13, నవంబర్ 2025, గురువారం

సమస్య - 5304

14-11-2025 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తరువులఁ బెంచుటయె పెద్ద తప్పగును సుమా”
(లేదా...)
“తరువుల్ పెంచుట తప్పు పట్టుదలతో ధ్వంసంబు గావింపుమా”

10 కామెంట్‌లు:

  1. గరువముగ బతుకుచుండగ
    నిరుగు పొరుగు వారి మధ్య నెడమును గూర్చన్
    పురజనుల నడుమ కులయం
    తరువులఁ బెంచుటయె పెద్ద తప్పగును సుమా

    రిప్లయితొలగించండి

  2. విరివిగ పెంచగ వలయును
    తరువులనుచు చెప్పిరదియె తథ్యంబైనన్
    చెరువుల బూడ్చుచు నందున
    తరువులఁ బెంచుటయె పెద్ద తప్పగును సుమా.


    విరివిన్ గౌరవ మందజేయ వలయున్ భీరాళి కిన్ ధాత్రిలో
    తరుణుల్ లేనిదె సృష్టి యుండ దదియే తథ్యంబు కాదందురే
    యరయన్ వారిని చిన్నబుచ్చి ఖలులే యందించెడిన్ నగ్న చి
    త్తరువుల్ పెంచుట తప్పు పట్టుదలతో ధ్వంసంబు గావింపుమా.

    రిప్లయితొలగించండి
  3. కందం
    సిరులన్ బొందగ నెంచుచు
    నిరతము గంజాయిఁ బెంచ నేరము సుమ్మీ!
    ధరపై మాదక ద్రవ్యపు
    తరువులఁ బెంచుటయె పెద్ద తప్పగును సుమా!


    మత్తేభవిక్రీడితము
    పరువున్ ద్రుంచును విక్రయింపఁగనగన్ భంగున్సమాజంబునన్
    సిరులున్ బొందిన సక్రమార్జనను నిశ్చింతన్ బ్రసాదించు న
    ల్గురి మేలెంచెడు పంటలెప్పటికిఁ జెల్లున్, మాదకద్రవ్యపున్
    దరువుల్ పెంచుట తప్పు పట్టుదలతో ధ్వంసంబు గావింపుమా!

    రిప్లయితొలగించండి
  4. కం. అరితిన బిడ్డలఁ బెంచక,
    బరువని, కొలువే స్థిరమని, బడి సర్వమ్మై ,
    కరుణించక వారిని స
    త్తరువులఁ బెంచుటయె పెద్ద తప్పగును సుమా!

    భావం : ప్రేమతో పిల్లలని పెంచక, కష్టమని కొందరు, ఉద్యోగమే ముఖ్యమని కొందరు, చదువు ర్యాంకులు సర్వస్వమని కొందరు, జాలిలేక సత్రాలలో (Hostels) పెంచడము తప్పు సుమా !

    రిప్లయితొలగించండి
  5. గురువులు చెప్పిన విషయము
    పరమార్థము బోధపడగ ఫలితంబొసగున్
    మరి పెద్దలుపిన్నల యం
    తరువులఁ బెంచుటయె పెద్ద తప్పగును సుమా

    గురువుల్ చెప్పిన నీతి జీవితమునన్ గొండంత ధైర్యంబిడున్
    దరువుల్ పెంచుట మంచి కార్యముగదా తద్భావమున్ బెంచుమా
    పెరవారిన్ సమదృష్టిఁ గాంచుమెపుడున్ బెద్దంచు పిన్నంచు యం
    తరువుల్ పెంచుట తప్పు పట్టుదలతో ధ్వంసంబు గావింపుమా

    రిప్లయితొలగించండి

  6. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    ధర వానలు పడు మార్గము
    తరువులఁ బెంచుటయె;పెద్ద తప్పగునుసుమా
    హరిత వనములను నాశమొ
    నరించి నూతన గృహముల నధికము కట్టన్.

    రిప్లయితొలగించండి
  7. కురియు నుపాయము వానలు
    తరువులఁ బెంచుటయె, పెద్ద తప్పగును సుమా
    తరువులఁ దెగ నరుకుటయే
    పరిసర సమతుల్యత మరువకుమో నరుడా!

    రిప్లయితొలగించండి
  8. కురియన్ వానలు పెల్లుగా పుడమిపై గూర్చంగ సంక్షేమమే
    మరువంబోకుము మానవా యడవులన్ మాన్యంబుగా బెంచుటన్
    మరణంబుం గొనిదెచ్చి మాదకములం బండించు హాహాలపుం
    దరువుల్ పెంచుట తప్పు పట్టుదలతో ధ్వంసంబు గావింపుమా

    రిప్లయితొలగించండి
  9. మ.
    అరయం బల్లె జనాళి వచ్చి కను మాయాజాలమున్ రేయి నీ
    యరుదౌ శక్తులు బాలబాలికల కాహ్లాదంబు గల్గించినన్
    గరిమం జూపితివీవు లోకములు సంకల్పంబుతో, బెక్కు చి
    త్తరువుల్ పెంచుట తప్పు పట్టుదలతో ధ్వంసంబు గావింపుమా !

    రిప్లయితొలగించండి
  10. కం. బరిలో ఎన్నికగెలవగ
    నెరగా నుచితముల గాలమేమార్చంగన్
    వరముల నిచ్చెడియా యు
    త్తరువులఁ బెంచుటయె పెద్ద తప్పగును సుమా!

    భావం : ఎన్నికలలో గెలవడం కోసం ప్రజలను మోసం చేయుటకు ఉచితాలు ఎరగా ప్రకటించి, గాలమేసి, అట్టి వరాలు ఇచ్చే ఉత్తర్వులు (orders) పెంచడమే పెద్ద తప్పు సుమా!

    రిప్లయితొలగించండి