ప్రహేళిక సమాధానం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ప్రహేళిక సమాధానం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

27, మార్చి 2014, గురువారం

ప్రహేళిక - 52 (సమాధానం)

ఎవరా ప్రభువు?
ఆ.వె.
తండ్రికొడుకు లొక్క తరుణిని రమియింప
పుత్రు లిద్ద రొంది పోరు గలుగ
నొకని జంపి రాజ్య మొకని కిచ్చిన ప్రభు
వాతఁ డిచ్చు మనకు నఖిల సిరులు.

(‘నానార్థ గాంభీర్య చమత్కారిక’ గ్రంధం నుండి.)

సమాధానం
ఆ.వె.
తండ్రి కొడుకులైన తరణి యముల చేత
కర్ణ ధర్మజులను గనెను కుంతి
సమరమందు కర్ణుఁ జంపించి ధర్మజు
నవనిపతిగఁ జేసె హరియె గాదె.

8, ఆగస్టు 2011, సోమవారం

ప్రహేళిక - 50 సమాధానం

ఇతని పేరేమిటి?
ఖాండవమ్మను పేరు గలిగినట్టిది (విపినము)
వెలుఁగు నిచ్చెడునట్టి వేల్పు (సవితృడు)
జలమందు ముదమున జన్మించు పువ్వు (వనజము)
ఉచ్చైశ్శ్రవాఖ్యమై యొప్పునది (తురగము)
స్తంభమున జనించి దనుజుని చంపినది (నృసింహుడు)
దట్టమౌ వనికి ఉన్న పదం (గహనము)
వనిలోన సీతఁ బట్టిన రాక్షసుఁడు (విరాధుడు)
శిబి దేనికొఱకు నిచ్చెఁ దన తనువును? (పావురము)
విపినము - సవితృడు - వజము - తుగము - నృసింహుడు - గనము - విరాధుడు - పావురము.
పై పదాల రెండవ అక్షరాలను వరుసగా చదివితే తెలిసే ఆ వ్యక్తి పేరు ...
పి. వి. నరసింహ రావు.
సమాధానాలు పంపిన మిత్రులు ...
గన్నవరపు నరసింహ మూర్తి
మందాకిని
కోడీహళ్ళి మురళీ మోహన్
మిస్సన్న
లక్కాకుల వెంకట రాజారావు.

అందరికీ అభినందనలు.

1, ఆగస్టు 2011, సోమవారం

ప్రహేళిక - 49 (సమాధానం)

ఈ ‘భేదం’ ఏమిటి?
తే. గీ.
క్షాంతి, మేదస్సు, జలజము, సంక్షయమ్ము,
నొంటిపాటు, మోదమ్ము, ముక్కంటి, మౌని
యనెడి చతురక్షరపదమ్ము లందులో ద్వి
తీయవర్ణంబు లే ‘వాసిఁ’ దెలియఁజేయు?

సమాధానం .....
క్షాంతి = సహనము
మేదస్సు = మస్తిష్కము
జలజము = కమలము
సంక్షయము = నాశనము
ఒంటిపాటు = ఏకాంతము
మోదము = సంతసము
ముక్కంటి = పురవైరి
మౌని = ముముక్షువు.
స‘హ’నము - మ‘స్తి’ష్కము - క‘మ’లము - నా‘శ’నము - ఏ‘కాం’తము - సం‘త’సము - పు‘ర’వైరి - ము‘ము’క్షువు.
పై పదాల రెండవ అక్షరాలను వరుసగా చదివితే తెలిసే ‘భేదం’ ...
హస్తిమశకాంతరము.
సరియైన సమాధానాలు పంపినవారు ....
వసంత కిశోర్ గారు,
కోడీహళ్ళి మురళీమోహన్ గారు,
గన్నవరపు నరసంహ మూర్తి గారు,
చంద్ర శేఖర్ గారు.
అందరికీ అభినందనలు.

