వ్యాకరణం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
వ్యాకరణం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

19, డిసెంబర్ 2015, శనివారం

‘ఆంధ్రామృతం’ బ్లాగులో వ్యాకరణ పాఠాలు…

శ్రీ చింతా రామకృష్ణారావు గారి ఆంధ్రామృతంబ్లాగులో సంస్కృత, తెలుగు సంధుల గురించి వివరంగా వీడియో పాఠాలను అందిస్తున్నారు. ఔత్సాహిక కవిమిత్రులకు ఆ పాఠాలు ఎంతో ఉపయుక్తం. ఆ పాఠాలను పరిశీలించి, సాధారణంగా మనం చేస్తున్న నుగాగమ, యడాగమ, ద్రుత సంధిదోషాలను పరిహరించుకోవచ్చు. తప్పక చూడండి.

ఈ పాఠాలను అందిస్తున్న చింతా వారికి ధన్యవాదాలు తెల్పుకుందాం.
క్రింది లింకును క్లిక్ చేయండి.....

1, అక్టోబర్ 2012, సోమవారం

వ్యాకరణ పాఠము

          భాషకు వ్యాకరణమే మూలస్తంభము
మిత్రులారా!
          మన రచనలను సాధ్యమైనంత వరకు వ్యాకరణ బద్ధముగా నుండుటకే ప్రయత్నము చేయవలెను.  కొందరు మహాకవులు వ్యాకరణ విరుద్ధములైన ప్రయోగములు చేయుటయు వాటిని "ఆర్య వ్యవహారములు గా" వదిలివేయుటయు జరిగినది.  సమాసములలో పూర్వపదము చివరన "న్" లేక "ల్" వంటి వర్ణములు ఉన్నప్పుడు పర పదము "అ" కారము వంటి అచ్చుతో మొదలగునప్పుడు సంధి కార్యము ఎట్లుండును? 
ఉదా: వానిన్ + అక్కడ = వానినక్కడ (సాధు ప్రయోగము)
          ‘వానిన్నక్కడ’ అని సాధించుట వ్యాకరణ సమ్మతము కాదు.  కొందరు పూర్వ కవులు ఎందరో వర్తమాన కవులు ఈ విషయమును గమనించుట లేదు.  నా ఉద్దేశములో అట్టి దోష ప్రయోగములను చేయకుండుట మంచిది. 

          పూర్వపదము సంస్కృత పదము అయినప్పుడు పర పదము అచ్చుతో ప్రారంభమయినప్పుడు సంధి కార్యము ఈ క్రింది విధముగా నుంటుంది:
కస్త్వం + అనెను = కస్త్వమ్మనెను;
తుభ్యం + అనుచు = తుభ్యమ్మనుచు.
          ఈ సూత్రమును కేవల తెలుగు సంధులకు అన్వయించుట తగదు. 
ఉంచెన్ + ఇక్కడ = ఉంచెనిక్కడ మాత్రమే అగును.  ఉంచెన్నిక్కడ అని వాడరాదు.  అటులనే:
వచ్చెన్ + అంతట = వచ్చెనంతట మాత్రమే అగును.  వచ్చెన్నంతట అని సంధి చేయరాదు.

అందరకీ శుభాభినందనలతో.  స్వస్తి!
                   పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

11, జనవరి 2012, బుధవారం

వ్యాకరణం - 5

                          దుగాగమ సంధి

మిత్రులారా!
          నీ, నా, తన ల తరువాత యొక్కకు బదులుగా దుగాగమ సంధి సూత్రము ప్రకారము "దు" వచ్చును. ఇది మీ, మా, తమలకు మాత్రము వర్తించదు. అందుకు విరుద్ధముగా కొందరు కవులు మీదు, మాదు, తమదు అని ప్రయోగించుటను చూచుచున్నాము. బాల వ్యాకరణములోని ఈ సూత్రమును వ్యాఖ్యను గమనించండి

సమాస పరిచ్చేదము: సూత్రము 11:
యుష్మ దస్మ దాత్మార్థకంబుల కుత్తరపదంబు పరంబగునపుడు దుగాగమంబు విభాషనగు.
నీదు కరుణ-నీ కరుణ; నాదునేరిమి-నా నేరిమి; తనదురూపు-తనరూపు.

