29, నవంబర్ 2017, బుధవారం

పదవీ విరమణ సన్మాన పత్రము

శ్రీ గుండు మధుసూదన్ గారు, తెలుగు స్కూల్ అసిస్టెంటు,
ప్రభుత్వోన్నత పాఠశాల, శంభునిపేట, వరంగల్లు నుండి
తేది: 30-11-2017న పదవీ విరమణ చేయు సందర్భమున తేది: 29-11-2017నాడు సమర్పించిన
-:సన్మాన పద్య నవ రత్నములు:-
శ్రీయాదాద్రి నృసింహుం
డా యముడాల నిలయుఁడగునట్టి త్రినేత్రుం
డాయత కరుణా సాంద్రులు
నై యీ మధుసూదనుని ప్రియదులుగ నగుతన్!

ప్రథిత గుండు వంశ వారాశి పూర్ణ శ
శాంకుఁడీవు; మల్లికాంబ పుణ్య
శీల, సత్త్వగుణ విశిష్ట  రామస్వామి 
దంపతులకు ముద్దు తనయుఁ డీవు!

అడుగడుగున నాటంకము 
లిడుములఁ బెట్టంగ నోర్చి హితమగు విద్యల్
గడియించి జీవనమునకు 
నెడ నెడ నుద్యోగభార మెటు సైఁచితివో?

ఎడతెగని యీతిబాధలఁ 
బడి ప్రావీణ్యమునఁ దెలుఁగు భాషోపాధ్యా
యుఁడవై విద్యాబోధనఁ 
గడు నంకితభావ మొప్పఁగాఁ జేసితివే!

సంప్రదాయ కవిత్వమున్ సంస్కృతమును 
చిన్ననాఁటనె యభ్యసించితివి నీవు;
తత్ప్రభావమె నిన్నిట్లు సత్ప్రసాద 
గుణ కవిత్వరచనఁ బారగునిగఁ జేసె!

వేలకొలఁది పద్యము లవ
లీలన్ రచియించి లెక్కలేనట్టి కృతుల్
హేలన్ వెలయించిన కవి
తాలోలాత్మ! మధురకవి! ధన్యుఁడవయ్యా!

మధుసూదన! సత్కవితా 
సుధ లొల్కెడు నీదు పద్యశోభలఁ గనియున్
బుధు లెల్లరు నిను మెచ్చియు 
"మధురకవీ" యనుచుఁ బిలిచి మన్నించిరయా!

పెక్కు బిరుదు లంది, పెక్కు సన్మానమ్ము
లంది, యశముఁ గంటివయ్య నీవు!
బ్లాగుల నడిపించి వాట్సప్ సమూహాల
యందు కవుల మెప్పు లందినావు!!

ఎద యుప్పొంగ సమర్పిం
చెద మధుసూదన! సదా నృసింహుని కృపతోఁ
గొదువయె లేని శుభముఁ గనఁ 
బదవీ విరమణ సమయ శుభాకాంక్ష లివే!

సమర్పణ
కంది శంకరయ్య
"శంకరాభరణం" బ్లాగు నిర్వాహకులు


26 కామెంట్‌లు:

  1. నమస్కారములు
    కందములన్నియు అందముగానున్నవి సరస్వతీ పుత్రులకు సిరసాభి వందనములు

    రిప్లయితొలగించండి
  2. రమణీయమైన పద్య రత్నాలు. శంకరయ్య గారికి ధన్యవాదాలు. మధుర కవి గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  3. గురువు గారికి నమస్సులు. అభినందన సుమాలు అద్భుతంగా విచ్చుకున్నాయి. మధురకవి శ్రీ గుండు మధుసూదన్ గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  4. చల్లగుండుమయ్య చక్కటి పదవితో
    మధుర మధురముగను సుధల నొలికి
    బాలబాలికలకు బంగారు భవితకు
    బాట వేసినట్టి మేటి వీవు

    రిప్లయితొలగించండి
  5. కందిశంకరార్యు ఘనమైన పద్యాల
    ప్రేరణమ్మునొంది పెంపుగాను
    నుడుత భక్తితోడ నువ్విళ్ళులూరుచు
    వ్రాసినానుయల్ప రచననిట్లు

    రిప్లయితొలగించండి
  6. అరయ విష్ణువైనయా మధుసూదనుం
    డరయు నెల్లవేళలందు మిమ్ము
    సిరులునొల్కునట్లు తరలును శ్రీదేవి
    మీదు గృహమునకును మోదముగను

    రిప్లయితొలగించండి
  7. అరయ విష్ణువైనయా మధుసూదనుం
    డరయు నెల్లవేళలందు మిమ్ము
    సిరులునొల్కునట్లు తరలును శ్రీదేవి
    మీదు గృహమునకును మోదముగను

    రిప్లయితొలగించండి
  8. కవిపుంగవులు మధుసూదన్ గారికి సుదీర్ఘాంధ్ర భాషా బోధ నాతులిత సేవా తత్పరత సఫలీకృ తానంతర పదవీ విరమణ సందర్భముగా హృదయ పూర్వ కాభినందనలు. భగవంతుడు మీకు సంపూర్ణాయురారోగ్యములు ప్రసాదించి విస్తృత సాహిత్య సేవానంద భరితునిగా జేయ వలెనని మా ప్రార్థన!!!

    రిప్లయితొలగించండి
  9. ప్రణామములు గురువుగారు మధుర,మనోజ్ఞమైన పద్యరత్నములందించారు...మధురకవి శ్రీ గుండు మధుసూదన్ గారికి పదవీవిరమణ శుభాకాంక్షలు....

    రిప్లయితొలగించండి
  10. 🙏మిత్రులందఱకు నమస్సులు!🙏
    నా పదవీ విరమణ సందర్భంగా పద్య రూప సన్మాన పత్రమును రచించి యొసంగిన మన్మిత్రులు శ్రీ కంది శంకరయ్య గారికి మనఃపూర్వక కృతజ్ఞతాభివందనములు!
    🌷🌿🌷🌿🌷🌿🌷🌿
    నన్ను అభినందించిన సాహితీ మిత్రులందఱకు ధన్యవాదములు!
    🌹🌿🌹🌿🌹🌿🌹🌿
    మధురకవి గుండు మధుసూదన్
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    రిప్లయితొలగించండి
  11. మైలవరపు వారి శుభాకాంక్షలు:

    గుండు మధుసూదనార్య ! మీ కోర్కెలెల్ల
    దీర్చి సుఖ శాంతి సంపదల్ గూర్చి , శేష..
    శైల పతి గాచుగావుత సానుకూల..
    మైన విశ్రాంత జీవనమందజేసి !!

    జయోऽస్తు... సాహితీమిత్రమా... విజయోऽస్తు !!............ మురళీకృష్ణ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ అభినందనమును పొందగలిగిన నేను అదృష్టవంతుడను. మీకు ఇవే నా ధన్యవాదములు తెలుపుకొంటున్నాను!

      తొలగించండి
  12. మధుర కవి శ్రీ గుండు మధుసూదన్ గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు. గురువులు శంకరయ్య గారి అమృత వాక్కులు తమరి పట్ల వారి + మా ఆదరాభిమానములకు తార్కాణములు.

    రిప్లయితొలగించండి