29, జూన్ 2025, ఆదివారం

సమస్య - 5167

30-6-2025 (సోమవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“చాటుమాటుగా వినుట సంస్కారమగును”

(లేదా...)

“విననొప్పున్ గద చాటుమాటుగఁ బరుల్ వేర్వేర మాటాడఁగన్”

25 కామెంట్‌లు:

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

తేటగీతి
వ్యక్తిగత గోప్యతయన రాజ్యాంగ హక్కు
యేలికలె దాని హరియించ నేహ్యమగును
చట్టపరిధి నేరస్తుల గుట్టుఁ దెలియ
చాటుమాటుగా వినుట సంస్కారమగును

మత్తేభవిక్రీడితము
మనరాజ్యాంగము వ్యక్తి గోప్యతను సంభావించఁగన్ హక్కుగన్
వినిరే యేలికలైన నీచమనగన్వేదింప ప్రత్యర్థులన్!
జన సేమమ్మను దృష్టి చట్ట పరిధిన్ సాధింప నేరస్తులన్
విననొప్పున్ గద చాటుమాటుగఁ బరుల్ వేర్వేర మాటాడఁగన్

Sitharamayya Solasa చెప్పారు...

అంటురోగము పురమునందడరు వేళ
వైద్యశాలకు క్రొత్తగ వచ్చి నట్టి
రోగి కున్న రోగమును దెలుసుకోనుటకు
చాటుమాటుగా వినుట సంస్కారమగును

విరించి చెప్పారు...


బాధ్యతగల యుద్యోగ నిర్వహణ యనుచు
వృత్తి ధర్మాన్ని నెరవేర్చు వేగుల కది
తప్పదయ్యె కనగనది ధర్మమేను
చాటుమాటుగా వినుట సంస్కారమగును.



తనదౌ వృత్తిని సక్రమమ్ముగను నిత్య మ్మాచరింపం గ వే
తనమున్ గైకొని చేయు కార్యమనుచున్ ధర్మమ్మటంచయ్యదే
ఘనమంచున్ దలపోయు వేగులకు సత్కార్యంబదే కాంచగన్
విననొప్పున్ గద చాటుమాటుగఁ బరుల్ వేర్వేర మాటాడఁగన్.

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

దుష్ట శక్తులు చెలరేగి దుష్కృతముల
సలుపఁ బూనఁగ నరికట్ట వలసినపుఁడు
చట్ట పరిధిలో సేయఁగ గుట్టురట్టు
చాటుమాటుగా వినుట సంస్కారమగును

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

తే॥ శత్రు చేష్టలఁ బసికట్టి జన్మభూమి
రక్షణఁ గనఁగ వేగులు లక్ష్యసిద్ధిఁ
గోరి ప్రాణములొడ్డి నిగూఢతనటు
చాటు మాటుగా వినుట సంస్కారమగును

మ॥ కనఁగన్ భద్రత గూఢచర్యమిల సత్కార్యమ్ముగా నొప్పెడిన్
దనువుల్ ప్రాణము దేశరక్షణను సంధానించఁగా నొడ్డెడిన్
ఘనులా వేగులు శత్రు చేష్టలనుఁ బొంగార్చంగ నన్వేషణన్
విన నొప్పున్ గద చాటుమాటుగఁ బరుల్ వేర్వేర మాటాడఁగన్

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

వనసీమన్ వసియించి పౌరులకు రాభస్యమ్ము పోకార్చగా
ననిశమ్మున్ సమయోగముల్ నెరపు దుర్మార్గంబు రోధించగన్
జనసంక్షేమముఁగోరి రక్షక భటుల్ సవ్యంపు మార్గమ్మునన్
విననొప్పున్ గద చాటుమాటుగఁ బరుల్ వేర్వేర మాటాడఁగన్

పఠానేని కార్తిక్ చెప్పారు...

మ.
ఘన సామ్రాజ్య విరూఢి సంకలిత సంస్కారాఢ్య సందీప్తుడై
జన హృన్నేతగ పేరుగాంచెనొక రాజశ్రేష్ఠుడాశించి తా
మొనసెం బల్లెలకేగి దానముగ సొమ్ముల్ పంచు కాలంబునన్
విననొప్పున్ గద చాటుమాటుగఁ బరుల్ వేర్వేర మాటాడగన్ !

M.B.G.TILAK చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Dhanikonda Ravi Prasad చెప్పారు...

తే.గీ:నీవు గూఢచారి వనుచు నే నెరుగుదు
మగడ! అంత మాత్రమ్మున మన కొడుకును,
కోడలును గది లోన మా టాడ నెట్లు
చాటుమాటుగా వినుట సంస్కారమగును”?
(ఆ గూఢచారి కెందుకో కొడుకు మీద,కొత్త కోడలి మీద దౌటొచ్చింది.వాళ్ల లో అదీ సహజమే.)