వ్యాఖ్య - 
          సంస్కృతమునందలి యుష్మదస్మదాత్మన్ శబ్దములకు తెనుగున పర్యాయ పదములగు "నీ-నా-తన" యను శబ్దములకు సమాసమున వేరొక పదము పరమైనచో "దుక్" ఆగమముగా వచ్చునని సూత్రార్థము. ఈ యుదాహరణములన్నియు షష్ఠి తత్పురుష సమాసములు. సమాసమున విభక్తి ప్రత్యయము లోపించిన పిదప ఉత్తర పద పరత్వముండును గాన పూర్వ పదములగు నీ-నా-తనలకు "దు" వికల్పముగ చేరునని భావము.

                       నీయొక్క + కరుణ అని యుండగా సమాస 25వ సూత్రముచే విభక్తి ప్రత్యయము లోపించి నీ + కరుణ యైన పిదప ప్రకృత సూత్రముచే నీ యనుదానికి దుగాగమము వచ్చి "నీదు కరుణ" యైనది. ఈ దుగాగమము వికల్పముగాన రానపుడు నీకరుణ అనియే యుండును. ఇట్లే మిగిలిన రూపముల నూహించునది.


స్వస్తి!

                                                                  సేకరణ
                         శ్రీ పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారు

1, నవంబర్ 2011, మంగళవారం

ఔపవిభక్తికాలు

ఔపవిభక్తికాలు
ద్వితీయ మొదలైన విభక్తుల ఏకవచన శబ్దాలకు ముందు (సమీపంలో) చేరేవి కనుక వీటిని ఉపవిభక్తులు అంటారు. ‘ఇ, టి, తి’ అనే వర్ణాలు ఉపవిభక్తులు. వీటినే ఔపవిభక్తికాలు అంటారు. ఇవి చేరే పదాలను కూడ ఔపవిభక్తికాలు అనే అంటారు.
1) ఇ-టి-తి వర్ణంబులు వక్ష్యమాణంబు లౌపవిభక్తికంబులు.
ముందు చెప్పబోయే ఆయా సూత్రాలచేత విధింపబడే ఇ, టి, తి వర్ణాలు ఔపవిభక్తికాలు. ద్వితీయ మొదలైన విభక్తుల కారణంగా ఇవి వచ్చిచేరుతాయి. ఇవి కొన్ని చోట్ల పదాల తుది అక్షరాలకు ఆదేశం గాను, మరికొన్ని చోట్ల ఆగమం గాను చేరుతూ ఉంటాయి.
2) ఇవి ద్వితీయాద్యేకవచనంబులు పరంబు లగునపుడు నామంబులకుం గొన్నింటికిం బ్రాయికంబుగ నగు.
ఈ ఇ, టి, తి వర్ణాలు ద్వితీయనుండి అన్ని విభక్తులలో ఏకవచనం పరమైనపుడు కొన్ని శబ్దాలకు తరచుగా చేరుతూ ఉంటాయి.
‘కాలు’కు ద్వితీయ ఏకవచన ప్రత్యయం ‘ను’ చేరినపుడు ‘కాలు + ను’ అవుతుంది. దానికి ‘ఇ’ చేరగా ‘కాలు + ఇ + ను = కాలి +ను’ అవుతుంది. ‘ఇకారం మీది కు, ను, వు అనే క్రియావిభక్తుల ఉత్వానికి ఇత్వం అవుతుంది’ అనే సూత్రం వల్ల ‘కాలి + ని = కాలిని’ అవుతుంది. అదే విధంగా ‘కాలు + చే = కాలిచే’ అవుతుంది.
‘నాగలి’కి ద్వితీయ ఏకవచన ప్రత్యయం ‘ను’ చేరినపుడు ’నాగలి + ను’ అవుతుంది. దానికి ‘టి’ ఆదేశమై ‘నాగటి + ను -> నాగటిని’ అవుతుంది.
‘నేయి’కి ద్వితీయ ఏకవచన ప్రత్యయం ‘ను’ చేరినపుడు ‘నేయి + ను’ అవుతుంది. దానికి ‘తి’ చేరగా ‘నేతి + ను -> నేతిని’ అవుతుంది.
3) టివర్ణంబు గొన్నింటి యంతాక్షరంబున కాదేశంబును, గొన్నింటి కంతాగమంబును, గొన్నింటికిం బర్యాయంబున రెండును బ్రాయికంబుగ నగు.
‘టి’ వర్ణం కొన్ని శబ్దాల తుది అక్షరానికి ఆదేశంగాను, కొన్నింటికి ఆగమంగాను, కొన్నింటికి రెండూ వస్తాయి.
ఆదేశానికి ....
త్రాడు + ను -> త్రాటి + ను -> త్రాటిని
కాడు + ను -> కాటి + ను -> కాటిని
నోరు + ను -> నోటి + ను -> నోటిని
ఆగమానికి ....
అన్ని + ను -> అన్ని + టి + ను -> అన్నిటిని
ఎనిమిది + ను -> ఎనిమిది + టి + ను -> ఎనిమిదిటిని
వేయి + ను -> వేయి + టి + ను -> వేయిటిని
ఉభయానికి (ఆదేశ, ఆగమాలు రెండూ) ....
ఏమి + ను -> (ఆదేశం) ఏటి + ను -> ఏటిని;
.......................... (ఆగమం) ఏమి + టి + ను -> ఏమిటిని.
