండ వటంచు నిన్
మోదమందుచు గొల్వ వారికి పూర్ణ యోగము కూర్పవే?
సాదరాన సమర్థ సద్గురు  సాయినాథ మహప్రభూ!
     

7
ద్వారకామయి పాద దాస్యము, దాస దాస్య పరంపరన్
భూరి మోదమునొందు దాసుల భూతి వెల్గగ వారిపై
భారమంతయు నీవె గొందువు భక్త కోటి కొసంగి చిత్
సారమెల్ల సమర్థ సద్గురు  సాయినాథ మహాప్రభూ!
     

8
శిష్ట రక్షక! దుష్టశిక్షక! చేరి సఖ్యముతోడ నిన్
హృష్ట చిత్తముతో భజించిన నెల్ల సిద్ధులు చేకురున్
పుష్టి, తుష్టియు నీవె సమ్మతి భుక్తి ముక్తి ప్రదాతవున్
స్రష్ట వీవె సమర్థ సద్గురు  సాయినాథ మహాప్రభూ!
  

9
నాదు దేహము నాదు గేహము నాదు సంపదలంచు నే
వేదనల్ పడనేల ఆత్మ నివేద నంబొనరించుచో
ఆదిదేవుడ వీవె కూర్చెద వక్షయమ్ముగ యోగముల్
సాదరాన సమర్థ సద్గురు  సాయినాథ మహాప్రభూ!
    

ఫలశ్రుతి
 సాయి భక్తి విలాస మంజరి సత్ఫలమ్ములొసంగుచున్
హాయిగొల్పును ఆలకించిన ఆలపించిన నెమ్మదిన్
జ్ఞేయమౌచును ధ్యేయమౌచును నేయమౌచును మోక్షమున్
సాయి కూర్చు సమర్థ సద్గురు  సాయినాథ మహాప్రభూ!

రచన
శ్రీ పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారు

25, డిసెంబర్ 2011, ఆదివారం

చమత్కార పద్యాలు - 158

క్రమస్థ సర్వవ్యంజనం
క్రింది శ్లోకంలో అన్ని హల్లులూ వరుసక్రమంలో ఉన్నాయి.

కః ఖగౌఘాఙచిచ్ఛౌజా
ఝూఞ్ జ్ఞోటౌఠీడడంఢణాః
|
తథోదధీన్ పఫర్బాభీ
ర్మయోऽరిల్వాశిషాం సహః
||

ఈ శ్లోకం ప్రతిపదార్థాలు ఎంత ప్రయత్నించినా దొరకలేదు. తాత్పర్యం మాత్రం దొరికింది.

తాత్పర్యం 
విహంగప్రేమికుడు, సంపూర్ణజ్ఞాని, పరబలాపహర్త, శత్రుసంహారకుడు, ఉత్తముడు, సుస్థిరుడు, నిర్భయుడు, సముద్రాలను నీటితో నింపినవాడు, మాయా స్వరూపుడు (అయిన పరబ్రహ్మ) దయ సర్వపాపాలను హరిస్తుంది.
(శ్లోకం శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారి ‘ప్రహేళికలు’ నుండి. తాత్పర్యం ‘గూగులమ్మ’ ఇంగ్లీషులో చెప్పినదానికి నా తెలుగు అనువాదం)

రాజమౌళి యొక్క ఆభరణములు

శ్రీమదాది శంకర విరచితమయిన 
శివానందలహరి 
                         అనే స్తోత్రములోని ఈ శ్లోకమును చూడండి:

జడతా, పశుతా, కళంకితా,
కుటిలచరత్వంచ నాస్తి మయి దేవ!
అస్తియది రాజమౌళే!
భవదాభరణస్య నాస్మి కిం పాత్రం?

భావము:  
ఓ రాజ మౌళీ! (చంద్రకళను ధరించిన పరమ శివా! లేక రాజులలో
శ్రేష్ఠమైన వాడా!) నాలో గంగ వలె జడత్వము గాని, నంది వలె పశుత్వము గాని,
చంద్రుని వలె కళంకితత్వము గాని , నాగరాజు వలె వక్రగమనము గాని లేవు.
ఒకవేళ అట్టిదేమైనా ఉంటే నీకు ఆభరణముగా అర్హుడిని అయి ఉండేవాడిని కదా!  ఈ
శ్లోకము ద్వారా వ్యంగ్యంగా అప్పటి రాజ ఆస్థానములలో ఉద్యోగము కొరకు ఎట్టి
లక్షణములు ఉండేవో వివరించారు శ్రీ మదాది శంకరాచార్యులు.


                                          శ్రీ పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారు

సమస్యాపూరణం - 572 (దండనము కాదు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది
దండనము కాదు కాదది పండువయ్యె
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

సమస్యాపూరణం - 572 (అమవసనాఁటి రాత్రి)

వారాంతపు సమస్యాపూరణం

కవిమిత్రులారా,
ఈ వారాంతానికి పూరించవలసిన సమస్య ఇది
అమవసనాఁటి రాత్రి యొక
యంగన చూపెను చంద్రికాద్యుతుల్.

24, డిసెంబర్ 2011, శనివారం

చమత్కార పద్యాలు - 155

చాటు శ్లోకం


వినాయకపతే శ్శత్రుః
తస్య నామ షడక్షరమ్ |
పూర్వార్ధం తవ రాజేంద్ర
ఉత్తరార్ధం తు వైరిణామ్ ||

భావం -
"ఓ రాజేంద్రా! వినాయకపతికి శత్రువైనవాని ఆరక్షరాల పేరులోని మొదటిసగం నీకు, రెండవసగం నీ శత్రువులకు కలుగుగాక!" అని కవి ఒక రాజును దీవించాడు.


వివరణ - 
వి = పక్షులకు
నాయక = రాజైన గరుత్మంతునికి
పతేః = ప్రభువైన విష్ణువుకు (నృసింహరూపునకు)
శత్రుః = వైరి అయినవా డెవడో
తస్య = అతని
షడక్షరం = ఆరు అక్షరాలు కలిగిన
నామ = పేరు (హిరణ్యకశిప) లోని
పూర్వ + అర్ధం = మొదటిసగం (హిరణ్యం = బంగారం)
తవ = నీకు,
ఉత్తర + అర్ధం = తరువాతి సగం (కశిపువు = తల్పం)
వైరిణాం = శత్రువులకు (కలుగుగాక!)


