9, జులై 2012, సోమవారం

సమస్యాపూరణం -758 (తల్లిబాసను రోసిరి)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

తల్లిబాసను రోసిరి పిల్లలెల్ల.

ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

కవిమిత్రుల పూరణలు

౧. గోలి హనుమచ్ఛాస్త్రి
    జన్మనిచ్చిన గ్రామంబు 'ఛాఛ' బోరు
    కజ్జ కాయలు తల్లీయ 'పిజ్జ' గోరు
    మమ్మి యనుగాని యిమ్ముగ నమ్మ యనరు
    తల్లిబాసను రోసిరి పిల్లలెల్ల.
*     *     *     *     *
౨. లక్ష్మీదేవి
    నల్లరంగును పులుమగ నాగ సంతు
    నకును, కద్రువ యిచ్చు నానతిని విన్న
    వెంటనే విస్మయమునంది వికృతమయిన 

    తల్లిబాసను, రోసిరి పిల్లలెల్ల .
(బాస = ప్రతిజ్ఞ)
*     *     *     *     *
౩. సుబ్బారావు
    ఆదరించుము మనసార హాయి గొలుపు
    తల్లి బాసను, రోసిరి పిల్ల లెల్ల
    రాంగ్ల భాషను జదువగ యావ లేక;
    దేశ భాషల యందున తెలుగు లెస్స .
*     *     *     *     *
౪. హరి వేంకట సత్యనారాయణ మూర్తి
(1)
    విత్తమును గోరి ధర్మంబు విడిచిపెట్టి
    సంబరంబున దేశాంతరంబు జేరి
    తల్లిదండ్రులె గృహమున దలవనపుడు
    తల్లిబాసను రోసిరి పిల్లలెల్ల.
(2)
    తారతమ్యము లేదు సోదరులమనుచు
    ప్రతిన బూనిరి పౌరులు బాల్యమందు
    కులము పేరిట దేశాన గొడవలేల?
    తల్లి! బాసను రోసిరి పిల్లలెల్ల.
*     *     *     *     *
౫. చంద్రమౌళి
    తండ్రి తాష్కేంటు జ్ఞాని యాంధ్రమ్మురాని
    మహిళ జతగూడి తామెచ్చి మనువునాడె
    రాదు భాషను మాటాడ రష్య పిన్న
    తల్లిబాసను రోసిరి పిల్లలెల్ల.

*     *     *     *     *
౬. గన్నవరపు నరసింహ మూర్తి
(1)

    తేనె లూరెడి కమ్మని తెలుగు నెట్టి
    అఱకొఱయు లేక నిత్యము నాంగ్ల మందు
    పలుకు చుండగ హృదిలోన ములు దిగంగ

    తల్లి బాసను రోసిరి పిల్ల లెల్ల.
(2)
    వాలమును బట్టి వ్రేలాడ వాజి నొకఁడు
    పంతమున గెల్తు, దాస్యంబు వాయు నాకు
    ననగ కద్రువ(యు) నొల్లక యనయమునకుఁ
    దల్లి బాసను రోసిరి పిల్ల లెల్ల !
*     *     *     *     *
౭. గుండు మధుసూదన్
    నేఁటి తలిదండ్రు లెంతయో నిష్ఠ తోడ
    నాంగ్ల మాధ్యమ విద్యల నందఁ జేయఁ
    దెలుఁగు మాట్లాడుటయె యప్రతిష్ఠ యనుచుఁ
    దల్లి భాషను రోసిరి పిల్ల లెల్ల!

*     *     *     *     *
౮. పండిత నేమాని
    తెలుగు బాసయె లెస్స దేశభాషలలోన
              నను కృష్ణరాయు వాక్యము గతించె
    ఇటలీయ భాషకు నీస్టులో సమమైన
              బాస తెలుంగను ప్రథయు డుల్లె
    తేటతెనుగు మాది సాటిలేనిది యను
              మంచి పేరేనియు మాసిపోయె
    సరస వాఙ్మయ మహా సంపన్నమన నొప్పు
              వైభవంబేనియు వ్యర్థమయ్యె
    ఆదరణలేక విలవిల లాడె తెలుగు
    మంచి యుద్యోగముల నిచ్చు మాయ భాష
    లనెడు మోజుతో నభిమానమును త్యజించి
    తల్లి బాసను రోసిరి పిల్ల లెల్ల.
*     *     *     *     *
౯. ఊకదంపుడు
(తల్లి "అమ్మా" అన్న పిలుపే నేర్పుకుంటే - పిల్లలు మమ్మీ అని పిలవరు కదా..పిల్లలకన్నా - తల్లి, తండ్రి గురువులు అనుసరిస్తున్న విధానం వల్లే, పిల్లల పరిస్థితి మన భాష పరిస్థితి ఇలా ఉందని నా అనుకోలు.)
    తమిళులకరణి, కన్నడతమ్ములవలె
    గాక, ఆంధ్రలోపుట్టినకారణమున
    తల్లి,తండ్రిగురువులుపధ్ధతిని మీర-
    తల్లి బాసను రోసిరి పిల్ల లెల్ల.
*     *     *     *     *
౧౦. సహదేవుడు
    భరత పట్టాభిషేకమ్ముజరుపమనుచు
    మునుపటి వరములను గోరె కినుకఁ బూని

