7, జనవరి 2011, శుక్రవారం

సమస్యా పూరణం - 191 (కలహంసల తప్పు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
కలహంసల తప్పు గాక కాకుల తప్పా?
దీనిని పంపించిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.

ప్రహేళిక - 35

పేరు చెప్పండి
చ.
"సరసిజనేత్ర! నీ మగని చక్కని పేరది యేదొ చెప్పుమా"
"అరయఁగ నీవు న న్నడుగు నాతని పే రిదె చిత్తగింపుమా
కరియును, వారిరాశి, హరుకార్ముకమున్, శర, మద్దమున్, శుకం
బరుదుగ వ్రాయఁగా నడిమి యక్షరముల్ గణుతింపఁ బే రగున్.

(చాటుపద్య రత్నాకరము)
గమనిక - సాధారణంగా కావ్యభాషలో పదాలు ముప్రత్యయంతో ఉంటాయి. కాకుంటే మ్ము, ంబులతో ఉంటాయి. ఉదాహరణకు కరి అంటే కుంజరము, కుంజరమ్ము, కుంజరంబు అని మూడు రూపాల్లో చెప్పవచ్చు.కుంజరం అనేది వ్యావహారిక రూపం. వాస్తవానికి ఇలాంటి చోట గ్రాంథిక పదమే చెప్పాలి. కాని ఇక్కడ మాత్రం `కుంజరము` అనే నాలుగక్షరాల గ్రాంథిక పదాన్ని కాకుండా `కుంజరం` అనే మూడక్షరాల వ్యవహార పదాన్నే తీసుకోవాలి. (నిజానికి ఈ పద్యంలో అది కుంజరం కాదు). చివరి పదం తప్ప మిగిలిన వన్నీ ఇలాంటివే.
ఇప్పుడు చెప్పండి
ఆమె మగని పే రేమిటి?

చమత్కార పద్యాలు - 51

బొగ్గవరపు పెద పాపరాజు
18వ శతాబ్దికి చెందిన ఈ కవిది గుంటూరు మండలంలోని బొగ్గవరం గ్రామం. బెజగం నరసయ్య అనే వ్యక్తిపై ఇతడు రాసిన పద్యం ఇది ......
సీ.
నీ చిఱునవ్వు వెన్నెల బెదరింపఁగా
మోము చందురు గేరు టేమి చెప్ప?
నీ కన్ను లంభో నివహంబు నగ బొమల్
కాము విండ్లను గేరు టేమి చెప్ప?
నీ వర్థిజన కల్పవృక్షంబు నాఁ జేతు
లా మ్రాని కొమ్మలం చేమి చెప్ప?
నీ నడల్ మదకరి కాన సేయఁ నూరు
లిభహస్త నిభములం చేమి చెప్ప?
తే.గీ.
చక్కఁదముల కుప్పగా సరవి నిన్ను
ధాత జనియింపఁగాఁ జేసె ధణిలోన
కలమగు భూసురాశీర్వచన వివర్ధి
తాన్వ నిధాన! కృతిగర్భితాభిధాన!
ఈ పద్యంలోనే "బెజగము నరసయ్య" అనే పేరు దాగి ఉంది.
(చాటుపద్య రత్నాకరము)

6, జనవరి 2011, గురువారం

కృతజ్ఞతా పూర్వక నమస్సుమాంజలి

మిత్రులకు, శ్రేయోభిలాషులకు,
కృతజ్ఞతా పూర్వక నమస్సుమాంజలి.
నా విన్నపాన్ని మన్నించి, నా సమస్యను తీర్చి, బ్లాగు నిరాటంకంగా కొనసాగడానికి తమ తమ పరిధులలో ఆర్థిక సహాయం చేసిన మిత్రులకు, శ్రేయోభిలాషులకు "శంకరాభరణం" సినిమాలో శంకర శాస్త్రి చెప్పినట్లు "శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను".
ఈ సత్కార్యానికి పూనుకొని, బ్లాగు మిత్రులను ప్రోత్సహించి, కార్యభారాన్ని తమ భుజాల కెత్తుకొని నిర్వహించిన హరి గారికి, వలబోజు జ్యోతి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.
స్పందించి, ఆర్థిక సహకారాన్ని అందించిన సహృదయులు ............
హరి గారు
వలబోజు జ్యోతి గారు
మంద పీతాంబర్ గారు
మిస్సన్న గారు
వసంత్ కిశోర్ గారు
గన్నవరపు నరసింహ మూర్తి గారు
నచికేత్ గారు
మంత్రి ప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారు
జిగురు సత్యనారాయణ గారు
మలక్ పేట్ రౌడీ గారు
మైత్రేయి గారు
డా. ఆచార్య ఫణీంద్ర గారు
డా. విష్ణు నందన్ గారు
సనత్ శ్రీపతి గారు
ఊకదంపుడు గారు
రవి గారు
భరద్వాజ్ గారు
నేదునూరి రాజేశ్వరి గారు
పేరు ప్రకటించడానికి ఇష్టపడని అజ్ఞాత దాత పంపింది 15000 రూ.లు.
మొత్తం మీద ఈ "మిష"తో నా అకౌంట్ లోకి చేరిన డబ్బు 32280 రూ.లు.
నా మినిమం అవసరానికి మాగ్జిమం రెట్టింపు!
దేనికొరకు వచ్చిన డబ్బును దానికొరకే వినియోగించాలి కనుక ఈరోజే అన్ని హంగులతో, మంచి కాన్ ఫిగరేషన్ తో సిస్టం (డెస్క్ టాప్) తీసికొని, మిగిలిన డబ్బుతో జ్యోతి గారి సూచన ప్రకారం ప్రింటర్, స్కానర్ తీసుకుంటున్నాను. అప్పటికీ మిగిలితే కొన్ని ఛందో వ్యాకరణ గ్రంథాలు తీసుకొంటాను.
రేపటి నుండి నా బ్లాగు సక్రమంగా కొనసాగుతుంది.
ధన్యవాదాలతో ....
మీ
కంది శంకరయ్య.