31, జులై 2011, ఆదివారం

ప్రహేళిక - 48 (సమాధానం)

సీ.
రావణాసురుఁడు శ్రీరామున కేమగు? (అరాతి)
వానలు లేకున్న వచ్చు నేది? (క్షామము)
బంగారు నగలమ్ము వర్తకు నేమందు(రు)? (సరాబు)
ఐరావతాఖ్యమైనట్టి దేది? (గజము)
సంపన్నతను దెల్పఁజాలు బూడిద యేది? (విభూతి)
ప్రాణమ్ములను దీయు వస్తు వేది? (విషము)
సూక్ష్మాతిసూక్ష్మవస్తువుకు గుర్తింపేది? (అణువు)
మ్రొక్కి దేవున కిచ్చు మూట యేది?(ముడుపు)
తే. గీ.
అన్నిటికిఁ జూడ మూడేసి యక్షరమ్ము
లందు మధ్యాక్షరమ్ముల నరసి చూడ
నష్టదిగ్గజకవులలో నగు నొకండు
చెప్పువారల కిత్తుఁ బ్రశంస లెన్నొ.
రాతి - క్షాము - సరాబు - గము - విభూతి - విము - అణువు - ముడుపు.
సమాధానాల నడిమి అక్షరాలను వరుసగా చదివితే వచ్చే సమాధానం ...
రామరాజభూషణుడు.
సరియైన సమాధానాలు పంపినవారు ...
గన్నవరపు నరసింహ మూర్తి గారు,
మందాకిని గారు,
కోడీహళ్ళి మురళీ మోహన్ గారు,
వసంత కిశోర్ గారు,
చంద్రశేఖర్ గారు,
‘కమనీయం’ గారు.
అందరికీ అభినందనలు.

20, జులై 2011, బుధవారం

ప్రహేళిక - 44 (సమాధానం)

ఈ దేవి ఎవరు?
తే. గీ.
గాలికొడుకు కుమారునిఁ గూల్చినట్టి
వాని తండ్రిని మ్రింగెడివారి తలలు
నఱికినట్టివాని సుతుని నలుమొగముల
నెలకొనిన దేవిఁ గొల్తు విద్యల నొసంగ.

వివరణ -
గాలికొడుకు - భీముఁడు.
భీముని కుమారుఁడు - ఘటోత్కచుఁడు.
ఘటోత్కచుని కూల్చినవాఁడు - కర్ణుఁడు.
కర్ణుని తండ్రి - సూర్యుఁడు.
సూర్యుని మ్రింగెడివారు - రాహుకేతువులు.
రాహుకేతువుల తలలు నఱికినవాఁడు - విష్ణువు.
విష్ణువు సుతుఁడు - బ్రహ్మ.
బ్రహ్మ నలుమొగాలలో నెలకొన్న దేవి - సరస్వతి.
సమాధానాలు పంపిన
కోడీహళ్ళి మురళీమోహన్
సంపత్
గోలి హనుమచ్ఛాస్త్రి
మందాకిని
గారలకు అభినందనలు.

21, మార్చి 2011, సోమవారం

ప్రహేళిక - 43 సమాధానం.

ఈ కావ్యం పేరేమిటి?
ఏది జటాయువు సోదరునకుఁ బేరు? - సంపాతి
సాగరముఁ గలువ సాగు నేది? - సరిత్తు
మత్తుఁ గల్గించు గమ్మత్తు వస్తు వదేది? - గంజాయి
ఇల్వలు సోదరుం డెవ్వఁ డతఁడు? - వాతాపి
పాంచాలితోడ సుభద్ర వరుస యేది? - సపత్ని
నాల్గవ శత్రువు నామ మేది? - మోహము
కామధేనువునకుఁ గల వేఱు పేరేమి? - సురభి
సముదాయమునకును సంజ్ఞ యేది? - గణము
వాయుసుతుఁడు పాండవద్వితీయుఁ డెవండు? - భీముడు
సంపాతి - సరిత్తు - గంజాయి - వాతాపి - సపత్ని - మోహము - సురభి - గణము - భీముడు.
పై పదాల నడిమి అక్షరాలను చదివితే తెలిసే కావ్యం పేరు ..........
పారిజాతాపహరణము
సరియైన సమాధానాలు పంపిన వారు .......
1. చంద్రశేఖర్ గారు,
2. కోడీహళ్ళి మురళీ మోహన్ గారు,
3. మందాకిని గారు,
4. మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారు,
5. వసంత్ కిశోర్ గారు,
6. గన్నవరపు నరసింహ మూర్తి గారు.
అందరికీ అభినందనలు.

27, జనవరి 2011, గురువారం

ప్రహేళిక - 42 సమాధానం.

