31, మే 2011, మంగళవారం

సమస్యాపూరణం - 349 (జనసంహార మొనర్చువాని)

వారాంతపు సమస్యాపూరణం
కవి మిత్రులారా,
ఈ వారాంతానికి పూరించ వలసిన సమస్య ఇది ......
జనసంహార మొనర్చువాని పదకం
జాతమ్ములే దిక్కగున్.

సమస్యా పూరణం -348 (మూఁడుకనుల వేల్పు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
మూఁడుకనుల వేల్పు మురహరుండు.

24, మే 2011, మంగళవారం

క్షమించాలి

కవిమిత్రులకు మనవి.
ఈరోజు పోస్టులు పెట్టలేక పోతున్నందుకు మన్నించండి.
నిన్న ప్రయాణంలో ఉండి సరిగా నీళ్ళు త్రాగకపోవడం వల్ల ఉదయంనుండి కిడ్నీలోని రాయివల్ల భరిచరాని నొప్పి వస్తున్నది. మా బంధువు నన్ను డక్టరు గారి దగ్గరకు తీసుకువచ్చాడు. వోవెరాన్ ఇంజెక్షన్ ఇచ్చి అబ్జర్వేషన్‌లో ఉంచారు. మా బంధువుతో టాయిలెట్‌కని చెప్పి హాస్పిటల్ వెనుక గుమ్మంగుండా బయటకు వచ్చి ప్రక్కనే ఉన్న నెట్ సెంటర్ నుండి ఈ సందేశాన్ని పోస్ట్ చేస్తున్నాను.
ఎప్పుడు ఆరోగ్యం కుదుట పడితే అప్పుడే క్రొత్త పోస్ట్ పెడతాను, నిన్నటి పూరణలను చూసి వ్యాఖ్యానిస్తాను.
అప్పటిదాకా నన్ను క్షమించాలి.

23, మే 2011, సోమవారం

సమస్యా పూరణం -347 (బ్రహ్మచారి భార్య)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
బ్రహ్మచారి భార్య పరమ సాధ్వి
ఈ సమస్యను పంపిన కవిమిత్రునికి ధన్యవాదాలు.

చమత్కార పద్యాలు - 61 (తలలొ క్కేబదినాల్గు)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 5

సమస్య - "తలలొ క్కేబదినాల్గు కానఁబడియెన్
దద్గౌరి వక్షంబునన్"
మ.
లలితాకారుఁ గుమారు షణ్ముఖునిఁ దా లాలించి చన్నిచ్చుచో
గళలగ్నగ్రహరత్నదీప్తికళికా గాంభీర్యహేమాంచితో
జ్జ్వలరత్న ప్రతిబింబితాననములన్ శంభుండు వీక్షింపఁగాఁ
దలలొ క్కేబదినాల్గు కానఁబడియెన్ దద్గౌరి వక్షంబునన్.

(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

22, మే 2011, ఆదివారం

సమస్యాపూరణం - 346 (సన్నుతిచేయు టొప్పగును)

వారాంతపు సమస్యాపూరణం
కవి మిత్రులారా,
ఈ వారాంతానికి పూరించ వలసిన సమస్య ఇది ......
సన్నుతిచేయు టొప్పగును
సత్యవిదూరుల నిద్ధరాస్థలిన్.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునికి ధన్యవాదాలు.

సమస్యా పూరణం -345 (రాహుకాలాన వెడల)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
రాహుకాలాన వెడలఁ గార్యము సఫలము.

చమత్కార పద్యాలు - 60 (భార్య లిద్దఱు)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 4

సమస్య -
"భార్య లిద్దఱు శ్రీరామభద్రునకును"
తే. గీ.
రావణుని సంహరించియు రాజ్యమునకు
నంగనను గూడి యభిషిక్తుఁడై వెలుంగ
హార తిచ్చిరి ప్రేమతో హరుని ముద్దు
భార్య లిద్దఱు శ్రీరామభద్రునకును.