5, జనవరి 2011, బుధవారం

సమస్యా పూరణం - 190 (అమృతపానమ్ము)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
అమృతపానమ్ము మరణమ్ము నందఁ జేసె.

3, జనవరి 2011, సోమవారం

సమస్యా పూరణం - 189 (చెల్లి యని పతి)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
చెల్లి యని మగఁడు పిలువఁగా చెలియ మురిసె.
మంద పీతాంబర్ గారి పూరణ చూసినప్పుడు తెలిసింది. "చెల్లి యని మగఁడు పిలువఁగా చెలియ మురిసె" అన్నప్పుదు గణదోషం దొర్లింది. దానిని ఇలా సవరించాను.
చెల్లి యని పతి పిలువఁగా చెలియ మురిసె.

2, జనవరి 2011, ఆదివారం

కవి మిత్రులకు మనవి ....

ఇంతకాలం ఇంట్లో కంప్యూటర్ ఉండడంతో బ్లాగు నిర్వహణ నిరాటంకంగా కొనసాగింది. ఈ రోజు మా అబ్బాయి సిస్టం ను హైదరాబాద్ తీసుకు వెళ్తున్నాడు. రేపటి నుండి "ఇంటర్ నెట్ కేఫ్"లే దిక్కు. అవి సాధారణంగా ఉదయం 10 గంటలకు తెరుస్తారు. వెళ్ళినప్పుడు సిస్టం ఖాళీగా దొరకక పోవచ్చు. దొరికినా నెట్ స్పీడు చాలా తక్కువగా ఉంటుంది.
పోని తక్కువ కాన్ ఫిగరేషన్ తో ఒక కొత్త సిస్టమో లేదా సెకండ్ హాండ్ దో కొందామంటే ప్రస్తుతానికి నా ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేదు.
ఏతా వాతా నా మనవి ఏమంటే ....
రేపటి నుండి నా పోస్టులు కాస్త ఆలస్యం కావచ్చు. ఒక్కొక రోజు ఉండక పోవచ్చు. మీ అందరి పూరణలను విడి విడిగా వ్యాఖ్యానిచడం వీలుకాక పోవచ్చు. మీ సందేహాలకు వెంట వెంటనే సమాధానాలు ఇవ్వలేక పోవచ్చు.
కాబట్టి మీరే మిగిలిన కవి మిత్రుల పూరణలను విశ్లేషిస్తూ, గుణదోష విచారణ చేస్తూ, వీలైతే సందేహాలకు సమాధానాలు ఇస్తూ ఉండండి.
వీలైనంత తొందరలో సిస్టం తీసుకొని బ్లాగును సక్రమంగా కొనసాగిస్తాను.
మీకు కలిగిస్తున్న ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాను.

సమస్యా పూరణం - 188 (దాని మానుప భువి)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
దాని మానుప భువి నౌషధమ్ము గలదె?
దీనిని పంపించిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.

1, జనవరి 2011, శనివారం

ప్రహేళిక - 34 (సమాధానం)

అత డెవరు?
చం.
మనసిజు మామ మామ యభిమాన మడంచినవాని మామ నం
దనుని విరోధి నందనుని నందను సుందరి మేనమామఁ జం
పిన జగజెట్టి పట్టిఁ బొడిజేసిన శూరుని తండ్రిఁ గన్నుగాఁ
గొనిన సురాధినాథుని తనూభవు నాయువు మీకు నయ్యెడున్.

(చాటుపద్య రత్నాకరము)
పరిష్కారం ...............
1. మన్మథుని మామ - చంద్రుడు
2. అతని మామ - దక్షుడు
3. అతని గర్వం అణచినవాడు - శివుడు
4. అతని మామ - హిమవంతుడు
5. అతని కొడుకు - మైనాకుడు
6. అతని శత్రువు - ఇంద్రుడు
7. అతని కుమారుడు - అర్జునుడు
8. అతని పుత్రుడు - అభిమన్యుడు
9. అతని భార్య - ఉత్తర
10. ఆమె మేనమామ - కీచకుడు
11. అతనిని చంపిన వీరుడు - భీముడు
12. అతని కొడుకు - ఘటోత్కచుడు
13. అతనిని చంపిన శూరుడు - కర్ణుడు
14. అతని తండ్రి - సూర్యుడు
15. అతనిని కన్నుగా పొందిన దేవుడు - విష్ణువు
16. అతని కుమారుడు - బ్రహ్మ
ఆ బ్రహ్మదేవుని ఆయువు మీకు కలగాలని ఆశీస్సు.
సమాధానం పంపినవారు జి. మైథిలీ రాం గారొక్కరే. అదికూడా 100% సరియైన సమాధానం వారికి అభినందనలు.

సమస్యా పూరణం - 187 (నూతన సంవత్సరమున)

కవి మిత్రులారా,
అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు.
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
నూతన సంవత్సరమున నూటికి నూఱే.