4, సెప్టెంబర్ 2025, గురువారం

సమస్య - 5234

5-9-2025 (శుక్రవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“సంసారమె సుఖకరమని సన్యాసి యనెన్”

(లేదా...)

“సంసారంబె సుఖావహం బనుచు నా సన్యాసి బోధింపఁడే”

(బ్రహ్మశ్రీ వద్దిపర్తి వారి కాశీ శతావధానంలో నారాయణం బాలసుబ్రహ్మణ్యం గారి సమస్య)

22 కామెంట్‌లు:

  1. శా.
    కంసారాతి పదంబు నమ్మి మహిపై కష్టంబులం దాల్మితో
    హింసావాదము మాని జీవితమునన్ హీరంబుగా నుండి వి
    ధ్వాంసుల్ మెచ్చెడి రీతి జ్ఞాననిధితో వర్ధిల్లి దీపించు త
    త్సంసారంబె సుఖావహంబనుచు నా సన్న్యాసి బోధింపడే ?

    రిప్లయితొలగించండి
  2. హింస రహితముగ నుండుచు
    సంసారమున గల దేశ జనులందరొకే 
    శంసపయి నిలచి యుండిన 
    సంసారమె సుఖకరమని సన్యాసి యనెన్

    రిప్లయితొలగించండి
  3. సంసారంబన సాగరంబనుచు నిస్సారంబుగానెంచియా
    సంసర్గంబును వీడి ప్రవ్రజనమున్ క్షాంతమ్ముగా గైకొనెన్
    సంసారొక్కఁడు, ముక్తసంగుడగుటన్ సంస్కారహీనంబుగా
    సంసారంబె సుఖావహం బనుచు నా సన్యాసి బోధింపఁడే!

    రిప్లయితొలగించండి
  4. కందం
    హంసగ తన కౌపీనము
    ధ్వంసము కాకుండు కతన దారను గొను మీ
    మాంసను తర్కింపంగన్
    సంసారమె సుఖకరమని సన్యాసి యనెన్!

    శార్దూలవిక్రీడితము
    హంసధ్యానికి శత్రువాఖువయి తానందంగ కౌపీనమున్
    హింసామార్గము ద్రొక్కెడున్ గతన దానిల్లాలినిన్ బొందు మీ
    మాంసన్ దర్కము నెంచి చూడ మనకున్ మర్మంబు వీడంగనే
    సంసారంబె సుఖావహం బనుచు నా సన్యాసి బోధింపఁడే!

    రిప్లయితొలగించండి
  5. సంసారము సాగరమని
    సంసర్గము వీడి మారె సన్యాసిగ, వి
    ధ్వంసఁపు పోకడ జూపుచు
    సంసారమె సుఖకరమని సన్యాసి యనెన్

    రిప్లయితొలగించండి

  6. హంసుని కొలుచుచు పరులను
    హింసించని సతియె యుండి యిమ్మగు తన ప్రే
    యాంసున కనుకూలమయిన
    సంసారమె సుఖకరమని సన్యాసి యనెన్.


    అంసమ్మందున నున్న బాధ్యతలకై యాయాస మున్ వీడుచున్
    హంసన్ నమ్మిన సాధ్వియే పతిని ప్రత్యక్షేతనుండంచు ప్రే
    యాంసున్ గొల్చెడమాయకంపు సతియే యర్ధాంగి గా నున్నచో
    సంసారంబె సుఖావహం బనుచు నా సన్యాసి బోధింపఁడే.

    రిప్లయితొలగించండి
  7. హంసంబుట్టులస్వచ్ఛమై సతతమాహ్లాదంబు గానుండుచున్
    శంసల్ లేక ప్రశాంత మానసముతో సన్మార్గమే పట్టుచున్
    కంసారాతి పదంబులన్ విడువకన్ కర్మంబులన్ జేయు యా
    సంసారంబె సుఖావహంబనుచు నా సన్యాసి బోధింపడే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హంసంబట్టులస్వచ్ఛమైసతతమాహ్లాదంబు గానుండుచున్
      శంసల్ లేక ప్రశాంత మానసముతో సన్మార్గమే పట్టుచున్
      కంసారాతి పదంబులన్ విడువకన్ కర్మంబులన్ జేయు యా
      సంసారంబె సుఖావహంబనుచు నా సన్యాసి బోధింపడే

