11, జులై 2012, బుధవారం

సమస్యాపూరణం -760 (తండ్రి నేర్పు విద్య)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

తండ్రి నేర్పు విద్య తప్పు గాదె!

ఈ సమస్యను సూచించిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

పద్య రచన - 47


కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.

10, జులై 2012, మంగళవారం

రవీంద్రుని గీతాంజలి - 69

రవీంద్రుని గీతాంజలి

*తెనుఁగు సేత*

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు

69

THE same stream of life that runs
through my veins night and day runs
through the world and dances in
rhythmic measures.

It is the same life that shoots in joy
through the dust of the earth in
numberless blades of grass and breaks
into tumultuous waves of leaves and
flowers.

It is the same life that is rocked in
the ocean-cradle of birth and of death,
in ebb and in flow.

I feel my limbs are made glorious by
the touch of this world of life. And my
pride is from the life -throb of ages
dancing in my blood this moment. 


చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము.....


పారుచున్నది జీవనధార యదియె
నరము నరమున రేఁబవల్ నాదుమేన,
ఆడుచున్నది విశ్వమం దదియె స్వీయ
గాన సముచిత లయతాళ గతులతోడ ||

మట్టిలోఁ బచ్చిక గుబుర్లు పెట్టఁ బ్రీతి
పులకలెత్తించుచున్నది పుడమి కదియె,
నగవు తడలెత్తి పొట్టలు పగులునట్టు
లాకులం బూల విప్పించు నట్టి దదియె ||

పుట్టు చావుల కడలిపైఁ బోటుపాట్ల
తూఁగుటూయెల హాయిగ నూగు నదియె ||

అంగమంగము సత్తువ పొంగులెత్తఁ
దాకునట్టి మహాప్రాణధార యదియె,
నేడు సైతము నా రక్తనాడులందుఁ
జిందులం ద్రొక్కు యుగయుగస్పంద మదియె,
యీ యనుభవమ్మె గర్వితుఁ జేయు నన్ను || 

సమస్యాపూరణం -759 (మాట తప్పువాఁడు)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

మాట తప్పువాఁడు మంచివాఁడు.

ఈ సమస్యను సూచించిన వసంత కిశోర్ గారికి ధన్యవాదాలు.

కవిమిత్రుల పూరణలు

౧. హరి సత్యనారాయణ మూర్తి
    స్వార్థపరుడె భువిని పాలకాగ్రణి నేడు
    కోట్లు మ్రింగువాడు గొప్పవాడు
    బాస చేసినట్టి పనులను చేయక
    మాట తప్పువాడు మంచివాడు.
*     *     *     *     *
౨. పండిత నేమాని
    చిన్నికృష్ణుడితడు పున్నెములకు ప్రోవు
    మా వరాల పంట మరల మరల
    వాని గూర్చి కొంటె వాడంచు మీరను
    మాట తప్పు, వాడు మంచి వాడు.

*     *     *     *     *
౩. లక్ష్మీదేవి
    ఎవరిమాట నమ్ముటిలను ముప్పునుఁదెచ్చు,
    నెవడు వాడు? జగతి నెపుడు చెడ్డ
    వాని వలన బాధ పడునదెవ్వరు చెప్పు?
    మాట తప్పు వాఁడు, మంచివాఁడు.

*     *     *     *     *
౪. మిస్సన్న
    ధర్మరాజ! నీకు తగదు జూదము పోకు-
    మాట తప్పు వాఁడు మంచివాఁడు
    కాదు శకుని పాచికలను మాయంజేసి
    నీదు సిరుల దోచు నిజము నమ్ము.

*     *     *     *     *
౫. గుండు మధుసూదన్
    భాష పైన గొప్ప పట్టున్న పండితుం
    డతఁడు మాట లాడ నమృత మొలుకు;
    వాని మాట పసిఁడి; వానికి లేదయ్య
    మాట తప్పు! వాఁడు మంచివాఁడు!

*     *     *     *     *
౬. గోలి హనుమచ్ఛాస్త్రి
    ప్రక్క యింటి లోని పాపయ్య గారికి
    పుత్రు లిద్దరయ్య పోల్చి చూడ
    వారు పెద్ద. చిన్న వరుసగా చెప్పెద
    మాట తప్పు వాఁడు, మంచివాఁడు.

*     *     *     *     *
౭. సుబ్బారావు
    వర్జ్యనీయుడు సుమి వసుధలో నిచ్చన
    మాట తప్పు వాడు, మంచి వాడు
    సర్వ జనుల యెడల సమ భావముగ నుండు
    మాట యాయువు గద ! మానవునకు.

*     *     *     *     *
౮. ‘మన తెలుగు’ చంద్రశేఖర్
    మాట తప్పు వాఁడు మంచివాఁడు మనకు
    రాష్ట్రపతి యగునట రాలుగాయి
    రాజకీయ మందు రభస తప్పుటలేదు
    కాంగ్రెసు ప్రణతుడె కడకు గతిర.

*     *     *     *     *
౯. సహదేవుడు
    ఆధునికయుగపతివాదసూత్రములివే
    మాటతప్పువాడుమంచివాడు!
    తూటఁబేల్చువాడుదొడ్డవాడుగఁజెల్లు!
    హత్యఁజేయ గద్దె నందువాడు!
*     *     *     *     *
౧౦. కమనీయం
    శుక్రనీతి చెప్పు సూత్రప్రకారమ్ము
    అనుసరించి గొప్ప యాపదలను
    తనను దాను కాచుకొనుటకై యాడిన
    మాట తప్పువాడు మంచివాడు.

*     *     *     *     *
౧౧. చంద్రమౌళి
(సత్రాజిత్తు శ్యమంతకరత్నాన్ని కృష్ణుడపహరించెననిన బలరాముడు ఆ నింద నిజముకాదని అతని మందలించిన సందర్భము)
    “పరుల సొమ్ము కృష్ణ పరమాత్మ తాకడు,
    నింద వేయ తగదు నిజము గాను
    తమ్ముడా రతనము తస్కరించె ననెడి
    మాట తప్పు, వాడు మంచివాడు”
*     *     *     *     *
౧౨. రాజేశ్వరి నేదునూరి
    కలసి యాడి పాడి కలలందు కరిగించి
    మమత లెన్నొ పెంచి మాట మార్చి
    మోస గించ లేక విసుగు నభినయించి
    మాట తప్పు వాఁడు మంచి వాఁడు.
*     *    *     *     *
౧౩. ఊకదంపుడు
    లోన దిగులు మింగి లేనిధైర్యమునొంది
    పలికె పతికి నిట్లు "పవలు, కొడుకు
    చేరదీయడనిన చిలుకజోస్యమువాని
    మాట తప్పు, వాఁడు మంచి వాఁడు."

పద్య రచన - 46


కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.


కవిమిత్రుల పద్యములు

౧. మిస్సన్న
    రూపాయీ! భరతాంబకు
    పాపాయీ! లుబ్ధు కంటిపాపా! చోరుం
    జూపా! దాచెడు వారికి
    తీపా ! మరి లేని వారి తిప్పల కుప్పా!

