19, ఆగస్టు 2026, బుధవారం

సమస్య - 5564

20-8-2026 (గురువారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“శవమా నా మనవిని విని సౌఖ్యం బిడుమా”

(లేదా...)

“శవమా విన్నపమాలకించి దయతో సౌఖ్యంబుఁ గూర్పంగదే”

(ఉప్పలధడియం భరతశర్మ శతావధానంలో దొనపూడి శ్రీనివాస్ గారి సమస్య)

23 కామెంట్‌లు:

  1. కందం
    భవుఁడు శిరంబున గంగను
    భువికిన్ వర్షింపడేలొ? భుక్తికెటుల? కా
    వవె! పాదజము విడిచి కే
    శవ! మా మనవిని విని సౌఖ్యంబిడుమా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మత్తేభవిక్రీడితము
      భవుడున్ జూటము జార్చి గంగనిడడే పాపాత్ములంచెంచెనో!
      భువిపై క్షామము సుట్టె జీవులకహో! భుక్తిన్ ప్రసాదించి కా
      వవె! నీపద పంకజంపు జలమే ప్రాణాల దక్కించుఁ!గే
      శవ మా విన్నపమాలకించి దయతో సౌఖ్యంబుఁ గూర్పంగదే!

      తొలగించండి
  2. అవిరళ సేవను జేసిన
    భవ! భక్తుల మమ్ము బ్రోవు పాపములున్నన్
    తవ చరణదాసులము కే
    శవ మామనవినివిని సౌఖ్యంబిడుమా!

    రిప్లయితొలగించండి
  3. పవమానాత్మజుఁ డెన్నిమారు లనిలోఁ బాపాత్ముఁ జీల్చన్ బున
    ర్భవుఁడై నిల్చుచునుండ హరి తోడ్పాటిచ్చుటం జంప వా
    స్తవముం గాంచి జనాళి పల్కిరి జరాసంధా! భువిం గూలు నో
    శవమా! విన్నపమాలకించి దయతో సౌఖ్యంబుఁ గూర్పంగదే!

    రిప్లయితొలగించండి
  4. జవముగ ముసలి తనంబున
    వివిధరకంబు లయినట్టి వేదన లొందన్
    సవరించ మరల మను శై
    శవమా ! నా మనవిని విని సౌఖ్యం బిడుమా

    రిప్లయితొలగించండి

  5. కవలలము మేమిచ్చట
    స్తవనీయుడ వంచు నిన్ను ధ్యానించెదమే
    కువలేశయుoడ వగు కే
    శవ! మా, నా, మనవిని విని సౌఖ్యం బిడుమా.


    భవ బoధమ్ములశాశ్వతమ్ములని కైవల్యమ్ము నే గోరు చున్‌
    స్తవనీయమ్మగు నీదు నామమునె నే ధ్యానించెదన్ నిత్యమున్
    కవనమ్మందు, దయామయుoడవగుచున్ గా రుణ్యమున్ జూపి కే
    శవ! మా! విన్నపమాలకించి దయతో సౌఖ్యంబుఁ గూర్పంగదే.

    రిప్లయితొలగించండి
  6. అవలోకించుము స్వామీ
    నవవిధ రీతుల కొలిచెదనయముగ నిన్నే
    స్తవమును చేసెదనో కే
    శవ!మా నామనవిని విని సౌఖ్యంబిడుమా

    రిప్లయితొలగించండి
  7. 1.
    భవబంధంబులఁ ద్రుంచి శాంతిసుఖముల్ భాసిల్లఁ జేయంగదే
    శివభక్తిన్ గొని పూజసేయ మదిలో శ్రీనాథుఁ డానందమై
    శివుఁ డాత్మేశ్వరుఁ డంచుఁ గొల్చి నిజమై శ్రేయంబు నందించుచున్
    శవమా విన్నపమాలకించి దయతో సౌఖ్యంబుఁ గూర్పంగదే


