23, ఆగస్టు 2026, ఆదివారం

సమస్య - 5568

24-8-2026 (సోమవారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“స్థితరూపముఁ గని పలుకుము శ్రీయొ యగజయో”

(లేదా...)

“స్థితరూపమ్మును జూచి పల్కుమిపుడే శ్రీదేవియో గౌరియో”

(ఫ్లోరిడా, అమెరికాలో వద్దిపర్తి పద్మాకర్ గారి శతావధాన సమస్య)

13 కామెంట్‌లు:

  1. అతులితమౌ జ్ఞానివిగద ,
    తతంగ మంతటను జుచి తప్పు సలుపకన్
    చతురుడవగుచో నీవా
    స్థితరూపముఁ గని పలుకుము శ్రీయొ యగజయో”

    రిప్లయితొలగించండి

  2. స్మిత వదనము కరమందును
    శత పత్రము రక్త వర్ణ సంవ్యాసముతో
    ద్యుతినొలుకు నయనము లవ
    స్థితరూపముఁ గని పలుకుము శ్రీయొ యగజయో.


    శత పత్రమ్మది యాసనమ్ము కరమున్ సారంగమున్ దాల్చి రో
    హిత వర్ణాంబర ధారియై కారముతో హేమంబు నే రాల్చుచున్
    ద్యుతితోభాసిలు నేత్ర రాజములతో ద్యోతించెనే య య్యవ
    స్థితరూపమ్మును జూచి పల్కుమిపుడే శ్రీదేవియో గౌరియో.

    రిప్లయితొలగించండి
  3. వ్రతదీక్షాపరులౌ దం
    పతులకు పుట్టెను గొమరిత వ్రతఫలమనగా
    రతనంబును బోలెడి సం
    స్థితరూపముఁ గని పలుకుము శ్రీయొ యగజయో

    పతియుంబత్నియు సంతు కోరి సతమున్ బ్రార్థించిరాదైవమున్
    జతగా తామొనరించినట్టి వ్రతముల్ సాకారమౌ రీతినిన్
    రతనంబున్ దలపించునట్టి సుత సంప్రాప్తించె నీనాడు సం
    స్థితరూపమ్మును జూచి పల్కుమిపుడే శ్రీదేవియో గౌరియో

    రిప్లయితొలగించండి
  4. పతిదేవుని యురమున శా
    శ్వతముగ తానుండు నెవరు? పతి దేహమునన్
    స్థితమగు నర్ధాంగి యెవరు?
    స్థితరూపముఁ గని పలుకుము శ్రీయొ యగజయో

    రిప్లయితొలగించండి
  5. సతి తానెవ్వరు భర్త గుండియ నివాసంబై చరించున్ సదా
    పతిదేహంబున తా వశించి సగమై భాసిల్లె నేదేవియో
    సతతం బిర్వురిలోన నెవ్వరిని విశ్వాసించి పూజింతువో
    స్థితరూపమ్మును జూచి పల్కుమిపుడే శ్రీదేవియో గౌరియో

    రిప్లయితొలగించండి
  6. మనసా!

    కందం
    పతనావస్థన్ జననిన్
    గతిజూపియు వలయు శక్తిఁ గలుగఁగ భక్తిన్
    నుతియింప వెలసిన వ్యవ
    స్థితరూపముఁ గని పలుకుము శ్రీయొ! యగజయో!

    మత్తేభవిక్రీడితము
    పతనావస్థకుఁ జేరితిన్ బ్రతుకునన్ బాధింప లోకమ్మదే
    గతినీవే తగఁ జూపి శక్తి జననీ! గల్గింప రమ్మంచు నే
    నుతియింపన్ గరుణాంతరంగ నిలిచెన్ దోడుండ నా ముందు సం
    స్థితరూపమ్మును జూచి పల్కుమిపుడే శ్రీదేవియో! గౌరియో!

