20, నవంబర్ 2025, గురువారం

సమస్య - 5310

21-11-2025 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఇంతలు గనులున్ననుఁ దెరువే కననైతిన్”
(లేదా...)
“ఇంతలు గన్నులుండఁ దెరువే కననైతి నిదేమి చోద్యమో”

6 కామెంట్‌లు:

  1. ఉ.
    కాంతలు హేల నాటలను కమ్మని పల్కులు బల్కి నాకు బె
    న్గంతలు గట్టి వీడిరి ప్రకామ మనోజ్ఞ వనాంతరంబునన్
    గొంతిల రాలు గేకలను గొబ్బున బెట్టితి జెంత జేరలే
    దింతలు కన్నులుండ దెరువే కననైతి నిదేమి చోద్యమో !

    రిప్లయితొలగించండి
  2. చెంతనగల హితుని గలసి
    మంతనము సలుప వెడలగ మార్గమునందున్
    నంతయు జీకటి కవియగ ,
    నింతలు గనులున్ననుఁ దెరువే కననైతిన్

    రిప్లయితొలగించండి

  3. చెంతను కనిపించిన దొక
    కాంతయె యందమున మేనక నుబోలిన యా
    యింతిని విడిచి చనుటకిక
    నింతలు గనులున్ననుఁ దెరువే కననైతిన్.


    ఇంతియె కానవచ్చెనట యేమని చెప్పెద నందమున్ గళా
    వంతుని కన్న మిన్నయను భావన కల్గిన దయ్యె నత్తరిన్
    గాంతను దాటి నాదయిన గ్రామము జేరు పథమ్ము గాంచగా
    యింతలు గన్నులుండఁ దెరువే కననైతి నిదేమి చోద్యమో.


    చెంతన యున్నమూర్ఖులగు స్నేహితు లెల్లరు పోరు పెట్టగా
    పంతము వీడి యాసవము బానము సేయగ నెంచి యేగితిన్
    ముంతెడు కల్లు గ్రోలగనె ముంచుకు వచ్చిన మత్తు తో కదా
    యింతలు గన్నులుండ దెరువే కననైతి నిదేమి చోద్యమో.

    రిప్లయితొలగించండి
  4. ఎంతటి దెప్పరమ్ముగన నీవనమందున నీనిశీధిలో
    వింతగ నొక్కమారు వినువీధిని మేఘములావరించగా
    గంతలు కట్టినట్లు కనుగానని రీతిని వాన తుట్రిల
    న్నింతలు గన్నులుండఁ దెరువే కననైతి నిదేమి చోద్యమో

    రిప్లయితొలగించండి
  5. తనను వీడిన లక్ష్మికై వెదుకుతూ రమాకాంతుడు:


    కందం
    చింతయె క్రోధమ్మై న
    న్నింతగ వక్షమున దన్న నీసున భృగువే
    కాంతయె వీడెను! పొందఁగ
    నింతలు గనులున్ననుఁ దెరువే కననైతిన్!

    ఉత్పలమాల
    చింతయె క్రోధమై భృగువు శీఘ్రమె రొమ్మున దన్నినంతటన్
    గాంతకు స్థానమౌ కతన కందియు వీడె వికుంఠమామెయే
    చెంతనె లేక పోషణము సృష్టికి నెట్లొకొ! లక్ష్మినొందగా
    నింతలు గన్నులుండఁ దెరువే కననైతి నిదేమి చోద్యమో!

    రిప్లయితొలగించండి
  6. [హిమాద్రికేగి సంతసించిన పిదప ప్రవరుని యంతరంగము]

    వింతగ లేపనము కరిగె
    నింతలు గనులున్ననుఁ దెరువే కననైతిన్
    సంతసమే మటుమాయము
    చింతలు విడివడి గృహమును సేరుట యెటులో

    ఇంతలు గన్నులుండఁ దెరువే కననైతి నిదేమి చోద్యమో
    వింతలు చూడగోరి పరివేష్టన సల్పితినేమి కర్మమో
    చింతిల పాదలేపనము చిత్రముగా కనరానిదయ్యెనే
    సంతసమే సమాప్తమయె సద్మము నెవ్విధిఁ సేరుకొందునో

    రిప్లయితొలగించండి