పేరు చెప్పండి.
సీ.
మృగలాంఛనుండుగ మింటనుండు నెవండు?
ఘనసార మను పేరు గలది యేది?
పుట్టలపైఁ జూడఁ బుట్టెడి గొడు గేది?
పాపడికై తల్లి పాడు నేది?
యవనీతనూజుఁడౌ హరివైరి యెవ్వఁడు?
పక్షులు చరియించు పథ మదేది?
రసము లూరించు భారతదేశ ఫలమేది?
యచ్చువేసెడి కార్య మనఁగ నేది?
తే.గీ.
యన్నిటికిఁ జూడ నాల్గేసి యక్షరమ్ము
లందు మొదటి యక్షరముల నరసి చూడ
కాకతీయ సామ్రాజ్యపు ఘనతఁ గన్న
ముఖ్యపట్టణమై వెల్గు పుర మదేది?
వివరణ -
మృగలాంఛనుడుగా మింట నుండు వాడు - ఏణాంకుడు.
ఘనసార మను పేరు గలది - కర్పూరము.
పుట్టలపై పుట్టెడి గొడుగు - శిలీంధ్రము.
పాపడికై తల్లి పాడునది - లాలిపాట.
అవనీతనూజుడగు హరి వైరి - నరకుడు.
పక్షులు చరియించు పథము - గగనము.
రసము లూరించు భారతదేశ ఫలము - రసాలము.
అచ్చువేసెడి కార్య మనగా - ముద్రణము.
ఏణాంకుడు - కర్పూరము - శిలీంధ్రము - లాలిపాట - నరకుడు - గగనము - రసాలము - ముద్రణము.
పై పదల మొదటి అక్షరాలను చదివితే తెలిసే కాకతీయుల రాజధాని ...
ఏకశిలానగరము.
వివరణతో సరియైన సమాధానాలు పంపిన వారు ...
గన్నవరపు నరసింహ మూర్తి గారు,
కోడీహళ్ళి మురళీ మోహన్ గారు,
మంత్రిప్రగడ బలసుబ్రహ్మణ్యం గారు.

అందరికీ అభినందనలు.

17, జనవరి 2011, సోమవారం

ప్రహేళిక - 41 సమాధానం

ఈ కూరగాయ ఏది?
తే.గీ.
వాయసము, స్వప్నము, తిమిరవైరి, వార
ణాసి, సన్యాసి యనెడి రెండక్షరముల
పదముల ప్రథమాక్షరములఁ బట్టి చూడఁ
దెలియు కూరగాయను దెల్పఁ గలరె మీరు?

వివరణ -
వాయసము - కాకి
స్వప్నము - కల
తిమిరవైరి - రవి
వారణాసి - కాశి
సన్యాసి - యతి
పై పదాల మొదటి అక్షరాలను చదివితే
సమాధానం - కాకరకాయ.
సమాధానాలు పంపినవారు -
కోడీహళ్ళి మురళీ మోహన్ గారు,
జి. మైథిలీ రాం గారు,
అందవోలు విధ్యాసాగర్ గారు,
మిస్సన్న గారు,
మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారు,
గన్నవరపు నరసింహ మూర్తి గారు,
మంద పీతాంబర్ గారు.
అందరికీ అభినందనలు.

16, జనవరి 2011, ఆదివారం

ప్రహేళిక - 40 సమాధానం

ఈ పండుగ ఏది?
తే.గీ.
సిరుల తల్లి, మండూకము, శృంగజంబు,
కామదూతి, శౌర్యము, క్రియాకారము లవి
త్ర్యక్షర పదంబు, లందు మధ్యాక్షరములఁ
జూడఁ దెలిసెడి పండుగ జాడఁ గనుఁడు.

సమాధానం -
సిరుల తల్లి - కమల
మండూకము - భేకము
శృంగజము - శరము
కామదూతి - వాసంతి
శౌర్యము - విక్రాంతి
క్రియాకారము - ప్రతిన/ప్రతిజ్ఞ
పై పదాల నడిమి అక్షరాలను చదివితే ...
ఆ పండుగ - మకర సంక్రాంతి.
సమాధానాలు పంపినవారు ....
గన్నవరపు నరసింహ మూర్తి గారు,
మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారు,
మైథిలీ రాం గారు,
కోడీహళ్ళి మురళీ మోహన్ గారు,
రహ్మానుద్దిన్ షేక్ గారు,
వసంత్ కిశోర్ గారు.
అందరికీ అభినందనలు.

