27, జూన్ 2011, సోమవారం

చమత్కార పద్యాలు - 88 (గాడిద యేడిచెఁ గదన్న)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 32
సమస్య _
"గాడిద యేడిచెఁ గదన్న ఘనసంపన్నా!"
కం.
"ఆడిన మాటకుఁ దప్పెను
గాడిదకొడు" కంచుఁ దిట్టఁగా విని "యయ్యో
వీఁడా నా కొక కొడు" కని
గాడిద యేడిచెఁ గదన్న ఘనసంపన్నా!
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

19 కామెంట్‌లు:

  1. గాడినిఁ దప్పెను చూడుము,
    వీడిగుణముఁదెలిసెనిప్డు, విశ్వాసమునే
    వీడిన శునకమ్మిదియని
    గాడిద యేడిచెఁ గదన్న ఘనసంపన్నా!

    కుక్క, గాడిదలను పెంచుకున్న ఒక చాకలి నిద్రలో ఉన్నపుడు దొంగలు ఇంటిని దోచుకుపోతుండగా, బద్ధకముతో అరవని కుక్కనుగాడిద కోపపడి, తానే యజమానిని లేపాలని ఓండ్రపెట్టి, యజమాని మెప్పును పొందకపోగా, నిద్రాభంగము చేసినందుకు దెబ్బలు దిని తనకుమాలిన ధర్మము మొదలు చెడ్డ బేరము అని తెలుసుకున్న గాడిద కథ మనందరకూ తెలిసిందే. ఆ గాడిద ఎలా బాధపడిందో ఇక్కడ వివరించాను.

    రిప్లయితొలగించండి
  2. (మోచర్ల వారి బాటలోనే ...)

    ఆడిన మాటను దప్పగ,
    వేడుకగా దిరిగి చదువు వెనుకన వేయన్!
    వాడికి నా పేరా? యని
    గాడిద యేడిచెఁ గదన్న ఘనసంపన్నా!!

    రిప్లయితొలగించండి
  3. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    దేవకికి అష్టమ గర్భ సంజాతు డుదయించగానే
    గాడిదరూపంలో కావలియున్న కంస భటుడు
    తన యేలికను తలచుకొని దుఃఖ్ఖించిన వైనం :

    1)
    _______________________________

    చూడుము ప్రసవం బాయెను
    వీడే కాబోలు నిన్ను - పేరడగించున్ !
    తోడే లేదిక నీకని
    గాడిద యేడిచెఁ గదన్న - ఘనసంపన్నా!
    _______________________________

    రిప్లయితొలగించండి
  4. మిత్రుల పూరణలు బ్రహ్మాండము.

    మిత్రులు చంద్రశేఖరుల వారికి ధన్యవాదములు.

    కాడికి యెద్దుల నోపక
    గాడిదలను గట్టిరంట కర్షక వరులున్
    ఓడిన హలములు దాల్చుచు
    గాడిద లేడ్చెఁ గదర ఘన సంపన్నా !

    రిప్లయితొలగించండి
  5. వేడుక యా దినములలో
    వాడుకగా దినగ నేర్చి వర సాహితి నీ
    నాడును నీనాడుల ! యని
    గాడిద యేడ్చెఁ గదర ఘన సంపన్నా !

    రిప్లయితొలగించండి
  6. క్షమించాలి
    సమస్య ఆఖరు పాదములను

    గాడిద లేడిచె గదన్న ఘన సంపన్నా

    గాదిద యేడిచె గదన్న ఘన సంపన్నా అని సవరించుకొని చదువ ప్రార్ధన.

    రిప్లయితొలగించండి
  7. నాడును, నేడును మరియే
    నాడును సోమరులనెల్ల, నలుగురు వినగా
    గాడిద లారా యనగా,
    గాడిద యేడిచె గదన్నఘన సంపన్నా!!!

    రిప్లయితొలగించండి
  8. మందాకిని గారూ,
    మంచి కథను గుర్తుకు తెస్తూ మంచి పూరణ నిచ్చారు. అభినందనలు.

    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    భావం అదే అయినా పద్యం చెప్పిన తీరు అమోఘం. అభినందనలు.

    వసంత కిశోర్ గారూ,
    పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    ‘నిన్ను పేరడగించున్’ అన్నచోట ‘నీదు పేరడగించున్’ అంటే బాగుంటుంది.

    రిప్లయితొలగించండి
  9. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ రెండు పూరణలలో మొదటిది ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    రెండవ పూరణకు చిన్న వివరణ ఇస్తారా?

    మంద పీతాంబర్ గారూ,
    సోమరుల నుద్దేశించి మీరు చేసిన పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. ఓడిన నోర్వని వాడును!
    వాడుకగా జాతి సొత్తు వాడెడి వాడున్!
    నేడేలు కొడుకులని యా
    గాడిద యేడిచెఁ గదన్న ఘనసంపన్నా

    రిప్లయితొలగించండి
  11. మిస్సన్న గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. గాడిని దప్పిన కొమరుని
    గాడిద కొడుకంచు తండ్రి ఘనముగ తిట్టన్ !
    చూడుము బిడ్డా మనగతి
    గాడిద యేడిచె గదన్న ఘన సంపన్నా ?

    రిప్లయితొలగించండి
  13. శ్రీపతిశాస్త్రిసోమవారం, జూన్ 27, 2011 10:59:00 PM

    శ్రీగురుభ్యోనమ:

    వాడుకగా రేవుకుజను
    వాడా చాకలి దిగులుగ వ్రాలెన్ నేలన్
    వేడికి నోపగ చావగ
    గాడిద, యేడిచె గదన్న ఘనసంపన్నా

    రిప్లయితొలగించండి
  14. శంకరార్యా ! ధన్యవాదములు !
    చంపు = పేరడగించు
    కావున " నిన్ను పేరడగించున్ " అనడం జరిగింది !

    మిత్రులందరి పూరణలూ ముచ్చటగా నున్నవి !

    రిప్లయితొలగించండి
  15. రాజేశ్వరక్కా,
    చక్కని పూరణ. అభినందనలు.
    చాలా కాలానికి పద్యం నిర్దోషంగా వ్రాసారు. ధన్యోऽస్మి!

    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ వైవిధ్యంగా బాగుంది. అభినందనలు.

    వసంత కిశోర్ గారూ,
    మీరు ఆ రూట్లో వచ్చారా? బాగు .. బాగు.. నేను అర్థం చేసికొనడంలో పొరబడ్డాను. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  16. శ్రీపతిశాస్త్రిబుధవారం, జూన్ 29, 2011 11:22:00 PM

    శ్రీగురుభ్యోనమ:
    పై పద్యపాదాన్ని సమస్యాపూరణగా భావించి అలా అపూరించాను. చమత్కారంగా క్రిందివిధంగా

    చూడర సుతుడా మనుజుల
    క్రీడలు, మనపై భారములు వైచి గెంటిరి మనకున్
    కూడైన నిడరు యనుచున్
    గాడిద యేడిచె గదన్న ఘన సంపన్నా

    రిప్లయితొలగించండి
  17. శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  18. రోడున లూనాలనుగని
    వేడుకగా చాకలోండ్రు బిరబిర కొనగా
    వీడెదరిక నన్ననుచును
    గాడిద యేడిచెఁ గదన్న ఘనసంపన్నా!



    రిప్లయితొలగించండి