9, ఆగస్టు 2026, ఆదివారం

సమస్య - 5554

10-8-2026 (సోమవారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“కాకినాడలోఁ దక్కువ కవుల సంఖ్య”

(లేదా...)

“కవులు తక్కువ కాకు లెక్కువ కాకినాడ పురమ్మునన్”

(ఉప్పలధడియం భరతశర్మ శతావధానంలో కవిశ్రీ సత్తిబాబు గారి సమస్య)

12 కామెంట్‌లు:

  1. తేటగీతి
    సాహితీ పిపాసగలుగ సత్కవనము
    మెచ్చువారలే కలుగంగ మిక్కుటముగ
    పరవశింప వత్తురే! రాని వారనంగ
    కాకినాడలోఁ దక్కువ కవుల సంఖ్య

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తరళము
      హవము రీతిగ మానసంబున నంచనాలను గల్గుచున్
      గవనమన్నది కమ్మదంచును గాంచు వారవధానముల్
      బవలురేయని యెంచకుండగ పాలుఁగొందురు, రారనన్
      కవులు తక్కువ! కాకు లెక్కువ కాకినాడ పురమ్మునన్

      తొలగించండి
  2. తరళము:
    కవనమందున కాంక్ష జూపుచు కాకినాడ పురమ్మునన్
    పవలు రేయని భేదమెంచక పాలుగొంద్రు కవీశ్వరుల్
    యెవరు చెప్పగ వింటిరో తమరిట్టులంటిరి వింతగన్
    కవులు తక్కువ కాకు లెక్కువ కాకినాడ పురమ్మునన్

    రిప్లయితొలగించండి
  3. తేటగీతి:
    కవివరేణ్యుల నిలయమీ కాకినాడ
    కావ్య గోష్ఠులు జరిగెడు భవ్య పురము
    యెవరు చెప్పితి రీసుతో నిట్టులనుచు
    కాకినాడలోఁ దక్కువ కవుల సంఖ్య

    రిప్లయితొలగించండి
  4. లేచినది మొదలు ధనము లెక్క కట్టి ,
    నాటి వర్తకమున లాభనష్ట మరసి ,
    నిదురలోన నాలెక్కలె నెరపుచుండ ,
    కాకినాడలోఁ దక్కువ కవుల సంఖ్య

    రిప్లయితొలగించండి
  5. మేటి కవులున్న పురము గా మేటి యగుచు
    పేరు ప్ర ఖ్యా తు లను బొంది వినుతి కెక్కె
    కాకినాడ లో దక్కువ కవుల సంఖ్య
    యనుట నంగీ క రింప రీ యవని జనులు

    రిప్లయితొలగించండి

  6. సకల శాస్త్రాల నెరిగిన జనుల కాల
    వాలమంచును పొగిడెడి నేల యిదియె
    పద్యముల్ వ్రాయు పటిమున్న వారు గాంచ
    కాకినాడలోఁ దక్కువ? కవుల సంఖ్య.


    భువిని సంపద కూడ బెట్టగ బూతు కైతలు వ్రాయుచున్
    బవలు రేయిల భేద మెంచక పాప కార్యము లెన్నియో
    నవని చేసెడి దుష్టశీలురు నాకతాయిలునైన కా
    కవులు తక్కువ, కాకు లెక్కువ కాకినాడ పురమ్మునన్.

    రిప్లయితొలగించండి
  7. కావ్య సృష్టికి నెలవట కాకినాడ
    ఘన చరిత్రులు సత్కవుల్ గాని వారు
    కాకినాడలోఁ దక్కువ; కవుల సంఖ్య
    నే గణింప పుష్కలమిట నిశ్చయమ్ము

    కవనమన్న కృశించె మన్నన కాలమెంతగ మారెనో
    దవము దాపున కొండచాటున తారసిల్లిన పల్లెలో
    కవులు తక్కువ కాకు లెక్కువ; కాకినాడ పురమ్మునన్
    గవులు విజ్ఞులు ధన్యజీవులు కార్యశూరులు పెక్కురే

    రిప్లయితొలగించండి
  8. కవన సేద్యము నందు నెందరొ కాకినాడ పురమ్ములో
    పవలు రేయి వెలుంగు చుండగ భాను డట్టుల మిక్కిలిన్
    చవి యెరుంగని వార లందురు చాటుమాటుగ నిట్టులన్
    కవులు తక్కువ కాకు లెక్కువ కాకి నాడ పురమ్ములో

    రిప్లయితొలగించండి
  9. తే.గీ:రాణ్మహేంద్రవరమ్మున రాజిలంగ
    నన్నయయాది మహాకవుల్ నాడు, కనగ
    తూర్పు గోదావరిని లక్ష్మి తో వెలుంగు
    కాకినాడలోఁ దక్కువ కవుల సంఖ్య”
    ( రాజమండ్రి,కాకినాడ రెండూ తూర్పు గోదావరి జిల్లా యే కానీ పూర్వం కవులు రాజమండ్రి లో ఎక్కువ.కాకినాడ లో తక్కువ అనేది నా బోటి ఒకడు చేసిన పరిశీలన. )

    రిప్లయితొలగించండి
  10. తే॥ గరికపాటి వారుఁ దెలుప కాకినాడ
    వాసులేగాద ప్రతిభకు వాసిఁ గాంచి
    వెలుఁగు చుండు నగరమిది తలఁపకెపుడు
    కాకినాడలోఁ దక్కువ కవుల సంఖ్య

    తరళము
    ఎవరు చెప్పిరి తప్పులెంచుచు నేలఁ దెల్పిరొ యిట్టులన్
    గవులు తక్కువ కాకులెక్కువ కాకినాడ పురమ్మునన్
    గవుల మేలిమి నారసింహుఁడు కాకినాడకు చెందడే
    చవిగ విద్యలు కాకినాడయె స్థావరమ్ముగ భాసిలెన్

    (నాకు తెలిసినంతవరకు శ్రీ గరికపాటి వారు కాకినాడ వారండి

    రిప్లయితొలగించండి
  11. ధ్రువకోకిల
    చవుల గూర్చెడు పద్యరాశిని జాలినంతగ వ్రాసి మా
    కివియె చా లవధాన భార మదేల యంచు దలంచు నా
    కవులు తక్కువ, కాకు లెక్కువ కాకినాడ పురమ్మునన్
    చవట వ్యాఖ్యల జేయు టుండక, సద్విమర్శలు వెల్గెడిన్.
    (కవు లందరూ అవధానాలు చెయ్యరు కానీ కాకినాడ లో ఆ తలనొప్పి మా కెందుకు? అనుకొనే కవులు తక్కువ. కాకుల లాగా చవట విమర్శలు చేసే వాళ్లు తక్కువ. )

    రిప్లయితొలగించండి