8, జనవరి 2011, శనివారం

ప్రహేళిక - 35 సమాధానం

పేరు చెప్పండి
చ.
"సరసిజనేత్ర! నీ మగని చక్కని పేరది యేదొ చెప్పుమా"
"అరయఁగ నీవు న న్నడుగు నాతని పే రిదె చిత్తగింపుమా
కరియును, వారిరాశి, హరుకార్ముకమున్, శర, మద్దమున్, శుకం
బరుదుగ వ్రాయఁగా నడిమి యక్షరముల్ గణుతింపఁ బే రగున్.

(చాటుపద్య రత్నాకరము)
సమాధానం -
కరి = సారంగం
వారిరాశి = సాగరం
హరుకార్ముకము = పినాకం
శరము = సాయకం
అద్దము = ముకురం
శుకము = చిలుక
సారంగం, సాగరం, పినాకం, సాయకం, ముకురం, చిలుక
పై పదాల నడిమి అక్షరాలను చదివితే సమాధానం తెలుస్తుంది.
ఆమె మగని పేరు - రంగనాయకులు.
సరియైన సమాధానం చెప్పింది జ్యోతి గారొక్కరే.
కొంచెం అటు ఇటుగా చెప్పినవారు వసంత్ కిశోర్ గారు, గన్నవరపు నరసింహ మూర్తి గారు, నేదునూరి రాజేశ్వరి గారు.
మందాకిని గారూ మిమ్మల్ని మరిచిపోలేదండీ ...
అందరికీ అభినందనలు.

1, జనవరి 2011, శనివారం

ప్రహేళిక - 34 (సమాధానం)

అత డెవరు?
చం.
మనసిజు మామ మామ యభిమాన మడంచినవాని మామ నం
దనుని విరోధి నందనుని నందను సుందరి మేనమామఁ జం
పిన జగజెట్టి పట్టిఁ బొడిజేసిన శూరుని తండ్రిఁ గన్నుగాఁ
గొనిన సురాధినాథుని తనూభవు నాయువు మీకు నయ్యెడున్.

(చాటుపద్య రత్నాకరము)
పరిష్కారం ...............
1. మన్మథుని మామ - చంద్రుడు
2. అతని మామ - దక్షుడు
3. అతని గర్వం అణచినవాడు - శివుడు
4. అతని మామ - హిమవంతుడు
5. అతని కొడుకు - మైనాకుడు
6. అతని శత్రువు - ఇంద్రుడు
7. అతని కుమారుడు - అర్జునుడు
8. అతని పుత్రుడు - అభిమన్యుడు
9. అతని భార్య - ఉత్తర
10. ఆమె మేనమామ - కీచకుడు
11. అతనిని చంపిన వీరుడు - భీముడు
12. అతని కొడుకు - ఘటోత్కచుడు
13. అతనిని చంపిన శూరుడు - కర్ణుడు
14. అతని తండ్రి - సూర్యుడు
15. అతనిని కన్నుగా పొందిన దేవుడు - విష్ణువు
16. అతని కుమారుడు - బ్రహ్మ
ఆ బ్రహ్మదేవుని ఆయువు మీకు కలగాలని ఆశీస్సు.
సమాధానం పంపినవారు జి. మైథిలీ రాం గారొక్కరే. అదికూడా 100% సరియైన సమాధానం వారికి అభినందనలు.

31, డిసెంబర్ 2010, శుక్రవారం

ప్రహేళిక - 33 (సమాధానం)

ఆమె ఎవరు?
తే.గీ.
ఆలి నొల్లక యున్నవా నమ్మ మగని
నందులోపల నున్నవా నక్క మగని
నమ్మినాతనిఁ జెఱుచుదా నమ్మ సవతి
సిరులు మీ కిచ్చు నెప్పుడుఁ గరుణతోడ.

