28, నవంబర్ 2025, శుక్రవారం

సమస్య - 5318

29-11-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మదిరఁ గొన్నయెడల ముదిమి రాదు”
(లేదా...)
“ప్రీతిన్ నిత్యము మద్యమున్ గొనినచో వృద్ధాప్యమే రాదు పో”

15 కామెంట్‌లు:

  1. హితుని గలిసి నంత హితము బలికెనిట్లు
    "మదిరఁ గొన్నయెడల ముదిమి రాదు"
    దీని యర్థమడుగ దెలిపె నీరీతిగా
    "ముదిమి రాక మునుపె ముగియు బ్రతుకు"

    రిప్లయితొలగించండి

  2. *(త్రాగు బోతు మాటలుగా......)*

    మద్య పాన మదియు మంచిది కాదంచు
    మాను మంచు గోరు మాన్య వరుల
    తో వచిన్చె నాతడు త్రాగి తూలుతున్ మత్తులో
    మదిరఁ గొన్నయెడల ముదిమి రాదు.


    నీతుల్ జెప్పుట మాను మంటిగద నా స్నేహంబు నే కోరినన్
    నాతో పాటుగ మద్యశాల యనెడిన్ నాకమ్ము నేజేరి వి
    ఖ్యాతమ్మైన భిషగ్జితమ్ము నట నీవానందమున్ గ్రోలుమా
    ప్రీతిన్ నిత్యము మద్యమున్ గొనినచో వృద్ధాప్యమే రాదు పో.

    రిప్లయితొలగించండి
  3. ఆటవెలది
    మత్తులోన దిగులు మఱపించు మందుగన్
    వ్యసనమనగ మారి వదలనీక
    యాయువుండగానె యసువులఁ దీసెడు
    మదిరఁ గొన్నయెడల ముదిమి రాదు!

    శార్దూలవిక్రీడితము
    చేతమ్మున్ మఱపించఁగన్ దిగులదే క్షీణించి నట్లుండుచున్
    ఘాతమ్ముల్ స్ఫురణంబునన్ దొలఁగ మైకమ్మాదుకొన్నట్లుగా
    నూతమ్మై మది రంజిలన్ జెలఁగి యాయుక్షీణ మొందించుచున్
    ప్రీతిన్ నిత్యము మద్యమున్ గొనినచో వృద్ధాప్యమే రాదు పో!

    రిప్లయితొలగించండి
  4. ప్రజలమేలుకొరకు వారుణి వాహిని
    పథకమొకటితెచ్చె ప్రభుత మనకు
    త్రాగివాగినాడు త్రాగుఁబోతొక్కండు
    మదిరఁ గొన్న యెడల ముదిమి రాదు

    జీతంబంతయు వెచ్చబెట్టి సతియే చీకొట్ట నిశ్చింతగాఁ
    జేతన్ నిత్యము బుడ్డితోనలరుచున్ సేవించుచున్ మద్యమున్
    ఖ్యాతిన్ గొన్న బుధానుడీ పొలుపునన్ గైపెక్కి వాక్రుచ్చెనే
    ప్రీతిన్ నిత్యము మద్యమున్ గొనినచో వృద్ధాప్యమే రాదు పో

    రిప్లయితొలగించండి
  5. ప్రాయమల్పమౌను బాల్యమిత్రులచెంత
    యందురందు లేదు సందియమ్ము
    చెలుల సంగతమున చెలగుచు మితముగా
    మదిరఁ గొన్నయెడల ముదిమి రాదు

    రిప్లయితొలగించండి
  6. పుడమి యందు త్రాగుబోతుల కెన్నఁడు
    మదిరఁ గొన్నయెడల ముదిమి రాదు
    ఎందు వలన ననఁగ నేమని చెప్పుదు
    చిన్న వయసులోనె చితిని జేరు

    రిప్లయితొలగించండి
  7. చేతన్ రూకయు లేకపోయినను విచ్ఛేదమ్ము ప్రాప్తించినన్
    ప్రీతిన్ గ్రోలఁగ నిచ్చగించి కుజనుల్ భీతిల్లకన్ మద్యమున్
    చేతంబందు తలంతురివ్విధిని నిశ్చేయమ్ముగా నెల్లరున్
    ప్రీతిన్ నిత్యము మద్యమున్ గొనినచో వృద్ధాప్యమే రాదు పో