    రామవనవాస మెంచెను ప్రేమ మఱచి
    తల్లి! బాసనురోసిరి పిల్లలెల్ల!

*     *     *     *     *
౧౧. రాజేశ్వరి నేదునూరి
    ఆధునిక మని యా తల్లు లంగ లార్చి
    యితర దేశము లందున వెతలు దీరు
    నమ్మ ప్రేమకు తాకట్టు మమ్మి యనగ
    తల్లి బాసను రోసిరి పిల్ల లెల్ల !
*     *     *     *     *
౧౨. కమనీయం
    పల్లెటూరి యందాలను బాసి,నగర
    వాసవిలాసాల మరగి ,పరుల భాష
    నింగిలీషు నుపాధికై నేర్చి నేడు
    తల్లిబాసను రోసిరి పిల్లలెల్ల .

27 కామెంట్‌లు:

  1. జన్మనిచ్చిన గ్రామంబు 'ఛాఛ' బోరు
    కజ్జ కాయలు తల్లీయ 'పిజ్జ' గోరు
    మమ్మి యనుగాని యిమ్ముగ యమ్మ యనరు
    తల్లిబాసను రోసిరి పిల్లలెల్ల.

    రిప్లయితొలగించండి
  2. నల్లరంగును పులమగ నాగ సంతు
    నకును, కద్రువ యిచ్చు నానతిని విన్న
    వెంటనె వారలప్పుడె కొంత వికృతమయిన
    తల్లిబాసను, రోసిరి పిల్లలెల్ల .

    రిప్లయితొలగించండి
  3. ఆదరించుము మనసార హాయి గొలుపు
    తల్లి బాసను, రోసిరి పిల్ల లెల్ల
    రాం గ్ల భాషను జదు వగ యావ లేక
    దేశ భాషల యందున తెలుగు లెస్స .

    రిప్లయితొలగించండి
  4. విత్తమును గోరి ధర్మంబు విడిచిపెట్టి
    సంబరంబున దేశాంతరంబు జేరి
    తల్లిదండ్రులె గృహమున దలవనపుడు
    తల్లిబాసను రోసిరి పిల్లలెల్ల.

    రిప్లయితొలగించండి
  5. తారతమ్యము లేదు సోదరులమనుచు
    ప్రతిన బూనిరి పౌరులు బాల్యమందు
    కులము పేరిట దేశాన గొడవలేల?
    తల్లి! బాసను రోసిరి పిల్లలెల్ల.

    రిప్లయితొలగించండి
  6. తండ్రి తాష్కేంట్లొ విజ్ఞాని తెలుగురాని
    మహిళ జొతగూడి తానొచ్చి మనువునాడె
    రాదుభాషలు మాటాడ రష్యపిన్న
    తల్లిబాసను రోసిరి పిల్లలెల్ల

    రిప్లయితొలగించండి
  7. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘ఇమ్ముగన్ + అమ్మ’ ఇమ్ముగ నమ్మ అవుతుంది. యడాగమం రాదు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ వైవిధ్యంగా ఉంది. బాగుంది. అభినందనలు.
    మూడవ పాదంలో గణదోషం. నా సవరణ గమనించండి.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సత్యనారాయణ మూర్తి గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
    *
    చంద్రమౌళి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు. చిన్న సవరణలు చేసాను. గమనించండి.

    రిప్లయితొలగించండి
  8. గురువు గారు,
    నిజమే. పొరబాటుకు మన్నించండి.
    సవరణకు ధన్యవాదాలు. వెంటనె, అప్పుడే అన్నందుకు పునరుక్తి దోషము వస్తుందేమో అనుకున్నాను.
    కానీ ఏమీ తోచలేదు.
    వెంటనే విస్మయమునంది వికృతమయిన
    అంటే బాగుంటుందంటారా!

