23, సెప్టెంబర్ 2026, బుధవారం

సమస్య - 5599

24-9-2026 (గురువారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“తల్లిని దూషించి సవతితల్లికి మ్రొక్కెన్”

(లేదా...)

“తల్లిని దూఱుచున్ సవతితల్లికి మ్రొక్కె నొకండు విజ్ఞుఁడై”

(ఐతగోని వెంకటేశ్వర్లు గారి శతావధానంలో వేదాల గాయత్రి గారి సమస్య)

9 కామెంట్‌లు:

  1. చెల్లెలిపైన ప్రేమమున సేవల చేయుచు నామెకిచ్చతో
    నుల్లములోన క్రోధన మనూహ్యము కోడలిపైన హెచ్చగా
    కల్లల జెప్పుచుండగను, కాంచి నిజమ్మును చేరదీయగా
    తల్లిని దూఱుచున్ సవతితల్లికి మ్రొక్కె నొకండు విజ్ఞుఁడై

    రిప్లయితొలగించండి
  2. ఇల్లాలు కోరి నదనుచు
    నొల్లుచు రాఘవుని వెడల నోజ నొ సంగన్
    నొల్లమి జూపుచు భరతుడు
    దల్లిని దూషించి సవతితల్లికి మ్రొక్కెన్

    రిప్లయితొలగించండి

  3. ఎల్లరు కొలిచెడి రాముని
    తల్లియె స్వార్థమ్ము తోడ తల్కము కంnపన్
    హృల్లేఖ మందు భరతుడు
    తల్లిని దూషించి సవతితల్లికి మ్రొక్కెన్.


    చెల్లెలి భంగ పాటు మరచెన్గద హీనుని రామ చంద్రునిన్
    బల్లిదుడంచు నప్రియపు భాషణ జేసేనె రాజ ద్రోహియై
    యెల్లరు లాలకింపుమిది హీనగుణుండువిభీషణుండు తా
    తల్లిని దూఱుచున్ సవతితల్లికి మ్రొక్కె నొకండు, విజ్ఞుఁడై?


    ఎల్లరు లాలకింపుమిది హీనుడ నేననుచున్ విభీషణుం
    డుల్లము గాయ పర్చి నరుడుత్తము డంచును దుష్ట బుద్ధితో
    నల్లన మానవాధముని యంకము జొచ్చుట కాంచి నంతనే
    తల్లిని దూఱుచున్ సవతితల్లికి మ్రొక్కె నొకండు, విజ్ఞుఁడై?

    రిప్లయితొలగించండి
  4. పిల్లలను భర్తను విడిచి
    కల్లరి తాఁబోయెనకట కామిని యగుచున్
    బిల్లడు దిగవిడిచినదగు
    తల్లిని దూషించి సవతితల్లికి మ్రొక్కెన్

    కల్లరి వీడిపోయె తన కాంతునిఁ బుట్టిన బిడ్డపాపలన్
    బిల్లల పెంపుకై మగడు వేరొక కాంతను బెండ్లియాడగా
    సల్లలితంబుగా సుమతి సాకగ పొంపిరివోవు బాలుడై
    తల్లిని దూఱుచున్ సవతితల్లికి మ్రొక్కె నొకండు విజ్ఞుఁడై

    రిప్లయితొలగించండి
  5. భరతుని ఆవేదన:-
    చెల్లునె మోము రాఘవును చెంత, యిదేమి వరమ్ము నీకు నన్
    చిల్లర వానిగన్ గనరె, చేరెద కానలకంచు పల్కడే!
    యుల్లము మోద పూర్ణమగు నున్నతమౌ రఘు రామ గాథలో
    తల్లిని దూఱుచున్ సవతితల్లికి మ్రొక్కె నొకండు విజ్ఞుఁడై!!

    రిప్లయితొలగించండి
  6. కందం
    తల్లికన మూర్ఛరోగమె
    పెళ్లాడెనొకర్తిఁ దండ్రి! వేసరి సుతుఁడున్
    దల్లికొనగూడ సర్వము
    తల్లిని దూషించి సవతితల్లికి మ్రొక్కెన్!

    ఉత్పలమాల
    తల్లికి మూర్ఛ రోగమని తండ్రియె రెండవపెళ్లిఁ జేకొనెన్
    దల్లడ పెట్టెనే తనయుఁ దండ్రియొనర్చిన దారుణమ్మదే
    యుల్లము రాయి చేసుకొని యోర్పునఁ దల్లికిఁ గూర్చనన్నియున్
    దల్లిని దూఱుచున్ సవతితల్లికి మ్రొక్కె నొకండు విజ్ఞుఁడై!

    రిప్లయితొలగించండి
  7. కం: ఉల్లమున బ్రేమ యుండియు
    నల్లరి చేయంగ దిట్టు నమ్మ, యరువుదౌ
    తల్లిదె ప్రేమ యని యొకడు
    తల్లిని దూషించి సవతితల్లికి మ్రొక్కెన్
    ( తల్లికి ప్రేమ ఉన్నా కోప్పడుతుంటుంది. సవతి తల్లికి బాధ్యత లేదు కనుక ఊరికే ప్రేమ చూపిస్తుంది.అది తెలియని పిల్ల వాడు అమ్మ కంటే సవతి తల్లే మంచిదని దణ్నం పెట్టాడు. )

    రిప్లయితొలగించండి
  8. ఉ॥ ప్రల్లదుఁడై చరించుచును బాధ్యత వీడుచుఁ ద్రాగు చుండఁగన్
    దల్లికి ఖేదమున్ సవతి తల్లికి మోదముఁ గల్గ మారునా?
    కల్లును గ్రోల విత్తమును గావలె నంచు నుపాయమెంచుచున్
    దల్లిని దూఱుచున్ సవతితల్లికి మ్రొక్కె నొకండు విజ్ఞుఁడై

    (త్రాగుడుకు బానిసలైన వారింతేనండి. సవతితల్లి ఉంటే సవతికొడుకు చెడిపోతుంటే ఊతమిచ్చి ప్రోత్సహిస్తారు)

    రిప్లయితొలగించండి
  9. ఉ:తల్లిని గౌరవించుటయె ధర్మము కాని దురాశ జెంద నా
    తల్లిని కైకమన్ బలు విధమ్ముల నా భరతుండు తిట్టెగా
    తొల్లిటి సాధువర్తనము ద్రోయుచు దా పెద తల్లి బిడ్డడై
    తల్లిని దూరుచున్ సవతి తల్లికి మ్రొక్కె నొకండు విజ్ఞుడై.

    రిప్లయితొలగించండి