చ. తెలుఁగుల నూత్నవత్సరమ!
తీరని కోరిక లెన్నియో మనః
స్థలమున నిండి తీర్చుకొను జాడను
గానక బిక్కుబిక్కుమం
చలఘు భవిష్య సౌఖ్యములకై నిలువెల్లను
గన్నులుంచి ది
క్కులఁ గలయంగఁ జూచెదము, కోర్కెలఁ
దీర్చవె హేవిళంబమా!
ఉ. దుర్మతులైన
ముష్కరులు దోచిన యిల్లయి నాదు మానసం
బర్మిలికై నిరంతర నయానునయమ్మునుఁ
గోరుచుండఁగా
దుర్ముఖి వచ్చి పోయినది, దుష్టమొ
శిష్టమొ భావ వీచికా
మర్మ మెఱుంగఁ జేసి చనె, మమ్మిక
బ్రోవుము హేవిళంబమా!
ఆ.వె. హేవళం బటంచు
హేవిళంబి యనుచు
హేమలంబ మనుచు హెచ్చె రగడ,
పేర్మి నొసఁగు సాలు పేరేది యైనను
మనకు హితము నొసఁగి మంచి దగుత!
సీ. ధవళకాంతులు
కటుత్వపు రుచుల్ గల్గియు
వెలయు నింబ కుసుమములను జేర్చి
వగరుగా నుండి సౌరగు సహకార శ
లాటు సత్ఖండమ్ములను గలిపియు
మధుమాధురీ రసామలమయి యొప్పగా
నిమ్ముగాఁ గొంత గుడమ్ముఁ జేర్చి
యామ్లిక స్వాదు సదామోద మొసఁగుచు
రంజిల్లు తింత్రిణీరసముఁ జేర్చి
తే.గీ. క్షార లవణాదులం
జేర్చి సరస రుచిర
షడ్రసోపేతమైన పచ్చడినిఁ జేసి
దివ్య నైవేద్య మొనరించి తిందు
మమ్మ!
హేవిళంబి వత్సరమ! మ మ్మేలుమమ్మ!
కం. గతకాలము మంచిదె,
యా
గతకాలము కూడ మంచిగా నుండుటకై
హితమును గోరుచు మధుర క
వితలను వినిపించు సుకవి పికబృంద
మిటన్.
కంది శంకరయ్య