9, అక్టోబర్ 2026, శుక్రవారం

సమస్య - 5615

10-10-2026 (శనివారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“తెలుఁగు తల్లి వృద్ధాశ్రమాధీన యయ్యె”

(లేదా...)

“తెలుఁగునుఁ దల్లిగాఁ దలఁచి దించిరి వృద్ధుల యాశ్రమంబునన్”

(న.చ. సాహిత్ శతావధానంలో వేదాల గాయత్రి గారి సమస్య)

9 కామెంట్‌లు:

  1. అన్య భాషపై మక్కువ యధికమవగ
    నేటి యువత గౌరవమని నిబ్బరించ
    తెలుఁగు తల్లి వృద్ధాశ్రమాధీన యయ్యె
    మూల నున్న ముసలిదగు ముందు ముందు

    రిప్లయితొలగించండి
  2. తేటగీతి
    ఆంగ్ల భాషా విలాసాల నలరు చుండి
    కన్న భాషను మరువగ కర్కశులుగ
    మాతృ వందన మెరుగని మనుజు లనగ
    తెలుఁగు తల్లి వృద్ధాశ్రమాధీన యయ్యె!

    చంపకమాల
    అలరుచు నాంగ్లమందున నపారపు మోహము పెంచుకొంచునున్
    గలకలలాడు మాతృమణి కమ్మని పల్కుల నెల్ల వీడుచున్
    విలసిత సంస్కృతిన్ మరచి వింతగ నిప్పటి నాగరికులున్
    దెలుఁగునుఁ దల్లిగాఁ దలఁచి దించిరి వృద్ధుల యాశ్రమంబునన్!

    రిప్లయితొలగించండి
  3. (గొప్ప భాషకు జన్మనిచ్చిన తెలుగు తల్లి బొమ్మను ఒక వృద్ధాశ్రమంలో గోడపై దించినారని ( గీసినారని) భావము)

    చంపకమాలిక.

    వెలసెను వేదమై ధరణి వేంకట నాథుని జన్మభూమిలో
    నిలిచెను లెస్సగా భరత నేలన బుట్టిన గొప్పభాషలం
    దలరెను మాధురీఝరులధారగతేనెలనొల్కువాణియై
    చిలికినపాలమీగడల చిక్కని భాషకు మాతయైననా
    తెలుగును దల్లి గా దలచి దించిరి వృద్ధుల యాశ్రమంబునన్;

    రిప్లయితొలగించండి

  4. ఎందరో యువ యవధాను లింపు గాను
    పాటవమ్మును జూపగా పరవ శించి
    దిగ్దిశాంతము లందున తెలుగు వెలిగె
    తెలుఁగు తల్లి వృద్ధాశ్రమాధీన యయ్యె?


    తెలుగుకు పూర్వ వైభవము తెచ్చుట కోసము కోడె కారులే
    పలువురు దీక్ష బూని యిట భాసిలమానము చేయు చుండిరే
    తెలుఁగునుఁ దల్లిగాఁ దలఁచి, దించిరి వృద్ధుల యాశ్రమంబునన్
    తెలుగు ననంగ కల్లయది తీవ్ర నిరాశను వీడు మందునే.

    రిప్లయితొలగించండి
  5. సాటిలేనిభాష యనగ స్పష్టమయ్యె
    తేనె లొలుకును తెలుగని తెల్లమయ్యె
    తెలుగునాట నేడిట కడు దీనయయ్యె
    తెలుఁగు తల్లి వృద్ధాశ్రమా ధీన యయ్యె

    కలియుగమందు చూడనగు కర్కశులై మరి కన్న బిడ్డలే
    పలువురు సాగనంపిరిటఁ బాపమునెంచక తల్లిదండ్రులన్
    వెలసిన వృద్ధశాలలకు వేదన లేక మరెందరెందరో
    తెలుఁగునుఁ దల్లిగాఁ దలఁచి దించిరి వృద్ధుల యాశ్రమంబునన్

    రిప్లయితొలగించండి
  6. తే.గీ; తెలుగు పిల్లలు పలుకరు తెలుగు నిపుడు
    వారి తో నాంగ్లమే తల్లి వాగుచుండు
    ముది కవుల మమ్ము తెల్గింక వదల కుండె
    తెలుఁగు తల్లి వృద్ధాశ్రమాధీన యయ్యె”
    (పిల్లలకు తెలుగు అక్కర లేదు. ముసలి కవుల మైన మమ్మల్ని మాత్రం తెలుగు పట్టుకు వేలాడుతోంది. ఇలా తెలుగు వృద్ధాశ్రమాధీన అయ్యింది. )






    రిప్లయితొలగించండి
  7. చం:తెలుగుకు సేవ జేతుమని, తెల్గు కవిత్వము నుద్ధరింపగా
    పలు సభలన్ వచించు నొక పండితవంశపు పుత్రు లక్కటా!
    తలచరు తల్లి ప్రేమను, వృథా కవనమ్ముల జెప్పి భాష యౌ
    తెలుఁగునుఁ దల్లిగాఁ దలఁచి దించిరి వృద్ధుల యాశ్రమంబునన్”
    (వీళ్లు భాషని తల్లిగా భావించి, కవిత్వాలు రాసి కన్న తల్లిని మాత్రం ఆశ్రమం లో దింపారు. )





    రిప్లయితొలగించండి
  8. తే॥ తలఁచి సంతు వృద్ధిఁ గనఁగఁ తప్పదనుచు
    నాంగ్ల మాధ్యమముఁ దొలుత నట్లు పిదప
    మాతృ భాష యెటుల వచ్చు మరి వగచఁగఁ
    దెలుగు తల్లి వృద్ధాశ్రమాధీన యయ్యె

    (ఈ బాధ తెలుగు నాట తక్కువే నండి. హైదరాబాద్ సంగతి తెలియదు కాని బెంగుళూరు లో పిల్లలకు ఆంగ్లమే వ్యావహారికం)

    చం॥ వలచిన మాతృభాషనటు భవ్యమటంచును మిక్కటమ్ముఁగన్
    బలుకుల యందు నుంచినను బాటవ మొప్పగ శాస్త్ర శోధనల్
    తలఁచఁగ నాంగ్ల భాషయును దప్పునె పాడియె దెప్ప నిట్టులన్
    తెలుఁగునుఁ దల్లిగాఁ దలఁచి దించిరి వృద్ధుల యాశ్రమందునన్

    ( నాకు ఈ భాషను గురించిన సెంటిమెంటు కూడ నచ్చదు. శాస్త్ర విజ్ఞానమునకు ప్రాంత భేదము లేదండి. మొన్న ఫిజిక్స్ నోబెల్ గ్రహీత ఫ్రాన్సిస్ హాల్జెన్ బెల్జియం నుండి అమెరికాకు వెళ్ళి పరిశోధన చేసారు)

    రిప్లయితొలగించండి