17, నవంబర్ 2025, సోమవారం

సమస్య - 5307

18-11-2025 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రామునాజ్ఞ వాలియె సముద్రమును దాఁటె”
(లేదా...)
“రామోక్తిన్ దలఁ దాల్చి వాలియె సముద్రంబున్ దరించెన్ గదా”

9 కామెంట్‌లు:

  1. తేటగీతి
    వాలమున్ గల్గ మారుతి వాలియౌను
    జానకీమాత వెదుకంగ వానరాళి
    తరళినారు నల్దిక్కులన్ దక్షిణమున
    రామునాజ్ఞ వాలియె సముద్రమును దాఁటె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శార్దూలవిక్రీడితము
      నీమంబున్ విడనాడి భంగపడుచున్ నేర్పంగఁ బౌలస్తియే
      కామోద్రేకము మీరి రావణుఁడు లంకన్ జేర్చ సీతమ్మనే
      సేమంబున్ గనిరాగ దిక్కుకొకరున్ జేరంగ హన్మంతుఁడై
      రామోక్తిన్ దలఁ దాల్చి వాలియె సముద్రంబున్ దరించెన్ గదా!

      తొలగించండి
  2. శా.
    భీమాకారము నొంది కొండకొనపై పెన్గర్జనల్ చేసి సీ
    తామాతం గని లంకకుం జని విరోధవ్రాతముల్ కూల్చి దో
    స్సామర్థ్యంబును జూప వాయుసుతు డుత్సాహించె, రాజాజ్ఞయౌ
    రామోక్తిం దల దాల్చి వాలియె సముద్రంబుం దరించెం గదా !

    (వాలి - వాలము కలిగిన వాడు)

    రిప్లయితొలగించండి
  3. తమ్ముని దన రాజ్యమునుండి తరిమివేయు
    కతన కలిగిన కష్టపు కడలి దోడ
    సతమతము నొందుచుండిన సమయమందు
    రామునాజ్ఞ వాలియె సముద్రమును దాఁటె”

    రిప్లయితొలగించండి
  4. చదువు సంధ్యలు తెలియని చవటయొకఁడు
    రామచరితముఁ దెలిపెద రండటంచు
    పిలిచి తనవారినెల్లరఁ బలికె నిటుల
    “రామునాజ్ఞ వాలియె సముద్రమును దాఁటె”

    రిప్లయితొలగించండి
  5. వామాక్షీ! విను రామచంద్రుని కథన్ భవ్యంబుగా దెల్పెదన్
    క్షేమంబున్ ఠవణించునంచు బలికెన్ శీనుండు తానిట్టులన్:
    రాముండాజ్ఞ యొసంగ సీతనుగనన్ లంకాపురంబందునన్
    రామోక్తిన్ దలఁ దాల్చి వాలియె సముద్రంబున్ దరించెన్ గదా

    రిప్లయితొలగించండి

  6. వాలి సుగ్రీవు హనుమల పోలికలవి
    చూడ నొకవిధముగ నుండ చోద్యముగను
    పావనిని వాలి యనుకుని బాలకుడనె
    రామునాజ్ఞ వాలియె సముద్రమును దాఁటె.



    సౌమిత్రేల విభీషణున్ బ్రభువు గాసమ్మానమున్ జేసెనో
    నేమమ్మున్ విడి తమ్మువానికటహానిన్ గూర్చె నెవ్వాడు రో
    రామున్గార్య మటంచు పావనియె ధైర్యంబెట్లు తా జూపెనో
    రామోక్తిన్ దలఁ దాల్చి, వాలియె, సముద్రంబున్ దరించెన్ గదా.

    రిప్లయితొలగించండి
  7. శక్తిమంతులకే కష్టసాధ్యమైన
    పనిని సాధింప నెంచుచు బయలు దేరె
    నేలచూలిని గాలింప గాలిచూలి
    రామునాజ్ఞ వాలియె సముద్రమును దాఁటె

    రామార్తిన్ గమనించి తాను మదిలో లక్ష్యంబునే గూర్చుచున్
    సామాన్యుల్ తలపెట్టలేని విధినే సాధింపగా నెంచుచున్
    భామన్ గన్గొనివత్తునంచు పలికెన్ వాతాత్మజుండచ్చటన్
    రామోక్తిన్ దలఁ దాల్చి వాలియె సముద్రంబున్ దరించెన్ గదా

    [వాలియె = విజృంభించియె]

    రిప్లయితొలగించండి
  8. భరతు డెవరియాజ్ఞనయోధ్య పురముకేగె
    సూడుకొని యేచెనెవ్వడు సూర్యసుతుని
    అవనిజను వెదకగనేమి హనుమ జేసె
    రామునాజ్ఞ వాలియె సముద్రమును దాఁటె

    (క్రమాలంకారము )

    రిప్లయితొలగించండి