___ శత్రువులకు తల్పం అంటే దీర్ఘనిద్ర (మరణం) కలుగాలని భావం.

(శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారు సేకరించిన ‘ప్రహేళికలు’ గ్రంథం నుండి)

సమస్యాపూరణం - 570 (త్రాతనే పాముగా నెంచి)


 కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది
త్రాతనే పాముగా నెంచి తరుమఁ దగునె?
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

23, డిసెంబర్ 2011, శుక్రవారం

చమత్కార పద్యాలు - 154

ప్రహేళిక

శస్త్రం నఖలు కర్తవ్యం
ఇతి పిత్రా నియోజితః
|
తదేవ శస్త్రం కృతవాన్
పితురాజ్ఞా నలంఘితా
||
భావం -
ఏ శస్త్రాన్ని నిర్మించవద్దని తండ్రి ఆదేశించాడో, ఆ శస్త్రాన్నే కొడుకు నిర్మించి 
తండ్రి ఆజ్ఞను జవదాటనివా డైనాడు.
సమన్వితార్థం -
‘న ఖలు’ శబ్దంలోనే ఉంది చమత్కార మంతా. ‘చేయకూడదు’ అనే అర్థంలో ‘న, ఖలు’ అనేవి అవ్యయాలు. గోళ్ళను కత్తిరించు (నఖాన్ లునాతి) అని ‘నఖలు’ శబ్దానికి మరో అర్థం ఉంది.

గోళ్ళను కత్తిరించే (నఖలు) శస్త్రాన్ని నిర్మించమని తండ్రి ఆదేశించగా, 
కొడుకు దానినే చేసి తండ్రి ఆజ్ఞను మీరలేదని తాత్పర్యం.
(శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారు సేకరించిన ‘ప్రహేళికలు’ గ్రంథం నుండి)

సమస్యాపూరణం - 569 (మద్యము సేవించువాఁడు)


కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది
మద్యము  సేవించువాఁడు  మాన్యుఁడు  జగతిన్
ఈ సమస్యను పంపిన శ్రీ పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

22, డిసెంబర్ 2011, గురువారం

చమత్కార పద్యాలు - 153

ప్రహేళిక

దేవరాజో మయా దృష్టః
వారివారణమస్తకే
|
భక్షయి త్వార్కపర్ణాని
విషం పీత్వా క్షయం గతః
||

 వాచ్యార్థం -
నీటియేనుగు తలపైన (వారివారణ మస్తకే). నాకు కనిపించిన (మయాదృష్టః), ఇంద్రుడు (దేవరాజః) జిల్లేడు ఆకులను (అర్కపర్ణాని), తిని (భక్షయిత్వా), విషం త్రాగి (విషం పీత్వా), నాశన మయ్యాడు (క్షయం గతః).

వ్యంగ్యార్థం -
దేవర = ఓ మరదీ!
వారి వారణ మస్తకే = నీటిని అడ్డగించే కట్టమీద
మయా దృష్టః = నాచేత చూడబడిన (నేను చూచిన)
అజః = మేక
అర్కపర్ణాని = జిల్లేడు ఆకులను
భక్షయిత్వా = తిని
విషం = నీటిని
పీత్వా = త్రాగి
క్షయం = ఇంటికి
గతః = వెళ్ళిపోయింది.


(శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారు సేకరించిన ‘ప్రహేళికలు’ గ్రంథం నుండి)

సమస్యాపూరణం - 568 (గంగ మునిఁగిపోయె)


 కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది
గంగ మునిఁగిపోయె గంగలోన.

21, డిసెంబర్ 2011, బుధవారం

చమత్కార పద్యాలు - 152

                                చాటు శ్లోకం

విరాజరాజపుత్రారేః
యన్నామ చతురక్షరమ్
|
పూర్వార్ధం తవ శత్రూణాం
పరార్ధే తవ సంగరమ్
||

భావం -
‘విరాజరాజపుత్రారి’కి సంబంధించిన నాలుగక్షరాల పేరులోని మొదటి సగం నీ శత్రువులకు, తరువాతి సగం నీకు యుద్ధంలో సంభవించును గాక!


అర్థాలు - 

వి = పక్షులకు
రాజ = ప్రభువైన గరుత్మంతునికి
రాజ = నాయకుడైన విష్ణువు యొక్క
పుత్ర = కుమారుడైన మన్మథునికి
అరేః = శత్రువైన శివునికి సంబంధించిన
యత్ + నామ = ఏ పేరు
చతురక్షరం = నాలుగక్షరాలు కలిగి ఉందో
పూర్వార్ధం = (అందులో) మొదటి సగం
సంగరే = యుద్ధంలో
తవ శత్రూణాం = నీ శత్రువులకు
పరార్ధం = రెండవ సగం
తవ = నీకు (సంభవించును గాక!)


వివరణ - 
శివునికి సంబంధించిన నాలుగక్షరాల పేర్లలో ‘మృత్యుంజయః’ ఒకటి. యుద్ధంలో నీ శత్రువులకు ‘మృత్యువు’, నీకు ‘జయం’ చేకూరుతాయని భావం. 

(శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారు సేకరించిన ‘ప్రహేళికలు’ గ్రంథం నుండి)

సమస్యాపూరణం - 567 (విష గుళికయయ్యె)

 కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది 
విష గుళికయయ్యె గీతావివేక రసము.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

నా పాటలు - అయ్యప్ప పాట

                            అయ్యప్ప దేవుడు


దేవుడంటె దేవుడు - అయ్యప్ప దేవుడు
దీక్షగొన్న స్వాములకు తిరుగులేని దేవుడు          || దేవుడంటె ||


శంకరహరి పుత్రుడు - శశిభాస్కర నేత్రుడు
సుబ్రహ్మణ్య గణపతులకు సోదరుడగు దేవుడు
భూతసంఘ నాథుడు - పూర్ణపుష్కలేశుడు
పందళరాజ్యాధినేత భవ్యదత్తపుత్రుడు                   || దేవుడంటె ||

శబరిగిరి నివాసుడు - సదమల దరహాసుడు
శరణు కోరువారి నెల్ల కరుణించే దేవుడు
మహిమలున్న దేవుడు - మణికంఠ నాముడు
ఆర్తులైన భక్తులను ఆదుకొనే దేవుడు                   || దేవుడంటె ||

పంచగిరి విహారుడు - పానవట్ట బంధుడు
వావరుని మన్నించిన పదునెట్టాంబడి విభుడు
విల్లాలి వీరుడు - మహిషి ప్రాణహారుడు
శుభము లిచ్చి కాపాడే జ్యోతిస్వరూపుడు              || దేవుడంటె ||

20, డిసెంబర్ 2011, మంగళవారం

చమత్కార పద్యాలు - 151

చాటు శ్లోకం


అపూర్వోऽయం మయా దృష్టః
కాంతం కమలలోచనే
|
శోంతరం యో జానాతి
 స విద్వాన్ నాత్ర సంశయః
||

వాచ్యార్థం -
ఓ కమలాక్షీ! అపూర్వం (మును పెన్నడు లేనిది), కాంతం (సుందరం) ఐనది నాచేత చూడబడినది. ఎవడైతే శోంతరం తెలుసుకుంటాడో అతడే పండితుడు. అందులో అనుమానం లేదు.