(చాటుపద్య రత్నాకరము)
పరిష్కారం ...............
1. భార్య వద్దనుకున్న వాడు - భీష్ముడు
2. అతని తల్లి - గంగ
3. ఆమె మగడు - సముద్రుడు
4. అతనిలోపల ఉన్నవాడు - మైనాకుడు
5. అతని అక్క - పార్వతి
6. ఆమె భర్త - శివుడు
7. అతనిని నమ్మిన వాడు - రావణుడు
8. అతని నాశనానికి కారణమైన ఆమె - సీత
9. ఆమె తల్లి - భూదేవి
10. ఆమె సవతి - లక్ష్మి
ఆ లక్ష్మీదేవి మీకు కరుణతో సిరులిస్తుందని భావం.
సమాధానం పంపినవారు కోడీహళ్ళి మురళీ మోహన్ గారొక్కరే. వారికి అభినందనలు.
వ్యాఖ్యలను "మాడరేషన్"లో పెట్టక పోవడం వల్ల మురళీ మోహన్ గారి సమాధానం వెంటనే కనిపించి మిగిలిన వారంతా ప్రయత్నం మానుకున్నట్టున్నారు. ఈ సారి ప్రహేళిక పెట్టినప్పుడు వ్యాఖ్యలను "మాడరేషన్"లో పెడతాను.

10, నవంబర్ 2010, బుధవారం

ప్రహేళిక - 29 సమాధానం

ఎవరీ మూర్ఖ విద్యార్థులు?
సీ.
గోవింద రాజులు కొలువున్న నగరేది?
మన ప్రతిరూపమ్ముఁ గనెద మెందు?
వన పుష్పముల మాలికను దాల్చు నెవ్వఁడు?
శివ వాహనము పేరి క్షేత్ర మేది?
ధరణికి నీటిని దాన మొసఁగు నేది?
యితరుల కొనరించు హిత మదేది?
వెనుకటి గాంధర విద్యాలయం బేది?
మానవుం డన వేఱు మాట యేది?
తే.గీ.
విరటు కొలువున భీముఁ డే పేరఁ జొచ్చె?
నన్నిఁటికిఁ జూడ నాల్గేసి యక్షరమ్ము
లందు క్రమముగా మూడవ యక్షరములఁ
జదువ నొక గురువును జేరి చదువఁ గోరి
నట్టి మూర్ఖ విద్యార్థుల నరయుఁ డిపుడు.
మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారి వివరణ ...
గోవింద రాజులు కొలువున్న నగరేది? - తిరుపతి
మన ప్రతిరూపమ్ముఁ గనెద మెందు? - ముకురము
వన పుష్పముల మాలికను దాల్చు నెవ్వఁడు? - వనమాలి
శివ వాహనము పేరి క్షేత్ర మేది? - మహానంది
ధరణికి నీటిని దాన మొసఁగు నేది? - అంబుదము?
ఇతరుల కొనరించు హిత మదేది? - సాహాయ్యము
వెనుకటి గాంధర విద్యాలయం బేది? - తక్షశిల
మానవుం డన వేఱు మాట యేది? - మనుష్యుడు
విరటు కొలువున భీముఁ డే పేరఁ జొచ్చె? - వలలుడు
తిరుపతి - ముకురము - వనమాలి - మహానంది - అంబుదము - సాహాయ్యము - తక్షశిల - మనుష్యుడు - వలలుడు
పై పదాల మూడవ అక్షరాలను చదివితే ...
సమాధానం - పరమానందయ్య శిష్యులు.
సమాధానాలు పంపిన వారు ...
నేదునూరి రాజేశ్వరి గారు, చంద్రశేఖర్ గారు, గన్నవరపు నరసింహ మూర్తి గారు, మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారు, మందాకిని గారు, భమిడిపాటి సూర్యలక్ష్మి గారు, మంద పీతాంబర్ గారు, కోడీహళ్ళి మురళీ మోహన్ గారు.
అందరికీ అభినందనలు.

9, నవంబర్ 2010, మంగళవారం

ప్రహేళిక - 28 సమాధానం

ఈ వాహనం ఏమిటి?
తే.గీ.
లక్ష్మి కూతురు సవతి బాలకుని తండ్రి
భక్తుని సహోదరునకు నభయ మొసంగు
వాని తమ్ముని గాచినవాని జనకు
పట్టి కగ్రజు తండ్రికి వాహనంబు.

