4, నవంబర్ 2011, శుక్రవారం

సమస్యా పూరణం - 515 (కొంటెవాఁ డెదిగెను)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
కొంటెవాఁ డెదిగెను జగద్గురు వనంగ.
ఈ సమస్యను సూచించిన పండిత నేమాని గారికి ధన్యవాదాలు.
*********************************************************************************

3, నవంబర్ 2011, గురువారం

చమత్కార పద్యాలు - 132

*********************************************************************************
చతుర్విధ కందం
*సురరాజ వినుత నిర్మల
చరితా! *పరమాంతరంగ! సజ్జన వరదా!
*నరవర! విశేష పావన
చరణా! *కరుణా నిధాన! సత్పథ నిరతా!

ఈ కందపద్యంలో 4 * గుర్తులున్నాయి. ఏ గుర్తునుండి మొదలుపెట్టినా పద్యాన్ని అర్థవంతంగా చదువుకొన వచ్చు. ఆ విధంగా 4 పద్యాలను ఇక్కడ చూడవచ్చు.

ప్రథమ కందం ....
సురరాజ వినుత నిర్మల
చరితా! పరమాంతరంగ! సజ్జన వరదా!
నరవర! విశేష పావన
చరణా! కరుణా నిధాన! సత్పథ నిరతా!

ద్వితీయ కందం ....
పరమాంతరంగ! సజ్జన
వరదా! నరవర! విశేష పావనచరణా!
కరుణా నిధాన! సత్పథ
నిరతా! సురరాజ వినుత నిర్మలచరితా!

తృతీయ కందం ....
నరవర! విశేష పావన
చరణా! కరుణా నిధాన! సత్పథ నిరతా!
సురరాజ వినుత నిర్మల
చరితా! పరమాంతరంగ! సజ్జన వరదా!

చతుర్థ కందం ....
కరుణా నిధాన! సత్పథ
నిరతా! సురరాజ వినుత నిర్మలచరితా!
పరమాంతరంగ! సజ్జన
వరదా! నరవర! విశేష పావనచరణా!

శ్రీ పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారి
‘శ్రీమదధ్యాత్మ రామాయణము’ నుండి
*********************************************************************************

సమస్యా పూరణం - 514 (జనముఁ గాంచి నేత)

*********************************************************************************
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
జనముఁ గాంచి నేత జాఱుకొనెను
ఈ సమస్యను పంపిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.
*********************************************************************************

2, నవంబర్ 2011, బుధవారం

సమస్యా పూరణం - 513 (మస్తకమ్మును మించునే)

*********************************************************************************
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
మస్తకమ్మును మించునే పుస్తకమ్ము?
ఈ సమస్యను పంపిన
పండిత నేమాని వారికి
ధన్యవాదాలు.
*********************************************************************************