      తొలగించండి
    2. హంసంబట్టులస్వచ్ఛమైసతతమాహ్లాదంబు గానుండుచున్
      శంసల్ లేక ప్రశాంత మానసముతో సన్మార్గమే పట్టుచున్
      కంసారాతి పదంబులన్ విడువకన్ కర్మంబులన్ జేయు యా
      సంసారంబె సుఖావహంబనుచు నా సన్యాసి బోధింపడే

      తొలగించండి
  8. మాంసాహారము మద్యము
    సంసారముఁ వీడి కడకు సన్యస మందెన్
    ధ్వంసంబయ్యెను భోగము
    సంసారమె సుఖకరమని సన్యాసి యనెన్

    మాంసాహారము మద్యపానమును దుర్మార్గంపు టాలోచనల్
    సంసారంబును వీడి శీఘ్రమతడే సన్యాస దీక్షన్ గొనెన్
    ధ్వంసంబయ్యె ఫలోదయమ్మని మదిన్ వైక్లవ్యమేపారగా
    సంసారంబె సుఖావహం బనుచు నా సన్యాసి బోధింపఁడే

    రిప్లయితొలగించండి
  9. కం:కంసాలి వారి చిన్నది
    సంసారము దుఃఖ మనుచు సన్యాస మిడన్
    వెంసూరు స్వామి నడుగగ
    సంసారమె సుఖకర మని సన్యాసి యనెన్
    (వెంసూరు అనేది ఒక ఊరు.ఆ కంసాలి స్త్రీకి సంసారం దుఃఖ మని పించి సన్యాసం ఇప్పించమని వెంసూరు స్వామీజీని అడిగితే "వద్దు.నీకు సంసారమే మంచి దన్నాడు.ఆడవాళ్లకి సన్యాసం తో కొన్ని సమస్య లుంటాయి.)

    రిప్లయితొలగించండి
  10. శా:సంసారమ్మును వీడి యాశ్రమములన్ స్థాపింపగా వేదవి
    ద్వాంసుల్,సాధక కోటి లేక యచటన్ స్వార్థమ్ము హెచ్చన్ సదా
    హింసన్ వెట్టగ రాజకీయము లటన్,హీనమ్మె యీ గోల,యా
    సంసారంబె సుఖావహం బనుచు నా సన్యాసి బోధింపఁడే
    (ఉదా;-ఒక మారు చింతల పూడి యోగినీ మాత అనే సాధ్వీమ తల్లి,ప్రేమ మూర్తి తన ఉపన్యాసం లోనే "మీ ఇళ్లల్లో తగాదాలు ఒక లెక్కా! మేము ఈ ఉపన్యాసాలు ముగించుకొని ఆశ్రమానికి పోతే ఎన్ని తగవులు,ఎన్ని రాజకీయాలు పరిష్కరించాలో మీకేం తెలుసు" అని కుండ బద్దలు కొట్టి చెప్పారు.ఆ తల్లికి నమస్కారం.)

    రిప్లయితొలగించండి
  11. కం॥ ధ్వంసమ్ము శాంతి సుఖములు
    సంసారమున యని తలఁచి సన్యాసిగనై
    హింసఁ బడయ కష్టములకు
    సంసారమె సుఖకరమని సన్యాసి యనెన్

    శా॥ ధ్వంసంబయ్యెనె శాంతి యంచు ధర సద్భాగ్యమ్ము సన్యాసమే
    సంసారమ్మును వీడ నొప్పుననుచున్ సన్యాసియై యచ్చటన్
    హింసన్ గాంచుచు భోజనాదులకు నాహేలార్థమున్ దెల్లమై
    సంసారంబె సుఖావహం బనుచు నాసన్యాసి బోధింపఁడే

