30, జూన్ 2011, గురువారం

సమస్యా పూరణం -378 (సిరులవలన నేఁడు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
సిరులవలన నేఁడు చేటు గలిగె.
ఈ సమస్యను సూచించిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.

29, జూన్ 2011, బుధవారం

చమత్కార పద్యాలు - 90 (దోగ్ధ్రీధేనువు గర్భమందు)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 34
సమస్య - "దోగ్ధ్రీధేనువు గర్భమందు పులికం
దు ల్వుట్టె నుగ్రాకృతిన్"
శా.
దోగ్ధ్రీవాంతతపోదయా! గుణనిధీ! తేజస్వి! పాపాటవీ
దగ్ధ్రాక్ష్మానలుఁ డైన కశ్యపున కుద్యద్గర్వులై యాగభు
గ్జగ్ధ్రీశుల్ సుతు లుద్భవించిరి బిడౌజా! వింత వీక్షించితే
దోగ్ధ్రీధేనువు గర్భమందు పులికందు ల్వుట్టె నుగ్రాకృతిన్"
[పులి కందులు = పులి బిడ్డలు]
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

సమస్యా పూరణం -377 (కుత్తుకలు గోయువానికి)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
కుత్తుకలు గోయువానికి కోటి నుతులు.

28, జూన్ 2011, మంగళవారం

చమత్కార పద్యాలు - 89 (దుగ్ధపయోధి మధ్యమున)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 33
సమస్య - "దుగ్ధపయోధి మధ్యమున
దుమ్ములు రేఁగె నదేమి చిత్రమో!"
ఉ.
స్నిగ్ధపువర్ణుఁ డీశ్వరుఁడు చిచ్చఱకంటను బంచబాణునిం
దగ్ధముచేసె నంచు విని తామరసేక్షణు మ్రోల నున్న యా
ముగ్ధపు లచ్చి మోదుకొనె; మోహనగంధము పిండిపిండియై
దుగ్ధపయోధి మధ్యమున దుమ్ములు రేఁగె నదేమి చిత్రమో!
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

సమస్యా పూరణం -376 (మీసమ్ములు మొలిచె)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
మీసమ్ములు మొలిచెఁ గనుఁడు మీననయనకున్.

27, జూన్ 2011, సోమవారం

చమత్కార పద్యాలు - 88 (గాడిద యేడిచెఁ గదన్న)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 32
సమస్య _
"గాడిద యేడిచెఁ గదన్న ఘనసంపన్నా!"
కం.
"ఆడిన మాటకుఁ దప్పెను
గాడిదకొడు" కంచుఁ దిట్టఁగా విని "యయ్యో
వీఁడా నా కొక కొడు" కని
గాడిద యేడిచెఁ గదన్న ఘనసంపన్నా!
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

సమస్యా పూరణం -375 (శంకరునకు గలవు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
శంకరునకు గలవు వంక లెన్నొ!
నిన్న నన్ను "వంకరయ్యా!" అని సంబోధించిన బాల్యమిత్రుడు `గుజరాతి లక్ష్మన్ సా' కు ధన్యవాదాలతో ....

26, జూన్ 2011, ఆదివారం

చమత్కార పద్యాలు - 87 (సుగ్రీవుని యెడమకాలు)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 31
సమస్య -
"సుగ్రీవుని యెడమకాలు శునకము గఱచెన్"
కం.
అగ్రారపు నడివీథిని
నిగ్రహముగ బొమ్మలాట నేర్పుగ నాడన్
విగ్రహము లెత్త మఱచిన
సుగ్రీవుని యెడమకాలు శునకము గఱచెన్.
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

సమస్యా పూరణం -374 (ఓనమాలు రాని)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
ఓనమాలు రాని యొజ్జ మేలు!
ఈ సమస్యను పంపిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.

25, జూన్ 2011, శనివారం

చమత్కార పద్యాలు - 86 (నిప్పున నొక చేరెఁడంత)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 30
సమస్య -
"నిప్పున నొక చేరెఁడంత నెత్తురు గాఱెన్"
కం.
కుప్పించి వెలుగు దూఁకిన
గొప్ప ములిదె నాటె నిపుడు; కోమలి త్వరగా
నుప్పుఁ గొనిరమ్ము కాఁతము
నిప్పున; నొక చేరెఁడంత నెత్తురు గాఱెన్.
[వెలుగు = కంచె; ములిదె = ములు (ముల్లు) + ఇదె]
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.