4, జులై 2026, శనివారం

సమస్య - 5518

5-7-2026 (ఆదివారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పద్యమల్లఁడు సత్కవిత్వమ్ముఁ జెప్పు”
(లేదా...)
“పద్యంబల్లుట రానివాఁడె సుకవిత్వంబల్లు మెచ్చన్ జనుల్”

4 కామెంట్‌లు:

  1. తేటగీతి
    వ్యాకరణశుద్ధి మెరిసెడు పాటవమ్ము
    దైవకృప వల్ల నమరిన దక్షుఁడతడు
    ప్రీతిఁ గూర్చెడు వాడనఁ, బేలవముగఁ
    బద్యమల్లఁడు సత్కవిత్వమ్ముఁ జెప్పు

    శార్దూలవిక్రీడితము
    ఖాద్యమ్మన్నది సాత్వికమ్మనఁగఁ దాఁ గన్పించి శాంతమ్ముగన్
    విద్యన్నేరిచి భావజాలములతో వేనోళ్లు కీర్తింపఁగన్
    హృద్యమ్మై కవిపండితుల్ మిగుల మన్నింపంగ నిస్సారమౌ
    పద్యంబల్లుట రానివాఁడె సుకవిత్వంబల్లు మెచ్చన్ జనుల్

    రిప్లయితొలగించండి
  2. ఛందమును నేర్వ కుండిన చందమందు
    గాన రూపము నొందిన కణినొసగెడు
    పద్యముల రుచి మరగిన బాలుడొకడు
    పద్యమల్లఁడు సత్కవిత్వమ్ముఁ జెప్పు

    రిప్లయితొలగించండి

  3. అన్నమయ్య సంకీర్తన లద్భుతమ్ము
    లంచు పొగుడుచుందురు గదా యవని జనులు
    కాంచ జనవంద్యు డైన యా కవిని చూడ
    పద్యమల్లఁడు సత్కవిత్వమ్ముఁ జెప్పు.


    గద్యం బైనను వ్రాయలేని కడు మూర్ఖాగ్రేసరుం డాతడే
    విద్యా హీనుడు భీరుకమ్ము జనుచున్ వేటాడు సారంగుడే
    హృద్యంబౌ రఘురామ గాథ నతడే యీజాతి కిచ్చెన్ గనన్
    పద్యంబల్లుట రానివాఁడె, సుకవిత్వంబల్లు మెచ్చన్ జనుల్.

    రిప్లయితొలగించండి
  4. పద్య మందున చక్కని భావమలర
    హృద్యమందురు గాదె సహృదయులెపుడు
    హృద్య రచనా విభుడు రసహీనమైన
    పద్యమల్లఁడు సత్కవిత్వమ్ముఁ జెప్పు

    పద్యంబల్లుట నేర్చువాడు కవియౌ భావంబు శోభిల్లగా
    పద్యాలే కమనీయమౌను సతమున్ బాండిత్య సంపత్తినా
    విద్యాదేవి యొసంగ సత్కవివి నీవే దోషభూయిష్ఠమౌ
    పద్యంబల్లుట రానివాఁడె సుకవిత్వంబల్లు మెచ్చన్ జనుల్

    రిప్లయితొలగించండి