*     *     *     *     *
౨. లక్ష్మీదేవి
    ధనమది యెంతగ వచ్చిన
    జనులకు తక్కువగఁ దోచు; సంపాదనయే
    మన జీవిత లక్ష్యమనుచు
    దినదినమును తిరుగుచుంద్రు, దెసదెసలందున్.
*     *     *     *     *
౩. పండిత నేమాని
    మనమారన్ దలతున్ శుభంకరి! మహామాయా స్వరూపాంచితా!
    ధనలక్ష్మీ! సకలార్థ దాయిని! నినున్ ధ్యానింతు నిత్యమ్ము న
    ర్చనలన్ సల్పుదు సర్వ విశ్వమునకున్ సామ్రాజ్ఞివీవే కృపా
    వనరాశీ! ధనమే ప్రధానమగు సర్వం విత్త సాధ్యం జగత్!

*     *     *     *     *
౪. గుండు మధుసూదన్
    పైస లోన నుండు పరమాత్ముఁ డిల లోన;
    ధనమె మూల మయ్యె ధరణి లోన;
    డబ్బు లేని వాఁడు డుబ్బుకుఁ గొఱ గాఁడు!
    కాన, గూడఁబెట్టఁ గలుగు సుఖము!!

    కులము గొప్పదైన; గోత్రోత్తముండైన;
    విద్య యున్న; సద్వివేకమున్న;
    ధనము గల్గు వాని దాసునిగా మాఱి,
    సతము సేవఁ జేయు నతఁడు, నిజము!

    రూపాయియె పరమార్థము;
    పాపములను జేసి యైనఁ బైసను బెంచన్
    దాపత్రయ పడుచుందురు;
    రూపాయీ, నీకు నతులు! ప్రోవుము నన్నున్!

*     *     *     *     *
౫. సుబ్బారావు
    రూపాయి కిలో బియ్యము
    నీ పాలన నున్న వరకు నిత్తురు కానీ
    నీ పథకము చివరి వరకు
    నాపాదితమగునె నిచట నార్ధిక మంత్రీ!
*     *     *     *     *
౬. ‘మన తెలుగు’ చంద్రశేఖర్
    రూప్యమున కిక బియ్య మప్రాప్య మనిరి
    రూప్యమునకు పాలుపెరు గప్రాప్యము సరి
    రూప్యమున కిన్ని నీళ్ళైన నాప్య మనఁగ
    లేము, రూప్యమా! చాలిక లేచి పొమ్ము!

*     *     *     *     *
౭. హరి వేంకట సత్యనారాయణ మూర్తి

    రూపాయి

    జగముల కీవే మూలము
    నిగమంబుల పాఠనంబు నిత్యార్చనముల్
    భగవత్సేవలు నీకొర
    కగణితసుఖకామ్యదాత వగు రూపాయీ! (1)

    పరమానందము నిత్తువు
    కరుణాత్మకుడన్న పేరు కఠినున కిలలో
    నిరతము గూర్తువు, మహిమను
    కరమొసగెడుదాన వీవు గద! రూపాయీ! (2)

    విద్యాహీనునకైనను
    సద్యోజ్ఞానంబు నొసగి సంఘమునందున్
    హృద్యంబగు గౌరవ మెపు
    డద్యతన సుఖంబులిత్తు వట! రూపాయీ!(3)

    అందము లేని కురూపికి
    సుందరరూపునకు నుండు శోభలు, మరియున్
    నిందితులకు సజ్జనయశ
    మందింతువు శక్తియుక్తవగు రూపాయీ! (4)

    నీవెవ్వనిఁ గరుణింతువొ
    సేవింతురు వాని జనులు శ్రీపతి యనుచున్
    భూవిభుడవు నీవేయని
    యేవేళను బల్కుచుందు రిక రూపాయీ! (5)

    ఎవరెవరో బంధువులని
    సవినయముగ వచ్చి చేరి సహచరులగుచున్
    నివసించుట నీ మహిమయె
    యవిరళసంతోషదాయి వగు రూపాయీ! (6)

    ఒక్కడు ధరణీపతియై
    యొక్కడు దాస్యంబు చేయుచుండుట కవురా
    నిక్కము నీవే కారణ
    మిక్కుంభినిలోన జూడ నిక రూపాయీ! (7)

    నిరుపేదకు రాజరికము
    ధరనేలెడు వానికేమొ దారిద్ర్యంబుల్
    ధరణిని గలుగుటకున్ నీ
    కరుణయె కారణ మటండ్రు గద! రూపాయీ! (8)

    నీవుండిన సుఖముండును
    నీవమరిన ధైర్యమబ్బు నిఖిలజగాలన్
    నీ వత్యవసరమనదగు
    నేవేళను దయనుఁ జూపు మిక రూపాయీ! (9)

    స్మరియించిన నమరెదవో?
    నిరతము సద్భక్తితోడ నినుఁ బూజింపన్
    నరులకుఁ గూడెదవో? మరి
    వరముల నిచ్చెదవొ? చెప్పవలె రూపాయీ! (10)

*     *     *     *     *
౮. కమనీయం
    విచ్చ రూపాయిలో తులము వెండి కలిగి
    వెలుగు వెలిగిన నాణెమా విలువ తగ్గి
    వీథి బిచ్చగాడైనను విసరి కొట్టు
    కర్మ పట్టెను నీకిపుడు కాలమహిమ.

*     *     *     *     *
౯. రాజేశ్వరి నేదునూరి
    ధనమే జగతికి మూలము
    జను లన్నము దినుటకైన చతురున కైనన్ !
    కనుగొనె రూప్యము నెవ్వడొ
    మనుజుని ప్రాణమున కైన మనుగడ కైనన్ !

    డాలరు బడాయి పోకడ
    చాలదు కొలువంగ నిలను చక్రికి నైనన్ !
    రాలును రూప్యపు విలువకు
    మేలగు సంస్కృతి మనదని మెప్పులు ధరలో !



 

9, జులై 2012, సోమవారం

రవీంద్రుని గీతాంజలి - 68

రవీంద్రుని గీతాంజలి

తెనుఁగు సేత

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు

68

THY sunbeam comes upon this earth of
mine with arms outstretched and stands
at my door the livelong day to carry
back to thy feet clouds made of my
tears and sighs and songs.

With fond delight thou wrappest
about thy starry breast that mantle of
misty cloud, turning it into numberless
shapes and folds and colouring it with
hues ever changing.

It is so light and so fleeting, tender
and tearful and dark, that is why thou
lovest it, O thou spotless and serene.
And that is why it may cover thy
awful white light with its pathetic
shadows. 


చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము....

