2, నవంబర్ 2011, బుధవారం

సమస్యా పూరణం - 513 (మస్తకమ్మును మించునే)

*********************************************************************************
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
మస్తకమ్మును మించునే పుస్తకమ్ము?
ఈ సమస్యను పంపిన
పండిత నేమాని వారికి
ధన్యవాదాలు.
*********************************************************************************

48 కామెంట్‌లు:

 1. నిల్వ జేయు సమస్తము నిశ్చయముగ
  విస్తు బోయెడు జ్ఞానమ్ము విస్తరించు
  మఱ్ఱి విత్తనమును బోలు మహిమ గలది
  మస్తకమ్మును మించునే పుస్తకమ్ము?

  రిప్లయితొలగించండి
 2. అందరికీ వందనములు !
  శాస్త్రీజీ ! బావుంది !
  01)

  _____________________________________

  మనిషి పుట్టిన దాదిగా - మడియు వరకు
  మతిని యుండును మొత్తము - స్మృతుల వలెను
  మస్తకమునకు సరిసాటి - మహిని గలదె?
  మస్తకమ్మును మించునే - పుస్తకమ్ము?
  _____________________________________

  రిప్లయితొలగించండి
 3. అఖిల విద్యల జ్ఞానమ్ము నాదినుండి
  భద్రపరచి వ్యాప్తమొనర్చు "పద్మవనము" (మహా పద్మాటవి అంటారు)
  అద్భుతమగు బుద్ధికి జ్ఞప్తి కాలయమగు
  మస్తకమ్మును మించునే పుస్తకమ్ము

  రిప్లయితొలగించండి
 4. పుస్తకములోని బొమ్మకు పొరలి పొరలి
  దండముల బెట్ట నేలయా ? తల్లి దివ్య
  మంగళాకృతి ధ్యానించు మదిని, వేడు,
  మస్తకమ్మును మించునే - పుస్తకమ్ము?

  రిప్లయితొలగించండి
 5. మస్తకమ్మును మించునే పుస్తకమ్ము?
  భాగవతము సీతచరిత భారతమును
  పదునెనిమిది పురాణాది వహుల వెట్టి
  మస్తకమునైన మించెడి పుస్తకములు!

  రిప్లయితొలగించండి
 6. ఒక ధ్యానం లో మునిగిన వేళ
  మనసే బృందావనం ఐన వేళ
  సర్వ జ్ఞానం తనలో నించి బహిర్గతమైన వేళ
  మస్తకమ్మును మించునే - పుస్తకమ్ము ?

  రిప్లయితొలగించండి
 7. నేమాని పండితవర్యా! ధన్యవాదాలు.
  " మహాపద్మాటవీ సంస్థా " అనే అమ్మవారి నామానికి
  నిజమైన అర్థాన్ని ఇప్పుడు తెలుసుకొన్నాను.

  రిప్లయితొలగించండి
 8. 02)
  _____________________________________

  పుణ్య పురుషులు పూర్వులు - పుడమి నిడిన
  పుస్తకములన్ని జనితము - మస్తకమున !
  భూరి సృష్టికి యాధార - భూత మైన
  మస్తకమ్మును మించునే - పుస్తకమ్ము?
  _____________________________________

  రిప్లయితొలగించండి
 9. అయ్యా మిస్సన్న గారూ!
  మీరు మహా పద్మాటవి గురించి తెలిసికొన్నందులకు సంతోషము. శాక్తేయములో మనలో మూలాధారము నుండి ఆజ్ఞా చక్రము వరకు ఆరు చక్రాలు ఉంటాయని ఆపైని సహస్రారము ఉంటుంది అంటారు. ఈ ఆరు చక్రాలని ఆరు పద్మములు అంటారు,సహస్రారము ఉండే స్థానమును మహా పద్మాటవి అని పెద్దలు చెప్పగా విన్నాను.

