15, జూన్ 2025, ఆదివారం

సమస్య - 5153

16-6-2025 (సోమవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“గంగన్ హరి దలనుఁ దాల్చెఁ గని శివుఁ డొప్పన్”

(లేదా...)

“గంగన్ శ్రీహరి దాల్చె నౌదల నుమాకాంతుండు మేల్మేలనన్”

15 కామెంట్‌లు:

పఠానేని కార్తిక్ చెప్పారు...

శా.
బంగారంబగు మేనికాంతి లలనల్ భాసిల్లి వైకుంఠమున్
శృంగారాస్పద కృష్ణలీలలను వాసిం బాడు గాలంబునన్
రంగన్నీల మయూర బర్హమును ద్యోరాజాదులచ్చోట మూ
గంగన్ శ్రీహరి దాల్చె నౌదల నుమాకాంతుండు మేల్మేలనన్ !

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

కందం
నింగి సురాపగ భువి జా
రంగ భగీరథుఁడు భక్తి త్ర్యక్షున్ ప్రార్థిం
పంగ, పితరుఁడై సూనను
గంగన్ హరి, దలనుఁ దాల్చెఁ గని శివుఁ డొప్పన్

శార్దూలవిక్రీడితము
నింగిన్ జారు సురాపగన్ కరుణతో నిల్పంగ వేగమ్ము వే
డంగన్ భక్తి భగీరథుండు సరి జూటాధీశు గౌరీశు ఖ
ట్వాంగిన్, భూమికి శ్రేయమంచు మది సంభావించి దీవింపగన్
గంగన్ శ్రీహరి, దాల్చె నౌదల నుమాకాంతుండు మేల్మేలనన్

విరించి చెప్పారు...


బంగరు దువ్వెన తోడను
ముంగురులను దువ్వి మోదమున సితా
పాంగపు పింఛమ్మును వే
గంగన్ హరి దలనుఁ దాల్చెఁ గని శివుఁ డొప్పన్.


సింగారింపగ నాటకమ్ము కొరకై శ్రీకృష్ణునిన్ బాత్ర కై
బంగారాన్విత సంప్రసాధనములున్ వంశిన్ గరమ్మందునన్
పింగాశంపు సుమాలనే కురులలో, పింఛమ్ము నే పేర్మి వే
గంగన్ శ్రీహరి దాల్చె నౌదల నుమాకాంతుండు మేల్మేలనన్.

Sitharamayya Solasa చెప్పారు...

ఆంగన సత్య వలపునకు
భంగము వాటిల్లకుండ  భవనము కేగి
ఇంగముగ పదములను వే
గంగన్ హరి దలనుఁ దాల్చెఁ గని శివుఁ డొప్పన్

M.B.G.TILAK చెప్పారు...

చెంగున దూకెడు క్రేపుల
భంగిన్ బొంగారు గంగ భాగ్యంబనగా
బంగరు పదముల తాకెను
గంగన్ హరి, దలనుఁ దాల్చెఁ గని శివుఁ డొప్పన్

శృంగారాకృతి కల్గి యున్నదిగదా చిందించె విన్నాణమే
సాంగత్యమ్మును కోరె శంతనుడటన్ సమ్మోహ సంరంభమున్
బంగారంబన నొప్పు దీవెనలతో స్పర్శించె పాదాలతో
గంగన్ శ్రీహరి, దాల్చె నౌదల నుమాకాంతుండు మేల్మేలనన్

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

రంగండేగెను గాంచగా శివుని సంరంభంబుగా లచ్చితో
గంగాధారి యొసంగ నాదరమునన్ గార్హస్థ్య ధర్మంబుగా
గంగాతోయము నర్ఘ్యపాద్యములుగన్, కల్హారదామంబు, వే
గంగన్ శ్రీహరి దాల్చె నౌదల నుమాకాంతుండు మేల్మేలనన్

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

గంగాధరునికడకు నే
గంగన్ వైకుంఠవాసి గారవమున నీ
యంగన్ శిఖిపింఛము వే
గంగన్ హరి దలనుఁ దాల్చెఁ గని శివుఁ డొప్పన్

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

పొంగిన నుత్సాహంబున
ముంగురు లను సర్దు కొనియు మురిపము తోడన్
రంగుల కిరీటమును వే
గంగన్ హరి తల ను దా ల్చె గని శివు డొప్పె న్

Dhanikonda Ravi Prasad చెప్పారు...