భుజముల న్నిగిడించి నా పుడమిపైకి
స్వామి! నీ రవిరశ్మి తా వచ్చు టేల?
పవలు మొత్తము మామకద్వారసీమ
నిలిచియుండుట యేలనో నిత్య మద్ది?
నాదు నిశ్శ్వాస, బాష్ప, గానములు గూర్చు
మొగులు తెప్పల నీ పాద మూలమునకుఁ
జేర్చు కొఱకని వచ్చి నిల్చినది తాను ||

అంధకారఁపు రాత్రులయం దపార
తారకల్ పొల్చు స్వీయవక్షమ్ముపైన
పలుచ పలుచని మొగులు దువ్వలువ విప్పి
కప్పుకొను టెంత సంతోషకరము నీకు!
పెక్కు పోలిక లొప్పఁ ద్రిప్పెదవు దాని,
నిమిష నిమిషము మారు వన్నియల నద్ది
పలురకమ్ముల మడతలు మలఁచెదోయి! ||

చాల సన్నని, చామనచాయ లొలయు,
పరమ సుకుమార, చంచల వస్త్ర మద్ది,
నిష్కళంక! నిరంజన! *నీవు దాని
నిక్కతమ్మున నింత ప్రేమింతువోయి!
స్వీయమౌ కరుణామయచ్ఛాయతోన
తాను నీ చండకిరణప్రతాప మెల్ల
కప్పి వైచుట కిద్దియె కారణమ్ము || 

సమస్యాపూరణం -758 (తల్లిబాసను రోసిరి)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

తల్లిబాసను రోసిరి పిల్లలెల్ల.

ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

కవిమిత్రుల పూరణలు

౧. గోలి హనుమచ్ఛాస్త్రి
    జన్మనిచ్చిన గ్రామంబు 'ఛాఛ' బోరు
    కజ్జ కాయలు తల్లీయ 'పిజ్జ' గోరు
    మమ్మి యనుగాని యిమ్ముగ నమ్మ యనరు
    తల్లిబాసను రోసిరి పిల్లలెల్ల.
*     *     *     *     *
౨. లక్ష్మీదేవి
    నల్లరంగును పులుమగ నాగ సంతు
    నకును, కద్రువ యిచ్చు నానతిని విన్న
    వెంటనే విస్మయమునంది వికృతమయిన 

    తల్లిబాసను, రోసిరి పిల్లలెల్ల .
(బాస = ప్రతిజ్ఞ)
*     *     *     *     *
౩. సుబ్బారావు
    ఆదరించుము మనసార హాయి గొలుపు
    తల్లి బాసను, రోసిరి పిల్ల లెల్ల
    రాంగ్ల భాషను జదువగ యావ లేక;
    దేశ భాషల యందున తెలుగు లెస్స .
*     *     *     *     *
౪. హరి వేంకట సత్యనారాయణ మూర్తి
(1)
    విత్తమును గోరి ధర్మంబు విడిచిపెట్టి
    సంబరంబున దేశాంతరంబు జేరి
    తల్లిదండ్రులె గృహమున దలవనపుడు
    తల్లిబాసను రోసిరి పిల్లలెల్ల.
(2)
    తారతమ్యము లేదు సోదరులమనుచు
    ప్రతిన బూనిరి పౌరులు బాల్యమందు
    కులము పేరిట దేశాన గొడవలేల?
    తల్లి! బాసను రోసిరి పిల్లలెల్ల.
*     *     *     *     *
౫. చంద్రమౌళి
    తండ్రి తాష్కేంటు జ్ఞాని యాంధ్రమ్మురాని
    మహిళ జతగూడి తామెచ్చి మనువునాడె
    రాదు భాషను మాటాడ రష్య పిన్న
    తల్లిబాసను రోసిరి పిల్లలెల్ల.

*     *     *     *     *
౬. గన్నవరపు నరసింహ మూర్తి
(1)

    తేనె లూరెడి కమ్మని తెలుగు నెట్టి
    అఱకొఱయు లేక నిత్యము నాంగ్ల మందు
    పలుకు చుండగ హృదిలోన ములు దిగంగ

    తల్లి బాసను రోసిరి పిల్ల లెల్ల.
(2)
    వాలమును బట్టి వ్రేలాడ వాజి నొకఁడు
    పంతమున గెల్తు, దాస్యంబు వాయు నాకు
    ననగ కద్రువ(యు) నొల్లక యనయమునకుఁ
    దల్లి బాసను రోసిరి పిల్ల లెల్ల !
*     *     *     *     *
౭. గుండు మధుసూదన్
    నేఁటి తలిదండ్రు లెంతయో నిష్ఠ తోడ
    నాంగ్ల మాధ్యమ విద్యల నందఁ జేయఁ
    దెలుఁగు మాట్లాడుటయె యప్రతిష్ఠ యనుచుఁ
    దల్లి భాషను రోసిరి పిల్ల లెల్ల!

*     *     *     *     *
౮. పండిత నేమాని
    తెలుగు బాసయె లెస్స దేశభాషలలోన
              నను కృష్ణరాయు వాక్యము గతించె
    ఇటలీయ భాషకు నీస్టులో సమమైన
              బాస తెలుంగను ప్రథయు డుల్లె
    తేటతెనుగు మాది సాటిలేనిది యను
              మంచి పేరేనియు మాసిపోయె
    సరస వాఙ్మయ మహా సంపన్నమన నొప్పు
              వైభవంబేనియు వ్యర్థమయ్యె
    ఆదరణలేక విలవిల లాడె తెలుగు
    మంచి యుద్యోగముల నిచ్చు మాయ భాష
    లనెడు మోజుతో నభిమానమును త్యజించి
    తల్లి బాసను రోసిరి పిల్ల లెల్ల.
*     *     *     *     *
౯. ఊకదంపుడు
(తల్లి "అమ్మా" అన్న పిలుపే నేర్పుకుంటే - పిల్లలు మమ్మీ అని పిలవరు కదా..పిల్లలకన్నా - తల్లి, తండ్రి గురువులు అనుసరిస్తున్న విధానం వల్లే, పిల్లల పరిస్థితి మన భాష పరిస్థితి ఇలా ఉందని నా అనుకోలు.)
    తమిళులకరణి, కన్నడతమ్ములవలె
    గాక, ఆంధ్రలోపుట్టినకారణమున
    తల్లి,తండ్రిగురువులుపధ్ధతిని మీర-
    తల్లి బాసను రోసిరి పిల్ల లెల్ల.
*     *     *     *     *
౧౦. సహదేవుడు
    భరత పట్టాభిషేకమ్ముజరుపమనుచు
    మునుపటి వరములను గోరె కినుకఁ బూని

    రామవనవాస మెంచెను ప్రేమ మఱచి
    తల్లి! బాసనురోసిరి పిల్లలెల్ల!

*     *     *     *     *
౧౧. రాజేశ్వరి నేదునూరి
    ఆధునిక మని యా తల్లు లంగ లార్చి
    యితర దేశము లందున వెతలు దీరు
    నమ్మ ప్రేమకు తాకట్టు మమ్మి యనగ
    తల్లి బాసను రోసిరి పిల్ల లెల్ల !
*     *     *     *     *
౧౨. కమనీయం
    పల్లెటూరి యందాలను బాసి,నగర
    వాసవిలాసాల మరగి ,పరుల భాష
    నింగిలీషు నుపాధికై నేర్చి నేడు
    తల్లిబాసను రోసిరి పిల్లలెల్ల .

