7, జనవరి 2011, శుక్రవారం

ప్రహేళిక - 35

పేరు చెప్పండి
చ.
"సరసిజనేత్ర! నీ మగని చక్కని పేరది యేదొ చెప్పుమా"
"అరయఁగ నీవు న న్నడుగు నాతని పే రిదె చిత్తగింపుమా
కరియును, వారిరాశి, హరుకార్ముకమున్, శర, మద్దమున్, శుకం
బరుదుగ వ్రాయఁగా నడిమి యక్షరముల్ గణుతింపఁ బే రగున్.

(చాటుపద్య రత్నాకరము)
గమనిక - సాధారణంగా కావ్యభాషలో పదాలు ముప్రత్యయంతో ఉంటాయి. కాకుంటే మ్ము, ంబులతో ఉంటాయి. ఉదాహరణకు కరి అంటే కుంజరము, కుంజరమ్ము, కుంజరంబు అని మూడు రూపాల్లో చెప్పవచ్చు.కుంజరం అనేది వ్యావహారిక రూపం. వాస్తవానికి ఇలాంటి చోట గ్రాంథిక పదమే చెప్పాలి. కాని ఇక్కడ మాత్రం `కుంజరము` అనే నాలుగక్షరాల గ్రాంథిక పదాన్ని కాకుండా `కుంజరం` అనే మూడక్షరాల వ్యవహార పదాన్నే తీసుకోవాలి. (నిజానికి ఈ పద్యంలో అది కుంజరం కాదు). చివరి పదం తప్ప మిగిలిన వన్నీ ఇలాంటివే.
ఇప్పుడు చెప్పండి
ఆమె మగని పే రేమిటి?

17 కామెంట్‌లు:

  1. గోవర్ధన గిరి ధారి = కృష్ణుడు = విష్ణువు
    ఔనా?

    రిప్లయితొలగించండి
  2. జ్యోతి గారూ,
    మొదటి రెండు అక్షరాలు తప్పు.

    వసంత్ కిశోర్ గారూ,
    మీ సమాధానం తప్పు. మళ్ళీ ఒకసారి ఆలోచిం చండి.

    రిప్లయితొలగించండి
  3. భర్తపేరడిగితే ఈ పదాల మధ్య అక్షరాలు కలిపితే తన భర్త పేరొస్తుందని చెప్తుంది.కరి=సారంగం, వారిరాశి =సాగరం హరకార్ముకం - పినాకం, శరం - సాయకం, అద్దం -ముకురం, శుకం - చిలుక .. వీటి మధ్య అక్షరాలు కలిపితే రంగనాయకులు వస్తుంది. ఇదే కదా..

    నేను ఇంతకుముందు చదివిన పద్యం ఇది..
    సరసిజనేత్ర నీ విభుని చక్కని పేరు వచింపుమన్న యా
    పరమ పతివ్రతామణియు భావమునన్ ఘనమైన సిగ్గునన్
    కరియును రక్కసుండు హరుకార్ముకమున్ శరమద్దమున్ శుకం
    బరయగ వీనిలోని నడి యక్కరముల్ గణుతింప పేరుగన్ .

    అందుకే రఘునాయకులు అన్నాను.. :))

    రిప్లయితొలగించండి
  4. శంకరార్యా!
    నేను-
    వానరం-----------న
    సాగరం-----------గ
    శివధనుస్సు--------ధ
    పెరుగు-----------రు
    ---------
    చిలుక------------లు

    తప్పని తెలియు చున్న నూ
    మీ సూచనల కొరకు ప్రకటించితిని.
    అద్దమునకు పర్యాయ పదం (దర్పణం)ఒకటే దొరికినది.

    ఈ పర్యాయ పదము లెందు లభించునో తెలుపగలరు.

    రిప్లయితొలగించండి
  5. గజము, సాగరం, పినాకం, తోయము, ముకురము, చిలుక

    జగనాయకులు

    రిప్లయితొలగించండి
  6. జ్యోతి గారు సరిగ్గా చెప్పారు. సారంగముకు ఏనుగు అర్ధము ఉంది. రంగనాయకులు. ఆవిడ కరెక్టుగా చెప్పారు.

    రిప్లయితొలగించండి
  7. జ్యోతి గారూ,
    ఇప్పుడు మీరు ౧౦౦% కరెక్ట్. అబినందనలు.

    మందాకిని గారూ,
    మీ సమాధానం కరెక్ట్. అబినందనలు. కానీ ఆ పేరు ఎలా తెలిసిందో వివరిస్తే బాగుండేది.

    మూర్తి గారూ,
    కొడ్డగా గురి తప్పింది.

    వసంత్ కిశోర్ గారు,
    జ్యోతి గారి వివరణ చూడండి.

    రిప్లయితొలగించండి
  8. కరి = ద్విరదము అనగా ఏనుగు [ " ర " }
    రాక్షుడు = అఘుడు [" ఘు " ]
    హరుకార్ముకము = పినాకము [ " నా " ]
    శరము = సాయకం [ " య " ]
    అద్దం = ముకురము [ కు " ]
    శుకము = చిలుక [ " లు " ]
    అన్ని కలిపిన = అతడి పేరు " రఘునాయకులు "

    రిప్లయితొలగించండి
  9. జ్యొతి గారు చదివిన పద్యమె ఇంతకు ముందు నెను చదివాను " వారిరాశి , వారాశి " అనగా సాగరము. మరి కరి అనగా " సారంగము " అన్నారు. సారంగము అనగా " లేడి " అనికుడా ఉంది. ఇది వివరించ గలరు
    నేను చదివిన పద్యం గుర్తు రాగా మర్చి పోయి పద్యం పూర్తిగా చదవ కుండా అలా రాసేసాను పొరబాటుకు మన్నించ గలరు

    రిప్లయితొలగించండి
  10. నేను చదివిన పద్యములొ " వారిరాశికి " బదులు " రక్కసుండు " అని ఉంది

    రిప్లయితొలగించండి
  11. గురువుగారూ, నాకు అసలు తెలీలేదండి. నేను జ్యోతిగారి వ్యాఖ్య, మీ సమాధానాన్ని బట్టి రాశాను .అంతే.

    రిప్లయితొలగించండి
  12. రాజేశ్వరి గారూ,
    'సారంగం' శబ్దానికి లేడి, ఏనుగు, తుమ్మెద అనే అర్థాలున్నాయి.

    రిప్లయితొలగించండి
  13. వసంత్ కిశోర్ గారూ,
    ఆచార్య జి.ఎన్. రెడ్డి గారి "తెలుగు పర్యాయపద నిఘంటువు" కొనుక్కోండి. విశాలాంధ్ర వారి పుస్తకాల షాపుల్లో దొరుకుతుంది. వెల 240 రూ.లు.
    నాకు తెలిసినంత వరకు తెలుగులో పర్యాయ పదాల కొరకు దీనిని మించింది లేదు. ఇది సమగ్రంగా ఉంది.

    రిప్లయితొలగించండి