కం:మంగళ పదముల దాల్చగ
గంగన్ హరి, దలనుఁ దాల్చెఁ గని శివుఁ డొప్పన్”
సింగారమ్మని జగము, ల
భంగము గా గంగ సాగె పాప హరిణి యై.

Dhanikonda Ravi Prasad చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Dhanikonda Ravi Prasad చెప్పారు...

2)శా:రంగౌ పాదపు వెండి గజ్జెల వలెన్ రంజిల్లు రూపమ్ము తో
గంగన్ శ్రీహరి దాల్చె, నౌదల నుమాకాంతుండు మేల్మేలనన్
సింగారమ్ముగ నుండె నంచు జగముల్ల్ జేజే లనన్ దాల్చె గా!
భంగ మ్మౌ నఘసంఘ మట్టి నదియౌ భాగీరథిన్ దల్చినన్.

(గంగ విష్ణుపాదోద్భవం.శివుడు శిరస్సున ధరించాడు.)

Dr H Varalakshmi చెప్పారు...

సమస్య:
గంగన్ శ్రీహరి దాల్చె నౌదల నుమాకాంతుండు మేల్మేలనన్

శార్దూలము:

పొంగే కంట గజేంద్రుడే మొరలిడే పోయేను ప్రాణంబులన్
భంగంబున్నగునంచు నున్కి లయలే భవ్యంపు నుద్దీప్తులై
సంగంబున్ స్థితులైన యీశ్వర, హరీ సంతాపమే బాప, యే
గంగన్, శ్రీహరి దాల్చె నౌదల, నుమాకాంతుండు, మేల్మేలనన్

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

అంగన శచీ సతి యొసఁగ
బంగరు కలశమున నింపి వారినిఁ దమి శ్రీ
రంగపతి పదములు కడిగి
గంగన్ హరి దలనుఁ దాల్చెఁ గని శివుఁ డొప్పన్


భంగం బుండదు భావజాలమునకున్ భావింప నీరీతిఁ బా
దాంగచ్ఛేదము నిట్లు సేయ వలె సత్యార్థమ్ము గంగా సతిన్
సింగారించిన దా సదాశివుఁడు గా శ్రీకాంతుఁడే మేలనెన్
గంగన్, శ్రీహరి, దాల్చె నౌదల నుమాకాంతుండు, మేల్మేలనన్

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...


పొంగగ దాల్చెన్ పదముల
గంగన్ హరి, దలను దాల్చె గని శివుడొప్పన్
సింగారమ్మగుచు నదియె
ఛెంగున దూకుచును జారె క్షితిపతి వేడన్/వెంటన్


పొంగుల్వారుచుపాదమందునుదయమ్మెందంగదీవించుచున్
*“గంగన్ శ్రీహరి దాల్చె నౌదల నుమాకాంతుండు మేల్మేలనన్”*
చెంగున్గెంతుచునెక్కెశంభుశిరమున్ శీఘ్రంబుగానచ్చటన్
హంగున్జూపుచు సాగుచుండెనిలవయ్యారమ్ము చూపించుచున్

Dr H Varalakshmi చెప్పారు...

సమస్య:
గంగన్ శ్రీహరి దాల్చె నౌదల నుమాకాంతుండు మేల్మేలనన్

శార్దూలము:

భంగమ్మున్ బడి బూదిగా సగరులన్ భాగీరథుండే గనెన్
అంగల్ నేర్వని విష్ణుపాద జనితౌ యా గంగనే కోరగన్
భంగిన్ సేయ తపంబునెంచెనుగ యా భాగీరథుండే,విడెన్
గంగన్ శ్రీహరి, దాల్చె నౌదల నుమాకాంతుండు మేల్మేలనన్