(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

21, మే 2011, శనివారం

సమస్యా పూరణం -344 (బిడ్డఁ గన్న తల్లి)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
బిడ్డఁ గన్న తల్లి గొడ్డురాలు.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునికి ధన్యవాదాలు.

చమత్కార పద్యాలు - 59 (కన్నులలోఁ జన్ను లమరెఁ)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 3
సమస్య -
"కన్నులలోఁ జన్ను లమరెఁ గాంతామణికిన్"
కం.
చిన్నవి ఝషకంబులు గొని
చెన్నలరఁగ బెస్తవారి చిన్నది రాఁగాఁ
బన్నుగ ఱొమ్మునఁ గల వల
కన్నులలోఁ జన్ను లమరెఁ గాంతామణికిన్.

(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

20, మే 2011, శుక్రవారం

సమస్యా పూరణం -343 (గొప్పవారి కుండు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
గొప్పవారి కుండుఁ గొంచె బుద్ధి.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునికి ధన్యవాదాలు.

చమత్కార పద్యాలు - 58 (గుఱ్ఱానికి నైదుకాళ్ళు)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 2

సమస్య - "గుఱ్ఱానికి నైదుకాళ్ళు కోడికి వలెనే"
కం.
మఱ్ఱాకుఁ బాన్పుగాఁ గొని
బొఱ్ఱను బ్రహ్మాండపఙ్తిఁ బూనిన ముద్దుం
గుఱ్ఱఁడ! విను, వన్నెలు గుహు
గుఱ్ఱానికి నైదు; కాళ్ళు కోడికి వలెనే.

(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

19, మే 2011, గురువారం

సమస్యా పూరణం -342 (సంపాదన లేని పతిని)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
సంపాదన లేని పతిని సతి మెచ్చుకొనెన్.

చమత్కార పద్యాలు - 57 (దృఢసత్త్వంబునఁ జీమ)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 1
సమస్య - "దృఢసత్త్వంబునఁ జీమ తుమ్మెఁ గదరా
దిగ్దంతు లల్లాడఁగన్"
మ.
సఢులీశోర్వి చలింప, నిర్జరవరుల్ శంకింప, భేరీనికా
య ఢమత్కారత నిద్రలేచి దశకంఠామర్త్యవిద్వత్పరీ
వృఢసోదర్యుఁడు లేచి రా వ్యధ యొనర్చెన్ నాసికాంతస్థ్సమై
దృఢసత్త్వంబునఁ జీమ; తుమ్మెఁ గదరా దిగ్దంతు లల్లాడఁగన్.
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

18, మే 2011, బుధవారం

చమత్కార పద్యాలు - 56 (మోచెర్ల వెంకన్న కవి)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు.
మోచెర్ల వెంకన్న నెల్లూరు జిల్లా "తెట్టు" గ్రామానికి చెందిన కవి. ఇత డొకసారి వెంకటగిరిరాజు ఒక సంస్కృతపండితుణ్ణి అవమానించిన విషయం తెలిసికొని అతణ్ణి వెంటబెట్టుకొని రాజు దగ్గరికి వెళ్ళాడు. "మీ దే ఊరు?" అని అడిగితే "మాది తెట్టు" అన్నాడు కవి. రాజు హేళనగా "తెట్టేనా?" అని నవ్వాడట. వెంకన్న కవికి చురుకెక్కి "మహారాజా! తెట్టు మహాపట్టణం కాకున్నా అంత చులకనగా చూడదగింది కాదు.
ఉ.
తెట్టు కుమారకృష్ణజగతీవరనందన! రాజ్యలక్ష్మికిం
బట్టు; ధరాంగనామణికిఁ బాపటబొట్టు; రిపూరగాళి వా
కట్టు; సముజ్జ్వలద్ధృతికి గట్టు; బుధాళికి వేల్పుఁజెట్టు; వా
గ్దిట్టల కున్కిపట్టును మదీయ నివాసము యాచభూపతీ!"

అని సమాధానం చెప్పాడు. రాజు "మీ పేరేమిటి?" అని అడిగితే కవి
కం.
"నా పేరు వెంక నందురు
భూపాలకమకుట నీలపుంజ మిళిందో
ద్దీపిత పాదాంబుజ! కరు
ణాకర! వెలుగోటి యాచ నరనాథేంద్రా!"

