21, మే 2025, బుధవారం

సమస్య - 5128

22-5-2025 (గురువారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“పెండ్లి యాడి రాజు బిచ్చమెత్తె”

(లేదా...)

“పెండిలి యాడి రాజు వడి బిచ్చము నెత్తుచుఁ గ్రుమ్మెరెన్ భువిన్”

17 కామెంట్‌లు:

  1. ఆటవెలది
    బసవరాజు పేరు ప్రతివారు రాజుగన్
    పిలుచుచుంద్రు నూరఁ బ్రేమతోడ
    పొదుపు తెలియనట్టి పొలతిని మోహాన
    పెండ్లి యాడి రాజు బిచ్చమెత్తె!

    ఉత్పలమాల
    పండిన పంటతో బ్రతుకు పాటిగ సాగెడు రాజు మోహమై
    గుండెలఁ గూడుఁగట్టి నొక కోమలి నూహలదేలనింగిలో
    మొండిగ పట్టుఁబట్టి పొదుపున్ గిదుపున్ విడి వైభవంబుగన్
    పెండిలి యాడి రాజు వడి బిచ్చము నెత్తుచుఁ గ్రుమ్మెరెన్ భువిన్!

    రిప్లయితొలగించండి
  2. ఉ.
    మండెడి భానుడుగ్రుడగు మంటిని తీక్ష్ణ కరాళ హస్తముల్
    నిండుగ నింపి తాపముల నిగ్గుల నిచ్చుచు ఘోర దర్పమున్
    మెండుగఁ జూపు, గ్రీష్మరమ మించెడి తోషము సేత బట్టె తాం
    బెండిలి యాడి, రాజు వడి బిచ్చము నెత్తుచు గ్రుమ్మరెన్ భువిన్ !

    రిప్లయితొలగించండి
  3. నెత్తిపయిన జ్యేష్ఠ నెలకొన , దానిని
    పెండ్లి యాడి రాజు బిచ్చమెత్తె ;
    దేనిని దరిజేర్చ దెలియకుండినయెడ
    ఫలితమిటులె యుండు వాస్తవముగ

    రిప్లయితొలగించండి
  4. ఆ॥ తెలియక గతమేమి తలఁచుచు రూపము
    రాజు పెండ్లి యాడ రమణి ప్రియుని
    మోజున పడి మగని పొడవనెంచఁగ వీడె
    పెండ్లి యాడి రాజు బిచ్చమెత్తె

    ఉ॥ పెండిలి యాడె రాజు తగు ప్రేమనుఁ గాంచుచు నొక్క కన్యకన్
    మొండిగ నామెయే ప్రియుని మోజును వీడక భర్తనావిధిన్
    ఖండనఁ జేయనెంచ పతి కాంచుచు వీడెను కట్టుబట్టలన్
    బెండిలి యాడి రాజు వడి బిచ్చము నెత్తుచుఁ గ్రమ్మరెన్ భువిన్

    రాజు రాజు అనే పేరున్న మనిషి. అడపాదడపా News Paperలో చూస్తున్న వార్తల ఆధారంగా నండి. చంపిన కేసులే అధికం

    రిప్లయితొలగించండి
  5. అక్షరాజొకండు లక్షల కధిపతి
    జూదమాడునపుడు సొమ్ముపోయి
    లక్షలన్ని కరఁగి భిక్షకుండయ్యెను
    పెండ్లి యాడి రాజు బిచ్చమెత్తె

    నిండుగ జూదమాడుటకు నిత్యముఁ బోవును జూదశాలకే
    తిండికి పోతురాజనుచుఁ దెల్పెదరాతని నక్షరాజుగా
    దండిగ జూదమాడగ విధానము సర్వము నంతరించగా
    పెండిలి యాడి రాజు వడి బిచ్చము నెత్తుచుఁ గ్రుమ్మెరెన్ భువిన్

    రిప్లయితొలగించండి

  6. *(బాసరలో మాధవకరమని నాలుగిళ్ళల్లో యాయవరం తెచ్చుకోవడం సాంప్రదాయం ఇప్పటికీ వుంది.)*

    మనువు జరుపు మమ్మ మాధవకరమెత్తి
    బాసరమ్మ నిన్ను వాసిగాను
    కొలతు నంచు వాడు కోరికొనియె గాన
    పెండ్లి యాడి రాజు బిచ్చమెత్తె.


    కొండల రాయునిన్ గొలచె కోరిన కన్నిక భార్యయైన నా
    దుండిని వెంటబెట్టుకుని దొందుగృహమ్ముల కేగి బోనమున్
    బాండలి చేతబట్టుకుని భక్తినితెచ్చెద నంచు మ్రొక్కి తా
    పెండిలి యాడి రాజు వడి బిచ్చము నెత్తుచుఁ గ్రుమ్మెరెన్ భువిన్.

    రిప్లయితొలగించండి
  7. గండము గట్టిదై నిలిచె కన్నియ జాతకమందుఁ జూడగన్
    కుండలిలో గ్రహమ్ములనుకూలము కావని చెప్పినంతటన్
    పండిత వాక్కులన్ వినక భామిని యందము పైన కోర్కెతో
    పెండిలి యాడి రాజు వడి బిచ్చము నెత్తుచుఁ గ్రుమ్మెరెన్ భువిన్!!

