30, సెప్టెంబర్ 2016, శుక్రవారం

చమత్కార పద్యాలు – 216/9


త్రింశదర్థ పద్యరత్నము పోకూరి కాశీపతి

ఆ.వె.
భూరి జఠర గురుఁడు నీరజాంబక భూతి
మహిత కరుఁ డహీన మణి కలాపుఁ
డలఘు సద్గణేశుఁ డగ్రగోపుఁడు మహా
మర్త్యసింహుఁ డేలు మనల నెపుడు.

9వ అర్థము –  వరుణ స్మరణ          
                                                                          
భూరి జఠర గురుఁడు = బ్రహ్మయే తాతగా గలవాడును, (బ్రహ్మ సంతానమగు కర్దమ ప్రజాపతి పుత్రుఁడు)
నీరజ అంబక =అగ్గికంటి అయిన శివుని వంటి
భూతి = ఐశ్వర్యముగా గలవాఁడును,
మహిత కరుఁడు = అతిశయ మైనవాఁడును,
అహీన మణి కలాపుఁడు = సర్పరాజమును మణికట్టున భూషణముగా (నాగపాశము) గలవాఁడును,
అలఘు సద్గణేశుఁడు = గొప్ప యొప్పుల కుప్ప యగు ప్రభువైనవాఁడును,
అగ్ర గోపుఁడు = ప్రధానమగు జలమునకు అధిపతి యైనవాఁడును,
మహామర్త్యసింహుఁడు = గొప్ప దేవతా శ్రేష్ఠుఁ డైనవాఁడును (అగు వరుణుఁడు)
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!

సమస్య - 2158 (కుండపోత వర్షమ్మున...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"కుండపోత వర్షమ్మున గొడుగు లేల"
లేదా...
"వద్దిక ఛత్రముల్ గొనుట వర్షము వచ్చినఁ గుండపోతగన్"

29, సెప్టెంబర్ 2016, గురువారం

చమత్కార పద్యాలు – 216/8


త్రింశదర్థ పద్యరత్నము పోకూరి కాశీపతి

ఆ.వె.
భూరి జఠర గురుఁడు నీరజాంబక భూతి
మహిత కరుఁ డహీన మణి కలాపుఁ
డలఘు సద్గణేశుఁ డగ్రగోపుఁడు మహా
మర్త్యసింహుఁ డేలు మనల నెపుడు.

8వ అర్థము నిరృతి స్మరణ          

భూరి జఠర గురుఁడు = గొప్ప కఠినులగు వారికి (రాక్షసులకు) రాజైన వాడును,
నీరజ అంబక =అగ్గికంటి అయిన శివుఁడే
భూతి = ఐశ్వర్యముగా గలవాఁడును,
మహిత కరుఁడు = అతిశయ మైనవాఁడును,
అహీన = వృత్రాసురుఁడను ప్రభువుకు
మణి కలాపుఁడు = రత్నభూషణము వంటివాఁడును,
అలఘు సద్గణేశుఁడు = మిక్కిలి యొప్పుల కుప్ప యగు ప్రభువైనవాఁడును,
అగ్ర గోపుఁడు = దిక్పాలకాగ్రణి యైనవాఁడును,
మహా మర్త్యసింహుఁడు = మిక్కిలిగా మానవులకు సింహప్రాయుఁ డైనవాఁడును (అగు నిరృతి)
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!

సమస్య - 2157 (వాలినిఁ జంపె రావణుఁడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"వాలినిఁ జంపె రావణుఁడు పార్వతి శోకముఁ గాంచి జాలితో"
లేదా...
"వాలిని భవాని కొఱకు రావణుఁడు చంపె"
ఈ సమస్యను పంపిన విరించి గారికి ధన్యవాదాలు.

28, సెప్టెంబర్ 2016, బుధవారం

చమత్కార పద్యాలు – 216/7


త్రింశదర్థ పద్యరత్నము పోకూరి కాశీపతి

ఆ.వె.
భూరి జఠర గురుఁడు నీరజాంబక భూతి
మహిత కరుఁ డహీన మణి కలాపుఁ
డలఘు సద్గణేశుఁ డగ్రగోపుఁడు మహా
మర్త్యసింహుఁ డేలు మనల నెపుడు.