    రిప్లయితొలగించండి
  8. ఆ॥ మద్యపానమునిల మరులుకొల్పు ప్రచార
    మాధ్యము ప్రకటనలె మనసు పడుచు
    జనులు మద్యమడుగు సరళి వ్రాసిరిటుల
    మదిరఁ గొన్న యెడల ముదిమి రాదు

    శా॥ ప్రీతిన్ నిత్యము మద్యమున్ గొనినచో వృద్ధాప్యమే రాదుపో
    ఖ్యాతిన్ బొందగ మద్య పానమిల నాహ్వానించు నస్త్రమ్ముగన్
    నీతిన్ బాసి యిటుల్ ప్రచారముఁ గనన్ నిత్యంబు విజ్ఞానిగా
    నీతీరున్ గని ఛీత్కరించఁగ సదా యింపారు సందేశమౌ

    రిప్లయితొలగించండి
  9. ఆ.వె:నరము లందు బలము నానాటికిన్ బోవు
    ముఖము కళను దప్పు ,ముందె వచ్చు
    మదిరఁ గొన్నయెడల ముదిమి రా దుష్టుడా ! యిపు
    డైన దాని వదలు మతి రయమున.

    రిప్లయితొలగించండి
  10. త్రాగు బోతు వాడు తై తక్క లాడుతూ
    పలుకు చుండె తాను పరుష ముగను
    నెదుటి వాని గాంచి యీ విధంబు గ బ ల్కె
    " మధిర గొన్న యెడల ముదిమి రాదు

    రిప్లయితొలగించండి
  11. శా:"ఏ తీ రౌ నిది? మానుమా మదిర" నం చెన్నెన్నియో చక్కనౌ
    నీతుల్ జెప్పగ "వృద్ధు నైన పిదపన్ నే మానెదన్ లే" యటం
    చే తెల్విన్ వచియించినావొ! మరణమ్మే వచ్చు శీఘ్రమ్ముగా
    ప్రీతిన్ నిత్యము మద్యమున్ గొనినచో, వృద్ధాప్యమే రాదు పో”
    (తాగుడు మానుకో మంటే వార్థక్యం లో మానేస్తాను.ఇప్పుడే తొంద రేమిటి? అన్నాడు. ఇలా రోజూ తాగితే ముసలితనం రాకుండానే పోతావు అన్నాడు మిత్రుడు. )

    రిప్లయితొలగించండి
  12. ఆ॥వె
    వడలుచుండు యొడలు వయసు పరుగిడంగ
    తలపులందు వలదు దాని చింత-
    సరసభావమొలుకు సురసమైన కవన
    మదిరఁగొన్నయెడల ముదిమి రాదు!

    రిప్లయితొలగించండి
  13. మందు గొన్న రీతి మంచి జరుగు నెంచ
    సంతసంబు తనరఁ జింత లేక
    యనుదినమ్ము సుంత యంచితమ్ముగ మంచి
    మదిరఁ గొన్న యెడల ముదిమి రాదు


    తాతల్ తండ్రులు త్రాగి మద్యమును సంతప్తాంగు లై రెల్లరున్
    నీ తీరుం గన నీకుఁ దప్ప దని సందేహంబు నా కయ్యెడిన్
    భ్రాతా చక్కఁగ నాలకింపుమ సుధన్ రాగంబుతో, వీడి ని
    ష్ప్రీతిన్ నిత్యము మద్యముం, గొనినచో వృద్ధాప్యమే రాదు పో

    రిప్లయితొలగించండి

  14. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    మత్తు కలుగజేయు మాటలు తడబడు
    మదిరఁ గొన్న యెడల; ముదిమి రాదు
    స్వర్గలోకమందు వసియించు సురలకు
    సుధను గ్రోలి వారు సుఖము నుండ.

    రిప్లయితొలగించండి
  15. తిప్ప లింక నీకు తప్పవు వినుమయ్య
    *“మదిరఁ గొన్నయెడల ముదిమి రాదు”*
    గొనుచునున్న నాకు కూరలతో తిండి
    దరికి రావు రుజలు తనువు కెపుడు.

    రిప్లయితొలగించండి