13, నవంబర్ 2026, శుక్రవారం

సమస్య - 5650

14-11-2026 (శనివారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“లంకఁ గాల్చిన హనుమ కళంకితుండు”

(లేదా...)

“లంకనుఁ గాల్చి మారుతి కళంకితుఁ డయ్యెను సీత దృష్టిలో”

12 కామెంట్‌లు:

  1. రావణుడు పరిపాలించు రాజధాని
    లంకఁ గాల్చిన హనుమ కళంకితుండు
    కాదు ; పరయింతు లందున కాముకుడయి
    చెరను బెట్టెడు జరితము జెంది యుండ

    రిప్లయితొలగించండి
  2. తేటగీతి
    జన్మభూమిని మించిన స్వర్గమేది?
    నష్టమొనర నసురులకున్ కష్టమదియె!
    పరుడనన్వాలమంటించి తరుమనెంచ
    లంకఁ గాల్చిన హనుమ కళంకితుండు!

    రిప్లయితొలగించండి
  3. సీత జాడను గనుగొన చేరె లంక
    వాలమును గాల్చి య సురులు వంత గూర్ప
    సాహసంబు న జూపించె శక్తి యె టుల
    లంక గాల్చిన హనుమ కళ o కి తుండు?

    రిప్లయితొలగించండి
  4. రిప్లయిలు
    1. రామ పత్నిని కనుగొన లంకఁ జేరి
      మ్రోల నిలిచి సంభాషించె మోదమలర
      భూజ భద్రతను మఱచి మూర్ఖుడగుచు
      లంకఁ గాల్చిన హనుమ కళంకితుండు

      లంకను జేరి కన్గొనెను రాముని భార్యనశోకమందునన్
      జంకక హెచ్చరించెను నిశాచర భానువు రావణుండనున్
      బంకజ నేత్రి జానకికిఁ భద్రత నెంచని బాలకుండుగా
      లంకనుఁ గాల్చి మారుతి కళంకితుఁ డయ్యెను సీత దృష్టిలో

      తొలగించండి

  5. కారణమ్మది లేకుండ కదన మాడి
    దనుజుల దునిమె నంచు నా దానవ కుల
    దృంభువైనట్టి రావణు దృష్టి లోన
    లంకఁ గాల్చిన హనుమ కళంకితుండు.


    జంకక వృక్ష వాటికను సాద మొనర్చె నకారణమ్మునన్
    సంకర మాడె వీడనుచు సాల్వుడు రావణు మానసమ్మునన్
    లంకనుఁ గాల్చి మారుతి కళంకితుఁ డయ్యెను, సీత దృష్టిలో
    వంకను తీర్చ గల్గు నిజ బంధువు గా మది నిల్చి పోయెనే.

    రిప్లయితొలగించండి
  6. వనము దహియించగానొక వానరమ్ము
    అదియె ఘనకార్య మెట్లగు నఘము గాదె
    యనుచు పాలసుడొకఁ డగడాడె నిటుల
    లంకఁ గాల్చిన హనుమ కళంకితుండు

    రిప్లయితొలగించండి
  7. ఉ॥ వంకలఁ బెట్టువారలకు బ్రాఁతినిఁ గూర్చద రామగాథయే!
    పెంకితనమ్ము తోడ విషవృక్షమటంచును వ్రాయ నెంతురే!
    పొంకము లేనివాదనలఁ బొల్లునుఁ దెల్పుచుఁ బల్కెనెవ్వఁడో
    ”లంకనుఁ గాల్చి మారుతి కళంకితుఁ డయ్యెను సీత దృష్టిలో”

    పొల్లు అసత్యము

    (రామాయణము భక్తులకే కాక తప్పులు బట్టే వారికీ ప్రియమేనండి)

    రిప్లయితొలగించండి
  8. లంకకు జేరి జానకి లలామను గాంచిన వాయుపుత్రుడే
    లంకను గాల్చె వాలముకు రక్కసి మూకలు నిప్పు పెట్టగా
    వంకలు పెట్టుటే పనిగ పాలసుఁడొక్కఁడు బల్కెనిట్టులన్
    లంకనుఁ గాల్చి మారుతి కళంకితుఁ డయ్యెను సీత దృష్టిలో

    రిప్లయితొలగించండి
  9. పంక మనస్సు రాక్షసులు వాయుకుమారుని పట్టి, తోకకున్
    బింకము తోడ నింగిలము బెట్టి వినాశన కారణమ్ముగాన్
    వంకర బుద్ధితో నొకడు పల్కెను మద్యముఁ ద్రాగి మత్తులో
    ‘లంకనుఁ గాల్చి మారుతి కళంకితుఁ డయ్యెను సీత దృష్టిలో’

    రిప్లయితొలగించండి
  10. కాలి నంతటఁ జేతులు కడఁగి భృశము
    పత్రములను నాత్రమ్మునఁ బట్టి నట్లు
    నిలువ జానకి లంకలో నేరకుండ
    లంకఁ గాల్చిన హనుమ కళంకితుండు


    శంక చెలంగ డెందమున జానకి దుఃఖిత యయ్యె నత్తఱిన్
    గొంక కెడంద నల్పమును ఘోర తరమ్ముగ నగ్ని ధగ్ధ లం
    కాంకిత మీయ సోకులకు నద్భుత రీతిని నంత వారికిన్
    లంకనుఁ గాల్చి మారుతి కళంకితుఁ డయ్యెను సీత దృష్టిలో

    రిప్లయితొలగించండి