5, సెప్టెంబర్ 2026, శనివారం

సమస్య - 5581

6-9-2026 (ఆదివారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“మూగవాని భాష ముదముఁ గొలుపు”

(లేదా...)

“మూగవాని భాష విన్న మోదమెంతొ గల్గుఁగా”

(పట్వర్ధన్ గారి శతావధానంలో పాము భాస్కర్ గారి సమస్య)

14 కామెంట్‌లు:

Sitharamayya Solasa చెప్పారు...

మౌనబతము నాది , మాటలాడననుచు
జేతులూపి సయిగ జేయుచుండి
కోరికలను దీర్చుకొనుట కొరకయి యా
మూగవాని భాష ముదముఁ గొలుపు

Sitharamayya Solasa చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

ఆటవెలది
రెండుపదులవయసు నిండి భరతశర్మ
తనరగన్ శతావధానమొక్క
దినమున ముగియించు దృష్టినిన్ బృచ్ఛకుల్
మూగ, వాని భాష ముదముఁ గొలుపు!

సుగంధి
వేగ పద్యగంధమొల్కు విద్యనొంద శర్మయే
యూగకే శతావధానమొక్కనాడె జేయఁగన్
సాగిరాగ కాకినాడ సంతసాన పృచ్ఛకుల్
మూగ, వాని భాష విన్న మోదమెంతొ గల్గుఁగా!

M.B.G.TILAK చెప్పారు...

మూగ పెదవిపైన మ్రోగేటి వేణువే
పల్కుచుండును మది పరవశింప
స్వాదుశబ్దగీతి సౌఖ్యంబునొసగగా
మూగవాని భాష ముదముఁ గొలుపు

మూగవాడు విన్యసింప మోవి పైన వేణువే
రాగయుక్త మైన పాట రమ్యరీతి సాగగా
మూగవాని భాష విన్న మోదమెంతొ గల్గుఁగా
త్యాగరాజు జ్ఞప్తికొచ్చి ధన్యమౌను జన్మమే

విరించి చెప్పారు...


చట్ట సభల యందు శాసన సభ్యుల
పలుకులు విని నంత పరమ రోత
వాటి కన్న గాదె వసుధను జూడగా
మూగవాని భాష ముదముఁ గొలుపు.


సాగరంపు తీర మందు సాగునే వధాన మం
చేగిరంట పండితాళి యింపటంచు దల్చుచున్
వేగి రమ్ము నందు జేరి విజ్ఞు లెల్ల రచ్చటన్
మూగ, వాని భాష విన్న మోదమెంతొ గల్గుఁగా.


ఏ గతిన్ బుధాళి వచ్చు నింత దూర మంచు వా
డాగమంచు చెప్పనేమి యాగ నంచు చెప్పుచున్
వేగిరమ్ము గాను వచ్చి ప్రేక్షకాళి భూరిగా
మూగ, వాని భాష విన్న మోదమెంతొ గల్గుఁగా.

Zilebi చెప్పారు...

-
కాము కవివరులము గనమలంకారపు
పదములు ప్రభు! యీ సభకు నమనము
లిడుచు హృదయమును తెరిచి వ్రాసినట్టి యా
మూగవాని భాష ముదముఁ గొలుపు


Zilebi చెప్పారు...

~-

వేగ మెంతొ కలిగె వాడి వేడుకైన జాడగా
రాగ తాళ భావ మెల్ల రంజరిల్లె నీటుగా
బాగు బాగు భావమెల్ల పద్యమంత నీటుగా
మూగవాని భాష విన్న మోదమెంతొ గల్గుగా

అజ్ఞాత చెప్పారు...

తీగ లాంటి కన్నె పిల్ల దేవళంబునందునన్
రాగమూని పాడు చుండ రక్తి గొల్పు పాటలన్
బాగు యంచు మూగ చేయు వాద్య మందు శబ్ధముల్
మూగ వాని భాష ,విన్న మోదమెంతొ గల్గుగా

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

వేగవేగ మాటలాడ వెసను జెంది పాఁపడే
యూగి తూగి కరములూపి యుంగయనెడు బల్కులన్
సాగు వాని మూగ భాష, సంతతమ్ము తల్లికిన్
మూగవాని భాష విన్న మోదమెంతొ గల్గుఁగా

Dhanikonda Ravi Prasad చెప్పారు...

ఆ.వె:మూగ వాడు చేయ సైగల నది కాంచి
పెక్కు జనులు జేయ నెక్కిరింత
కన్న తల్లి నవ్వ గలుగునే?ఆమె కా
మూగవాని భాష ముదముఁ గొలుపు.


కరణం రాజే శ్వర రావు చెప్పారు...

మాట రాదు కాని మంచి విద్యను నేర్చి
కవిత వ్రాయ గలడు కమ్మ గాను
రచన గాంచి నట్టి రసికులు పలికి రా
మూగ వాని భాష ముదము గొలుపు

Dhanikonda Ravi Prasad చెప్పారు...

సుగంధి
ఈ గతిన్ వినంగ నేడు కృష్ణశాస్త్రి గీతముల్
రాగరంజితస్వరాన భ్రాత! నీవె పాడగా
మూగ నైతి మాట లేని మోద మంది దివ్యమౌ
మూగవాని భాష విన్న మోదమెంతొ గల్గుఁగా!”
(కృషణశాస్త్రి గారు స్వరపేటిక పోయి మూగ అయ్యారు.ఆయన పాటలను ఎవరో పాడి వినిపిస్తే విన్న వారి స్పందన. విన్న వ్యక్తి కూడా సంతోషం తో మాటలు లేని మూగ అయ్యాడు.)


రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

ఆ॥ సంజ్ఞలెన్నొ నేర్చి సౌమ్య రీతిఁ గనుచు
వర్తమానమెల్ల భావయుక్త
మెగియఁ దెలిపినంత నెవరు పలుకరొకొ
మూగవాని భాష ముదముఁ గొలుపు

సుగంధి
మూగవాఁడు నైన నేమి బుద్ధిఁ గాంచి సంజ్ఞలన్
బాగుగాను నేర్చి తాను భవ్యరీతిఁ దాల్చుచున్
సాగి వర్తమానమెల్ల సౌమ్యమొప్పఁ దెల్పఁగన్
మూగవాని భాష విన్న మోదమెంతొ గల్గుఁగా

(సంజ్ఞాభాష అండి)

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

మాట రాక యున్న లోటేమి యుండును
సైగ లెల్లఁ జేయ బాగు గాను
గేళ్లు కదుపుచుండి కేళి లీల నరయ
మూఁగవాని భాష ముదముఁ గొలుపు


బా గనంగఁ జాల దతని భాష రమ్యతరమె యే
రోగ మెఱుఁగఁ డెన్నఁ డతఁడు గ్రుక్క త్రిప్పకుండకే
యాఁగకుండ మాట లాడ, నాలకింప నెందఱో
మూఁగ వాని భాష విన్న, మోద మెంతొ గల్గుఁగా