కోడీహళ్ళి మురళీ మోహన్ గారి సమాధానం ....
లక్ష్మి కూతురు = గంగ
గంగ సవతి = గౌరి(పార్వతి)
ఆమె బాలకుడు = గణపతి లేదా కుమారస్వామి
అతని తండ్రి = శివుడు
అతని భక్తుడు = రావణుడు
అతని సహోదరుడు= విభీషణుడు
అతనికి అభయ మొసంగువాడు= రాముడు
వాని తమ్ముడు = లక్ష్మణుడు
వాని గాచినవాడు = హనుమతుడు
వాని జనకుడు= వాయువు
అతని పట్టి = భీముడు
అతనికి అగ్రజుడు= ధర్మరాజు
అతనితండ్రి= యమధర్మరాజు
అతనికివాహనంబు= దున్నపోతు.
సరియైన సమాధానం పంపిన డా. ఆచార్య ఫణీంద్ర గారికి, కోడీహళ్ళి మురళీమోహన్ గారికి అభినందనలు.

5, నవంబర్ 2010, శుక్రవారం

ప్రహేళిక - 26 సమాధానం

ఈ కలహభోజనుడిని ఏమంటారు?
సీ.
కరములతో ముష్టిఘాత యుద్ధం బేది?
రంగస్థలముపై విరాజిలు నెది?
కరినిఁ బట్టిన దేది కంజాక్షుచేఁ జచ్చె?
భాగ్యనగర మయె నే భామ పేర?
భరియించరానట్టి పద్ధతి నే మందు
రే ఋతువుతోఁ గ్రొత్త యేడు వచ్చు?
మంచి దైనట్టి సమాచార మేమంద్రు?
ముక్కన్ను లుండు నే పూజ్యునకును?
తే.గీ.
పాండవు లనుచుఁ బిలుతు రెవ్వాని వలన?
నన్నిటికిఁ జూడ నాల్గేసి యక్షరమ్ము
లట ద్వితీయాక్షరమ్ముల ననుసరింపఁ
గలహభోజనుం డగుఁ దెలుపఁ గలరె మీరు?
వివరణ -
కరములతో ముష్టిఘాత యుద్ధం - బాహాబాహి
రంగస్థలముపై విరాజిల్లేది - నాటకము
కరినిఁ బట్టి కంజాక్షుచేత చచ్చింది - మకరము
భాగ్యనగర మయింది ఈ భామ పేర - భాగమతి
భరియించరానట్టి పద్ధతి - దుర్భరము
ఏ ఋతువుతోఁ గ్రొత్త యేడు వచ్చు? - వసంతము
మంచి దైనట్టి సమాచారము - శుభవార్త
ముక్కన్నులు ఏ పూజ్యున కుంటాయి? - శివునకు
పాండవు లనుచుఁ బిలుతు రెవ్వాని వలన? - పాండురాజు
బాహాబాహి - నాటకము - మకరము - భాగమతి - దుర్భరము - వసంతము - శుభవార్త - శివునకు - పాడురాజు.
పై పదాల రండవ అక్షరాలను చదివితే ...
సమాధానం - హాటకగర్భసంభవుడు.
సరియైన సమాధానం పంపినవారు -
రవీందర్ గారు, చంద్రశేఖర్ గారు, కోడీహళ్ళి మురళీ మోహన్ గారు.
ప్రయత్నించినవారు -
భమిడిపాటి సూర్యలక్ష్మి గారు, మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారు, నేదునూరి రాజేశ్వరి గారు.
అందరికీ అభినందనలు,
దీపావళి శుభాకాంక్షలు.

4, నవంబర్ 2010, గురువారం

ప్రహేళిక - 25 సమాధానం

ఈ పదాలు ఏవి?
ఆ.వె.
కవితఁ జెప్పువాఁడు, ఘనమైన కాంతియు,
తేజ మొసఁగువాఁడు, త్రిదివంబు
ద్వ్యక్షరమ్ము లవి చివర "వి"కారంబు
గల పదంబు లేవొ తెలుపఁ గలరె?

కవిత చెప్పువాడు = కవి
ఘనమైన కాంతి = ఛవి
తేజ మొసగువాడు = రవి
త్రిదివము = దివి

సమాధానాలు పంపినవారు -
మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారు, మంద పీతాంబర్ గారు, మందాకిని గారు, నేదునూరి రాజేశ్వరి గారు.
అందరికీ అభినందనలు.