వ్యంగ్యార్థం -
అపూర్వం (మొదట ‘అ’కారం ఉన్నదీ), కాంతం (క + అంతం = చివర ‘క’కారం ఉన్నదీ), శోంతరం (శో + అంతరం = నడుమ ‘శో’ ఉన్నదీ) అయిన ‘అశోక’ వృక్షాన్ని చూచాను. 


               (శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారు సేకరించిన ‘ప్రహేళికలు’ గ్రంథం నుండి)

సమస్యాపూరణం - 566 (సంపన్నుల దైవ మగును)


 కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది
సంపన్నుల దైవ మగును శంకరుఁ డెన్నన్
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

19, డిసెంబర్ 2011, సోమవారం

చమత్కార పద్యాలు - 150

                                 చాటు శ్లోకం


సమరే హేమరేఖాంకం
బాణం ముంచతి రాఘవే
|
స రావణోపి ముముచే
మధ్యే రీతిధరం శరమ్
||

 వాచ్యార్థం - 
యుద్ధంలో రాముడు సువర్ణరేఖ అనే బాణాన్ని ప్రయోగించగా, ఆ రావణుడు యుద్ధం మధ్యలో ఇత్తడి (రీతి = ఇత్తడిని; ధరం = ధరించిన) బాణాన్ని విడిచాడు.

వ్యంగ్యార్థం -
యుద్ధంలో రాముడు సువర్ణరేఖ అనే బాణాన్ని ప్రయోగించగా రావణుడు (మధ్యే = నడుమ; రీ + ఇతి = రీ అనే అక్షరాన్ని ధరించిన; శరం = శ, రం అనే అక్షరాలు కలిగినది - అంటే) శరీరం విడిచాడు.

              (శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారు సేకరించిన ‘ప్రహేళికలు’ గ్రంథం నుండి)

సమస్యాపూరణం - 565 (భామను పెండ్లాడి యొకఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది
భామను పెండ్లాడి యొకఁడు బలిపశువయ్యెన్.
ఈ సమస్యను సూచించిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

18, డిసెంబర్ 2011, ఆదివారం

సమస్యాపూరణం - 564 (తేనెబొట్టుతో నంబుధి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది
      తేనెబొట్టుతో నంబుధి తియ్యనయ్యె.
ఈ సమస్యను సూచించిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.

సమస్యాపూరణం - 563 (యోగులు కాని నాయకులె యోగ్యులు)

                   వారాంతపు సమస్యాపూరణం
కవిమిత్రులారా,
ఈ వారాంతానికి పూరించవలసిన సమస్య ఇది
యోగులు కాని నాయకులె
                   యోగ్యులు భారతభూమి నేలగన్.

                                                    (ఆకాశవాణి- విజయవాడ వారి సౌజన్యంతో)


17, డిసెంబర్ 2011, శనివారం

చమత్కార పద్యాలు - 149

                                చాటు శ్లోకం



శంకరం పతితం దృష్ట్వా
పార్వతీ హర్షనిర్భరా |
రుదంతి పన్నగా స్సర్వే
హా హా శంకర శంకర ||

వాచ్యార్థం -
పడిపోయిన శంకరుని చూసి పార్వతి ఎంతో సంతోషించింది. పాములన్నీ "అయ్యో శంకరా! శంకరా!" అని ఏడ్చాయి.
 
వ్యంగ్యార్థం -
శంకరం = చందనవృక్షం
పతితం = పడిపోవడాన్ని
దృష్ట్వా = చూచి
పార్వతీ = పర్వతజాతికి చెందిన భిల్లకాంత
హర్షనిర్భరా = ఎంతో సంతోషించింది (కొమ్మలకోసం చెట్టు నెక్కే శ్రమ తప్పినందుకు)
పన్నగాః సర్వే= పాములన్నీ
హా హా శంకర శంకర = అయ్యో చందనవృక్షమా అంటూ
రుదంతి = విలపించాయి (తమ కాశ్రయమైన వృక్షం నేలకూలినందుకు)

(శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారు సేకరించిన ‘ప్రహేళికలు’ గ్రంథం నుండి)

సమస్యాపూరణం - 562 (పలికి చేసి చూచి కొలిచి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది
పలికి చేసి చూచి కొలిచి యలరు.
(శ్రీ పండిత నేమాని వారి ‘క్రమాలంకార సౌలభ్యము’ స్ఫూర్తితో)

క్రమాలంకార సౌలభ్యము

పోతన గారి భాగవతములో భక్తిరసముతో కూడిన ఒక సీసపద్యము :
"కమలాక్షు నర్చించు కరములు కరములు  .. .. .."
ఇటువంటి భావముతోనే శంకరాచార్యుల వారి శివానందలహరిలో ఒక చిన్న ఆర్యావృత్త మున్నది.  ఆ శ్లోకమును చూడండి.

సా రసనా, తే నయనే,
తావేవ కరౌ, స యేవ కృతకృత్యః
యా యే యౌ యో భర్గం
వదతీక్షేతే సదార్చతః స్మరతి.

 తాత్పర్యము - ఈశ్వరుని ఎల్లప్పుడు చెప్పునది నాలుక, చూచేవి కళ్ళు, అర్చించేవి చేతులు, స్మరించువాడు కృతకృత్యుడు. 
 చూచేరా ఎంత చిన్న పద్యములోఎంత పెద్ద భావము ఇమిడ్చబడినదో ... 
ఇది క్రమాలంకారము వలన సాధ్యమయినది. 
స్వస్తి!
                శ్రీ పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారు

16, డిసెంబర్ 2011, శుక్రవారం

చమత్కార (చాటు) పద్యాలు - 148

                            చాటు శ్లోకం

కాచాయ నీచం కమనీయ వాచా
మోచాఫల స్వాదు ముచాన యాచే
|
దయా కుచేలే ధనదత్కుచేలే
స్థితేऽకుచేలే శ్రిత మా కుచేలే
||


అర్థాలు - 

దయా = దయకు
కుచేలే = (కు = భూమికి, చేలం = వస్త్రమైనట్టి) సముద్రమైనవాడూ,
ధనదత్ = కుబేరునిగా చేయబడిన
కుచేలే = కుచేలుడు కలవాడూ,
శ్రిత = ఆశ్రయింపబడ్డ
మా = లక్ష్మీదేవియొక్క
కుచేలే = వక్షఃస్థలం కలవాడూ,
అకుచేలే = కుత్సితం కాని వస్త్రం (పీతాంబరం) కలవాడూ అయిన విష్ణువు
స్థితే = రక్షకుడై ఉండగా
మోచాఫల = అరటిపండు యొక్క
స్వాదు = మాధుర్యాన్ని
ముచా = వర్షించే
కమనీయ = హృద్యమైన
వాచా = వాక్కుతో (కవిత్వంతో)
కాచాయ = గవ్వకోసం
నీచ = అల్పుని
న యాచే = యాచింపను. 


