8, మే 2025, గురువారం

సమస్య - 5117

9-5-2025 (శుక్రవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“అమ్మను నమ్మవల దనుచు నార్యులని రొగిన్”

(లేదా...)

“అమ్మని నమ్మరా దనుచు నార్యులు పల్కి రనంతరీతులన్”

(మొన్నటి పట్వర్ధన్ గారి శతావధానంలో రాచిరాజు మురళీకృష్ణ గారి సమస్య)

19 కామెంట్‌లు:

  1. కందం
    కమ్మగ లాలించియు స్త
    న్యమ్మిడ నాశ్రమమునెంచి యంపగ వృద్ధా
    ప్యమ్మున నిర్దయఁ దనయుం
    డమ్మను, నమ్మవల దనుచు నార్యులని రొగిన్!

    ఉత్పలమాల
    కమ్మని రాగమున్ బనిచి గర్భమునందున మోసి తల్లి జ
    న్మమ్మిడి పెంచి లాలనల నర్మిలి పుత్రుని పెద్దఁ జేయ, నం
    త్యమ్మున నిర్దయన్ విడువ నాశ్రమమందు కుమారుఁడంత తా
    నమ్మని, నమ్మరా దనుచు నార్యులు పల్కి రనంతరీతులన్

    రిప్లయితొలగించండి
  2. తమ్ముని నన్ను వీడియును దామర

    ణించెను గన్న తల్లియున్

    క్రమ్మర పెండ్లి జేసుకొనె కాంతనొ

    కామెను దండ్రి యామెయున్

    మమ్ముల హింసపెట్ట గని మానస

    మందున చింతజెంది చి

    న్నమ్మను నమ్మరాదనుచు నార్యులు

    పల్కిరనంత రీతులన్

    రిప్లయితొలగించండి

  3. కమ్మని మాటల నాడుచు
    మమ్ముల వంచించె వాడు మామ శకునియే
    యమ్మా! యని తెలుప కలిసె
    నమ్మను, నమ్మవల దనుచు నార్యులని రొగిన్.

    *(వికర్ణుడు గాంధారికి శకునిగూర్చి చెప్ప కలిసెనని)*


    ఇమ్మహి గాంచగా శకుని హీనగుణాత్ముడటంచు తెల్పగా
    నెమ్మది గా వికర్ణుడట నిశ్చల చిత్తము తోడ చేరి తా
    నమ్మని , నమ్మరా దనుచు నార్యులు పల్కి రనంతరీతులన్
    నమ్ముము నాదుమాటలని నారికి తెల్పెనతండు నమ్రుడై.

    రిప్లయితొలగించండి
  4. అమ్మాయిల నాన బరచు
    యిమ్మగు కథలను స్మరించి యెంచిన వాటిన్ 
    కమ్మగ నెరిగించెడీ ఆ
    యమ్మను నమ్మవల దనుచు నార్యులని రొగిన్

    రిప్లయితొలగించండి
  5. అనాథాశ్రమంలో పెరుగుతున్న చిన్నారుల మనో వ్యథండి

    కం॥ అమ్మయె దైవమనుకొనుచు
    నమ్మిన నాశ్రమమునందు నాతి విడువఁగన్
    గ్రమ్మిన కష్టముల బ్రదుక
    నమ్మను నమ్మవల దనుచు నార్యులని రొగిన్

    ఉ॥ నమ్మిన నమ్మ దైవమని నమ్మిన వారల నాశ్రమమ్మునన్
    గమ్మున వీడి పోయిరిటు కన్నుల నీరిడి దైన్యమొందుచున్
    గ్రమ్మిన దుఃఖ భారమునఁ గష్టము లొందఁగ సత్యమే గదా
    అమ్మని నమ్మరాదనుచు నార్యులు పల్కి రనంతరీతులన్

    గత నాలుగైదు సం॥లలో నేను దిహిందూలో చదివిన 5-6 వార్తలు మరీ ఘోరం. ఇలాంటి వారు 0.1 శాతము కంటే తక్కువేనండి. మిగతా 99.99 శాతానికి తల్లే దైవము.

    రిప్లయితొలగించండి
  6. ఇమ్మహి మంత్రరాజముల నెంచగ సాంధ్యకు సాటిలేదు. దై
    వమ్ముల తల్లి గొప్పయగు వాదము లేక, వివేకశీలు రీ
    నమ్మిక దల్లినిన్ గొలువ న్యాయము కేవలమర్త్యనారిగా
    నమ్మని నమ్మరాదనుచు నార్యులు పల్కిర నంతరీతులన్.

    రిప్లయితొలగించండి
  7. క్రమ్మిన మశూచి తొలగగ
    నెమ్మనమున వేడుకొంద్రు నిశ్చల భక్తిన్
    నమ్మిన చికిత్స విడి నె
    ల్లమ్మను నమ్మవల దనుచు నార్యులని రొగిన్

    నమ్మి భజించుచుంద్రు గద నాకముఁ గోరుచు దేవతాదులన్
    జిమ్ముచు నుంద్రు కాన్కలను చేతురుగాదె సమర్పణమ్ముగా
    కమ్మని పిండివంటలను కాని మశూచిని మట్టుబెట్ట యె
    ల్లమ్మని నమ్మరా దనుచు నార్యులు పల్కి రనంతరీతులన్

    రిప్లయితొలగించండి
  8. ఇమ్ముగ గాన వచ్చు వగలింతలు వింతలు జేసి జూపుఁ దాన్
    రమ్మని సైగఁ జేసి యనురాగము జూపు నిశీధి వేళలో
    సొమ్ముల మీద ప్రేమలను జూపు నిజంబెరుగంగ సాని సూ
    పమ్మని నమ్మరా దనుచు నార్యులు పల్కి రనంతరీతులన్!!


