6, నవంబర్ 2025, గురువారం

సమస్య - 5297

7-11-2025 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చిన్న యెవ్వఁ డిందు మిన్న యెవఁడు”
(లేదా...)
“చిన్న యెవండొ మిన్నగనుఁ జేకొన నర్హుఁ డెవండొ చెప్పుమా”

5 కామెంట్‌లు:

  1. ఉ.
    పున్నమి నాడు నాదు వ్రతముం గని దానములంద గోరి యీ
    వెన్నెల వెల్గు వెల్లువుల వ్రేకదనంబును జూపు దేహముల్
    చెన్నుగ గల్గు పౌరులు విశేషముగా నిట వచ్చిరంగనా
    చిన్న యెవండొ ? మిన్నగను జేకొన నర్హుడెవండొ ? చెప్పుమా !

    రిప్లయితొలగించండి

  2. (శ్రీ రాముని అంతర్మథనము)

    చూడగ నిట వీరు సుగ్రీవుడును వాలి
    యొక్క విధము గానె యుండి రైరి
    ఎటుల బోల్చు కొందు నిచట వీరల లోన
    చిన్న యెవ్వఁ డిందు మిన్న యెవఁడు.


    వెన్నుని కాదు కాదనుచు వెంగళి యాశిశు పాలుడే భువిన్
    మిన్న యటంచు నెంచితిరి మీకది ధర్మము కాదు పెద్దవై
    యన్నగ మేలుకోరుకుని యామె మనస్సు నెఱంగు మంటినే
    చిన్న యెవండొ మిన్నగనుఁ జేకొన నర్హుఁ డెవండొ చెప్పుమా.

    రిప్లయితొలగించండి
  3. ఎన్నికలిటఁ దెచ్చె నెన్నియో కడగండ్లు
    కన్నమేసి దోచు ఘనుడొకండు
    పన్నులెల్లఁ మ్రింగు పాపి మరియొకండు
    చిన్న యెవ్వఁ డిందు మిన్న యెవఁడు

    ఎన్నిక తెచ్చెఁ బౌరులకు నెన్నడులేని సమస్య లిచ్చటన్
    గన్నమువైచి దొంగిలిన గర్వితుడొక్కడు నిల్చె నిచ్చటన్
    బన్నుల సొమ్ముతో మిగుల పాపపు కర్మలు సల్పెనొక్కడున్
    చిన్న యెవండొ మిన్నగనుఁ జేకొన నర్హుఁ డెవండొ చెప్పుమా

    రిప్లయితొలగించండి
  4. ఒక పార్టీ అంతర్గత సమావేశంలో పార్టీ అధ్యక్షులవారు:

    ఆటవెలది
    ప్రజలకాంక్ష మేర పాలించు నేతనే
    యెన్నుకొనఁగవలయు నెప్పుడైన
    వందయేళ్లు దాటె పక్షమారంభించి
    చిన్న యెవ్వఁ డిందు మిన్న యెవఁడు?

    ఉత్పలమాల
    మన్ననలందినాము ప్రజ మద్దతు నీయఁగ గద్దెనెక్కగా
    నెన్నుకొనంగ మేలగు ననేకులు మెచ్చెడి ముఖ్యమంత్రినిన్
    నిన్నటి పక్షమా? శతము నిండెను నేటికి! నందరందరే!
    చిన్న యెవండొ మిన్నగనుఁ జేకొన నర్హుఁ డెవండొ చెప్పుమా?

    రిప్లయితొలగించండి
  5. అతిథులందు యెవరి నగ్రగ ణ్యుడనగ
    చిన్న యెవ్వఁ డిందు మిన్న యెవఁడు
    గ తలచనగు ననుచు కలవర మొందగ
    వృష్ణి యనుచు దెలపె భీష్ము డపుడు

    రిప్లయితొలగించండి