    2.
    భవరోగంబుల బాపి సర్వజనులన్ భద్రంబుగాఁ గాచుమా
    తవ సేవాఫలమే సదా సుఖదమై దాసుల్ సుఖింపంగదే
    అవనిన్ బ్రోచెడి తల్లి నీదు కరుణన్ హర్షంబు నింపంగదే
    శవమా విన్నపమాలకించి దయతో సౌఖ్యంబుఁ గూర్పంగదే

    రిప్లయితొలగించండి
  8. 3.
    అవనిన్ బుట్టితి కర్మబంధనముచే నాపన్నుఁడన్ దేవ నీ
    భవదీయంబగు పాదపద్మయుగమున్ భక్తిన్ భజింతున్ సదా
    ధవళాక్షా! నిను నమ్మినాఁడ కరుణాధారన్ గృపన్ జూడు కే
    శవ! మా విన్నపమాలకించి దయతో సౌఖ్యంబుఁ గూర్పంగదే

    రిప్లయితొలగించండి
  9. మ॥ నవకమ్మొంది భవాబ్ధి దాటఁగను సన్మానించి సన్మార్గమున్
    జవితోఁ దాల్చుచు నిత్యకర్మములటుల్ సారించి కావించుచున్
    భవదీయాశ్రితులై చరించ ధరలోఁ బ్రార్థించి వర్తిల్ల కే
    శవ, మా విన్నపమాలకించి దయతో సౌఖ్యంబుఁ గూర్పంగదే

    రిప్లయితొలగించండి
  10. కం:పువులన్ బెట్టుక వచ్చిన
    నవవథువును నన్ను జూడు నా మగడా!లే!
    ఇవిగో పా లో జీవ
    చ్ఛవమా నా మనవిని విని సౌఖ్యం బిడుమా”
    (భర్త నిద్ర పోతుంటే నవ వధువు పడిన బాధ.)


    రిప్లయితొలగించండి
  11. కవగొన వెనుకాడ వలదు
    నవలామణి నీకు నచ్చిన దశ యనినచో
    భువిపై యౌవనమా శై
    శవమా నా మనవిని విని సౌఖ్యం బిడుమా

    భువిపైజన్మము నొంది దుఃఖితులమై పోరాటమున్ సల్పుచున్
    భవబంధమ్ముల చిక్కుకొంటిమిలలోఁ బద్మాక్ష వీక్షింపుమా
    లవలేశంబగు జాగులేక దయతో రక్షింపుమా చెన్నకే
    శవ! మా విన్నపమాలకించి దయతో సౌఖ్యంబుఁ గూర్పంగదే

    రిప్లయితొలగించండి
  12. మ:శవమున్ దాల్చిన విక్రమార్కునకు నిశ్శబ్దమ్ము భంగమ్ము గా
    నెవియో ప్రశ్నల నిట్లు బల్కె "విసుగిం తే లేదె భేతాళ? యా
    పవె నీ తెల్విని! వీని పాల బడి నన్ బాధించ నో రెత్తు నో
    శవమా! విన్నపమాలకించి దయతో సౌఖ్యంబుఁ గూర్పంగదే”

    (పట్టు వదలని విక్రమార్కుడి నిశ్శబ్దాన్మి శవం లో ఉన్న భేతాళుడు మాటి మాటికి భంగం చేస్తూ ఉంటాడు. చివరి విక్రమార్కుడు భేతాళుణ్ని, అతను ఆవహించిన శవాన్ని కూడా తనను మాట్లాడించ వద్దని ఉపాయం తో బతిమిలాడాడు.పూర్వం చందమామ కథలు గుర్తున్నాయా?)

    రిప్లయితొలగించండి
  13. కొందరి పూరణలను వాట్సాప్ లో సమీక్షించినందున ఇక్కడ వ్యాఖ్యానించలేదు.

    రిప్లయితొలగించండి