    చిన్నప్పుడు సోమరిగా ఉన్నప్పుడు మాయమ్మ చెప్పిన చిన్న కథ ఆధారంగా నండి

    రిప్లయితొలగించండి
  12. శా:సంసారమ్మును,నాలి లేక తన దేశమ్మే కడున్ ముఖ్య మై
    హంసన్ బోలిన వాజపేయియె యపాయమ్మొందె
    పొత్తంచు నా
    హింసన్ వెట్టు జయన్ భరించ, మమతాహింసన్ భరింపంగనే
    సంసారంబె సుఖావహం బనుచు నా సన్యాసి బోధింపఁడే
    (వాజపేయి అనే బ్రహ్మచారి జయలలిత మమతా బెనర్జీ అనే ఇద్దరు ఆడవాళ్లని తట్టుకో లేక పోయాడు.దీని కంటే పెళ్లి చేసుకు సంసారం లోకి దిగితేనే బాగుండేది అనుకొని ఉండ వచ్చు.వాజపేయి బ్రహ్మచారే కానీ సన్యాసి కాదు కదా! అంటారా!ఆయన వేషం వేసుకోని సన్యాసే.)

    రిప్లయితొలగించండి
  13. సంసార మనగ దెలియని
    సంసారి కానట్టి వాడు చాతుర్య ము గా
    సంసారము గూర్చి యె టుల
    సంసారము సుఖ కరమని సన్యాసి య నె న్?

    రిప్లయితొలగించండి
  14. సమస్య:
    సంసారంబె సుఖావహంబనుచు నా సన్యాసి బోధింపడే !

    శా :

    సంసారంబును సాగరంబనిరిగా శక్యంబె చేరద్దరిన్ !
    హింసాపూరిత శోకతప్త జగతిన్ హిందోళ రాగంబులా !
    సంసారాబ్ధిని దాట నెంచగనుబో సంసద్గతే దక్కునా !
    సంసారంబె సుఖావహంబనుచు నా సన్యాసి బోధింపడే !

    రిప్లయితొలగించండి
  15. (4)శా:సంసారమ్మును వీడినా ననుచు వేషమ్మేదొ దాల్చంగనే
    సంసారాశయు జచ్చునే
    తనను మెచ్చన్ స్త్రీయె సన్యాసమే
    ధ్వంసమ్మై మన నందమూరి గృహచింతన్ జిక్కడే?యింక నీ
    సంసారంబె సుఖావహం బనుచు నా సన్యాసి బోధింపఁడే?

    రిప్లయితొలగించండి
  16. గురువులు శంకరయ్య గారికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  17. హంసాతిథ్య మొసంగఁ బ్ర
    శంసార్హంబై వెలయును సతమున్ రాజో
    త్తంసా సతి పోరెఱుఁగని
    సంసారమె సుఖకరమని సన్యాసి యనెన్


    పాంసుక్షీణ పటాభ మానసులు క్షుద్బాధాది సంపూర్ణ వి
    ధ్వంసప్రక్రియ నన్య మర్త్యులకు మోదంబీయ సంసార ధు
    ర్యాంసశ్రేష్ఠులు పంచయజ్ఞ పరిపో షాసక్తులై యుండుటన్
    సంసారంబె సుఖావహం బనుచు నా సన్యాసి బోధింపఁడే

    రిప్లయితొలగించండి
  18. హింసకుఁదా తావీయక
    సంసారముఁజేయుచుండు శర్మను గనుచున్
    హింసారహితంబగుచో
    సంసారమె సుఖకరమని సన్యాసి యనెన్”

    రిప్లయితొలగించండి
  19. సంసారంబె సుఖావహం బనుచు నా సన్యాసి బోధింపఁడే”
    సంసారాంబుధి దాట శక్యమె?భువిన్ సన్యాసిమాట్లాడుటా!
    సంసారంబిల చూడ గాఁగను మహా సంద్రంబువోలెన్ గ దా
    సంసారంబునుఁజేయకుండుటమహా సాయంబుఁజేయంజుమీ

    రిప్లయితొలగించండి

  20. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    సంసారము వీడి వెడలె
    హంసల వలె బ్రతకలేక నడవుల యందున్
    హింసలు పడి తిండి కొఱకు
    సంసారమె సుఖకరమని సన్యాసి యనెన్.

    రిప్లయితొలగించండి