    సాని + చూపు + అమ్ము + అని = సాని సూపమ్మని

    రిప్లయితొలగించండి
  9. కమ్మని సుద్దులఁ జెప్పుచు
    నెమ్మనమందున గరళము నింపు దురాత్ముం
    డిమ్మహిలోగలడాద
    ద్దమ్మను నమ్మవల దనుచు నార్యులని రొగిన్

    రిప్లయితొలగించండి
  10. కమ్మగ నాప్తవాక్యముల గ్రన్నన బల్కును చేతమందునన్
    గ్రమ్మును హాహలంబు గనరాదు రవంతయు నెమ్మి వానిలో
    యిమ్మహిలోననట్టి గుణహీనులు కొల్లలు నీతిలేని వా
    జమ్మని నమ్మరా దనుచు నార్యులు పల్కి రనంతరీతులన్

    రిప్లయితొలగించండి
  11. కం:అమ్మయె దైవము రా !ఆ యమ్మయె లేకున్న నన్న మైనను లే, దే
    యమ్మయొ చెడ్డ దనగ మీ
    అమ్మను నమ్మవల దనుచు నార్యులని రొగిన్”
    (మీ అమ్మ మంచిది కాదని దేశం లో ఏ అమ్మ అన్నా నమ్మ వద్దు.)

    రిప్లయితొలగించండి
  12. ఉ:అమ్మయె జన్మ నిచ్చినది,యన్నము పెట్టిన దయ్య మధ్య లో
    సొమ్మును జూచి,యందమును సోకును జూచి యొసంగు బిడ్డ న
    త్తమ్మ,యసూయ పెచ్చరిలి యమ్మను నిత్యము నింద జేయ న
    త్తమ్మను నమ్మరా దనుచు నార్యులు పల్కి రనంతరీతులన్”

    రిప్లయితొలగించండి
  13. కమ్మని మమతల బంచుచు
    నిమ్మహి దైవముగ సంతు నిచ్చా రీతి న్
    సమ్మతి గ బెంచు గద నా
    యమ్మను నమ్మ వల దనుచు నార్యు లని రొ గిన్

    రిప్లయితొలగించండి
  14. కమ్మని వంటల బొజ్జల
    నిమ్ముగ నింపుఁ దిన కున్న నెన్నఁడు తమినిం
    బొమ్మనఁ గోపమ్మున నీ
    వమ్మను నమ్మ వల దనుచు నార్యు లని రొగిన్


    ఇమ్మహిఁ గాలు వెట్టుటకు నెల్లర కింపుగ హేతు వమ్మయే
    నెమ్మినిఁ గాచుఁ బిల్లలను నేర్పున నిత్యము వేయి కళ్లతో
    నమ్మక చెల్ల నిక్కముగ నందఱి నెవ్వరు గౌరవింపరో
    యమ్మను నమ్మరా దనుచు నార్యులు పల్కి రనంత రీతులన్

    రిప్లయితొలగించండి
  15. డా బల్లూరి ఉమాదేవి
    శంకరాభరణం గ్రూప్ వారిచ్చిన సమస్యలకు నా పూరణలు
    *"అమ్మను నమ్మవల దనుచు నార్యులని రొగిన్”
    (లేదా...
    *"అమ్మని నమ్మరా దనుచు నార్యులు పల్కి రనంతరీతులన్”*


    అమ్మను మరిపించు నటుల
    నిమ్ముగదరిచేరికథలనెన్నితెలిపినన్
    నెమ్మనముననీవుసవతి
    *"యమ్మను నమ్మవల దనుచు నార్యులని రొగిన్”*
    ఉ.మా
    అమ్మల గన్న యమ్మ మన నాదరమొప్పగ కాచుచుండుతా
    నమ్మయు నట్టులే మనకు నాకలి బాధలు తీర్చునెప్పుడున్
    నమ్మకు పెద్ద సోదరియు నంబుధి పెద్ద కుమార్తెయైనపె
    *"ద్దమ్మని నమ్మరా దనుచు నార్యులు పల్కి రనంతరీతులన్”*

    రిప్లయితొలగించండి
  16. సమస్య:
    అమ్మని నమ్మరాదనుచు నార్యులు పల్కిరనంత రీతులన్

    అమ్మయు నాన్న దైవమిలనార్తిని దీర్తురు జన్మ బంధమై
    కమ్మని పల్కు నేర్పి తను గారవ మొప్పగ నిన్ను పెంచినన్
    నమ్ముచు వేరు మాటలను నావలకంపగ కన్నవారలన్
    పెమ్మియు పొందనేల యిల పేర్ముడి సూపని సూనులందురే
    అమ్మని నమ్మరాదనుచు నార్యులు పల్కిరనంత రీతులన్

    రిప్లయితొలగించండి

  17. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    అమ్మయె మరణించగ పె
    ద్దమ్మయె తన స్వార్థ బుద్ధి యమరగ నింటన్
    నెమ్మదిగ చేరె నా పె
    ద్దమ్మను నమ్మవలదనుచు నార్యులని రొగిన్.

    రిప్లయితొలగించండి