7వ అర్థము యమ స్మరణ             

భూరి జఠర = పెద్ద కడుపు గల భీమునకు,
గురుఁడు = పెదతండ్రి యైనవాడును,
నీరజ అంబక =అగ్గికంటి అయిన శివుని వలన
భూతి = పుట్టిన వాఁడును,
మహిత కరుఁడు = అతిశయ మైనవాఁడును,
అహీన = సర్పరాజమును
మణి కలాపుఁడు = మణికట్టున భూషణముగా గలవాఁడును,
అలఘు సద్గణేశుఁడు = గొప్ప యొప్పుల కుప్ప యగు ప్రభువైనవాఁడును,
అగ్ర గోపుఁడు = ముఖ్య (దక్షిణ) దిక్పతి యైనవాఁడును,
మహా +అమర్త్యసింహుఁడు = గొప్ప దేవతాశ్రేష్ఠు డైనవాఁడును (అగు యముఁడు)
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!

సమస్య - 2156 (కవియే మన పతనమునకు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"కవియేగా మఱి చేటు దెచ్చు నిలలోఁ గాఠిన్యమే చిందుచున్"
లేదా...
"కవియే మఱి పతనమునకు కారణ మగురా!"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

ఖండకావ్యము - 33
సూర్యభగవానుడు
రచన – మంద పీతాంబర్

కోయిల పాటపాడె శతకోటి సుమమ్ములు వేచె బూయగా
కోయని కోడి కూసెగద కోవెల లోపల గంట మ్రోగె దా
హాయిగ విప్పి పింఛమును ఆడె మయూరి మనోజ్ఞరీతి వి
చ్చేయుము భాస్కరా గగన సీమకు, వెల్గులు  జిమ్మ పృథ్విపై !!!

ఏడు గుర్రాలతో జోడు చక్రములేని
తేరుపై తిరుగాడు దేవు డీవు,
ఊరువుల్ లేని యనూరుని కరుణించి
సారధి జేసిన స్వామి వీవు,
పాలకడలిపైన పాము పడగలనీడ
పవళించు హరికంటి పాప వీవు,
కడలిపై పలువేడి సుడులను సృష్టించి
వర్షమ్ము లిడెడు మహర్షి  వీవు,
భూతకోటికి జీవ చైతన్యమునొసంగి
ప్రీతిగూర్చెడు పరంజ్యోతివీవు,
తిమిరమునుబార ద్రోలెడు ద్యుమణి వీవు
ప్రాణికోటిని రక్షించు ప్రభుడ వీవు
సౌర మండల సామ్రాజ్య సార్వభౌమ
స్వాగతము దీనజనపాల సమయ పాల!!

చెంగున దూకి నిన్ మ్రింగ జూచిన కపి
పుంగవునకు శాస్త్రములను జెప్పి,
ఆదిత్య హృదయ మత్యాదరమ్మున ననిన్
ధ్యానించి రాముండు ధనువు నెత్తి
శరపరంపరలచే శిరతోరణము గూల్చ
సీతాపహరణుని ఛిద్రపరచె
మునిమంత్ర వశమున మును కుంతి నిను గోర
వీర విక్రముడైన శూరునిచ్చి
వనవాస సమయాన వినయులై పాండవుల్
ప్రార్థింప నక్షయ పాత్ర నొసగి
మే లొనర్చిన ఘనమైన  కాలపురుష!
ధర్మ పక్షాన నిలిచిన  కర్మసాక్షి
శుభము లెన్నియో చేకూర్చు విభుఁడ వనుచు
దినకరా! నిన్ను గొలుతుము దినదినమ్ము!!!

ఉదజని హీలియమ్ మొదలైన  వాయు
మ్మేళన మయమైన గోళ రూప!
పంచ భూతముల ప్రభావితు జేసి  ప్ర
పంచమ్ము నెల్ల పాలించు రేడ!
కరచరణాలనే కిరణాలుగా జేసి
ధరణిపై  పరిచెడు పరమ పురుష!
విసుగు విరామమ్ము నిసుమంతయునులేక
విశ్వమందున సదా  వెలుగు వాడ!
భాస్కరాదిత్య ఖగ పూష భాను తేజ
రవి సవిత్రార్క సూర్య హిరణ్యగర్భ
కశ్యపాత్మజ  చైతన్య కారకుండ
మమ్ము బ్రోవుము దీవించి మనసు నిండ !!!

తూరుపు దిక్కునన్ వెలుగుతోరణమో యన స్వర్ణ వర్ణ మం
దారములీల గన్పడెడు తామసదూరుని తామరప్రియున్
పూరిత భక్తిభావములు పొంగ మనమ్మున దివ్యమంగళా
కారుని బాలభానుని సహస్ర కరున్ కరమోడ్చి మ్రొక్కెదన్!!!