పగలు + ను -> (ఆదేశం) పగలు + ను -> పగటిని;
............................. (ఆగమం) పగలు + ఇ + టి + ను -> పగలిటిని.
మొదలు + ను -> (ఆదేశం) మొదలు + టి + ను -> మొదటిని;
.................................. (ఆగమం) మొదలు + ఇ + టి + ను -> మొదలిటిని.
రెండు + ను -> (ఆదేశం) రెండు + టి + ను -> రెంటిని;
............................ (ఆగమం) రెండు + ఇ + టి + ను -> రెండిటిని.
మూఁడు + ను -> (ఆదేశం) మూఁడు + టి + ను -> మూఁటిని;
................................. (ఆగమం) మూఁడు + ఇ + టి + ను -> మూఁడిటిని.
నూఱు + ను -> (ఆదేశం) నూఱు + టి + ను -> నూటిని;
.............................. (ఆగమం) నూఱు + ఇ + టి + ను -> నూఱిటిని.
4) హ్రస్వము మీఁది ‘టి’ వర్ణంబునకు ముందు పూర్ణబిందువు బహుళముగా నగు.
హ్రస్వాంతమైన శబ్దానికి పరమైన ‘టి’ వర్ణానికి ముందు నిండుసున్న బహుళముగా అవుతుంది.
అన్ని+ను -> అన్ని+టి +ను -> అన్నింటిని, అన్నిటిని.
‘అన్ని+టి+ని’ అన్నప్పుడు ‘న్ని’ అనే హ్రస్వానికి పరమైన ‘టి’ వర్ణానికి ముందు నిండుసున్న వచ్చి ‘అన్నింటిని’ అవుతుంది. బహుళం అనడం వల్ల సున్నా రానప్పుడు ‘అన్నిటిని’ అవుతుంది.
ఎనిమిది+టి+ను -> ఎనిమిదింటిని, ఎనిమిదిటిని.
పగలు+టి+ను -> పగటి+ను -> పగంటిని, పగటిని
రెండు+టి+ను -> రెండిటి+ను -> రెండింటిని, రెండిటిని
మూఁడు+టి+ను -> మూఁడుటి+టి+ను -> మూఁడింటిని, మూఁడిటిని.
‘హ్రస్వముమీఁది’ అనడం వల్ల దీర్ఘముమీఁది ‘టి’ వర్ణమునకు నిండుసున్న రాదు. ఉదా... త్రాడు+ను -> త్రాటిని, ఏఱు+ను -> ఏటిని మొ.
ఇదే విధంగా ... కుందేలు+టి+ను -> కుందేటిని.
5) పదాద్యంబగు హ్రస్వంబుమీఁది టివర్ణంబునకు ముందు పూర్ణబిందు వగు.
పదంలోని మొదటి హ్రస్వాక్షరానికి ముందు ఆదేశంగా వచ్చిన ‘టి’ వర్ణానికి ముందు నిండుసున్న నిత్యంగా వస్తుంది.
కన్ను+ను -> కంటిని
‘కన్ను+ను’ అని ఉండగా ‘న్ను’కు ‘టి’ ఆదేశంగా రాగా ‘క+టి+ను’ అయి ఈసూత్రం వల్ల ‘కంటిని’ అవుతుంది.
మిన్ను+ను -> మిటి+ను -> మింటిని
ఇల్లు+ను -> ఇటి+ను -> ఇంటిని
పల్లు+ను -> పటి+ను -> పంటిని.
6) టితివర్ణంబులు పరంబు లగునపు డుత్వంబున కిత్వంబగు.
ఆగమాలుగా వచ్చిన ‘టి, తి’ వర్ణాలకు ముందున్న ఉత్వం ఇత్వం అవుతుంది.
రెండు+టి+కు -> రెండి+టి+కు -> రెండిటికి
మూఁడు+టి+కు -> మూఁడి+టి+కు -> మూఁడిటికి
నాలుగు+టి+కు -> నాలుగి+టి+కు -> నాలుగిటికి
పగలు+టి+కు -> పగలి+టి+కు -> పగలిటికి
మొదలు+టి+కు -> మొదలి+టి+కు -> మొదలిటికి
పెక్కు+టి+కు -> పెక్కి+టి+కు -> పెక్కిటికి
నెత్తురు+టి+కు -> నెత్తు+టి+కు -> నెత్తుటికి (ఇక్కడ మాత్రం ఇత్వం రాదు).
7) టివర్ణంబు పరంబగునపుడు క్రిందు, మీఁదు, ముందు, పువర్ణంబుల కత్వంబగు.
‘టి’వర్ణం పరమైనపుడు క్రిందు, మీఁదు, ముందు శబ్దాల తుది అచ్చుకు, శబ్దాల చివర ఉన్న ‘పు’ వర్ణానికి అత్వం వస్తుంది.
క్రిందు+టి+ను -> క్రిందటిని
మీఁదు+టి+ను -> మీఁదటిని
ముందు+టి+ను -> ముందటిని
మాపు+టి+ను -> మాపటిని
అప్పుడు+టి+ను -> అప్పు+టి+ను -> అప్పటిని.
మిత్రులారా,
ఇప్పటికి నేను తెలుసుకొన్నది ఇది. మీ సందేహాలను కాని, సవరణలను కాని, మీకు తెలిసిన అదనపు విశేషాలను కాని వ్యాఖ్యగా పెడితే అందరికీ ఉపయుక్తంగా ఉంటుంది.