పద్య రచన - 45


కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.

కవిమిత్రుల పద్యములు

౧. గోలి హనుమచ్ఛాస్త్రి
    తాటక నిలువుము నిను బం
    తాటగ నే నాడుకొందు ధైర్యము గలదా?
    తాటను దీసెద నటుపై
    తాటాకును గాల్చినట్లు తగులంబెడుదున్!
*     *     *     *     *
౨. హరి సత్యనారాయణ మూర్తి
    లోకహితమును గోరుచు నేకదీక్ష
    యజ్ఞయాగాది క్రతువుల ననవరతము
    చేయు చుండెడి సన్మునిశ్రేష్ఠులకును
    విఘ్నములు గూర్తు రసురులు వివిధగతుల.

    దుష్టులను గూల్చి యణగించి దుర్మతులను
    ధర్మరక్షణ చేయుచు ధైర్యమొసగి
    సాధుజనులను గాచుట క్షత్రియులకు
    విహితధర్మంబు చూడగ విశ్వమందు.

    గాధినందను డొనరించు క్రతువు నపుడు
    భంగ మొనరింప బూనిన పరమనీచు
    లైన రక్కసిమూకను యముని పురికి
    రామ చంద్రుండు పంపించె రయము మీర.

    అతివనైనను దుర్మతి యగుచు మీరి
    సజ్జనాళిని బాధించి సవనములకుఁ
    గీడు కలిగింపఁ బూనిన నాడు దానిఁ
    జంప దగునిందు లేదింత సందియంబు.
*     *     *     *     *
౩. పండిత నేమాని
    రామచంద్రుండును లక్ష్మణుడును తండ్రి
              యానతి తలదాల్చి మౌనివర్యు
    డైన విశ్వామిత్రు యజ్ఞరక్షణకునై
              శస్త్రపాణులగుచు జనుచునుండ
    తాటకావనమున దైత్యాంగన మహాభ
              యాకృతితో నిల్చి యభ్రమందు
    రామచంద్రునిపైకి లంఘించు తరుణాన
              ముని యానతి ప్రకారముగ శరమ్ము
    నామెపై వేయ నతుల భయంకరముగ
    నామె వక్షస్థలము జీల్చె నా శరమ్ము
    ఘోరముగ రొప్పుచును దైత్య కూలెనంత
    హర్షమున ముని శ్రీరాము నభినుతించె

    తీరెను శాపమామెకు క్షితిన్ రఘురాముని దర్శనమ్ముతో
    పేరు ముదమ్ము తోడ రఘువీరుని పాదములంటి మ్రొక్కి యా
    సారసనేత్ర పొందె తన చక్కని యక్షిణి రూపమంతటన్
    జేరి నిలింప బృందములు శ్రీరఘురాము నుతించి రాదృతిన్.

*     *     *     *     *
౪. లక్ష్మీదేవి
    రాముని శౌర్యమెల్లెడల రాజిల జేసిన ఘట్టమియ్యదే!
    కోమలుడైన బాలుడిట ఘోరత రక్కసి జంపెజూడుడీ!
    శ్యామలదేహుడవ్వనిని జన్నము గావగ వచ్చె దానహో!
    మైమరపించు దృశ్యమది, మంగళముల్ గొను రాఘవా! సదా!

*     *     *     *     *
౫. సుబ్బారావు
    తాటకి నాబడు రక్కసి
    దీ టు గ నాకసము నుండి దిగువకు జూడన్
    పో టు గ రాముం డ య్యె డ
    నాటెను శరమొకటి దైత్య నాయిక యెదపై.
*     *     *     *     *
౬. రాజేశ్వరి నేదునూరి
    గాదేయు డడిగె రాముని
    బాధించెడి తాటకిఁ జంపఁ బంపు మటంచున్ !
    వేధించు సంశయమునను
    బాధగ పంపెను తనయుని పసివా డనుచున్ !
*     *     *     *     *
౭. కమనీయం
(1)
    వనిత దీనిని జంపగా వలవదనుచు
    సందియమునొందు యారామచంద్రు తోడ
    తాటకాఖ్య రాక్షసి యిది తగదు జాగు
    అనుచు బోధించె కౌశికుండాత్రముగను.
(2)
    ధ్వంసమొనరించె జనావాస పదములెన్నొ
    దుష్ట చిత్త,భీకరరూప ,దురితచరిత,
    దీని నుపేక్షింపగ రాదు స్త్రీ యటంచు
    సత్వరము ప్రయోగింపుము శస్త్రములను.
 

వైవిధ్య సంగీత కార్యక్రమం ‘ఆద్యక్షరి’

                   వాగ్గేయకార వైభవ ‘ఆద్యక్షరి’

          అంత్యాక్షరి తెలుసుకాని, ఈ "ఆద్యక్షరి" ఏమిటి?! కొత్తగా ఉందే! అనుకుంటున్నారా?....... కాస్త ముందుకు పదండి, మీకే తెలుస్తుంది.  
మూడు సంవత్సరముల క్రితం కొంతమంది తెలుగుభాషాభిమానులు పూనుకొని మా ఊళ్ళో (మంచిర్యాలలో) "సాహితీ సంరక్షణ సమితి" అనే సంస్థను ఆరంభించారు. ఈ సంస్థ ఆధ్వర్యములో ప్రతి నెల 3వ, 4వ ఆదివారపు సాయంత్రాల్లో సాహిత్యసమావేశములు జరుగుతుంటాయి. నేను కూడా ఈ సంస్థలో సభ్యుడినే! సాధారణంగా కవిసమ్మేళనము, ఒక సాహితీప్రసంగం ఏర్పాటు చేస్తుంటారు. నేను సైతం కొన్ని సాహిత్యప్రసంగములు చేశాను లోగడ! 

 ఐతే, ఒకే మూసలో వెళ్తున్న కార్యక్రమాలకు కొంత వైవిధ్యం తీసుకువస్తే బాగుంటుందనే ఆలోచనతో, ఇటీవల నేను ఒక క్రొత్త ప్రయోగం చేశాను. దాని గురించి మీకు తెలపడమే ఈ వ్యాసం యొక్క ఉద్దేశం. 
 
మనకు అన్నమాచార్యుడు, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య, తూము నరసింహదాసు, సదాశివబ్రహ్మేంద్రస్వామి, నారాయణతీర్థులు, జయదేవుడు మొదలైన వాగ్గేయకారులు ఎందరో ఉన్నారు. వారందరూ భగవంతుణ్ణి స్తుతిస్తూ ఎన్నో కీర్తనలు, కృతులు రచించి, గానం చేశారు. వీరి కీర్తనలను ఆధారం చేసుకుని, నేను ఈ నూతనప్రక్రియకు రూపకల్పన చేశాను. 
 
