15, మే 2026, శుక్రవారం

సమస్య - 5468

16-5-2026 (శనివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“దోమ మ్రింగె నొక్క సామజమును”

(లేదా...)

“మ్రింగెను దోమ యేనుఁగును మిక్కిలి యాఁకలిఁ గొన్నదై వడిన్”

5 కామెంట్‌లు:

  1. ఆటవెలది
    ఇచ్చిపుచ్చుకొనఁగ నెంచఁగఁ జరవాణి
    మోసకారులతని ధ్యాసమార్చి
    దూరి కోట్లధనము దోచినారను రీతి
    దోమ మ్రింగె నొక్క సామజమును!

    ఉత్పలమాల
    రంగమునందునన్ దిగిరి రాక్షసులెందరొ కళ్లుఁగప్పుచున్
    దొంగిల కోట్ల విత్తమును దూరుచు నా చరవాణి క్రీడలం
    దంగిట నున్న నేమరిచి యబ్బురమొందగ దోచురీతిగన్
    మ్రింగెను దోమ యేనుఁగును మిక్కిలి యాఁకలిఁ గొన్నదై వడిన్

    రిప్లయితొలగించండి
  2. పార్టి పెట్టి విజయ పంచ వర్షములు
    మంత్రి పదవి చేయు మహిత నేత
    నోడ జేసె నౌర యోహో!యనగనవ్య
    దోమ మ్రింగె నొక్క సామజమును!

    రిప్లయితొలగించండి
  3. సామజమను పేరు చక్కని జింకది
    భారి కొసగి నట్టి పేరు దోమ
    చిన్న పిల్ల వాడు చెప్పెనీ విధముగా
    దోమ మ్రింగె నొక్క సామజమును

    బంగరు వన్నె జింకనకు బాలకు డిచ్చిన పేరు యేనుగే
    చెంగట నున్న కేసరికి శీఘ్రమె దోమ యటంచు పేరిడెన్
    సింగము చంపె జింక నని చెప్పగ నెంచి వచించె నిట్టులన్
    మ్రింగెను దోమ యేనుఁగును మిక్కిలి యాఁకలిఁ గొన్నదై వడిన్

    రిప్లయితొలగించండి
  4. కంటివి గద యిటుల కలలయం దున నేడు
    " దోమ మ్రింగె నొక్క సామజమును "
    జేయలేని దైన జేయుచునుండుట
    జరుగబోవు ననుచు సైగ యిదియ

    రిప్లయితొలగించండి
  5. పేరు మోసి నట్టి పెద్ద నేత కెదురు
    పోటి చేసి గెలువ మేటి యనుచు
    జన త పొగడి వాని సంతస మున పల్కె
    దోమ మ్రింగె నొక్క సామ జమును

    రిప్లయితొలగించండి