                  (శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారు సేకరించిన ‘ప్రహేళికలు’ గ్రంథం నుండి)

సమస్యాపూరణం - 561 (శ్రీకృష్ణున కిచ్చె సిరి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది
          శ్రీకృష్ణున కిచ్చె సిరి కుచేలుఁడు నెమ్మిన్.   

చమత్కార పద్యాలు - 147 (ప్రహేళిక సమాధానం)

గంగాయాం స్నాతు ముద్యుక్తా
ఏకోనా వింశతి స్త్రియః
|
తత్త్రైకా మకరగ్రస్తా
పునర్వింశతి రాగతా
||

 సమాధానం -
గంగలో స్నానం చేయడానికి ఒక పురుషుడు (ఏకః + నా), ఇరవైమంది (వింశతి) స్త్రీలు మొత్తం ఇరవైయొక్కమంది సిద్ధపడ్డారు. అందులో ఒకరిని మొసలి తినగా ఇరవైమంది తిరిగి వచ్చారు.

ఏకోనా వింశతి స్త్రియః .....
ఏక + ఊనా వింశతి స్త్రియః = ఒకటి తక్కువ ఇరవై (పందొమ్మిది) మంది స్త్రీలు.
ఏకః + నా = ఒక పురుషుడు, వింశతి స్త్రియః = ఇరవై మంది స్త్రీలు.


జిలేబీ గారు, భైరవభట్ల కామేశ్వర రావు గారు సరియైన సమాధానాలు తెలిపారు. అభినందనలు.
శ్యామల రావు గారు, పండిత నేమాని వారు చమత్కారంగా సమాధానం చెప్పారు. ధన్యవాదాలు.
ఇంకా గోలి హనుమచ్ఛాస్త్రి గారు, సుబ్బారావు గారు, లక్కాకుల వెంకట రాజారావు గారు ప్రశంసనీయమైన ప్రయత్నం చేసారు.

అందరికీ అభినందనలు, ధన్యవాదాలు.

15, డిసెంబర్ 2011, గురువారం

ముద్రాలంకారం

                           ముద్రాలంకారం
పద్యం పేరును ఆ పద్యంలో ప్రస్తావిస్తే దానిని ముద్రాలంకారము అంటారు. సామాన్యంగా ఛందోగ్రంథాలలో వృత్తలక్షణాలకు ఉదాహరణగా ఇచ్చిన పద్యాలలో ఈ ముద్రాలంకారం కనబడుతుంది.

పండిత నేమాని వారి ఈ క్రింది పద్యాలలో ముద్రాలంకారమును చూడవచ్చును:

మనమారన్ గొలుతున్ మహాగణపతీ! మత్తేభ రాజాననా!
ఘన విఘ్నాపహ! సర్వ యోగఫలదా! గౌరీసుతా! సత్కవి
త్వనిధానా! గురువర్య! మాన్యవిభవా! తత్త్వప్రకాశమ్ము నా
మనమందిమ్ముగ నింపి ప్రోవుము ననున్ మాంగళ్యదా! సర్వదా!


మౌనివర్య! జనమాన్య చరిత్రా!
జ్ఞానసారనిధి! స్వాగతమయ్యా
మాననీయ గుణ! మంగళదాతా!
పూని నీ పదము మ్రొక్కెద స్వామీ!


దేవదేవుడు వచ్చు శీఘ్రమె దివ్యతేజము తోడ భూ
దేవి చాల సుఖించు పూర్తిగ దీరిపోవును కష్టముల్
దేవతల్ తమ పూర్వ వైభవ దీప్తి గాంచెదరంచు సద్
భావ మొప్పగ మత్తకోకిల పాడె నామని రాకతో.


ఈ వృత్తాలు (1) మత్తేభము, (2) స్వాగతము  (3) మత్తకోకిల --  ఆయా పేరులు ఆయా వృత్తాలలో వచ్చేయి కదా.
 
ఈ విధంగా మరికొన్ని వృత్తాలలో కూడా ముద్రాలంకారాన్ని పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారు తమ అధ్యాత్మ రామాయణములో ప్రయోగించారు.. 


                           (పండిత నేమాని వారికి ధన్యవాదాలతో)

సమస్యాపూరణం - 560 (కాఱుకూఁతలు కూయ)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది
         కాఱుకూఁతలు  కూయ సంస్కర్త యగును.
ఈ సమస్యను సూచించిన
పోచిరాజు సుబ్బారావు గారికి
ధన్యవాదాలు.

చమత్కార పద్యాలు - 147 (ప్రహేళిక)

ప్రహేళిక
గంగాయాం స్నాతు ముద్యుక్తా
ఏకోనా వింశతి స్త్రియః |
తత్త్రైకా మకరగ్రస్తా
పునర్వింశతి రాగతా
||
గంగలో స్నానం చేయడానికి 
పందొమ్మిదిమంది (ఏకోనా వింశతి) స్త్రీలు సిద్ధపడ్డారు. 
అందులో ఒకరిని మొసలి తినగా 
ఇరవైమంది తిరిగి వచ్చారు.
ఎలా సాధ్యమో తెలియజేయండి.
(సమాధానం ..... రేపు)
(శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారు సేకరించిన ‘ప్రహేళికలు’ గ్రంథంనుండి)

14, డిసెంబర్ 2011, బుధవారం

చమత్కార పద్యాలు - 146 (ప్రహేళిక సమాధానం)

ప్రహేళిక సమాధానం

అనేకసుశిరం వాద్యం
కాంతం చ ఋషిసంజ్ఞితమ్
|
చక్రిణా చ సదారాధ్యం
యది జానాసి తద్వద
||

 సమాధానం

అనేక సుశిరం = పలురంధ్రాలు కలది, 
వాద్యం (వ + ఆద్యం) = ‘వ’ అనే అక్షరం మొదట ఉండేది, 
కాంతం (క + అంతం) = ‘క’ అనే అక్షరం చివర ఉండేది, 
ఋషి సంజ్ఞితం = ఋషి (వాల్మీకి) పేరు కలది, 
చక్రిణా = పాములచేత, సదా + ఆరాధ్యం = ఎప్పుడు సేవింపబడేది

అది వల్మీకం (పుట్ట).

సమాధానం కోసం ప్రయత్నించిన మందాకిని, రాజేశ్వరి అక్కయ్య, అజ్ఞాత గారలకు ధన్యవాదాలు.