18, అక్టోబర్ 2011, మంగళవారం

యడాగమం - 3

యడాగమం - 3

‘యడాగమం’ ఉదాహరణలు ఒకేచోట .....
(అ)
మా + అమ్మ = మా యమ్మ
మీ + ఇల్లు = మీ యిల్లు
మా + ఊరు = మా యూరు
రావా + ఇటు = రావా యిటు
అదియే + ఇది = అదియే యిది.
(ఆ)
అమ్మ + ఇచ్చెను = అమ్మ యిచ్చెను
అక్క + ఎక్కడ = అక్క యెక్కడ.
దూత + ఇతఁడు = దూత యితఁడు
హరి + ఎక్కడ = హరి యెక్కడ
చెలువుఁడ + ఇందము = చెలువుఁడ యిందము
రామ + ఇటురా = రామ యిటురా
మిత్రమ + ఏమంటివి = మిత్రమ యేమంటివి
(ఇ)
మేన + అల్లుఁడు = మేనల్లుఁడు; మేనయల్లుఁడు.
పుట్టిన + ఇల్లు = పిట్టినిల్లు; పుట్టినయిల్లు.
చూడక + ఉండెను = చూడకుండెను; చూడకయుండెను.
(ఈ)
ఏమి + అంటివి = ఏమంటివి, ఏమి యంటివి.
మఱి + ఏమి = మఱేమి, మఱి యేమి.
అది + ఎక్కడ = అదెక్కడ, అది యెక్కడ.
అవి + ఎవరివి = అవెవరివి, అవి యెవరివి.
ఇది + ఏమిటి = ఇదేమిటి, ఇది యేమిటి.
ఇవి + అతనివి = ఇవతనివి, ఇవి యతనివి.
ఏది + ఎక్కడ = ఏదెక్కడ, ఏది యెక్కడ.
ఏవి + అవి = ఏవవి, ఏవి యవి.
(ఉ)
ఏమీ + అంటివి = ఏమీ యంటివి
(ఊ)
వచ్చిరి + అప్పుడు = వచ్చిరప్పుడు, వచ్చిరి యప్పుడు.
వచ్చితిమి + ఇప్పుడు = వచ్చితిమిప్పుడు, వచ్చితిమి యిప్పుడు.
(ఋ)
వచ్చి + ఇచ్చెను = వచ్చి యిచ్చెను
చూచి + ఏడ్చెను = చూచి యేడ్చెను.
పోయి + ఉండెను = పోయి యుండెను.
తిని + ఏమనెను = తిని యేమనెను.
(ౠ)
ఏమి + ఏమి = ఏమేమి, ఏమి యేమి
(ఎ)
ఏగి + ఏగి = ఏగి యేగి
(ఏ)
నా + అది = నాది, నా యది
నా + అవి = నావి, నా యవి