అని పద్యంతోనే బదులిచ్చాడు. రాజు "కవిరాజా! గంట కెన్ని పద్యాలు చెప్పగలరు?" అని అడిగితే "మహారాజా! ఊరికే పద్యాలు చెప్పడం కాదు, ఆశువుగా ఎన్నైనా సమస్యలను పూరిస్తాను. కావాలంటే పరీక్షించండి" అని సమాధాన మిచ్చాడు.
అప్పుడు జరిగిన పరీక్షలో వెంకన్న కవి పూరించిన సమస్యలు రేపటినుండి రోజు కొకటి ....
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)

సమస్యా పూరణం -341 (కలిమిఁ గలిగించు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
కలిమిఁ గలిగించు కలకంఠి కంటినీరు.

17, మే 2011, మంగళవారం

సమస్యా పూరణం -340 (వంక బెట్టఁదగును)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
వంక బెట్టఁదగును శంకరునకు.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

16, మే 2011, సోమవారం

చమత్కార పద్యాలు - 55 (నస్యము)

నస్యముపై చాటుపద్యములు
(ఎన్నో తరాలుగా మా యింట్లో నస్యం తయారుచేసి అమ్మడం కులవృత్తిగా ఉండేది. ఇప్పుడు లేదనుకోండి! అసలు మా ఊళ్ళో మమ్మల్ని "నశపోళ్ళు (నస్యం వారు) అని పిలిచేవారు. 50,60 సంవత్సరాల క్రితం మా మేనమామ "నశ్యం పాపయ్య" అంటే వరంగల్ లో అందరికీ హడల్. ఈ తరం వాళ్ళకు తెలీదు కాని పాతతరం వాళ్ళకు బాగా తెలుసు. "చాటుపద్య రత్నాకరము"లో నస్యమును గురించిన పద్యాలు దొరికాయి.)
ఉ.
నస్యము శీతమత్తగజనాశనహేతువిచారధీరపం
చాస్యము, సుస్తిరోగనిబిడాంధతమఃపటలార్కబింబసా
దృశ్యము, వేదశాస్త్రపటుదివ్యసుపండితవాగ్విచిత్రసా
రస్యము, రాజవశ్య, మహిరాణ్మణికైన నుతింప శక్యమే?

ఉ.
మట్టపొగాకులో నడుమ మందము గల్గినచోటఁ దీసి, తాఁ
బట్టుగఁ బక్వశుద్ధిగను బాగుగఁ గాచి, యొకింత సున్నమున్
బట్టను వ్రేల నొత్తి, తన బల్మికొలందిగ నల్చి, నస్యమున్
బట్టపు డబ్బిలో నునిచి ప్రాజ్ఞుల కిచ్చిన పుణ్య మబ్బదే!

సీ.
నస్యమా యిది? మరు న్నారీశిరోమణి
కుచకుట్మలము మీఁది కుంకుమంబు;
నాసికాచూర్ణమా? నలినరుడ్వనితాధ
రార్పిత తాంబూలికాసవంబు;
పొడుమటే? వెడవిల్తు పొలఁతి నెమ్మోముపైఁ
గొమరొందు కసటు కుంకుమపుఁ దావి;
ముక్కుపొడే యిది? ...... ..........
................. .............. జ్జ్వలరసంబు;
తే.గీ.
సకలజన మానసోజ్జ్వల చరమమార్గ
తత్త్వమస్యాది వాక్య ప్రధాన సార
హేతుకంబై చెలంగుచు నింపు నింపు
నస్యము గణింప శక్యమే నలువ కైన!
- అజ్ఞాత కవి.

సమస్యా పూరణం -339 (కవిని పెండ్లియాడి)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
కవిని పెండ్లియాడి కాంత వగచె.