  రిప్లయితొలగించండి
 10. 03)
  _____________________________________

  పుస్తకములున్న లేకున్న - పుడమి మీద
  బుద్ధి చేతనె జీవులు - వృద్ధి జెందు !
  మస్తకము లేని ప్రాణికి - మనుగడేది ?
  మస్తకమ్మును మించునే - పుస్తకమ్ము?
  _____________________________________

  రిప్లయితొలగించండి
 11. జిలేబి గారి ఫ్రీ-వెర్స్ బాగుంది. బ్లాగోధ్ధిష్ష మైన ఛందస్సులోకి మార్చితే -
  పరమ ధ్యాన సమాధిలో వరలు వేళ
  హృదియె బృందావనంబుగా నున్న వేళ
  ఆత్మ నిర్గతమై జ్ఞాన మమరు వేళ
  మస్తకమ్మును మించునే - పుస్తకమ్ము ?

  రిప్లయితొలగించండి
 12. 04)
  _____________________________________

  బ్రహ్మ మస్తక సృష్టియే - ప్రాణులన్ని
  మనిషి మస్తక సృష్టియే - మాయలన్ని
  మస్తకముగాదె సృష్టి , స - మస్తమునకు
  మూల మాధార భూతమీ - పుడమి యందు !
  మస్తకమ్మును మించునే - పుస్తకమ్ము?
  _____________________________________

  రిప్లయితొలగించండి
 13. జిలేబి గారి వచనకవితకు నా పద్యానుకృతి .....

  గట్టిగా ధ్యానమున మున్గి నట్టివేళ
  మానసమ్మె బృందావన మైనవేళ
  జ్ఞానరుచులు బహిర్గత మైనవేళ
  మస్తకమ్మును మించునే పుస్తకమ్ము?

  రిప్లయితొలగించండి
 14. ‘శ్యామలీయం’ గారూ,
  మన్నించాలి. జిలేబి గారి కవితకు మీరిచ్చిన పద్యరూపాన్ని చూడక నేను పోస్ట్ చేసాను. మీ పద్యం బాగుంది. కాకుంటే రెండవపాదంలో యతి తప్పింది.

  రిప్లయితొలగించండి
 15. ‘శ్యామలీయం’ గారూ,
  ఆ రెండవపాదాన్ని ఇలా సవరిస్తే ఎలా ఉంటుంది?
  ‘హృదియె బృందావనంబుగా నెసఁగు వేళ’

  రిప్లయితొలగించండి
 16. 05)
  _____________________________________

  మస్తకమునకు సాటేది - మహిని లేదు
  మస్తకమునకు సరిపోలు - మస్తకమ్మె
  మస్తకము తోడ పోల్చిన - మశకము గద !
  మస్తకమ్మును మించునే - పుస్తకమ్ము?
  _____________________________________

  రిప్లయితొలగించండి
 17. ధారణాశక్తి పెంపొంద దగిన దదియె
  నాటి గురుముఖతః విద్య. నాగరికత
  పేఱ పుస్తక పఠనమ్ము పెఱిగె నేడు
  మస్తకమ్మును మించునే పుస్తకమ్ము?

  రిప్లయితొలగించండి
 18. జిలేబీగారి స్ఫూర్తితో :

  06)
  _____________________________________

  మనిషి ధ్యానంబు నందున - మునిగి యుండ
  మదియె బృందావనంబుగా - మారుచుండ
  మహిత ఙ్ఞానమ్ము పురివిప్పి - మసలు చుండు
  మస్తకమ్మును మించునే - పుస్తకమ్ము?
  _____________________________________

  రిప్లయితొలగించండి
 19. 07)
  _____________________________________

  మధుర మంజుల వాక్కుల - హృదిని నింపు
  మనిషి మనిషికి మధ్యను - మమత బెంచు
  మత్సరాలను తగ్గించి - మధువు నింపు
  మస్తకమ్మును మించునే - పుస్తకమ్ము?
  _____________________________________

  రిప్లయితొలగించండి
 20. శంకరయ్య గారికి నా అనువాదంలో ద్వితీయ పాదంలోని యతిభంగాన్ని సవరించి 'ఉన్న వేళ' ను 'ఎసఁగు వేళ' గా పరిష్కరంచినందుకు ధన్యవాదాలు. నిజంగానే, నా నుండి తరచు యతివిషయక మైన పొరపాట్లు దొర్లుతున్నాయి. బాగా పరిశ్రమచేయవలసి ఉందని గ్రహించాను. శంకరయ్య గారి అనువాదం కూడా చాలా బాగుంది. ఇరువురమూ జిలేబి గారిలాగే పాదాంతములలో 'వేళ'ను ఉంచాము.