    రిప్లయితొలగించండి
  8. మోస గత్తె యొ క తె మురిపాలు పండించ
    వలపు నందు జిక్కి పతన మ య్యె
    రాణి యైన పిదప రాజ్య పాలన జేయ
    పెండ్లి యాడి రాజు బి చ్చ మెత్తే

    రిప్లయితొలగించండి
  9. ఆ.వె.
    ఫేసుబుక్కు లోన పెళ్లిచూపులుచూసి
    ఆనులైను లోన తాళికట్టి
    నెట్టు ఫ్రాడు కింగు నేరస్తురాలిని
    పెండ్లి యాడి రాజు బిచ్చమెత్తె

    రిప్లయితొలగించండి
  10. ఆ.వె:శత్రు దేశపతిని సమరాన గెలిచియు
    కోర సంధి నతని కూతు నొకతె
    పెండ్లి యాడి రాజు, బిచ్చమెత్తె ననక
    గౌరవించె మామగారటంచు.

    రిప్లయితొలగించండి
  11. ఉ:తిండికి లేని వారు పడు తిప్ప లదేమియొ,తిండి గుడ్డలున్
    మెండుగా నుండి ధర్మమును మీరున దెవ్వరొ చూడ మొన్ననే
    పెండిలి యాడి రాజు, వడి బిచ్చము నెత్తుచుఁ గ్రుమ్మెరెన్ భువిన్
    తిండియె లేని భిక్షుకుని తీరున వేషము దాల్చి గూఢతన్.
    (రాజు క్రొత్తగా పెండ్లాడిన వాడై కూడా రాజ్యం లో మంచి,చెడు తెలుసుకోటానికి బిచ్చగాని వేషం లో బయలుదేరాడు.)

    రిప్లయితొలగించండి
  12. సమస్య:
    పెండిలి యాడి రాజు వడి బిచ్చము నెత్తుచుఁ గ్రుమ్మెరెన్ భువిన్.

    కొండల పిండి సేయు బహు కండల రాయడు ప్రేమగుడ్డిదై
    మెండుగ ప్రీతిఁ జూపి దను మెత్తని భార్య నపోహ చండికన్
    పెండిలి యాడి రాజు వడి బిచ్చము నెత్తుచుఁ గ్రుమ్మెరెన్ భువిన్.
    ఖండిత మాయె కర్మమును కాదన లేమను నగ్నసత్యమున్ !

    రిప్లయితొలగించండి
  13. ఇంటి పేరు గాంచ నింపైన కస్తూరి
    యబ్బ యింటి నిండ గబ్బిలములు
    పేరు రాజు తాను బేద మిక్కుటముగఁ
    బెండ్లి యాడి రాజు బిచ్చ మెత్తె


    దండము లన్నఁ బొంగుదురు దర్ప గుణాంధులు రాజు లెల్లరున్
    మెండుగ నాశ మిక్కుటము మేటి పొగడ్తల భూమి నందఁగా
    రండని యిచ్చి మూ డడుగులన్ బలి గాంచెను దా నధోగతిన్
    దండిగఁ జేసి వే రొకఁడు దానము లౌర దరిద్ర దేవతం
    బెండిలి యాడి రాజు వడి బిచ్చము నెత్తుచుఁ గ్రుమ్మరెన్ భువిన్

    రిప్లయితొలగించండి
  14. మెండగు భోగలాలసయు మించిన దుర్వ్యసనంబులన్ సదా
    దండిగ ఖర్చులన్ మునిగె దానికితోడుగ రాజు కోమలిన్
    పెండిలియాడె నాపెయును వేడుకలందున మున్గి తేలగన్
    పెండిలి యాడి రాజు వడి బిచ్చము నెత్తుచుఁ గ్రుమ్మెరెన్ భువిన్

    రిప్లయితొలగించండి
  15. పేరు రాజు కాని పేదవా డాతండు
    పెండ్లియాడినాడు వేదవతిని
    భూషణముల కొరకు పోరుబెట్టఁగ భార్య
    పెండ్లి యాడి రాజు బిచ్చమెత్తె

    రిప్లయితొలగించండి
  16. సమస్య:
    పెండిలి యాడి రాజు వడి బిచ్చము నెత్తుచుఁ గ్రుమ్మెరెన్ భువిన్.

    మొండిగ నాడు పెద్దలకు మోదము లేకను పెండ్లియాడగన్
    నిండగు జీవితమ్ముఁ సతి నీతుల దానును వేరుగఁ బోవగన్
    మెండగు సంపదన్ మిగుల మెచ్చెడు బందుగు ప్రీతిఁ శూన్యమై
    పెండిలి యాడి రాజు వడి బిచ్చము నెత్తుచుఁ గ్రుమ్మెరెన్ భువిన్.

    రిప్లయితొలగించండి

  17. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    పెండ్లి జరుగ తాను బిచ్చమెత్తెదనని
    మ్రొక్కుకొనెను రాజు ముడుపు కట్టి
    యనుకొనిన విధముగ నా గ్రామమందున
    పెండ్లి యాడి రాజు బిచ్చమెత్తె.

    రిప్లయితొలగించండి