2, నవంబర్ 2010, మంగళవారం

ప్రహేళిక - 23 సమాధానం

ఇది ఏమిటి?
సీ.
ఎలుకలు నివసించు కలుగు నేమందురు?
కలిగినవాఁ డేమి కలిగియుండు?
గడచిపోయినదానికై యే పదం బున్న
దన్నార్థు లగుదు మే మున్న వేళ?
గంగాళమున కున్న ఘనమైన పేరేది?
మేలుఁ గూర్చెడి మాట మీ రెఱుఁగరె?
పెరుగుఁ జేయుట కక్కరపడు నది యేది?
వాలి ప్రాణముఁ దీయు వస్తు వేది?
తే.గీ.
కీచక ప్రాణమును దీసి గెలిచె నెవ్వఁ
డన్నిటికిఁ జూడ మూడేసి యక్షరమ్ము
లగు; ద్వితీయాక్షరముల నరసి చూడఁ
దెలుఁగుతో నొక ప్రాంగణం బలరె; నేడు
పేరు మార్పుతో జరిగెను పెద్ద గొడవ.
వివరణ -
ఎలుకలు నివసించు కలుగు నేమందురు? - బిలము
కలిగినవాఁ డేమి కలిగియుండు? - కలిమి
గడచిపోయినదానికై యే పదం బున్నది? - గతము
అన్నార్థు లగుదు మే మున్న వేళ? - ఆకలి
గంగాళమున కున్న ఘనమైన పేరేది? - కళాయి
మేలుఁ గూర్చెడి మాట మీ రెఱుఁగరె? - హితోక్తి
పెరుగుఁ జేయుట కక్కరపడు నది యేది? - క్షీరము
వాలి ప్రాణముఁ దీయు వస్తు వేది? - బాణము
కీచక ప్రాణమును దీసి గెలిచె నెవ్వఁడు? - భీముడు.
బిలము - కలిమి - గతము - ఆకలి - కళాయి - హితోక్తి - క్షీరము - బాణము - భీముడు
రెండవ అక్షరాలను చదివితే ......
సమాధానం .... లలితకళాతోరణము.
సమాధానాలు పంపినవారు -
కోడీహళ్ళి మురళీ మోహన్ గారు, మందాకిని గారు, మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారు, చంద్రశేఖర్ గారు, గన్నవరపు నరసింహ మూర్తి గారు, మంద పీతాంబర్ గారు, భమిడిపాటి సూర్యలక్ష్మి గారు, నేదునూరి రాజేశ్వరి గారు.
అందరికీ అభినందనలు.

1, నవంబర్ 2010, సోమవారం

ప్రహేళిక - 22 సమాధానం

ఎవరీ వ్యక్తి?
సీ.
ఫల్గుణుని ధ్వజముపై నుండు నేరాజు?
పోతన రాజైన ఖ్యాతి యేది?
విద్యతో పాటేది విధిగ నుండవలెను?
సరస మాడెడివాని సంజ్ఞ యేది?
స్తంభోద్భవుండైన శౌరి రూపం బేది?
అన్ని ప్రాణుల కేది యవసరమ్ము?
అలసిన డెందము లానందపడు నెట?
శాంతి చిహ్నఁపు పక్షి జాడ యేది?
తే.గీ.
నాలు గక్షరమ్ముల పద నర్తనమున
క్రమముగా ద్వితీయాక్షర గతిని గనిన
తెలుగు నామమ్ము ఢిల్లీకి తేజ మొసఁగ
ముఖ్యమంత్రి, ప్రధానియౌ ముఖ్యుఁ డెవఁడు?
వివరణ -
ఫల్గుణుని ధ్వజముపై నుండే రాజు - కపిరాజు
పోతన రాజైన ఖ్యాతి - కవిరాజు
విద్యతో పాటు విధిగ నుండవలసింది - వినయము
సరస మాడెడివాని సంజ్ఞ - సరసుడు
స్తంభోద్భవుండైన శౌరి రూపము - నృసింహుడు
అన్ని ప్రాణులకు అవసరమైనది - ఆహారము
అలసిన డెందము లానందపడు చోటు - ఆరామము
శాంతి చిహ్నఁపు పక్షి జాడ - పావురము
కపిరాజు - కవిరాజు - వినయము - సరసుడు - నృసింహుడు - ఆహారము - ఆరామము - పావురము
పై పదాల రెండవ అక్షరాలను చదివితే ....
సమాధానం - పి వి నరసింహారావు.
సమాధానాలు పంపినవారు ...
కోడీహళ్ళి మురళీ మోహన్ గారు, గన్నవరపు నరసింహ మూర్తి గారు, మైథిలీరం గారు, అనఘ గారు, మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారు, మందాకిని గారు, చంద్రశేఖర్ గారు.
అందరికీ అభినందనలు.