యడాగమం _ 2

యడాగమం _ 2
3) ఏమ్యాదుల యిత్తునకు సంధి వైకల్పికముగా నగు.
ఏమి, మఱి, కి(షష్ఠి), అది, అవి, ఇది, ఇవి, ఏది, ఏవి అనేవి ఏమ్యాదులు (ఏమి + ఆదులు -‘ఏమి’ మొదలైనవి). ఈ పదాల చివర ఉన్న ఇత్తుకు (హ్రస్వ ఇకారానికి) అచ్చు పరమైనపుడు సంధి వైకల్పికం (జరుగవచ్చు లేదా జరుగకపోవచ్చు).
ఉదా ...
ఏమి + అంటివి = ఏమంటివి, ఏమి యంటివి.
మఱి + ఏమి = మఱేమి, మఱి యేమి.
అది + ఎక్కడ = అదెక్కడ, అది యెక్కడ.
అవి + ఎవరివి = అవెవరివి, అవి యెవరివి.
ఇది + ఏమిటి = ఇదేమిటి, ఇది యేమిటి.
ఇవి + అతనివి = ఇవతనివి, ఇవి యతనివి.
ఏది + ఎక్కడ = ఏదెక్కడ, ఏది యెక్కడ.
ఏవి + అవి = ఏవవి, ఏవి యవి.
‘కిషష్ఠి’ అంటే షష్ఠీవిభక్తి ప్రత్యయం ‘కిన్’. ఇది ద్రుతప్రకృతికం. అంటే నకారం అంతమందు కలది. ‘హరికిన్ + ఇచ్చె’ అన్నప్పుడు సంధి జరుగకుంటే ‘హరికి నిచ్చె’ అవుతుంది. ద్రుతం (న్) లోపించినపుడు ‘హరికి + ఇచ్చె = హరి కిచ్చె’ అవుతుంది. ఇక్కడ యడాగమం రాదు.
ఇత్తునకు (హ్రస్వ ఇకారానికి) అనడంవల్ల దీర్ఘమైన ఇకారం (ఈ) కు ఇక్కడ సంధి జరుగక యడాగమమే వస్తుంది. ఉదా ... ‘ఏమీ + అంటివి = ఏమీ యంటివి’.
4) క్రియాపదములం దిత్తునకు సంధి వైకల్పికముగా నగు.
క్రియాపదాలలో ఇత్తుకు (హ్రస్వ ఇకారానికి) అచ్చు పరమైనపుడు సంధి జరుగవచ్చు లేదా జరుగక యడాగమం రావచ్చు. ఇది ప్రథమపురుష, ఉత్తమపురుష బహువచన క్రియారూపాలకే వర్తిస్తుంది.
ప్రథమపురుషకు ఉదా ...
వచ్చిరి + అప్పుడు = వచ్చిరప్పుడు, వచ్చిరి యప్పుడు.
ఉత్తమపురుషకు ఉదా ...
వచ్చితిమి + ఇప్పుడు = వచ్చితిమిప్పుడు, వచ్చితిమి యిప్పుడు.
‘మధ్యమపురుష క్రియలం దిత్తునకు సంధి యగును’ అనే సూత్రం చేత ‘ఏలితివి + అప్పుడు = ఏలితివప్పుడు; ఏలితిరి + ఇప్పుడు = ఏలితిరిప్పుడు’ అని సంధి జరుగుతుందే కాని ‘ఏలితివి యప్పుడు, ఏలితిరి యిప్పుడు’ అని యడాగమం రాదు.
