26, జూన్ 2011, ఆదివారం

సమస్యా పూరణం -374 (ఓనమాలు రాని)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
ఓనమాలు రాని యొజ్జ మేలు!
ఈ సమస్యను పంపిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.

20 కామెంట్‌లు:

  1. విద్య నేర్వ వచ్చు విద్యార్ధుల నెడను
    ఘోర హింస మరియు గోరి, లైంగి
    కముగ బాధ పెట్టు కార్యక్రమములందు,
    ఓనమాలు రాని యొజ్జ మేలు!

    రిప్లయితొలగించండి
  2. మదము పెరిగి ప్రీతి మాతృభాషను జెప్ప
    సంశయించు నట్టి భ్రంశు గంటె
    తెలుగు పలుకు లాడి తేట గీతులు పాడు
    ఓనమాలు రాని యొజ్జ మేలు .

    అజ్ఞాత వాసములో - నరసిం హ మూర్తి

    రిప్లయితొలగించండి
  3. ' ఆ, ఇ, ఊ ' ల నేర్వ నాసక్తి కల్గించి
    ' అరటి, ఆవు, ఇటుక ' లనగ నేర్పి
    బాల బాలికలను లాలించు పరభాష
    నోనమాలు రాని యొజ్జ మేలు!

    రిప్లయితొలగించండి
  4. నిష్ఠఁబూని సుతకుఁ నేర్పగఁ గోరితి
    నోనమాలు! రాని యొజ్జ, మేలు
    గూర్ప గలడె? వినుము, గొప్పగఁ బిడ్డకు
    విద్య గరపు నొజ్జ వీరు గలరు.

    రాని గురువు గురించి చింత వలదు, ఇంకొక గొప్ప గురువున్నారు ,చూడమనుట.

    రిప్లయితొలగించండి
  5. విద్య వచ్చి యుండి ,వినయమ్ము లేనట్టి,
    నీతి,రీతి లేని భీతి గొల్పు
    పనులు జేయు నట్టి,బరమ మూర్ఖునికంటె
    ఓనమాలు రాని యొజ్జ మేలు!!!

    రిప్లయితొలగించండి
  6. మిస్సన్న మహాశయా ధన్యవాదములు. మీ పూరణలు యెల్లప్పుడు సుందరంగా యుంటాయి. మీరెక్కడ పద్యము వ్రాసినా చదివి ఆనందిస్తాను.

    నరసింహ మూర్తి

    రిప్లయితొలగించండి
  7. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    01)
    __________________________________

    తేనె లొలుకు నట్టి - తెలుగు భాషను నేర్ప
    దేవభాషయందు - దీప్తి వలయు !
    పాడు జేయు, హూణ - భాష యందు
    ఓనమాలు రాని - యొజ్జ మేలు!
    __________________________________

    రిప్లయితొలగించండి
  8. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ‘హింసావిద్య’లో ఓనమాలు రాని గురువు ... బాగుంది. మంచి పూరణ. అభినందనలు.

    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

    మిస్సన్న గారూ,
    పరభాషలో ఓనమాలు రాని ఒజ్జ .. మంచి ఊహ. బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. మందాకిని గారూ,
    మీ పదాల విఱుపులోని చాతుర్యం అబ్బురపరచింది. చాలా బాగుంది పూరణ. అభినందనలు.

    మంద పీతాంబర్ గారూ,
    మంచి పూరణ. మీ పద్యం చూస్తుంటే ‘గురోరప్యవలిప్తస్య ...’ శ్లోకం గుర్తుకు వచ్చింది. అభినందనలు.

    వసంత కిశోర్ గారూ,
    మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. నాస్తికుండొకండు నయముగ పల్కెను
    "ఓం నమః యనంగ, నూరకేల
    వచ్చు విద్యలన్ని? వలదు మంత్రము మాకు!
    ఓనమాలు రాని యొజ్జ మేలు!"

    రిప్లయితొలగించండి
  11. జిగురు సత్యనారాయణ గారూ,
    ఓనమాల అర్థాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకొని చక్కని పూరణ చేసారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. గురువుగా రన్నాక మరోసారి చూశాను. మందాకినీ గారి పద్యం అద్భుతంగా ఉంది.

    రిప్లయితొలగించండి
  13. జి యస్ యన్ గారూ ! నాస్తిక మనస్తత్వాన్ని చక్కగా చెప్పారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. అందరి పూరణలూ చక్కగా అనిపించాయి.
    మిస్సన్నగారూ, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  15. శ్రీపతిశాస్త్రిసోమవారం, జూన్ 27, 2011 10:48:00 PM

    శ్రీగురుభ్యోనమ:

    సర్వముతెలుసునను గర్వముజూపుచూ
    చదువు చెప్పలేని చవటకన్న
    ఆదరమును జూపు ఆయాగ పనిచేయు
    ఓనమాలురాని యొజ్జ మేలు

    కాన్వెంట్లలో పిల్లలకు ఆయాలు అన్నం తినటం మొదలైనవి నేర్పించే గురువులే కద.

    రిప్లయితొలగించండి
  16. శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
    ప్రథమపాదాంతంలో ‘చూపుచూ’ అన్నచోట ‘చూపుచున్’ అనండి.

    రిప్లయితొలగించండి