31, అక్టోబర్ 2010, ఆదివారం

ప్రహేళిక - 21 సమాధానం

ఈ దేవుడు ఎవరు?
ఆ.వె.
నలుమొగములవాని చెలువ యత్త కొడుకు
పగతు భార్య తండ్రి వైరి తనయు
బావ దాయఁ జంపువాని తండ్రి సుతుని
ప్రభువు మీ కొసంగు విభవములను.

సమాధానం - ఆ దేవుడు రాముడు.
వివరణ -
శ్రీ కోడీహళ్ళి మురళీ మోహన్ గారొక్కరే సరియైన వివరణతో సమాధానం చెప్పారు. వారి వ్యాఖ్యనే ఇక్కడ ప్రచురిస్తున్నాను. వారికి అభినందనలు. ధన్యవాదాలు.
నలుమొగములవాడు బ్రహ్మ
వాని చెలువ సరస్వతి
ఆమె అత్త లక్ష్మి
ఆమె కొడుకు మన్మథుడు
అతని పగతుడు శివుడు
అతనిభార్య పార్వతి.
ఆమె తండ్రి పర్వతుడు
అతని వైరి ఇంద్రుడు.
ఆతని తనయుడు అర్జునుడు.
అతని బావ కృష్ణుడు.
అతని దాయ(శత్రువు) జరాసంధుడు
అతని జంపువాడు భీముడు.
వాని తండ్రి వాయుదేవుడు.
అతని సుతుడు ఆంజనేయుడు.
అతని ప్రభువు శ్రీరామచంద్రుడు.
ప్రహేళికను పరిష్కరించే ప్రయత్నం చేసినవారు .....
మందాకిని గారు, నారాయణ గారు, మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారు, నేదునూరి రాజేశ్వరి గారు, చంద్రశేఖర్ గారు.
అందరికీ అభినందనలు.

30, అక్టోబర్ 2010, శనివారం

ప్రహేళిక - 20 సమాధానం

ఈ నగరం పేరేమిటి?
సీ.
కావ్య మంకిత మందఁగా మెచ్చు నెవ్వఁడు?
కోనేటి రాయని కొండ యేది?
నిదుర రానున్నటు లెది తెల్పు మనలకు?
ప్రహ్లాదమున కన్య పద మదేమి?
వంద పద్యములతో వరలెడి కృతి యేది?
వృషభ భుజమున కేది వేఱు పేరు?
బ్రహ్మ నాలుక పైన వసియించు నే కాంత?
నైరృతి దిగ్గజ నామ మేది?
తే.గీ.
అన్నిటికిఁ జూడ నాల్గేసి యక్షరమ్ము
లా పదమ్ముల రెండవ యక్షరముల
నుడువఁగ ననంత పద్మనాభుఁడు వెలసిన
నగరమై యొప్పుఁ జెప్పు డా నగర మేదొ.
వివరణ -
కావ్య మంకిత మందఁగా మెచ్చువాడు - కృతిపతి(భర్త)
కోనేటి రాయని కొండ -తిరుమల
నిదుర రానున్నట్లు మనలకు తెలిపేది - ఆవలింత
ప్రహ్లాదమున కన్య పదము - ఆనందము
వంద పద్యములతో వరలెడి కృతి - శతకము
వృషభ భుజమునకు వేఱు పేరు - మూపురము
బ్రహ్మ నాలుక పైన వసియించు కాంత - సరస్వతి
నైరృతి దిగ్గజ నామము - కుముదము.
కృతిపతి(భర్త) - తిరుమల - ఆవలింత - ఆనందము - శతకము - మూపురము - సరస్వతి - కుముదము
పై పదాల రెండవ అక్షరాలను చదివితే
సమాధానం - తిరువనంతపురము.
సమాధానాలు పంపినవారు
మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారు, మందాకిని గారు, మంద పీతాంబర్ గారు, టేకుమళ్ళ వెంకటప్పయ్య గారు, నారాయణ గారు, గన్నవరపు నరసింహమూర్తి గారు, నేదునూరి రాజేశ్వరి గారు, కోడీహళ్ళి మురళీమోహన్ గారు.
అందరికీ అభినందనలు.