    సుబ్బారావు గారి పూరణలో మూడవపాదములో జదువగన్ యావ అని అర్థమా? అప్పుడు సంధి గురించి కొంచెం వివరించగలరు.
    ఇక్కడ తప్పు ఉందని కాదు నా భావన.
    ఇలాంటి చోట వ్రాసేటప్పుడు సందిగ్ధంగా ఉందని నేను పదాల్ని మార్చుకుంటూ ఉంటాను. ఆ సందిగ్ధత తొలగించుకోవటానికే అడుగుతున్నాను.

    చంద్రమౌళి గారి పూరణలో మొదటి పాదములో యతి సరిపోలేదనుకుంటాను.

    రిప్లయితొలగించండి
  9. గురువుగారికి , నేమాని వారికి, మరియు కవిమిత్రులకు నమస్కారములతో
    శ్రీ నేమాని వారి గర్భ కవితలు జూచి చిన్ని ప్రయత్నము

    సీ /ఆ .వె :శంక రాభరణము స్వాగతము బలుకు
    సాధకులకు , సాధు సజ్జనులకు
    పద్య రచన, దత్త పది , నిషిద్దాక్షరి ,
    నవరసములు నింపి యావకాయ
    పచ్చడి వలె నిచ్చు , పాదము నిత్యము
    ప్రాస యతుల తోడ పాఠ్య ము, మన
    సంశయములు దీర్చు సత్కవులు గలరు
    సరసిజాత మిడచు సంధ్య వేళ
    తే : సహకరించని జేతికి శక్తి నిచ్చి
    వంకరలు దీయు రయమున శంకరయ్య
    గారి కలము చాల రసవత్తరము గాను
    కోరు పద్య ప్రేమికు లెల్ల వీరి బ్లాగు

    రిప్లయితొలగించండి
  10. లక్ష్మీ దేవి గారి భావనే నాకు కలిగింది. కాని ఓ తల్లి యింటికి పిలిచి మినప రొట్టె ఆవకాయ పచ్చళ్ళతో విందు చేయడము వలన యింటికి రావడము ఆలస్య మయింది. లక్ష్మీ దేవి గారి పూరణ చూసాను. చాలా బాగుంది.మిగిలిన పూరణలు చాలా బాగున్నాయి.

    తేనె లూరెడి కమ్మని తెలుగు నెట్టి
    అఱకొఱయు లేక నిత్యము నాంగ్ల మందు
    పలుకు చుండగ హృది లోన ములు దగిలెనొ
    తల్లి బాసను రోసిరి పిల్ల లెల్ల

    రిప్లయితొలగించండి
  11. గుండు మధుసూదన్ గారి పూరణ....

    నేఁటి తలిదండ్రు లెంతయో నిష్ఠ తోడ
    నాంగ్ల మాధ్యమ విద్యల నందఁ జేయఁ
    దెలుఁగు మాట్లాడుటయె యప్రతిష్ఠ యనుచుఁ
    దల్లి భాషను రోసిరి పిల్ల లెల్ల!

    రిప్లయితొలగించండి
  12. తెలుగు బాసయె లెస్స దేశభాషలలోన
    నను కృష్ణరాయు వాక్యము గతించె
    ఇటలీయ భాషకు నీస్టులో సమమైన
    బాస తెలుంగను ప్రథయు డుల్లె
    తేటతెనుగు మాది సాటిలేనిది యను
    మంచి పేరేనియు మాసిపోయె
    సరస వాఙ్మయ మహా సంపన్నమన నొప్పు
    వైభవంబేనియు వ్యర్థమయ్యె
    ఆదరణలేక విలవిల లాడె తెలుగు
    మంచి యుద్యోగముల నిచ్చు మాయ భాష
    లనెడు మోజుతో నభిమానమును త్యజించి
    తల్లి బాసను రోసిరి పిల్ల లెల్ల

    రిప్లయితొలగించండి
  13. అయ్యా! వర ప్రసాద్ గారూ!
    శుభాశీస్సులు.
    మీరు గర్భ కవిత్వమునకు ప్రయత్నము చేయుట ముదావహము. ప్రాస యతి నియమములు మీకు తెలియవని గ్రహించేను. అవి తెలుసుకొని ప్రాసయతులు వేయండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  14. తల్లి "అమ్మా" అన్న పిలుపే నేర్పుకుంటే - పిల్లలు మమ్మీ అని పిలవరు కదా..
    పిల్లలకన్నా - తల్లి, తండ్రి గురువులు అనుసరిస్తున్న విధానం వల్లే, పిల్లల పరిస్థితి మన భాష పరిస్థితి ఇలా ఉందని నా అనుకోలు.

    తమిళులకరణి, కన్నడతమ్ములవలె
    గాక, ఆంధ్రలోపుట్టినకారణమున
    తల్లి,తండ్రిగురువులుపధ్ధతిని మీర-
    తల్లి బాసను రోసిరి పిల్ల లెల్ల

    స్వస్తి.