సెప్టెంబరు నెలలోని 3వ ఆదివారమైన 18/09/2011 నాటి సాయంత్రం మావూళ్ళోని శ్రీ సరస్వతీ శిశుమందిర్ పాఠశాల ప్రాంగణములో పై కార్యక్రమాన్ని నిర్వహించాను. 

రండి! మీరు కూడా ఈ కార్యక్రమములో పాలుపంచుకొని ఆనందించండి! 

ఆనాటి సమావేశానికి స్థానిక మధురగాయకులు పి.దక్షిణామూర్తిగారు అధ్యక్షత వహించారు. స్థానిక సంగీత విద్వాంసురాలు శ్రీమతి నెమలికొండ వైదేహిగారు, ఇక్కడి సీనియర్ మోస్ట్ వైద్యులు డాక్టర్ విష్ణువర్ధన్ రావుగారు, ప్రముఖ నేత్రవైద్యులు డాక్టర్ బద్రినారాయణగారు ముఖ్య అతిథులుగా వేదికను అలంకరించారు. అధ్యక్షులవారి తొలిపలుకుల అనంతరం, నేను కొద్దిసేపు ప్రసంగించాను... ఈ క్రిందివిధంగా!

"సంగీతము, సాహిత్యము చదువులతల్లి సరస్వతి యొక్క స్తనద్వయంగా అభివర్ణించారు మన పూర్వీకులు! జ్ఞానపీఠ అవార్డుగ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డిగారు ఒక పాటలో
"సంగీత సాహిత్య సమలంకృతే! స్వరరాగ పదయోగ సమభూషితే!" అని ప్రస్తుతించారు ఆ శారదామాతను. ఒక సంగీతవిద్వాంసుడు తన పాటకచ్చేరీల ద్వారా సరస్వతీమాతను అలరిస్తాడు, అంటే ఆయన సంగీతమార్గములో ఆ దేవిని అర్చిస్తున్నాడు. ఒక కవీశ్వరుడు తన కావ్యముల ద్వారా వాణీమాతను సేవిస్తాడు, అనగా ఆయన సాహిత్యమార్గములో ఆ తల్లిని పూజిస్తున్నాడు. ఐతే, వీరిద్దరికన్నా వాగ్గేయకారులు ధన్యజీవులు! వారు అద్భుతమైన తమ రచనలతో తెలుగుసాహిత్యమును పరిపుష్టం చేయడమే కాకుండా, ఆ కీర్తనలు/కృతులకు స్వరాలు సమకూర్చి, రాగయుక్తంగా పాడి జగత్తును అలరించారు. ఏకకాలంలో సరస్వతీదేవికి ప్రియమైన 2 మార్గాలలో (సంగీత సాహిత్యాలు) వారు విద్దెలరాణిని ఆనందింపజేశారు. 

అటువంటి ధన్యజీవులైన వాగ్గేయకారులపై నేనొక కార్యక్రమమును రూపొందించాను. ప్రసంగరూపములో వారందరి గురించి చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. అందుకని తక్కువ సమయములో వీలైనంత ఎక్కువమంది వాగ్గేయకారులను, వారి కీర్తనలను మీకు పరిచయం చేయాలనే తలంపుతో నేను 
"వాగ్గేయకార వైభవ ఆద్యక్షరి" పేరుతో ఒక వినూత్న ప్రక్రియను మీ ముందుకు తెస్తున్నాను. 

"అంత్యాక్షరి"
 అంటే అందరికీ తెలిసినదే, ఒకరు పాడిన పాటలోని చివరి అక్షరాన్ని అందుకుని, దానితో ఆరంభమయ్యే మరో పాటను మరొకరు పాడడమే "అంత్యాక్షరి". ఈ ఆట ఆడడానికి ఒకరికన్నా ఎక్కువ వ్యక్తులు అవసరం... మరి, ఈనాటి కార్యక్రమాన్ని నిర్వహించేది నేనొక్కడినే కనుక, దీనికి "ఆద్యక్షరి" అని నామకరణం చేశాను; అనగా మొదటి అక్షరం! ఈ సభకు విచ్చేసిన సాహితీమిత్రులు, శ్రోతలు ఎవరైనా నాకు ఒక అక్షరం చెప్పాలి. ఆ అక్షరముతో ఆరంభమయ్యే కీర్తన/కృతి/తరంగం/అష్టపది ఏదైనా నేను అప్పటికప్పుడు స్ఫురణకు తెచ్చుకుని, అది ఎవరి రచనో చెప్పి, పల్లవి పాడి వినిపించాలి. నాకు బాగా తెలిసిన కీర్తన ఐతే, పల్లవితో పాటు చరణములు కూడా వినిపిస్తాను. నా చేతిలో ఏవిధమైన కాగితాలు గాని, నోట్స్ గాని ఉండవు; కేవలం నా జ్ఞాపకశక్తి, ధారణలే ఆధారం!..."అంత్యాక్షరి" కన్నా ఈ "ఆద్యక్షరి" కొంత కఠినమైనదని చెప్పవలసివుంటుంది. ఎందుకంటే, "అంత్యాక్షరి" లోని సినిమాపాటలు అందరికీ తెలిసేవుంటాయి. కనుక పాడే పాటలోని చివరి అక్షరం ఏమైవుంటుందో ఊహించుకుని, తర్వాతి పాటకు సిద్ధంగా ఉండవచ్చు. "ఆద్యక్షరి" లో అటువంటి సౌకర్యం లేదు. అక్షరం చెప్పినదే తడవుగా పాట వినిపించవలసివుంటుంది, ఆ పాట కూడా కేవలం వాగ్గేయకారుల రచనే అయివుండాలి.

తెలుగు వర్ణమాలలోని 
"అ" నుండి "క్ష" వరకు గల అక్షరాల్లో ఏదైనా మీరు అడగవచ్చు. ఐతే, ఒక విన్నపం! దయచేసి, మహాప్రాణాక్షరములను (ఒత్తు అక్షరాలను) మాత్రం అడగవద్దు. ఎందుకనగా, ఒత్తు అక్షరాలతో ఆరంభమయ్యే కీర్తనలు అతి తక్కువగా, ఒకటి, రెండు అక్షరాలకు మాత్రమే పరిమితమై ఉన్నాయి. 

ముందుగా ముఖ్యమైన కొందరు వాగ్గేయకారుల గురించి సంక్షిప్తంగా పరిచయం చేస్తాను" అని చెప్పి, అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, తూము నరసింహదాసు, క్షేత్రయ్య, జయదేవుడు, సదాశివబ్రహ్మేంద్రస్వామి. నారాయణతీర్థులు మున్నగువారి రచనల గురించి, వారి జీవితకాలాల గురించి క్లుప్తంగా చెప్పాను. 

ఆ తర్వాత 
"ఆద్యక్షరి" కొనసాగింది ఉత్సాహంగా! 