5) క్త్వార్థంబైన యిత్తునకు సంధి లేదు.
భూతకాలాన్ని తెలిపే అసమాపకక్రియ క్త్వార్థం. ఒకే వ్యక్తి వెంటవెంట చేసిన రెండు పనులను ఒకే వాక్యంలో చెప్పినప్పుడు మొదటి క్రియాపదం అసమాపకంగా ఉంటుంది. ‘చూచి వచ్చెను’ అన్నప్పుడు మొదటి క్రియాపదం ‘చూచి’ అనేది అసమాపకం. ఇటువంటి క్రియాపదాల చివర ఇత్తు (హ్రస్వ ఇకారం) ఉన్నప్పుడు సంధి జరుగక యడాగమం వస్తుంది.
‘వచ్చి + ఇచ్చెను’ అన్నప్పుడు ‘వచ్చి’ అనేది క్త్వార్థం. దీని చివర ఉన్న హ్రస్వ ఇకారానికి (ఇత్తుకు) ‘ఇ’ అనే అచ్చు పరమైనపుడు సంధి జరుగక యడాగమం వచ్చి ‘వచ్చి + య్ + ఇచ్చెను = వచ్చి యిచ్చెను’ అవుతుంది.
ఇదే విధంగా క్రిందివి ...
చూచి + ఏడ్చెను = చూచి యేడ్చెను.
పోయి + ఉండెను = పోయి యుండెను.
తిని + ఏమనెను = తిని యేమనెను.
‘అచ్చున కామ్రేడితంబు పరంబగునపుడు సంధి తఱుచుగ నగు’ అనే సూత్రం వల్ల ‘ఔర + ఔర = ఔరౌర; ఆహా + ఆహా = ఆహాహా’ మొదలైన సంధులు జరిగి ‘తఱుచుగా’ అనడం వల్ల సంధి వైకల్పికంగా వచ్చి ‘ఏమి + ఏమి = ఏమేమి, ఏమి యేమి’ అవుతుంది. కాని ‘ఏగి + ఏగి’ అన్నప్పుడు ‘ఏగి’ అనేది క్త్వార్థం కాబట్టి సంధి జరుగక ‘ఏగి యేగి’ అని యడాగమం వస్తుంది.
‘అది యవి శబ్దంబుల యత్తునకు వృత్తిని లోపంబు బహుళంబుగా నగు’ అనే సూత్రం వల్ల అది, అవి శబ్దముల హ్రస్వ అకారమునకు సమాసంలో లోపం వస్తుంది. బహుళంగా అనడం వల్ల లోపించక పోవచ్చు. ‘నా + అది’ అన్నప్పుడు ‘అ’ లోపించి ‘నా + ది = నాది’ అనీ, ‘అ’ లోపించకుంటే ‘నా + అది = నా యది’ అనీ అవుతుంది. అలాగే ‘నా + అవి = నావి, నా యవి’ అనేది.
ప్రస్తుతానికి ఇంతే!
మిత్రులారా,
యడాగమానికి సంబంధించిన మీకు తెలిసిన విశేషాలను, సందేహాలను వ్యాఖ్యలుగా పెట్టండి.