15, మే 2011, ఆదివారం

సమస్యాపూరణం - 338 (దేశము మాకు వద్దనెడి)

వారాంతపు సమస్యాపూరణం
కవి మిత్రులారా,
ఈ వారాంతానికి పూరించ వలసిన సమస్య ఇది ......
దేశము మాకు వద్దనెడి
తెంపరులే మన జాతిరత్నముల్.

సమస్యా పూరణం -337 (విద్య యొసఁగునే)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
విద్య యొసఁగునే వినయంబు వెఱ్ఱి గాక!
ఈ సమస్యను పంపిన కవిమిత్రునికి ధన్యవాదాలు.

14, మే 2011, శనివారం

చమత్కార పద్యాలు _ 54 (సరిగమల పద్యాలు)

సరిగమల పద్యాలు
కం.
మాపని నీపని గాదా?
పాపమ మా పాపగారి పని నీ పనిగా;
నీ పని దాపని పని గద,
పాపని పని మాని దాని పని గానిమ్మా!

కం.
సరి సరిగా మా మానిని
గరిమగ మరిమరిని దాని గదమగ పదమా
సరిగాని దాని సమ మని
సరిగద్దా గసరి దాని దారిగ మారీ!

- అజ్ఞాత కవి
("చాటుపద్య రత్నాకరము" నుండి)

సమస్యా పూరణం - 336 (మీసముల దువ్వి)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
మీసముల దువ్వి వనితలే మిడిసి పడిరి.
ఈ సమస్యను పంపిన టేకుమళ్ళ వెంకటప్పయ్య గారికి ధన్యవాదాలు.

12, మే 2011, గురువారం

చమత్కార పద్యాలు - 53 (నవరస నాయకుఁడు)

నవరస నాయకుఁడు శ్రీరాముఁడు
సీ.
కడు నొప్పు జానకీకల్యాణ శుభలగ్న
కాలోత్సవంబు శృంగారరసము
పట్టాభిషేక సంభ్రమవేళ మునివృత్తిఁ
జను మన్నఁ జనుటయే శాంతరసము
తను నరమాత్రుగాఁ దలఁచు తాటక నేయ
నట్టహాసస్ఫూర్తి హాస్యరసము
పాదరేణువు సోఁకి పాషాణ మెలమితో
పొలతియై నిలుచు టద్భుతరసంబు
మాయామృగం బైన మారీచుఁ జంప బా
ణము వేయుటే భయానకరసంబు
కడఁగి వారిధిమీఁదఁ గదిసి లక్ష్మణు చేతి
విల్లందుకొను వేళ వీరరసము
తన బాణహతిఁ బడ్డ దైత్యుల వికృతాంగ
భావంబు చూడ బీభత్సరసము
రాణివాస ద్రోహి రావణాసురుఁ బట్టి
రణవీథిఁ ద్రుంచుట రౌద్రరసము
అల విభీషణుని లంకాధిపుఁ జేయుచో
రూఢికి నెక్కు కారుణ్యరసము
తే. గీ.
నవరసంబులు నీయెడ నాటుకొనియె
దశరథేశ్వరపుత్ర! సీతాకళత్ర!
తారకబ్రహ్మ! కౌసల్యతనయ! రాజ
రాజదేవేంద్ర! పట్టాభిరామచంద్ర!
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారు సేకరించిన
చాటుపద్య రత్నాకరము నుండి)

సమస్యా పూరణం - 335 (నాస్తికులకు దేవతలన్న)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
నాస్తికులకు దేవతలన్న నయము భయము.
ఈ సమస్యను సూచించిన కవిమిత్రునికి ధన్యవాదాలు.

11, మే 2011, బుధవారం

దత్తపది - 13 (లాడెన్, ఊడెన్, వీడెన్, వాడెన్)

కవిమిత్రులారా,
"లాడెన్, ఊడెన్, వీడెన్, వాడెన్"
పై పదాలను ఉపయోగించి
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ స్థితిగతులపై
మీకు నచ్చిన ఛందస్సులో పద్యం వ్రాయండి.
ఈ దత్తపదిని సూచించిన టేకుమళ్ళ వెంకటప్పయ్య గారికి ధన్యవాదాలు.