ప్రథమంగా ముత్తుస్వామిదీక్షితార్ గారి సుప్రసిద్ధ కీర్తన 
"వాతాపి గణపతిం భజేహం" తో వినాయక ప్రార్థన చేశాను. తర్వాత సభకు వచ్చిన శ్రోతలందరినీ ఉద్దేశించి "ఎందరో మహానుభావులు! అందరికీ వందనములు" పల్లవి ఆలపించాను. త్యాగరాజుగారి ప్రసిద్ధ పంచరత్నకీర్తనలులో ఇది ఒకటి. 

ఆ పిమ్మట శ్రోతలను అక్షరాలు ఇవ్వవలసిందిగా అభ్యర్థించాను. 

మొట్టమొదటగా ఒక శ్రోత లేచి 
"న అక్షరముతో అన్నమాచార్య కీర్తన వినిపించండి" అని కోరారు. "వాగ్గేయకారులలో ప్రాచీనుడు, పదకవితా పితామహుడైన అన్నమయ్య కీర్తనను ప్రప్రథమంగా ఆలపించే అవకాశం రావడం సముచితంగానూ, సంతోషంగానూ ఉంది. ఇది చాలా మధురమైన కీర్తన. ఇందులో కేవలం ఆ శ్రీమన్నారాయణుని వివిధనామాల సంకీర్తనే తప్ప, మరొక విషయం ఏదీ లేదు" అని చెప్పి "నారాయణతే నమో! నమో! భవ నారద సన్నుత నమో! నమో!" కీర్తనను పల్లవితో పాటు 2 చరణములు పాడి వినిపించాను. శ్రోతలంతా నిశ్శబ్దంగా విన్నారు; ఆ తర్వాత వారి కరతాళధ్వనులతో హాలంతా మారుమ్రోగిపోయింది. 

వెంటనే మరొక శ్రోత 
"స" అక్షరం అడిగారు. "రామదాసు కీర్తన వినండి, చాలా బాగుంటుంది" అని చెప్పి "సీతారామస్వామీ! నే చేసిన నేరములేమీ!" అనే కీర్తన పల్లవి, ఒక చరణం ఆలపించాను.

పిమ్మట 
"మ" అక్షరంతో చెప్పమన్నారు. "మరుగేలరా ఓ రాఘవా!" అనే త్యాగరాజకృతి పల్లవిని వినిపించాను. "ఇదే అక్షరంతో సదాశివబ్రహ్మేంద్రులవారి రచన కూడా వినండి; చక్కని కీర్తన" అని చెప్పి "మానస సంచరరే!" పల్లవి, ఒక చరణం వినిపించాను 

తదుపరి ఒక మహిళాశ్రోత 
"హ" అక్షరం ఇచ్చారు. "హరిహరి! రామ! నన్నరమర చూడకు!" అనే రామదాసు కీర్తన పల్లవి పాడాను. 

అటుపిమ్మట 
"వ" అక్షరంతో చెప్పమని కోరారు. "విన్నపాలు వినవలె వింతవింతలూ" అనే అన్నమయ్య కీర్తన పల్లవి, ఒక చరణం వినిపించాను. 

తదనంతరం "ఇ" అక్షరం అడిగారు. రామదాసుగారి అద్భుత కీర్తన 
"ఇక్ష్వాకు కులతిలకా! ఇకనైనా పలుకవే రామచంద్రా!" పల్లవితో పాటు దాదాపు మొత్తం కీర్తన ఆలపించాను. ఈ కీర్తనలో రామదాసుగారు తాను సీతారాములకు, లక్ష్మణ భరత శత్రుఘ్నులకు చేయించిన స్వర్ణాభరణముల గురించి వర్ణించారు. ఆయన బాధ, ఆక్రోశం చివరి చరణాల్లో బాగా వ్యక్తపరచబడింది. శ్రోతలందరూ మంత్రముగ్ధులై ఆలకించారు... తర్వాత ఇదే అక్షరంతో"ఇప్పుడిటు కలగంటి" అనే అన్నమాచార్య కీర్తన పల్లవి, ఒక చరణం పాడాను. 

ఆ తర్వాత ఒక సోదరీమణి 
"య" అక్షరముపై వినిపించమన్నారు. జయదేవ కవీంద్రుని అష్టపది "యారమితా వనమాలినా" పల్లవి, ఒక చరణం వినిపించి, వెనువెంటనే త్యాగయ్యగారి "యోచనా?... కమలలోచనా నను బ్రోవ!" అనే కృతి పల్లవి పాడాను. 

ఆపై 
"బ" అక్షరం వచ్చింది. అన్నమయ్యగారి సుప్రసిద్ధ కీర్తన "బ్రహ్మ కడిగిన పాదమూ"పల్లవి, ఒక చరణం ఆలపించాను. 

తదుపరి ఒక మిత్రుడు 
"శ్రీ" తో ప్రారంభమయ్యే కీర్తన కావాలని అడిగారు. వెంటనే రామదాసుగారి "శ్రీరామ! నీ నామమేమి రుచిరా!" కీర్తన పల్లవి, 2 చరణాలు పాడాను. 

పిమ్మట 
"ఆ" అక్షరం అడిగారు. నారాయణతీర్థులవారి "ఆలోకయే శ్రీ బాలకృష్ణం" అనే తరంగం పల్లవి వినిపించాను. 

ఇంతలో ఒక శ్రోత మళ్ళీ 
"న" అక్షరముతో కావాలని కోరారు. వారి కోరికను మన్నిస్తూ తూము నరసింహదాసుగారి "నిద్రాముద్రాంకితమైన నీ కన్నుల నీటు చూడగగల్గెనూ" అనే అందమైన కీర్తన పల్లవి, ఒక చరణం పాడాను. భగవంతుణ్ణి మేలుకొలిపే కీర్తనలు మనకు చాలా ఉన్నాయి. ఐతే, ఈ కీర్తనలో నరసింహదాసుగారు నిద్రిస్తున్న ఆ పరంధాముని సౌందర్యాన్ని అద్భుతంగా వర్ణించారు... నరసింహదాసుగారివి చాలా చక్కని కీర్తనలు. 

తర్వాత 
"గ" అక్షరం వచ్చింది. "గోవింద! గోవింద! యని కొలువరే!" అనే అన్నమయ్య కీర్తన పల్లవి, ఒక చరణం ఆలపించాను. 

పిదప మరొక మిత్రుడు "ద" అక్షరం ఇచ్చారు. 
"దీనదయాళో! దీనదయాళో! దీనదయా పరదేవ దయాళో!" అనే రామదాసు కీర్తన పల్లవి, ఒక చరణం పాడాను. ఇదే అక్షరంతో తూము నరసింహదాసుగారి "దొర వలె కూర్చున్నాడూ! భద్రగిరినాథు డితడేమొ చూడూ!"కీర్తన పల్లవిని సైతం వినిపించాను. 

తదుపరి ఒక సోదరి 
"ల" అక్షరంతో పాడమని కోరారు. "లాలనుచు నూచేరు లలన లిరుగడలా" అనే అన్నమాచార్య కీర్తన పల్లవితో పాటు ఒక చరణం పాడాను. 