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

పరుల లేఖలు చదువుట పాడి కాదు
వారు గోప్యము గా సల్పు భాష ణంబు
దొంగ వలె చేరి నక్కియు దోష మెటుల
చాటు మాటుగా వినుట సంస్కార మగును?

Dhanikonda Ravi Prasad చెప్పారు...

మ:నిను నే నమ్మితి సాధ్వి వంచు, నెవడో నిన్ గూర్చి మాటాడ న
మ్మను,నన్ గూర్చియు నీకు జెప్ప చెడుగా మన్నించ కా మాటలన్
మనకున్ దంపులు వెట్టు చుందు రెపుడున్ మా వారు మీవారు ,న
వ్విననొప్పున్ గద చాటుమాటుగఁ బరుల్ వేర్వేర మాటాడఁగన్”
(ఈ భార్యా భర్తలకి ఒకరి మీద ఒకరికి సాడీలు చెప్పే వాళ్లున్నారు కానీ నమ్మ వద్దని,ఇక చాటుగా మాట్లాడుకుంటే నవ్వుకుంటే సరిపోతుందని.)

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'కొనుటకు' టైపాటు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
'మాటాడఁగన్ + ఒనగూడు' అన్నపుడు యడాగమం రాదు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

M.B.G.TILAK చెప్పారు...

ధన్యవాదాలు గురూజీ 🙏

Sitharamayya Solasa చెప్పారు...

🙏

Dr H Varalakshmi చెప్పారు...

సమస్య:
“విననొప్పున్ గద చాటుమాటుగఁ బరుల్ వేర్వేర మాటాడఁగన్”

మత్తేభము:

కనమంజెప్పవు వేరు కృష్ణ సతులే కాంతున్ బిగిం గట్టిరో !
ఘనమౌ సత్యకు తోడునీడనుచు నే గారంబునే పొందితిన్
చనమం జెప్పిరి పుట్టినింట నను నీ సంతోషమే గాంచగా
“విననొప్పున్ గద చాటుమాటుగఁ బరుల్ వేర్వేర మాటాడఁగన్”

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

దిట్టతనమున నట్టింట గుట్టు రట్టు
కాఁగఁ బట్టు పట్టి పలుకఁ గాదె చెట్ట
వట్టి మాటలె యిట్టివి యెట్టి చోటు
చాటుమాటుగా వినుట సంస్కార మగును


ఘనులే యౌదురు దోష మించుకయు నెక్కాలమ్మునం గాంచ రీ
మనుజశ్రేష్టులు పౌర సంతతికి సంప్రాప్తించు క్షేమమ్ములే
యనయం బింపుగ గూఢచారులకు రాజ్యక్షేమ మాశించుచున్
విన నొప్పున్గద చాటుమాటుగఁ బరుల్ వేర్వేఱ మాటాడఁగన్

[పరులు = శత్రువులు]

M.B.G.TILAK చెప్పారు...

చట్టబద్దత లేనట్టి చారుచర్య
హద్దు మీరుచు సల్పిన సుద్దులేల
కనుగొనుటకు చక్కని వీలు కలిగినపుడు
చాటుమాటుగా వినుట సంస్కారమగును

[సంస్కారము = సామర్థ్యము]


సవరణతో ...

మన రాజ్యాంగపు హద్దుమీరుటయె సామాన్యంబుగా మారెగా
మనసొప్పున్ గద గూఢచర్యల విధిన్ మర్మంబులన్ గన్గొనన్
విననొప్పున్ గద చాటుమాటుగఁ బరుల్ వేర్వేర మాటాడఁగన్
గొనసాగన్ వలె స్వప్రయోజనములే కొంగ్రొత్త మార్గంబులన్

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

సవరించిన తేటగీతి

తేటగీతి
వ్యక్తిగత గోప్యతయన రాజ్యాంగ హక్కు
నేలికలె దాని హరియించ నేహ్యమగును
చట్టపరిధి నేరస్తుల గుట్టుఁ దెలియ
చాటుమాటుగా వినుట సంస్కారమగును

Dr H Varalakshmi చెప్పారు...

సమస్య:
“విననొప్పున్ గద చాటుమాటుగఁ బరుల్ వేర్వేర మాటాడఁగన్”

మత్తేభము:

కనలేవో కలికాలమందు నిల నే కార్యంబు సవ్యంబగున్
మనగన్ రాదుగ స్వార్ధమే విడచియే, మర్యాదలే సేయరే
తన వారెవ్వరు జూడగన్ హితమునే తామెంచరే యేరికిన్
విననొప్పున్ గద చాటుమాటుగఁ బరుల్ వేర్వేర మాటాడఁగన్”

పిన్నక నాగేశ్వరరావు. చెప్పారు...


పిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.

మారు వేషమ్ములో తాము మసలుకొనుచు
ప్రజల కష్ట సుఖములను ప్రభుకు తెలుప
చాటు మాటుగా వినుట సంస్కారమగును
వేగులను వారి; కది వారి వృత్తియె కద.