    రిప్లయితొలగించండి
  7. మ॥ స్థితరూపమ్మును జూచి పల్కుమిపుడే శ్రీదేవియో గౌరియో
    మతి చాంచల్యమొ యిద్దరొక్కటియె సంభావించి సద్భక్తితో
    నుతులన్ బూజల సేయుమిర్వురనటుల్ నోముల్ ధరన్ నోచుచున్
    వెతలున్ వీడును రూప భేధముననే వేరింతియే గాదొకో

    రిప్లయితొలగించండి
  8. మతి నుప యో గించు చు
    ప్రతిమల ను పరీక్ష చేసి వచి యింప వలె న్
    చతురము గా యోచించు చు
    స్థిత రూపము గని పలుకుము శ్రీ యొ యగజ యో?

    రిప్లయితొలగించండి
  9. కం:ఇతడు గణపతియె, మరి గణ
    పతి ప్రక్కన గీసె తీవు పార్వతి నా ? నా
    మతికిన్ లక్ష్మి గా దోచెను
    స్థితరూపముఁ గని పలుకుము శ్రీయొ యగజయో”
    (గణపతి ప్రక్కన స్త్రీ దేవత ను గీసాడు. పార్వతి కావచ్చు.లక్ష్మీ గణపతి బొమ్మ ఐతే ఆమె లక్ష్మి ఐ యుండ వచ్చు. )



    రిప్లయితొలగించండి
  10. మ:సుత! లక్ష్మీగణపత్యుపాసకుడ నంచున్ దెల్పు నీ దీక్ష తో
    నతిభక్తిన్ వెలయించు శిల్పమున నా యంబన్ బరీక్షించితే?
    మతిలో భావము శిల్ప మందు నెటులో మారెన్ గదా! శిల్పసం
    స్థితరూపమ్మును జూచి పల్కుమిపుడే శ్రీదేవియో గౌరియో”
    (లక్ష్మీ గణపతి శిల్పం చెక్క బోతే ఆ భావం శిల్పం లో లేక ఆమె లక్ష్మియా? పార్వతియా? అనే సందేహం వచ్చింది. )




    రిప్లయితొలగించండి
  11. సతతం బుండఁగ గళమున
    సతియై సరసను వెలుంగ సంతోషముగన్
    మతి నూహించి వెస నుప
    స్థిత రూపముఁ గని పలుకుము శ్రీయొ యగజయో

    [శ్రీ = విషము; అగజ = పార్వతి]


    సతతం బెన్న సతీ విలోలు లిరువుర్ సందేహ శూన్యమ్ముగా
    నుత నారాయణ నాగభూషణులు నే నోరార వాకృచ్చెదన్
    స్తుత నారీ మణు లెవ్వ రెవ్వరఁట వక్షోభాగ వామార్ధ సం
    స్థిత రూపమ్మును జూచి పల్కు మిపుడే శ్రీదేవియో గౌరియో

    రిప్లయితొలగించండి
  12. భర్త భార్యతో
    అతులమ్మౌ గృహబాధలన్ మడచగా, యత్యంత నెయ్యమ్ముతో
    గతినీవే యని మ్రొక్క పార్వతికి నాకాంక్షించి సౌభాగ్యమున్
    సతి! కన్పించె వరాలతల్లి యదిగో! సౌజన్యమున్ జూపి సం
    స్థితరూపమ్మును జూచి పల్కుమిపుడే శ్రీదేవియో గౌరియో!

    రిప్లయితొలగించండి
  13. భార్యను పొగుడుతూ

    ప్రతిరూపంబగు నీదు మోము గనినన్ బ్రాహ్మీసమా భాసిలున్
    నతనీలాలక భామినీ నిను గనన్ నారాయణీ తోచెడున్
    గతిసౌందర్యము నీకు సాటి యనగా గంగాధరున్ రాణియే
    స్థితరూపమ్మును జూచి పల్కుమిపుడే శ్రీదేవియో గౌరియో

    #ఛందం #యంత్రం

    రిప్లయితొలగించండి