17, అక్టోబర్ 2011, సోమవారం

యడాగమం -1

యడాగమం -1
‘మా + ఇల్లు’ అన్నప్పుడు సంధి జరుగడానికి అవకాశం లేదు. వ్యావహారికంలో "మా ఇల్లు ఇక్కడికి చాలా దూరం’ అంటాము. కాని గ్రాంథికంలో "మా యిల్లిక్కడకు చాల దూరము’ అంటాము. గ్రాంథికంలో ముఖ్యంగా పద్యరచనలో వాక్యం మధ్య అచ్చును ప్రయోగించడం దోషం. ‘మా + ఇల్లు = మా యిల్లు’ ఇక్కడ ‘ఇ’ అనే అచ్చు స్థానంలో ‘యి (య్ + ఇ) వచ్చింది. ఇది యడాగమం.
యట్ + ఆగమం = యడాగమం. ‘యట్’ అనేది ఆగమంగా రావడం యడాగమం. ‘యట్’లోని టకారం లోపించి ‘య’ మిగులుతుంది. ‘య’లోని అకారం ఉచ్చారణాసౌలభ్యం కోసం చేరినదే. నిజానికి అక్కడ ఆగమంగా వచ్చేది ‘య్’ మాత్రమే.
‘ఆగమం’ అంటే వర్ణాధిక్యం. ఒక వర్ణం (అక్షరం) అధికంగా వచ్చి చేరడమే ఆగమం. మనకు ఆగమ సంధులు, ఆదేశ సంధులు ఉన్నాయి. ‘మిత్రవదాగమః (మిత్రవత్ + ఆగమః), శత్రువదాదేశః (శత్రువత్ + ఆదేశః)’ అంటారు. ఆగమం మిత్రుని వంటిది. అంతకు ముందున్న అక్షరాన్ని తొలగించకుండా మిత్రుని వలె ప్రక్కన చేరుతుంది. ఉదా... పెంకు + ఇల్లు = పెంకు + టు + ఇల్లు = పెంకుటిల్లు (టుగాగమ సంధి). ఆదేశం శత్రువు వంటిది. అందుకు ముందున్న అక్షరాన్ని కాని అక్షరాలను కాని తొలగించి శత్రువులా ఆ స్థానాన్ని ఆక్రమించుకుంటుంది. ఉదా... వాఁడు + చచ్చెను = వాఁడు సచ్చెను (గసడదావేడ సంధి).
ఇప్పుడు ఎక్కడెక్కడ యడాగమం వస్తుందో చూద్దాం ....
1) సంధి లేనిచోట స్వరంబునకంటెం బరంబయిన స్వరంబునకు యడాగమం బగు.
వివరణ - సంధి జరుగని చోట అచ్చు తర్వాత ఉన్న అచ్చుకు యడాగమం అవుతుంది.
ఉదా.
మా + అమ్మ = మా యమ్మ
మీ + ఇల్లు = మీ యిల్లు
మా + ఊరు = మా యూరు
రావా + ఇటు = రావా యిటు
అదియే + ఇది = అదియే యిది.
2) అత్తునకు సంధి బహుళముగా నగు.
వివరణ - ‘అత్తు’ అంటే హ్రస్వమైన అకారం. దీనికి అచ్చు పరమైనప్పుడు సంధి బహుళముగా జరుగుతుంది. బహుళమంటే అనేకవిధాలు. వ్యాకరణంలో బహుళార్థాలు నాలుగు (క్వచిత్ ప్రవృత్తిః క్వచిదప్రవృత్తిః, క్వచిద్విభాషా క్వచిదన్యదేవ| విధేర్విధానం బహుధా సమీక్ష్య, చతుర్విధం బాహుళకం వదంతి||)
అ) ప్రవృత్తి (నిత్యం) - విధించిన వ్యాకరణకార్యం నిత్యంగా (తప్పకుండా) జరగడం.
ఉదా... రామ + అయ్య = రామయ్య; సీత + అమ్మ = సీతమ్మ.
ఆ) అప్రవృత్తి (నిషేధం) - విధించిన వ్యాకరణకార్యం జరుగకపోవడం. స్త్రీవాచక తత్సమ సంబోధనాంత పదాల అత్తునకు సంధి లేదు.
స్త్రీవాచక శబ్దాలకు ఉదా ...
అమ్మ + ఇచ్చెను = అమ్మ + య్ + ఇచ్చెను = అమ్మ యిచ్చెను
అక్క + ఎక్కడ = అక్క + య్ + ఎక్కడ = అక్క యెక్కడ.
తత్సమ శబ్దాలకు ఉదా ...
దూత + ఇతఁడు = దూత + య్ + ఇతఁడు = దూత యితఁడు
హరి + ఎక్కడ = హరి + య్ + ఎక్కడ = హరి యెక్కడ
సంబోధనాంత శబ్దాలకు ఉదా ...
చెలువుఁడ + ఇందము = చెలువుఁడ + య్ + ఇందము = చెలువుఁడ యిందము
రామ + ఇటురా = రామ + య్ + ఇటురా = రామ యిటురా
మిత్రమ + ఏమంటివి = మిత్రమ + య్ + ఏమంటివి = మిత్రమ యేమంటివి
ఇ) విభాష (వికల్పం) - విధించిన వ్యాకరణకార్యం జరుగవచ్చు, జరుగక పోవచ్చు.
ఉదా ...
మేన + అల్లుఁడు = (సంధి జరిగి) మేనల్లుఁడు;
(సంధి జరుగక యడాగమం వచ్చి) మేన + య్ + అల్లుఁడు = మేనయల్లుఁడు.
పుట్టిన + ఇల్లు = పిట్టినిల్లు; పుట్టినయిల్లు.
చూడక + ఉండెను = చూడకుండెను; చూడకయుండెను.
ఈ) అన్యకార్యప్రవృత్తి (అన్యవిధం) - మరొక విధంగా జరుగడం.
ఉదా ... ఒక + ఒక = ఒకానొక.
(మిగతా తరువాతి పాఠంలో ...)
దయచేసి ఈ పాఠంపై మీ అభిప్రాయాలను తెల్పండి.