1, నవంబర్ 2011, మంగళవారం

ఔపవిభక్తికాలు

ఔపవిభక్తికాలు
ద్వితీయ మొదలైన విభక్తుల ఏకవచన శబ్దాలకు ముందు (సమీపంలో) చేరేవి కనుక వీటిని ఉపవిభక్తులు అంటారు. ‘ఇ, టి, తి’ అనే వర్ణాలు ఉపవిభక్తులు. వీటినే ఔపవిభక్తికాలు అంటారు. ఇవి చేరే పదాలను కూడ ఔపవిభక్తికాలు అనే అంటారు.
1) ఇ-టి-తి వర్ణంబులు వక్ష్యమాణంబు లౌపవిభక్తికంబులు.
ముందు చెప్పబోయే ఆయా సూత్రాలచేత విధింపబడే ఇ, టి, తి వర్ణాలు ఔపవిభక్తికాలు. ద్వితీయ మొదలైన విభక్తుల కారణంగా ఇవి వచ్చిచేరుతాయి. ఇవి కొన్ని చోట్ల పదాల తుది అక్షరాలకు ఆదేశం గాను, మరికొన్ని చోట్ల ఆగమం గాను చేరుతూ ఉంటాయి.
2) ఇవి ద్వితీయాద్యేకవచనంబులు పరంబు లగునపుడు నామంబులకుం గొన్నింటికిం బ్రాయికంబుగ నగు.
ఈ ఇ, టి, తి వర్ణాలు ద్వితీయనుండి అన్ని విభక్తులలో ఏకవచనం పరమైనపుడు కొన్ని శబ్దాలకు తరచుగా చేరుతూ ఉంటాయి.
‘కాలు’కు ద్వితీయ ఏకవచన ప్రత్యయం ‘ను’ చేరినపుడు ‘కాలు + ను’ అవుతుంది. దానికి ‘ఇ’ చేరగా ‘కాలు + ఇ + ను = కాలి +ను’ అవుతుంది. ‘ఇకారం మీది కు, ను, వు అనే క్రియావిభక్తుల ఉత్వానికి ఇత్వం అవుతుంది’ అనే సూత్రం వల్ల ‘కాలి + ని = కాలిని’ అవుతుంది. అదే విధంగా ‘కాలు + చే = కాలిచే’ అవుతుంది.
‘నాగలి’కి ద్వితీయ ఏకవచన ప్రత్యయం ‘ను’ చేరినపుడు ’నాగలి + ను’ అవుతుంది. దానికి ‘టి’ ఆదేశమై ‘నాగటి + ను -> నాగటిని’ అవుతుంది.
‘నేయి’కి ద్వితీయ ఏకవచన ప్రత్యయం ‘ను’ చేరినపుడు ‘నేయి + ను’ అవుతుంది. దానికి ‘తి’ చేరగా ‘నేతి + ను -> నేతిని’ అవుతుంది.
3) టివర్ణంబు గొన్నింటి యంతాక్షరంబున కాదేశంబును, గొన్నింటి కంతాగమంబును, గొన్నింటికిం బర్యాయంబున రెండును బ్రాయికంబుగ నగు.
‘టి’ వర్ణం కొన్ని శబ్దాల తుది అక్షరానికి ఆదేశంగాను, కొన్నింటికి ఆగమంగాను, కొన్నింటికి రెండూ వస్తాయి.
ఆదేశానికి ....
త్రాడు + ను -> త్రాటి + ను -> త్రాటిని
కాడు + ను -> కాటి + ను -> కాటిని
నోరు + ను -> నోటి + ను -> నోటిని
ఆగమానికి ....
అన్ని + ను -> అన్ని + టి + ను -> అన్నిటిని
ఎనిమిది + ను -> ఎనిమిది + టి + ను -> ఎనిమిదిటిని
వేయి + ను -> వేయి + టి + ను -> వేయిటిని
ఉభయానికి (ఆదేశ, ఆగమాలు రెండూ) ....
ఏమి + ను -> (ఆదేశం) ఏటి + ను -> ఏటిని;
.......................... (ఆగమం) ఏమి + టి + ను -> ఏమిటిని.
పగలు + ను -> (ఆదేశం) పగలు + ను -> పగటిని;
............................. (ఆగమం) పగలు + ఇ + టి + ను -> పగలిటిని.
మొదలు + ను -> (ఆదేశం) మొదలు + టి + ను -> మొదటిని;
.................................. (ఆగమం) మొదలు + ఇ + టి + ను -> మొదలిటిని.
రెండు + ను -> (ఆదేశం) రెండు + టి + ను -> రెంటిని;
............................ (ఆగమం) రెండు + ఇ + టి + ను -> రెండిటిని.
మూఁడు + ను -> (ఆదేశం) మూఁడు + టి + ను -> మూఁటిని;
................................. (ఆగమం) మూఁడు + ఇ + టి + ను -> మూఁడిటిని.
నూఱు + ను -> (ఆదేశం) నూఱు + టి + ను -> నూటిని;
.............................. (ఆగమం) నూఱు + ఇ + టి + ను -> నూఱిటిని.
4) హ్రస్వము మీఁది ‘టి’ వర్ణంబునకు ముందు పూర్ణబిందువు బహుళముగా నగు.
హ్రస్వాంతమైన శబ్దానికి పరమైన ‘టి’ వర్ణానికి ముందు నిండుసున్న బహుళముగా అవుతుంది.
అన్ని+ను -> అన్ని+టి +ను -> అన్నింటిని, అన్నిటిని.
‘అన్ని+టి+ని’ అన్నప్పుడు ‘న్ని’ అనే హ్రస్వానికి పరమైన ‘టి’ వర్ణానికి ముందు నిండుసున్న వచ్చి ‘అన్నింటిని’ అవుతుంది. బహుళం అనడం వల్ల సున్నా రానప్పుడు ‘అన్నిటిని’ అవుతుంది.
ఎనిమిది+టి+ను -> ఎనిమిదింటిని, ఎనిమిదిటిని.
పగలు+టి+ను -> పగటి+ను -> పగంటిని, పగటిని
రెండు+టి+ను -> రెండిటి+ను -> రెండింటిని, రెండిటిని
మూఁడు+టి+ను -> మూఁడుటి+టి+ను -> మూఁడింటిని, మూఁడిటిని.
‘హ్రస్వముమీఁది’ అనడం వల్ల దీర్ఘముమీఁది ‘టి’ వర్ణమునకు నిండుసున్న రాదు. ఉదా... త్రాడు+ను -> త్రాటిని, ఏఱు+ను -> ఏటిని మొ.
ఇదే విధంగా ... కుందేలు+టి+ను -> కుందేటిని.
5) పదాద్యంబగు హ్రస్వంబుమీఁది టివర్ణంబునకు ముందు పూర్ణబిందు వగు.
పదంలోని మొదటి హ్రస్వాక్షరానికి ముందు ఆదేశంగా వచ్చిన ‘టి’ వర్ణానికి ముందు నిండుసున్న నిత్యంగా వస్తుంది.
కన్ను+ను -> కంటిని
‘కన్ను+ను’ అని ఉండగా ‘న్ను’కు ‘టి’ ఆదేశంగా రాగా ‘క+టి+ను’ అయి ఈసూత్రం వల్ల ‘కంటిని’ అవుతుంది.
మిన్ను+ను -> మిటి+ను -> మింటిని
ఇల్లు+ను -> ఇటి+ను -> ఇంటిని
పల్లు+ను -> పటి+ను -> పంటిని.
6) టితివర్ణంబులు పరంబు లగునపు డుత్వంబున కిత్వంబగు.
ఆగమాలుగా వచ్చిన ‘టి, తి’ వర్ణాలకు ముందున్న ఉత్వం ఇత్వం అవుతుంది.
రెండు+టి+కు -> రెండి+టి+కు -> రెండిటికి
మూఁడు+టి+కు -> మూఁడి+టి+కు -> మూఁడిటికి
నాలుగు+టి+కు -> నాలుగి+టి+కు -> నాలుగిటికి
పగలు+టి+కు -> పగలి+టి+కు -> పగలిటికి
మొదలు+టి+కు -> మొదలి+టి+కు -> మొదలిటికి
పెక్కు+టి+కు -> పెక్కి+టి+కు -> పెక్కిటికి
నెత్తురు+టి+కు -> నెత్తు+టి+కు -> నెత్తుటికి (ఇక్కడ మాత్రం ఇత్వం రాదు).
7) టివర్ణంబు పరంబగునపుడు క్రిందు, మీఁదు, ముందు, పువర్ణంబుల కత్వంబగు.
‘టి’వర్ణం పరమైనపుడు క్రిందు, మీఁదు, ముందు శబ్దాల తుది అచ్చుకు, శబ్దాల చివర ఉన్న ‘పు’ వర్ణానికి అత్వం వస్తుంది.
క్రిందు+టి+ను -> క్రిందటిని
మీఁదు+టి+ను -> మీఁదటిని
ముందు+టి+ను -> ముందటిని
మాపు+టి+ను -> మాపటిని
అప్పుడు+టి+ను -> అప్పు+టి+ను -> అప్పటిని.
మిత్రులారా,
ఇప్పటికి నేను తెలుసుకొన్నది ఇది. మీ సందేహాలను కాని, సవరణలను కాని, మీకు తెలిసిన అదనపు విశేషాలను కాని వ్యాఖ్యగా పెడితే అందరికీ ఉపయుక్తంగా ఉంటుంది.

కవీనాం కవి:

కవీనాం కవి:

గణపతి ధ్యానము చేయునప్పుడు "కవిం కవీనా ముపమశ్ర వస్తమం" అని అంటాము. కవులందరిలో గొప్ప కవిగా వేదాలలో కొనియాడబడిన కవి గణపతి.
భగవద్గీతలో విభూతి యోగములో "కవీనా ముశనా కవిః" అని సాక్షాత్తూ శ్రీ కృష్ణ పరమాత్మ తెలిపేరు. ఈ విధముగా భగవద్విభూతి గల కవి శుక్రాచార్యులు.
ఆదిత్య హృదయ స్తోత్రములో "కవి" అనే పేరు ఆదిత్యునికి చెప్పబడినది.
విష్ణు సహస్ర నామములలో కూడా "కవి" అనే పేరు విష్ణు మూర్తికి చెప్ప బడినది.
సమస్త సృష్టికి కారణమైన పరబ్రహ్మము మరియు బ్రహ్మ కూడా కవులే కదా.
ఇలాగ మన వైదిక ప్రపంచములోకి చూస్తుంటే ఎందరో దేవతా మూర్తులు "కవులు".
"క" అంటే నీరు, 'వి" అంటే పక్షి, వెరసి "కవి" అంటే నీటి పక్షి అని సెలవిచ్చారు తెనాలి రామకృష్ణ కవి.
కవి అల్లసాని పెద్దన
కవి తిక్కన సోమయాజి, గణుతింపంగా
కవి నేను రామకృష్ణుడ
కవియను పేరింక నీటికాకికి లేదే? (తెనాలి)
వైదిక కవి పరంపరను ఒక్క మారైనా తలచుకొనుట మన కనీస కర్తవ్యమే అవుతుంది.
పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

సమస్యా పూరణం - 512 (తెలుఁగు కల్పవృక్షమునకు)

*********************************************************************************
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
తెలుఁగు కల్పవృక్షమునకు తెగులు పట్టె.
*********************************************************************************

31, అక్టోబర్ 2011, సోమవారం

సమస్యా పూరణం - 511 (అల్లుఁ డవినీతిపరుఁ డైన)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
అల్లుఁ డవినీతిపరుఁ డైన నత్త మెచ్చు.
ఈ సమస్యను పంపిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.
కవిమిత్రులకు మనవి ...
నిన్న మా అక్కయ్య వాళ్ళ ఊరికి వెళ్ళి ఇప్పుడే ఇల్లు చేరాను. అందువల్ల ఈనాటి సమస్యను ఇవ్వడం ఆలస్యమయింది. నిన్నటి పూరణలు, వ్యాఖ్యలను ఈ మధ్యాహ్నం వరకు పరిశీలించి స్పందిస్తాను. ఆలస్యానికి మన్నించండి.

30, అక్టోబర్ 2011, ఆదివారం

సుబ్రహ్మణ్య స్తోత్రము

సుబ్రహ్మణ్య స్తోత్రము
(నాగుల చవితి పర్వదిన శుభాకాంక్షలతో ...)

వందే సుబ్రహ్మణ్యం
వందే సేనాన్య మఖిల భక్త శరణ్యమ్ |
వందే బుధాగ్రగణ్యం
వందే నాగార్చితం శివాతనయ మహమ్ ||

వందే తారకహారిం
వందే శక్రాది దేవ వందిత చరణమ్ |
వందే రుద్రాత్మభవం
వందే షాణ్మాతురం శివాతనయ మహమ్ ||

వందే వల్లీ సహితం
వందే కరుణాకరం శుభప్రదమూర్తిమ్ |
వందే మయూరవాహం
వందే వరదం గుహం శివాతనయ మహమ్ ||

వందే వీరవరేణ్యం
వందే వందారు భక్త వర సురభూజమ్ |
వందే భవభయ హారిం
వందే గణపానుజం శివాతనయ మహమ్ ||

వందే శరవణజనితం
వందే జ్ఞాన ప్రభా విభాసుర మమలమ్ |
వందే పరమానందం
వందే ముక్తిప్రదం శివాతనయ మహమ్ ||

వందే కుమారదేవం
వందే గాంగేయ మగ్నిభవ మమరనుతమ్ |
వందే వరశక్తిధరం
వందే మంగళకరం శివాతనయ మహమ్ ||

వందే సుందర రూపం
వందే వేదాంత రమ్య వనసంచారిమ్ |
వందే సురదళనాథం
వందే జ్ఞానప్రదం శివాతనయ మహమ్ ||

వందే భవ్య చరిత్రం
వందే శుభగాత్ర మబ్జపత్ర సునేత్రమ్ |
వందే పరమ పవిత్రం
వందే వల్లీప్రియం శివాతనయ మహమ్ ||

రచన - శ్రీ పండిత నేమాని రామజోగి సన్యసి రావు గారు.

సమస్యా పూరణం - 510 (భవుఁడు భవు నెదిర్చి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
భవుఁడు భవు నెదిర్చి భంగపడఁడె.
ఈ సమస్యను పంపిన
పండిత నేమాని వారికి
ధన్యవాదాలు.