  వసంత కిశోర్ గారి అనువాదంలో 'సాటేది' అన్న ప్రయోగం పరిహార్యం. తృతీయపాదంలో 'మస్తకము తోడ పోల్చిన మశకము గద ' అన్నప్పుడు యేది అన్న ప్రశ్నకు సమాధానం అందులో లేక అన్వయం దెబ్బతిందని మనవి. వారి నం. 06 అనువాదం కడు రమ్యంగా ఉంది. వారి పద్యం 07 జులేబీకి అనువాదం కాదు. ఇది కూడా బాగుంది.

  మందాకిని గారి అనువాదంలో పద్యం మధ్యలో వాక్య విరామచిహ్నం ఉంచారు. ఇదివరకే మనవి చేసినట్లు యేవిధమైన విరామచిహ్నమూ మన తెలుగులోలేనే లేదు సాంప్రదాయికంగా. వచనంలో వాడటం నేడు వాడుక యైనా, పద్యంలో ఉంచటం విషయంలో కొంత సందిగ్ధత ఉంది. ఉంచక పోవటమే మంచిది. ముఖ్యంగా వాక్య విరామచిహ్నం. పద్యం చాలా బాగుంది. 'గురుముఖతః విద్య' అన్న ప్రయోగం పరిశీలనార్హం.

  రిప్లయితొలగించండి
 21. వెంకట రాజారావు . లక్కాకులబుధవారం, నవంబర్ 02, 2011 11:42:00 AM

  మస్త కమ్మును మించు - నేపుస్త కమ్ము?
  ప్రాణి కాత్మయే శక్తి ,సర్వ ప్రదాత ,
  భగవ దత్తంబు ,పరమాత్మసగుణ మూర్తి
  మస్తకమ్మును మించు- నీపుస్తకమ్ము

  రిప్లయితొలగించండి
 22. ధారణాశక్తి పెంపొంద దగిన రీతి
  నాటి బోధనమ్మమరి విజ్ఞతను పెంచె
  నేటి విద్యలదెట్టుల నేర్పగలవు?
  మస్తకమ్మును మించునే పుస్తకమ్ము?

  రిప్లయితొలగించండి
 23. పాఠశాలలో పాఠియై పరగువాని
  హస్తభూషణ మయినచో నగునుగాక
  పూర్ణ విద్యాప్రవీణుడౌ బుద్ధిశాలి
  మస్తకమ్మును మించునే పుస్తకమ్ము??.

  ఆర్యులారా,
  నాకో చిన్న అనుమానం. మస్తకము అనే మాటకీ మస్తిష్కము అనే మాటకీ వ్యత్యాసం ఉంది కదా. ఈనాటి పూరణలలో చాలా మటుకు మస్తిష్కము అనే పదానికి బదులు మస్తకము అని వాడినట్లుగా నాకు అనిపిస్తోంది. పెద్దలు దయచేసి కాస్త వివరించాలి.

  శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ

  రిప్లయితొలగించండి
 24. అందరికీ నమస్కారం !
  ఇది నా పూరణ,

  భూరి ఖలుచింతనలయందు భుక్తి కొరకు
  కుటిల రాజకీయములందు గొప్ప కొరకు
  నాత్రముగ నసత్యములాడుటందు నరయ
  మస్తకమ్మును మించునే పుస్తకమ్ము?

  రిప్లయితొలగించండి
 25. వెంకట రాజారావు . లక్కాకులబుధవారం, నవంబర్ 02, 2011 3:06:00 PM

  కృష్ణు డాచార్యు డై వ్యాస కృత మగుచు స
  మస్త కమ్మును మించు నే పుస్తకమ్ము
  వాసు దేవుని రూపమై వసుధ నిల్చు
  నట్టి గీత కు భక్తితో నంజ లింతు

  రిప్లయితొలగించండి
 26. మిత్రులారా!
  వసంత కిశోర్ గారి 6వ పద్యము 3వ పాదములో "మహిత జ్ఞానమ్ము" ఒకే సమాసము కాబట్టి త గురువయి గణ భంగము అవుతోంది.
  వెంకట రాజారావు గారి పద్యము 3వ పాదములో "భగవ దత్తంబు" నకు బదులుగా "భగవద్దత్తంబు" అని ఉండాలి, అందుచేత గణభంగము అవుతోంది.
  అవకాశము బట్టి సవరించాలి.
  నేమాని సన్యాసి రావు

  రిప్లయితొలగించండి
 27. ఎట్టి ప్రతిబంధకమునైన మట్టు బెట్టు
  తత్క్షణోపాయములనెల్ల దాచియుంచి
  యడిగినట్టిదె తడవుగా నుడువు నట్టి
  మస్తకమ్మును మించునే పుస్తకమ్ము.

  రిప్లయితొలగించండి
 28. వెంకట రాజారావు . లక్కాకులబుధవారం, నవంబర్ 02, 2011 4:52:00 PM

  నేమాని వారికి ధన్య వాదముల తో సవరణ

  మస్త కమ్మును మించు- నేపుస్తకమ్ము?
  ప్రాణి కాత్మ యే శక్తి -సర్వ ప్రదాత ,
  దైవ దత్తంబు ,పరమాత్మ ధర్మియగుట
  మస్తకమ్మును మించు నీ పుస్తకమ్ము

  రిప్లయితొలగించండి
 29. **********************************************************************
  కవి మిత్రులారా,
  శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారు ‘మస్తకము - మస్తిష్కము’ అనే పదాల వ్యత్యాసాన్ని తెలిపి ఈనాటి పూరణలలో చాలా వరకు ఆ భేదాన్ని పాటించలేదన్నరు. నేను అ సూక్ష్మమైన విషయాన్ని గమనించ వలసిందిగా మీకే వదిలేస్తున్నాను. ఆ దృష్టితో ఒక్కొక్కరి పూరణలను వ్యాఖ్యానిస్తే ఒక పేజీ (ముఖ్యంగా సమయం) సరిపోదు.
  **********************************************************************
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మస్తకాన్ని మఱ్ఱివిత్తనంతో పోల్చిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
  **********************************************************************
  వసంత కిశోర్ గారూ,
  మీ ఏడు పూరణలు బాగున్నాయి. అభినందనలు.
  ‘శ్యామలీయం’ గారి వ్యాఖ్యను గమనించారా?
  ఐదవ పూరణలో ‘సాటేది’ అన్నచోట ‘సమమేది’ అందాం.
  ఆరవ పూరణలో ‘మహిత జ్ఞానము’ అన్నచోట ‘మహిత చేతన’ అందాం.
  **********************************************************************
  పండిత నేమాని గారూ,
  ‘అద్భుత’మైన పూరణ చెప్పారు. అభినందనలు.
  **********************************************************************
  మిస్సన్న గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  **********************************************************************
  జిలేబి గారూ,
  చక్కని భావాన్ని ఇచ్చారు. మీ అదృష్టం! మీ భావానికి మూడు పద్యానుకృతులు లభీంచాయి. అభినందనలు.
  **********************************************************************
  ‘శ్యామలీయం’ గారూ,
  మీ నిశిత పరిశీలనకు జోహార్లు. మీ వ్యాఖ్యల వలన కవిమిత్రులు తమ దోషాలను గుర్తించి మళ్ళీ చేయకుండా చక్కని పద్యాలు వ్రాయగలరు. ధన్యవాదాలు.
  జిలేబీ గారి పద్యంలో ‘పరమధ్యాన’ అన్నప్పుడు ‘మ’ గురువై గణదోషం కలుగుతున్నది. ‘పరమ’ను ‘పరము’ చేస్తే ..?
  **********************************************************************
  మందాకిని గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నాయి. అభినందనలు.
  ‘శ్యామలీయం’ గారి వ్యాఖ్యను పరిగణనకు తీసికొని పద్యాంతర్గత విరామ చిహ్నాలను తగ్గించండి. అలాగే ‘గురుముఖతః విద్య’ ను ‘గురుబోధతో విద్య’ అని మార్చండి.
  **********************************************************************
  లక్కాకుల వెంకట రాజారావు గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  ‘భగవద్దత్తము’ను భగవదత్తము అన్నారు. అక్కడ ‘భగవదంహతి’ అందాం. అంహతి అన్నా దత్తమే.
  మీ రెండవ పూరణ పూర్తిగా వైవిధ్యంగా ఉంది. బాగుంది. కాని ‘సమస్తకము’ ?
  ఓహ్! ‘దైవదత్తంగా’ మార్చారా? బాగుంది. ఇప్పుడే చూసాను.
  **********************************************************************
  శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
  మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
  మీ వ్యాఖ్యను గమనించి మిత్రుల దృష్టికి తెచ్చాను. ధన్యవాదాలు.
  **********************************************************************
  కళ్యాణ్ గారూ,
  మీది నెగెటివ్ అప్రోచ్ (కరెక్టేనా? నాకంతగా ఇంగ్లీషు రాదు!). చక్కని పూరణ. అభినందనలు.
  ‘భూరి ఖలు చింతనలు’ .... ?
  **********************************************************************
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  **********************************************************************

  రిప్లయితొలగించండి
 30. వెంకట రాజారావు . లక్కాకులబుధవారం, నవంబర్ 02, 2011 6:44:00 PM

  1 . స-మస్తకము = జ్ఞానము

  2 . సమస్త-కము= విశ్వము
  --- అని నా తాత్పర్యము

  రిప్లయితొలగించండి
 31. పుస్తకముజూడ తెలియదు పొమ్ము స్వరము
  వేద మంత్రములకు నీవు విన్న గాని
  గురువు నోటను, సర్వ మక్షర వశమ్మె
  మస్తకమ్మును మించునే పుస్తకమ్ము?

  రిప్లయితొలగించండి
 32. మస్తకము లేనట్టి ప్రాణుల మనుగ డేది ?
  విభవ మున్నట్టి జగతిని వేద మమరె
  మదిని మదియించి రచియించ మంచి రచన
  మస్త కమ్మును మించునే పుస్తకమ్ము ?

  రిప్లయితొలగించండి
 33. పుస్తకమ్ముల మథియించి ముదిత జేయు
  కొత్త వంటల సురుచుల కోర్వలేక
  వగచి పత్నిని ప్రశ్నించె పతియొకండు -
  "మస్తకమ్మును మించునే పుస్తకమ్ము?"

  రిప్లయితొలగించండి
 34. శంకరనారాయణశాస్త్రిబుధవారం, నవంబర్ 02, 2011 9:09:00 PM

  గురువుగారూ నమస్కారములు

  నేను 9 వ తరగతి చదువుతున్నాను మాపాఠములోని ఒక పద్యము

  ఆనందబున నర్ధరాత్రముల జంద్రాలోకముల్ కాయగా
  నానాసైకత వేదీకాస్థలములన్ నల్దిక్కులన్ శంభు గా
  శీనాథున్ దరుణేందుశేఖరు శివున్ శ్రీకంఠునిన్ బాడుదు
  న్మేనెల్లం బులకాంకుర ప్రకరముల్ నిండార మిన్నేటిలోన్

  శంకరనారాయణశాస్త్రి

  రిప్లయితొలగించండి
 35. శ్రీపతిశాస్త్రిబుధవారం, నవంబర్ 02, 2011 10:45:00 PM

  శ్రీగురుభ్యోనమ:

  మధురమైనట్టి స్మృతులను మనన దెచ్చు
  కళ్ళు లేకున్ననూ విషయము గాంచవచ్చు
  జ్ఞాన నేత్రమై జీవికి జయముగూర్చు
  మస్తకమ్మును మించునే పుస్తకమ్ము?

  రిప్లయితొలగించండి
 36. శ్రీపతిశాస్త్రిబుధవారం, నవంబర్ 02, 2011 10:55:00 PM

  గురువుగారూ,నాకుమారుడు చి.శంకరనారాయణ ఉత్సాహంకొలదీ "నేనూ వ్రాస్తాను" అంటే వ్రాయమన్నాను. వాడు పై పద్యం వ్రాసినాడు. గురువర్యులు ఆశీస్సులనందిచ ప్రార్థన.

  రిప్లయితొలగించండి
 37. శ్రీపతిశాస్త్రిబుధవారం, నవంబర్ 02, 2011 11:14:00 PM

  రవిగారూ చాలాబాగ చమత్కరించారు. అభినందనలు.
  మిత్రులందరి పూరణలు బాగున్నాయి.

  రిప్లయితొలగించండి
 38. చదివి యిచ్చెదనంచుదోచగనులేరు
  మరచెదను,చేజారను వెరపు లేదు
  వెలయు లేదులేదద్దెయునిలను కనగ
  మస్తకమ్మును మించు, నేపుస్తకమ్ము?

  రిప్లయితొలగించండి
 39. శ్యామలీయంగారికి ధన్యవాదములు !
  అయ్యా !తృతీయపాదంలో 'మస్తకము తోడ పోల్చిన మశకము గద ' అన్నప్పుడు యేది అన్న ప్రశ్నకు సమాధానం
  నాల్గవ పాదంలో ఉన్న పుస్తకమే !

  రిప్లయితొలగించండి
 40. నేమాని వారికి ధన్యవాదములు !
  శంకరార్యా చక్కని సవరణలకు ధన్యవాదములు !
  మిత్రులందరి పూరణలూ ముచ్చటగా నున్నవి !

  రిప్లయితొలగించండి
 41. అయ్యా ! కామేశ్వరశర్మగారూ ! గట్టి పట్టే పట్టారు
  మస్తకము అనే మాటకీ మస్తిష్కము అనే మాటకీ నిఘంటువును
  పరికిస్తే ఖచ్చితంగా వ్యత్యాసం ఉంది !
  కాని జన బాహుళ్యంలో మాత్రం అవి ఒకే అర్థంలో
  రూఢి పడిపోయినవి !

  వీడికి తలకాయ లేదు
  వాడికి కొంచెమైనా బుర్ర లేదు

  అన్నప్పుడు "శిరస్సు" అనే అర్థం తీసుకోలేము గదా !

  అలా కాదనుకున్నా మస్తకములో భాగమే గదా మస్తిష్కము !
  అప్పుడిక అన్వయ లోపము గాని అర్థలోపముగాని రాదుగదా !

  ఇంతకీ సమస్య నిచ్చిన నేమాని వారు
  ఏ అర్థంలో వాడారో వారు చెబితేనే సముచితంగా ఉంటుంది !

  రిప్లయితొలగించండి
 42. చిరంజీవి శంకరనారాయణశాస్త్రికి సరస్వతీ కటాక్ష ప్రాప్తిరస్తు !

  రిప్లయితొలగించండి
 43. క్షమించాలి
  అవును నాకూ అదే సందేహం వచ్చింది. " మస్తకము = తల , మస్తిష్కము = మెదడు , అని నిఘంటువులో ఉంది. అందుకని నేను " మస్తకము లేనట్టి ప్రాణుల " అని వ్రాసాను. అంటే " తల " లేని ప్రాణి ఉండదు కదా ? " అని నా ఉద్దేశ్యము. మరి రైటో తప్పో ,అసలు నా పద్యమే తప్పో ? ప్చ్ ! ఏమి తెలియదు.

  రిప్లయితొలగించండి
 44. మిత్రులారా!
  నేను సమస్యగా ఇచ్చేను అంతే. దానిని పూరించే వారిలో ఉంటుంది ఏ అర్థము తీసుకుంటే బాగుంటుందో అని. ఇచ్చే ముందు నేను అంత లోతుగా ఆలోచించలేదు. మనము ఎవరినైనా ఉద్దేశించి చెప్పేటప్పుడు వాడు అంటాము గాని వాని శరీరమో లేక వాని మనస్సో అనము కదా. ఇచ్చిన సమస్యను ఎక్కువమంది ఎలాగ అర్థము చేసుకుంటే అలాగే ప్రసిద్ధము అవుతుంది కదా. ఇంతకీ గతం గతః.
  నేమాని

  రిప్లయితొలగించండి
 45. **********************************************************************
  మిస్సన్న గారూ
  స్వరరహితాక్షరమయమైన పుస్తకము కంటె స్వరసహితాక్షరమయమైన మస్తకము మేలన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
  **********************************************************************
  రాజేశ్వరి అక్కయ్యా,
  చక్కని పూరణ. అభినందనలు.
  మొదటి పాదంలో గణదోషం. ‘లేనట్టి ప్రాణుల’ను ‘లేని ప్రాణుల’ అంటే సరి!
  ‘విభవ మున్నట్టి జగతిని వేద మమరె’ అన్నవాక్యానికి అన్వయం కుదరడం లేదు. ‘నాదమయమైన ముఖమున వేద మమరె’ అందామా?
  **********************************************************************
  రవి గారూ,
  మీ పూరణలోని చమత్కారం అదిరింది. బాగుంది. అభినందనలు.
  **********************************************************************
  చిరంజీవి శంకరనారాయణ శాస్త్రీ,
  శుభాశీస్సులు! సరస్వతీ కటాక్ష ప్రాప్తిరస్తు!
  మన సంస్కృతి, భాష, సాహిత్యాలు పరిశీలించినపుడు, వాటి మహౌన్నత్యాన్ని అవగాహన చేసికొన్నప్పుడు ‘మేనెల్లం బులకాంకురప్రకరముల్ నిండారు’ నన్న సత్యాన్ని మరువకు. ఎక్కడ, ఏ స్థాయిలో ఉన్నా ‘మనది’అన్నదానిని చిన్నచూపు చూడకుండా, దానికి వారసులమని గర్వంగా చెప్పుకోవాలి. గౌరవించాలి. నాన్నగారి మార్గదర్శకంలో పద్యరచనకు ప్రయత్నించు.
  ‘శంభుఁడు, కాశీనాథుఁడు, తరుణేందుశేఖరుఁడు, శ్రీకంఠుఁడు అయిన శివుఁడు’ నీకు సర్వశుభములను కలిగించుగాక!
  **********************************************************************
  శ్రీపతి శాస్త్రి గారూ,
  మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
  ‘మననదెచ్చు’ ప్రయోగం సాధువు కాదేమో? రెండవపాదంలో గణదోషం. ‘లేకున్ననూ’ ను ‘లేకున్న’ అంటె సరి!
  **********************************************************************
  ఊకదంపుడు గారూ,
  మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
  రెండవ పాదంలో గణదోషం. ఆ పాదాన్ని ‘మరతుఁ జేజారు ననియెడి వెరపు లేదు’ అంటే సరి!
  **********************************************************************

  రిప్లయితొలగించండి
 46. చి|| శంకరనారాయణశాస్త్రికి శుభాభినందనలు, ఆశీస్సులు.

  రిప్లయితొలగించండి
 47. సకలగ్రంథమ్ములు,వివిధ శాస్త్ర సంగ
  తమగు జ్ఞానమ్ము నరుని మేధస్సు నుండి
  ఉద్భవించెను గాదె యీ ఉర్వి యందు
  మస్తకమ్మును మించునే పుస్తకమ్ము.

  రిప్లయితొలగించండి