5, ఆగస్టు 2011, శుక్రవారం

సమస్యా పూరణం -416 (కప్పులోనఁ బుట్టె)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
కప్పులోనఁ బుట్టెగద తుఫాను.

4, ఆగస్టు 2011, గురువారం

చమత్కార పద్యాలు - 118 (ప్రహేళిక)

శ్లో.
ఏకచక్షు ర్న కాకో೭యం
బిలమిచ్ఛే న్న పన్నగః |
క్షీయతే వర్ధతే చైవ
న సముద్రో న చంద్రమాః ||

(శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారి ‘ప్రహేళికలు’ గ్రంథం నుండి)
నా అనువాదం ...
ఆ. వె.
ఏకచక్షు వగును, కాకమ్ము కాదది;
బిలముఁ గోరుఁ, గాదు విషధరమ్ము;
క్షయము వృద్ధిఁ గనును గా దబ్ధి, చంద్రుఁడు;
దీని భావ మేమి తెలుపఁ గలరె?

కవిమిత్రులారా,
అదేమిటో తెల్పండి. సమాధానాన్ని మెయిల్ చేయండి.
shankarkandi@gmail.com

సమస్యా పూరణం -415 (కవితాగానమ్ము లోక)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
కవితాగానమ్ము లోకకంటక మయ్యెన్.
ఈ సమస్యను పంపిన
లక్కాకుల వెంకట రాజారావు గారికి

ధన్యవాదాలు.

3, ఆగస్టు 2011, బుధవారం

చమత్కార పద్యాలు - 117 (సప్తస్వర పద్యాలు)

కం.
మాపని నీపని గాదా?
పాపమ మా పాపగారి పని నీ పనిగా;
నీ పని దాపని పని గద
పాపని పని మాని, దాని పని గానిమ్మా!
కం.
సరి సరిగా మా మానిని
గరిమగ మరిమరిని దాని గదమగ పదమా
సరిగాని దాని సమ మని
సరిగద్దా గసరి దానిదారి గమారీ!
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి ‘చాటుపద్య రత్నాకరము’ నుండి)
కవిమిత్రులారా!
క్రింది సమస్యను పూరించండి.
(సప్తస్వరాలతోనే పద్యం వ్రాయాలనే నిబంధన లేదు)
సరిసరి! మా పనిని సరిగ సాగగ నిమ్మా!

సమస్యా పూరణం -414 (ప్రాస యతులు లేక)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
ప్రాస యతులు లేక పద్య మలరె.
ఈ సమస్యను పంపిన లక్కాకుల వెంకట రాజారావు గారికి ధన్యవాదాలు.

2, ఆగస్టు 2011, మంగళవారం

చమత్కార పద్యాలు - 116 (ప్రహేళిక)

ఇది ఏమిటి?
కం.
శిలవృక్షలతలఁ బుట్టిన
చెలువలు మువ్వురును గూడి చిడిముడిపడుచున్
దలవాకిట రమియింతురు
సలలితముగ దీని నెఱుఁగు సరసులు గలరే?

(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి ‘చాటుపద్య రత్నాకరము’ నుండి)
కవిమిత్రులారా,
అదేమిటో తెల్పండి. సమాధానాన్ని మెయిల్ చేయండి.
shankarkandi@gmail.com

సమస్యా పూరణం -413 (గౌరి ముఖమును చుంబించె)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
గౌరి ముఖమును చుంబించెఁ గరివరదుఁడు.
ఈ సమస్యను పంపిన చింతా రామకృష్ణారావు గారికి ధన్యవాదాలు.

1, ఆగస్టు 2011, సోమవారం

చమత్కార పద్యాలు - 115 (ప్రహేళిక)

ఇది ఏమిటి?
కం.
వండిన దెండిన దొక్కటి,
ఖండించిన పచ్చి దొకటి, కాలిన దొకటై
తిండికి రుచియై యుండును
ఖండితముగఁ దీనిఁ దెల్పు కవియుం గలఁడే?

(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి ‘చాటుపద్య రత్నాకరము’ నుండి)
కవిమిత్రులారా,
అదేమిటో తెల్పండి. సమాధానాన్ని మెయిల్ చేయండి.
shankarkandi@gmail.com

ప్రహేళిక - 49 (సమాధానం)

ఈ ‘భేదం’ ఏమిటి?
తే. గీ.
క్షాంతి, మేదస్సు, జలజము, సంక్షయమ్ము,
నొంటిపాటు, మోదమ్ము, ముక్కంటి, మౌని
యనెడి చతురక్షరపదమ్ము లందులో ద్వి
తీయవర్ణంబు లే ‘వాసిఁ’ దెలియఁజేయు?

సమాధానం .....
క్షాంతి = సహనము
మేదస్సు = మస్తిష్కము
జలజము = కమలము
సంక్షయము = నాశనము
ఒంటిపాటు = ఏకాంతము
మోదము = సంతసము
ముక్కంటి = పురవైరి
మౌని = ముముక్షువు.
స‘హ’నము - మ‘స్తి’ష్కము - క‘మ’లము - నా‘శ’నము - ఏ‘కాం’తము - సం‘త’సము - పు‘ర’వైరి - ము‘ము’క్షువు.
పై పదాల రెండవ అక్షరాలను వరుసగా చదివితే తెలిసే ‘భేదం’ ...
హస్తిమశకాంతరము.
సరియైన సమాధానాలు పంపినవారు ....
వసంత కిశోర్ గారు,
కోడీహళ్ళి మురళీమోహన్ గారు,
గన్నవరపు నరసంహ మూర్తి గారు,
చంద్ర శేఖర్ గారు.
అందరికీ అభినందనలు.

సమస్యా పూరణం -412 (అల్పుఁ డెపుడు పల్కు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
అల్పుఁ డెపుడు పల్కు నాదరమున.
ఈ సమస్యను సూచించిన కవిమిత్రునకు ధన్యవాదాలు.