    భవదీయుడు
    ఊకదంపుడు

    రిప్లయితొలగించండి
  15. మాస్టారూ... నా చాపల్యాన్ని కొంచెం సంస్కరించండి.

    యెల్ల నృపులు గొలువ బాసాడిన
    యల్ల రాయల తెనుగు ప్రేమ పోయె
    కాల మహిమ యయ్యొ యేమిది
    తల్లి బాసను రోసిరి పిల్లలెల్ల

    రిప్లయితొలగించండి
  16. రామాయణ భూమికగా...

    భరత పట్టాభిషేకమ్ముజరుపమనుచు
    మునపటివరములఁగోరికినుకబూని
    రామవనవాస మెంచెను ప్రేమ మఱచి
    తల్లి! బాసనురోసిరి పిల్లలెల్ల!

    రిప్లయితొలగించండి
  17. లక్ష్మీదేవి గారూ,
    మీ సూచించిన మార్పు చాలా బాగుంది. సవరిస్తాను.
    వాస్తవానికి ‘యావ’ గ్రాంధికశబ్దం కాదు.
    చంద్రమౌళి గారి పూరణలోని యతిదోషాన్ని నేను గమనించలేదు. ధన్యవాదాలు. సవరిస్తాను.
    *
    వరప్రసాద్ గారూ,
    శంకరాభరణం బ్లాగు పట్ల మీరు చూపిన అభిమానానికి, చేసిన ప్రశంసకు ధన్యవాదాలు.
    నేమాని వారి వ్యాఖ్యను గమనించారు కదా! మీ సీసంలో నాల్గవపాదంలో, ఎత్తుగీతిలో మూడవపాదంలో ప్రాసయతి తప్పింది.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    అద్భుతమైన సీసంతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    ఊకదంపుడు గారూ,
    చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    పురాణపండ ఫణి గారూ,
    మీ ప్రయత్నం ప్రశంసనీయం.
    సంస్కరించే ప్రయత్నం చేస్తాను.
    *
    సహదేవుడు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  18. అయ్యా శ్రీ సహదేవుడు గారూ!
    మీ భావము పద్యము బాగుగనే యున్నవి. కైక కోర్కెను లక్ష్మణుడు నిరసించెను, భరతుడు, శత్రుఘ్నుడు పురములోనే లేరు, రాముడు సంతోషముతో స్వీకరించెను కదా. పిల్ల లెల్ల అనే భావము ఇక్కడ వచ్చుటలేదు కదా. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  19. శ్రీనేమని గురువర్యులకు ప్రణాములు.ఇక్కడ నా భావము ప్రజలెల్ల. రాజ్య ప్రజలు రాజుగారిభార్యకు పిల్లలతో సమానమని క్రిందవివరణ యిద్దామని మరచాను.తమరి విలువైన సూచనకు ధన్యవాదములు.

    రెండవ పాదసవరణ

    మునుపటి వరములను గోరె కినుకఁ బూని

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  20. ఆధునిక మని తల్లులు యంగ లార్చి
    ఇతర దేశము లందున వెతలు దీరు
    అమ్మ ప్రేమకు తాకట్టు మమ్మి యనగ
    తల్లి బాసను రోసిరి పిల్ల లెల్ల !

    రిప్లయితొలగించండి
  21. గురువు గారూ, మూడవ పాదము సాఫీగా లేదని పిస్తుంది.చిన్న సవరణ చేసాను.

    తేనె లూరెడి కమ్మని తెలుగు నెట్టి
    అఱకొఱయు లేక నిత్యము నాంగ్ల మందు
    పలుకు చుండగ హృది లోన ములు దిగంగ
    తల్లి బాసను రోసిరి పిల్ల లెల్ల .

    రిప్లయితొలగించండి
  22. లక్ష్మీ దేవి గారి భావముతోనే,

    వాలమును బట్టి వ్రేలాడ వాజి నొకఁడు
    పంతమున గెల్తు, దాస్యంబు వాయు నాకు
    ననగ కద్రువ(యు) నొల్లక యనయమునకుఁ
    దల్లి బాసను రోసిరి పిల్ల లెల్ల !

    రిప్లయితొలగించండి
  23. పల్లెటూరి యందాలను బాసి,నగర
    వాసవిలాసాల మరగి ,పరుల భాష
    నింగిలీషు నుపాధికై నేర్చి నేడు
    తల్లిబాసను రోసిరి పిల్లలెల్ల .

    రిప్లయితొలగించండి
  24. మొదటిపాదములోని యతివ్యత్యయాన్ని తెలిపిన శ్రీ లక్షిగారికి, సవరించన శ్రీ శంకరయ్యగారికి ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి