30, నవంబర్ 2017, గురువారం

సమస్య - 2533 (గౌరికిఁ గేశవుఁడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"గౌరికిఁ గేశవుఁడు భర్త గావలె నెన్నన్"
(లేదా...)
"గౌరికిఁ గేశవుండు పతి గావలె శంకరుఁ డన్న గావలెన్"
(శతావధాని పోకూరి కాశీపతి పూరించిన సమస్య)

29, నవంబర్ 2017, బుధవారం

పదవీ విరమణ సన్మాన పత్రము


పదవీ విరమణ సన్మాన పత్రము

శ్రీ గుండు మధుసూదన్ గారు, తెలుగు స్కూల్ అసిస్టెంటు,
ప్రభుత్వోన్నత పాఠశాల, శంభునిపేట, వరంగల్లు నుండి
తేది: 30-11-2017న పదవీ విరమణ చేయు సందర్భమున తేది: 29-11-2017నాడు సమర్పించిన
-:సన్మాన పద్య నవ రత్నములు:-
శ్రీయాదాద్రి నృసింహుం
డా యముడాల నిలయుఁడగునట్టి త్రినేత్రుం
డాయత కరుణా సాంద్రులు
నై యీ మధుసూదనుని ప్రియదులుగ నగుతన్!

ప్రథిత గుండు వంశ వారాశి పూర్ణ శ
శాంకుఁడీవు; మల్లికాంబ పుణ్య
శీల, సత్త్వగుణ విశిష్ట  రామస్వామి 
దంపతులకు ముద్దు తనయుఁ డీవు!

అడుగడుగున నాటంకము 
లిడుములఁ బెట్టంగ నోర్చి హితమగు విద్యల్
గడియించి జీవనమునకు 
నెడ నెడ నుద్యోగభార మెటు సైఁచితివో?

ఎడతెగని యీతిబాధలఁ 
బడి ప్రావీణ్యమునఁ దెలుఁగు భాషోపాధ్యా
యుఁడవై విద్యాబోధనఁ 
గడు నంకితభావ మొప్పఁగాఁ జేసితివే!

సంప్రదాయ కవిత్వమున్ సంస్కృతమును 
చిన్ననాఁటనె యభ్యసించితివి నీవు;
తత్ప్రభావమె నిన్నిట్లు సత్ప్రసాద 
గుణ కవిత్వరచనఁ బారగునిగఁ జేసె!

వేలకొలఁది పద్యము లవ
లీలన్ రచియించి లెక్కలేనట్టి కృతుల్
హేలన్ వెలయించిన కవి
తాలోలాత్మ! మధురకవి! ధన్యుఁడవయ్యా!

మధుసూదన! సత్కవితా 
సుధ లొల్కెడు నీదు పద్యశోభలఁ గనియున్
బుధు లెల్లరు నిను మెచ్చియు 
"మధురకవీ" యనుచుఁ బిలిచి మన్నించిరయా!

పెక్కు బిరుదు లంది, పెక్కు సన్మానమ్ము
లంది, యశముఁ గంటివయ్య నీవు!
బ్లాగుల నడిపించి వాట్సప్ సమూహాల
యందు కవుల మెప్పు లందినావు!!

ఎద యుప్పొంగ సమర్పిం
చెద మధుసూదన! సదా నృసింహుని కృపతోఁ
గొదువయె లేని శుభముఁ గనఁ 
బదవీ విరమణ సమయ శుభాకాంక్ష లివే!

సమర్పణ
కంది శంకరయ్య
"శంకరాభరణం" బ్లాగు నిర్వాహకులు


సమస్య - 2532 (పగతుర పాదముల...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"పగతుర పాదములఁ బట్టవలె వీరులకున్"
(లేదా...)
"పగతుర పాదపద్మములఁ బట్టఁగ వీరుల కొప్పు నాజిలోన్"

28, నవంబర్ 2017, మంగళవారం

నిషిద్ధాక్షరి - 39

కవిమిత్రులారా,
అంశము - శివధనుర్భంగము
నిషిద్ధాక్షరములు - శ-ష-స-హ.
ఛందస్సు - మీ ఇష్టము.

వీణా బంధ ఉత్పలమాల (శివస్తుతి)


కారుణమూర్తి,  కోకనద,   ల్మషకంఠ,     కపాలధారి, కే
దార,యగస్త్య, ధూర్జటి, సదాశివ,యీశ్వర,  లోకపాలకా,
కారణ కారణమ్ము,శివ, గంగపతీ,భవ,  చంద్ర శేఖరా,  
మారిపతీ, యనారతము మమ్ముల గాచుము  లోకరక్షకా. 

  
పూసపాటి కృష్ణ సూర్య కుమార్

27, నవంబర్ 2017, సోమవారం

సమస్య - 2531 (పద్మములు ముకుళించెను...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"పద్మములు ముకుళించెను భానుఁ జూచి"
(లేదా...)
"పద్మము లెల్ల భానుఁ గని వైళముగన్ ముకుళించెఁ జూడుమా"
(శతావధాని అవ్వారి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు పూరించిన సమస్య)

26, నవంబర్ 2017, ఆదివారం

సమస్య - 2530 (శంకరుఁ డెత్తె హిమగిరిని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"శంకరుఁ డెత్తె హిమగిరిని సతి వెఱఁ గందన్"
(లేదా...)
"శంకరుఁ డెత్తె వెండిమల శైలతనూభవ సంభ్రమింపఁగన్"
(ఆకాశవాణి వారి సమస్య)

25, నవంబర్ 2017, శనివారం

సమస్య - 2529 (అవధానముఁ జేయువాఁడె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"అవధానముఁ జేయువాఁడె యతిమూర్ఖుఁ డగున్"
(లేదా...)
"అవధానమ్మునుఁ జేయునట్టి కవి మూర్ఖాగ్రేసరుండౌ జుమీ"

24, నవంబర్ 2017, శుక్రవారం

సమస్య - 2528 (చోరుని సముఁడు కవి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"చోరుని సముఁడు కవి యనుట చోద్యమ్మౌనే?"
(లేదా...)
"చోరునకున్ సముండు కవి చోద్యము గా దిది నిత్యసత్యమే"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.