పిమ్మట "ర" అక్షరం ఇవ్వబడింది. రామదాసుగారి మనోహరమైన కీర్తన 
"రామచంద్రులు నాపై చలము చేసినారూ! సీతమ్మా! చెప్పవమ్మా!" పల్లవి, ఒక చరణం ఆలపించాను. ఈ కీర్తనలో రామదాసుగారు తన బాధ, ఆవేదన, దుఃఖముతో కూడిన వెటకారం ఎంతో బాగా వ్యక్తీకరించారు. కాస్త భావుకులైనవారు ఈ కీర్తనను ఆలపించినా, ఆలకించినా కంట నీరు తిరగడం ఖాయం! 

తదనంతరం ఒక మిత్రుడు 
"అం"తో పాడమన్నారు. అన్నమయ్యగారి "అంతయు నీవే హరి! పుండరీకాక్షా!" కీర్తన పల్లవితో పాటు ఒక చరణం పాడాను. ఇది కూడా చక్కని కీర్తన. ప్రతి పంక్తి చివరన ఆ శ్రీహరి నామాల్లో ఏదో ఒకటి వస్తుంటుంది. 

తర్వాత ఇంకొక శ్రోత "జ" అక్షరం ఇచ్చారు. 
"జయజయ రామ! సమరవిజయ రామ!" అనే అన్నమాచార్య కీర్తన పల్లవి వినిపించాను. దానితో పాటు, తెలుగునాట ప్రతి తల్లికీ తెలిసిన"జో అచ్యుతానంద! జోజో ముకుందా! రావె పరమానంద! రామగోవిందా!" పల్లవి కూడా ఆలపించాను. ఇది అన్నమయ్యగారి కీర్తన అనే సంగతి చాలామందికి తెలియకపోవడం విశేషం!.. ఐతే, ఆ శ్రోత "త్యాగరాజకృతి వినిపించలేరా?" అని అడిగారు. వారి అభ్యర్థనను గౌరవిస్తూ "జగదానంద కారకా! జయ జానకీ ప్రాణనాయకా!" పల్లవి పాడాను. సుప్రసిద్ధమైన త్యాగరాజ పంచరత్న కీర్తనలులో ఇది కూడా ఒకటి. 
"ఆద్యక్షరి" లో "నిషిద్ధాక్షరి" :

అష్టావధానంలోని 8 అంశములలో "నిషిద్ధాక్షరి" అనేది ఒకటి. మీలో కొంతమందికి దీని గురించి తెలిసేవుంటుంది. తెలియనివారి కొరకు కాస్త వివరిస్తాను... అవధానికి పృచ్ఛకుడు ఏదైనా ఒక టాపిక్ ఇచ్చి, దానిపై పద్యం చెప్పమని అడుగుతాడు. అవధాని పద్యాన్ని ప్రారంభించిన తర్వాత 
"ఇక్కడ ఈ అక్షరం రాకూడదు" అని మధ్యమధ్యలో షరతులు విధిస్తుంటాడు. ఆ, యా అక్షరాలు రాకుండా, ఇతర అక్షరములను ఉపయోగించి అవధాని పద్యమును పూర్తిచేయవలసివుంటుంది. ఇదే "నిషిద్ధాక్షరి"!... ఈ "నిషిద్ధాక్షరి" ప్రస్తావన ఇప్పుడెందుకంటారా?... నా కార్యక్రమములో కూడా కొందరు సాహితీమిత్రులు ఈవిధమైన పరీక్షనే పెట్టారు నాకు! 

ఒక మిత్రుడు 
"అ" అక్షరముతో పాడమని అడిగి "అదివో! అల్లదివో! శ్రీహరివాసమూ! మాత్రం వద్దు" అన్నాడు. నేను అప్పుడు అన్నమయ్యగారిదే మరో కీర్తన "అన్ని మంత్రములు ఇందే ఆవహించెనూ!" పల్లవి, ఒక చరణం పాడి వినిపించాను. 

తర్వాత మరో మిత్రుడు పై తరహాలోనే "ప" అక్షరం ఇస్తూ 
"పలుకే బంగారమాయెనా!"వద్దన్నారు. "పలుకుతేనెల తల్లి పవళించెనూ!" అనే అన్నమాచార్య కీర్తన పల్లవి, ఒక చరణం ఆలపించి ఆయనకు సంతృప్తిని కలిగించాను. శృంగారపరమైన ఈ కీర్తన సభికులందరికీ అమితంగా నచ్చింది. 
సమయాభావము :

ఈ దశలో కార్యక్రమ నిర్వాహకులు కల్పించుకుని 
"తర్వాత కవిసమ్మేళనం ఉంది కనుక, చరణాలు పాడుతూ పోతే కాలాతీతం అవుతుందనీ, కేవలం పల్లవులు మాత్రమే ఆలపించమనీ, ఒక అక్షరానికి ఒక్క కీర్తన మాత్రమే వినిపించమని" అన్నారు. అందువల్ల మిగతా కార్యక్రమాన్ని కాస్త వేగవంతం చేయవలసి వచ్చింది; ఇక్కడినుండి కేవలం పల్లవులే పాడాను. 

తదుపరి ఒక మహిళాశ్రోత 
"చ" అక్షరముతో పాడమన్నారు. "చూడగల్గెను రాముని సుందరరూపమూ!" అనే తూము నరసింహదాసు కీర్తన పల్లవి పాడాను. 

పిమ్మట మరొక శ్రోత "డ" అక్షరం అడిగారు. అన్నమయ్య కీర్తన 
"డోలాయాంచల డోలాయాం! హరే! డోలాయాం!" ఆలపించాను. 

తర్వాతి శ్రోత 
"త" అక్షరం ఇచ్చారు. "తక్కువేమి మనకూ రాముండొక్కడుండు వరకూ!"అనే రామదాసు కీర్తన వినిపించాను. ఈ కీర్తనలో రామదాసుగారు శ్రీమహావిష్ణువు యొక్క దశావతారములను వర్ణించారు. 

ఇంతకుముందు 
"అ" అక్షరాన్ని అడిగిన మిత్రుడు మళ్ళీ లేచి "వర్ణమాలలోని మొదటి అక్షరమైన ' అ ' తో పాడారు; చివరి అక్షరమైన ' క్ష ' తో పాడగలరా?" అని ప్రశ్నించారు."పాడగలనండీ!" అని "క్షీరాబ్ధికన్యకకు శ్రీమహాలక్ష్మికిని నీరజాలయకును నీరాజనం" అనే అన్నమాచార్య కీర్తన ఆలపించాను. 

పిదప ఇంకొక శ్రోత 
"ఏ" అక్షరం ఇచ్చారు. రామదాసు కీర్తన "ఏ తీరుగ నను దయ జూచెదవో ఇనవంశోత్తమ! రామా!" పాడి వినిపించాను. 

తదుపరి ఒక సోదరి 
"క" అక్షరం అడిగారు. "కొండలలో నెలకొన్న కోనేటిరాయడు వాడూ!"అనే అన్నమయ్య కీర్తన ఆలపించాను. 

