3, నవంబర్ 2025, సోమవారం

సమస్య - 5294

4-11-2025 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పాపచిత్తుఁడు చేరెను స్వర్గమునకు”
(లేదా...)
“పాపాత్ముండగు మానవుండు గనఁగా స్వర్గంబుఁ జేరెన్ గటా”

10 కామెంట్‌లు:

  1. శా.
    భూపాలన్యుని యుద్ధ రంగమున నుద్భూత ప్రతాపంబుతో
    వే పోరాడుచు బ్రోచి ప్రాణముల దా వీడెన్, వితర్కింప బూ
    ర్వాపూర్వంబుల బుణ్య సంపదలు లేవాదర్శముం జూప, న
    ప్పాపాత్ముండగు మానవుండు గనగా స్వర్గంబు జేరెం గటా !

    రిప్లయితొలగించండి
  2. తేటగీతి
    దూరి లింగని గుడిలోన చోరుఁడొకఁడు
    ప్రమిదఁ గార్తిక పౌర్ణమి రాత్రివేళ
    వత్తి నెగ ద్రోసి వెలుగులు పంచినంత
    పాపచిత్తుఁడు చేరెను స్వర్గమునకు!

    శార్దూలవిక్రీడితము
    పాపంబున్ బరిమార్చు కార్తికమె దీపంబుంచినంతన్, గుడి
    న్నాపద్ధర్మమనంగ వత్తినెగ ద్రోయన్ వెల్గ చోరుండహో!
    యేపారంగను పుణ్యమే యఘములన్నీడేర్చ జన్మంబునన్
    పాపాత్ముండగు మానవుండు గనఁగా స్వర్గంబుఁ జేరెన్ గటా!

    రిప్లయితొలగించండి

  3. పరమ పాపి యైనను గూడ భక్తి తోడ
    కొండ యల్లుని శివరాత్రి కొలుచు వేళ
    మరణ మాసన్న మగుటచే మాన్యు డగుచు
    పాపచిత్తుఁడు చేరెను స్వర్గమునకు.


    పాపంబెంతయొ చేయ నేమి కడుకున్ వార్థక్య మందున్ సదా
    యా పింగాక్షుని నామమయ్యదియె సత్యంబంచు తా నమ్ముచున్
    వ్యాపారంబులు వీడిపేదలకు నాహారంబు నందించు చున్
    బాపాత్ముండగు మానవుండు గనఁగా స్వర్గంబుఁ జేరెన్ గటా.

    రిప్లయితొలగించండి
  4. ఎన్ని కష్టములందున యిమిడియుండి
    కూడ , వాటిని తొలగించు కొనుటకొరకు
    దుష్కృతముల నితరులకు దొరయకుండు
    పాపచిత్తుఁడు చేరెను స్వర్గమునకు

    పాప = మృదువు

    రిప్లయితొలగించండి
  5. పుణ్యలోకాల కరుగును పుణ్యజీవి
    పాపులకు కాలసూత్రమే ప్రాప్తమగును
    వీరమరణమొందిన యుద్ధవీరుడగుచు
    పాపచిత్తుఁడు చేరెను స్వర్గమునకు

    పాపాత్ముండయినన్ గమించు దివికిన్ బ్రాప్తించగా పుణ్యమే
    పాపంబుల్ పరిహారమౌనుగద కాపాలేశ్వరున్ జూడగా
    పాపాలెన్నియొ చేసియున్న భటుడే ప్రాఘాతమున్ గ్రుంకగా
    పాపాత్ముండగు మానవుండు గనఁగా స్వర్గంబుఁ జేరెన్ గటా

    రిప్లయితొలగించండి
  6. ఆదివారము గావున ననువు దొరికె
    ననుచు , పాప బొమ్మలదోడ నాడుచుండ
    కడకు వచ్చి చేరిన వృశ్చికమును జంప
    పాపచిత్తుఁడు చేరెను స్వర్గమునకు

    రిప్లయితొలగించండి
  7. శా||

    కోపంబున్ గడు జూపుచున్... బరులకున్ ఘోరమ్ముగా నిర్దయన్

    తాపంబుల్, కడగండ్లు బెట్టుచు... సదా తా జేసినన్ బెక్కుగా

    బాపాలన్...శివరాత్రి పర్వదినమే స్వర్గస్తుడైనట్టి య

    ప్పాపాత్ముండగు మానవుండు గనఁగా స్వర్గంబుఁ జేరెన్ గటా


    -- ఆకుల శాంతి భూషణ్
    వనపర్తి

    రిప్లయితొలగించండి
  8. శాపవశమున దైత్యుడై జన్మమెత్తి
    దర్పకామోద్ధతిఁ వెడగు దారి నడచి
    రామబాణోపహతిఁ గూలి రావణుండు
    *పాపచిత్తుఁడు చేరెను స్వర్గమునకు*

    రిప్లయితొలగించండి
  9. తే.గీ:యముని నీ రీతి గా సంశయమున నడిగె
    ధర్మజుం " డార్య! యెన్నో యధర్మములను
    జేసె నీ సుయోధను డేమి చేసి యిట్టి
    పాపచిత్తుఁడు చేరెను స్వర్గమునకు?

    రిప్లయితొలగించండి
  10. శా:పాపుల్ మద్యము ద్రావు బారునకు నీ స్వర్గమ్మటంచున్ ఘనం
    బౌ పే రెట్టుల బెట్టిరో గుడిన బూజారిత్వమున్ జేయు నే
    పాప మ్మం చటు బోను గాని మరిగెన్ బాబాయి యీ బారునే
    పాపాత్ముండగు మానవుండు గనఁగా స్వర్గంబుఁ జేరెన్ గటా”
    (ఆ బారు కి స్వర్గం అనే పేరు పెట్టారు.ఇతడు పూజారి కాబట్టి ఆ స్వర్గానికి పోడు కానీ వీళ్ల బాబాయి ఆ బార్ ని మరిగాడు.పూజారి లో పూజకు అరి అనే ప్రత్యయం ఉంది కనుక యతి సరిపోయిందని భావిస్తున్నాను.అది సరి కాకుంటే "బూజాదుల్ సదా జేయు" అని తీసుకొని వచ్చును.)

    రిప్లయితొలగించండి