15, ఏప్రిల్ 2025, మంగళవారం

సమస్య - 5094

16-4-2025 (బుధవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“రావణుం డాంజనేయుని ప్రాణసఖుఁడు”

(లేదా...)

“రావణుఁ డాంజనేయునకుఁ బ్రాణసముండగు మిత్రుఁడౌఁ గదా”

11 కామెంట్‌లు:

  1. లంక ప్రభువు మండోదరి రమణుడైన
    రావణుం ; డాంజనేయుని ప్రాణసఖుఁడు
    అంగదుడు , వాలి తారల కాత్మజుండు ,
    రామ రావణ రణమున ప్రముఖుడతడు

    రిప్లయితొలగించండి
  2. తేటగీతి
    రావమొలుక గొప్పగ దశగ్రీవుడందె
    రావణుండను పేరు, దారను గొనంగ
    నన్న సుగ్రీవుఁడా రీతి నరచినట్టి
    రావణుం డాంజనేయుని ప్రాణసఖుఁడు!

    ఉత్పలమాల
    దైవతపమ్మునన్ జెలఁగ ద్ర్యక్ష గిరీంద్రము క్రింద గాయమై
    రావము రేగ రోదనను రావణుడంద్రు దశాస్యు నట్లె సు
    గ్రీవుఁడు సైతమున్ బొగలె! కీడొనరన్ సతినొందవాలి. ,యా
    రావణుఁ డాంజనేయునకుఁ బ్రాణసముండగు మిత్రుఁడౌఁ గదా!

    రిప్లయితొలగించండి

  3. జనక సుతను బంధించిన దనుజు డెవ్వ?
    డంజని యెవరి తల్లియొ? యార్కి యనగ
    దాశరథియే విధమ్మున దలచె తెలుపు
    రావణుం , డాంజనేయుని , ప్రాణసఖుఁడు


    పావనినే దురాత్మకుడు బంధిని సేసెనొ తెల్పుమంటి? నా
    పావని పేరెవండకొ? యుపగ్రహమేమి విభీషణుం డటన్
    దావిషతీరమందుగల దక్షుడు రాముని జేర నేమయెన్?
    రావణుఁ , డాంజనేయునకుఁ, బ్రాణసముండగు మిత్రుఁడౌఁ గదా!

    రిప్లయితొలగించండి
  4. వీధి నాటకమునుజూపి విశదపరచె
    పాత్రధారుల నడుమ సంబంధములను
    'సీత జనకుని భార్యకు చెల్లెలగును
    రావణుం డాంజనేయుని ప్రాణసఖుఁడు'

    జీవితమౌను ధన్యమని చెప్పుచు చూపిన నాటకంబులో
    రావణుఁ డాంజనేయునకుఁ బ్రాణసముండగు మిత్రుఁడౌఁ గదా
    కావలికాచు లంకిణికి కైకయగున్ గద తోడిచూలు మై
    రావణ పుత్రుడే పరశు రాముని తండ్రిగ చూడగల్గితిన్

    రిప్లయితొలగించండి
  5. తే॥ క్రమముగఁ బురాణ సంవిత్తు కరగి పోవు
    చుండ జనులయందు పలుకఁ జోద్యమగునె
    విజ్ఞతఁ బడయని జనులె తజ్ఞులగుచు
    రావణుం డాజనేయుని ప్రాణసఖుఁడు

    ఉ॥ పూవుల సౌరభమ్ము తగు పొందిక నొందుచు నుండినంతనే
    తావికి పారవశ్యమగుఁ దప్పుగ వాసన లేని పూవులున్
    జేవకు జ్ఞానశూన్యులును శ్రేయముఁ బొందఁగఁ బల్క చోద్యమే!
    రావణుఁ డాంజనేయునకు బ్రాణసముండగు మిత్రుఁడౌఁగదా!

    శ్రీ కంది శంకరయ్య గారు సూచించిన దోషములు సవరించిన పిదప


    రిప్లయితొలగించండి
  6. నాటకము నందు శత్రువై నటన జేసె
    మంచి మిత్రుడై మెలిగుచు మరులు జూపు
    నెంచి చూడగా తెలియు వా రి ష్ట సఖులు
    రావణు డాంజ నేయుని ప్రాణ స ఖు డు

    రిప్లయితొలగించండి
  7. తే.గీ:ఎవడొ రాయబారమునకు నిటకు వచ్చె?
    నంచు చులకన జేసి ప్రశ్నించినంత
    రావణుం "డాంజనేయుని ప్రాణసఖుఁడు,
    వాలి పుత్రుడే" యని మంత్రి వరుడు తెలిపె

    రిప్లయితొలగించండి
  8. ఉ: ద్రావిడు డౌను రావణుడు,రాముడు ద్రావిడ శత్రు,వార్యుడన్
    భావము నెత్తి కెక్కి యొక బాలకు డిట్లనె " జాతి జూచినన్
    రావణుఁ డాంజనేయునకుఁ బ్రాణసముండగు మిత్రుఁడౌఁ గదా!
    ఏ విధి నాంజనేయు గమనించక తోకకు నిప్పు వెట్టెనో"
    (ద్రావిడ వాదం నెత్తి కెక్కిన వాడికి రామాయణం లో న్యాయాన్యాయాల తో కాక ఏ జాతి? అనేది ప్రథానం.పైగా వాడు పిల్ల వాడు.)



    రిప్లయితొలగించండి
  9. అండ కోరి నిండు మదిఁ గోదండ రామ
    చంద్రు దండ సేరిన యట్టి శస్త్ర కోవి
    దుండు రక్కసుండు విభీషణుండు వీత
    రావణుం డాంజనేయుని ప్రాణసఖుఁడు


    పావని సీత రాఘవుని పంచకుఁ బంపి సగౌరవమ్ముగాఁ
    బావనుఁ డై చరింపఁ దలపడ్డ నిశాచర రాజు తత్సభం
    బావని తోఁక కాల్చుటకుఁ బాల్పడ కాతని మాట విన్నచో
    రావణుఁ డాంజనేయునకుఁ బ్రాణ సముండగు మిత్రుఁడౌఁ గదా

    రిప్లయితొలగించండి

  10. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    సీత నెవ్వరు లంకను చెఱను పెట్టె?
    రాయబారిగ నెవరిని రాముడంపె?
    హనుమ యేమగు రామచంద్రునికి నరయ?
    రావణుం; డాంజనేయుని; ప్రాణసఖుడు.

    రిప్లయితొలగించండి
  11. దశశిరుం డన నెవ్వరు ధరణి యందు
    రాయబారిగా నెవరిని రాముడంపె
    కష్టసుఖము లందాసరాగ నిలబడును
    రావణుం డాంజనేయుని ప్రాణసఖుడు

    రిప్లయితొలగించండి