మరొకరు "ఉ" తో చెప్పమన్నారు. 
"ఉన్నాడో లేడో భద్రాద్రియందు" అనే రామదాసు కీర్తన వినిపించాను. 

తర్వాతి శ్రోత 
"ఒ" అక్షరం ఇచ్చారు. "ఒకపరి కొకపరి ఒయ్యారమై" అనే అన్నమాచార్య కీర్తన పాడాను. 

వెంటనే మరొకరు 
"ఓ" తో అడిగారు. రామదాసు కీర్తన "ఓ రఘువీరా! యని నే పిలిచిన ఓహో యనరాదా!" వినిపించాను. 

అటుపిమ్మట "ఊ" అక్షరం వచ్చింది. 
"ఊరకయే కలుగునా రాముని భక్తి" అనే త్యాగరాజ కృతి ఆలపించాను. 

ఇంకొక సభికుడు 
"ఎ" అక్షరంతో పాడమన్నారు. "ఎక్కడి మానుషజన్మం బెత్తిన ఫలమేమున్నది?" అనే అన్నమయ్య కీర్తన పాడాను. 

తదనంతరం ఒక శ్రోత 
"ఔ" అక్షరం అడిగారు. అన్నమయ్యదే మరో కీర్తన "ఔనయ్యా జాణడవు! ప్రహ్లాదవరదా!" వినిపించాను. 

తర్వాత మరొకరు 
"ఈ" అక్షరముతో కోరారు. "ఈశ్వరాజ్ఞ ఏమో తెలియదు!" అనే కీర్తన పల్లవి పాడాను. ఐతే, ఈ కీర్తన వ్రాసిన కవి యెవరో మాత్రం నాకు తెలియదు; ఎవరో అజ్ఞాత కవీశ్వరుడు!

దీనితో తెలుగు వర్ణమాలలోని అన్ని అక్షరాలూ పూర్తయినవి. ఆ శారదామాత కృప వలన నేను ఏ అక్షరానికీ తడుముకోవడంగానీ, తత్తరపడడంగానీ జరగలేదు. శ్రోతలు అడిగినదే తడవుగా వెనువెంటనే ఆ, యా కీర్తనలు పాడగలిగాను. గంటకు పైగా సాగిన కార్యక్రమంలో మొత్తం 41 కీర్తనలు ఆలపించాను. 

సాధారణంగా సాహిత్యసమావేశాలకు మహిళలు తక్కువగా వస్తుంటారు. కాని, ఆనాటి కార్యక్రమానికి స్త్రీలు చెప్పుకోదగిన సంఖ్యలో రావడమే కాక, ఉత్సాహంగా పాల్గొని నాకు అక్షరములు ఇవ్వడం చాలా సంతోషాన్ని కలిగించింది. 

ఇంక చివరిగా, రామదాసుగారి మంగళాశాసనం 
"రామచంద్రాయ! జనకరాజజా మనోహరాయ! మామకాభీష్టదాయ! మహిత మంగళం!" అనే మంగళహారతితో కార్యక్రమమును ముగించాను. ఈ హారతి పాట పాడేటప్పుడు శ్రోతలందరూ చప్పట్లు చరుస్తూ, నాతో గొంతు కలిపి పాడుతూ తమ ఆనందమును వ్యక్తం చేయడం ఎంతో సంతృప్తిని కలిగించింది. 

ఆ తర్వాత పలువురు పురప్రముఖులు, సాహితీవేత్తలు వేదిక పైకి వచ్చి 
"అద్భుతమైన కార్యక్రమం ఈనాడు చూడగలిగామనీ, ఇటువంటి వినూత్న ప్రక్రియ గురించి ఎప్పుడూ విననైనాలేదని" ప్రశంసించారు. 

చదువరులందరికీ ఒక విన్నపం! దయచేసి దీనిని స్వోత్కర్ష (సొంతడబ్బా) గా భావించకండి! నా మనసుకు కలిగిన ఆనందమును మీ అందరితో పంచుకోవాలనే ఉబలాటమే నన్ను ఈ వ్యాసరచనకు ప్రేరేపించింది. 

ఇది చదివిన మిత్రులంతా తమ అభిప్రాయమును కామెంట్ రూపములో తెలపాలని కోరుతున్నాను. కామెంట్ వ్రాసే అవకాశం లేనివారు, క్రింద ఇస్తున్న నా మొబైల్ నంబరుకు ఫోన్ చేసి నాతో మాట్లాడవచ్చు! 

భవదీయుడు,

సత్యనారాయణ పిస్క,

మొబైల్ : 9849634977.

8, జులై 2012, ఆదివారం

చమత్కార (చాటు) పద్యాలు - 204

భోజరాజు వింత కోరిక

భోజరాజున కొకనాఁడు పొడమె నొక్క
వింత కోరిక, “నే మరణింతు నేని
యెట్లు స్పందింతు?” వనుచు ప్రశ్నించెఁ గాళి
దాసు; నది విని వెఱగంది “తప్పు గాదె
యిట్లు మాటాడ, నే నిప్పు డిట్టి శ్లోక
మొక్కటైనను విన్పించ నొప్ప” ననెను;
కుపితుఁడై రాజు “నామాట గౌరవింప
కిట్లు రాజాజ్ఞధిక్కార మెంతొ చేసి
నాఁడ, విపుడె నా రాజ్యము వీడు” మనఁగ,
వెడలె తనయిచ్చ వచ్చిన కడకుఁ గవియు;
కొంతకాలము గడచిన యంత కాళి
దాసు లోపమ్ము గుర్తించి ధరణిపతియు
మారువేషమ్ముతోడ నూరూరు దిరిగి
వెదకుచుండఁగ నొకచోఁ గవిం గనుఁగొని
వందనము సేయ “నెవఁడ? వేపట్టణమ్ము
నీ?” దనుచు పృచ్ఛ సేయఁగా “నే నొకప్పు
డుంటి ధారానగరమునఁ, గంటికివెలుఁ
గైన భోజుఁడు మరణింప నది విడిచితి”
ననఁగ, నామాటలు విని యత్యధిక దుఃఖ
వివశుఁడై శ్లోక మొక్కటి వినిచె నిట్లు

“అద్య ధారా నిరాధారా
నిరాలంబా సరస్వతీ |
పండితాః ఖండితా స్సర్వే
భోజరాజే దివంగతే ||”

కొర్కె తీరిన భోజుఁడు గూలి మడిసెఁ;
బడిన భూపతిఁ గని గుర్తుపట్టి ఖేద
మంది యుమఁ గొల్చి శ్లోకము నచ్చటచట
స్వల్పభేదముల్ గల్పించి పలికె నిట్లు

“అద్య ధారా సదాధారా
సదాలంబా సరస్వతీ |
పండితాః మండితా స్సర్వే
భోజరాజే భువం గతే ||”

అమ్మహాకవివాక్ప్రభావమ్ముచేత
బ్రతికె భోజుఁడు, కవి కిడె వందనమ్ము,
లిరువు రానందమున పయనించి నెలవు
చేరి గడిపిరి బ్రతుకు సస్నేహముగను.