28, జూన్ 2011, మంగళవారం

చమత్కార పద్యాలు - 89 (దుగ్ధపయోధి మధ్యమున)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 33
సమస్య - "దుగ్ధపయోధి మధ్యమున
దుమ్ములు రేఁగె నదేమి చిత్రమో!"
ఉ.
స్నిగ్ధపువర్ణుఁ డీశ్వరుఁడు చిచ్చఱకంటను బంచబాణునిం
దగ్ధముచేసె నంచు విని తామరసేక్షణు మ్రోల నున్న యా
ముగ్ధపు లచ్చి మోదుకొనె; మోహనగంధము పిండిపిండియై
దుగ్ధపయోధి మధ్యమున దుమ్ములు రేఁగె నదేమి చిత్రమో!
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

6 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !
    01)
    ____________________________________________

    స్నిగ్ధపు వర్ణు డీశ్వరుడు - చిచ్చును కంఠము నందు దాచెగా !
    దుగ్ధపయోధి మున్సురలు - దుండగు లైనటు వంటి రాక్షసుల్
    దుగ్ధము చిల్కువేళ ఘన - దుర్భర శబ్ధము తోడ నయ్యెడన్
    దుగ్ధపయోధి మధ్యమున - దుమ్ములు రేగె నదేమి చిత్రమో !
    _____________________________________________

    రిప్లయితొలగించండి
  2. దగ్ధము జేతు నో నరక! దాగకు మాకసమందు పోరుమా !
    దుగ్ధము త్రాగు బాలునని దూరకు! మిప్పుడె దుమ్ము రేపి సం
    దిగ్ధము దీర్తునంచు తల దీయగ కృష్ణుడు చక్ర మంపగా
    దుగ్ధపయోధి మధ్యమున దుమ్ములు రేఁగె నదేమి చిత్రమో!!

    రిప్లయితొలగించండి
  3. ముగ్ధగఁ భర్తకెల్లపుడు ముచ్చట సేవలఁ జేయుభార్యగాన్
    స్నిగ్ధపు వర్ణసుందరియు శ్రీలను ధారల నిచ్చులక్ష్మి! నీ
    దుగ్ధపయోధి మధ్యమున దుమ్ములు రేఁగె నదేమి!చిత్రమో,
    దుగ్ధనుఁ దేవదానవులు దుగ్ధము చిల్కుచు నేమిఁ జేసిరో!

    దుగ్ధ = దురాశ అని తెలుగులో వాడతాం కదా!

    రిప్లయితొలగించండి
  4. వసంత కిశోర్ గారూ,
    అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

    మందాకిని గారూ,
    మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. స్నిగ్ధపు పాలనున్ గొనుచు నీరము దండిగ కల్పియమ్ముచున్
    ముగ్ధుడునౌచు నాయుడట మూటల లాభము పెంచగోరుచున్
    స్నిగ్ధపు సోపు పౌడరును నిండుగ పోయుచు చిల్కుచుండగా
    దుగ్ధపయోధి మధ్యమున దుమ్ములు రేఁగె నదేమి చిత్రమో!

    రిప్లయితొలగించండి