10, మే 2011, మంగళవారం

సమస్యా పూరణం - 334 (యతి మోహావేశ మెసఁగ)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
యతి మోహావేశ మెసఁగ నతివనుఁ బిలిచెన్.

9, మే 2011, సోమవారం

దత్త పది - 12 (సిరి)

కవి మిత్రులారా,
"సిరి" అనే పదాన్ని
"లక్ష్మి" అనే అర్థంలో ప్రయోగించకుండా
నాలుగు పాదాలలో వేసి
శ్రీదేవిని ప్రార్థిస్తూ మీకు నచ్చిన ఛందస్సులో
పద్యం వ్రాయండి.

8, మే 2011, ఆదివారం

సమస్యాపూరణం - 333 (తమ్ములఁ గాంచి కోపమున)

వారాంతపు సమస్యాపూరణం
కవి మిత్రులారా,
ఈ వారాంతానికి పూరించ వలసిన సమస్య ఇది ......
తమ్ములఁ గాంచి కోపమునఁ
దామరసేక్షణ తిట్టె నయ్యెడన్.

సమస్యా పూరణం - 332 (కనకదుర్గ యిచ్చు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
కనకదుర్గ యిచ్చుఁ గష్టములను.

7, మే 2011, శనివారం

సమస్యా పూరణం - 331 (ఓటుకు నోట్లిచ్చువారె)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
ఓటుకు నోట్లిచ్చువారె యుత్తమనేతల్.
ఈ సమస్యను సూచించిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.

6, మే 2011, శుక్రవారం

సమస్యా పూరణం - 330 (ఎన్నికలనఁగ రోతాయె)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
ఎన్నికలనఁగ రోతాయె నేమి కర్మ!
ఈ సమస్యను పంపిన టేకుమళ్ళ వెంకటప్పయ్య గారికి ధన్యవాదాలు.

5, మే 2011, గురువారం

సమస్యా పూరణం - 329 (వేప చెట్టున గాసెను)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
వేప చెట్టున గాసెను వెలగ పండ్లు.
ఈ సమస్యను సూచించిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.

4, మే 2011, బుధవారం

సమస్యా పూరణం - 328 (గర్భమందు బిడ్డ)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
గర్భమందు బిడ్డ గంతు లిడెను.
ఈ సమస్యను సూచించిన కవిమిత్రునికి ధన్యవాదాలు.
నిజానికి మిత్రుడు పంపిన సమస్య క్రింది కందపద్య పాదం.

గర్భంబున నున్న బిడ్డ గంతులు వేసెన్.
కాని "ర్భ" ప్రాస మిత్రులకు దుష్కర మౌతుందని భావించి దానిని ఆటవెలది పాదంగా మార్చి ఇచ్చాను.
ఉత్సాహం ఉన్నవారు పై కందపద్య పాదాన్ని స్వీకరించి పూరించవచ్చు.

3, మే 2011, మంగళవారం

సమస్యా పూరణం - 327 (రణమె మనల కిఁక)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
రణమె మనల కిఁక శరణము గాదె.

2, మే 2011, సోమవారం

సమస్యా పూరణం - 326 (నరసింహుం డాగ్రహించి)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
నరసింహుం డాగ్రహించి నరకునిఁ జంపెన్.

1, మే 2011, ఆదివారం

సమస్యాపూరణం - 325 (పిలువని పేరటమ్మునకుఁ)

వారాంతపు సమస్యాపూరణం
కవి మిత్రులారా,
ఈ వారాంతానికి పూరించ వలసిన సమస్య ఇది ......
పిలువని పేరటమ్మునకుఁ
బ్రీతిగఁ బోవుటె మేలు మిత్రమా!
ఈ సమస్యను పంపిన కవి మిత్రునికి ధన్యవాదాలు.

సమస్యా పూరణం - 324 (రామమూర్తిఁ గన)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
రామమూర్తిఁ గన విరక్తి గలిగె.
ఈ సమస్యను సూచించిన కవి మిత్రునికి ధన్యవాదాలు.