12, జులై 2026, ఆదివారం

సమస్య - 5526

13-7-2026 (సోమవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సంపాదన లేనివాఁడె సౌఖ్యంబందున్”
(లేదా...)
“ధనసంపాదన లేనివానికె కదా దక్కున్ సుఖంబుల్ భువిన్” 

6 కామెంట్‌లు:

  1. కందం
    నింపాదిగ కర్తవ్యము
    నింపుగ నెఱవేర్చి ఫలము నీశ్వరునికిడన్
    సొంపగు బ్రతుకది, యక్రమ
    సంపాదన లేనివాఁడె సౌఖ్యంబందున్

    మత్తేభవిక్రీడితము
    అనయంబున్ పరమాత్మచింతనముతో నానందమున్ బొందుచున్
    దనదౌ జీవిత దృక్పథమ్మునను కర్తవ్యంబె ముఖ్యమ్ముగన్
    వినయంబన్నది శోభిలన్, విడి ఫలాపేక్షన్, దురాలోచనన్
    ధనసంపాదన లేనివానికె కదా దక్కున్ సుఖంబుల్ భువిన్

    రిప్లయితొలగించండి
  2. సొంపుగ సోదరుల నడుమ
    పంపకము సలుపెడు వేళ పదముగ మనసు
    చంపుకొని లంచముగ గొను
    సంపాదన లేనివాఁడె సౌఖ్యంబందున్

    రిప్లయితొలగించండి

  3. చంపా! వినుమిది చెప్పెద
    కొంపలు కూల్చంగ నేల కుటిలత్వము తో
    సంపద పెంచగ, నక్రమ
    సంపాదన లేనివాఁడె సౌఖ్యంబందున్.


    అనయమ్మా యపునర్భవమ్ము కొరకై యారాటమున్ జూపుచున్
    మనమున్ శంకర రూపమున్ నిలిపి సమ్మానించుటే కృత్యమై
    మనుటే ముఖ్యముసోదరా వసుధలో మంజూష లో దాచెడిన్
    ధనసంపాదన లేనివానికె కదా దక్కున్ సుఖంబుల్ భువిన్.

    రిప్లయితొలగించండి
  4. సంపాదన సక్రమమై
    నింపాది గ జీవ నంపు నిర్మల ప్రద మై
    సొంపు గ బ్రతుకుచు నక్రమ
    సంపాదన లేనివాడె సౌఖ్యం బందున్

    రిప్లయితొలగించండి
  5. సంపాదింపవలెను ధన
    మింపుగ నియమాలతోడ మెచ్చిన రీతిన్
    దెంపుంబడు దుర్మార్గపు
    సంపాదన లేనివాఁడె సౌఖ్యంబందున్

    ధన సంపాదనకై తపించుచు సదా దౌర్జన్య కృత్యాలతో
    నెనలేనంతగ కూడఁబెట్టినను తానేరీతి సంతృప్తుడౌ
    వినియోగింపగ లేడు తృప్తి కలదా పేరాసలో నిర్నిబం
    ధన సంపాదన లేనివానికె కదా దక్కున్ సుఖంబుల్ భువిన్

    రిప్లయితొలగించండి