దత్తపది - 17 (పాలు, పెరుగు, చల్ల, వెన్న)

కవిమిత్రులారా,
‘పాలు, పెరుగు, చల్ల, వెన్న’
పై పదాలను పాడి సంబంధమైన అర్థంలో కాకుండా ఉపయోగించి
మహాభారతార్థంలో
మీకు నచ్చిన ఛందస్సులో
పద్యం వ్రాయండి.

శ్రీసాయినాధుని ‘ఏకాదశ సూత్రాలు’

శ్రీసాయినాధుని ‘ఏకాదశ సూత్రాలు’

ఆ.వె.
శిరిడి జేరు టెల్ల సిరులకు మార్గమ్ము
సర్వదు:ఖహరము సర్వశుభము
నీదు దర్శనమ్ము నిత్యకళ్యాణమ్ము
శ్రీనివాస సాయి ! శిరిడి రాజ !

ఆ.వె. 
తనర నెవరి కైన ద్వారకామాయిని
జేరి నంత శాంతి చేరు వగును
అరయ నార్తు డైన నిరుపేద యైనను
శ్రీని వాస సాయి !శిరిడ రాజ !

ఆ.వె.
పరమపురుష ! నీవు భౌతికదేహమ్ము
వీడి వరసమాధి కూడి యున్న
నాడు సైత మవని నప్రమత్తుండవే
శ్రీనివాస సాయి ! శిరిడి రాజ !

ఆ.వె.
నీదు భక్తజనుల నిత్యరక్షణభార
మొనసి వరసమాధి ముఖమునుండె
మోయు చుంటి వెంత మోదమ్ము రా నీకు
శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !

ఆ.వె.
శ్రీ సమాధి జేరి చేయెత్తి పిలిచిన
పలికి మాటలాడు ప్రభుడ వీవు
శ్రీ సమాధినుండి చేయెత్తి దీవించు
శ్రీనివాస సాయి ! శిరిడి రాజ !

కం.
నిన్నాశ్ర యించు వారిని
పన్నుగ నిను శరణు జొచ్చు భక్తజనుల నా
పన్నులను రక్షసేయుట
యెన్నగ నీ బాధ్యత యని యెంతువు సాయీ !

కం.
నీయందు దృష్టి నిలుపుచు
పాయక నిను కొలుచు నట్టి భక్త జనుల పై
శ్రీయుత నీదు కటాక్ష మ
మేయము గా బరపుచుందు మేలుగ సాయీ !

ఆ.వె.
సత్య మెరుగ లేక సంసార బంధాల
జిక్కి బాధలొందు జీవజనుల
బరువు మోయ నీవు ప్రత్యక్ష మౌదువు
శ్రీనివాస సాయి ! శిరిడి రాజ !

ఆ.వె.
ఎవరు గాని నిన్ను యెద నిండ భావించి
నీసహాయము కొర కాస పడిన
తత్క్షణాన నీవు తగ నాదు కొందువు
శ్రీనివాస సాయి ! శిరిడి రాజ !

కం.
శ్రీ భాగ్య నిధులు గూడుచు
నీ భక్తుల గృహములెల్ల నిండారును నీ
యే భక్తుని గృహ మైనను
శోభనమే – లేమి చొరదు శుభకర సాయీ !

ఆ.వె.
సర్వ కార్య ధర్మ నిర్వహణము లన్ని
శ్రీసమాధినుండె జేతు ననుచు
మాట యిచ్చి మమ్ము మన్నించినావురా
శ్రీ నివాస సాయి ! శిరిడి రాజ !

రచన
శ్రీ లక్కాకుల వెంకట రాజారావు గారు

13, డిసెంబర్ 2011, మంగళవారం

చమత్కార పద్యాలు - 146 (ప్రహేళిక)

ప్రహేళిక
అనేకసుశిరం వాద్యం
కాంతం చ ఋషిసంజ్ఞితమ్
|
చక్రిణా చ సదారాధ్యం
యది జానాసి తద్వద
||

 అనేక సుశిరం = పలురంధ్రాలు కలది, వాద్యం, కాంతం = సుందరమైనది, 
ఋషి పేరు కలది, చక్రికి ఎప్పుడూ సంతోషాన్నిచ్చేది........
అది ఏమిటో తెలియజేయండి.
వాద్యం, కాంతం, చక్రి శబ్దాల అర్థభేదాలను పరిశీలించండి.
(సమాధానం ..... రేపు)
(శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారు సేకరించిన ‘ప్రహేళికలు’ గ్రంథంనుండి)

సమస్యాపూరణం - 559 (సురహితమ్ముఁ గోరు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది
సురహితమ్ముఁ గోరు శుక్రుఁ డెపుడు.
ఈ సమస్యను సూచించిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

నా పాటలు - (అయ్యప్ప పాట)

                          అయ్యప్ప మందిరం



పద్దెనిమిది మెట్లపైన స్వర్ణమందిరం - మనల
పాలించే మణికంఠుని భవ్యమందిరం          || పద్దెనిమిది ||


పాపాలను తొలగించే పావనరూపం
కష్టాలను కడతేర్చే కరుణారూపం
మోక్షమార్గమును చూపే మోహనరూపం
అయ్యప్పగ వెలసినట్టి దివ్యమందిరం       || పద్దెనిమిది
||

చిన్ముద్రాంచితహస్తుడు శివునిపుత్రుడు
చిరునవ్వుల వెదజల్లు ప్రసన్నవదనుడు
పానవట్టబంధుడు కిరీటధారుడై
అవతరించి నెలకొన్న పుణ్యమందిరం       || పద్దెనిమిది ||


మహితమైన మాలవేసి మండలకాలం
వ్రతదీక్షాబద్ధులైన స్వాములందరు
ఇరుముడి తలకెత్తి స్వామి శరణుఘోషతో
తరలివచ్చి దర్శించే దైవమందిరం          || పద్దెనిమిది ||


కన్నె కత్తి గంట గద గురుస్వాములు
తరతమభేదాలు మరచి పరమభక్తితో
సేవించిన వారికి సుఖసంపదలిచ్చి
ధన్యత చేకూర్చునట్టి మాన్యమందిరం    || పద్దెనిమిది ||

12, డిసెంబర్ 2011, సోమవారం

చమత్కార పద్యాలు - 145

                                శబ్దచిత్రం


సాయాద్యః కరణోరణో రణరణో రాణోరణో వారణో
దత్తా యేన రమారమా రమరమా రామారమా సా రమా |
సశ్శ్రీమానుదయోదయో దయదయో దాయోదయోదేదయో
విష్ణు ర్జిష్ణు రభీరభీ రభిరభీ రాభీరభీ సారభీ
||

పదవిభాగం -
సాయాత్, యః, కరణః, అరణః, రణరణః, రాణః, రణః, వారణః, దత్తా, యేన, రమా, ఆర, మా, రమ, రమా, రామా, అరమా, సా, రమా, సః, శ్రీమాన్, ఉత్, అయ, ఉదయః, అదయదయః, ఉత్, అయః, దయః, దే, దయః, విష్ణుః, జిష్ణుః, అభీర, భీ, రభిః, అభీర, ఆభీర, భీ, సార, భీః.


అన్వయం -
యః, కరణః, అరణః, రాణః, రణరణః, రణః, ఉ, వారణః, ఆర, మా, రమా, రమ, ఆరమా, రమా, యేన, రామా, సా, రమా, దత్తా, ఉత్, అయ, ఉదయః, అదయదయః, దయః, దాయ, ఉత్, అయః, దే, దయః, అభీర, భీ, రభిః, ఆభీర, భీ, సార, భీః, శ్రీమాన్, జిష్ణుః,సః, విష్ణుః, పాయాత్.


ప్రతిపదార్థాలు -
యః = ఏ విష్ణువు
కరణః = జలాన్ని పొందియున్నవాడో (కం = జలం, రణతి = గచ్ఛతి; ఇతి కరణః)
          (మత్స్యకూర్మరూపాలను దాల్చినవాడో),
అరణః = యుద్ధవ్యాపారం లేనివాడో
          (వామనుడై యుద్ధం చేయకుండానే బలి నణచినవాడో),
(యస్య = ఎవనియొక్క)
రాణః = యుద్ధసంబంధమైన
రణరణః = ‘రణరణ’ అనే ధ్వని
రణః = యుద్ధం వల్ల కలిగే
ఉ = వ్రణాలు మొదలైన చిహ్నాలు కల వీరులను
వారణః = నివారించినదై ఉన్నవాడో
          (దేవభటుల అవసరం లేకుండా నృసింహరూపంతో హిరణ్యకశిపుని చంపినవాడో),
ఆర = శత్రుక్షత్రియ సమూహాన్ని
మా = పరశురామరూపంతో చంపి
రమా = లక్ష్మితో
రమ = రమించే విష్ణువునందు
ఆరమా = మిక్కిలి రమించే తాపసులను
రమా = రమింపజేసే
యేన = ఏ విష్ణువు చేత
రామా = రమణీయమైన
సా = అటువంటి
రమా = భూమి అనే రాజ్యలక్ష్మి
దత్తా = బ్రాహ్మణులకు ఇవ్వబడిందో,
ఉత్ = ఉద్ధరింపబడిన
అయ = నీట మునిగిన
ఉదయః = ఉదయాచలం మొదలైనవి గల భూమి కలవాడో
          (వరాహరూపం దాల్చినవాడని భావం),
అదయదయః = అదక్రూరులపై కూడ
దయః = దయగలవాడో (బుద్ధరూపంతో క్రూరులను ఉద్ధరించినవాడని భావం),
దాయ = రాజ్యభాగం కోసం
ఉత్ = ఎత్తబడిన
అయః = లోహనిర్మితశస్త్రాలు కల కౌరవులను
దే = చీల్చిన అర్జునుని యందు
దయః = కృప గలవాడో (కృష్ణుడని భావం),
అభీర = పరదారాపహరణ పాపానికి భయపడని రావణాదుల యందు
భీ = భయావహమైన
రభిః = యుద్ధరాభసం (తీవ్రత) కలవాడో (రాముడని భావం),
అభీర = శూరులయందు
ఆభీర = భీరువులయందు
భీ = సమానంగా భయాన్ని
సార = ప్రసరింపజేసిన మ్లేచ్చులకు
భీః = ప్రాణభయాన్ని కలిగించేవాడో (కల్కి అని భావం)
శ్రీమాన్ = నిత్యలక్ష్మి కలవాడూ
జిష్ణుః = జయశీలుడైనవాడూ
సః విష్ణుః = సర్వవ్యాపియైన ఆ నారాయణుడు
పాయాత్ = మిమ్ము బ్రోచుగాక!


                   (శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారు సేకరించిన ‘ప్రహేళికలు’ గ్రంథంనుండి)

సమస్యాపూరణం - 558 (సమరమునే కోరినాఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది
సమరమునే కోరినాఁడు శాంతిని పొందన్.
ఈ సమస్యను పంపిన
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి
ధన్యవాదాలు.

ఆదిత్య స్తోత్రము

                             ఆదిత్య స్తోత్రము



సీ.
సూర్యనారాయణా! శుద్ధ తేజోనిధీ!
          వందనమ్మో సదానందమూర్తి!
సకల లోకములలో చైతన్య తేజంబు
          ప్రసరింపజేయు దివ్య స్వరూప!
ఆదిదేవా! జగదాధార! భాస్కరా!
          ఆదిత్య! ధ్యానింతు నాత్మరూప!
సృష్టికర్తవు దేవ! శ్రితజనపాలకా!
          వేదమూర్తివి రవీ! విమలతేజ!
భువనపాలకుడవు పుష్కరబాంధవా!
          వాసుదేవ! దినేశ! పద్మినీశ!
ప్రళయకారకుడవు, ప్రణవవాచ్యుడవీవు
          అష్టమూర్తివి పూష! ఆదితేయ!
త్రిజగదాప్తుండవు దివ్యగాత్రుండవు
          విశ్వసాక్షివి మిత్ర! విబుధవంద్య!
గ్రహనాయకుడవు త్రికాల నియంతవు
          కాంతిమంతుడవు ప్రజ్ఞానరాశి
చైతన్య కారక!జ్ఞానతేజోనిధి!
          అజ్ఞాన తిమిరాపహారి! ద్యుమణి!
ఆరోగ్యదాత వాశ్రిత కల్ప భూజంబు
          దృష్టిప్రదాతవు దేవ దేవ!
సింహరాశ్యధిపతి! సైంహికేయారాతి
          ఆకాశగమనుడ వరుణ వర్ణ!
ధర్మ సంరక్షక! దానవ నాశక!
          తత్త్వవేత్తవు శ్రితత్రాత వర్క!
ఆ.వె.
నీ స్తవమునొనర్చి నీదు సేవలు చేసి
నిన్ను నాశ్రయించు నిర్మలులకు
శాంతి సౌఖ్యములను సద్గతులనొసంగు
భద్రరూప! నీకు వందనములు


        రచన - శ్రీ పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారు

11, డిసెంబర్ 2011, ఆదివారం

చమత్కార పద్యాలు - 144

                                  శబ్దచిత్రం

యావత్తోయధరా ధరా ధర ధరాధారాధర శ్రీధరా
యావచ్చారుచచారుచారుచమరం చామీకరం చామరమ్
|
యావద్రావణరామ రామరమణం రామాయణం శ్రూయతే
తావద్భో భువి భోగభోగ భువనం భోగాయ భూయాద్విభో
||


పదవిభాగం -
యావత్, తోయధరాః, ధరా, ధర, ధరా + ఆధార, అధర, శ్రీధరా, యావత్, చారు, చచా, రు, చారు, చమరం, చామీకరం, చ, అమరం, యావత్, రావణరామ, రామ, రమణం, రామాయణం, శ్రూయతే, తావత్, భో, భువి, భోగభోగ, భువనం, భోగాయ, భూయాత్, విభో.


అన్వయం -
తోయధరాః, ధరా, ధర, ధరా + ఆధార, అధర, శ్రీధరాః, యావత్, చ, చారు, చచా, రు, చారు, చమరం, అమరం, చామీకరం, యావత్, రావణరామ, రామ, రమణం, రామాయణం, భువి, యావత్, శ్రూయతే, తావత్, భోగభోగ, భో విభో, భువనం, భోగాయ, భూయాత్.

ప్రతిపదార్థాలు - 
తోయధరాః = సముద్రాలు
ధరా = భూమి
ధర = పర్వతాలు
ధరా + ఆధార = భూమికి ఆధారమైన
అధర = అధోలోకంలో ఉండే
శ్రీధరాః = విషధరుడైన ఆదిశేష సర్పం (లేదా లక్ష్మిని ధరించిన కూర్మం)
యావత్ = ఎప్పటివరకు (ఉంటాయో)
చ = మరియు
చారు = మనోజ్ఞమైన
చచా = ‘చచ’ అనే
రు = ధ్వనిని చేసే
చారు = అందమైన
చమరం = చమరమృగాలు కల
అమరం = దేవతలకు సంబంధించిన
చామీకరం = స్వర్ణనిలయమైన మేరుపర్వతం
యావత్ = ఎప్పటివరకు (ఉంటుందో)
రావణరామ = రామ రావణు లనే
రామ = జగత్తు నాకర్షించే
రమణం = నాయక, ప్రతినాయకులు కల
రామాయణం = రామాయణం
భువి = భూమిపైన
యావత్ = ఎప్పటివరకు
శ్రూయతే = వినిపిస్తుందో
తావత్ = అప్పటివరకు
భోగభోగ = భోగాలకు భోగభూతుడవైన
భో విభో = ఓ రాజా!
భువనం = భూమండలం
(తే) భోగాయ = నీ అనుభవం కోసం
భూయాత్ = అగును గాక! 


                (శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారు సేకరించిన ‘ప్రహేళికలు’ గ్రంథంనుండి)

సమస్యాపూరణం - 557 (తునికి సాయపడుము)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది
తునికి సాయపడుము కనుము సుఖము
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

సమస్యాపూరణం - 556 (ధర్మము వీడు వారలకు)

వారాంతపు సమస్యాపూరణం
కవిమిత్రులారా,
ఈ వారాంతానికి పూరించవలసిన సమస్య ఇది
ధర్మము వీడు వారలకు తప్పక కల్గును శాంతిసౌఖ్యముల్.
(ఆకాశవాణి- విజయవాడ వారి సౌజన్యంతో)

పద్యప్రాశస్త్యము

                             పద్యప్రాశస్త్యము



 సీ.
పద్యమ్ము పద్మసంభవ భామినీ విలా
          సాద్భుత రచనా మహత్త్వ ఫలము
పద్యమ్ము కవిరాజ వాక్సుధా వాహినీ
          వీచీ విలోల కవిత్వ మయము
పద్యమ్ము సముచిత పద గుంఫనోపేత
          రస విశేష పటుత్వ రాజితమ్ము
పద్యమ్ము శబ్దార్థ వైచిత్ర్య విన్యాస
          బాహుళ్య రుచిర సంపల్లలితము
తే.గీ.
సాహితీ నందనోద్యాన జనిత పారి
జాత సుమధుర సౌరభ సార కలిత
పద్యము మనోహరాకార వైభవమ్ము
భవ్య సౌవర్ణ భావ సౌభాగ్యవతికి 


మిత్రులారా!
           బమ్మెర పోతన గారు మహత్త్వ, కవిత్వ, పటుత్వ, సంపదల్ కోరేరు "అమ్మల గన్న యమ్మ" అనే తన ప్రార్థనలో. ఇవి క్రమముగా ఓం, ఐం, హ్రీం, శ్రీం అనే బీజాక్షరాలకి సంబంధించినవి. ఈ నాలుగు భావములను (మహత్త్వ, కవిత్వ, పటుత్వ, సంపదల్) పైన నేను చెప్పిన పద్యములో చేర్చేను. గమనించండి. అంటే మన కవిత్వము ఎంతో పవిత్రముగా ఉండాలని నా భావన. స్వస్తి.    
                  పండిత నేమాని రామజోగి సన్యాసి రావు
కవిమిత్రులారా,
          నేమాని వారి ‘పద్యప్రాశస్త్యము’ చదివారు కదా! పద్యం చచ్చిపోయిందన్న అపప్రథను తొలగించడానికి మనవంతు ప్రయత్నం మనం చేద్దాం. తెలుగు భాషాసాహిత్యాల గురించి కాని, పద్యకవితాసౌందర్యాన్ని గురించి కాని మీరూ పద్యాలు వ్రాసి పంపండి. ఆంధ్రపద్యకవిత్వం వర్ధిల్లాలి!

10, డిసెంబర్ 2011, శనివారం

చమత్కార పద్యాలు - 143

                      అనులోమ ప్రతిలోమ శ్లోకం

 కాళిదాసళిదాయోమా చంద్రంతేరిపురంజకమ్ |

కంజరంపురితేంద్రంచ మాయోదాళిసదాళికా|                                      
(ఈ శ్లోకాన్ని ఎటునుండి చదివినా ఒక్కటే!)

పదవిభాగం -
కాళి, దాసళి, దాయో, మా, చంద్రం, తే, రిపురంజకం, కంజరం, పురి, తా, ఇంద్రం చ, మాయో, దాళి, సత్ + ఆళి, కా.


 అన్వయం -
కాళి, దాసళి, దాయో, మాయో, దాళి, సత్ + ఆళి, పురి, తే, తా, చంద్రం, కంజరం, ఇంద్రం చ, రిపురంజకమ్, మా, కా


.ప్రతిపదార్థాలు -
కాళి = ఓ పార్వతీ!
దాసళి = దాసులను పుత్రులుగా స్వీకరించేదానా!
దాయో = వేరుగా ఉండని శివుడు కలదానా!
          (‘దాయః అవిభక్తః ఉః శివః యస్యాస్సా దాయో’ అని విగ్రహవాక్యం)
మాయో = మాయారూపిణివైన ఓ దేవతా!
          (‘మాయా చ సా ఊశ్చ మాయో’ అని విగ్రహం)
దాళి = దాంతి కలదానా!
          (‘దాం క్షాంతిం లాతి గృహ్ణాతీతి దాళీ)
సత్ + ఆళి = దేవతాస్త్రీలే చెలికత్తెలుగా కలదానా!
పురి = దగ్గరికి తీసే విషయమై
తే = నీ యొక్క
తా = దయ
చంద్రం = చంద్రుని
కంజరం = సూర్యుని
ఇంద్రం చ = ఇంద్రునీ
రిపురంజకమ్ = అరిషడ్వర్గం కలవారిగా చేయుదువు గాక!
మా = నన్ను గురించి
కా = సుఖానికి స్థానం అవుదువు గాక!
          (‘కస్య = సుఖస్య, ఆ = స్థానం - కా’ అని విగ్రహం)


(శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారు సేకరించిన ‘ప్రహేళికలు’ గ్రంథంనుండి)

సమస్యాపూరణం - 555 (తామసగుణపూర్ణుఁ డంద్రు)

కవిమిత్రులారా,
ఈరోజు దత్తజయంతి. 
 గురుమూర్తి దత్తాత్రేయుని కరుణాకటాక్షం వల్ల 
మీ కందరికీ సర్వశుభాలు కలుగాలని 
ఆకాంక్షిస్తున్నాను. 
 ఈరోజు పూరించవలసిన సమస్య ఇది
తామసగుణపూర్ణుఁ డంద్రు దత్తాత్రేయున్.

9, డిసెంబర్ 2011, శుక్రవారం

చమత్కార పద్యాలు - 142

               పాదానులోమ ప్రతిలోమ శ్లోకం
కాళీనానననాళీకా
రాధితాహిహితాధిరా |
మాయాసామమసాయామా
కాపిదీప్రప్రదీపికా
||
(ఈ శ్లోకంలో ఏపాదానికి ఆ పాదం ఎటునుండి చదివినా ఒక్కటే!)

పదవిభాగం -
కాళీ, ఈన, ఆనన, నాళీక, ఆరాధితా, హి, హిత, అధి, రా, మా, యా, సా, మమ, సా, ఆయామా, కాపి, దీప్రప్రదీపికా.


అన్వయం -
కాళీ, ఇన, ఆనన, నాళీక, ఆరాధితా హి, హిత, అధి, రా, యా మా, సా, ఆయామా, సా, మమ, కాపి, దీప్రప్రదీపికా.


ప్రతిపదార్థాలు
కాళీ = పార్వతి యొక్క
ఇన = భర్త అయిన శంకరుని
ఆనన = వదన మనే
నాళీక = పద్మం చేత
ఆరాధితా హి = స్తుతింపబడేడీ,
హిత = భక్తుల యొక్క
అధి = మనోవ్యధను
రా = తొలగించేదీ (అయిన)
యా మా = ఏ లక్ష్మీదేవి
సా = (భక్తులపట్ల) దయ యొక్క
ఆయామా = దీర్ఘత కలిగినదై ఒప్పుతున్నదో
సా = అటువంటి లక్ష్మీదేవి
మమ = నాకు
కాపి = అనిర్వచనీయమైన
దీప్రప్రదీపికా = ఎల్లప్పుడు ప్రకాశించే దీపిక అగును గాక!  


భాష్యం విజయసారథి గారు సేకరించిన ‘ప్రహేళికలు’ గ్రంథంనుండి)

సమస్యాపూరణం - 554 (హరుని పూజ సేయ)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది
హరుని పూజ సేయ హాని కలుగు.
ఈ సమస్యను పంపిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.

8, డిసెంబర్ 2011, గురువారం

శివ మానస పూజ

శివ మానస పూజ


శంభో మహాదేవ! శంభో మహాదేవ! స్వాంతమ్మునందు పూజింతు నిన్ను
శంభో మహాదేవ! శంభో మహాదేవ! పాలింపుమా మమ్ము పార్వతీశ!

దేవదేవా! మహాదేవ! గౌరీనాథ! ధ్యానింతు నీదు తత్వమ్ము నాత్మ
దేవదేవా! వామదేవ! విశ్వేశ్వరా! ఆవాహనమ్మిదే! ఆదిదేవ! 
దేవదేవా! సర్వదేవబృందార్చితా! నవరత్నఖచితాసనమిదె నీకు
దేవదేవా! దయాభావ! మృత్యంజయా! పాద్యజల మ్మిదే పరమపురుష!

శివశివా! శశధరశేఖరా! పరమేశ! అర్ఘ్య మియ్యదె నీకు అమృతరూప!
శివశివా! కైలాసశృంగనికేతనా! ఆచమనీయ మియ్యదె మహేశ!
శివశివా! భూతేశ! శ్రీకంఠ! పావనగంగాజలాభిషేక మిదె నీకు
శివశివా! సద్భక్తచిత్తాబ్జమందిరా! రమణీయవస్త్రయుగ్మ మిదె నీకు

భవభవా! శ్రితజనపాపవినాశకా! యజ్ఞసూత్ర మ్మిదే అభవ నీకు
భవభవా! సూర్యేందువహ్నిత్రిలోచనా! శ్రీచందనమ్ము నర్పింతు నీకు
భవభవా! ప్రజ్ఞానవైరాగ్యవైభవా! భూషణ మ్మిదె నీకు భూరితేజ
భవభవా! చిద్రూప! బ్రహ్మాండనాయకా! పుష్పాళితో నీకు పూజ లివియె

హరహరా! భవహరా! అభయప్రదాయకా! ధూపమియ్యదె నీకు దుఃఖనాశ!
హరహరా! శుభకరా! ఆర్యాసమన్వితా! దీపరాజియ్యదే దివ్యగాత్ర!
హరహరా! సకలలోకాధార! బహువిధ నైవేద్య మిదె నీకు నందివాహ!
హరహరా! పంచబాణాంతకా! కర్పూరతాంబూల మిదె నీకు నంబికేశ!

మంగళమ్మో సర్వమంగళాధవ నీకు మంగళ హారతి లింగరూప!
మంత్రవాచ్యా! నీకు మానసపూజతో మంత్రపుష్పమ్మిదే మద్ధృదీశ!

శంభో మహాదేవ! శంభో మహాదేవ! స్వాంతమ్మునందు పూజింతు నిన్ను
శంభో మహాదేవ! శంభో మహాదేవ! పాలింపుమా మమ్ము పార్వతీశ!

ఫల శ్రుతి
పార్వతీశు కరుణ బడసి వ్రాసిన యట్టి
యీ స్తవమును నిత్య మెవ్వరేని
బూని మానసమున పూజింప నొదవును
శాంతి సౌఖ్యములును సద్గతులును

       రచన - శ్రీ పండిత రామజోగి సన్యాసి రావు గారు